– విహారి

చారిత్రక కథ

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ గౌరవార్ధం ఎంపికైన రచన

నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఊరూవాడా పండుగ వాతావరణం. రాజధాని అంతటా కోలాహలంగా ఉన్నది. హంపీ విజయనగరాన్ని చందనంలో ముంచి తేల్చినట్టుంది. ఇవ్వాళ షష్టి. దేవాలయాల్లో మహాలక్ష్మీ అవతారం. కన్నులపండువగా అలంకారాలు. దర్శనానికి వచ్చివెళ్లే జనసందోహం. సంతలూ అంగళ్లూ.

రాజధానికి క్రోసెడు దూరంలో కమలాపురం. పెద్ద చెరువుగట్టున శివాలయం. ఆలయానికి కుడిఎడమల రాతిగోడల నివాసగృహాల వరుస. నాపరాళ్ల కప్పు. వాటిలో ఒకటి`తిమ్మప్ప రౌతుది.

రాత్రి –

గ్రామ చావిడిలో తొమ్మిది గంటలు కొట్టారు.

అన్నాలైనాయి. వసారాలో తిమ్మప్ప తండ్రి బీరప్ప నులకమంచంలో పడుకుని చుట్టకాల్చు కుంటున్నాడు, పక్కన గోడకి ఆనుకుని తిమ్మప్ప. వంటిల్లు సర్దుకుని వచ్చింది ఎల్లవ్వ. తిమ్మప్ప భార్య. భర్తకి ఎదురుగా చూరుకింద రాతిస్తంభానికి నడుం ఆనించి కూచుంది. క్షణాలు గడుస్తున్నాయి. రెప్ప వేయకుండా మొగుణ్ణి చూసి చూసి, గొంతు సవరించు కుని ‘‘రేపు మాత్రం నువ్విజయనగరం ఎల్లొద్దు బావా’’ అన్నది. మాటల్లో భయం ధ్వనించింది.

తిమ్మప్ప నవ్వేడు. ‘‘ఉత్సవాల్లో రేపే గదే వీరులకి పండగరోజు’’ అని ‘‘రాయలవారు మందీమార్బ లంతో, ఏనుగులు, గుర్రాలు, కాలిబంట్ల దళాల కవాతుతో, ప్రధాని తిమ్మరుసయ్య, మంత్రులు, సంప్రతులు, అధికారులతో సహా నవరాత్రి దిబ్బకు వేంచేసేది. వారి వెనగ్గా ఎంతోమంది సామం తులు… ఓప్‌ా… కన్నుల పండగ్గా వుంటుంది` వేడుక. పైగా మల్లయుద్ధాలు, విల్లంబుల పోటీలు, నృత్యాలు, గానాలు, అష్టదిగ్గజాల పద్యాలు… ఎన్నెన్ని ఆకర్షణలో. అయినా ఆ వైభవాన్నంతా నిరుడు చూశావుగా… వద్దంటావేం?’’

‘‘చూశానుగనకనే ఈ భయం. రాయలవారు ఏదో వో పోటీ పెడతారు. నిరుడు గుర్రపుస్వారీ పెట్టారు కదా. ఆ పోటీకి దూకకుండా నిన్ను ఆపటం చచ్చే చావయింది నాకు. అట్టాగే ఈ యేడూ మహారాజు గారు ఏం పోటీ పెడతారో! నీకేమో అసలే వొళ్లూపై తెలియదు. ఒకటే ఆవేశం….’’

బీరప్ప నవ్వుకుంటూ మంచంలో కదిలాడు. ‘‘ఎల్లవ్వా… నిరుడు కొత్తపెళ్లాంవి కదా అని మాట విన్నాడు’’ అని అంటూ, ‘‘వీరుడికి అట్టా పోటీల్లో దిగటంకంటే ఘనతేం వుందే. మారోజుల్లో మేం చెయ్యలా వెయ్యి సాహసాలు?’’ అన్నాడు జ్ఞాపకాలైన అనుభవాల్ని తడువుకుంటూ…

‘‘ఇన్నాంగదా నీ గొప్ప. గుర్రాన్ని ఆరుగజాల కందకాన్ని దాటించాడు మాయన్న’’ అని అమ్మ మళ్లీ మళ్లీ చెప్పుకుంటూ మురిసిపోతావుందిలే’’ అన్నది ఎల్లవ్వ.

మామా కోడళ్ల మాటలు వింటూ తనలో తను నవ్వుకున్నాడు తిమ్మప్ప. తానూ అంతకంత సాహసే. అట్టాంటి సాహసాలు చేసేవున్నాడు.

‘‘అయినా`పోటీ ఏవిటో ముందుగా చెప్పరుగదే. అక్కడికి పోయి ఆ సమయాన్ని చూడాల్సిందే. చూద్దాం`ఈ ఏడాది మహారాజుగారు వీరులకి ఏ సవాలు విసురుతారో…’’ అన్నాడు తిమ్మప్ప. ‘‘సవాలు ఏదైనా`గెలిస్తే అందే బహుమతీ ఘనంగానే వుంటుంది గదా’’ బీరప్ప. ‘‘అవన్నీ ఎట్టావున్నా, రేపెల్లి చూడాల్సిందే. నువ్వూరికే తోకపీకుడు చెయ్యమాక’’ మందలింపుగా అని భార్యవైపు క్రీగంట చూశాడు తిమ్మప్ప. ఆమె కినుకతో, అసహనంగా లేచి లోపలికి వెళ్లిపోయింది.

బీరప్ప ఆలోచన ఎల్లవ్వ మీదికి పోయింది. ఆ పిల్ల తన చెల్లెలు ఆదిలక్ష్మి కూతురే. తండ్రి లేడు. ఆనెగొంది వాడు. ఆయనా రాయలకొలువులో రౌతే. ఎల్లవ్వకీ తిమ్మప్పమీద ప్రేమే. ఆదిలక్ష్మి వచ్చి పెళ్లి ప్రసక్తి తెచ్చింది. బాగానే వుంది. కానీ, కులాచారం, సంప్రదాయం ప్రకారం నూటొక్క వరహాలు పెళ్లి సుంకంగా ఇవ్వాల్సిందేనని పట్టుపట్టాడు తాను. ‘తండ్రి లేని పిల్ల అనీ, తనకింకా ఇద్దరు బిడ్డల పెళ్లి బాధ్యత ఉన్నదనీ ఆ సుంకం ఇచ్చుకోలే’ననీ ప్రాధేయ పడిరది ఆదిలక్ష్మి. తాను వినలేదు. తిమ్మప్ప ‘మనకి సుంకం వద్దు! ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఏడు వర హాల్నీ ఆమెను చెల్లించనీ’ అని తనకు నచ్చచెప్పాలని ప్రయత్నం చేశాడు. తాను ససేమిరా అన్నాడు. సాటివారిలో తనకి చిన్నతనంగా ఉంటుందని మొరా యించాడు. ఆదిలక్ష్మికి ఆ సొమ్ము ఇవ్వక తప్పలేదు. పెళ్లి జరిగింది. నిజానికి, ఆ సొమ్ములో సగానికి పైగా ఎల్లవ్వ నగలకే ఖర్చు చేశాడు తను. ఎల్లవ్వ అసలే అందగత్తె. ఆ నగల్లో పిల్ల ఇంకా బంగారపు బొమ్మలా ఉంది. మురిసిపోతూ మంచంలోనే వంకర్లు తిరిగి మొహాన్ని వెలిగించుకున్నాడు బీరప్ప.

అటు`పది గంటలు కొట్టారు. ఇటు శివాలయం ముందు ఒగ్గుకథ మొదలైంది. ఉజ్జ యనీ మహంకాళి స్తుతి అయిపోయి నట్లుంది. గణపతి ప్రార్థన వినవస్తోంది.

`ఇవాళ నాగెన హళ్లి నుంచి వచ్చిన సత్తయ్య ‘బీరప్ప’ కత చెబుతాడు. సత్తయ్య పేరు నాలుగు నాడుల్లా ప్రసిద్ధి. ఆయన పురాణజ్ఞానం, లౌకికమైన అనుభవం`వాటికి తోడు కతలో చిందులు, ఆడవేషం వేసే యువకునితో పరాచికాలు, క్షణాల్లో ఆశువుగా రగడల్ని మారుస్తూ, త్రిపుట, జంపె, కురుజంపె, ఏక, ఆటతాళాల్లో `సన్నివేశానికి తగిన ఊపునీ, తూగునీ మేళవించి ఉత్కంఠ కలిగిస్తూ కతని జనరంజకం చేస్తాడు. ‘బీరప్ప’ కతలో శివతాండవం ప్రత్యేక ఆకర్షణ!

‘‘ఏందయ్యా ఆలోచన?’’ తిమ్మప్ప ప్రశ్నతో ప్రస్తుతంలోకి వచ్చాడు బీరప్ప. ‘‘ఏం లేదులేరా’’ అని మంచందిగాడు. ‘‘నేనట్టా సత్తయ్య కత కాడికెళ్లొస్తా’’ అంటూ పైపంచె సర్దుకుని కదిలాడు.

తిమ్మప్ప లేచి నిదానంగా ఇంట్లోకి నడిచాడు.

*       *       *

మహర్నవమి దిబ్బ`ప్రాంగణమంతా కళకళ లాడుతోంది. ఎటుచూసినా అలంకారాలు. రాచన గరులోని వందస్తంభాల రాజప్రాసాదం నుండి విశాలమైన బాట. బాటపొడవునా ఇసుకవేస్తే రాల నంతమంది జనం. దిబ్బ`నేలమీద రెండు వందల అమ్ము వేటుల చవుకంగా ఇరవై నాలుగు బారల ప్రమాణం ఎత్తులో ఉన్న రాతి కట్టడం. ఇదే ఉత్సవవేదిక. పరివారంతో వచ్చి వేదికమీద కొలువు తీరాడు`మూరురాయరగండడు, శ్రీకృష్ణదేవరాయలు. వేదికముందు అసంఖ్యాకమైన ప్రేక్షక సమూహం.

వివిధ వేడుకలు సాగుతున్నై. సమయం ఎంత గడుస్తున్నదో తెలియని సందర్భం. రాయలవారి కనుసైగతో సభానాయక, తంత్రనాయక, సర్వశిరః ప్రధాని`తిమ్మరుసు. ఈ సంవత్సరం వీరత్వ ప్రదర్శనని ప్రకటించాడు.

‘‘ఎదురుగా కనిపిస్తున్న పన్నెండు బారల గుంటలో ఒకపులి, ఒక విషనాగు ఉన్నాయి. ఈ పోటీ ఆశ్విక వీరులకు మాత్రమే ఉద్దేశింపబడిరది. మన సామ్రాజ్యంలో ఉన్న పన్నెండు వేలమంది ఆశ్వికవీరుల్లో ఎవరైనాసరే వచ్చి, వాటిని చంపి విజయుడు కావచ్చు. విజేత రాయలవారి మెప్పునూ, కానుకలనూ పొందటమేకాక, ప్రత్యేకంగా కోరుకున్న వరాన్నీ పొందవచ్చు.

ప్రేక్షకుల్లో కలకలం రేగింది. ‘అమ్మో!’ ‘అయ్యో!’ ఆశ్చర్యం! ఆ వీరుడు ఎవరౌతారా?! అని ఉత్కంఠ.

క్షణాలు గడుస్తున్నై. దండధరులెవరో హెచ్చ రికలతో బరాబరులు చేశారు. ప్రాంగణం నిశ్శబ్దమైంది.

ఇక్కడ`పదివరుసల వెనుక`తిమ్మప్ప రౌతు. అతనికి కుడివైపు వొదిగి నిలిచిన ఎల్లవ్వ. తిమ్మప్ప రక్తం ఉప్పొంగుతోంది. కోడె వయసు కాలుదువ్వు తోంది. ఆజానుబాహు విగ్రహం ధైర్యస్థైర్యాల్ని ఉద్రేకపరుస్తోంది. రాయలవారి మెప్పుకోసం కన్నా, వారి వరం కోసం మనసు తొందరచేస్తున్నది. కుడిముంజేతిని దృఢంగా పట్టుకున్న భార్య గుప్పిట బిగిసివుంది. కండరాలు ఉత్సహిస్తుంటే నరాలు ఉద్రిక్తమవుతున్నాయి. భయం సుడి తిరుగుతున్న చూపులతో మూగగా భర్తని వారిస్తున్నది ఎల్లవ్వ. అతని చూపులో చూపు నిలపటానికి మాత్రం ధైర్యం చాలటంలేదు. ప్రాణం రెప్పలవెనుక ఉప్పెనలో కొట్టుకులాడుతోంది. ఆమె అంతఃకరణలోని భీతి తిమ్మప్పకు తెలుసు!

తిమ్మప్పకు ఎడమవైపు బీరప్ప. కొడుకు భుజంమీద చేయివేసి సూటిగా కొడుకు కళ్లల్లోకి చూశాడు. ఆ చూపు వెట్టగా వుంది. ఆ చేతి స్పర్శ వెచ్చని ధైర్యాన్నిచ్చింది.

అటు`తిమ్మరుసు పక్కన వున్న ధర్మశాసనాధికారి పోటీ ప్రకటనని మరోమారు చెప్పి, వీరుల్ని ఆహ్వానించాడు.

ఇప్పుడు తిమ్మప్ప భుజంమీద తండ్రి చరుపు!

ఎల్లవ్వ పట్టుని ఠక్కున సడలించుకుని, రివ్వున ముందుకురికాడు తిమ్మప్ప. రాయలవారికి ప్రణామం చేసి, ఒక్క ఉదటున గుంటదగ్గరికి పోయి నిలిచాడు. ఒక్కక్షణం తల వంగింది. గుంటలోకి చూశాడు!

ప్రేక్షకుల కోలాహలం. చప్పట్లూ, అరుపులూ, దరువులూ!

నేలతల్లికి దణ్ణంపెట్టి పిడుగుపాటులా గుంటలోకి దూకేశాడు తిమ్మప్ప!

ఇప్పుడు తిమ్మప్ప అంటే ఒక సాహసానికి ప్రతీక! పులికి పులి! కోడెత్రాచుకు కోడెత్రాచు! తిమ్మప్ప అంటే ప్రాణాలకు తెగించిన ధీరుడు. ఒక సవాలుకు ప్రతిసవాలు! మూర్తీభవత్‌ ఆత్మవిశ్వాసం!

ఇక్కడ ప్రాంగణంలో తలకొక ఆలోచన, మనిషి కొకమాట. ‘శవాన్ని పైకి లాగాల్సిందే’ ‘శవం మిగిలితే కదా?’ ‘పెళ్లాంతాడుకి అసలు పురిలేదు పాపం’ ‘ఏ తల్లి కన్నబిడ్డో ఈ యేటి పోటీకి అర్పణం!’ ‘అయినా, రాజావారికి ఎవరిచ్చారో ఈ ఆలోచన. దారుణం?’ ‘చూస్తూ చూస్తూ నరబలి!’ ‘ఉండండహే`వాడు వరపుత్రుడేమో చూద్దాం’.

`ఎల్లవ్వ మోకాళ్లపైకి వంగి కూచుని, నెత్తీనోరూ కొట్టుకుంటోంది. మాటలు గుండెగొంతుకలో పూడుకుపోయాయి. మోయలేని దిగులు బరువు క్రుంగదీస్తున్నది. క్షణాలు.. కదులుతున్నై. నిమిషాలు… జారుతున్నై. గంట గడిచింది.

గుంటపైన` పైపైకి వ్రేళ్లు! అరచేయి ముంజేయి… మోచేయి… క్రమంగా దర్శనమిచ్చాయి. తిమ్మప్ప దేహయష్టి పైకి వచ్చి నేలమీద పడిరది. క్షతగాత్రుడు! జనం అలజడి, ఘోష, అభినందన ‘జయహో’ ‘భళీ, భళా’లు మిన్నంటాయి.

లిప్తకాలంలో రాజోద్యోగులు, వైద్యులు వచ్చి అతన్ని సేదదీర్చారు. బీరప్ప మీసం దువ్వుకుంటూ చకచకా వచ్చి కొడుక్కి దగ్గరై కూర్చుని చేతిని పట్టుకుని, ఆప్యాయపు చూపుల్లో మెప్పుని దట్టించాడు. ఎల్లవ్వ మూరలుబారలేసుకుంటూ వచ్చి, ఉద్విగ్నంగా బోరున ఏడుస్తూ భర్తమీద పడి, కొంగుతో అక్కడా ఇక్కడా అనకుండా ఒళ్లంతా అలముకున్న రక్తపు మరకల్ని తుడుస్తోంది. ఆమె ప్రేమాను రాగాల స్పర్శ అతనికి అమృత ప్రాయంగా ఉన్నది.

తిమ్మప్ప తేరుకున్నాడు. ఇప్పుడతను ఒక విజయ పతాక! ఒక సాహసఫలం!

రాయలవారు కళ్లు చికి లించారు. తిమ్మరుసు తన సైగతో కర్తవ్యాన్ని సూచిం చాడు. నలుగురైదుగురు అధికారులు కదిలి చేతుల్లో పూలమాలలతో తిమ్మప్ప దగ్గరికి వచ్చారు. అతని మెడలో మాలలు వేసి అతన్ని రాయలవారి సమ్ముఖానికి తోడ్కొని వెళ్లారు.

నమస్కారాలు అయినై.

రాయలవారి చిరు నవ్వుతో తిమ్మరుసు నిలబడి ‘‘నీ సాహసం అపూర్వం. చరిత్ర ప్రసిద్ధమవుతుంది. మా అభినందనలు, ఆశీ స్సులు’’ అన్నాడు. తిమ్మప్ప శిరసా, మనసా, వాచా నమస్కరించాడు. పక్కనుంచీ పణాలు, ముత్యాలహారాలు, పతకం ఉన్న వెండిపళ్లెం అందించారు పరిచారికలు.

పతకాన్ని తీసి తిమ్మప్ప మెడలో వేసి, ‘‘ఏం కావాలో అడుగు’’ అన్నాడు తిమ్మరుసు.

చేతులు మోడ్చి ఒకింత వంగి నిలబడి వున్నాడు తిమ్మప్ప. ‘‘ప్రభువులవారికి విన్నపం. నేను ఇంత సాహసం చేసింది ఈ వరంకోసమే ప్రభూ. మాది కురుమ కులం. మా కులాచారం ప్రకారం పెళ్ళి చేయాలంటే ఆడపిల్ల తల్లిదండ్రులు పెళ్లికొడుక్కి 101 వరహాలు, పెళ్లి సుంకంకింద ప్రభుత్వానికి 7 వరహాలు చెల్లించాల్సి వస్తోంది. ఇంత సొమ్ముని కూడబెట్టుకోలేక చాలామంది పేదలైన కురుమకులం ఆడపిల్లల పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. కనుక, ప్రభుత్వానికి చెల్లించే 7 వరహాలతో సమానంగా పెళ్లికొడుక్కి కూడా 7 వరహాలే చెల్లించేటట్లు అనుమతించి శాసనం ఇప్పించమని మనవి చేసుకుంటున్నాను ప్రభూ’’ అని మళ్లీ మళ్లీ దణ్ణాలు పెట్టుకున్నాడు.

రాయలవారు తిమ్మరుసు వైపు చూసి, చిరునవ్వునవ్వి తానే ప్రకటించాడు. ‘‘భేష్‌ గొప్పకోరిక. నీ స్వార్థానికి కాకుండా, నీ కులక్షేమానికీ, సంఘ శ్రేయస్సుకు ప్రయోజనకరమైన కోరికని కోరేవు. నీ కోరికని మన్నిస్తున్నాను. శాసనాన్ని ఇప్పిస్తాము. ఈ శాసనం సూర్యచంద్రులున్నంత వరకూ అమల్లో ఉంటుంది.

సభలోని పెద్దలంతా సంతోషంతో తల ఊపు లతో మెచ్చుకుంటే, సామాన్య జనమంతా కరతాళ ధ్వనులతో రాయలవారికి, తిమ్మప్పకూ జయజయ ధ్వానాలు చేశారు.

ఎల్లవ్వ పరుగుపరుగున వచ్చి తిమ్మప్పను ఆలింగనం చేసుకుంది. ఆమె కన్నీటి ముత్యాల్లో భర్త సంతృప్తి తొణికిసలాడిరది. బీరప్ప భారంగా నడుస్తూ వచ్చి ప్రభువుకు నమస్కరించి ‘‘వీడి తండ్రిని ప్రభూ’’ అని తెలుపుకున్నాడు.

ఇప్పుడు తిమ్మప్ప ఒక సామాజిక లక్ష్య సాధకుడు. ఒక సంస్కృతి అభ్యుదయ వర్థకుడు! ఒక జాతి ఆరాధనీయుడు! అయితే, ఈ సాహసం`అంతంకాదు, ఆరంభం మాత్రమే!

*       *       *

వసంతం వచ్చింది. ఇదీ నవరాత్రి సందర్భమే. విజయనగర సామ్రాజ్య మంతటా ఉత్సవ సంరంభం సాగుతున్నది.

ఇవాళ షష్ఠి. ఆరురోజుల క్రితమే రాజధానిలోని ఆశ్విక దళాధికారి నుంచీ పన్నెండువేల మంది రౌతుల్ని ఉద్దేశించి ప్రకటన వెలువడిరది. ఢల్లీి పాదుషా ఒక ఎత్తయిన, పొడవైన అలవికాని, పొగరుబోతు జవనాశ్వాన్ని విజయనగరానికి పంపాడు. దాన్ని ఎక్కడానికి రెండు మెట్లుగల జీనును అమర్చి గుఱ్ఱాన్ని అదుపుచేసి, స్వారీకి అనువుగా చేయించమని ఆయన సవాలు. ఇంతవరకూ ఏ ఆశ్వికుడూ ముందుకు రాలేదు. ఈ సాయంత్రం ఆ ప్రకటనని మళ్లీ ఆశ్వికసమూహానికి పంపించారు. రేపు చివరిరోజు.

రాత్రి గ్రామ చావడిలో పది గంటలు మ్రోగాయి. నడిమంచం మీద తిమ్మప్ప. కాళ్లకట్టన ఎల్లవ్వ. ఇద్దరికీ నిద్రరావటంలేదు.

‘‘ఆ నవరాత్రికి అట్టాభయపడి, ఏడ్చి వెనక్కి గుంజి గోలపెట్టావు కదే పిల్లా! ఈసారి పోటీకి పొమ్మని సలహా ఇస్తున్నావ్‌. నీకూ ధైర్యం, సాహసం ఎగదట్టుతున్నయ్యే’’ అని పరిహాసంగా నవ్వుతూ భార్య భుజంమీద అలతి స్పర్శనిచ్చాడు తిమ్మప్ప. బుంగమూతి పెట్టింది ఎల్లవ్వ. కళ్లల్లో రోషం మెరిసింది. ‘‘ఈ పోటీ వేడుక్కి కాదు, మన సామ్రాజ్యం పరువు ప్రతిష్టలకి సంబంధించింది. అందుకూ, నేనొప్పుకుంటున్నది’’ అన్నది.

‘‘అమ్మో… నీకూ దేశభక్తి పెరిగిందే’’ అని దగ్గరకు లాక్కున్నాడు తిమ్మప్ప.

ఇంట్లోనూ, బయటా “ ఆమనీ, వెన్నెలా పులకిస్తున్నాయి!

*       *       *

సప్తమి. మధ్యాహ్నం. రాజుగారి బహిరంగసభ!

పోటీ గుర్రాన్ని అలవోకగా స్వాధీనం చేసుకుని ఎక్కాడు తిమ్మప్ప. మెరుపువేగంతో ఉరికించాడు.

గంట గడిచింది.

యోజనం దూరం స్వారీ చేసి తిరిగి వచ్చాడు తిమ్మప్ప. జనసందోహంలో కోలాహలం. సంబరం.

రాయలవారి ప్రసన్నవదనంలో సంతృప్తి. ‘‘ఇప్పుడేం వరంకావాలి`తిమప్పా’’ అని ఆదరణతో అడిగేరు రాయలవారు.

‘‘ప్రభూ… ఇప్పుడు నా కులంలోని దురాచారాలు`వ్యభిచారం, అన్యాయంగా సంపాదించే ఆస్తిపాస్తులు, మాటద్వారా గానీ, చేతద్వారాగానీ చేసిన తప్పులు, పిల్లలులేని వారి బతుకు నికృష్టంగా కావటం`వంటి అవస్థల్ని రూపుమాసి పోయేటట్లు చేయండి ప్రభూ’’ అని చేతులు కట్టుకొని మ్రొక్కాడు.

రాయలవారు అతని సమాజహితమైన కోర్కెను మన్నించారు. ‘‘నిన్ను రాష్ట్రాధికారిగా నియమిస్తున్నాము. ప్రతి గ్రామంలోనూ ఆ దురాచారాల్ని రూపుమాపటంతో పాటు, పన్నులు వసూలు చేసుకోవటానికి కూడా వంశపారంపర్య హక్కుల్ని ఇప్పిస్తున్నాము. ఇందుకు అవసరమైన శాసనాన్ని ఇప్పిస్తాము. అనగానే నిండు సభలో జయహో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.

తిమ్మప్ప వినయంగా ప్రభువుకి నమస్కరించాడు.

ఇప్పుడు తిమ్మప్ప నిస్స్వార్థ త్యాగశీలి! ఇప్పుడు తిమ్మప్ప ప్రభుత్వాధికారి! ఒక బాధ్యతాయుతమైన కర్తవ్య నిర్వాహకుడు!

*       *       *

(తిమ్మప్ప సాహసాల క్రమవికాసం మరో శాసనానికీ ఎక్కింది. ఢల్లీి పాదుషా 120 మంది మల్లయోధుల్ని ఓడిరచమని పంపిస్తే, ఆ సవాలునీ స్వీకరించి విజయం సాధించిన ఘనుడు`తిమ్మప్ప. ఊహాతీతమైన విజయం ఇది. అంతేకాదు, తిమ్మప్ప నాలుగు పులుల్ని చంపిన యోధుడు. సాహసవీరుడు!!

రాబోయే తరాల క్షేమాన్ని ఆకాంక్షించిన పరోపకారి తిమ్మప్ప. చారిత్రాత్మకంగా మహావిజేత! స్ఫూర్తిప్రదాత!!)

About Author

By editor

Twitter
YOUTUBE