-డా॥ ఆరవల్లి జగన్నాథస్వామి

భగవంతుడు మనిషికి ఇచ్చిన విలువైన సంపద కాలం. దానిని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం? అన్నది మన ముందున్న ప్రశ్న. కాలం ప్రవాహం లాంటిది. ఎవరికోసం ఆగదు. ముందుకు సాగడమే కానీ వెనక్కి మళ్లదు. అది ఎవరిపైనా దయ చూపదు. సమదర్శి. తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాలపరీక్షకు తట్టుకున్నవారు విజేతలుగా నిలుస్తారు. కాలపురుషుడు అమిత ప్రభావశీలి. తన ప్రభావంతో రాజు కింకరుడు, సేవకుడు ప్రభువు కావచ్చు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు సామెత నిజం కావచ్చు. ఒక ఆలోచన (ఐడియా) జీవితాన్ని మారుస్తుంది అన్నది ఆధునిక వ్యాపార నినాదం. ఒక క్షణం బతుకులను తారుమారు చేస్తుందన్నది నిత్యసత్యం.

తనను ఎలా వినియోగించుకోవాలో కాలం నిర్దేశిస్తుంది. ‘శైవవేభ్యస్తు విద్యానాం యౌవనే విషjైుషిణాం/వార్థక్యే మునివృత్తీనాం యోగానంతే తనుత్యజాం’ బాల్యంలో చదువు, యౌవనంలో సంసారిక సుఖం, వార్ధక్యంలో సర్వసంగపరిత్యాగం, అంత్యకాలంలో విరాగిjైు శరీర త్యాగంచేయాలని భావం. (ఆధునిక కాలంలో వానప్రస్థం లేనందున ఆత్మ సంతృప్తితో ఇష్టమైన వ్యాపకంతో ప్రశాంతంగా గడపాలంటారు). దీనినే ‘ఏ వయసుకు తగ్గ ముచ్చట’ అనే నానుడికి అన్వయించుకోవచ్చు. అందుకు భిన్నంగా బాల్యంలో చదువును పక్కనపెట్టి ఆట పాటలతో కాలం గడిపేవారిని యౌవనం రాకాసిలా భయపెడుతుందట. వద్దనుకున్నా వార్ధక్యం ముంచుకువస్తుంది. కనుక కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలంటారు.

‘వేదశాస్త్ర పురాణేన కాలోగచ్ఛతి ధీమతాం/వ్యసనేన చ మూర్ణాణాం నిద్రయా కలహేన చ’ బుద్ధి మంతుల సమయం వేదశాస్త్ర పురాణ ప్రసంగాలతో గడుస్తుందని, మూర్ఖుల కాలం దురలవాట్లు, కలహాలు, నిద్రలో దొర్లిపోతుందని సుభాషితం. దీనికి సమాంతరంగా ‘జీవితమున సగ భాగం నిద్దురకే సరిపోవు/ మిగిలిన ఆ సగ భాగం చిత్తశుద్ధి లేకపోవు’ అన్నారు ఒక సినీకవి. ఇది అందరి విషయంలో కాకపోయినా కొందరికౖెెనా వర్తించకమానదు. నిద్ర, అనారోగ్యం లాంటి వాటికి పోను మిగిలే కాలాన్ని వినియోగించుకోవడంలోనూ అవరోధాలు ఎదుర వుతున్నాయి. అందుకు పరిస్థితులు కొంత కారణమైతే, స్వయంగా విధించుకునే పరిమితులు, నిబంధనలు మరికొంత కారణంగా చెబుతారు. అతి నమ్మకాలు కూడా అందులో భాగంగా వ్యక్తిత్వవికాస నిపుణులు చెబుతారు. నమ్మకాలు వ్యక్తిగతం. అయినా పరిమితంగా ఉండాలి తప్ప ప్రతి పనిని వాటితో ముడిపెడితే ముందుకు సాగడం కష్టం. మంచిచెడులు మనిషి మనస్తత్వానికి సంబంధించినవే కాని కాల సంబంధితాలు కావని, ఆధ్యాత్మికతకు, అతి విశ్వాసాలకు సంబంధం లేదని కూడా అంటారు. మంచిచెడుల ఘడియలు అంటూ నిరీక్షించడం వల్ల విలువైన సమయం వృథా అవుతున్న తీరును పరిగణనలోకి తీసుకోవాలంటారు.

సమయపాలనే సంపద

సమయపాలనతోనే సంపద సృష్టించవచ్చని పెద్దలు చెబుతారు. ఇక్కడ సంపద అంటే కేవలం ఆర్థికమనే భావనే కాదని, మానవ జీవన వికా సానికి ఉపకరించేదంతా సంపదగానే భావించాలని అంటారు. ప్రకృతి కాలానుగుణంగానే నడుస్తుంది. రుతువులు తమ ధర్మాలను నిర్వర్తిస్తాయి. మనిషి మాత్రమే దానిని అంతగా పట్టించుకోడు. కాల హరణం వల్ల వ్యక్తికే కాదు వ్యవస్థకే ముప్పు. నిర్ణయాలు తీసుకోవడంలో తాత్సారం, తీసుకున్న వాటిని సకాలంలో అమలు చేయలేకపోవడం, నిర్ణీత గడువులోగా పూర్తి కావలసిన పనులలో జాప్యం, వాయిదాలు వంటివి కొన్ని తరాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పనులలో జాప్యమే కాకుండా వ్యయ ప్రయాసలు అనివార్యమవుతాయి. అనుకున్న పనులను వెంటనే చేయాలి. రేపటి పనిని ఈ రోజు… నేటి పనిని ఇప్పుడే చేయాలని పెద్దలు చెప్పిన మాటలలో అలసత్వం కూడదనే సందేశాన్ని గ్రహించాలి.

‘నందత్యుదిత ఆదిత్యే నందంత్యస్తమితే రవౌ!/ఆత్మనో నావబుధ్యంతే మనుష్యా జీవితక్షయమ్‌!’ సూర్యోదయస్తమయాలను లెక్కించే వారు ఆ రెండిటి మధ్య సాధించదగిన వాటిని పొందలేకపోతున్నారని, జీవితకాలం కరిగిపోతుందని శ్రీరామచంద్రుడు సోదరుడు భరతుడికి కర్తవ్యోపదేశం చేశారు. వేసవిలో సూర్యకిరణాల ప్రభావంతో సరస్సులోని నీరు ఆవిరైపోతున్నట్లు రోజులు గడిచే కొద్దీ ఆయుర్దాయం తరిగిపోతూనే ఉంటుందని కూడా హితవు చెప్పారు. కాలసంద్రంలో యుగాలకు యుగాలే నీటి బిందువుల మాదిరిగా ఆవిరవుతుంటే మనిషి నూరేళ్ల పరిమాణమనగా ఎంత?

మనిషిని నీడలా వెంటాడేది మృత్యువు మాత్రమే. కూర్చున్నా, నడిచినా, నిద్రించినా, పయనించినా వెంటే ఉంటుంది. దాని బారిన పడకముందే అనుకున్న పనులు పూర్తి చేయాలంటారు విజ్ఞులు. ‘కృష్ణ!త్వదీయ పద పంకజ పంజరాంత/మద్యైవ మే విశతు మానస రాజహంస:/ప్రాణప్రయాణ సమయే కఫవాతపిత్తై:/కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే’ (మరణ సమయం ఆసన్నమైనప్పుడు కఠం కఫ వాతపిత్తా దులతో రుద్ధమైపోయి నీ నామస్మరణకు అంతరాయం కలుగవచ్చు కనుక రాజహంస అనే నా మనసును నీ పాద పద్మములనే పంజరంలోకి ప్రవేశించే భాగ్యం కలుగచేయి) అని వేడుకున్నారు పన్నెండు మంది ఆళ్వారులలో ఒకరు శ్రీ కులశేఖరులు.

ముఖ్యంగా విద్యార్థులు సమయ సద్వినియోగం పట్ల శ్రద్ధపెట్టాలి. అందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. కానిపక్షంలో సువర్ణావకాశాలను చేజార్చుకునే ఆస్కారం ఉంది. విద్యార్థులు ఎప్పటి కప్పుడు పాఠాలు పూర్తి చేయగలిగితే పరీక్షల వేళ ఆందోళనకు అవకాశం ఉండదు. పరిశోధక విద్యార్థులు నిర్దేశిత, నిర్ణీత సమయంలో తమ కార్యాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఫలితాలు తారుమారు కావచ్చు. కాలం కలసి వచ్చినప్పుడు అందిపుచ్చుకోవడం విజ్ఞుల లక్షణమని, ఇతరేతర కారణాలతో జాప్యం చేస్తే భవిష్యత్‌ శూన్యమవుతుందన్నది అనుభవజ్ఞుల మాట. సమయానికి స్పందించకుండా ‘గత జల సేతు బంధనం’ లా ‘అలా చేసి ఉంటే బాగుండేది…’ అనుకోవడం వృథా ప్రయాస అని చెబుతారు. ‘నిదానమే ప్రధానం’ అనేది అన్ని వేళలా అన్వయిం చదు. కొన్ని సందర్భాలలో ‘ఆలస్యం అమృతం విషం..’ అనే సూక్తీ వర్తిస్తుంది. కాలం చక్రమే కాదు, నిచ్చెన కూడా. ఒకవైపు కరిగిపోతునే, మనిషికి ఎన్నో సదవకాశాలను ప్రసాదిస్తోంది. వాటిని ‘నిచ్చెన’లా భావించి సద్వినియోగం చేసుకోవాలి. అలా విజయాలు సాధిస్తున్నవారూ గణనీయంగానే ఉన్నారు.

ఆ క్షణమే విలువైంది..

అనంతమైన కాలవాహినిలో ఒక్క క్షణం లెక్కలోకి రాకపోవచ్చు కానీ ఆ ఒక్క క్షణమే అనేక పరిణామాలకు కారణం కావచ్చు. ఆ ఒక్క క్షణంలోనే మనసు మారవచ్చు. ప్రచారంలో ఉన్న పురాణగాథను గుర్తుచేసుకోవడం సందర్భోచితమనిపిస్తుంది. ఒకరోజు కర్ణుడు స్నానం చేసే వేళ వెళ్లిన శ్రీకృష్ణుడికి అక్కడి బంగారు పాత్ర నచ్చిందట. అది గ్రహించిన కర్ణుడు తన ఎడమ చేతిలోని దానిని పరమాత్మకు అంద చేస్తుండగా స్వీకరణకు ఆయన తటపటా యించారట. దక్షిణ హస్తంతో బహూకరించవలసి ఉండగా వామ హస్తంతోనా? అని శ్రీకృష్ణుడి సందేహం. అదే వెల్లడిరచాడు. ‘మహానుభావా! నీ సందేహం నిజమే కానీ ఎడమ చేతిలోని పాత్రను కుడిచేతిలోకి తీసుకుని నీకు అందించేలోగా నా మనసు మారవచ్చు. లేదా నేనే ఉండకపోనూవచ్చు’ అని బదులిచ్చాడట కర్ణుడు. ఇక్కడ కాలం విలువతో పాటు జీవితం నీటిబుడగ అనే తాత్త్వికత బోధ పడుతుంది.

కాలగమనంలో అనేక మార్పులు. ఎన్నో యుగాలు గడచిపోయాయి. ఎన్నో రాజ్యాలు, వైభవాలు, ఎందరెందరో ఘనచరితులు కాలగర్భంలో కలసిపోయారు. కాలం తాత్కాలిక విషాదం నుంచి ఉపశమనం కలిగిస్తూనే ఉంది. నేటి పెను విషాదాన్ని రేపటి జ్ఞాపకంగా మిగులుస్తోంది. ‘కాలం ఎంతటి గాయాన్నయినా మాన్పుతుంది’ అనే నానుడి ఇలానే పుట్టి ఉంటుంది.

సమత్వం

తలపెట్టిన కార్యాలకు సమయం సరిపోవడం లేదని కొందరు భావిస్తే, కాలాన్ని గడపడం కష్టంగా ఉందని మరికొందరంటారు. కాలక్షేపం కోసం ఆరాటపడుతుంటారు. ఆనందం కలిగినప్పుడు సంవత్సరాలు క్షణాల్లా దొర్లిపోతే, బాధల్లో క్షణాలు యుగాలుగా అనిపిస్తాయి. కానీ, కాలచక్రం ఒకే రీతిలో ఉంటుందని, ఆయా ఆనంద విషాద సమయాలు, మనోభావాలు మారుతుంటాయని, రెండు సందర్భాలలోని సమయాన్ని ఏకరీతిని పరిగణించ గలగడమే సమత్వం అని చెబుతారు. ‘కావ్యశాస్త్ర వినోదేనా కాలో గచ్ఛతి ధీమతామ్‌’ అన్న సూక్తిని అనుసరించి ధీమంతులు తమ విలువైన సమయాన్ని కావ్యశాస్త్ర అధ్యయనాలకు, రచనలకు వినియోగిస్తారు. ఉదాహరణకు, స్వరాజ్య ఉద్యమం, ఇతర ఉద్యమాల సమయంలో చెరసాలపాలైన అనేక ప్రముఖులు అక్కడే గ్రంథ, కావ్య రచన చేయడం, అవి జగద్విఖ్యాతి పొందడం తెలిసిందే. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని కాలంలోనే, పిన్నవయసులోనే ఆదిశంకరులు, అలెగ్జాండర్‌, స్వామి వివేకానంద వంటి మహనీయులు అనితర సాధ్యమైన విజయాలు సాధించారంటే కాలంతో పోటీి పడడాన్నే కారణంగా చెప్పుకోవచ్చు. మన సమయం సద్వినియోగ, దుర్వినియోగాలు మన చేతుల్లోనే ఉంటాయనేవారు సంగీత విద్వాంసులు శ్రీపాద పినాకపాణి. ‘ఏ పని చేయడానికైనా సమయం సరిపోవడం లేదని చాలా మంది చెప్పడాన్ని నేను అంగీకరించను. భగవంతుడు అందరికి రోజుకు 24 గంటలే ఇచ్చాడు. దానిని సద్వినియోగం చేసుకోవడంపైనే వారి విజ్ఞత ఆధారపడి ఉంటుంది. ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తే కాలం మన అధీనంలోనే ఉంటుంది. నిత్యజీవనం గడపడంతోపాటు ఇష్టమైన రంగంలోనూ వ్యాసంగం కొనసాగించవచ్చు. అలా చేయబట్టే ఎందరో మహనీయులు అనేక రంగాలలో ఉన్నతి సాధించారు’ అనేవారు.

సమయ సద్వినియోగంపై ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి చెప్పిన ఉదాహరణ ప్రస్తావనార్హం. ఒక ఆధ్యాత్మికవేత్తను కారులో తీసుకువెళుతున్న వాణిజ్యవేత్త ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద వాహనం నిలిపి ‘నగరంలోని ట్రాఫిక్‌ సిగ్నళ్ల వల్ల సమయం వృథా అవుతోంది’ అన్నారట. ముంబైలో తమ ఇంటి దగ్గర నుంచి ఆధ్యాత్మిక కేంద్రం వెళ్లే మార్గంలో ఇంతకంటే ఎక్కువ సిగ్నల్‌ లైట్లు ఉన్నాయని, అయినా సమయం వృథా కాదని బదులిచ్చారట ఆ ఆధ్యాత్మికవేత్త. ఆశ్చర్యపోతున్న వాణిజ్యవేత్తతో ‘ఔను! అనారోగ్యంతో బాధపడే అనేకులు కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తాను. నా జాబితాలోని వారి కోసం ట్రాఫిక్‌ లైట్ల వల్ల నిత్యం ఇలా ప్రార్థనలు చేయగలుగుతున్నాను’ అని వివరించారట. ఇక్కడ సమయం సద్వినియోగంతో పాటు మానవీయత కూడా వెల్లడవుతోంది.

విలువలేని క్షణమంటూ ఒకటైనా ఉండదు. మనిషికి సమయపాలన అత్యంత అవసరం. సమయ పాలనతోనే వారి వారి ఉన్నతి తెలుస్తుంది. మనిషికి కాలం విలువా తెలియనిది కాదు. అయినా దానికి తగినంత ప్రాధాన్యం ఇవ్వలేకపోతున్నారు అంటారు విజ్ఞులు. యుగ ఆవిర్భావ అంతాల గురించి ఆలోచించడం కంటే ప్రతి క్షణాన్ని సార్థకం చేసు కుంటూ, ఆనందంగా జీవించడమే కాలపురుషుడికి అర్పించే నీరాజనం.

వ్యాసకర్త: సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE