– డా॥ చింతకింది శ్రీనివాసరావు

జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన

‘‘ఏమ్మా! ఆరోగ్యం ఎలా ఉంది. న్యాయ విభాగానికి చేరే ముందువరకూ బాగానే ఉన్నావు. అక్కడ తారసిల్లిన ఏదైనా అంశం నిన్ను బాధిం చిందా?’’ ప్రేమాస్పదమైన స్వరంతో రాచగన్నియ పక్కకు చేరి, ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుని నోరారా అడిగింది. ఒక్కసారిగా అత్తమ్మ కరస్పర్శ అనుభవంలోకి రాగానే గన్నియకు మాకలిశక్తి జ్ఞాపకానికి వచ్చింది. అమ్మ తలపు తాకగానే ఆమె కళ్లు చెమర్చాయి. మరులిప్తలోనే పూర్ణిమాదేవి చేతుల్లో ఒరిగిపోయింది. మాతృప్రేమ కోసం అర్రులుచాచే బిడ్డలా అత్తగారికి మరింతగా దగ్గరయింది.

ఇదే సరైన సమయమని తలచింది పూర్ణిమ. అరణపు దాసిగా నందపురం నుంచి గన్నియతోపాటే వడ్డాది వచ్చిన సేవిక చిత్తజాణ ఆ సమయాన అక్కడ లేదు. అందుకనే కొద్దిపాటి చొరవ తీసుకుంది. గన్నియ తలనిమురుతూ,

‘‘చెప్పు. నీకొచ్చిన కష్టం చెప్పు. అత్తగారిగా అడగడం లేదు. తోటి స్త్రీగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. భయపడకు. బెంగపడకు.’’ ప్రియ వచనాలను ప్రసరింపజేసింది. గన్నియ తేరుకుంది. సాటి మహిళగా అత్తమ్మ అడుగుతోంది కాబట్టి మనసులో మాట చెప్పేందుకు సాహసించింది.

‘‘అత్తయ్యా! దేవిడీలోకి అడుగుపెట్టి అర్థ సంవత్సరం అవుతున్నా ఇక్కడి భోగట్టాలేవీ అంతుపట్టడం లేదు. ఇదేం రాజ్యమో బోధపడటం లేదు. అంతా కొరుకుడుపడని పంచాగంలా ఉంది.’’ టకటకా చెప్పేసింది. గతుక్కుమంది పూర్ణిమ. కోడలి మనసులోతుల్లో చాలా సందేహాలే ఉన్నట్టుగా తేలడంతో సమస్య పరిష్కారానికి నడుం బిగించింది.

‘‘నేనూ నీలాగే ఒకనాడు ఈ రాచనగరికి కోడలిగా వచ్చినదాన్ని. కొత్తలో ఎవరికైనా అలాగే ఉంటుంది. రానురానూ అన్నీ సర్దుకుంటాయి.’’ గన్నియ హస్తాలకు పట్టిన చిరుచెమటలను చీరకొంగుతో తుడుస్తూ నిమ్మళంగా పలికింది. అయినప్పటికీ గన్నియలో పెద్దగా మార్పులేదు. తన సమస్య అది కాదని, తన హృదయం దుఃఖసంకులం కావడానికి కారణం అదంతా కానేకాదని అత్తమ్మకు ఆమె చెప్పదలచింది. ఎందుకనో తటపటాయించింది. ఈ లజ్జుగుజ్జులను పూర్ణిమాదేవి గ్రహించి,

‘‘నా మాటలు నీకు సాంత్వన చేకూర్చడం లేదు కదూ?’’ తల నేలకు పడేసుకుని నిలుచున్న కోడలి ముఖాన్ని తన చేత్తో పట్టి పైకి తీస్తూ మృదువుగా పలికింది. గన్నియను అక్కడే ఉన్న ఆసనానికి చేర్చింది. తనూ ఆ పక్కనే కూర్చుంది. రాచకోడలికి కొంచెం ఉపశమనం దొరికింది. గళం విప్పింది.

‘‘అత్తమ్మా! వడ్డాది ఆచారవ్యవహారాలేవీ నచ్చడం లేదు. వీటి గురించి ఎంతో చెప్పవలసి ఉంది. కానీ, అంతటి శక్తి నాకిప్పుడు లేదు. కొన్ని మటుకు ఉటంకిస్తాను. ఇంతక్రితమే న్యాయపాలక భవనంలో మనముందుకు వచ్చిన తగవు ఏమిటి? భూమి భాగోతమే కదా! అసలు నేలను అమ్ముకోవడం ఏంటి? అది మనం సృష్టించింది కాదే! భగవంతుడు ఇచ్చిందే. దాన్ని ఒకరికి ఒకరు పత్రాలు రాసి ఇచ్చుకోవడం న్యాయమా? దీనికి మళ్లీ గొడవలు పడటం ఏంటి? మా దేశంలో ఎప్పుడూ ఇలాంటివి మేం చూడలేదే.’’ ఆవేశం కట్టలు తెంచుకోగా ఘంటిక మోగినట్టుగా మోగింది.

అప్పటికిగానీ, గన్నియ గుండెల చప్పుడేమిటో రాజమాతకు పూర్తిగా అవగతం కాలేదు. ఆ గుండియలు పలురకాల సందియాలతో సతమతమవు తున్నాయనీ తెలియరాలేదు. ఉడుకుతున్న కోడలి మానసం కలవరపెట్టకపోలేదు. అందుకే ఆ సందర్భాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగదీయకూడదని గట్టిగానే అనుకుంది. అదే తడవుగా,

‘‘గన్నియా! మనసును కష్టపెట్టుకోకు. పొంగి పొరలుతున్న నీ భావాలన్నీ తెలుసుకోగలుగుతున్నాను. ఇవి మనిద్దరం మాట్లాడుకుంటే తెగేవి కావు. పైగా నీవు నెలతప్పిన పిల్లవు. అందుకే సాయం సంధ్యవేళ సమాలోచనమందిరానికి రా. అక్కడికి ప్రణవశర్మను రప్పిస్తాను. నీ భర్త దేవేంద్రులవారూ వస్తారు. నేనూ ఉంటాను. మాట్లాడుకుందాం. అంతవరకూ స్థిమితపడు. నే వెళుతున్నాను.’’ అక్కడ ఒక్క క్షణం ఉన్నా కోడలు మరింతగా హృదయాన్ని దగ్ధం చేసుకుంటుందని, దరిమిలా శరీరానికి ఏ సమస్యయినా తెచ్చుకుంటుందని భావించి మందిరాన్ని చకచకా వీడివెళ్లిపోయింది రాజమాత. ఆమె వెళ్లేదారినే పట్టిపట్టి చూస్తూ ఉండిపోయింది గన్నియ.

*       *       *

సాయంవేళ రానేవచ్చింది. సమాలోచన మందిరానికి తరలిపోవలసిన తరుణం ఆసన్నమైందని తలపోసింది గన్నియ. అప్పటికే నందపురం నెచ్చెలి చిత్తజాణ అమ్మగారి ప్రయాణాన్ని పసిగట్టి ఉన్నందువల్ల తగిన ఏర్పాట్లు చేస్తోంది.

చిత్తజాణ పేరుకు తగ్గ జాణ. గన్నియ మనసును ఇట్టే కనిపెట్టి నడుచుకోగల సేవాపరాయణి. ఒకలా చెప్పాలంటే, వడ్డాది రాచరికాన్ని మహారాణీ హోదాలో రాచగన్నియ ఇముడ్చుకోలేకపోతోందన్న విషయం తెలుసుకున్న పిల్ల. ఈ పరిస్థితుల్లో రాణీకి తనే పెద్దదిక్కుగా నిలవాలనీ సంకల్పం చెప్పుకుని ఉంది. అచ్చం అలానే నిలుస్తోంది కూడా.

జాణ లేనినాడు తన మనుగడ ఎంతగా వడ్డాది దివాణంలో దిగనాసిల్లేదోనని ఇప్పటికి కనీసం వెయ్యిమార్లయినా అనుకుని ఉంటుంది గన్నియ.

‘‘నే వెళుతున్నది సమాలోచన కోసం. పెళ్లి చూపులకేం కాదు. హెచ్చుగా శ్రమపడకే.’’ తనను అద్దం ముందు కూర్చోబెట్టి రూపాన్ని చక్కదిద్దబోయిన జాణతో నిర్మోహంగా పలికింది వడ్డాది పట్టమహిషి.

‘‘సమాలోచనకయినా చక్కగానే వెళ్లాలి కాదూ! రాజావారు వేంచేసే చోటు ఏదయినా అక్కడికి మీరు రాణీగానే చేరవలసి ఉంటుంది.’’ యజమానురాలి మీదికి ఠక్కున జవాబు విసిరింది జాణ.

‘‘సరేలే. మీ ప్రభువులవారికి సతీమణి అంటే అలంకార ప్రాయం. సమయానికి అక్కరకు వచ్చే పదార్థం. ఇది యదార్థం.’’ రవ్వలహారాన్ని తప్ప దన్నట్టుగా మెడకు ధరిస్తూ మాటలు జారవిడిచింది గన్నియ.

‘‘ఏ మగాడయినా అంతేనమ్మా. పెళ్లాం తన చేతిలో బొమ్మ అనుకోవడం అతని రివాజు. తన బొమ్మ చేతిలో తనే కీలుబొమ్మ కావడం అతని మోజు.’’ ఇలా కిలకిలమన్న సేవికను వారిస్తూ,

‘‘అసలు ఎవరయినా ఎవర్నయినా ఎందుకు కీలుబొమ్మగా చేసుకుని ఆడిరచాలే! స్నేహబంధంతో పెనవేసుకోవడం తప్పనిచ్చి మరో ప్రకృతి భార్యాభర్తల మధ్య ఎందుకుండాలి? నువ్విలా దాసీత్వం చేయడమే నాకు నచ్చదు. అరణంగా ఒక మనిషి కోసం మరో మనిషి జీవితాన్ని వెచ్చించడం దారుణం.’’ గన్నియ చిరచిరలాడిరది.

‘‘ఆహా. బాగుందే. పోనీ అని చెప్పినందుకు నా కొలువుకే ఎసరు పెడుతున్నారు. సరే లెండి. ఈ సుగంధ ద్రవ్యం కొంచెం పూసుకోండి.’’ అంటూనే గన్నియ చేతికి ఒకానొక భరిణెను మూత తీసి అందించింది జాణ. ఒక్కసారిగా మందిరమంతా సువాసనా భరితమైంది. తటాలున విద్యుల్లత ఏదో ఒంట్లో పాకినట్టుగా వజవజా వణికింది మహారాణి. అందుకున్న భరిణెను చప్పున జాణకు తిరిగి ఇచ్చేసింది. అలా ఇస్తూనే,

‘‘ఇది పునుగు కదూ!’’ నిర్లిప్తంగా ప్రశ్నించింది. అంతలోనే రాణీవారు అంతటి బేలగా ఎందుకు మారవలసివచ్చిందో అర్థం కాలేదు జాణకి. అయినా యజమానురాలిని మెప్పించాలన్న తీరున,

‘‘పునుగే కాదు. కస్తూరీ లేకపోలేదు. కావాలంటే ఇట్టే తెచ్చి ఇవ్వగలను.’’ అసలు విషయాన్ని బయటపెట్టింది. ఆ మాటలతో గన్నియ మరింత నిస్పృహ చెందినట్టయింది.

‘‘ఎక్కడివే ఈ సుగంధాలు. వడ్డాది ఎలా చేరాయి.’’ కటువుగానే పదాలను విసిరింది. జాణ భయపడిరది. అనవసరమైన ప్రసంగం చేయలేదు కదా అనే తనుపుతో,

‘‘ఇవి మన అడవుల్లోనివేనమ్మా. వడ్డాది వేట గాళ్లు తీసుకువచ్చినవే. ఇవే కాదు. మన సరుకులెన్నో ఇప్పుడు సరాసరి కొండలు దిగి వచ్చేస్తున్నాయి. పల్లపువ్యాపారులంతా నేడు నందకోనల్లోనే తిరుగు తున్నారు. ఇప్పుడక్కడ తేనెలేదు. కుంకుళ్లు లేవు. అడ్డాకులు లేవు. ఇంకా చాలా లేవు. అవన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి. రేపటిరోజున గిరులన్నీ తవ్వి రంగురాళ్లు, లోహాలూ వడ్డాది షావుకార్లు బయటకు తీస్తారట.’’ ఈ మధ్యనే ఇంటికివెళ్లి తిరిగివచ్చేటప్పుడు నందపురంలో తెలుసుకున్న సత్యసమాచారమంతా ప్రవాహంగా చెప్పేసింది.

నిస్త్రాణ ముంచుకువచ్చినట్టుగా అయిపోయింది గన్నియ. అద్దం వద్దనుంచి లేచింది. దగ్గరగా ఉన్న ఆసనంలో కూలబడినట్టుగా కూర్చుండిపోయింది. కొన్ని క్షణాలను భారంగా దొర్లించింది. ఇదంతా బోధపడక ఆ కాలమాత్రలను ఎలాగోఒకలా గడుపు కొచ్చింది జాణ. మెల్లగా మామూలయిన గన్నియ,

‘‘చూడవే. ఎంత దురన్యాయానికి వడ్డాది దుండగులు పాల్పడుతున్నారో! రక్షితప్రాణులుగా మనం ప్రకటించుకున్న పునుగు పిలుల్నీ, కస్తూరి జింకల్నీ నామరూపాల్లేకుండా చేస్తున్నారన్నమాట.’’ నిట్టూర్పు విడుస్తూ అంది. జాణకు అర్థం కాలేదు. ఈ కారణంగానే బుర్రగోక్కుంటూ,

‘‘ఇందులో దురన్యాయం ఏముందమ్మా. మన్యం మగువను భార్యగా చేసుకున్న రాజుకు అత్తవారి శిఖరాలమీద హక్కుండదా?’’ అనేసింది.

జాణమాటలకు నిప్పులు చిమ్ముతున్న జ్వాలా తోరణమే అయిపోయింది గన్నియ. చండప్రచండ కోపంతో ఊగిపోతూ అగ్నికీలల్ని కక్కుతున్నట్టుగా వాచను పెనుకేకలుగా మార్చివేసింది.

‘‘వడ్డాదిప్రభువు నాకు మొగుడు గానీ మా నాన్న రాజ్యమంతటికీ మొగుడా? పిల్లకీ, పిల్ల కన్నవారి ఆస్తిపాస్తులకీ, వాళ్లసామ్రాజ్యమంతటికీ ఈ దేవేంద్రుడు పెనిమిటి అయిపోయి అలుపులేని మిథునక్రీడకు దిగుతాడేం? గిరికాంతలోకే కాదు. గిరికంతల్లోకీ మగతనాన్ని ప్రవహింపజేసేసి రాళ్లకే రంకుమొగుడు అయిపోతాడేం? ఇతగాడు అంతపెద్ద మగాడేం?’’ అనకూడని మాటలు సైతం రౌద్రంగా వెల యించేసింది. దెబ్బకి జాణ నోరు కట్టడిపోయింది. అంతటితోనే గన్నియ ఆగలేదు.

‘‘నన్ను పెళ్లాడానన్న నెపంతో వడ్డాదిరాయడు నందాన్ని మింగుతానంటే నేనెందుకు ఒప్పుకుంటానే. నందపురాన్ని స్మశానవాటికగా మారుస్తానంటే మరెలా ఒల్లగలనే. మన పసిబయళ్లన్నీ బీళ్లుగా మార్చే ప్రయత్నం ఎవరు చేసినా మనసు కాలిపోదా?’’ బిగ్గరగా పలికింది. ఆ వెంటనే తెరలుతెరలుగా నీరసచ్ఛాయలు కమ్ముకోవడంతో ఆసనపు అంచునకు చేరి మెడ జారవేసింది. మందిరం పైకప్పును చూస్తూ ఉండిపోయింది. ఠారెత్తిపోయింది జాణ. ఉరమని పిడుగులా రాణీవారూ గళం పెంచేయడాన్ని, శిఖర ప్రాయమంతటి ఆగ్రహాన్ని తెచ్చేసుకోవడాన్ని తట్టుకోలేక డస్సిపోయినట్టయింది. గుండె పూర్తిగా జారిపోకుండా చూసుకుంటూనే మందిరం మూలనున్న మంచినీటి పాత్ర తెచ్చి గభాలున గన్నియకు అందించింది.

నోటికందిన నీరు అమృతంలా తోచింది రాణీకి. లోటాతో లోటాడు జలాన్నీ ఒక్క పెట్టున గుటకలు గుటకలుగా మింగేసింది. ఆ మీదట కాసింత తెప్ప రిల్లినట్టయింది. మెల్లగా కొన్ని క్షణాలకు చల్లబడినట్టూ అయింది. జాణకు ఖాళీ నీటిపాత్ర అందిస్తూ,

‘‘నీ మీద కోప్పడ్డానే. మరేం అనుకోకు. నా బాధ అలాంటిది.’’ ఆగ్రహాన్ని వదిలిపెట్టి సాధారణస్థితికి వస్తూ అనేసింది.

‘‘అబ్బే. నామీద మీరేం కోపపడలేదమ్మా. కోప్పడితే మాత్రం తప్పేంటి. అదలా ఉండనివ్వండి గానీ, చీటికీ మాటికీ మీరిలా నెత్తురు కాగబెట్టుకోవడం ఇప్పుడున్న స్థితిగతుల్లో మంచిది కాదు. మీకు మూడవనెల నడుస్తోంది. అది మరచిపోకండి.’’ చెప్పవలసింది చనువారా చెప్పేసింది జాణ. మూడవ నెల అనే మాట వినగానే గన్నియ నీరుగారి పోయినట్టుగా అయిపోయింది.

‘అవుననుకున్నా కాదనుకున్నా కొన్ని సవాళ్లను మనిషికి దేవుడే విసురుతుంటాడు.’ ఎదలోనే సొదపడుతూ,

‘‘జాణా! ఊరికే నేనేం మరిగిపోవడం లేదే. ఎదుటివారి ఆస్తులను ఎంత దగ్గరవాళ్లయినా దోచుకోకూడదు కదే. పెళ్లినాటి మాటలు నాగవల్లికే మలిగిపోతే ఎలా చెప్పు. సరేలే. నీముందు నాగిని నృత్యం చేస్తే లాభమేంటి. అడగవలసినవాళ్లనే అడగాలి. ఇంతకీ ఇప్పుడు నువ్విచ్చిన జీవజలాలు ఎక్కడివే. అచ్చం మన శిలానది నీళ్లల్లానే ఉన్నాయి. గొంతులో ఒంపుకుంటే నందపురం వెళ్లొచ్చినట్టే ఉంది. నలిగిపోయిన నాడులన్నీ నవజీవాన్ని పొందినట్టుంది. పోయిన ప్రాణం లేచివచ్చినట్టే ఉంది. ఇంతకీ ఇవి ఏ నీళ్లు?’’ విపులంగా గన్నియ మాట్లాడే సరికి హాయిని పొందింది జాణ.

‘‘పోనీలెండమ్మా. మీరు శీతబడ్డారు. నాకదే చాలు. ఈ మధ్య మీకు ఏం చెబితే ఏమవుతుందో అన్నట్టుగా బెగిలిపోతున్నాను తల్లీ.’’ ప్రేమ పూర్వకంగానే మదిలోని చింతను బయటపెట్టింది.

‘‘మరేం ఫరవాలేదు లేవే. నీ మీద కాకపోతే ఎవరి మీద ఎగిరిపడగలను చెప్పు.’’ ముసిముసిగా బదులు పలికింది వడ్డ్దాది రాణి. ‘‘అలా అయితే ఒక మాట. మళ్లీ మీరు చీకాకుపడకూడదు. ఇప్పుడు మీరు తాగిన నీళ్లన్నీ మీరన్నట్టు మన శిలానది నీళ్ళే.’’ అసలు విషయాన్ని వివరించింది జాణ. చకిత అయింది గన్నియమ్మ. ఎక్కడలేని ఆనందం తనదే అన్నట్టుగా వదనాన్ని వాటంగామార్చి,

‘‘అక్కడెక్కడి జలాలో ఇక్కడికెలా వచ్చాయే.’’ విస్మయం పాలవుతూ అడిగింది. ‘‘ఎలా వచ్చాయా? శిలానదినుంచీ వడ్డాది రాజ్యంలోని బంగారు మెట్టవాగుకు కాలువతవ్వి రెంటినీ కలుపుకొచ్చారు కదా. అలా మీ నోటికి అందాయి ఈ నీళ్లు. నిన్ననే జలాల విడుదల జరిగింది. ఇకమీదట ఎంచక్కా మననీళ్లు మనమే తాగవచ్చు.’’ జాణ పలికిన పలుకులతో ఆసనంనుంచి తటాలున లేచింది గన్నియ.

‘‘అవి వడ్డాది నీళ్లు ఎలా అవుతాయి. అవి నందా నివి కదా. కొండల జీవజలాలనూ వడ్డాది ప్రభువులు వదలడం లేదా. శిలానదిని మనం గ్రోలుతుంటే, నందప్రజలు కుడవడానికి పంటలెక్కడుంటాయి. కొత్త ఫలం తిని కొవ్వి.. పాత అన్నం తిని బలిసి.. అనే సామెతను గుర్తుకుతెస్తున్నారీ వడ్డాదివారు. చెప్తా నుండు. అడగవలసినవేవో ప్రభువునే అడుగుతాను. అడగడం కాదు కడుగుతాను.’’ అంటూనే మరోమాట లేకుండా సరసరా సమాలోచన మందిరంవైపు తోకతొక్కిన తాచులా వెళ్లిపోయింది. ఆమె వెళ్లినదారిని అవాక్కయి చూడటం జాణ వంతయింది.

*       *       *

మహారాణీ రాచగన్నియ కోసమే నిరీక్షిస్తూ సమాలోచనమందిరంలో కూర్చున్న పూర్ణిమాదేవికి, దేవేంద్రునికి, ప్రణవశర్మకి తుపానులా వచ్చి పడ్డ ఆమెను చూడగానే బుర్రగిర్రున తిరిగినట్టయింది. పట్టపుదేవిలా కాకుండా కోనలు తిరిగే గిరినాగులా గన్నియమ్మ మందిరంలోకి చొరబడిన తీరు వారిని మహదాశ్చర్యంలో ముంచివేసింది. ముగ్గురూ కొంతసేపు నిరుత్తరులే అయ్యారు.

వ్యగ్రతను ఎంతగా తగ్గించుకుందామని అనుకున్నా కుదరకపోవడంతో ఉగ్రంగానే మందిరాన ప్రవేశించిన గన్నియ కొన్ని రాచమర్యాదలను మరచిపోయింది. వస్తూవస్తూనే తనకు నిర్దేశించిన ముఖ్‌మల్‌ పరుపుల కర్రబల్లమీద కూలబడిపోయింది. ఆ వెంటనే కర్తవ్యం గుర్తుకువచ్చినట్టుగా అయిపోయి బల్లను వదిలిపెట్టింది. ప్రణవులవారికి నమస్కారాలు చేసింది. అత్తగారికి పాదాభివందనాలూ చెల్లించింది. ప్రభువు మొహం మాత్రం కనీసం చూడనయినా చూడకుండా ఆసదనం వైపు నడిచిపోయింది.

ఆమె మానసిక స్థితిని ప్రణవులవారు అప్పటికప్పుడే బేరీజు వేయగలిగారు. ఆమె రాకడకు ముందే రాజమాత చెప్పిన సొదలన్నీ విని ఉన్నారు గనక పస తెలుసుకున్నారు. ఇప్పుడు మాట్లాడవలసింది తను కాదన్నట్టుగా పూర్ణిమాదేవి కిమ్మనకుండా ఉండిపోయింది. దేవేంద్రుడు మటుకు మల్లగుల్లాలు పడుతున్నాడు. అప్పటికే వ్యక్తిగత సమయాల్లో తనతో భార్య జరిపిన అనేకానేక అదిలింపుల సంభాషణలూ గుర్తుకురాకపోలేదు. ఆమె చెప్పిన కొన్ని నీతులూ మనసున మెదలకపోలేదు. అవన్నీ అతనికి పెద్దగా నచ్చుబాటుకానివే. ఇందువల్లనే,

‘వదరుబోతు. తెంపరి. న్యాయం, ధర్మం, దీనికే తెలుసట. మర్వెవరికీ ఎరుకలేదట. కనకపు సింహాసనం మీద అనర్హులు కూర్చోకూడదని అంటారందుకేను.’ మనసును గంటుపెట్టుకున్నాడు.

(ఇంకా ఉంది)

About Author

By editor

Twitter
YOUTUBE