– డా॥ చింతకింది శ్రీనివాసరావు

ఆకాశమంత పీనె, ముత్యాల పందిరిని పోలిన విశాలమైన పెళ్లిశాల నెలకొల్పడం సరే, మన్యమంతా తరలివచ్చే ఈ పాణిగ్రహణానికి విందు పేరిట కలిమిముద్దల వడ్డన, మూటకూళ్ల పంపకం సామాన్యంగా లేవు. తాగేవారి కోసం సకల సురలూ కల్లు రూపాన గూనల కొద్దీ సిద్ధమైపోయాయి. పుట్టతేనెలు, పట్టుతేనెలు, కొత్తన్నాలు, చింత నూరుళ్లు, దుంప కాల్పులు, పప్పుకట్లు, కొర్ర బువ్వలు, అరికె ముద్దలు, సజ్జకూళ్లు, రాగుల బండారాలు ఒక్కటి కాదు. తిన్నవాడికి తిన్నంత అన్నట్టుంది. మాంసాల సంగతయితే మరి చెప్పనక్కరలేదు. గువ్వకూరలు, కణుజునంజరలు, నెమలి మాంసాలు, జింక చట్టలు, పంది చియ్యలు, కుందేటి కవుచులు రాళ్ల పొయ్యిల మీద ఉడుకుతున్నాయి.

అడవిలో పండ్లకు కరవేంటి! కోట్ల దేశం నుంచి నెమ్మిపండ్లు వలసవచ్చినట్టుగా వచ్చేశాయి. గాళ్ల మైదానాలనుంచి సీతాఫలాలు సందోహంగా చేరిపోయాయి. దోరశి కొండదారుల నుంచి చిట్టీత పళ్లు కుమ్ముకొచ్చాయి. పసిబయలు నుంచి రామా ఫలాలు, ఆరుళ్ల నుంచి నేరేళ్లు దిగాయి. ఏకపదంగా చెప్పాలంటే మన్యపుసంపదంతా ఆనాడు కరుకు పుట్టుకు చేరినట్టుగా ఉంది. వివాహానికి హాజరయి వధూవరులను ఆశీర్వదించేందుకు ఎక్కడెక్కడి జనమూ వచ్చిపడిపోయారు. ఇసకవేస్తే ఇసకరాలదు. ఊకపోస్తే ఊక దిగదు.

జంగయ్య బగత ఇంట ఈ వివాహం ఇంతగా కళకట్టడానికి మరో కారణమూ లేకపోలేదు. అతగాడికి రాజాస్థానంలో చాలా విలువ ఉంది. దండనాయకుల్లో అతనిది అగ్రేసరస్థానం. రాజ్యం కోసం ఏ క్షణానయినా ప్రాణాన్ని ఫణంగా పెట్టేంత నిబద్ధ గద్దెభక్తుడు. దీనికి తోడు సాక్షాత్తూ నందప్రభుత పెద్దదిక్కు మాకలిశక్తి ఈ మనువు వీక్షించేందుకు స్వయంగా తరలివచ్చారు. ఇందువల్లనే నెలవంక పెళ్లికి వెళ్లడం జోడులాభాలుగా గిరిప్రజ తల పోస్తోంది. కొత్తజంటను చూడటం ఇందులో ఒకట యితే, మామంచి రాచతల్లి మాకలి దీవెనలు పొంద వచ్చన్నది రెండవది. ఈ ఉద్దేశం చేతనే నలుమూలల శిఖర జనమూ పరుగులమీద పయనమై వచ్చేశారు.

ఈ పౌర సమూహం మధ్య, అశేష జనవాహిని అభినందనలు అందుకుంటూ పెళ్లి అరుగు ఎదురుగా సింహాసనం వంటి గద్దియ మీద మాకలిశక్తి కూర్చుని మనువు సరళిని తిలకిస్తోంది.

మాకలికి శైలపరిణయాలు చూడటం మహా ఇష్టం.

‘మంచి మాట వినవచ్చు. మంచి పాట ఆలకించవచ్చు. మకిలిపట్టని గుట్టల సంప్రదాయాన్ని దర్శించవచ్చు.’ అనేది ఆమె ఊహ. ఆ ఆలోచనతోనే దండనాయకుని ఇంట జరుగుతున్న పెళ్లికి తరలి వచ్చింది. పైగా జంగయ్య మీద ఆమెకు పుత్రప్రేమ. తన భర్త భైరవునికి జంగడు పాలనా వ్యవహారాల్లో సాయపడ్డ తీరు అసమానమని ఆమె తరచూ తలపోస్తుంటుంది.

మాకలమ్మ ఈ చందాన యోచన చేస్తున్నంతలోనే కరుకుపట్టు ముత్తయిదువులు కొందరు శుభప్రదమైన అద్రి గీతాల ఆలాపన ఆరంభించారు. పాండవరాజు పెళ్లి పాట మోరకెత్తుకున్నారు.

‘అన్నమూలదేవి ` అసివేయుల పాప

సత్తె పాండువరాజు ` పెండ్లి కబురులు

ఏ దేశం పిల్లను ` తెద్దమన్నారు

నాగలపురికి ` పుట్టి ఉన్నదట

నల్లది గన్నిక `నాగులది మేడ

చీమలు దేవిన ` నల్లరేవడి భూమి

గాజు కంబలిల్లు` ఘనగోపురాలు..’

శ్రావ్యంగా ఆలపిస్తున్నారు. అంతేకాదు. ఒకరి నడుము చుట్టూ మరొకరు చేతులు బిగించి థింసా అడుగులతో భూమి తొక్కుతున్నారు.

పెళ్లికి వచ్చిన వారందరూ రాగం తీగసాగుతున్న వైనాన్నీ, ముత్తయిదువల అడుగుల కదలికల్నీ పరికిస్తూనే, అరుగు మీది పెళ్లితంతును వీక్షిస్తూ సంతస పడుతున్నారు. మాకలి అయితే మరింత సంతోషంగా ముఖాన్ని పూర్ణచంద్రునిగా చేసుకుంది. పాట వింటుంటే ఆమెకు ప్రాణం స్నానం చేసినట్టుంది. స్థానీయ సౌరభం, ఆస్థాన కళావిలాసం చుట్టుముట్టి తన జన్మకు అర్థాన్నీ పరమార్థాన్నీ సమకూర్చినట్టుగా భావన చేసింది.

‘ఆహా! ఎంత గొప్ప సంస్కృతిలో పుట్టాను. ఎన్ని జన్మల పుణ్యం వల్లనో కదూ ఇంతటి శృంగజన్మ ప్రాప్తించింది. మూలవాసిగా పుట్టడం కంటే మనిషికి కావల్సిందేముంటుంది? ఆదివాసిjైు ఆకులోఆకుగా కలిసిపోవడం, చెట్లలో చెట్టుగా మారిపోవడం, పక్షితో, మృగంతో సహవాసి కావడం, చివరికి గిరు ల్లోనే భూస్థాపితం కావడం. పుట్టుక అంటే గిరిపుట్టుకే పుట్టుక. చావంటే గిరిచావే చావు.’ ఎంతగానో లోలోన మురిసిపోయింది. మైమరిచినట్టుగానూ అయింది. ఈ వేళలోనే వివాహ ప్రక్రియ కానిస్తున్న గిరిఒజ్జ గొంతుక పెంచి సూచనలకు దిగడంతో మళ్లీ ఈ లోకంలోకి వచ్చినట్టయింది.

పెళ్లి చేయిస్తున్న ఒజ్జ శ్రద్ధగా తంతు నడుపు తున్నాడు. పెళ్లికూతురు నెలవంకకీ, పెళ్లికొడుడు పోలడికీ కర్ణాల్లో ఏదో చెబుతూ మనువు జరుగుతున్న సరళికి ప్రాముఖ్యత తెస్తున్నాడు. అతనికి సహాయ కారిగా నిలుచున్న పూజారులు, వెజ్జులు, లెంకలు కాకరబీకరగా మంత్రాలు చదువుతున్నారు. వారికి కాస్త దూరంగా నలుగురు గురువులు ఏవేవో స్తోత్రాలు వల్లెవేస్తున్నారు.

ఆ గురువులెవరో అక్కడివారెవరికీ పెద్దగా పరిచయం లేదు. ఇంకా చెప్పాలంటే కరుకుపుట్టు నివాసులు చాలామంది ఇప్పుడే వారిని చూస్తున్న ట్టున్నారు. ఈ విషయాలు వేటితోనూ సంబంధం లేదన్నట్టుగా కొద్దిపాటి దూరంలో పెళ్లికూతురు తండ్రి జంగయ్య బగత, అతని భార్య నీలమ్మ కరపీడన కార్యాన్ని ముచ్చటగా తిలకిస్తున్నారు.

ఈ సమయంలోనే మాకలిశక్తి పెళ్లి అరుగుమీదికి ఖణీగా దృష్టి సారించింది. ఈసారి మటుకు అరుగు పక్కనే నిలుచున్న నలుగురు గురువులూ ఆమె కళ్లల్లో పడ్డారు. వారు పఠిస్తున్న స్తుతులూ చెవులను తాకాయి. దీంతో ఆమె కొద్దిపాటి అక్కజానికీ లోనయింది.

‘తానెప్పుడూ కొండ వివాహాల్లో ఇలాంటి లెంకలను చూడలేదే. ఇలాంటి కొత్తగళాల సరికొత్త పదాలనూ వీనులకు చేర్చుకోలేదే.’ అనుకుంటూ ఉండిపోయింది. ఏదేదో యోచిస్తుండగానే హఠాత్తుగా జంగయ్య బగత ఆహార్యం వైపు ఆమె నేత్రాలు పారాయి. విస్మిత అయింది.

‘కరగ్రహణాలు నిర్వహిస్తున్నప్పుడు మిట్టల్లో పెళ్లిపెద్దల కట్టూబొట్టూ మిగిలినవారితో పోలిస్తే ప్రత్యేకంగానే ఉంటాయి. కాదనలేం. కానీ గిరిజనానికి అలవాటులేని పద్ధతిలో ఈ రోజు జంగయ్య కని పిస్తున్నాడు. మున్నెన్నడూ తనెక్కడా చూడని విధంగా అడ్డ జంధ్యాలు వీపున వేళ్లాడేసుకుని అగుపిస్తున్నాడు. ఈ జంరaప్పోసలు మన భూధరాల మీదికి ఎలా వచ్చాయి? ఇలా ఎందుకవుతోంది. మనవి కాని విధానాలను మనం మరెందుకు నెత్తికెత్తుకుంటున్నాం?’ మౌలికమైన ప్రశ్నలు తలను తగులుకోవడం మాకలికి మొదలయింది. ఆ ప్రశ్నల పరంపర ఆమెలో కొంత అసహనాన్నీ, మరికొంత అనుమానాన్నీ పుట్టించింది. దీనికి తోడు నలుగురు గురువులూ చేరి జంగయ్య దంపతుల చేత కన్యాదానం పేరుచెప్పి ఏదేదో చేయించడంతో మాకలి మనసు రaల్లుమంది.

‘కన్యాదానం మనకెక్కడిది. మనమేం కిందివారం కాదు కదా. మన పిల్లను పెళ్లికొడుక్కిచ్చి వివాహం చేయడమే ఎక్కువ. దానం అంటారేంటి? కొండల్లోకి కొత్తగా ఏవేవో తెచ్చిపెడుతున్నారేంటి? పిల్లల్ని పుట్టించగల స్త్రీలే అపరబ్రహ్మలు. వాళ్లకు మిట్టల మీద ఎంతో గౌరవం. అలాంటి వారిని దానం చేయడానికి సిగ్గుండొద్దా?’ డెందాన్ని డెక్కెడ బెట్టుకుంది.

కొన్ని క్షణాలు దొర్లిపోయాక, వీలయినంత మంచిగానే ఎలుగుపెంచి, జంగయ్యబగతను రణగొణధ్వని పెళ్లిమండపాన కేక వేసి పిలిచింది.

మాకలమ్మమాట వినపడగానే ఉలిక్కిపడి నట్టయ్యాడు జంగడు. చేపట్టిన పెళ్లిక్రియను భార్యకు అప్పగించి రాజమాత దగ్గరకు చేరాడు. ఆనతి ఇవ్వమన్నట్టుగా నిలబడ్డాడు.

‘‘జంధ్యం వేసుకున్నావేంటి. మనలో ఈ పద్ధతులు ఎప్పుడొచ్చాయి? ఆ సరికొత్త పెద్దలెవరు.’’ అడగ వలసిందేదో మెత్తగానే అడిగేసింది మాకలి. కలవర పడ్డాడు జంగయ్య. కొద్దిగా హడావుడీ పడ్డాడు.

‘‘మరేం లేదు. మరేంలేదు.’’ తడబడ్డాడు.

‘‘ఫరవాలేదులే చెప్పు. నా బిడ్డలాంటివాడివి. నిష్పూచీగా పలుకు.’’ మాకలి భరోసా ఇవ్వడంతో మెల్లగానే ఆమె చెవి చెంతకు చేరి,

‘‘ఆ నలుగురు గురువులూ గౌరీపట్నం కందాళ గురువులమ్మా. ఈ మధ్యనే మాకు మార్గదర్శకు లయ్యారు. మా బగతలందరిచేతా పూజలు చేయించారు. జంధ్యాలు తొడిగించారు. నా బిడ్డ పెండ్లి దగ్గరుండి జరిపిస్తున్నారమ్మా.’’ జంగయ్య చెప్పుకొచ్చాడు. ఉలిక్కిపడినట్టయింది మాకలి. ఏదో అంతుపట్టనట్టూ అయింది. కొన్ని క్షణాలకే తేరుకుని,

‘‘గౌరీపట్నం అంటే వడ్డాది రాజ్యం కదా! ఆ పల్లాన ఉన్నవారు నీకెలా పరిచయం?’’ చేష్టలుడిగి నట్టయి చిన్నగా ప్రశ్నించింది. అందుకు మురిసి పోతున్నట్టుగా ముఖం పెట్టి,

‘‘గౌరీపట్నం ఇప్పుడు మనదే కదమ్మా. మన గన్నియమ్మ రాజ్యం. కందాళం వారే కాదు. చాలా మంది పల్లపు స్వాములు అచలానికి వచ్చి ఇప్పుడు మనవాళ్లకి భక్తిశ్రద్ధలు నేర్పిస్తున్నారు. నాగరికులు చెప్పింది వింటే మంచిదని జంధ్యం వేసుకున్నాను. వాళ్లు మనకంటే గొప్పవారమ్మా. వాళ్లతో పోలిస్తే మనమెంత. దానాల్లోకెల్లా గొప్పదానమని వారు చెబితేనే కన్యాదానం చేస్తున్నాను. అల్లుణ్ణి కూడా ఎంచి ఎంచి తెచ్చుకున్నాను. సొంత ఊళ్లోని బంధువుల సంబంధాలు కాదని సుజనకోట నుంచీ నా స్థాయికి తగ్గ సూకూరి బగత జంధ్యపాడినే తీసుకువచ్చాను. మన గిరికట్టు ప్రకారమే అయితే పెళ్లికొడుకు ఇంటనే వివాహం జరగాలి. మారిన కాలాన్ని బట్టి పిల్ల ఊళ్లోనే పెళ్లి పెట్టుకున్నాం.’’ బిరబిరా జంగయ్య చెప్పుకొచ్చేయడంతో మాకలి శిరస్సు వెయ్యిచెక్కల యినట్టుగా అయిపోయింది. ఆమె శరీరమంతా అప్పటికప్పుడే స్వేదంతో నిండిపోయింది. ముఖానికి పట్టిన చెమట ధారలుధారలుగా కింది మేనుకు ప్రవహించిపోయాయి. స్తబ్దుగా మారిపోయింది.

‘వాళ్లు నాగరికులా! మరి మనం ఎవరం? మనల్ని మనమే తక్కువ చేసుకునే పిదపకాలం వచ్చిందేంటి? ఏనాడూ చెక్కుచెదరని మన స్వాభిమానం నేడు ఏమవుతోంది? ఇంతటి ఆత్మ న్యూనత ఎందుకు కొండలను చుట్టుకుంటోంది? స్థాయీభావాలు ఏ రకంగా పొడసూపుతున్నాయి? దీనంతటికీ రాచగన్నియ వివాహమే మూలకుదురు కావడంలేదు కదా!’ ఎప్పుడయితే ఇలాంటి తలపోతలు ఆమెను పట్టిపీడిరచడం మొదలైందో ఒక్కపెట్టున బేలగా మారిపోయింది.

మాకలమ్మ అలా గడబిడ పడిపోవడం జంగయ్యకు అస్సలు అర్థం కాలేదు. అంతలేసి చెమటలతో ఆమె అకస్మాత్తుగా ఆరడి పాలవడం అతనికి బోధపడనేలేదు. ఆనప దిప్పతో నీళ్లు తీసుకువచ్చి అందించాడు. ఆ జీవజలాన్ని గబగబా తాగేసింది మాకలి. చీరచెంగుతో తనకుతానే గాలి పోసుకోవడం మొదలుపెట్టింది. ఇంతలోనే నీలమ్మ పరుగున వచ్చి విసనకర్రతో వీవన మొదలెట్టింది.

ఇకను తను అక్కడ ఉండకూడదని అనుకుంది మాకలి. మెత్తగానే స్వరాన్ని కదిలిస్తూ జంగయ్య దంపతులను ఉద్దేశించి,

‘‘వెళ్లిరానా! రాచనగరు కట్టుబాట్లు మీకు తెలిసినవే కదా!’’ అనునయంగా పలికింది. ఇందుకు స్పందిస్తున్నట్టుగా,

‘‘ఇప్పటికే మా మీద ప్రేమతో మండపంలో చాలాసేపు గడిపారు. దేవుణ్ణయినా హెచ్చుగా కోరకూడదు. తమ ప్రయాణానికి అన్నీ చిటికెలోనే సిద్ధపరుస్తాం.’’ జంగయ్యసతి పలికింది.

‘హమ్మయ్య’ అనుకుంది మాకలి. గుర్రాలమీద ఏవేవో కానుకలు వెంటరాగా ఆమె పల్లకీ బయలుదేరింది. మేనా పైకి లేవగానే,

‘‘విక్రమార్క జయహో.. నందరాజ్యానికీ జోర.. మహాదేవి మాకలిశక్తికీి జై..’’ నినాదాలు జనం నోటినుంచి వెల్లువెత్తి ఆకాశాన్ని తాకాయి.

*       *       *

కరుకుపుట్టు నుంచి ఎలా వచ్చిందో తెలియ దన్నంతగా రాజభవనానికి వచ్చిపడిపోయింది మాకలి శక్తి. ఆమె మానసం గుండమైనట్టుగా ఉంది. చింతన లేవేవో శిరసున చితిమంటలు రేపుతుండగా బతి కుండానే కాలిపోతున్నట్టుగా అవుతోంది. అందుకనే మెత్తని శయ్య మీద ఉన్నా ముళ్లమీదనే కూర్చు న్నట్టుంది. మాకలి ఎదుర్కొంటున్న ఈ ఉపస్థితికి ఆమె అనుంగు చెలికత్తె నెమలిజాణా నలిగిపోతోంది.

ఉదయం పెళ్లికి వెళ్లేవరకూ చక్కగానే ఉన్న మహాదేవి, కరుకుపుట్టు నుంచి వచ్చేసరికల్లా ఈ విధాన ఎందుకు మారవలసివచ్చిందో నెమలికి అర్థం కాలేదు. ఇంతకు ముందర రాణీగారి వ్యాకులత లెన్నింటినో ఆమె చూడకపోలేదు. రాణీవాసపు కష్టాలు, నష్టాలు ఎరుగనిదీ కాదు. కానీ, ఇప్పటి గతి వేరుగా కనిపిస్తోంది.

ఒకటీ రెండూ కాదు. దాదాపు నలభైయ్యేళ్లుగా రాజమాతకు సేవలు చేస్తోంది నెమలిజాణ. మాకలిని మహారాణీగానూ చూసింది. పూర్వసువాసినిగానూ చూసింది. రాజమాతగానూ చూసింది. దాసీగా మాకలికి ఆమె ఎన్నడూ సేవలు చేసిందే లేదు. కన్నతల్లికి కన్నబిడ్డ చేస్తున్న ప్రేమలసాయంగానే వృత్తిని భావిస్తూవచ్చింది. మాకలీ అంతే. నెమలిపక్కనుంటే పుట్టినిల్లే పక్కనున్నంతగా తేటపడుతుంది. ఆ చనువుతోనే,

‘‘చెప్పకూడని బాధ ఏదయినా తమరు పడుతుంటే గనక చెప్పనవసరం లేదు. నాతో పంచుకోదగ్గ పరిణామమే అయితే చప్పున బయల్పరచండి. కష్టాలబరువు తగ్గుతుంది.’’ శయ్యమీద పరుండిన మాకలి తలను నెమ్మదిగా నిమురుతూ అడిగింది నెమలి. ఆ మాటకు వెంటనే లేచికూర్చుంది మాకలి.

‘‘నీకు చెప్పకూడనివి ఉంటాయా నెమలీ. నువ్వూ నేనూ వేరు కాదే. కాకపోతే,’’ మాట మధ్యలోనే అగిపోయింది.

‘‘ఆగిపోయారెందుకమ్మా.’’ విసనకర్రతో వీవన వీస్తూనే స్థిరంగా పలికింది. సర్దుకుంది మాకలి. సమస్యను తేలికచేసి చెబితే తనకూ వినేవారికీ మంచిదన్న ఒకానొక సంభూతి ఆమెకు కలిగింది. అంతటి యాతనా దిగమింగుకుంటూనే,

‘‘కొండల్లో బగతలు జంధ్యాలు ధరిస్తున్నారే. కన్యాదానాలు చేస్తున్నారు.’’ కొత్త విషయమేదో చెప్పినట్టుగా నెచ్చెలి దగ్గరగా జరిగి మరీ చెప్పింది. ఆకర్ణించిన నెమలిజాణ పెద్దపెట్టున నవ్వింది. అదేమీ తనకు కొత్త విషయం కాదన్నట్టుగా నవ్వింది. మాకలికి తెలియాల్సినవి చాలా ఉన్నట్టుగానూ నవ్వింది.

‘‘ఎందుకే అలా హసిస్తున్నావు.’’ ఏదో అనుమాన పడుతున్నట్టుగా అడిగింది రాచపెద్ద.

‘‘బగతలే జంధ్యాలు వేసుకుంటున్నారని మీరనుకుంటున్నారు. వాళ్లని చూసి కొటియాలూ తయారయ్యారు. జంధ్యాలు ధరించి తామూ బగతలు కావాలనుకున్నారు. కట్టుబాట్ల కారణంగా చిట్టి బగతలుగా స్థిరపడ్డారు. జంధ్యాల బలిమిని అంతే తెలివిగా ఎదుర్కోవాలనుకున్న కమ్మర్లు మరో అడుగు ముందుకువేశారు. బలిఘట్టం గంగనందాచార్యకు అనుయాయులుగా మారిపోయారు. మాంసం తినడం మానేశారు. జంరaప్పోసలతో ఓజులైపోయారు. వాల్మీకులయితే పశుమాంసాన్ని వదిలిపెట్టి, గుర్తేటి సిద్ధాంతులను పట్టి, ఆలయాలు కడుతున్నారు. ఇంకా చెప్పాలంటే, బాకూరు వారు రాజులవుతున్నారు. సీకరివారు దొరలవుతున్నారు. లగిసిపిల్లివారు పాత్రుళ్లవుతున్నారు. పాతకోటవారు పడాళ్లవు తున్నారు. డోకులూరువారు నాయుళ్లవుతున్నారు. ఇందువల్లే ఎన్నడూ లేని కులభేదాలు మెరకల మీద పొడుచుకువస్తున్నాయి.’’ తనకు తెలిసినదంతా చకచకా చెప్పుకొచ్చేసింది. దెబ్బకి నోరు వెళ్లబెట్టింది మాకలి. జంగయ్య కూతురి పెళ్లిలో తను చూసిన దృశ్యాలకూ ఇప్పుడు నెమలి చెబుతున్న విషయాలకూ పొంతన ఉన్నట్టుగా ఆమెకు ధృవపడిపోయింది.

(ఇంకా ఉంది)

About Author

By editor

Twitter
YOUTUBE