-సుజాత గోపగోని, 6302164068

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ తెలంగాణలోనూ వణుకు పుట్టిస్తోంది. తొలుత విదేశాలనుంచి వచ్చిన వాళ్లతో మొదలైన పాజిటివ్‌ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. డిసెంబర్‌ 20 నాటికి అధికారిక లెక్కల ప్రకారం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 20కి చేరింది. పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారికి ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా మార్చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌ టోలిచౌకిలోని పారామౌంట్‌ కాలనీని కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.

తెలంగాణలోకి ఒమిక్రాన్‌ విదేశీయుల కారణంగానే వచ్చింది. వాళ్లే ఇక్కడ మరిన్ని కేసులకు కారణమయ్యారు. విమానాశ్రయం మీదుగా, అధికారుల ముందు నుంచే వాళ్లు తెలంగాణలోకి అడుగుపెట్టారు. కరోనా నిబంధనలంటూ, కంటైన్‌ మెంట్‌ జోన్‌లంటూ స్థానికులను, అవసరార్థులను ఇబ్బందులు పెట్టే అధికారులు విదేశాల నుంచి వచ్చిన వారికి, అదీ అనుమానితులకు కచ్చితంగా పాటించాల్సిన మార్గదర్శకాలను, నిబంధనలను కూడా పాటించకుండా స్వేచ్ఛగా వదిలేశారు. అదే ఇప్పుడు శాపంగా మారింది. ఒమిక్రాన్‌ వ్యాప్తికి కారణమైంది.

ఈనెల 14న హైదరాబాద్‌లో ఇద్దరికి ఒమిక్రాన్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. కెన్యా నుంచి వచ్చిన యువతి, సోమాలియా నుంచి వచ్చిన యువకుడికి కొత్త వేరియంట్‌ సోకినట్టు తేలింది. ఆ యువతి వచ్చినప్పటి నుంచీ ఇంట్లోనే ఉంది. యువకుడు మాత్రం మూడు రోజులపాటు సిటీలోని వివిధ ప్రాంతాలకు, ఆసుపత్రులకు, రెస్టారెంట్లకు తిరిగాడు. పైగా వీరిద్దరూ వ్యాక్సిన్‌ సింగిల్‌ డోసు మాత్రమే తీసుకున్నారు. అయినా అధికారులు అప్రమత్తత ప్రదర్శించలేదని స్పష్టంగా అర్థమవుతోంది. మిగతా కరోనా వేరియంట్ల కన్నా ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తుందని, టీకాలకు పెద్దగా లొంగదని రకరకాల వాదనలు వినిపిస్తుండటంతో దీనిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

విదేశీయులిద్దరూ వేర్వేరు విమానాల్లో హైదరా బాద్‌కు వచ్చారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ కోసం శాంపిల్స్‌ ఇచ్చి వెళ్లిపోయారు. టెస్టుల్లో ఇద్దరికీ కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో మరుసటి రోజు శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం ఉప్పల్‌లోని సీడీఎఫ్‌డీ (సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌) ల్యాబ్‌కు పంపించారు. కానీ, అధికారులు మాత్రం నిర్లక్ష్యంతో వీళ్లిద్దరికీ పాజిటివ్‌ వచ్చిన విషయాన్నే తెలియజేయ లేదు. ట్రేస్‌ చేయలేదు. ఇంతలో వీళ్లిద్దరికీ ఒమిక్రాన్‌ పాజిటివ్‌ వచ్చిందంటూ 14న సాయంత్రం సీడీఎఫ్‌డీ సైంటిస్టులు రిపోర్టులు ఇచ్చారు. దీంతో బాధితులను ట్రేస్‌ చేసేందుకు పోలీసులను తీసుకుని హెల్త్‌ ఆఫీసర్లు ఉరుకులు పరుగులు పెట్టారు.

కెన్యాకు చెందిన 24ఏళ్ల ఇక్రాన్‌ ఇస్మాయిల్‌ ఖలీఫ్‌ ఈ నెల 12న ఖతార్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. పారామౌంట్‌ కాలనీ గేట్‌ నంబర్‌ 4 ఏరియాలోని ఓ ఇంట్లో నివాసం ఉంటోంది. ఆ యువతికి ఒమిక్రాన్‌ సోకినట్టు నిర్ధారణ అయిన తర్వాత ట్రేస్‌ చేసి ఆమెను గుర్తించిన అధికారులు గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించారు. ఆమె తండ్రి, మామను ప్రైమరీ కాంటాక్టులుగా గుర్తించి, వారిద్దరికీ కరోనా టెస్టులు చేశారు. కెన్యాకు చెందిన ఓ కేన్సర్‌ పేషెంట్‌కు అటెండెంట్‌గా ఉండేందుకు ఈమె వచ్చినట్టు సమాచారం. మూడు రోజులుగా ఆమె ఇంట్లోనే ఉందని, బయటకు వెళ్లలేదని అధికారులు చెబుతున్నారు.

ఇక, సోమాలియాకు చెందిన యువకుడు అబ్దుల్లా అహ్మద్‌ నూర్‌ కూడా ఈ నెల 12న ఖతార్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. అతను కూడా టోలిచౌకీ లోని పారామౌంట్‌ కాలనీ గేట్‌ నంబర్‌ 4 ఏరియా లోని అక్బర్‌ టవర్స్‌లో ఉన్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రికి చికిత్స చేయించేందుకు అతను హైదరాబాద్‌ వచ్చాడు. ఈనెల 12 నుంచి 15 వరకు టోలిచౌకీ, సోమాజిగూడ, జూబ్లీహిల్స్‌ తదితర ప్రాంతాల్లో తిరిగాడు. 13న తండ్రిని యశోద హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. 14, 15 తేదీల్లో అపోలో హాస్పిటల్‌లో డాక్టర్లను కలిశాడు. అక్కడ డాక్టర్లకు చూపించుకుని, మధ్యాహ్నానానికి రూమ్‌కు వచ్చారు. అప్పటికే అతనికోసం గాలిస్తున్న వైద్యశాఖ సిబ్బంది.. తండ్రీ కొడుకులిద్దరినీ అంబులెన్స్‌లో గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించారు.

పాజిటివ్‌ వచ్చిన విదేశీయులు బయట తిరగకుండా కట్టడి చేయడంలో ఎయిర్‌పోర్ట్‌ సర్వైలెన్స్‌ విభాగం అధికారులు నిర్లక్ష్యం చూపినట్లు ఈ పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి. వచ్చినరోజే ఎయిర్‌పోర్టులో చేసిన టెస్టుల్లోనే వాళ్లిద్దరికీ కరోనా పాజిటివ్‌ అని తేలింది. అయితే ఆ విషయాన్ని వారికి చెప్పలేదని, కనీసం లోకల్‌ హెల్త్‌ ఆఫీసర్లకూ సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. కరోనా పాజిటివ్‌ అని తేలగానే పోలీసులకు చెప్పి ఎయిర్‌పోర్ట్‌లో వారు ఇచ్చిన వివరాల ఆధారంగా ట్రేస్‌ చేయించాల్సిన ఆవశ్యకత ఉంది. అంతేకాదు, వాళ్లు నిబంధనల ప్రకారం హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారో, బయట తిరుగుతున్నారో అనే అంశాలపైనా నిఘా పెట్టాల్సి ఉంది. కానీ, అధికారులు ఇవేమీ పట్టించుకోలేదు.

వాస్తవానికి కొవిడ్‌ మార్గదర్శకాలు, ఒమిక్రాన్‌ నేపథ్యంలో జారీచేసిన తాజా నిబంధనల ప్రకారం ఒమిక్రాన్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న 11 దేశాల నుంచి వస్తున్న వాళ్లందరికీ ఎయిర్‌పోర్టులోనే ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ చేయాలి. ఫలితం వచ్చేంత వరకూ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు పంపకూడదు. పాజిటివ్‌ వస్తే ఆసుపత్రిలోనే ఐసోలేషన్‌లో ఉంచాలి. నెగెటివ్‌ వస్తే హోం ఐసోలేషన్‌లో నిఘా పెట్టాలి. రిస్క్‌ లిస్టులో లేని దేశాల నుంచి వచ్చే ఫ్లైట్లలో ర్యాండమ్‌గా రెండు శాతం మందికి ఎయిర్‌పోర్టులోనే ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ చేయించాలి. పాజిటివ్‌ వస్తే శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించాలి. రిజల్ట్‌ వచ్చే వరకూ హోం ఐసోలేషన్‌లోనే ఉంచాలి.

ఇద్దరు విదేశీయుల ఒమిక్రాన్‌ కేసులు నమోదైన తొలి నాలుగు రోజుల్లోనే తెలంగాణలో అధికారిక లెక్కల ప్రకారం ఈ కేసులు 20కి చేరుకున్నాయి.  సోమాలియా యువకుడి తండ్రికి చికిత్స చేసిన ఓ కార్పొరేట్‌ వైద్యుడూ ఆ జాబితాలో ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఆ తర్వాత ఆ వైద్యుడు ఇంకెంతమందికి వైద్యం అందించాడన్న వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈనెల 20 నాటికి నమోదైన అధికారిక లెక్కల ప్రకారం ఒమిక్రాన్‌ వచ్చిన వారిలో విదేశీయులే ఎక్కువగా ఉన్నారు.

మరోవైపు హైదరాబాద్‌ టోలీచౌకీ ప్రాంతంలోని పారామౌంట్‌ కాలనీలో వందకుపైగా ఒమిక్రాన్‌ పాజిటివ్‌లు వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. కానీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దీనిని ధ్రువీకరించలేదు. పారామౌంట్‌ కాలనీలో ఉంటున్నవారిలో 90శాతం విదేశీయులే. పైగా ఇతర దేశాల నుంచి కొత్తగా ఒక్కరు వచ్చినా అంతా గెట్‌ టు గెదర్‌ అవుతుంటారని పరిశీలనలో తేలింది. దీంతో వైద్యశాఖ లెక్కల కంటే ఇక్కడ భారీగా పాజిటివ్‌లు నమోదవుతున్నా యంటున్నారు. గతంలో కరోనా మొదటి, సెకండ్‌ వేవ్‌లో తెలంగాణలో పాజిటివ్‌ కేసుల ప్రకటనలో వైద్య, ఆరోగ్యశాఖపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. క్షేత్రస్థాయిలో అధికారులు ప్రకటించే లెక్కలకు, ప్రభుత్వం ప్రకటించే లెక్కలకు అసలు పొంతన కుదరకపోవడం, భారీ సంఖ్యలో కేసులను తక్కువగా చూపించడం వంటి పరిణామాలు ఎదుర య్యాయి. ఇప్పుడు ఒమిక్రాన్‌ విషయంలోనూ అలాగే చేస్తున్నారేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, ఈ వేరియంట్‌ పుట్టిన దక్షిణాఫ్రికాలో నవంబర్‌ 9న తొలి కేసు వచ్చింది. అప్పటికి రోజూ 500 కొవిడ్‌ కేసులు వచ్చేవి. ఇప్పుడు 20వేల వరకు నమోదవుతున్నాయి. వీటిలో 80 శాతం ఒమిక్రాన్‌ కేసులేనని డబ్ల్యూహెచ్‌వో వెల్లడిరచింది. ఈ ఉదాహ రణను ప్రస్తావిస్తూ.. విపరీతమైన జనసంచారం ఉండే మనదగ్గర ఒమిక్రాన్‌ను కట్టడి చేయడం కష్టమేనని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఎటువంటి ఆంక్షలు లేవని, ప్రజలు సరిగా మాస్క్‌లు ధరించడం లేదని, భౌతికదూరం పాటించడం లేదని గుర్తుచేస్తు న్నారు. కొవిడ్‌వ్యాప్తి తొలినాళ్లలో విదేశాల నుంచి వచ్చేవారికి చేతిపై స్టాంపింగ్‌ వేసేవారు. దాంతో కచ్చితంగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చేది. బయటకు వచ్చినా తెలిసిపోయేది. ప్రస్తుతం అటువంటిదేమీ లేదు. దీంతో విదేశాల నుంచి వచ్చినవారు యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఒమిక్రాన్‌ ముప్పు నేపథ్యంలోనూ వైద్యం పేరుతో ఇక్కడికి వచ్చే విదేశీయులపై కనీస నిఘా ఉండటం లేదు. దాంతో హైదరాబాద్‌లో వేరియంట్‌ చాలా వేగంగా వ్యాప్తి జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో జనవరి మూడో వారం నుంచి లేదా ఫిబ్రవరిలో కేసులు పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కడైనా కేసులు ఎక్కువైతే, ఆ ప్రాంతాల్లోనే ఆంక్షలు విధిస్తామని, ప్రజలు స్వచ్ఛందంగా కరోనా నిబంధనలు పాటించాలని వైద్యాధికారులు కోరుతున్నారు.

వెంటాడుతున్న భయాలు

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయం స్టాక్‌ మార్కెట్‌ను కూడా వెంటాడుతోంది. ఒమిక్రాన్‌ కేసులు అంతకంతకూ పెరుగుతుండటం, లండన్‌లో ఈ బాధితుల మరణాలు పెరగడం.. ఫలితంగా ఎఫ్‌ఐఐల అమ్మకాల వెల్లువతో సెన్సెక్స్‌ ఏకంగా నాలుగు నెలల కనిష్టానికి పడిపోయింది. ఈ భయాలు ప్రపంచ మార్కెట్ల తరహాలోనే మన మార్కెట్లనూ వెంటాడుతున్నాయి. ఈనెల 20న ట్రేడిరగ్‌లో సెన్సెక్స్‌ 1,190 పాయింట్లు, నిఫ్టీ 371 పాయింట్లు నష్ట పోయాయి. మదుపరుల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.6.80 లక్షల కోట్ల మేర ఆవిరై రూ.2,52, 57,581.05 కోట్లకు పరిమితమైంది. అలాగే, ఈనెల 17న ట్రేడిరగ్‌లో కూడా రూ.4.65 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.

ధైర్యంగా ఎదుర్కొంటాం..

 దేశంలో ఒమిక్రాన్‌ విజృంభణ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఈ కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు అన్నివిధాలుగా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. అవసరమైన ఔషధాలు, ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, రాష్ట్రాలకు ఇప్పటికే 48 వేల వెంటిలేటర్లు పంపిణీ చేశామని వివరించారు. ప్రస్తుతం నెలకు 31 కోట్ల కొవిడ్‌ టీకా డోసులు ఉత్పత్తి అవుతున్నాయని, వచ్చే 2 నెలల్లో ఉత్పత్తి సామర్థ్యం 45 కోట్లకు పెరగనుందని చెప్పారు. అత్యవసర అనుమతుల మంజూరు కోరుతూ మరో రెండు టీకా ఉత్పత్తి సంస్థలు ప్రభుత్వానికి వివరాలు సమర్పించాయన్నారు.

వ్యాసకర్త : సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE