– డా॥ చింతకింది శ్రీనివాసరావు
జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన
వెంకటేశుడు హర్షధ్వానాలు చేస్తూ తల్లి మాటను ఔదలదాల్చాడు. అప్పటికే మెత్తబడిన రాచగన్నియ సైతం అమ్మమాట విని పరవశించి పోయింది. ఆ సమయాన ఆసనం పైనుంచి లేచి ప్రణవశర్మ పాదాలకు అభివందనాలూ చేసింది. శర్మ సంతోషానికి మేరలేదు. అతని మోదానికి హద్దు తెలియలేదు.
‘‘శుభం భూయాత్..’’ అంటూనే పూజగదిలోని పాలవెల్లికి మొక్కాడు. నీలకంఠునికి స్తోత్రపాఠాలు చేశాడు. మంత్రపూతమైన శర్మ గళం మలిగేవరకూ మిగిలినవారంతా విరూపాక్షునికి జోరలు చేస్తూ నిలుచుండిపోయారు. మంత్రపఠనం ముగిశాక దేవతామూర్తుల చెంతనున్న భరిణె తీసి వెంకటేశుడు, రాచగన్నియ నుదుట కల్యాణ తిలకాలు దిద్దినట్టుగా కుంకుమ పూశాడు ప్రణవయ్య. ఆశీర్వచన పనస చదివాడు.
‘‘వడ్డాది, నందరాజ్యాలు ఇకమీదట రెండు కావు. ఒక్కటే. ఇరు సామ్రాజ్యాలూ అజేయమై వర్థిల్లు గాక.’’ ఆనందంగా గొంతు విప్పార్చాడు. ఆ తర్వాత,
‘‘వడ్డాది మహారాణీ రాచగన్నియకు, వడ్డాది జామాత వెంకటేశునికీ నమోనమో.’’ జయకారాలతో కైమోడ్పు చేశాడు. వెంకటేశుడు, రాచగన్నియ, మాకలిశక్తి తడిసిన మనసులతో ప్రణవశర్మకు ప్రతివందనాలు సమర్పించారు. ఆ ఉదయకాలాన హర్షప్రకాశనంతో విరాజమానమైంది పూజగది.
* * *
శుభవార్తను వెంటతీసుకుని ఆ సాయంత్రమే అశ్వారూఢుడై, రాచకానుకలతో, నందరాజ్యపు రక్షణ వలయాల నడుమ వడ్డాది ప్రయాణమయ్యాడు ప్రణవశర్మ. మంత్రివర్యులు పట్టుకువచ్చిన జయవార్త విని మత్స్యరాచకుటుంబీకులు పరవశులయ్యారు. చాకచక్యంగా పని సానుకూలం చేసి వచ్చిన ఆయనను సత్కరించారు. నందరాజ్యంనుంచి వచ్చిన మందీ మార్బలానికీ పాలవిందులు చేశారు. క్షేమంగా వారిని వారి దేశానికి సాగనంపారు. ఆనందాల నందం, అపురూపాల మత్స్యం కలిసి సాగితే ఎదురే ఉండబోదని మురిసిపోయారు.
గిరిసైనికుల ఆయుధాలైన చిల్లలమ్ములు, శిలబాణాలు, కొమ్ములబల్లేలు, బోడిబల్లేలు, వడిశెలు పల్లం శూలాలతో కలిస్తే చెప్పేదేముంది! దిగువ కరవాలాలతో నేస్తం కడితే మాట్లాడేదేముంది! కింది మందుగుండుతో జోడా అయితే పలికేదేముంది. మెరకనున్న అశ్వాలూ లోతట్టు మత్తేభాలూ మైత్రికి దిగితే మరో మాట ఏముంటుంది! జయపురపు బాజాలు వడ్డాది సన్నాయిలతో సంవర్తలాడితే తిరుగేముంటుంది. అప్పుడిక అంతా అప్రతిహతమే. అంతటా విజయదుందుభులే. అన్నింటా జయన గారాలే. కాబట్టే, మత్స్యనందరాజ్యాల మధ్య కుదిరిన వియ్యం ఈ ఇరురాజ్యాల మీదా కయ్యం ప్రకటించిన జోదులకు నోట్లో మట్టికొట్టింది. ఆ ఎగువ దిగువ నెయ్యం శత్రుయోధులందరినీ చేటమూలకు చేర్చింది. వాళ్ల నోళ్లు మూతబడేలా చేసింది.
అప్పటివరకూ నంద, మత్స్యరాజ్యాలను కబళిం చాలనుకున్న సాముగరడీల చాళుక్యులు, పొంకనాల చోళులు, కాకలు తీరిన కాకయలు, రాజమహేంద్ర వరం రెడ్డిరాజులు, బస్తరు వస్తాదులు, బారగడ శూరులు మరి మాట్లాడలేదు. మాట్లాడితే బలిష్టమైన రెండు రాజ్యాలూ కట్టుగా మీదపడతాయని మిన్న కున్నారు. పెద్దపెద్ద ప్రభువులే నిస్సారమైపోవడంతో స్థానీయ తిరుగుబాటుదారులూ తోకలు ముడిచారు. వక్రమార్గాలకు స్వస్తిపలికారు. తత్ఫలితంగా మైదాన దేవేంద్రుడు, మెట్టల వెంకటేశుడూ తమ సింహాసనాలు పదిలమయ్యాయని తెరిపినపడ్డారు. ప్రశాంత చిత్తులయ్యారు. జోడు రాజ్యాల ప్రజలూ శత్రువుల ముప్పు తప్పినందుకు సంతసమొందారు.
‘భూదేవి అంత అరుగు.. ఆకాశమంత పందిరి.. చుక్కబొట్టు అక్షింతలు.. సూర్యుడే బాసికము..’ అన్నట్టుగా భూనభోంతరాలు దద్దరిల్లేలా వివాహ సన్నాహాలు జరిగాయి. బొడ్డేరు, తాచేరు, శారద, వరాహ, తాండవ, వంశధార, నాగావళి నదులు ఉప్పొంగినంత కల్లు పొంగిపొరలింది. వేటలు తెగిపడ్డాయి. పాణిగ్రహణ మహోత్సవం కళకళ లాడేలాగా, తళతళమెరిసేలాగా ఎక్కడెక్కడి జనమూ తయారయ్యారు. దైవజ్ఞులు నిశ్చయించిన సుముహూ ర్తాలకు నందరాజ్యం నుంచి భైరవఖడ్గం పల్లానికి చేరింది. దేవేంద్రునితో తాళి కట్టించుకుంది. వడ్డాది నుంచి నందపురానికి ఎగసిన బాసికపు కత్తికి బంధుమిత్రుల సమక్షంలో వెంకటేశుడు సూత్రాన్ని ముడివేశాడు. నందరాచ గన్నియ వడ్డాది అత్తవారింట కాలు మోపింది. వడ్డాది దేవేంద్రాలు నందరాజ్యానికి కోడలిగా వెళ్లింది.
* * *
మెట్టినింటికి విచ్చేసిన రాచగన్నియకు ఎదురవుతున్న అనుభవాలన్నీ కొత్తవే. ఘటనలు, సంఘటనలూ సరికొత్తవే. కొత్తకోడలికి ఇలాంటివి మామూలే అని గన్నియ విషయంలో సరిపెట్టుకునే వీలేలేదు. అత్తవారితో కలవడం, భర్తతో సంసార యాత్ర చేయడం, నూతనంగా ఏర్పడిన సంబంధ బాంధవ్యాలను అర్థం చేసుకోవడం, వాటిని బేరీజు వేసుకుని వర్తనను నిర్మించుకోవడం, ఇవన్నీ సగటు కోడళ్లందరికీ సమానమే కావచ్చు. ఒకానొక ఇంటినుంచి మరొక ఇంటికి వచ్చినప్పుడు ఆర్థిక, సామాజిక స్థితిగతులను సమన్వయపరుచుకునేవేళ కొన్ని చిన్నపాటి సమస్యలు ఎదురుకావడమూ కద్దు. కాకపోతే గన్నియ స్థితి బాగా తారుమారు.
ఎక్కడో మెట్టదేశం నుంచి ఊహించని రీతిలో మైదానానికి దిగివచ్చింది. ఇక్కడి మనుషులు వేరు. ఆచారాలు వేరు. సంస్కృతి వేరు. సంప్రదాయాలు వేరు. యాస వేరు. భాష వేరు. ఆహారం వేరు. వ్యవహారం వేరు. సర్దుబాటు చేసుకోవడానికి ఆమెకు కష్టంగానే ఉంది. రెండు ప్రదేశాల భావజాలాల్లో తేడాలుండటం మూలాన మనుషుల ప్రవర్తనలోనూ, వారు పాటించే మానవతావిలువల్లోనూ వారా కనిపిస్తోంది.
గన్నియకు ఒక పట్టాన వడ్డాది వాతావరణం మనసుకు పట్టడం లేదు. పైగా ఆమె నిక్కచ్చి మనిషి. నమ్మినదానిని ఆచరించడానికి, వల్లించడానికి, ప్రకటించడానికి ఎప్పుడూ ముందే ఉంటుంది. లజ్జు గుజ్జులు ఉండనే ఉండవు. తెలియనే తెలియవు. ఆమె పెరిగిన పద్ధతి అలాంటిది. ఆమె కోనజీవితం అంతటిది. అందుకే అప్పుడప్పుడు భర్త దేవేంద్రుని తోనూ ఆమెకు వాదులాట తప్పడం లేదు.
ఇక్కడ గన్నియ ఇలా ఉంటే అక్కడ నందరాజ్యానికి కోడలిగా వెళ్లిన దేవేంద్రాలికీ అంతా నవీనమే. వడ్డ్దాది మహిళకు స్వేచ్ఛ అంతంత మాత్రం. కొండ నందంలో అమ్మాయికి కావాల్సినంత స్వాతంత్య్రం. మత్స్య రాచమందిరం స్త్రీలకు చిలకల పంజరం. నందపాలన ముదితలకు మహానందసందోహం. వడ్డాది నేల మీద పురుషాధిక్యం. శిలవంశ భూమి కాంతల కనకమేడ. అన్నింటికీమించి అక్కడ మనసున్న మాకలిశక్తి ఉంది. నెమ్మదస్తుడైన దేవేంద్రుడూ ఉన్నాడు. అంచేతనే మెట్టిన స్థలాన్ని అర్థం చేసుకునే పని కొంతలో కొంత సుళువు అవుతోంది దేవేంద్రాలికి. దీనికితోడు ఆమె వస్తుతహ మెత్తనిది. అదనంగా దొరికిన స్వేచ్ఛను వినియోగించుకోవడానికీ వెనుకముందులు ఆలోచిస్తుంది. నందప్రభుపాలన, అక్కడి ప్రజల జీవనవిధానం, సామాజికాంశాలు, తదితరాలన్నీ ఆమెను అబ్బురపరుస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క విషయాన్నీ ఏ మాత్రమూ తొందరపడకుండా నిదానంగా అవగాహన చేసుకునేందుకు ప్రయత్ని స్తోంది. అవసరవేళ అత్త మాకలిశక్తి సహాయం తీసుకుంటోంది. దేవేంద్రాలు భార్యగా రావడంతో వెంకటేశుడు ఒడ్డునపడ్డాడు. మనసులో మాట చెప్పుకునే మరో మనిషి దొరికినట్టయింది. కోడలిని చూసి రాజమాత మాకలిశక్తీ గర్వపడిరది. పిల్ల ఒద్దికతనం ఆమెను సంతోషపెడుతోంది.
* * *
ఫాల్గుణమాసపు తొలి రవివారం. వడ్డాది పాలనాయంత్రాంగానికి సంబంధించినంతవరకూ ఆదివారాల ఉదయపు వేళ ధర్మగంట గణగణ మంటుంది. ప్రజలు తమ కష్టాలను, సమస్యలను సరాసరి రాజుతోనే చెప్పుకునే వీలుంటుంది. రాచభవనానికి ఎదురుగా ఏర్పాటయిన కంచుగంట మోగించినవారిని ప్రాసాదంలోని తీర్పులగదికి ఉద్యోగులే స్వయంగా తీసుకువెళతారు. అక్కడ కొలువైన ప్రభువు వ్యాజ్యాన్ని విచారించి నిర్ణయం చెబుతారు. అన్ని వారాలూ అలాగే జరుగుతుంది.
ఇందులో చిన్న తేడా ఏమిటంటే నెలలోని మొదటి భాస్కరవారం మటుకు తీర్పు చెప్పే పని రాజు ఆధ్వర్యంలో జరగదు. ఈ కార్యక్రమాన్ని మహారాణీ నిర్వహిస్తారు. నిర్వహించాలి. ఇది నిబంధన. నిబంధన అనే కంటే శతాబ్దాల తరబడి అమలవుతున్న మత్స్యరాజ్యపు కట్టుబడి. దీన్ని అనుసరించి ఆ వేళ రాజమాత పూర్ణిమాదేవి తీర్పుల గదికి వెళ్లేందుకు సమాయత్తమవుతోంది. వెళుతూ వెళుతూ తనతోపాటుగా రాచగన్నియనూ తీసుకు వెళ్లేందుకు సిద్ధపడుతోంది. ఈ విషయాన్ని గతవారమే కోడలికి అంతఃపుర వర్తమానంగా పంపి ఉంది. రానున్న కాలంలో రాచగన్నియకు రవివారపు విధిని అప్పగించాలనేది ఆమె భావన. వయసు మీద పడుతున్న తరుణంలో రాచకార్యాల నుంచి క్రమంగా వైదొలగాలనేది యోచన. ఆ ప్రకారమే ఆ రోజు మందిరాన్ని విడిచి ధర్మఘంటిక విధుల నిర్వహణకు బయలుదేరింది. రాజోద్యోగుల సూచనమేరకు రాచ గన్నియా అత్తగారి వెనుక తీర్పుల భవనానికి చేరింది.
రాజమాత, రాచగన్నియ కార్యస్థానానికి వచ్చేసరికి న్యాయ విభాగపు సిబ్బంది అప్పటికే అక్కడ హాజరీలో ఉన్నారు. అధికారులు, న్యాయమండలి సభ్యులు ఆసనాలు స్వీకరించి ఉన్నారు. రాణులిద్దరి వేంచేపు అయ్యాక న్యాయపీఠం సమక్షాన అందరూ గౌరవ పూర్వకంగా లేచి నిలుచున్నారు. పెద్దలు కూర్చున్నాక తమ తమ స్థానాలను అలంకరించారు.
ధర్మగంట కర్తవ్యాలను నిర్వహించేందుకు రాచగన్నియ తొట్టతొలిసారిగా విచ్చేసిన ఆ సందర్భాన్ని రాజోద్యోగులు ప్రత్యేకంగా పరిగణించారు. తీర్పుల నియమావళిని ఆమెవద్ద ఉల్లేఖించారు. ఇందుకు కొంతసమయం పట్టింది. అయినప్పటికీ ఇదంతా జరగవలసిందే అన్నట్టుగా ఓపిగ్గా రాజమాత వీక్షించింది. కోడలికి పాలనాయంత్రాంగం అర్థం కావడం మంచిదన్నట్టుగా భావించింది.
ఉద్యోగులు ఎంతగా వివరణ పోల్చినప్పటికీ గన్నియకు వడ్డాది న్యాయసూత్రాలు బోధపడలేదు. సరికదా అవన్నీ వింతగా తోచాయి. అందుకే అదో రకంగా మొహం పెట్టింది. అత్తగారివైపు చూసింది. పూర్ణిమాదేవి సూక్ష్మగ్రాహి. రోజులు గడిచేకొద్దీ అన్నీ మనసుకు పడతాయన్నట్టుగా కోడలివైపు చూసింది. మొదటిరోజు కాబట్టి మౌనంగా తీర్పులను వినమన్న ట్టుగా కళ్లతోనే వివరించింది. ఆనక విధుల్లోకి ప్రవేశి ద్దామని అధికారులకు సైగలతో ఇషారా ఇచ్చింది.
ఆ ఉదయమే కంచుగంటను మోగించిన ప్రథమ కక్షిదారులను ప్రవేశపెట్టారు రాజోద్యోగులు. అదొక స్థలవివాదం. ఒకానొక భూఖండానికి తప్పుడు పత్రాలు సృష్టించి అవతలివ్యక్తి తనకు అమ్మేశాడని, ఆ నేలను కొనుగోలు చేసి చిక్కుల పాలయ్యాయని ఒక పౌరుడు రాజమాత ముందు గగ్గోలు పెట్టాడు. కొన్ని కాగితాలను దాఖలు చేశాడు. మోసం చేసినవాడు ఇతగాడేనంటూ ఎదరి ఆసామిని చూపించాడు. సదరు వ్యక్తి తనపై రేగిన అభియోగాలకు వివరణ ఇస్తూ ఇందులో తన తప్పేమీ లేదని, క్రయఫలంగా భూమి కొన్నవాడు చెల్లించిన డబ్బు నకిలీదని విన్నవించాడు. కొన్ని టంకాలున్న చిక్కాన్ని మొలలో నుంచి పైకి తీశాడు. వివాదాన్ని చప్పున ఆకళింపు చేసుకున్న పూర్ణిమాదేవి,
‘‘భలే సమస్యే.’’ చిరునవ్వులు చిందిస్తూనే పలికింది. ఆమె అలా నవ్వుతూ మాట్లాడుతోంది గానీ గొడవ ఆలకించిన మరునిమిషంలోనే బుర్ర పాడయినట్టుగా రాచగన్నియ నజ్జుగా మారి పోయింది. తనెప్పుడూ ఇలాంటి చిక్కును ఎదుర్కోవడం మాట అటుంచితే అసలు ఆలకించనే లేదన్నట్టుగా ముఖం పెట్టింది.
కోడలి హావభావాలతో సంబంధం లేకుండా రాజమాత విచారణకు సిద్ధమైంది. ఇరుపక్షాలవారినీ రకరకాలుగా ప్రశ్నించింది. వాదప్రతివాదాలు విన్నది. ఏదేదో సమాచారాన్ని రాబట్టింది. ఒకరకంగా చెప్పాలంటే కక్షిదారులను శల్య పరీక్షచేసింది. గన్నియ మాత్రం ఒక్కమాటయినా మాట్లాడకుండా ఇదంతా చూస్తూ ఉండిపోయింది. విస్మయం పాలవుతూ మన్ను తిన్న పాములా మారిపోయింది. కోడలు ఈ రీతిగా మ్రాన్పడిపోవడానికి దారితీసిన ఘట్టమేమిటో పూర్ణిమాదేవికి అంతుబట్టలేదు. అంతకుమించి తల పోసేందుకు ఆమెకు ఆ సందర్భాన తీరుబడి లేదు. వాది దాఖలు చేసిన పత్రాలను, ప్రతివాది సమర్పిం చిన నాణాలను నిపుణుల పరీక్షకు పంపాలని ఆదేశిం చింది. వ్యాజ్యాన్ని వాయిదా వేసింది. మరో దావాను వివరించమన్నట్టుగా కొలువు కూటమివైపు చూసింది.
తడవులేకుండా ఇంకో తగవు ప్రస్తావనకు వచ్చేసింది. అది ఆలుమగల గొడవ. తన భార్య పరాయివాణ్ణి మరిగిందని, తనతో కాపురం చేయడం లేదని ఒక భర్త రాజమాతకు ఫిర్యాదు చేశాడు. ఆమెను దండిరచి తన పరం చేయాలని వేడుకున్నాడు. ఆ పతిదేవుడు చేసిన అభ్యర్థన విని పూర్ణిమదేవి ఏదో సంశయ పడిరదిగానీ రాచగన్నియ అయితే విస్తుపోయినట్టుగానే అయిపోయింది. తెల్లబోయినట్టూ అయింది. స్థాణువులా మారిపోయింది. ఇంతలోనే,
‘‘నా భార్యను అవసరమైతే కొరడాదెబ్బల శిక్షతో దారికి తెండి.’’ ఆ భర్తగారు తన కోర్కెను బయట పెట్టారు కూడాను. యోచిస్తున్న రాజమాతను ఈ కోరిక చీకాకు పెట్టింది. గన్నియకు మాత్రం ఒక్క సారిగా ఆ పెనిమిటిని చావచితక బాదేయాలన్నంత కోపం వచ్చింది. ఆసనంలోనే అసహనంగా కదిలి పోయింది. భార్యకు వేయమంటున్న కొరడా శిక్షను ఉన్నపళాన అతగాడికే వేస్తూ తీర్పు చెప్పే యాలన్నం తగా తరసపడిరది. కోడలి ఈ అసహనపు కదలికలను పూర్ణిమాదేవి అంచనా కట్టకపోలేదు. ఇందువల్లే అక్కడితో ఆ తగవును వాయిదా పద్ధతికి చేర్చాలని భావించింది. ఆ తలంపుతోనే,
‘‘ఇతగాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతని భార్యను వచ్చే ఆదిత్యవారానికల్లా న్యాయస్థానానికి చేర్చండి.’’ పొడిపొడిగా పలికింది. అంతటితో ఆ గోలను అప్పటికి ముగించేసింది.
‘ఈ రోజుకు అయిపోయినట్టేనా.’ అన్నట్టుగా న్యాయవిభాగపు బాధ్యుల దిక్కు చూసింది. వారు స్పందిస్తూ, ‘‘రాజమాతకు జయమగుగాక.’’ ముగించేశారు.
ఆసనం విడిచింది పూర్ణిమ. కచేరీ ముగిసిందన్న ధ్యాస లేకుండా అయోమయంగా ఉండిపోయిన గన్నియను పట్టిలేపింది. కోడల్ని ఈ లోకంలోకి తీసుకువచ్చింది. ఇరువురూ మందిరానికి కదిలారు.
రాజప్రాసాదం అంతస్తుల సోపానాలను అధి రోహించి వెళుతున్నా అటు పూర్ణిమాదేవిలోనూ ఇటు రాచగన్నియలోనూ మార్పేం లేదు. హఠాత్తుగా కోడలు ఎందుకు మౌనవ్రతం పట్టిందో అత్తగారికి అర్థం కాలేదు. తీర్పరిగదికి చేరిన వివాదాలను జీర్ణించు కోలేని అసహాయతనుంచి గన్నియా బయటపడలేదు.
రాచభవనంలోని మూడవఅంతస్తు మొత్తం మహిళలదే. అక్కడి మొదటి దేవిడీ దేవేరిది. అంటే రాచగన్నియది. చివరి ఆవాసం రాచకుల వృద్ధులది. అంటే పూర్ణిమాదేవిది.
ఆరునెలల కిందట దేవేంద్రుని వివాహం జరిగాకనే ఆ తొలి నివాసం నుంచి తుదిగదికి చేరింది రాజమాత. ఆ విధంగా గన్నియకు పట్టమహిషి హోదాను కట్టబెట్టింది.
మామూలుగా అయితే రాచఘోషా పద్ధతిని అనుసరించి అంతఃపురస్త్రీలే అయినా ఒకరి తావున మరొకరు చొరబడరు. కానీ, ఆ రోజు ప్రత్యేకమైన అవస్థ ఏదో గన్నియను పట్టిపీడిస్తోందని గ్రహించి ఆమె వెనుకనే పటారంలోకి పూర్ణిమాదేవి ప్రవేశించింది.
నందరాజ్యంలో ఘోషా అన్నదే ఉండదు. ఆత్మబంధువులు, తల్లీబిడ్డలు, అత్తాకోడళ్లు కలుసు కునేందుకు అనుమతులు అవసరమే లేదు. అలాంటి పద్ధతులనుంచి వచ్చినందువల్ల తన భవనంలోకి విచ్చేసిన అత్తగారిని తప్పుబట్టలేదు గన్నియ. తను మాట్లాడే మాటలు వడ్డాది ప్రముఖులకు ఖేదం కలిగిస్తాయేమో అనేదే ఆమె యాతన. అయినా అడగాల్సింది అడగకుండా ఉండలేని స్థితి. అప్పటికీ పెదవి కదపకుండా గంభీరంగానే ఉండిపోయింది. తూర్పుగవాక్షానికి చేరి నిలుచుండిపోయింది. కోడలి జంకుగొంకులను అర్థంచేసుకున్నట్టుగా రాజమాతే కలుగజేసుకుంది.
(ఇంకా ఉంది)