– సుజాత గోపగోని, 6302164068
తెలంగాణలో కొంతకాలంగా రాజకీయాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్ వ్యవహారశైలి, ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న తీరు రాష్ట్రమంతటా చర్చనీయాంశమవుతోంది. ఎందుకు, ఎలా, ఎవరి వల్ల, ఎందుచేత? అనే ప్రశ్నలు పక్కనబెడితే జనంలో ఒకరకమైన చర్చకు కేంద్రబిందువుగా మారుతోంది. ఇప్పటికే ఉన్న సమస్యలు, కొంతకాలంగా క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్ పట్ల నెలకొన్న వ్యతిరేకత, హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాలు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు వంటి అంశాలన్నీ పక్కకెళ్లిపోయాయి. టీఆర్‌ఎస్ నేతల విమర్శలు, కేసీఆర్ పలు సందర్భాల్లో చేస్తున్న దుందుడుకు వ్యాఖ్యలపైనే చర్చ జరుగుతోంది. ఇదంతా పక్కా వ్యూహం ప్రకారమే జరుగుతోందని, జనం దృష్టి మరల్చి ప్రభుత్వ వ్యతిరేకతను కొంతయినా మర్చిపోయే పరిస్థితులు కల్పిస్తున్నారన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ వ్యూహాల వెనుక, తాజా పరిణామాల వెనుక కేసీఆర్ మాస్టర్ మైండ్ ఉన్నట్లు చర్చ మొదలయింది.
హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితం కేసీఆర్‌లో తీవ్రమైన అలజడికి కారణమయింది. ఆయన ఏం చెబుతున్నారో, ఏ ప్రకటన చేస్తున్నారో ఆయనకే అర్థంకాని పరిస్థితి నెలకొందని పార్టీశ్రేణులే కుండబద్దలు కొట్టిన సందర్భాలున్నాయి. మరోవైపు, ఇదే తగిన సమయంగా భావించిన కొందరు సొంతపార్టీ నేతలు ఇన్నాళ్లు మనసులో ఉన్న మాటలు, అభిప్రాయాలు బయటకు చెప్పుకోలేక కుమిలిపోయిన నాయకులు నెమ్మదిగా తమ అభిప్రాయాల్ని బాహాటం చేస్తున్నారు. కేసీఆర్‌ది నియంతృత్వ ధోరణి అంటూ వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ పరిణామాల వెనక రాజకీయ ‘కన్సల్టెంట్ ప్లాన్’ ఉన్నట్లు అర్థమైపోయింది. రాజకీయ వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్.. కేసీఆర్‌కు సలహాలు ఇస్తున్నారన్న చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
సీఎం కేసీఆర్ ఇటీవల రూటు మార్చారు. దారుణమైన తిట్లతో వివాదాస్పద రాజకీయం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన దూషణలకు దిగుతున్నారు. ఎందుకిలా చేస్తున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. హుజురాబాద్ గురించి నభూతో నభవిష్యత్ మాదిరిగా కష్టపడినా, రాష్ట్ర ఖజానానే ఓ దశలో ఖాళీచేసే స్థాయిలో వరాలజల్లు కురిపించినా.. జనం కాషాయ కండువా కప్పుకున్న ఈటలకే జై కొట్టడం కేసీఆర్‌కు మింగుడు పడలేదని, అందుకే ఆ స్థాయిలో వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాడని అంతా అనుకున్నారు. సాక్షాత్తూ గౌరవప్రదమైన పదవిలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని తీవ్రస్థాయిలో దూషించారు. ఇదంతా ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న దూషణల రాజకీయాలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. ఏపీలో ఏకంగా మంత్రులే ప్రత్యర్థులపై దిగజారుడు వ్యాఖ్యానాలు, విమర్శలు చేస్తున్నారు. సాక్షాత్తూ అసెంబ్లీ వేదికనుంచే ఇంట్లోవాళ్లు, మహిళల పట్ల కించపరిచే విమర్శలు చేశారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అలాంటి భాషనే వాడుతున్నారు.
కొద్దిరోజుల పాటు తెలంగాణ మంత్రులు కూడా అనుచిత విమర్శల బాట పట్టారు. అది కూడా ఏపీ సర్కారు, ఏపీ మంత్రులు, ముఖ్యమంత్రి లక్ష్యంగా దూషణలు కొనసాగించారు. అప్పుడే తెలంగాణ రాజకీయాల్లో ఈ స్థాయి విమర్శలపై విస్తృతంగా చర్చ జరిగింది. తర్వాత ఆ తరహా విమర్శలు సద్దు మణిగాయి. కానీ, కొంత సమయం తర్వాత కేసీఆర్.. స్వయంగా దిగజారుడు విమర్శలకు పాల్పడు తున్నారు. అయితే, స్వయంగా కేసీఆరే ఈ తరహా రాజకీయాలకు కేంద్రబిందువుగా మారడంతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్లాన్ అయ్యుండొచ్చన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే ఏపీలో ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐప్యాక్ సంస్థ.. వైసీపీకి రాజకీయ సలహాలను అందిస్తోంది. వైసీపీ వ్యూహాలను ఖరారుచేస్తోంది. జనం దృష్టిని మరల్చగలిగే ప్లాన్లను రూపొందించి అమలు చేయిస్తోంది. ఇప్పుడు అదే పద్ధతిలో తెలంగాణ సీఎం విమర్శల వర్షం కురిపిస్తుండటంతో ఈ పోలిక నిజమే అన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్త మవుతున్నాయి. కొంతకాలం క్రితం తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యలు శాంపిల్స్‌గా భావి స్తున్నారు. ఆ సమయంలో మంత్రులు చేసిన వ్యాఖ్యలతో రాజకీయాల ప్రాధాన్యం మారిపోయింది. జనం దృష్టి మళ్లింది. ఆ పరిణామం విజయవంతం కావడంతో.. కేసీఆర్ ఆ ఫార్ములాను పాటిస్తున్నారన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి.
జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు అందించడం ప్రారంభమైందని అంచనా వేస్తున్నారు. టీఆర్‌ఎస్ కోసం పీకే టీం పని చేయబోతోందని.. ఈ మేరకు గతంలో ఓ సారి ప్రగతి భవన్‌లో సమావేశం అయ్యారన్న ప్రచారం జరిగింది. దానికి అధికారిక ప్రకటన రాలేదు. పీకేకు చెందిన ఐ ప్యాక్ కూడా టీఆర్‌ఎస్ కోసం పని చేస్తున్నట్లుగా ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. కానీ, ఇటీవలే పీకే టీమ్‌కు చెందిన ఐ ప్యాక్ బృందం కేసీఆర్‌తో, టీఆర్‌ఎస్ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశమైందని తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్, ఆయన సంస్థ ఐప్యాక్ వ్యూహకర్తగా సేవలందించేందుకు ఒప్పందం కుదిరిందని అంటున్నారు. అంతేకాదు.. ఇటీవల ఢల్లీి పర్యటనలో కూడా కేసీఆర్ పలుసార్లు పీకేతో భేటీ అయ్యారన్న వాదనలున్నాయి. అందుకే, ప్రశాంత్ కిషోర్ సలహాలతోనే ఉద్రిక్తతలు పెంచేలా తిట్ల రాజకీయం చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పీకే మార్క్ రాజకీయాలు ఎలా ఉంటాయో.. కేసీఆర్ కూడా అచ్చంగా అదే రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నా రన్న అనుమానం తెలంగాణ రాజకీయాల్లో సహజం గానే వ్యక్తమవుతోంది. వాస్తవానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ఆ స్థాయిలో తిట్టాల్సిన అవసరం కేసీఆర్‌కు లేదు. కానీ, పరిస్థితులను, పరిణామాలను జనం దృష్టి మళ్లించే స్థాయిలో అంత దారుణంగా తిట్టారు కేసీఆర్. అయితే, ఇదంతా ప్రశాంత్ కిషోర్ చలువేనని.. పదవిని కాపాడుకునేందుకు కేసీఆర్ అనాలోచితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణ లున్నాయి. నిజంగానే కేసీఆర్‌కు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు సమకూర్చే సేవలు ప్రారంభిస్తే తెలంగాణ రాజకీయాలు మరింత దిగజారడం ఖాయమన్న చర్చ జరుగుతోంది.
ఈనెల ఒకటో తేదీన తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసు కుందంటున్నారు. ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐప్యాక్ బృందం తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో సందడి చేసిందని అంటున్నారు. ఐప్యాక్ ప్రతినిధులు కేసీఆర్‌తోనూ, టీఆర్‌ఎస్ నేతలతోనూ సుదీర్ఘంగా సమావేశమయ్యారని చెబుతున్నారు. తొలుత రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, ప్రజల అభిప్రాయాలు, కేసీఆర్‌పై ఓటర్ల వైఖరి తదితర అంశాలపై సర్వే చేసేందుకు సన్నద్ధమైనట్లు సమా చారం. రాష్ట్రంలోని ఓటర్ల మానసిక స్థితిని అంచనా వేసేందుకు కూడా అవసరమైన సర్వేలు చేయాలని కేసీఆర్ సూచించారని చెబుతున్నారు. ఈ క్రమంలో.. సర్వేలు మొదలైనట్లు కూడా చెప్పుకుంటున్నారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల సమయం మాత్రమే ఉన్నందున.. ఇప్పటినుంచే పీకే టీమ్ సేవలను వినియోగించుకోవాలని టీఆర్‌ఎస్ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. తమ ప్రభుత్వానికి ఆదరణ తగ్గుతోందని ఆందోళన చెందు తున్న కేసీఆర్.. తన వైఫల్యాలకు గల కారణాలను విశ్లేషించుకొనేందుకు పీకే టీమ్ సర్వేలు తోడ్పడ తాయని అభిప్రాయపడ్డారట. క్షేత్రస్థాయిలో అధికార టీఆర్‌ఎస్‌పైనా, కేసీఆర్‌పైనా వ్యతిరేకత స్థాయి ఎక్కువగా ఉండటంతో సర్వే చాలావరకు కలిసి వస్తుందని చెప్పారట. అలాగే. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం, హుజురాబాద్ ఎన్నికల్లో విజయం సాధించడం ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కూడా తెలియాల్సి ఉందని కేసీఆర్ అంటున్నారట. వాస్తవానికి కొంతకాలం క్రితం ప్రశాంత్ కిషోర్‌తో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ సమావేశమయ్యారు. మహారాష్ట్రలో శరద్ పవార్‌తో పీకే సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ సమావేశం జరిగింది. మరో ఆసక్తికరమైన విషయమేంటంటే, వైఎస్ షర్మిలకు ఇప్పుడు పీకే టీమ్ సభ్యురాలు ప్రియా సలహాలు, సూచనలు అందిస్తున్నారు. మరి కేసీఆర్‌కు పీకే టీం సలహాలు ఇస్తారా? అన్న సందేహాలు కూడా వ్యక్త మవుతున్నాయి. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం పీకే టీం నుంచి సర్వే మద్దతును మాత్రమే కోరినట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి తదుపరి సేవలు నిర్ణయిస్తారని సమాచారం.
రాజకీయాల్లో కేసీఆర్‌నే పెద్ద వ్యూహకర్తగా చెప్పుకుంటారు. మరి.. అలాంటి నాయకుడు వేరే వ్యూహకర్త సలహాలు తీసుకుంటాడా? అన్న చర్చ కూడా రాజకీయవర్గాలలో సాగుతోంది. కానీ, ఆ అవసరం, అనివార్యమన్న పరిణామాలు ఇటీవలి కాలంలో చోటుచేసుకున్నాయి. తెలంగాణలో బీజేపీ ఊహించని స్థాయిలో పుంజుకుంది. పలు ఉప ఎన్నికల్లో సత్తా చాటింది. ప్రజల్లోకి ఉవ్వెత్తున దూసుకెళ్లింది. ఈ పరిస్థితుల్లో బీజేపీని ఎదుర్కోవడం కష్టసాధ్యమన్న అంచనాకు వచ్చిన కేసీఆర్ పీకే వ్యూహాలకు సై అన్నట్లు సమాచారం.
– వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్