-తురగా నాగభూషణం

ప్రజా ధనానికి తాను ట్రస్టీని మాత్రమే అని పార్లమెంటులో మోదీ 2019లో చేసిన ప్రకటనను ముఖ్యమంత్రులు, రాజకీయపార్టీలు కూడా స్వాగతించి అనుసరించాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైకాపా అధినేత మాత్రం దీనిని పట్టించుకోక కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సిపిఎస్‌) రద్దు చేస్తామని, పాత విధానాన్ని కొనసాగిస్తామని ఉద్యోగులకు మద్దతిచ్చి ఇప్పుడు వాటిని నెరవేర్చే శక్తిలేక వారితో దాగుడుమూతలాడుతున్నారు. పైగా అవగాహన లేక తాము సిపిఎస్‌ రద్దుచేస్తామని పేర్కొన్నామని, దీనిని రద్దుచేసి పాత విధానాన్ని కొనసాగిస్తే ఖజానా మొత్తం దానికే ఖర్చవుతుందని కూడా ప్రభుత్వ పెద్దలు పేర్కొంటున్నారు.

అధికార కాంక్షతో, ఓట్లు కొనుగోలు చేసే లక్ష్యంతో సంఘటితంగా ఉన్న ఉద్యోగ వర్గానికి ఇచ్చిన హామీ నేడు వైకాపా ప్రభుత్వానికి గుదిబండగా మారి మెడకు చుట్టుకుంది. పాత పెన్షన్‌ విధానం వల్ల ఉద్యోగుల వేతనాల కన్నా పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్‌ 20 ఏళ్ల తర్వాత రెట్టింపైపోతుంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని కేవలం పెన్షన్‌లు, జీతాలకే ఇవ్వగలుగుతాయి. ఆర్థికంగా దివాళాతీసే పరిస్థితి వస్తుంది. సిపిఎస్‌ విధానంలో ఉద్యోగికి భద్రత కల్పించే విషయంలో మరింత సమగ్రంగా చర్చిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. అందువల్ల రాజకీయ పార్టీలన్నీ ఈ విషయంపై చర్చించి పరిష్కార మార్గం ఆలోచించాలి.

2019 ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌మోహన రెడ్డి తన పాదయాత్రలో రాష్ట్రం మొత్తం పర్యటిం చారు. ఆ సమయంలో ఆయా ప్రాంతాల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని హామీలిచ్చారు. పలురకాల వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో సంఘటితంగా ఉండే ప్రభుత్వో ద్యోగులు తమకు జీతాలు పెంచాలని, ఇప్పుడు అమలుచేస్తున్న సిపిఎస్‌ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని కోరారు. వారితో పాటు కుటుంబ ఓట్లు కూడా లెక్కేసుకుని అవన్నీ తమకే గంపగుత్తగా పడతాయని జగన్‌మోహనరెడ్డి భావించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్‌ను రద్దుచేస్తామని, పాత విధానాన్ని కొన సాగిస్తామని వారికి హామీ ఇచ్చేశారు. ఆ ఎన్నికల్లో వైకాపా విజయానికి తాము కూడా కారకులమే అని ఉద్యోగులు కూడా చెప్పుకున్నారు. వైకాపా అధికారం చేపట్టి రెండున్నరేళ్లు అయింది. కాని సిపిఎస్‌ను రద్దుచేయలేదు. దీంతో పలుమార్లు విజ్ఞప్తులు చేసిన ఉద్యోగులు ఇప్పుడు ఆందోళన చేస్తామని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. సిపిఎస్‌, జీతాల పెంపుతో సహా 71 కోర్కెలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు.

సిపిఎస్‌ అంటే?

కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం. దీన్నే నేషనల్‌ పెన్షన్‌ స్కీం-ఎన్‌పీఎస్‌ అని కూడా పిలుస్తారు. కొత్త పెన్షన్‌ స్కీం ప్రకారం 2004, జనవరి 1 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరే వారందరూ సిపిఎస్‌ కిందికి వస్తారు. త్రిపుర, పశ్చిమబెంగాల్‌ మినహా ఏపీ, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు ఈ స్కీంలో చేరాయి. 2004కు ముందు వరకు చేరిన ఉద్యోగులకు రిటైర్మెంట్‌ తర్వాత ప్రభుత్వమే పెన్షన్‌ ఇచ్చేది. కానీ కొత్త స్కీం ప్రకారం పెన్షన్‌ కోసం ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి 10శాతం కట్‌ చేస్తారు. ప్రభుత్వం మరో 10శాతం ఇస్తుంది. ఈ పెన్షన్‌ నిధిని నేషనల్‌ పెన్షన్‌ స్కీం-ఎన్‌పీఎస్‌ ట్రస్టు, నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్‌-ఎన్‌ఎస్‌డీఎల్‌ ద్వారా షేర్‌ మార్కెట్‌లో మదుపు చేస్తారు. పదవీ విరమణ సమయంలో సర్వీసు మొత్తంలో ఉద్యోగి, ప్రభుత్వ వాటా మొత్తం నిధిలో నిర్ణీత శాతంలో యాన్యుటీ ప్లాన్‌లలో ఉంచి నెలవారీ పెన్షన్‌ చెల్లిస్తారు. దీనికోసం 2013లో యూపీఏ ప్రభుత్వం, విపక్ష ఎన్డీఏ మద్దతుతో పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ యాక్ట్‌-పీఎఫ్‌ఆర్‌డీఏ తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా 2004లో సిపిఎస్‌ను అమలు చేసింది. 2004కు ముందు పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం పాత పెన్షన్‌ విధానమే అమలవుతోంది.

సిపిఎస్‌ను సహజంగానే ఉద్యోగులు వ్యతి రేకించారు. 2004 తర్వాత నుంచి నేటి వరకు రాష్ట్రంలో కొత్తగా చేరిన ప్రభుత్వ ఉద్యోగులు సుమారు 2 లక్షల మంది ఉన్నారు. పాత ఉద్యోగుల వలె తమకు పదవీవిరమణ తర్వాత వారికిచ్చినంత పెన్షన్‌ కావాలని వీరు కోరుతున్నారు. వీరికి ఉన్నతాధి కారులు, రాజకీయ నేతల వద్ద పలుకుబడి ఉండటం, అన్నిటికీ మించి సంఘటితంగా ఉండటంతో తమ డిమాండ్ల సాధనకు ఏకతాటిపై నిలబడ్డారు. ఎన్నికల్లో గెలుపుకోసం పార్టీలు చేస్తున్న విచ్చలవిడి హామీలను చూసి తమ ఓటుబ్యాంకును చూపించి డిమాండ్లు వారి ముందుపెట్టారు. వైకాపా నుంచి స్పష్టమైన హామీ పొందారు.

సిపిఎస్‌ విధానం వల్ల ఉద్యోగులకు అన్యాయం జరగదని ప్రభుత్వాలు వాదిస్తున్నాయి. పాత పెన్షన్‌ విధానంలో కాకుండా ఈ విధానంలో ఎక్కువ భారం పడదని కూడా చెబుతున్నాయి. ఒకవేళ ఉద్యోగి, ప్రభుత్వం నుంచి ఇచ్చే పదిశాతం మొత్తాన్ని షేర్‌ మార్కెట్‌లో మదుపుచేసే ఆసక్తి లేకపోతే మరో రూపంలో స్వంతగా పెట్టుబడులు పెట్టుకునే అవ కాశం కల్పించేలా పరస్పర అంగీకారానికి రావాలి. ప్రభుత్వం ఇచ్చే అదనపు పదిశాతం జీతాన్ని ప్రతినెలా ఉద్యోగి ఖాతాకు జమచేయాలని కోరవచ్చు. వాటితో ఉద్యోగి ఏదైనా ఆస్తిని కొని వాయిదాల రూపంలో చెల్లించుకోవచ్చు. ఒక ప్రభుత్వోద్యోగి సర్వీస్‌ 35 ఏళ్లు చేస్తాడనుకుంటే.. ఈ 35 ఏళ్ల పాటు అతను తన జీతంలో నుంచి ప్రభత్వం ఇచ్చే పదిశాతం, తనవాటా పది శాతం కలిపి 20 శాతం పెట్టుబడి పెడితే మంచి ఆస్తి చేకూరుతుంది.

పాత పెన్షన్‌ విధానంలో సమస్యలు

ప్రభుత్వం మన పనులు చేయడం కోసం ఉద్యోగులను నియమించింది. ఉద్యోగులు కూడా ప్రజలే. వారు మన సమాజం నుంచే వచ్చారు. అయితే కష్టపడి ఉద్యోగం సంపాదించారు. మనకు సేవలందిస్తున్నారు. జీతాలు ఒకప్పటితో పోలిస్తే బాగా పెరిగాయి. పదివేల రూపాయలు సంపాదించే సాధారణ ప్రైవేటు ఉద్యోగితో పోలిస్తే అదే స్థాయి ప్రభుత్వ ఉద్యోగి 25 వేల నుంచి 30 వేలు జీతాలు సంపాదిస్తున్నారు. ప్రారంభంలో రూ.30 వేల జీతం తీసుకునే ఉద్యోగులు రిటైర్‌ అయ్యేనాటికి రూ.లక్ష వరకు జీతం తీసుకుంటున్నారు. వారికి ఆ స్థాయి జీతాలు ఇవ్వాలి. వారు దానికనుగుణంగా కష్టపడి పని చేయాలి. పాత పెన్షన్‌ విధానంలో 30`35 ఏళ్ల సర్వీసు తర్వాత ఉద్యోగ విరమణ చేస్తే వారికి పెన్షన్‌ ఇవ్వాలన్న విధానం అమలు జరిగేది. ప్రస్తుతం జీవితకాలం పెరిగింది. దీనివల్ల 35 ఏళ్లు పనిచేసిన ఒక ఉద్యోగి మరో 20 ఏళ్లకు పైగానే పింఛన్‌ తీసుకో గలుగుతున్నారు. చివరి జీతం ఎంత తీసుకున్నారో అంతే మొత్తాన్ని పెన్షన్‌గా తీసుకుంటున్నవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాగే ఇప్పుడు 30 వేల రూపాయలు జీతం తీసుకునే వ్యక్తి పదవీవిరమణ తర్వాత అప్పటి జీతంలో సగం ఇచ్చినా అప్పటి జీతం కంటే ఎక్కువే పెన్షన్‌గా పొందుతాడు. ఉద్యోగి మరణించేవరకు అతనికి పెన్షన్‌ లభిస్తుంది. అతడు మరణిస్తే, అతని భార్యకు కూడా కొంత తగ్గించి పెన్షన్‌ ఇస్తారు. ఉద్యోగం చేస్తూ భర్త మరణించినా, ఆ ఉద్యోగం పొంది, జీతంతో పాటు భర్త పెన్షన్‌ కూడా తీసుకుంటున్నవారు ఉన్నారు. నేటి ఉద్యోగి 35 ఏళ్ల తర్వాత పెన్షనర్‌. 1950 నుంచి ఇప్పటి వరకు ఏటా ఉద్యోగ విరమణ చేసే ఉద్యోగుల సంఖ్య 5 శాతం వరకు ఉంటుంది. రాష్ట్రంలో పెన్షనర్ల సంఖ్య 4 లక్షల వరకు ఉంది. రాష్ట్రంలో 16 లక్షల మంది ఉద్యోగులున్నట్లు ఉద్యోగ సంఘాలు చెబు తున్నాయి. మరో 20 ఏళ్లకు ఉద్యోగులతో సమానంగా పెన్షనర్లు ఉంటారు. అప్పటి నుంచి ఏటా 5 శాతం శాతం పెరుగుతూ 2060 నాటికి ఉద్యోగుల కంటే పెన్షనర్లే సగానికంటే ఎక్కువ సంఖ్యలో ఉంటారు.

రాబోయే తరాలపై పెనుభారం

పాత పెన్షన్‌ విధానం అమలైతే రాబోయే తరాలపై తీవ్రమైన ఆర్థికభారం పడనుంది. ఎవరైనా తమ తరాలకు మంచి భవిష్యత్‌ ఇవ్వాలని కోరుకుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అప్పులు, వడ్డీలు చెల్లించాలని కోరుకోరు. ఆస్తులే సంపాదించి ఇస్తారు. కాని రాష్ట్రప్రభుత్వం పోకడలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వంÑ ఒకటి రెండు తప్ప అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాత విధానాన్ని పాత ఉద్యోగులకు మాత్రమే కొనసాగిస్తూ, 2004 తర్వాత నుంచి చేరిన ఉద్యోగులకు సిపిఎస్‌ విధానాన్ని అమలుచేస్తుంటే వైకాపా ప్రభుత్వం మాత్రం దానికి వ్యతిరేకంగా ఆలోచిస్తోంది. ఇప్పటికే సంక్షేమం పేరుతో ఉన్న ఆదాయం ప్రజలకు పంచేయడంతో పాటు అవీ చాలక ఇంకా అప్పులు తెచ్చి వడ్డీలు కడుతోంది. ఈ పరిస్థితుల్లో సిపిఎస్‌ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగిస్తే ఇక రాష్ట్రం తేరుకునే అవకాశం ఉండదు.

విచిత్రం ఏమిటంటే రాష్ట్రంలోని పార్టీలన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తున్నాయి. గతంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్‌ సిపిఎస్‌ను వ్యతిరేకించారు. ఇప్పుడు నోరెత్తడం లేదు. అప్పుడు సిపిఎస్‌ మంచిదన్న చంద్రబాబు ఇప్పుడు ఉద్యోగుల డిమాండ్లకు మద్దతు ఇస్తున్నారు. తెదేపాతో పాటు మరికొన్ని పార్టీలు అదే బాటులో ఉన్నాయి. కాని ఎవరూ వాస్తవ విషయాలు ఆలోచించడం లేదు. టీడీపీ హయాంలో సిపిఎస్‌ పెన్షన్‌ సొమ్మును వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాల పాటు నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్‌కు జమ చేయకుండా దారిమళ్లించారు. ఈ విషయాన్ని నాడు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిట్‌ జనరల్‌ (కాగ్‌) కూడా తన నివేదికలో పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో కూడా సిపిఎస్‌ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వో ద్యోగులు ఛలో అసెంబ్లీ అంటూ ముట్టడి కూడా జరిపారు. దీక్షలు చేసి తమ నిరసనలు తెలిపారు. దీనిపై నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ‘సిపిఎస్‌ రద్దు అనేది కేంద్ర పరిధిలోని అంశం. దీనిపై కేంద్రానికి విజ్ఞప్తి చేయడం తప్ప ఏమీ చేయలేం’ అని చెప్పుకొచ్చారు. నేడు ఇది జగన్‌ తప్పిదంగా చెబుతున్నారు. ఇది కేంద్రప్రభుత్వ పరిధిలోని అంశమే అయితే నేడు చంద్రబాబు జగన్‌ను ఎందుకు విమర్శిస్తున్నట్లు? ఇది కేంద్రప్రభుత్వ పరిధిలోని అంశమే అయితే జగన్‌ నాడు స్పష్టమైన హామీ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడెందుకు నిశ్శబ్దంగా ఉంటున్నారు? ఈ విషయంలో ఇద్దరూ ఉద్యోగులను వంచించినట్లే కదా. అందువల్ల ప్రజలకు సిపిఎస్‌, పాత పెన్షన్‌ విధానంపై పార్టీలు అవగాహన కల్పించాలి. ఉద్యోగులే కాదు, తాము ఓటు వేస్తేనే ఈ ప్రభుత్వాలు గెలుస్తాయని, అందువల్ల తమ ప్రయోజనాలకు భంగం కలిగిస్తే ప్రమాదం తప్పదని ప్రజలు ప్రభుత్వాలను హెచ్చరించాలి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా అన్ని పార్టీలతో కలిసి చర్చించి ప్రభుత్వంపై తీవ్ర భారం పడేలా కాకుండా సిపిఎస్‌ ద్వారా వెసులుబాటు పొందే యోచన చేయాలి.

వ్యాసకర్త: సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE