– ఎం.వి.ఆర్‌. శాస్త్రి

అడవి దారుల్లో అష్టకష్టాలు పడి వందలమైళ్లు ప్రయాణించి ఎట్టకేలకు బాంగ్‌కాక్‌ చేరగానే అందరూ మాసిన దుస్తులైనా మార్చుకోకుండా పక్కమీద వాలి సొక్కు తీరేలా గంటలతరబడి గాఢనిద్ర పోయారు. నేతాజీ మాత్రం ఒక కప్పు టీ తాగి వెంటనే పనిలో పడ్డాడు. ఇండిపెండెన్స్‌ లీగ్‌ స్థానిక నాయకులను పిలిపించి, బర్మా నుంచి అక్కడికి జట్లుజట్లుగా చేరుకుంటున్న వారికి ఎదురువెళ్లి వారి అవసరాలు కనిపెట్టమని పురమాయించాడు.

లీగ్‌ స్థానిక నాయకుడొకరు తాను నివసించే బంగళాను ఖాళీ చేసి నేతాజీకి ఇచ్చాడు. చటర్జీ, కియానీలు కూడా అందులోనే బస చేశారు. రోజూ కనీసం ఒకసారి మంత్రులందరూ అక్కడ సమావేశమై మారుతున్న పరిస్థితిని సమీక్షించేవారు. జర్మనీ, ఇటలీ అప్పటికే సరెండర్‌ అయ్యాయి. జపాన్‌ ఇంకా ఎంతకాలం నిలబడగలదన్నది సందేహమే. తరవాత మనం ఏమి చేయాలన్నది ప్రశ్న. జపాన్‌ చేతులెత్తేసి నంత మాత్రాన మనం లొంగిపోయే ప్రసక్తే లేదుÑ పోరాటం కొనసాగించవలసిందే- అని దాదాపుగా ఆందరి అభిప్రాయం. దానికి ఏమిటి మార్గం?

సోవియట్‌ రష్యాయే శరణ్యం. జపాన్‌ మీద ఇంతవరకూ యుద్ధానికి దిగకుండా రష్యా తటస్థంగా ఉన్నది. కనుక వారిని ఆశ్రయించటానికి జపాన్‌ మనకేమన్నా సహాయపడుతుందా? తానే నాశనపు అంచున ఉన్నప్పుడు జపాన్‌ మన గురించి ఆలోచిస్తుందా? మన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చెసు కుంటుందా? బ్రిటన్‌, అమెరికాలతో సన్నిహితంగా ఉన్న రష్యా ఇంతదాకా శత్రు కూటమితో మమేకమైన మనపట్ల ఆదరణ చూపుతుందా? నాజీ జర్మనీతో బోస్‌ పూర్వ అనుబంధం దృష్ట్యా మననీ శత్రువులా చూస్తుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు. ఎంత మాట్లాడినా ఎవరికీ ఏమీ పాలుపోలేదు. బ్రిటిష్‌ అమెరికన్‌ సేనలు వచ్చిపడేలోగా వాటికి చిక్కనంత దూరానికి మనం తప్పించుకుపోవాలి. జపాన్‌తో మీ పలుకుబడిని ఉపయోగించి వారిద్వారా రష్యన్‌ ప్రభుత్వంలో ఉన్నతస్థాయి వారిని కాంటాక్ట్‌ చేసే ప్రయత్నం చేయండి అని మంత్రివర్గ సహచరులు నేతాజీకి సలహా ఇచ్చారు.

నిజానికి నేతాజీ అప్పటికే ఆ పనిలో ఉన్నాడు. రష్యాతో కాంటాక్ట్‌ కోసం ఆయన ఎంతోకాలంగా విశ్వప్రయత్నం చేస్తున్నాడు. యుద్ధంలో జపాన్‌ దిగ్విజయం గురించి బహిరంగంగా ఎంతగొప్పగా ఉద్ఘాటించినా వాస్తవానికి ఆ విషయంలో సుభాస్‌ బోస్‌కు భ్రమలేమీ లేవు. జపాన్‌ ఓటమి తథ్యమని ఇంఫాల్‌ సంగ్రామం మొదలవటానికి పూర్వమే ఆయన గ్రహించాడనటానికి చారిత్రక ఆధారా లున్నాయి. హెచ్‌.ఎన్‌. పండిట్‌ తన గ్రంథంలో వెల్లడిరచినట్టు-

జపాన్‌ ఓటమి తరవాత తాను సోవియట్‌ రష్యాకు వెళ్ళే అవకాశం గురించి నేతాజీ ఇంపీరియల్‌ జనరల్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో సెకండ్‌ బ్యూరోకు అధిపతిగా ఉన్న తన సన్నిహితుడు లెఫ్టినెంట్‌ జనరల్‌ సీజో అరిసూతో ముందుగానే చర్చించాడు. ఇంఫాల్‌లో జపాన్‌ గెలవటం అసంభవమని ఆ సందర్భంలో అతడికి జనాంతికంగా చెప్పాడు.

అలాగే బర్మా ఏరియా జపాన్‌ నౌకాదళం వైస్‌ అడ్మిరల్‌ చూడో ఒక రోజు డిన్నర్‌ తరవాత నేతాజీతో ఇదే విషయం మాట్లాడాడు. ‘ఇంఫాల్‌ ఆపరేషన్‌లో జపాన్‌ నెగ్గే ఆశ కనిపించటం లేదు. మీ మీద, భారత స్వాతంత్య్ర ఆశయం మీద పూర్తి సానుభూతితో అడుగుతుతున్నాను. మీ వ్యవహారాల్లో తల దూరుస్తున్నానని అనుకోకండి. నేతాజీ, ఈ ఆర్మీ ఆపరేషన్‌ విఫలమైతే మీరు ఏమి చేద్దామను కుంటున్నారు?’ అని అతడు అడిగాడు. నేతాజీ అంత తేలిగ్గా తన మనసులో మాట బయటపెట్టే మనిషి కాదు. ‘ఈ ఆపరేషన్‌ను నేనింకా లెక్కలోంచి తీసెయ్యలేదు.’ అని లౌక్యంగా బదులిచ్చాడు.

అవతలివాడు వదలలేదు. ‘మీ పోరాటం పట్ల సానుభూతి ఉన్న దేశాల్లో జపాన్‌ తరవాత రష్యానే చెప్పుకోవాలి. అది ఇప్పుడు బ్రిటన్‌కు మిత్రదేశమన్నది నిజమే. కాబట్టి ఇంఫాల్‌ తరహా ఆపరేషన్‌ దాని వల్ల కాదు. నేరుగా రెగ్యులర్‌ సైనికులను కాకుండా గెరిల్లాల వంటి ఏ నాన్‌ రెగ్యులర్‌ దళాలనో రష్యా మీకు సమకూర్చగలదు. అలాంటి నాన్‌ రెగ్యులర్‌ సేనల సాయంతో మీరు ఏ మధ్య ఆసియా నుంచో ఇండియాలోకి ఎందుకు ప్రవేశించకూడదు?’ అని అతడు రెట్టించి అడిగాడు. ‘ప్రస్తుతం రష్యాకు జపాన్‌తో ఒకరిపై ఒకరు దాడిచేయకూడదన్న ఒడంబడిక ఉంది. మీరు సరేనంటే నేను మీకు అన్నీ చేసి పెడతాను. సమర్ఖండ్‌ కో, తాష్కెంట్‌ కో నేనే మిమ్మల్ని వెంటబెట్టుకు వెళతాను’ అని కూడా అన్నాడు.

నేతాజీ మనసులోనూ అదే ఉద్దేశం ఉంది. కాని దాన్ని బాహాటంగా బయట పెట్టే సమయం ఇంకా రాలేదు. అప్పటికి ఇంఫాల్‌లో ఐఎన్‌ఎ విజయావ కాశాల మీద నేతాజీకి ఏ కాస్తో ఆశ మిగిలి ఉంది. ఐదారు నిమిషాల పాటు మౌనంగా దీర్ఘాలోచన చేసి నేతాజీ ఇలా అన్నాడు: ‘అడ్మిరల్‌ చూడో! మీరు దయతో చేసిన ఆఫర్‌కు చాలా సంతోషం. మీ ఫార్ములాని టోక్యో చేత మీరు ఆమోదింప చేయగలిగితే నేను మీ సలహాను పాటిస్తాను’’ అన్నాడు. ఉత్సాహం కొద్దీ చూడో తన పలుకుబడి ఉపయోగించి ఆ విషయంలో కొంత ప్రయత్నం చేశాడు. కానీ అతడి ప్రతిపాదనను టోక్యో తిరస్కరించింది.

[Netaji: From Kabul to Battle of Imphal, H.N.Pandit, pp. 288, 297-298]

తిరస్కరిస్తుందని బోస్‌కు తెలుసు. ఒక నెల తరవాత యమామోతో కూడా అలాంటి సూచనే చేశాడు. అతడికీ బోస్‌ సుముఖత తెలిపాడు. అప్పుడూ టోక్యో అడ్డం కొట్టింది.

మిత్రరాజ్యాలతో బేరమాడుకోవటానికి రష్యా సాయం తీసుకోవాలన్న ఎత్తుమీద ఉన్న జపాన్‌కు బోస్‌ గురించీ, భారత స్వాతంత్య్రం గురించీ ఆలోచించే తీరికగాని, కోరికగాని లేవు. జపాన్‌ వల్ల లాభం లేదనుకున్నప్పుడు తన ఆశయ సాధన కోసం ప్రత్యామ్నాయం చూసుకోవాలన్న నిర్ణయానికి బోస్‌ చాలా కాలం కిందటే వచ్చాడు. వాస్తవానికి వేరేదారిలేని స్థితిలో తప్పనిసరై నాజీల, ఫాసిస్టుల సాయం తీసుకున్నా బోస్‌ దృష్టి మొదటినుంచీ రష్యా మీదే ఉంది. 1941లో భారతదేశం వదిలిపెట్టక ముందు నుంచే సోవియట్‌ రష్యాను ప్రసన్నం చేసుకోవటానికి బెంగాల్‌ కమ్యూనిస్టు వర్గాల ద్వారా ఆయన తీవ్ర ప్రయత్నం చేశాడు. కాబుల్‌ నుంచి ఎకాఎకి రష్యా వెళ్ళాలని తహతహలాడాడు. కాబుల్‌లో రష్యా రాయబారిని కలవటం కోసం రష్యన్‌ ఎంబసీ ముందు ఏజంటు తల్వార్‌తో బాటు పడిగాపులు పడ్డాడు. మారుపేరుతో బెర్లిన్‌ వెళుతూ కొద్దిసేపు మాస్కోలో ఆగినప్పుడు ఆ కాస్త సమయంలోనే సోవియట్‌ అధికారులతో కాంటాక్ట్‌ కోసం సుభాస్‌ బోస్‌ ప్రయత్నించాడు. జర్మనీలో ఉన్నప్పుడూ, తూర్పు ఆసియాకు వచ్చాక కూడా స్టాలిన్‌నూ, సోవియట్‌ రష్యానూ పల్లెత్తు మాట పరుషంగా అనకుండా జాగ్రత్త పడ్డాడు. 1944 నవంబరులో కొత్త ప్రధాని ఆహ్వానం మీద జపాన్‌ పర్యటన సందర్భంలో టోక్యో యూనివర్సిటీలో చేసిన దార్శనిక ప్రసంగంలోనూ జర్మనీ పతనం తరవాత అమెరికా కూటమికీ, రష్యాకూ నడుమ పొడసూపే వైరుధ్యాలనూ, ప్రపంచ ఆదిపత్యం కోసం రెండు అగ్రరాజ్యాల నడుమ రాగల పోటీని బోస్‌ ముందే ఊహించి చెప్పాడు. సోవియట్‌ ప్రాపకం అపేక్షిస్తూ మాస్కోకు పరోక్ష సందేశాలు చాలా పంపాడు.

1945 జూన్‌ 18న టోక్యోలోని ఇంపీరియల్‌ జనరల్‌ హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి లెఫ్టినెంట్‌ జనరల్‌ తకకురా బాంగ్‌కాక్‌లో బోస్‌ నివాసానికి వచ్చి చాలా సేపు మాట్లాడాడు. బోస్‌ తన హెడ్‌ క్వార్టర్స్‌ను సైగాన్‌కు మార్చుకుని అక్కడి జపాన్‌ సదరన్‌ కమాండ్‌కు ఐఎన్‌ఎను అప్పగించమని అతడి ప్రతిపాదన. బోస్‌ అది కుదరదు పొమ్మన్నాడు. తన బలగాలన్నీ తిరిగివచ్చాక సైగాన్‌కు ఐఎన్‌ఎ హెడ్‌ క్వార్టర్స్‌ తరలించటానికి మాత్రం చివరిలో ఒప్పుకున్నాడు. రష్యా సరిహద్దుకు దగ్గరగా మంచురియాలో (సేఫ్‌ డిపాజిట్‌గా) తన ప్రభుత్వ హెడ్‌ క్వార్టర్స్‌ పెట్టుకోనివ్వమని నేతాజీ జపాన్‌ను కోరాడు. అమెరికా, బ్రిటన్‌ కూటమితో రష్యా సఖ్యత ఎంతోకాలం నిలవదు కనుక తనకు రష్యన్లతో మాట్లాడే అవకాశం ఇప్పిస్తే మాస్కోకూ టోక్యోకూ నడుమ సయోధ్య కుదర్చగలనని జపాన్‌ కొత్త ప్రభుత్వానికి ఉపాయం చెప్పాడు. బోస్‌ చేసిన ఏ ప్రతిపాదననూ టోక్యో పట్టించుకోలేదు. తమతో తటస్థసంధి కుదుర్చుకున్న రష్యాతో సంపర్కానికి బోస్‌ ప్రయత్నం చేయటం జపాన్‌కు నచ్చలేదు. వారి పచ్చ కళ్ళకు అది నమ్మకద్రోహంలా కనిపించింది.

జపాన్‌ ద్వారా పని కానప్పుడు నేరుగా రష్యన్లనే కాంటాక్ట్‌ చేయటం మేలని బోస్‌ తలిచాడు. 1944 నవంబరులో టోక్యోలో ఉండగా ఒక రాత్రి ఏదో మీటింగు నుంచి తిరిగొచ్చాక అక్కడి రష్యన్‌ రాయబారి జాకబ్‌ మాలిక్‌కి సుభాస్‌ చంద్రబోస్‌ ఒక రహస్యలేఖ రాసి తన వ్యక్తిగత సహాయకుడి చేతికిచ్చి పంపించాడు. ఆ సహాయకుడిని కలవటానికి రష్యా రాయబారి అంగీకరించలేదు. బోస్‌ పంపిన సందేశాన్నయితే రాయబారి మాస్కోకు పంపించాడు. కాని అటునుంచి జవాబు లేదు. మొదటినుంచీ రష్యా తన పట్ల ఎంత ప్రతికూలంగా ఉన్నా భయంకర ఆశావాది అయిన బోస్‌ నిస్పృహ చెందలేదు. తన ఏకైక లక్ష్యమైన స్వాతంత్య్రానికి సహాయపడగలిగిన అగ్రరాజ్యం రష్యాయే కనుక తిరస్కారాలను లెక్కచేయక మాస్కో ప్రసన్నత కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇవి అందరికీ బహిరంగంగా చెప్పగలిగిన విషయాలు కావు. అందుకే తన మంత్రివర్గ సహచరులు రష్యాను పట్టుకోవాలన్న ఆలోచన చేసినప్పుడు బోస్‌ తల పంకించి ఊరుకున్నాడు.

సోవియట్‌ రష్యా నాయక శ్రేణిలో పైస్థాయి వారితో సంపర్కానికి జపాన్‌ వర్గాల ద్వారా గట్టిగా ప్రయత్నించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రిటిష్‌, అమెరికా సేనలకు చిక్కకండి. శత్రువుకు అందనంత దూరంలో ఇండో చైనా, జపాన్‌, చైనాలలో రష్యా భూఖండానికి దగ్గరలో ఉండేలా ఏ చోటికైనా ఎప్పుడైనా బయలుదేరటానికి సిద్ధంగా ఉండండి.- అన్నది నేతాజీకి సహచరుల సలహా. జపాన్‌కూ రష్యాకూ నడుమ తటస్థ సంధి ఉన్నది కాబట్టి వీరిద్వారా వారిని చేరవచ్చునని అందరి ఆలోచన. 1945 ఆగస్టు 10న జపాన్‌ మీద రష్యా యుద్ధానికి దిగటంతో ఆ ఆశా పోయింది.

ఆ సమయాన బోస్‌ సెరంబాన్‌ అనే చోట గెస్ట్‌ హౌస్‌లో ఉన్నాడు. అక్కడి సైనిక శిక్షణ కేంద్రంలో లేచిన చిన్న అలజడిని విచారించటానికి వెళ్ళాడు. అక్కడ రేడియో సెట్‌ ఏదీ లేదు. త్వరితగతిన మారుతున్న పరిణామాలు, వాటిపై బి.బి.సి., ఆలిండియా రేడియోలు ప్రసారం చేసిన సంచలన వార్తలు కొద్దిరోజుల తరవాత ఎవరో చెబితే గానీ బోస్‌కి తెలియలేదు. ఆగస్టు 10 అర్ధరాత్రి కౌలాలంపూర్‌ నుంచి కల్నల్‌ ఇనాయత్‌ కియానీ లాంగ్‌ డిస్టెన్స్‌ ఫోన్‌ కాల్‌ చేసి రష్యా కూడా జపాన్‌పై యుద్ధానికి దిగిందన్న కబురు తెలిపాడు. మర్నాడు మధ్యాహ్నం సింగపూర్‌ నుంచి మేజర్‌ జనరల్‌ కియానీ ఫోన్‌ చేసి వీలైనంత త్వరగా సింగపూర్‌ చేరుకో వలసిందని నేతాజీకి చెప్పాడు. ‘అంత తొందర ఏమి వచ్చింది? జపాన్‌ మీద రష్యా యుద్ధం ప్రకటిస్తే మనకేమిటి? ఏది ఏమైనా కానీ మన పని మనదే. ఇక్కడ జరూరు పనులు చూసుకుని గాని బయలుదేరను’ అని కియానీకి బోస్‌ చిరాగ్గా బదులిచ్చాడు.

ఆ (11వ తేదీ) సాయంత్రం అక్కడి ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ శిక్షణ శిబిరంలో రెండు వేల మందిని ఉద్దేశించి ప్రసంగించి నేతాజీ రాత్రి 11 గంటలకు బంగాళాకు చేరాడు. అప్పుడు భోజనాలు చేస్తూ మాట్లాడుకుని లేచేసరికి అర్ధరాత్రి ఒంటిగంట అయింది. అంతలో మలక్కా నుంచి ఫోన్‌. సింగపూర్‌ హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి ఐఐఎల్‌ (ఇండిపెండెన్స్‌ లీగ్‌) జనరల్‌ సెక్రెటరీ లక్ష్మయ్య, సెక్రెటరీ గణపతి అర్జెంటుగా నేతాజీని కలవటానికి సింగపూర్‌ నుంచి కారులో బయలుదేరి వస్తున్నారు; ఇప్పుడే మలక్కా దాటారు; ఇంకో గంటలో వారు సెరంబాన్‌ చేరుకోవచ్చని సమాచారం. అంత హడావుడిగా వారు మోసుకొస్తున్న కబురు ఏమిటా అని అందరూ ఎదురుచూశారు. ఇంకో గంటకు దూర ప్రయాణంతో మొత్తం దుమ్ముకొట్టుకుపోయిన కారు నుంచి లక్ష్మయ్య, గణపతి దిగి లోపలికి పరుగెత్తారు. నేతాజీ వారిని నేరుగా తన బెడ్‌రూమ్‌కు పిలిపించాడు. తరవాత దృశ్యం అయ్యర్‌ మాటల్లో-

అది 20 x 10 అడుగుల గది. ఒక వైపు చెక్క మంచం, ఇంకో వైపు డ్రెస్సింగ్‌ టేబిల్‌ ఉన్నాయి. గది మధ్యలో నేతాజీ కూచున్నాడు. ఆయన ఇంకా యూనిఫాంలోనే ఉన్నాడు. ఉక్కగా ఉండటం వల్ల బుష్‌ కోటును మాత్రం తీసి బనియన్‌ మీద ఉన్నాడు. ఎలెక్ట్రిక్‌ ల్యాంపు కాంతి ఆయన మొహం మీద పడుతున్నది. నేను, లక్ష్మయ్య, గణపతి కుర్చీలు లాక్కుని ఆయన దగ్గర కూచున్నాం. నేతాజీ నన్ను గది తలుపులు, కిటికీలు మూసెయ్యమన్నాడు. ‘ఏమిటి విశేషం?’ అని లక్ష్మయ్యను అడిగాడు. లక్ష్మయ్య మరింత దగ్గరగా కుర్చీ లాక్కుని నేతాజీకి మాత్రం వినపడేట్టు ‘సారీ సర్‌! జపాన్‌ సరెండర్‌ అయింది’ అని రహస్యంగా చెప్పాడు. (నిజానికి అప్పటికింకా సరెండర్‌ కాలేదు. రేపో మాపో కాబోతున్నదని మాత్రమే బిబిసి చెప్పింది.)

నాకు తల తిరిగినట్టయింది. అంతా అయిపోయింది. ఈ మహా నాయకుడు రెండేళ్ళు కష్టపడి నిర్మించింది మొత్తం కుప్పకూలింది. ఆయన కష్టమంతా వ్యర్థమేనా? ఆయన కలలన్నీ కల్లలేనా? ఆయన ఆశలన్నీ అడియాసయేనా? పిడుగులాంటి ఈ కబురును ఆయన ఎలా తీసుకుంటాడు? ఈ దెబ్బను తట్టుకోగలడా? చిమ్మచీకటి ఆయనను మింగేస్తుందా? లేక ఎప్పటిలాగే పోరాడి దీనినుంచి బయటపడి తరవాతి యుద్ధరంగానికి సిద్ధమవు తాడా? ఇలా ఏవేవో ఆలోచనలతో నాకు దిమ్మతిరి గింది. భయం భయంగా నేతాజీకేసి చూశాను.

నేతాజీ ఆ కబురు విని తన సహజ రీతిలో ఉమ్‌ అన్నాడు. ఒక్క క్షణం ఆలోచించాడు. మరుక్షణం మామూలుగా అయ్యాడు. ఒక చిన్ననవ్వు నవ్వి ఆయన అన్న మాటలివి:

So that is that. What next?’ (అదన్నమాట సంగతి. తరవాత ఏమిటి?)

అది ఒక సైనికుడి మాట! అతడు అప్పుడే తరవాతి ఎత్తునూ, తరవాతి పోరాటాన్నీ ఆలోచిస్తు న్నాడు. ఓటమిని అంగీకరించే ప్రశ్నే లేదు. జపాన్‌ సరెండర్‌ అంటే ఇండియా సరెండర్‌ కాదు. జపాన్‌ లొంగినంత మాత్రాన భారత స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న విమోచన సేనలు లొంగిపోయినట్టు కాదు. ఐఎన్‌ఎ ఓటమిని అంగీకరించే ప్రసక్తే లేదు. అంతటి ఉత్పాతాన్నీ నేతాజీ నవ్వుతూ తీసేశాడు. ఎప్పటిలాగే జోకులేస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నాడు. అతి క్లిష్టమైన పరిస్థితి నుంచి మరోసారి అలవోకగా బయటపడ్డాడు. మూడిరటి వరకూ అవీ ఇవీ సరదాగా మాట్లాడి వచ్చినవారిని వారి గదికి పంపేశాడు. నన్ను ఉండమని చెప్పి చకచకా ఆదేశాలు ఇచ్చాడు.

‘‘పెనాంగ్‌లో ఉన్న రాఘవన్‌నూ, స్వామినీ, అలాగే ఐపోలో ఉన్న థివీనీ వెంటనే సింగపూర్‌కు రమ్మని చెప్పు. ఇనాయత్‌కు అతడి కారు టాంకు నిండా పెట్రోల్‌ పోయించి ఐపోకు పంపించమను. అక్కడ థివీనీ, అటునుంచి పెనాంగ్‌లో రాఘవన్‌, స్వామిలనూ పికప్‌ చేసుకుని రేపు సాయంత్రానికల్లా సింగపూర్‌ చేరేట్టు చూడమను. రేపు సాయంత్రానికల్లా మనమూ సింగపూర్‌ చేరుకుంటాం.’’

నేను మొదటి అంతస్థులో నిద్రపోతున్న కల్నల్‌ ఇనాయత్‌ను లేపి నేతాజీ ఆదేశాలను తెలిపాను. చెప్పిన పనులు చేసి నేను మళ్ళీ నేతాజీ గదికి వెళ్లేసరికి 4-30 అయింది. ఆయన ఇంకా యూనిఫాంలోనే ఉండి, ఏదో ఆలోచిస్తూ గదిలో పచార్లు చేస్తున్నాడు. నన్ను చూసి ‘ఇక్కడ వేడిగా ఉంది. వరండాలో కూచుందాం పద’ అన్నాడు. వరండాలో పేము కుర్చీల్లో కూచున్నాం. నేతాజీ మొహం గంభీరంగా ఉంది. కాసేపు దీర్ఘాలోచన చేశాక ‘ఇక మనం ఏమి చేయాలన్నది ఇప్పుడు ఆలోచించాలి.’ అని మెల్లిగా అన్నాడు.

సర్‌! ఇప్పుడు టైం 5 కావస్తున్నది. పొద్దున్నే మనం బయలుదేరి సింగపూర్‌కు 12 గంటలు నాన్‌ స్టాప్‌ ప్రయాణం చెయ్యాలి. ఈ లోపు మీరు కాసేపైనా రెస్టు తీసుకోవచ్చు కదా? అని నేనన్నాను. నేతాజీ తమాషాగా నవ్వి ‘ఫరవాలేదు. రేపటినుంచీ మనకు కావలసినంత రెస్టు దొరుకుతుందిలే’ అని జోక్‌ చేశాడు. నిజానికి సైగాన్‌లో తిరిగిరాని పయనానికి విమానం ఎక్కేంత వరకూ ఆయనకు ఒక్క క్షణం కూడా రెస్టు లేదు. తాను సింగపూర్‌ చేరేలోగా జరగవలసిన జరూరు పనులు కొన్ని నాకు అప్పగించి ‘మిగతా విషయాలు కారులో వెళుతూ మాట్లాడుదాము’ అని చెప్పి నన్ను పంపేశాడు. నాకు సరిగా నిద్ర పట్టలేదు. ఉదయం 6 గంటలకు కూడా నేతాజీ గదిలో లైటు వెలుగుతూనే ఉంది. 7 గంటలకు నన్ను ఎవరో లేపి ‘ఇంకో అరగంటలో బయలుదేరాలి’ అని చెప్పారు.

 నేను తయారై కిందికి వెళ్ళేసరికే నేతాజీ రెడీగా ఉన్నాడు. రాత్రంతా హాయిగా నిద్రపోయినట్టు మనిషి ఫ్రెష్‌గా ఉన్నాడు. తెల్లవార్లూ పడిన మధన తాలూకు ఛాయ మోహంలో మచ్చుకైనా లేదు. మలయా రాష్ట్రాల్లో మామూలుగా విజయయాత్రకు వెళ్లబోతున్నట్టే ఉన్నాడు. సాయుధ గార్డులు లారీలో ముందు నిలవగా మా కాన్వాయ్‌ బయలుదేరింది. మొదటి కారులో ఉన్న నేతాజీ నన్ను తన పక్కన కూచోమన్నాడు. మేజర్‌ జనరల్‌ అలగప్పన్‌, కల్నల్‌ నగర్‌, కల్నల్‌ ఇనాయత్‌, సహాయ్‌లు వెనక కార్లలో ఉన్నారు. ఉదయం 7-30 కి బయలుదేరిన వాళ్ళం సింగపూర్‌ చేరేసరికి రాత్రి 7-30 అయింది. ఎక్కడికీ వెళ్ళవద్దు. నా బంగళాలోనే ఉండండి – అని నేతాజీ మాకు చెప్పాడు. వెళ్ళగానే మొహాలు కడుక్కుని అందరం మొదటి అంతస్థు వరండాలో నేతాజీ చుట్టూ చేరాం. మేజర్‌ జనరల్‌ కియానీ, కల్నల్‌ హబీబుర్‌ రహ్మాన్‌లను కూడా అక్కడికి అర్జెంటుగా పిలిపించారు. అప్పుడు మొదలైన సమావేశం మధ్యలో అరగంట భోజన విరామం మినహాయిస్తే తెల్లవారు జామున 3 గంటల దాకా నడిచింది. జపాన్‌ లొంగుబాటు తరవాత ఏమి చేయాలన్నది వివరంగా చర్చించారు. డివిజనల్‌ కమాండర్లకు ఇవ్వవలసిన ఉత్తర్వులు, తూర్పు ఆసియాలోని ఐఐఎల్‌ శాఖలకు, ఉపశాఖలకు చెప్పవలసిన విషయాలు, సైనికులకు సివిలియన్‌ సిబ్బందికి కనీసం ఆరు నెలలకు సరిపడా జీతాలు అందేలా ఏర్పాట్లు వివరంగా చర్చించాము.

 జపాన్‌ లొంగిపోయినట్టు బ్రిటిష్‌, అమెరికన్‌ రేడియో స్టేషన్లు చెపుతున్నా అప్పటికింకా జపాన్‌ నుంచి ఆధికారిక ధృవీకరణ వెలువడలేదు. లండన్‌, వాషింగ్టన్‌, మాస్కోలకూ టోక్యోకూ నడుమ చర్చలు నడుస్తున్నాయని మాత్రమే చెపుతున్నారు. మరునాడు 13వ తేదీ పగలూ రాత్రీ, 14వ తేదీ సాయంత్రం వరకూ మేము నేతాజీని కలుస్తూ, ఆదేశాలు తీసుకుంటూ ఎవరి పనుల్లో వాళ్ళం చాలా బిజీగా ఉన్నాము. సింగపూర్‌, మలయా, తూర్పు ఆసియాలోని లీగ్‌ శాఖలకూ, ఐఎన్‌ఎ దళాలకూ నేతాజీ చివరి నిమిషంవరకూ అవసరమైన ఆదేశాలు ఇస్తూనే ఉన్నాడు. ఐఎన్‌ఎ బలగాల సరెండర్‌ ఎలా జరగాలి, సింగపూర్‌లో 500 వరకూ ఉన్న రaాన్సీరాణి రెజిమెంట్‌ అమ్మాయిలను క్షేమంగా ఇళ్ళకు ఎలా చేర్చాలి, సింగపూర్‌ తిరిగి బ్రిటిష్‌ సేనల వశమయ్యాక ఫుల్‌ టైమ్‌ పనిచేసే లీగ్‌ కార్యకర్తలకు ఇబ్బందులు రాకుండా ఎలా చూడాలి? వగైరా ఎన్నో అంశాలపై ఆయన దృష్టి సారించాడు.

 ఆగస్టు 14 మధ్యాహ్నం నేతాజీ బాధపెడుతున్న ఒక పన్నును పీకించుకున్నాడు. పక్క మీద నుంచి కదలకుండా ఒక రోజు పూర్తి రెస్ట్‌ తీసుకోవాలని డెంటిస్ట్‌ చెప్పాడు. 4 గంటలకు కొద్దిసేపు మాత్రం కళ్ళు మూసుకుని పడుకున్నాక నేతాజీ నన్ను పిలిచాడు. ‘ఈ సాయంత్రం మన రెజిమెంట్‌ అమ్మాయిలు రaాన్సి లక్ష్మీబాయి జీవితం మీద నాటకం వేస్తున్నారు. కమాండెంట్‌ జానకి థేవర్‌ నన్ను తప్పకుండా రమ్మంది. వెళ్ళాలి. నా కోసం ఆగకుండా కార్యక్రమం మొదలెట్టమని చెప్పు. నేను నెమ్మదిగా వెళతాను’ అన్నాడు. అన్నట్టే వెళ్ళాడు. ఎంతటి పంటి నెప్పీ నేతాజీని ఆపలేదు.

[Unto Him A Witness, S.A.Ayer , pp.51-57]

సుభాస్‌ చంద్రబోస్‌కు అత్యంత సన్నిహితుడు, పక్కనే ఉండి అన్నీ కనిపెట్టిన వాడు అని అందరూ అనుకునే అజాద్‌ హింద్‌ ప్రభుత్వ ప్రచార శాఖ మంత్రి సుబ్బియర్‌ అప్పాదురై అయ్యర్‌కి కూడా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. సెరంబాన్‌ గెస్ట్‌ హౌస్‌లో రేడియో సెట్టు లేదుÑ సింగపూర్‌ నుంచి లక్ష్మయ్య, గణపతి వచ్చి బి.బి.సి.లో తాము విన్న కబురు చెవిన వేసే దాకా జపాన్‌ లొంగుబాటు సంగతి బోస్‌కు తెలియదు అని అయ్యర్‌ కథనాన్ని చదివినవారు అనుకుంటారు. ఆగస్టు 6న హిరోషిమా మీద, మూడు రోజుల తరవాత నాగసాకి మీద అమెరికా ఆటంబాంబులు వేసి లక్షల మంది సామాన్యప్రజల ప్రాణాలు రాక్షసంగా బలిగొన్న వైనం గాని, సర్వనాశనాన్ని నివారించటానికి గత్యంతరం లేక జపాన్‌ లొంగుబాటుకు సిద్ధమైనదని బిబిసి ప్రసారం చేసిన వార్తగాని బోస్‌కు తెలియవుÑ చకచకా మారిపోతున్న యుద్ధ పరిణామాలు తెలియకపోవటం వల్ల బోస్‌ ముంచుకొస్తున్న ప్రమాదం తీవ్రతను గ్రహించలేక పోయాడుÑ లొంగిపోవలసిన సమయంలో మూర్ఖంగా ప్రవర్తించాడు – అని అధిక్షేపించిన గ్రంథకర్తలు, మేధావులు చాలామంది ఉన్నారు. వాస్తవానికి నేతాజీ ఎక్కడ ఉన్నాÑ బి.బి.సి. కంటే ముందే తాజా సమాచారం ఎప్పటికప్పుడు ఆయనకు అందుతుండేది. హికారీ కికాన్‌లో దుబాసీగా పనిచేసిన నెగిషి అనంతరకాలంలో అత్యధిక ప్రాచుర్యం కలిగిన జపాన్‌ దినపత్రిక Yomiyuri Shimnun జరిపిన సమగ్ర విచారణలో ఏమి చెప్పాడో చూడండి:

 ‘‘బాంగ్‌కాక్‌లోని జపాన్‌ రాయబారి రాసిన రహస్యలేఖను బోస్‌కు అందజేసే పని నాకు అప్పజెప్పారు. కవరు అతికించి లేదు. లోపలి ఉత్తరం నేను చదివాను. ‘జపాన్‌ ప్రభుత్వం పాట్స్‌ డాం డిక్లరేషన్‌ను అంగీకరించాలని నిర్ణయించింది. ఆ విషయం మీకు తెలియపరుస్తున్నాము.’ అని అందులో ఉంది. అప్పుడు బోస్‌ సెలంబాన్‌ క్యాంపులో ఉన్నాడు. ఆరు గంటలు పైగా ప్రయాణం చేసి ఆయన ఉన్నచోటికి వెళ్లి ‘రాయబారి మీకు ఈ ఉత్తరం పంపారు’ అన్నాను. బోస్‌ దాన్ని చూడగానే ‘ఏమిటి? మళ్ళీ ఆటంబాంబా?’ అని అడిగాడు. నాకు ఆశ్చర్యం వేసింది. హిరోషిమా, నాగసాకిల మీద అమెరికన్లు ఏవో బలమైన బాంబులు వేసారని వినడమే తప్ప అవి ఆటంబాంబులన్న సంగతి మాకు తెలియదు. అప్పటికే ఆయనకు ఆ సమాచారం ఎలా అందిందో! ఉత్తరం చూసి తల పంకించి బోస్‌ నాకో పని అప్పగించాడు. కిందటి మారు టోక్యో పర్యటనలో ఆయన తన ప్రభుత్వానికి రాబట్టిన 10 కోట్ల ఎన్‌ల రుణసదుపాయంలో కోటి ఎన్లు మాత్రమే ఖర్చయ్యాయట. సింగపూర్‌లోని యోకొహామ స్పెసీ బ్యాంకు బ్రాంచి నుంచి ఆ మొత్తం డ్రా చేసి ఐఎన్‌ఎ విభాగాలన్నిటికీ పంపే పని చూడు. కృతజ్ఞతా పూర్వకంగా నేను నా సైనికులకు ఇవ్వదలిచిన బహుమానం అది.` అన్నాడాయన.’’

[Quoted in Laid To Rest, Ashis Ray, pp. 85-86]

జపాన్‌ ప్రభుత్వం నుంచి ప్రత్యేక దూత ద్వారా లొంగుబాటు నిర్ణయం సమాచారం అధికారికంగా అందుకున్నాక బోస్‌ గెస్ట్‌ హౌస్‌కు తిరిగివెళ్ళాడు. అక్కడ అదే వార్త సింగపూర్‌ నుంచి పరుగున వచ్చిన తన సహచరులు చెబితే ‘ఔనా’ అన్నాడు! దటీజ్‌ నేతాజీ!!

– మిగతా వచ్చేవారం

About Author

By editor

Twitter
YOUTUBE