-హరి
అందరి బంధువు, అజాతశ త్రువు కొణిజేటి రోశయ్య. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శం. 70 ఏళ్ల ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం రాజకీయాల్లో రాణించాలనుకుంటున్న నేటి యువతరానికి ఎంతో స్ఫూర్తిదాయకం.
‘ప్రజాసేవాతత్పరత, దేశభక్తి, చిత్తశుద్ధి, అంకితభావమే అప్పటి రాజకీయాల్లో ప్రవేశించిన మాలాంటి వాళ్లకి పునాది…’ అని తరచూ చెప్పుకున్న రోశయ్య.. ఇప్పుడున్న రాజకీయ వాతావరణం, పరిస్థితులు 1950లలో ఉండి ఉంటే తాను అసలు రాజకీయాల్లో ప్రవేశించగలిగేవాడ్ని కాదు, మనగలిగే వాడ్ని కాదు అని ఇటీవల ఒక టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
కొణిజేటి రోశయ్య గుంటూరు జిల్లా వేమూరులో 1933 జూలై 4న ఓ దిగువ మధ్యతరతి కుటుం బంలో ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు. ఐదో తరగతి వరకూ సొంత ఊళ్లో, మూడో ఫారం వరకూ రెండు మైళ్ల దూరంలోని పెరవలిలో, స్కూలు ఫైనలు, పీయూసీ ఇంకొంత దూరంలో ఉన్న కొల్లూరులో చదివారు. గుంటూరు హిందూ కాలేజీలో వాణిజ్యశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశారు.
20 ఏళ్ల వయసులో కొత్త రఘురామయ్య నేతృత్వంలో కర్షకనేత ఆచార్య ఎన్జీ రంగా ఏర్పాటు చేసిన కిసాన్ యాత్రా స్పెషల్‌లో వందలాది రైతులతో పాటు ఉత్తర భారతదేశమంతా పర్యటించడం రోశయ్య తొలి రాజకీయానుభవం. ఆ యాత్రలో భాగంగా అప్పటి ప్రధాని నెహ్రూని కూడా ఆయన కలిశారు.
రోశయ్య ప్రజాక్షేత్రంలో జనం ఓట్లతో నాయకుడైన సందర్భాలు తక్కువ. పెద్దలసభ (శాసన మండలి) రద్దయి, తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటీ, రెండు సందర్భాల్లో ప్రజానాయక పాత్ర పోషించి ప్రజల ఓట్లు అడగాల్సిన పరిస్థితి ఎదురయింది. ఆయన ఎన్నికల రాజకీయం ఓటమితోనే మొదల యింది. చీరాల నియోజకవర్గం నుంచి ప్రముఖ చేనేత నేత ప్రగడ కోటయ్య మీద 1967లో పోటీ చేసి ఓడిపోయారు.
మరుసటి ఏడాది రాజాజీ స్థాపించిన స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఆచార్య ఎన్జీ రంగా ఆశీస్సులతో శాసనమండలికి పోటీచేశారు. కానీ, స్వతంత్ర పార్టీ బలం 7 ఎమ్మెల్యేలే. అయినా రోశయ్య గెలిచారు. ఎలాగంటే, రోశయ్య వినయవిధేయతలకి ముచ్చటపడిన అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఆయనని గెలిపించారు. అనంతరం 1971లో రోశయ్య కాంగ్రెస్‌లో చేరారు. కాసు తర్వాత ముఖ్యమంత్రులైన పీవీ నరసింహారావు, జలగం వెంగళరావులకు కూడా ఆయన సన్నిహితుడుగానే ఉన్నారు. చెన్నారెడ్డి, అంజయ్య, కోట్ల విజయ భాస్కరరెడ్డి మంత్రివర్గంలోనూ పనిచేశారు. వైయస్ రాజశేఖరరెడ్డి హయంలో కూడా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చీరాల నియోజకవర్గం నుంచి 1989, 2004లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యే గెలుపొందిన రోశయ్య సుధీర్ఘకాలం ఆర్థికమంత్రిగా పనిచేశారు. అప్పట్లో మొదటిసారిగా లక్షకోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రోశయ్య తన ఆర్థిక చాతుర్యాన్ని చాటారు.
రాజశేఖరరెడ్డి మరణించడంతో 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబరు 24 వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రోశయ్య బాధ్యతలు నిర్వహించారు. అనంతరం 2011 ఆగస్టు 31 నుంచి 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా సేవలందించారు. గవర్నరుగా పదవీ విరమణ అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. డిసెంబర్ 4, 2021న అనారోగ్యంతో మరణించారు.
వరించిన ఎన్నో పదవులు..
1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణా, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలుÑ 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ; 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణా, విద్యుత్తు శాఖలు; 1991లో నేదురుమల్లి జనార్థనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖలు; 1992లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖల మంత్రిగా పనిచేశారు. 2004, 2009లో వైఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను 16 సార్లు శాసనసభలో ప్రవేశపెట్టారు.
1995-97 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
అవినీతికి దూరం..
అధికారంలో ఉన్నాం కదా ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనేది రాజకీయ నేతల సహజ ఆలోచనగా ఉంటుంది. కానీ రోశయ్య అవినీతికి చాలా దూరంగా ఉండేవారు. ఇన్ని సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో ఎన్నడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదు. ఎవరైనా ఏదైనా పని మీద తనను కలిస్తే అది తాను నిర్దేశించుకున్న పద్ధతుల ప్రకారం ఉంటేనే చేసేవారు. నిబంధనలకు విరు ద్ధంగా ఉంటే తాను చేయలేనని అక్కడికక్కడే చెప్పేవారు. రోశయ్య చీరాల నుంచి గెలిచి మంత్రిగా ఉన్న సమయంలో ఆ ప్రాంత నేతలు కొందరు టిటిడి కల్యాణ మండపం వద్ద ఉన్న ఖరీదైన స్థలాన్ని రాత్రికిరాత్రే ఆక్రమించి అక్కడ గుడిసెలు వేసి దానికి కోణిజేటి రోశయ్య నగర్ అనే బోర్డు పెట్టేశారు. ఉదయాన్నే ఈ విషయం గురించి తెలుసుకున్న రోశయ్య తక్షణమే ఆ బోర్డు, అక్కడ ఉన్న గుడిసెలు తొలగించాలని అప్పటి కమిషనర్‌ను ఆదేశించారు. ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఎన్నో ఉన్నాయి.