Rahul Gandhi, Sonia Gandhi, Mamata Banerjee, M.K. Stalin, Uddhav Thackeray, Sharad Pawar

సంపాదకీయం

శాలివాహన 1943 శ్రీ ప్లవ మార్గశిర శుద్ధ దశమి – 13 డిసెంబర్‌ 2021, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


‌‘ఇంకెక్కడి యూపీఏ? ఇప్పుడెక్కడుంది?’ మమతా బెనర్జీ ఈ డిసెంబర్‌ ఆరంభంలో ఇలా కుండబద్దలు కొట్టారు. దాదాపు పదిహేడేళ్లు సాగిన ఒక రాజకీయ ప్రహసనానికి ఎప్పుడో తెర పడిన సంగతిని టీఎంసీ నాయకురాలు ఇలా వీలు చూసుకుని, తాపీగానే అయినా జాతి ఎదుట ప్రకటించారు. ఆమె ముంబైలో నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకుడు శరద్‌ ‌పవార్‌తో మంతనాలు జరిపి ఆపై ఈ ప్రకటన చేయడమూ ఒక తమాషాయే. ఎందుకంటే పవార్‌ ‌ప్రస్తుతం మహారాష్ట్రలో అధికార శివసేన పార్టీని మోస్తున్నది కాంగ్రెస్‌ ‌పార్టీతో కలసే. అప్రియసత్యాలని అంగీకరించడానికి మనసొప్పదు. ఇక కాంగ్రెస్‌ ‌వంటి నిష్క్రియాపరుల శిబిరం అసలే ఒప్పుకోదు.

మెరుపు లేని పిడుగులా ఢిల్లీ రాజకీయాల మీద పడిందే యునైటెడ్‌ ‌పోగ్రెసివ్‌ అలయెన్స్ (‌యూపీఏ). 2004లో అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ, ప్రభుత్వ స్థాపనకు అవసరమైనన్ని స్థానాలను బీజేపీ సాధించలేకపోయింది. అప్పుడే వామపక్షాల చొరవతో యూపీఏ హఠాత్తుగా పుట్టుకొచ్చింది. 145 స్థానాలు ఉన్న కాంగ్రెస్‌కు కిరీటం పెట్టారు. 2009లో కూడా అధికారంలోకి వచ్చి రెండు పర్యాయాలు ఏలింది. ఆనాడు యూపీఏలో ఉన్న పార్టీలు ఇవాళ లేవు. ఇవాళ అంటకాగుతున్న పార్టీలు కొన్ని ఆనాడు యూపీఏని దూరంగా పెట్టినమాటా నిజం. బొంబాయి పేలుళ్లు, యూపీఏ-2 హయాంలో అక్రమాలు ఇప్పటికీ దేశం మరచిపోలేదు. నాడు తెర వెనక ఉన్న రాహుల్‌ ‌గాంధీ ఇప్పుడు తెర వెనుక లేరు. అలా అని తెర ముందు ఉన్నారని కూడా అనుకోనవసరం లేదు. అదీ పరిస్థితి. ప్రధానమంత్రి ప్రాముఖ్యాన్ని పాతాళానికి విసిరేయడం యూపీఏ సాధించిన ఘనకార్యాలలో మొదటిది. ఈ దేశం చచ్చినట్టు కాంగ్రెస్‌ను అధికారంలోకి పంపవలసిందేనన్న ధోరణి 1952 నుంచి వస్తున్నదే. 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 6 చోట్లే యూపీఏ రాజ్యమేలుతోంది. కొడిగట్టిన యూపీఏ దీపం కొండెక్కుతోందనే మమత ప్రకటించారు. కాంగ్రెస్‌ ‌మీద కూడా అలాంటి ప్రకటన రావడమనే లాంఛనం మిగిలి ఉంది. అది వేరే విషయం.

ప్రాంతీయ పార్టీలు ఏకమైతే జాతీయ పార్టీ బీజేపీని అధికారంలో నుంచి అలవోకగా దింపవచ్చునని టీఎంసీ నాయకురాలు మమతా బెనర్జీకి దివ్యమైన ఆలోచన వచ్చింది.‘బీజేపీని తొలగిద్దాం, దేశాన్ని రక్షిద్దాం’ అన్న నినాదంతో ఆమె పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నారు. దేశం నిండా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రాంతీయ సేనలకి తానే సేనాపతి అయి మేరునగంలా ఉన్న కమలాన్ని కూల్చాలని ఆమె చిరుకోరిక. ఇందులో ప్రజాస్వామ్యయుతమైన చింతన లేదు. ప్రజాభిప్రాయం కోణం అసలే లేదు. ప్రజాస్వామ్యం పట్ల అసలు ఆమెకు ఉన్న గౌరవం ఏపాటిది? తన రాష్ట్రంలో సవాలు విసురుతున్న బీజేపీని బలహీనపరచడానికి ఆమె పన్నుతున్న పథకం- దేశం మొత్తం మీద ఆ పార్టీని ప్రాంతీయ పార్టీల అండతో బలహీన పరచడమే. ఇక్కడ వచ్చే ధర్మసందేహం ఎవరు తీరుస్తారన్నదే ఇప్పుడు ఇంకా పెద్ద సందేహం.

తీసుకున్న నినాదమేమో, బీజేపీని నిరోధించడం. అది మేం లేకుండానే అయిపోతుందా అని నిలదీస్తోంది శతాధిక వర్షాల కాంగ్రెస్‌. అసలు మమతా బెనర్జీకి కాంగ్రెస్‌ను చిత్తు చేయాలన్న కుట్ర బుద్ధి ముందునుంచి ఉన్నదేనని అంటున్నారు లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌ ‌రంజన్‌ ‌చౌధురి. బెంగాల్‌లో ఆమె గెలుపు బండారం ఇప్పుడిప్పుడే బయటపడడం లేదూ! అంటూ ఒక దేవరహస్యం ఆచూకీ ఇచ్చారు కూడా. యూపీఏ ప్రభుత్వంలో ఆరు మంత్రి పదవులు అనుభవించి కూడా ఇప్పుడు ఇలా తమకి మొండిచేయి చూపిస్తుంటే రంజన్‌దాకు దుఃఖం ఆగడం లేదు. కాంగ్రెస్‌ ‌లేకుండా బీజేపీని ఓడించడం మమత తరం కాదని శివసేన ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ‌ఠాక్రే కూడా కొత్త మిత్రుడి పట్ల విధేయత చాటారు. కాంగ్రెస్‌ ‌లేని విపక్ష కూటమి ఆత్మలేని దేహం అంటూ తాత్త్వికతను చాటారు కపిల్‌ ‌సిబల్‌. ‌కానీ, ఎక్కడైనా బావగాని, వంగదేశపు ఎన్నికల వంగతోట కాడ మాత్రం కాదు అన్నట్టే ఉంటుంది మమత వ్యవహారం. ఎన్నికల వేళ బీజేపీనీ, కాంగ్రెస్‌నీ, పనిలో పనిగా కమ్యూనిస్టులనీ కూడా సమానమైన శత్రువుల్లా చూడడం ఆమె అలవాటు. కానీ ఇటీవలి వరకు కూడా మమత ఢిల్లీ వస్తే సోనియా దర్శనం చేసుకోకుండా వెళ్లేవారే కాదు. అయినా అదేమిటో, మమతతో పాటు, చాలా ప్రాంతీయ పార్టీలకి కాంగ్రెస్‌ ‌వరకు ఢిల్లీలో వియ్యం, స్వరాష్ట్రాలలో కయ్యం అన్న విధానమే మహా ఇష్టం. మా బెంగాల్‌లో కాంగ్రెస్‌ ‌పోటీ చేయవచ్చు కాని, నేను గోవాలో పోటీ చేయకూడదా? అని అద్భుతమైన తర్కాన్ని ముందుకు తెస్తున్నారు మమత. మరోపక్క, గోవాలో మా అవకాశాలు తగ్గించడం మమతా దీదీకి భావ్యం కాదు అన్నట్టు దీనవదనులై మాట్లాడుతున్నారు ఆప్‌ ‌నేత అరవింద్‌ ‌కేజ్రీవాల్‌. ‌యూపీఏ మరణించినట్టే అంటూ ముంబైలో మమత ప్రకటించిన తరువాత, కేజ్రీవాల్‌ ఒక టీవీ చానల్‌లో మాట్లాడుతూ, మమతా బెనర్జీకి గోవాలో ఓట్లేమీ రాలవు అని జోస్యం చెప్పారు. ఇది ప్రాంతీయ పార్టీల కొత్త జాతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు తీరు.

నేషనల్‌ ‌ఫ్రంట్‌, ‌యూపీఏ దేశాన్ని ఒక దారుణమైన సామాజిక, రాజకీయ సంక్షోభంలోకి నెట్టి చేతులు దులుపుకుని పోయాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి ప్రయత్నం మమత అనే స్థానిక నియంత ఆధ్వర్యంలో ఆరంభమవుతున్నాయి. బీజేడీ వంటి ఒకటి రెండు ప్రాంతీయ పార్టీలు తప్ప అకాలీదళ్‌, ‌ద్రవిడ పార్టీలు, టీఎంసీ, శివసేన, ఆప్‌, ‌టీఆర్‌ఎస్‌, ‌టీడీపీ, ఎస్‌పీ, బీఎస్‌పీ, ఆర్‌జేడీ- ఏ ప్రాంతీయ దుకాణమైనా కావచ్చు, దారుణమైన గతాన్ని మూటగట్టుకున్నదే. ఫెడరల్‌ ‌విధానానికీ, ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించినదే. ఇవి జాతీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మిస్తామంటే నమ్మాలా? కాబట్టి మరోసారి దేశాన్ని దగా చేయడానికి మొదలైన యత్నాలపట్ల అప్రమత్తంగా ఉండాలి.

About Author

By editor

Twitter
YOUTUBE