‘నేను గుజరాత్‌లో పుట్టి పెరిగాను…’ అన్నాడతడు. ఇందులో తప్పేమీ కనిపించదు. తరువాతే ఓ ప్రమాదకర మలుపు తిప్పాడు సంభాషణ, ‘ఆ గుజరాత్‌లో బతికి ఉన్నాను కూడా!’. అంతే, ఆ వాచాలతలో అసాధారణమైన హాస్యమేదో పొంచి ఉన్నట్టూ, అది తమని ఉర్రూతలూగించినట్టూ పెద్ద పెట్టున నవ్వుతారు ప్రేక్షకులు. దీనికి ముక్తాయింపూ ఉంది. ‘నేను బతికి బయట పడ్డాననే అనుకుంటున్నాను. ఎలాగంటే, ఆ (గుజరాత్) రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయడంలో విఫలమై నందువల్లనేనని నా అభిప్రాయం’. ఈ మాట రెట్టింపు కిక్కు ఇచ్చినట్టే ఈలలూ, కేరింతలూ, తప్పట్లు. ఇది 2021 ఆరంభంలో ఏర్పాటు చేసిన కొత్త సంవత్సర వేడుకలలో ఏర్పాటు చేసుకున్న ఉబుసుపోక ప్రదర్శన. దాని పేరే స్టాండప్ కామెడీ. అందులో వినపడిన ‘హాస్యం’ ఇది. ఆ కమేడియన్ మున్వర్ ఫారుఖి. మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో ఇది జరిగింది. ఇది ప్రధాని నరేంద్ర మోదీ మీద పరోక్ష విమర్శ. అలాగే ఎందుకు అనుకోవాలి! అనుకోవచ్చు. ఆ స్టాండప్ కమేడియన్‌కే కాదు, దేశంలో దాదాపు పేరుమోసిన మరొక పాతిక ముప్పయ్ మంది ఆ బాపతు విదూషకులకి ఇదే పని. మోదీ మీద ముతక వ్యంగం, ప్రమాదకర హాస్యం సృష్టించాలన్న దుగ్ధ. ఇందోర్‌లోనే స్థానిక బీజేపీ నాయకుని కుమారుడు, హిందూ రక్షణ సంఘటన సభ్యుడు ఏకలవ్య గౌర్ వేదిక మీదకి వచ్చి ప్రేక్షకులని ప్రశ్నించాడు, ‘ఇతడు మున్వర్ ఫారుఖి. మన దేవతల మీద జోకులు వేస్తూ నవ్విస్తాడు. ఇలాంటి చెత్తని డబ్బులిచ్చి మరీ చూడడానికి మీకు సిగ్గనిపించడం లేదా?’ అని. ‘అబ్బే అదేమీ లేదు. నేను ఇస్లాం మీద కూడా జోకులేస్తా. త్రిపుల్ తలాక్ మీద కూడా’ అని వివరణ ఇచ్చాడు మున్వర్. నిజానికి ఇదే అసలు జోక్. తలాక్ మీద జోక్ వేయడమంటే వాళ్ల ప్రవక్త మీద జోక్ వేయడం కాదు కదా! తరువాత ఇతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతడు ముస్లిం కాబట్టి, బీజేపీని విమర్శించాడు కాబట్టి ప్రభుత్వం అరెస్టు చేయలేదు. కానీ ఇతడి మిత్రులు, మన గుడ్డి మేధావులు ముక్తకంఠంతో ఒకటే చెప్పారు, ‘అతడు మైనారిటీ కాబట్టి అరెస్టు చేశారు’. ఈ వార్తను ఫిబ్రవరి5, 2021న నమోదు చేసిన ‘లాస్‌ఏంజెలెస్’ పత్రిక సరిగ్గా ఇదే అభిప్రాయాన్నే ప్రకటించింది. కాబట్టి ఈ విదూషకులందరికీ లంకె ఉందనుకుంటే పొరపాటు కాదు.
2014లో హిందుత్వ మోదీ వచ్చిన తరువాత 14 శాతం ఉన్న ముస్లింలను లక్ష్యం చేసుకున్నది అని ఒక కువ్యాఖ్య కూడా జోడిరచింది ఏంజలిస్. దానికి ఈ కేతిగాడి ప్రదర్శన, అరెస్టే సాక్ష్యంగా జమేసుకోమంటున్నది. మోదీని విమర్శిస్తే చాలు, దేశద్రోహం కేసు పెట్టి జైళ్లల్లో పడేస్తున్నారని కూడా తేల్చిపారేసింది. ఇటీవల స్టాండప్ కామెడీ పేరుతో బీజేపీ, హిందుత్వం మీద జరుగుతున్న అసహ్యపు దాడికీ, దాని రీతికీ ఇదొక్క ఉదాహరణే. గుజరాత్ ప్రభుత్వం మీద ఇంత పెద్ద నిందతో సాగిన వ్యాఖ్యలివి. గుజరాత్‌కు పూర్తికాని లక్ష్యం అన్న అతడి వాగుడుకు అర్ధం ఏమిటో జనానికి తెలియదనే అనుకుంటున్నారా? ఇది పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగడం వంటిది. నిజానికి హిందూ`ముస్లిం రగడను ఏదో విధంగా కొనసాగించడానికి ఇదంతా హాస్యభరితంగా సాగుతున్న యత్నం. కానీ ఇదంతా భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగంగానే చూడాలి, నేర్చుకోండి! అంటోంది భారతీయ మేధోలోకం. ఈ మాత్రం స్వారస్యం, హాస్య చతురత, అర్ధం చేసుకునే విశాల హృదయం, కళాపోషణ లేకపోతే ఎలా? అంటోంది, అంతర్జాతీయ హక్కుల శిబిరం. ప్రపంచంలోనే ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో కొన్నిసార్లు న్యాయస్థానాలు కూడా, ‘నింద ఎలాంటిదో అన్న అంశం కంటే, నిందితుడు ఎవరో!’ అనే చూస్తున్నాయని, సంజయ్ హెగ్డే, ఓ లాయర్ పెద్దాయన ఆక్రోశాన్ని కూడా ఆ పత్రిక నమోదు చేసింది. మున్వర్ ఇలా ప్రదర్శనలు ఇస్తూ ఉంటాడు. అవన్నీ వైరల్ అయి దేశం మీద పడి స్వైరవిహారం చేస్తూ ఉంటాయి. గొడవలవుతూనే ఉంటాయి. అయినా, పోలీసులు ప్రాథమిక దర్యాప్తు కూడా జరపకుండానే ముద్దుల కమేడియన్‌ని అరెస్టు చేసి తీసుకుపోయారని మున్వర్ అభిమానగణం గోల చేసింది. ఇంతకీ మున్వర్ చిన్నతనంలోనే గుజరాత్‌ని వదిలి, ముంబై చేరాడు. ఆ దేవరహస్యం మాత్రం చెప్పరు. ఇతడి గురువు కూడా కమేడియనే. పేరు సాద్ షేక్. ‘నేను నా శిష్యుడిని రాజకీయాల జోలికి పోవద్దని చెప్పాను. అయినా ముస్లింలని లక్ష్యంగా చేసుకోవడం చాలా సులభం’ అంటూ తనదైన బుద్ధిని చాటుకున్నాడు. ‘ఔనౌను! మోదీ ప్రభుత్వ హయాంలో హాస్యం మీద రోజురోజుకీ దాడి పెరిగి పోతోంది. ఆఖరికి పెరుగుతున్న వంట గ్యాస్ గురించి మాట్లాడినా ఆయన అభిమానులు ధ్వజమెత్తుతున్నారు’ అంటాడు మరొక స్టాండప్ కమేడియన్ అదితీ మిట్టల్. మున్వర్‌పై కేసు ఉదంతానికి తెగ బాధపడిపోతూ సంజయ్ రాజౌరీ అనే ‘ఆసీ తాసై’ ‘ప్రజాస్వామిక వ్యంగ్య సంఘం’ సభ్యుడు ‘ఇది కుళ్లిన సంఘం’ అని ఆక్రో శించాడు. పాపం, ఇలా కేసులూ అవీ అంటే అతడి బతుకేంగాను! అతడికి ప్రదర్శనలు ఎలా వస్తాయి? అని కూడా నిలదీశాడు, ఈ ‘కుళ్లిన’ సమాజాన్ని. మధ్యప్రదేశ్ న్యాయమూర్తిగారు మాత్రం, ‘నీ వ్యాపారం కోసం ఇలా వాగడమేనా?’ అని గట్టిగానే అడిగారు. అగ్రిమా జాషువ అనే ఆవిడ అరేబియా సముద్రం ఒడ్డున శివసేన కూటమి శివాజీ విగ్రహం ప్రతిష్టించడం గురించి జోకులు కురిపించింది. అది కూడా స్టాండప్ కామెడీయే (ట). సాక్షాత్తు ఆ రాష్ట్ర హోంమంత్రి అరెస్టుకు ఆదేశాలు ఇవ్వడంతో కాళ్ల బేరానికి వచ్చి, క్షమాపణలు చెప్పింది. చాలామంది మరాఠీలు, ఇతరులూ కూడా ఒళ్లు దగ్గరెట్టుకోమని మందలించారు.
వీళ్ల ధోరణి చూస్తుంటే కన్యాశుల్కంలో కరటకశాస్త్రి చెప్పిన సంభాషణ గుర్తుకు వస్తుంది. యాంటీనాచ్‌లలో చాలా రకాలు ఉంటారట. కొందరు పగలు యాంటీ నాచ్. రాత్రి ప్రోనాచ్. కొందరు సొంతూళ్లో యాంటీనాచ్. పొరుగూరులో ప్రోనాచ్. అలాగే మోదీని విమర్శించే విదూషకులను అరెస్టు చేస్తే అది భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం. కానీ మోదీ అనుకూల, కాంగ్రెస్ వ్యతిరేక జర్నలిస్టుని అరెస్టు చేయడం, పైగా దానిని సుప్రీంకోర్టు తప్పు పట్టడం ఘోరాతిఘోరమైన తప్పిదం. కునాల్ కమ్రా అనే గంథోళీగాడు ఈ కేసులో సుప్రీం కోర్టుని వెక్కిరించి ప్రసిద్ధుడయ్యాడు. కాంగ్రెస్‌నూ, దాని అంగుష్టమాత్ర నేతలను విమర్శించినందుకు శివసేన ప్రభుత్వం కక్ష కట్టి అర్నబ్ గోస్వామిని అరెస్టు చేయిస్తే, సుప్రీంకోర్టు అడ్డం పడిరది. అదే కమ్రాకి అసలు నచ్చలేదు. గోస్వామికి బెయిల్ ఇచ్చినందుకు సుప్రీంకోర్టు మీద జోకులేశాడు. క్షమాపణ చెబుతావా లేదా? అని గద్దించింది అత్యున్నత న్యాయస్థానం. అత్యున్నత అధికారం, పలుకుబడి ఉన్న సంస్థలు కూడా ఈ కాస్త హాస్యాన్ని కూడా సహించలేకపోతే, ఈ దేశంలో హాస్యగాళ్ల గతేమి కాను? అని కమ్రా వాపోయాడు. రాయల్ అండ్ ఫీల్డ్ ద్విచక్ర వాహనాన్ని చూస్తే హర్లే డేవిడ్‌సన్‌కీ, రాజదూత్‌కీ పుట్టిన అక్రమ సంతానంలా ఉంటుందని ఒక కమేడియన్ వాగి చిక్కుల్లో పడ్డాడు. మరొకడు, వినాయకుడంటే తండ్రి తల నరికిన దేవుడు, ఆయన్ని పూజిస్తున్నారని మరొకడు నోరు పారేసుకున్నాడు.
‘అతడి కంటె ఘనుడు ఆచంట మల్లన్న…’ అన్నట్టు, వీళ్లందరి రికార్డు బద్దలుకొట్టదలచిన వీర విదూషకుడు `వీర్‌దాస్. ‘నేను రెండు ఇండియాల నుంచి వచ్చాను…’ అంటూ నవంబర్ 15, 2021న ఇతడు అమెరికా నుంచి ఒక వీడియో ప్రపంచం మీదకు వదిలాడు. వాషింగ్టన్ డిసిలోని కెనెడీ సెంటర్‌లో ఈ ప్రబుద్ధుడు వాగినదే అది. ‘భారత్‌లో స్త్రీని పగలు దేవతంటారు. రాత్రైతే సామూహిక అత్యాచారం చేస్తారు’ అని కూశాడు అందులో. అలాగే, ‘శాకాహారిగా ఉండ డమే గొప్పతనంగా భావించే దేశంలో, ఆ శాకాలను పండిరచే రైతులను జీపులు ఎక్కించి చంపుతున్నారు’ అని కూడా వాగాడు. దీని మీద చాలామంది భారతీయులు ధ్వజమెత్తారు. నేను భారత్‌లో భేషజం ఎలా ఉందో చెప్పానంతే అంటు న్నాడు వీర్. దీనికి కాంగ్రెస్ వాళ్లు వంతపాడారు. అతడికి స్టాండప్ అంటే ఏమిటో నిజంగా అర్ధమైంది. స్టాండప్ అంటే సత్యం కోసం నిలబడ డమే అని ఘనమైన భాష్యం వెలగబెట్టారు శశి థరూర్. ఆ మాత్రం భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండొద్దా అన్నారు కపిల్ సిబల్. కానీ అభిషేక్ మను సింఘ్వి మాత్రం విదేశాలలో కూర్చుని ఇదేం వాగడు అని అనగలిగాడు. ఈ తిష్టన్మూత్రులకి బీజేపీనీ, మోదీనీ విమర్శించే క్రమంలో,తాము మహిళలను ఘోరంగా అవమానిస్తున్నామన్న స్పృహ కూడా చచ్చి పోతోంది. ‘వీర్ వ్యాఖ్య నన్ను నిలువునా కుదిపేసింది సుమా! ఇలాంటి వ్యాఖ్య చేయడమంటే దమ్ము లుండాలి!’ అంటూ మహిళ అయి ఉండి కూడా బాలివుడ్ వెండితెర వేలుపు పూజాభట్ నిస్సిగ్గుగా ప్రపంచానికి సందేశించింది. ఇదంతా మెత్తని ఉగ్రవాదం కాదా అంటూ కంగనా రనౌత్ చీల్చి చెండాడారు. నెవిల్లే షా అనే కమేడియన్ రిజర్వేషన్ల మీద పడ్డాడొకసారి. ‘ప్రాణాలు కాపాడే కోర్సులలోకి రిజర్వేషన్‌లతో ప్రవేశం ఏమిటో నాకు అర్ధమే కాదు!’ అన్నట్టు వ్యాఖ్యానించి చావు తప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఈ వ్యాఖ్య కూడా మేధావులకు వినసొంపుగానే ఉందని భావించాలి. అందుకే ఖండిరచలేదు. కానీ, అంతో ఇంతో విజ్ఞత ఉండే సాధారణ నెటిజన్లు తిట్టిపోశారు. దానితో క్షమాపణ చెప్పాడు నెవెల్లి. తాగిన వాడిలా వాగడం, ఆపై ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదనడం. దేశంలో అందరికీ మామూలైపోయింది. ఇక ఈ బాపతు కమేడియన్ల సంగతేం చెప్పాలి!
మోదీ మీద స్నాప్‌చాట్ చేసినందుకు తన్మయ్ భట్ అనే స్టాండప్ కమేడియన్ మీద కూడా ముంబై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. మాసూమ్ రాజ్వాణి మీద కూడా హిందూ దేవుళ్లను కించ పరిచినందుకు కేసు నమోదైంది. కోర్టులో మద్యపానం చేసే సన్నివేశం తగిలించినందుకు కపిల్ శర్మ అనే బుల్లితెర స్టాండప్ కమేడియన్ కేసులో ఇరుక్కున్నాడు.
2005 నాటి ది గ్రేట్ ఇండి యన్ లాఫర్ చాలెంజ్‌తో ఈ పనికిమాలిన ప్రదర్శనలకి ఇక్కడ అంకురార్పణ జరిగింది. 2009లో ముంబైలో మొదలుపెట్టిన ది కామెడీ స్టోర్ కార్యక్రమంతో దేశంలో ఈ స్టాండప్ గోల ఎక్కువయింది. అంటే ఇదీ ఇంగ్లండ్ నుంచి బిచ్చమెత్తుకున్నదే. దీనికి యూట్యూబ్ తోడయింది.
అసలు వీళ్లకి హిందూ దేవుళ్లపైనే జోకులు వేయాలని ఎందుకు అనిపిస్తుంది? హిందువుల మీద, బీజేపీ మీదనే విరుచుకుపడిపోవాలని ఎందుకు అనిపిస్తుంది? భారతీయులు స్త్రీని పగలు దేవతగా పూజిస్తారు రాత్రి సామూహిక అత్యాచారం చేస్తారు అని అత్యంత నీచంగా నింద మోపినవాడికి పక్కనే ఉన్న అఫ్ఘానిస్తాన్‌లో ఏం జరుగుతున్నదో తెలియదా? బొకొ హరాం (ఆఫ్రికా) అనే ముస్లిం మతోన్మాద ఉగ్రవాద సంస్థ ఎంతమంది అమాయక ముస్లిం బాలికలను అంతర్జాతీయ సెక్స్ మార్కెట్‌లో నిలబెట్టి వేలం వేసిందో తెలియదా? అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ అధికారంలో వచ్చిన కొద్దిగంటలకే నజర్ మహమ్మద్ అనే కమేడియన్‌ని నిర్దాక్షిణ్యంగా చంపేసిన సంగతి ఈ కేతిగాళ్ల సమూహానికి ఎందుకు గుర్తుకు రావడం లేదు? తాలిబన్ మీద, వాళ్ల అకృత్యాల మీద ఎందుకు జోకులు పేలవు? పాకిస్తాన్‌లో, బంగ్లాదేశ్‌లో హిందువుల మీద జరుగుతున్న అత్యాచారాల మీద, లవ్ జిహాద్ మీద ఎందుకు వ్యంగ్యాస్త్రాలు జాలు వారవు? శాకాహారం తినే దేశంలో కాయగూరలు పండిరచే రైతులను జీపులు ఎక్కించి చంపేస్తారని అమెరికాలో అంత ధీమాగా చెప్పిన వాడికి, దొంగ రైతులు, సాటి దొంగ రైతునే చేతులు నరికి, తల వేరుచేసి పడేశారని ఎందుకు తెలియలేదు? ఇతడు రెండు ఇండియాల నుంచి వచ్చాడట. అనుకోకుండా నిజమే చెప్పాడు. ప్రజానీకం బీజేపీని అభిమానించి, ఓట్లు ఇచ్చి పార్లమెంటుకు పంపుతుంది. అదొక భారత్. ఇక్కడ జరిగేవన్నీ అకృత్యాలేనంటూ ఇలాంటి అబద్ధాల కోరులు అంతర్జాతీయ వేదికల మీద చూపించే భ్రమాజనిత భారత్ మరొకటి. మోదీని రక్తపిపాసి అన్నవాళ్లు బయటే తిరుగుతున్నారు. ‘హిందూ ఫాసిజం’ అంటూ గొంతు చించుకునే కిరాయి వాగుడుకాయలు హాయిగా ఉద్యమాలు చేసుకుంటున్నాయి. అయినా ఇక్కడ వాక్‌స్వాతంత్య్రం ఏదీ, ఎక్కడ అంటున్నారు. మోదీ మీద నిందలేయ కుండా పేపరు వెలువరించలేని సంస్థలు కోకొల్లలు. తిట్టని టీవీ చానళ్లు కొన్నే.
కానీ వాటి మీద అత్యవసర పరిస్థితి ఫేం సెన్సార్‌షిప్ లేదు. అన్నట్టు రెండు ప్రపంచాలు ఉన్న సంగతి వీళ్లకి తెలియడం లేదు. మోదీని అత్యున్నత ప్రధాని అని కొనియాడే ప్రపంచం ఒకటి. ఇలాంటి వాళ్ల సొల్లు ఆబగా వినే మడ్డి ప్రపంచం ఒకటి. ఇవన్నీ వింటూ ఉంటే స్టాండప్ కామెడీయన్లంటే తిష్టన్మూత్రుల మందలా అనిపించడం లేదా? ఆ ప్రేక్షకులు చూసి ఆనందిస్తున్నది దానినే.