తెలిసో తెలియకో కొందరు నాయకులూ, ఇసుక రేణువంత నాయకత్వ లక్షణం లేకున్నా ప్రముఖ కుటుంబాలకు చెందిన కారణంగా కొందరు వ్యక్తులూ కొన్ని వివాదాలు లేవదీయాలని చూస్తుంటారు. దీనితోనే వాళ్లు అడ్డదారిలో సాధించా లనుకున్న ప్రయోజనం సాధ్యమను కుంటారు. అది ఎప్పటికీ కాదు. పైగా అలాంటి ప్రతికూల పంథా వల్ల తలబొప్పి కడుతుంది. హిందూత్వ, హిందూయిజం పేర్లు పెట్టి భారతీయ సమాజాన్ని విడదీయవచ్చునని ఆశపడుతున్న కాంగ్రెస్ ప్రముఖుడు రాహుల్ గాంధీకి జరిగేది అదే. ఇప్పుడు రాహుల్ హిందూయిజం – హిందుత్వ అంటూ ఒక వ్యర్థ చర్చను దేశం ముందుకు తేవాలని ఆరాటపడుతున్నారు. డిసెంబర్ 12న రాజస్తాన్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో మరొకసారి ప్రయోగించారు.
కశ్మీరీ పండిత్‌లను లోయలో ఊచకోత కోయడం మొదలు ఇటీవలనే మహారాష్ట్రలో జరిగిన ఇద్దరు సాధువుల హత్య వరకు నోరు విప్పడానికి ముందుకు రాని రాహుల్ హిందువెప్పుడయ్యారో తెలియదు. ఒకవేళ అయినా తాత్కాలికమే. లోక్‌సభకో, లేదా రాష్ట్రాలకో ఎన్నికలు ప్రకటించి నప్పుడే రాహుల్ అమాంతం హిందువు అయిపోతూ ఉంటారు. అసలు హిందుత్వ, హిందూయిజం వంటి అంశాల మీద విశ్లేషణకు పూనుకోవడం రాహుల్ గాంధీ సొంత ఆలోచన కానేకాదు. ఆయన అంత ఆలోచనాపరుడు కాదు కూడా. ఇది ఆయన చేస్తున్న దుస్సాహసం. ఓట్ల మీద ఆశతో బుర్ర నిండా ఇస్లాంనీ, తల్లి నుంచి వచ్చిన విశ్వాసంతో గుండెలో చర్చ్ పట్ల విశ్వాసాన్నీ నింపుకున్న ఈ నాయకుడు అవసరార్ధం ఒంటి మీద జంధ్యం వేసుకుంటూ ఉంటారు. అది ఈ దేశ ప్రజలకు తెలుసు. కాబట్టే హిందూత్వ, హిందూ యిజం అన్న ఆయన ఉవాచ దేశ ప్రజలలో చులకనైంది. రాహుల్ ఏదో అన్నారని కాకున్నా, హిందూత్వ, హిందూయిజం గురించి ఇటీవల ఇండియా టుడే వెబ్‌సైట్‌లో రాజీవ్ తులి అనే కాలమిస్ట్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు గమనించ దగినవి ఉన్నాయి. వాటిలో కొన్ని అంశాలు:
హిందుత్వ, హిందూయిజం అంటూ ఒక చర్చను లేవదీయడానికి ఈ మధ్య పథకం ప్రకారం ప్రయత్నం జరిగింది. ఇక్కడ హిందూయిజం అంటే నిజమైన ఆచరణ అనీ, హిందూత్వ అంటే విభజన ఉద్దేశంతో కూడుకున్న రాజకీయవాదమని వాళ్లు చెబుతున్నారు. ఆ మధ్య అమెరికాలో జరిగిన డిజ్‌మ్యాంటిలింగ్ గ్లోబల్ హిందూత్వ సదస్సుతో ప్రారంభమైన దుష్ప్రచారం ఇంకా కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఓ పదక్రీడని సాగిస్తున్నవారు హిందూత్వ వ్యతిరేకులే. ఆ సదస్సు చతికిలపడినా ఈ వ్యతిరేకుల శిబిరం దుష్ప్రచారం ఆపడం లేదు.
హిందూయిజం గొప్పది అన్న చర్చను లేవదీయా లనుకోవడం వెనుక ఉన్న లక్ష్యం- హిందూయిజంను ఏకశిలా సదృశమైన సెమిటిక్ లేదా అబ్రహమిక్ మతాల పక్కన పెట్టడం (అంటే యూదులకు, క్రైస్తవానికి చెందిన మతాల సరసన పెట్టడం). ‘హిందూత్వ’తో కేంద్రంలో అధికారంలో వచ్చినది బీజేపీ. ఆ చర్చను లేవదీస్తున్నవాళ్లు చెప్పేది ఈ హిందూత్వ. ఎలాంటి శషభిషలు లేకుండా బీజేపీకి అధికారం ఇచ్చి తన వైఖరి ఏమిటో భారత ప్రజానీకం స్పష్టం చేసేసింది. ప్రతిపక్షాలని కంగు తినిపించింది. దీనితో ఉనికి కోసం విపక్షాలకి పోరాడక తప్పడం లేదు. అయినా హిందూ ఓటు బ్యాంకు సుస్థిరం కాకుండా చూడాలన్న వాటి ప్రయత్నం సాగడం లేదు.
అసలు హిందూత్వ అన్న పదాన్నయినా, లేదా హిందూయిజం (హిందూనెస్) అంటే ఏమిటో తెలియాలన్నా కూడా మొదట అర్ధం కావలసింది ‘హిందూ’ అన్న పదానికి ఉన్న అసలు అర్ధం. ఎన్నో గ్రంథాలు, మత పెద్దలు హిందూ అన్న పదానికి అర్ధం చెప్పడానికి, వివరించడానికి తమవంతు ప్రయత్నం చేశారు. లోకమాన్య తిలక్, మహర్షి అరవిందుడు, వినాయక్ దామోదర్ సావర్కర్, బిపిన్ చంద్రపాల్, స్వామి వివేకానంద వంటి మహోన్న తులు హిందువుగా ఉండడం అంటే ఏమిటో తమ తమ అభిప్రాయాలలో వెల్లడించారు. వారందరి ఆ అర్ధ వివరణలను, విశ్లేషణలను ఒక ప్రత్యేక సందర్భంలోని నేపథ్యంగా పరిగణించి పరిశీలిం చాలి. వారి ఆలోచనకు పునాదిగా ఉన్న సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల ఆధారంగాను, ఆ కాలాన్ని బట్టి కూడా చూడాలి.
ఆర్‌ఎస్‌ఎస్ ఆవిర్భావం నుంచి కూడా హిందువు అంటే ఎవరు? హిందుత్వం అంటే ఏమిటి? వంటి ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. కొందరు నాయకులు, ప్రధానంగా టీవీ ప్యానలిస్టులు ఈ పద సృష్టికర్తగా వీర్ సావర్కర్‌ను చూపుతున్నారు. నిజం చెప్పాలంటే ‘హిందుత్వ’ అనే పదాన్ని 1892లో బెంగాల్‌కు చెందిన చంద్రకాంత్ బసు తన వ్యాసం ‘ఎస్సన్షియల్స్ ఆఫ్ హిందూత్వ’ కోసం ప్రయోగించారు. అసలు హిందూత్వ, హిందూనెస్ అనే పదాలను అవగాహన చేసుకోవడానికి వీకీపీడియా మీద ఆధారపడితే సరిపోదు. ఒకింత లోతుకు వెళ్లవలసి ఉంటుంది. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేబీ హెడ్గెవార్‌కు సావర్కర్‌తో సన్నిహిత పరిచయం ఉంది. హిందూత్వ, దానికి సంబంధించిన అంశాల మీద వారి మధ్య చర్చలు జరిగాయి. డాక్టర్ రతన్ శార్దా రచన ‘ఆర్‌ఎస్‌ఎస్: ఎవల్యూషన్ ఫ్రం యాన్ ఆర్గనైజేషన్ టు ఏ మూవ్‌మెంట్’ ప్రకారం స్వరాజ్య సాధనకు డాక్టర్జీ పెట్టిన మొదటి షరతు హిందువులు ఐక్యం కావడంతో పాటు చైతన్యవంతులు కావడం. శార్దా ఇంకొక ఘట్టం గురించి కూడా నమోదు చేశారు. ఒకసారి డాక్టర్ హెడ్గెవార్ పుణేలోనే ఒక సభలో ప్రసంగిస్తుండగా, ఒక వ్యక్తి లేచి, అత్యంత దురహంకారంతో ఇలా అన్నాడు. ‘భారత్ అంటే హిందూదేశమని చెప్పే ఆ మూఢుడు ఎవరు?’ అని. ‘నేను’ ఎలాంటి సంకోచం లేకుండా, ఏదో పుస్తకంలోని వాక్యాలో, పండితులు చెప్పినదానినో ప్రస్తావించ కుండా వెంటనే అన్నారు డాక్టర్ హెడ్గెవార్. ‘నేనే, డాక్టర్ కేశవరావ్ బలిరామ్ హెడ్గెవార్‌ని అంటున్నాను. భారత్ అంటే హిందూ రాష్ట్రమే’. అప్పటి వరకు ఆయన ఆ విషయం గురించి ఎవరితోనూ చర్చించేవారు కాదు. కానీ ఆయన నిండుసభలో అలా అనడం వెనుక పెద్ద చింతనే ఉంది. హిందూత్వ గురించి లేదా హిందూయిజం గురించి నిర్వచించ డానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆర్‌ఎస్‌ఎస్ మత సంస్థ కాదు. కాబట్టి మత గురువులు, ఆధ్యాత్మికవాదులు ఆ పదానికి ఇచ్చిన నిర్వచనానికి కట్టుబడి ఉండవలసిన అవసరం దీనికి లేదు. అందుకే హిందూత్వ అన్న భావన విషయంలో ఈ సంస్థకు తనదైన దృక్పథం ఉంది.
ప్రస్తుత సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ కూడా ఈ మధ్యనే ఇచ్చిన ప్రకటనలో అఖండ భారత్‌లో నివసిస్తున్న అత్యధికుల డీఎన్‌ఏ ఒకటేనని అన్నారు. కాబట్టి వీరందరిదీ ఒకే సంస్కృతి, నాగరికత అని కూడా ఆయన చెప్పారు. దీనర్ధం వీరంతా హిందువులు అనే. పై ప్రకటనలోనే డాక్టర్ భాగవత్ మరొక అంశం కూడా ప్రస్తావించారు. అది ఇంతవరకు పెద్దగా చర్చలోకి వచ్చినది కాదు. ఉమ్మడి గతం ఉన్నవారంతా కూడా హిందువులేనని డాక్టర్ భాగవత్ చెప్పారు. ఒకటి మాత్రం చారిత్రక సత్యమే. ఇప్పుడు క్రైస్తవులు, మహమ్మదీయులుగా ఉన్న చాలామంది మతాంతరీకరణ చెందినవారే. హిందూత్వంలోని క్రమరాహిత్యాలతో లేదా ప్రలోభాలతో ఆ మత మార్పిడులు జరిగాయన్నదీ నిజం. తరువాత అలాంటివారి వారసులు అవే మత విశ్వాసాలలో కొనసాగారు. అయితే విశ్వాసాలు మారడమంటే జాతీయత కూడా మారడమని అర్ధం కాదు.
హిందూత్వ లేదా హిందూనెస్ ఒక సంఘటన. ఆ భావనలో అటు విష్ణు పురాణం అందించిన హిందూ రాష్ట్ర (దేశ) భౌగోళిక విస్తృతీ ఉంది. ఇటు ఒకే సంస్కృతి, నాగరికతా విలువలు కలిగిన సమూహమనే కోణమూ ఉంది. హిమ సానువుల నుంచి, హిందూ మహా సాగరం వరకు నివసించి; ఉమ్మడి నాగరికత, సంస్కృతి కలిగిన వారిని హిందువు లుగా పేర్కొనవచ్చునన్న నిర్వచనం కూడా ఉంది. అయితే వారిది ఏ ఆరాధన పద్ధతి అన్నది ఇక్కడ ప్రశ్న కానేకాదు. చర్చ్‌కు వెళ్లినా, మసీదులో ప్రార్ధించినా వారు హిందువుగా ఉండేందుకు ఆ ఆరాధనా పద్ధతులు ఆటంకం కాబోవు.
హిందు, హిందూత్వ, హిందూనెస్, హిందూ రాష్ట్ర- ఏదైనా కావచ్చు. ఇవేమిటి అన్న ప్రశ్నకు సమాధానం రాబట్టుకోవాలంటే ఫ్రెంచ్ తత్త్వవేత్త, సంస్కృతం వంటి ప్రాచ్య భాషల అధ్యయన నిపుణుడు ఎర్నెస్ట్ రెనాన్ (19 శతాబ్దం) మాటలను పరిశీలించాలి. పైన పేర్కొన్న ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. జాతి అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు ఆయన సమాధానం- జాతి అనేది ఒక ఆధ్యాత్మిక సూత్రం అంటారాయన. ఇంకా, క్లిష్ట పరిస్థితులతో కూడిన చరిత్ర శోధన ఫలితం అన్నారు. జాతి అంటే అదొక ఆధ్యాత్మిక కుటుంబం అని కూడా చెప్పారు. అంటే ఒక సమూహానికి చెందిన గతం, వర్తమానం కూడా ఇందులో ప్రాధాన్యం వహిస్తాయి. అంటే ఉమ్మడి సంస్కృతి, నాగరికతలు కలిగి ఉండడం, దీని ఆధారంగా ఒక ఒప్పందంతో వర్తమాన భవిష్యత్ కాలాలలో కలసి జీవించడం కూడా. క్లుప్తంగా చెప్పాలంటే, భారతీయులంతా హిందువులు. ఇక్కడ మతంతో నిమిత్తం లేదు. హిందువులుగా హిందూత్వను ఆచరించాలి. దాని మార్గదర్శకత్వంలో నడవాలి. కాబట్టి హిందూత్వ, హిందూయిజం అన్న చర్చ అర్ధం లేనిది.
ఆ కాలమిస్ట్ అభిప్రాయం మాటెలా ఉన్నా, రాహుల్ ఇలాంటి ఒక వివాదాన్ని రాజేయదలచడం ప్రమాదం. ఆయన సావర్కర్, సర్దార్ వల్లభ్ బాయి పటేల్, పురుషోత్తమదాస్ టండన్, బాబూ రాజేందప్రసాద్ వంటి మహనీయులను కూడా సంకుచిత దృష్టి కలిగిన సమూహంలో కొందరిగా చేరుస్తున్నారు. గుజరాత్‌లో సోమనాథ్ ఆలయ జీర్ణోద్ధరణ, ఆ ఆలయ ప్రతిష్టకు రాజేందప్రసాద్ వెళ్లకుండా నిరోధించేందుకు నెహ్రూ ప్రయత్నించడం, ఆ సందర్భంలోనే నెహ్రూ భక్తులు రాజెన్‌బాబును హిందుత్వవాదిగా ముద్ర వేయడానికి ఉత్సాహ పడడం చరిత్ర. ఇప్పుడు రాహుల్ చేస్తున్నది కూడా అదే. ఆయన తాను హిందువునని గుండెలు బాదుకుంటూ చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఆయన హిందూధర్మం మీద దాడికి మరొకసారి దొడ్డిదారిన యత్నిస్తున్నారు.
‘నేను నిజమైన హిందువుని’ అంటూ గొంతు చించుకుంటే కేరళ వంటిచోట కాంగ్రెస్‌కి ఓట్లు పడతాయా? క్రైస్తవులు ఒప్పుకుంటారా? ఆ కోణం నుంచి ఆలోచిస్తే మాత్రం ‘నేను హిందువును, హిందూత్వవాదిని కాను’ అంటూ చేసిన ప్రకటన మోసపూరితమే. తాత్కాలిక ప్రయోజనం కోసం ఒక మహా సంస్కృతిని రాజకీయాల కోసం ఉపయోగించు కోవాలని అనుకోవడమే. అయినా చిరకాలంగా హిందువుల మీద ఇన్ని దాడులు జరుగుతున్నా నోరెత్తని, ముస్లింల మీద ఈగ వాలినా హిందువులనే తప్పపట్టే హిందూయిజాన్ని ఏమనాలి? ఇది ఇప్పటికే సాధారణ హిందువులో వస్తున్న ప్రశ్న. అంతేకాదు, పొరుగున ఉన్న పాకిస్తాన్ అకృత్యాలను పరోక్షంగా సమర్ధించే, పాక్ మూకలు చేసిన దాడిని కూడా ‘హిందూత్వ’ (రాహుల్ పరిభాషలో) భారత ప్రభు త్వానికే అంటగట్టే కాంగ్రెస్ మార్క్ హిందూయిజం ఎక్కడి నుంచి వచ్చింది?