కేరళలో మార్క్సిస్టులు, మతోన్మాదులు టామ్ అండ్ జెర్రీలు. వక్ఫ్ బోర్డులో ఉద్యోగాల భర్తీని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అప్పగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగానే ముస్లిం సంఘాలు ధ్వజమెత్తాయి. ముస్లిం లీగ్ అయితే దీనికి నిరసనగా మసీదులలో నిరసనలు చేపట్టాలనే వరకు వెళ్లింది. ఇంతకీ ముస్లిం లీగ్ మత సంస్థా? లేకపోతే రాజకీయ పార్టీయా? ఇది కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తాజాగా వేసిన ప్రశ్న. పినరయి వంటి కమ్యూనిస్టు ఉద్దండుడికి ఈ విషయంలో పరిజ్ఞానం లేదని అనుకోలేం. ముస్లింలకి మతం, రాజకీయం వేరువేరు కాదన్న నగ్నసత్యం పినరయికి బాగానే తెలుసు. అయినా ఇలాంటి ప్రశ్న వేయడానికి పినరయికి బలమైన కారణమే ఉంది. ఎంతయినా కూతురుని అంతమాట అంటే ఏ తండ్రి భరించగలడు? కమ్యూనిస్టు అయితేనేం! ఆయనలోను తండ్రి ఉంటాడు. కానీ ముస్లిం లీగ్ నాయకులకు అవతలి మతం వారి మనోభావాల పట్ల, మానవ సంబంధాల పట్ల గౌరవం ఉంటుందని అనుకోలేం. కేరళలో ఇప్పుడు అదే జరిగింది. వక్ఫ్‌బోర్డులో ఉద్యోగ నియామకాలన్నీ ఇతర ఉద్యోగ నియామకాల మాదిరే పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అప్పగించాలన్న యోచనలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది. దాదాపు 120 ఉద్యోగాలు. ఇది ముస్లిం లీగ్‌తో పాటు, దాదాపు అన్ని ముస్లిం సంస్థలకు నచ్చలేదు. ఎక్కడైనా సెక్యులర్‌గాని ముస్లిం సంస్థల దగ్గర కాదు. కమ్యూనిస్టులు కావచ్చు, ఒట్టి సెక్యులరిస్టులే కావచ్చు, ముస్లిం సంస్థల వ్యవహారా లలో వేలు పెట్టాలని చూస్తే తాము అంగీకరించ బోమని తేల్చి చెప్పేశారు. ఈ గొడవలోనే ముస్లిం లీగ్ హద్దు మీరి వ్యాఖ్యలు చేసింది. దాని మీదే ముఖ్యమంత్రికి కోపం వచ్చింది. ముస్లిం లీగ్ కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమాక్రటిక్ ఫ్రంట్ భాగస్వామి. దీనికి కోపం రాకుండా ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు శబరిమల దేవస్థానం తరహాలోనే వక్ఫ్‌బోర్డు నియామకాలకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని చెప్పారు. కానీ శబరిమల దేవస్థానంలో హిందువులు కానివారికి కూడా ఉద్యోగాలు వచ్చాయి. వక్ఫ్‌బోర్డు ఉద్యోగాలు మాత్రం మాకు తప్ప ఇంకెవరికీ ఇవ్వడం కుదరదని చెబుతున్నాయి ముస్లిం సంఘాలు. ఇదే ఇప్పుడు మాటల యుద్ధానికి కారణమైంది. దీనిని సున్నీల మధ్య ఆధిపత్య పోరుగా కొందరు చూస్తుంటే, 1989లో రెండుగా చీలిన సున్నీలను ఏకం చేస్తున్న పరిణామంగా కొందరు భావిస్తున్నారు. వాస్తవానికి ముస్లిం లీగ్ వక్ఫ్ నియామకాల సమస్యలోకి ముఖ్యమంత్రి కుటుంబాన్ని లాగింది. అది కూడా పరమ కుసంస్కారంతో.
‘డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు ఒకడున్నాడు. అతడు ఒకింటి అల్లుడు కూడా. మా ప్రాంతానికి చెందినవాడే. అతని భార్య ఎవరు? వాళ్లదొక పెళ్లా? అది వ్యభిచారం!’ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నాయకుడు, కేరళ ప్రముఖుడు అబ్దుల్ రహమాన్ కల్లాయి నోటి నుంచి వచ్చిన ఈ మాట ఎంత నీచమైన వ్యాఖ్యో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంతకీ ఆ యూత్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు ఎవరు? ఆయన పేరు పీఏ మహ్మద్ రియాస్. కేరళ సీపీఎం మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రి. సాక్షాత్తు ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ అల్లుడే. ఆయన కుమార్తె వీణా విజయన్‌ను రియాస్ పెళ్లి చేసుకున్నాడు. అంటే ముస్లిం లీగ్ నాయకుడు కల్లాయి వ్యభిచారం అంటగట్టినది వీణా విజయన్‌కే.
పినరయ్ విజయన్ తనను తాను హిందువుగా భావిస్తారంటే నమ్మడం కష్టం. ఆయన కాకలు తీరిన కమ్యూనిస్టు కదా! కానీ ముస్లిం నాయకులు ఆయనను హిందువుగానే చూస్తున్నారని కల్లాయి వ్యాఖ్యలను బట్టి తెలుస్తుంది. రియాస్‌దీ, వీణదీ వివాహం కాదన్నదే కల్లాయి మాటల సారాంశం.
ఇన్నాళ్లూ కమ్యూనిస్టులకి ముస్లింలు అత్యంత ఆత్మీయులు అనుకుంటూ ఉంటే ఇలాంటి వ్యాఖ్యలేమిటి అన్న రీతిలో సామాజిక మాధ్యమాలలో చాలామంది కల్లాయి మీద విమర్శలు కురిపించారు. ఇదో వివాదంగా మారింది. దీనికి కల్లాయి ఇచ్చిన వివరణ చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియదు. ఎవరినీ వ్యక్తిగతంగా కించపరచడానికి ఆ మాట అనలేదన్నాడు కల్లాయి. అయితే ఒకరి జీవితంలో ఉండవలసిన మతకోణాన్ని చూపడం నా ఉద్దేశమేనని ఒప్పుకున్నాడు. కాబట్టి కల్లాయికి కావలసింది రియాస్, వీణా వివాహంలోని మతకోణమే. కల్లాయి ఈ వ్యాఖ్యలు చేసిన వేదిక కూడా మత వ్యవహారాలతో సంబంధం ఉన్నదే. వక్ఫ్ బోర్డులో ఉద్యోగాల నియమకాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఇస్తూ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా కొజికోడ్ సముద్ర తీరంలో డిసెంబర్ 9న జరిగిన సభలో కల్లాయి ఈ వ్యాఖ్యలు చేశారు. రియాస్ భార్య హోదాలో వీణ పినరయినే ముఖ్యమంత్రి వక్ఫ్ బోర్డు నేతను చేస్తారన్న భయం ఏమైనా లీగ్‌కు ఉందేమో! కల్లాయి కోపానికి ఇంకో కారణం కూడా ఉంది. ఇక వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకూ ఉద్యోగావకాశాలు ఉంటాయని సామాజిక మాధ్యమాలలో హోరెత్తింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేతిలోకి వచ్చాక అర్హులను నియమిస్తారు. అక్కడ మతం, ప్రాంతం అర్హతలు కాలేవు. కానీ ముఖ్యమంత్రి పినరయ్ ఇది వదంతేనని నచ్చచెప్పారు. హిందువుల సంస్థలలో ముస్లింలనీ, క్రైస్తవులనీ దూర్చినట్టుగా వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు అవకాశం ఇవ్వబోమని హామీ అన్నమాట.
కూతురిని అంతమాట అన్నందుకు పినరయికి ఎక్కడో బాధగానే ఉంది. ముస్లింలందరి మీద తమదే ఆధిపత్యమని లీగ్ నమ్మకం కాబోలు అని కూడా ఆయన అన్నారు. మా వెనుక ముస్లింలు లేరా? అని కూడా ప్రశ్నించారు. మలప్పురం అల్లర్ల సమయంలో సంఘ పరివార్ దాడులు చేసినప్పుడు ముస్లింలు మాతోనే ఉన్నారని కూడా గుర్తు చేశారు. ఆఖరికి ఇటీవల జరిగిన మలప్పురం ఎన్నికలలో కూడా మాతోనే వారు కలసి ఉన్నారని కూడా విజయన్ చెప్పుకున్నారు.
అయినా ముస్లింల మీద గుత్తాధి పత్యమంతా మీదే అని మీరు చెప్పుకుంటే దానికి మేం అంగీకరించం అని కూడా పినరయి చెప్పారు. ఏం చేసినా ముస్లిం లీగ్ అంగీకారంతో, అనుమతితో చేయాలా అని కూడా ఆక్రోశించారు. అయితే కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ ముస్లింలు, సీపీఎం నాయకత్వంలోని లెఫ్ట్ డెమాక్రటిక్ ఫ్రంట్ గొడుగు కింద ఉండే ముస్లింలు వేర్వేరు కాకపోవచ్చు. ఈ సత్యం ఇప్పటికైనా పినరయి గుర్తిస్తే మంచిది. ఇవాళో రేపో ఎల్‌డీఎఫ్ ముస్లింలు కూడా వచ్చి వక్ఫ్ నియామకాలలో ఎవరూ వేలుపెట్టకూడదని చెబితే పినరయి మారు మాట్లాడకుండా ఆమోదించరా ఏమిటి? ముస్లిం లీగ్, ఇతర ముస్లిం సంఘాలు సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలకు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో చెప్పాయి. వక్ఫ్ బోర్డు ముస్లింల ఆచార వ్యవహారాలను పరిరక్షించాలి, అలాంటి బాధ్యతను బోర్డ్ సక్రమంగా నిర్వర్తించాలంటే ముస్లింలు మాత్రమే ఉద్యోగులుగా ఉండాలని వాటి వాదన. కాబట్టి దీని మీద ఆలోచించి, అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి పినరయి వెంటనే హామీ ఇచ్చారు. ఇలాంటి సదుపాయం హిందూ దేవస్థానాలకు ఎందుకు వర్తింప చేయరు? ఇది మాత్రం అడగరాదు.
నిజానికి వక్ఫ్ బోర్డు ఉద్యోగ నియామకాల విషయం చాలాదూరం వెళ్లింది. దీనికి వ్యతిరేకంగా మసీదులలోనే నిరసన చేపట్టాలని కొన్ని ముస్లిం సంఘాలు పిలుపు ఇచ్చాయి. కానీ ఈ ఆలోచనను ఇస్లామిక్ పండితుల సంఘం జమాయితుల్ ఉలేమా తీవ్రంగా వ్యతిరేకించింది. మసీదులంటే పవిత్ర స్థలాలు, అక్కడ నిరసనలు అవీ కుదరదు అని సంస్థ అధ్యక్షుడు సయిద్ ముహ్మద్ జిఫ్రి ముతుక్కొయ తంగాల్ అభిప్రాయపడ్డారు. లీగ్ మసీదులలో నిరసన చేపట్టాలని చెప్పడంలో రాజకీయం ఉందని చాలా మంది అభిప్రాయం. ముస్లిం లీగ్ కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ భాగస్వామి కాబట్టి ఈ వివాదాన్ని సీపీఎం రాజకీయంగా ఉపయోగించు కోవడానికి సిద్ధపడింది. ముస్లిం లీగ్ ముస్లింలలోనే విభేదాల సృష్టించడానికి, మత విభేదాలు తేవడానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనోభావాలను రెచ్చ గొట్టేందుకు ప్రయత్నిస్తున్నదని పార్టీ ఆరోపించింది. తరువాత తీరా లీగ్ కూడా జమాయితుల్ ఉలేమా అభిప్రాయాన్నే గౌరవించి, తన ప్రయత్నం విరమించుకుంది.
ఈ వివాదం వెనుక ముజాహిద్ జమాత్ ఇ ఇస్లాం ఉందని చాలామంది ముస్లింల అభిప్రాయం. ప్రస్తుతం కేరళ ముస్లిం సమాజం మీద ఆధిపత్యం తెచ్చుకోవాలని ఈ సంస్థ ప్రయత్నిస్తున్నదన్న ఆరోపణ ఉంది. ఇది ముస్లింలీగ్ చెప్పుచేతల్లో ఉంటుంది. కొందరు ముస్లింల వాదన ప్రకారం వక్ఫ్ నియామకాలు ముస్లిమేతరులకు వెళితే తమ ఆచార వ్యవహారాలకు నష్టం. కానీ ఇంకొందరి అభిప్రాయం ప్రకారం మసీదుల ఆస్తులన్నీ ముజాహిదీన్‌ల చేతికి వెళతాయి. నేటి వివాదం కారణంగా ఇంతవరకు ముజాహిదీన్‌లు ఆక్రమించిన వక్ఫ్ ఆస్తుల చిట్టా కూడా బయటకు వస్తుందని కొందరి ఆశ. ఒకటి మాత్రం నిజం. వక్ఫ్ బోర్డు నియామకాలలో రాజకీయ జోక్యం ఉంది. వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి. కానీ వీటిని బయటకు చెప్పడం లేదు. కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ పేరుతో ముస్లిమేతరులు ప్రవేశిస్తే ఆమోదించేది లేదని ముక్తకంఠంతో ముస్లింలు చెప్పేశారు.