రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌కు ఎదురుగాలి వీస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తుండగా.. అంతర్గత సర్వేల్లోనూ, బయటి సర్వేల్లోనూ పార్టీ గ్రాఫ్ గణనీయంగా పడిపోయింది. ఇక, ప్రభుత్వ పాలనాశైలిని గమనిస్తే గర్వకారణమైతే ఏదీ కనిపించడం లేదు. పార్టీ గ్రాఫ్‌ను కాపాడేందుకు ఏ అంశమూ నిలబడే పరిస్థితి కానరావడం లేదు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపొందినప్పటికీ దీనిని టీఆర్‌ఎస్ ‘ఘన’ విజయంగా చెప్పలేమని విశ్లేషకులు భావిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థి రవీందర్‌సింగ్ అధికార పార్టీకి గట్టిపోటీ ఇచ్చారు. అంతేకాదు ఆదిలాబాద్, మెదక్, ఖమ్మంలోనూ క్రాస్ ఓటింగ్ జరిగింది. టీఆర్‌ఎస్ ఓట్లు కాంగ్రెస్, బీజేపీలకు పడినట్లు తెలుస్తోంది.
రెండో విడత అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్ సర్కారు పాలన తీరుపై జనం పెదవి విరుస్తున్నారు. రెండు ఉపఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి పాలయింది. రాష్ట్రానికి గుండెకాయలాంటి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నేల విడిచి సాము చేసినట్లుగా కొత్త పథకాలు ఇబ్బడి ముబ్బడిగా ప్రకటిస్తోంది. కేవలం హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం దళితబంధు పథకాన్ని తెరమీదకు తెచ్చారు. ఇప్పటికే రాష్ట్రం రూ. 2.38 లక్షల కోట్ల అప్పుల్లో ఉండగా.. ప్రతినెలా సగటున రూ.4,050 కోట్లకుపైగా అప్పు చేయడం అనివార్యమవుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వంతో తగవు పెట్టుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టీఆర్‌ఎస్ సర్కారు ప్రజా విశ్వాసాన్ని కోల్పోతోం దన్న సంకేతాలు వస్తున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోందని సర్వేల్లో తేలుతోంది. ఫలితంగా రానున్న రెండేళ్ల కాలం కేసీఆర్ సర్కారుకు గడ్డుకాలం కానుందంటున్నారు. ఈ మూడేళ్లలో పార్టీకి ఎదురైన పరాజయాలు, వివిధ వర్గాల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. ఈ అసంతృప్తికి కారణం.. ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేక పోవడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి భిన్నంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడమేనని అంటున్నారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా టీఆర్‌ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు గెలుచుకున్న సీట్ల కన్నా రెండోసారి ఎన్నికల్లో అంతకు మించి మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో 63 స్థానాలు గెలుపొందగా, 2018 ఎన్నికల్లో ఏకంగా 88 స్థానాలు దక్కించుకొని తిరుగులేని మెజారిటీ సాధించింది. తొలి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోయినా.. మరోసారి అధికారం అప్పగిస్తే వాటిని పూర్తి చేస్తుందన్న నమ్మకాన్ని ప్రజలు తమ తీర్పు ద్వారా చూపించారు. కానీ, రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక కేసీఆర్ సర్కారు అడుగులు తడబడుతున్నాయి.
రాష్ట్రంలోని పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామని మొదటినుంచి చెబుతూ వచ్చారు. రెండో విడతలోనూ ఆ హామీని నిలబెట్టుకోలేకపోయింది. దాదాపు ఏడున్నరేళ్లలో కట్టించిన ఇళ్లు నామమాత్రమే. పైగా సొంత జాగా ఉన్నవారికి ఇళ్లు నిర్మించు కోవడానికి రూ.5 లక్షల నుంచి రూ.6.5 లక్షల వరకు నిధులను కేటాయిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీనీ అమలు చేయలేదు. దీంతో ఇల్లులేని పేదల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరిగిపోయింది. ఇక ఎన్నికల హామీల్లో మరో ప్రధానమైన అంశం నిరుద్యోగ భృతి. రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.3016 భృతి ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. కానీ, మూడేళ్లు గడిచినా కనీసం రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారన్న లెక్కలు కూడా తీయలేదు. పైగా, ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ ఖాళీలున్నా.. వాటి భర్తీకి చర్యలు చేపట్టడంలేదు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో పలువురు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలూ చోటుచేసుకున్నాయి.
దళితబంధు అమలుతో బీసీ వర్గాల నుంచి ప్రభుత్వానికి ఒత్తిడి పెరిగింది. తమకు కూడా అలాంటి పథకాన్ని అమలు చేయాలన్న డిమాండ్లు పెరిగాయి. దీంతో ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఈబీసీలు… ఇలా అన్ని వర్గాలకూ ఇలాంటి పథకాన్ని తీసుకొస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. కానీ, ఆచరణలో అది సాధ్యమయ్యే అవకాశాలు ఎంతమాత్రం లేవని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. పైగా బీసీల అభివృద్ధికి వచ్చే ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు వ్యయం చేస్తామని ప్రభుత్వం అంతకుముందే ప్రకటించింది. రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల్లో ఈ హామీ ఆశలు నింపింది. కానీ, ఆచరణలో రిక్తహస్తాలే కనిపిస్తుండడంతో బీసీల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. అందుకే హుజురాబాద్ ఉపఎన్నికలో బీసీలు కూడా టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. ఎస్టీలు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ఎస్సీల వర్గీకరణపై పోరాడుతామంటూ ఇచ్చిన హామీలనూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం మరిచిపోయింది.
ప్రభుత్వంపై ప్రజల్లో ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న వ్యతిరేకత వివిధ సందర్భాల్లో వచ్చిన ఎన్నికల్లో వెల్లడవుతోంది. రెండోసారి అధికారంలోకి వచ్చాక దుబ్బాక ఉపఎన్నిక రూపంలో అధికార పార్టీకి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. ఆ వెంటనే 2020 డిసెంబర్‌లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ మరోసారి పరాభవం ఎదురైంది. తాజాగా హుజురా బాద్ ఉపఎన్నికలో మరింత పెద్ద దెబ్బ తగిలింది. కోట్ల రూపాయలు కుమ్మరించినా ప్రజలు అధికార పార్టీని తిరస్కరించారు. ఇది టీఆర్‌ఎస్‌కు కోలుకోలేని దెబ్బగా విశ్లేషకులు పేర్కొన్నారు. ఆ పార్టీ పట్ల ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.
ఉద్యోగులకు వేతన సవరణ విషయంలో పీఆర్సీ నివేదిక ఇచ్చినా.. అమలులో ప్రభుత్వం జాప్యం చేసింది. బకాయిల చెల్లింపు విషయంలోనూ ఉద్యోగుల అసంతృప్తికి కారణమైంది. పైగా 2018 జూలై తరువాత రిటైరైన వారికి పీఆర్సీని వర్తింపజేయ లేదు. ఇక ఆసరా పింఛన్‌లకు అర్హత వయసును 62 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామని చెప్పి పట్టించుకో లేదు. రైతుల పంటరుణాలను లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో చెప్పిన టీఆర్‌ఎస్ మూడేళ్లయినా పూర్తిస్థాయిలో నెరవేర్చలేకపోయింది. ఇప్పటివరకు రూ.50వేల వరకు రుణాలను మాత్రమే మాఫీ చేసింది. ఇక పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పి నాన్చుతూ వస్తున్నారు. ఇది గిరిజనుల్లో వ్యతిరేకతకు దారి తీస్తోంది.
ఇటీవల తెరపైకి వచ్చిన ధాన్యం కొనుగోళ్ల సమస్య టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచింది. కేంద్రంలోని బీజేపీదే తప్పు అంటూ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకొనే ప్రయత్నం చేస్తుందన్న విమర్శలున్నాయి. ప్రభుత్వం తన రాజకీయ లబ్ధి కోసం రోజుకో నాటకమాడుతోందని ఆరోపిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో మాట్లాడి సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ చట్టాలు దుర్మార్గమని చెప్పి, తర్వాత అవే చట్టాలు రైతులకు మేలు చేస్తాయంటూ వ్యాఖ్యానించి, మళ్లీ ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం గుర్తు చేస్తున్నారు. ఇలాంటి ధోరణి కారణంగానే రైతుల్లోనూ వ్యతిరేకత పెరుగుతుందన్న విశ్లేషణలున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే జూలై నుంచి కొత్త పీఆర్సీ అమలు చేస్తోంది. దీంతో ఇదివరకు రూ.2,500 కోట్ల వరకు ఉన్న నెలవారీ వేతనాల పద్దు ఏకంగా రూ.4000 కోట్ల వరకు పెరిగింది. వీటికి అదనపు నిధులను సర్దాల్సి వస్తోంది. ఇక ప్రతి నెలా సంక్షేమ పథకాలకు నిధులను సర్దాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ముందున్న ఒకే ఒక మార్గం… అప్పుల బాట. ఇప్పటికే ఈ ఏడాది రూ.28 వేల కోట్ల అప్పులు చేసింది. జీఎస్‌టీ పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుతో మరో రూ.2000 కోట్ల అప్పును సేకరించింది. నవంబరు, డిసెంబరు 10 నాటికి మరో రూ.4000 కోట్లకు పైగా అప్పు తీసుకున్నట్లు సమాచారం. ఇవన్నీ కలిపితే రూ.34 వేల కోట్ల అప్పులవుతాయి. ఇలాంటి పరిస్థితులతో ప్రభుత్వం రాబోయే రెండేళ్లు ఎలా నెట్టుకువస్తుందన్నది సవాలే.
ఈ నేపథ్యంలో కేసీఆర్ బయటకు గంభీరంగా కనిపిస్తున్నా ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసు కుంటున్న పరిణామాలు ఆయనకు తలనొప్పిలా మారుతున్నట్టు తెలుస్తుంది. తాజాగా టీఆర్‌ఎస్ పార్టీ అంతర్గత సర్వేలో వచ్చిన ఫలితాలు కేసీఆర్‌ను షాక్‌కు గురిచేసినట్టు తెలుస్తోంది. కేబినెట్ మంత్రులపై చేసిన ఈ సర్వేలో ఐదుగురు మాత్రమే గెలుస్తారని తేలినట్టు సమాచారం. ప్రస్తుతం కేబినెట్‌లో 17 మంది మంత్రులు ఉండగా.. కేసీఆర్‌తో పాటు మరో నలుగురు మంత్రులు మాత్రమే గెలుపుగుర్రం ఎక్కుతారట. అంతేకాదు, 41 ఎమ్మెల్యేలకూ ఓటమి తప్పదని ఓ రిపోర్టు కూడా సీఎం దగ్గరకి వచ్చిందట. గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నేతలపై భూకబ్జా ఆరోపణలు పెరిగిపోవడంతో ప్రజలు మార్పును కోరుకుంటు న్నారని ఈ సర్వేలో వెల్లడైంది. మరోవైపు పార్టీలో కూడా గ్రామస్థాయి కార్యకర్తలు బాగా విసుగు చెందారని తెలుస్తోంది. ఉద్యమ సమయంలో కష్టపడిన వాళ్లని పూర్తిగా పక్కనపెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్ద పీట వేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. పార్టీలోని వర్గ పోరు కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇలాంటి పలు అంశాలు సర్వే ఫలితాలపై ప్రభావం చూపి ఉండొచ్చంటున్నారు.
మరోవైపు.. రెండేళ్ల ముందే తెలంగాణలో ముందస్తు సందడి కనిపిస్తోంది. కేసీఆర్ మళ్లీ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారనే ప్రచారంతో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చనే ఉద్దేశంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, కేసీఆర్ పాలనపై జనాలు ఏమంటున్నారు, ముందస్తు ఎన్నికలు వస్తాయా.. వస్తే ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది, టీఆర్‌ఎస్‌లో ఏం జరుగుతోంది. కేటీఆర్‌ను సీఎంగా జనాలు కోరుకుంటున్నారా.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా జనాలు ఏ పార్టీని కోరుకుంటారు? అన్న అంశాలపై వోటా సంస్థ సర్వే నిర్వహించింది.
డిసెంబర్ 1 నుంచి 10 వరకు పది రోజుల పాటు వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరిం చింది. ఎక్కువగా ఆన్‌లైన్ ద్వారా శాంపిల్స్ సేకరిం చింది వోటా సంస్థ. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా గ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్ ఆన్‌లైన్ వేదికగా ద్వారా జరిగిన సర్వేలో వేలాది మంది పాల్గొని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సర్వేలో సంచలన ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగానే సీఎం కేసీఆర్ పాలనపై తెలంగాణ ప్రజలు తీవ్ర కోపంగా ఉన్నారనే విషయం సర్వేలో స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోతుందని సర్వేలో తేలింది. అంతేకాదు టీఆర్‌ఎస్‌లో అసమ్మతి ఖాయమని కూడా మెజార్టీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఏడేళ్ల పాలన ఎలా ఉందని ప్రశ్నించగా కేవలం 18 మార్కులే వచ్చాయి. కేసీఆర్ పాలన అస్సలు బాగాలేదని ఏకంగా 50.8 శాతం మంది, బాగాలేదని 20.3 శాతంమంది తీర్పు ఇచ్చారు. 10.9 శాతం మంది మాత్రమే పాలన పర్వాలేద న్నారు. ఇక దళితబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారని అనుకుంటున్నారా? అని అడిగితే దాదాపు 73 శాతం మంది అమలుచేయరని చెప్పారు. దీనిని బట్టి కేసీఆర్ హామీలపై జనాలకు పూర్తిగా నమ్మకం పోయిందని తెలుస్తోంది.
టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం ఎవరని ప్రశ్నించగా ఆసక్తికరమైన ఫలితం వచ్చింది. కమలంపార్టీ వైపు మెజార్టీ జనాలు మొగ్గు చూపారు. బీజేపీకి 48.5 శాతం ఓటర్లు జై కొట్టగా.. కాంగ్రెస్‌కు మద్దతుగా 27.1 శాతం మంది నిలిచారు. టీఆర్‌ఎస్‌ను ఎవరూ ఓడించలేరని 18 శాతం మంది చెప్పారు. ముందస్తు ఎన్నికలు వస్తే ఎవరికి ఓటు వేస్తారన్న ప్రశ్నకు కూడా గమ్మత్తైన ఫలితం వచ్చింది. బీజేపీకి 38.4 శాతం, కాంగ్రెస్‌కు 37 శాతం మంది ఓటేశారు. టీఆర్‌ఎస్‌కి 22.2 శాతం మంది మాత్రమే ఓటేస్తారని చెప్పారు.
– సుజాత గోపగోని, 6302164068, సీనియర్ జర్నలిస్ట్