– తురగా నాగభూషణం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమైన అంశాల్లో యూటర్న్‌లు తీసుకోవడం అలవాటైపోయింది. గతంలో చంద్రబాబు ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించి మరల యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా కావాలని కోరారు. ఇప్పుడు వైకాపా సర్కారు మూడు రాజధానుల చట్టాన్ని, ఏపీసీఆర్‌డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. అలాగే శాసనమండలి రద్దు నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుని అసెంబ్లీలో తీర్మానం చేసింది. పరిపాలనపై అవగాహన లేకపోవడం, తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలపై పడే ప్రభావం గుర్తించలేక పోవడం, బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే, వారి ఆదేశాలతో తిరిగి యూటర్న్ తీసుకోవడం వైకాపా ప్రభుత్వానికి రివాజుగా మారింది. ప్రభుత్వ నిర్ణయాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు 2019 ఎన్నికల్లో ఇచ్చిన మద్దతును 2024 ఎన్నికల్లో యూటర్న్ తీసుకుని ఓడిరచే ప్రమాదం కూడా ఉంది.
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొదటి శాసనసభ ఎన్నికల్లో తెదేపా, భాజపా కలసి పోటీచేశాయి. తెదేపా, భాజపా భాగస్వామ్యపాలన ప్రారంభమైంది. నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా పదేళ్లపాటు హైదరాబాదే కొనసాగుతుందని, రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం స్పష్టంచేసింది. కాని చంద్రబాబు ఈ వెసులుబాటును ఉపయోగించుకోక, అమరావతి ప్రాంతంలో రాజధానిని నిర్మించాలని యోచించారు. అక్కడ రైతుల నుంచి 34 వేల ఎకరాలు తీసుకుని అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రాజధాని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా రూ.2,500 కోట్లు నిధులిచ్చింది. రూ.5 వేల కోట్ల రుణ సదుపాయం కూడా కల్పించింది. 15వ ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు ప్రత్యేక హోదా ఏ కొత్త రాష్ట్రానికి ఇవ్వడానికి వీలుకాదని నీతి ఆయోగ్ చెప్పడంతో, దానికి బదులుగా ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి, ప్రాజెక్టుల కోసం నిధులు ఇస్తామని చెప్పింది. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు. హోదా కన్నా ప్యాకేజీ ద్వారా ఎక్కువ నిధులు వస్తాయని, అందువల్ల అదే ముఖ్యమైనదని కూడా ప్రకటించారు. కాని విపక్షాలు ఒత్తిడి చేయడంతో తన అవినీతి, అసమర్థ పాలనతో ప్రజలను దారి మళ్లించేందుకు తిరిగి యూటర్న్ తీసుకుని ప్యాకేజీ వద్దని హోదా కావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోనూ, ఢల్లీలోనూ సమావేశాలు పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని విమర్శించారు. కాని ప్రజలు ఆయనను విశ్వసించలేదు. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిరచారు.
చంద్రబాబు రూ.4 లక్షల కోట్ల అవినీతి చేశారని, దానిని బట్టబయలు చేస్తామని, జైలుకు పంపుతామని ప్రజలను నమ్మించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చారు. అధికారం చేపట్టి రెండున్నరేళ్లయినా ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు. నవరత్నాలు తప్ప ఏ హామీని పట్టించుకోలేదు. అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని నిర్మాణాన్ని కొనసాగించరాదని నిర్ణయించు కున్నారు. అమరావతిలో భూ సేకరణ రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా జరిగిందని, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముందుగా స్థలాలు కొని అక్రమంగా డబ్బు సంపాదించారని ఆరోపించారు. అమరావతి లోతట్టు ప్రాంతం కాబట్టి మునిగి పోతుందని, దానిని అభివృద్ధి చేసేందుకు లక్ష కోట్లు కావాలని కారణాలు చెబుతూ అమరావతి రాజధానిని కొనసాగించరాదని నిర్ణయించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో హైదరాబాద్ ఒక్కటే అభివృద్ధి చెందిందని, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే తెలంగాణ వేర్పాటువాదం డిమాండ్ వచ్చేది కాదన్నారు. అదే తప్పు మరోసారి చేయరాదని, అందువల్ల రాష్ట్రాన్ని వికేంద్రీకరిస్తామని చెప్పారు. విశాఖలో పరిపాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయరాజధాని నిర్మిస్తామని ప్రకటించారు.
చంద్రబాబు హయాంలో చేసిన ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అభివృద్ధి అథారిటీ (ఏపీసీఆర్‌డీఏ) చట్టం రద్దు బిల్లును శాసనసభలో ఆమోదింపచేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, ప్రాంతాలకు అతీతంగా మెజార్టీ ప్రజలు ఆకాంక్షించిన మాట వాస్తవం. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ గత చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన చేసినప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో జగన్ కూడా ఆ నిర్ణయాన్ని స్వాగతిం చారు. అందుకనే తన నివాసం రాజధాని ప్రాంతమైన తాడేపల్లిలో నిర్మించుకున్నట్లు ప్రకటించారు. కాని అధికారంలోకి వచ్చిన వెంటనే వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ కారణంగా అమరావతి భగ్గుమంది. ఆందోళన బాట పట్టిన రైతులతో ప్రభుత్వం కనీసం సంప్రదింపులు జరపలేదు. ఈ పరిణామంతో కలత చెందిన రాజధాని రైతులు 700 రోజులుగా ఉద్యమ బాట పట్టారు. ముఖ్యమంత్రి వారి వేదనను వినలేదు సరికదా వైకాపా నాయకులు హేళన కూడా చేశారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని తమ ఆవేదనను చెప్పుకుందామని అమరావతి రైతులు పాదయాత్ర చేయాలని నిర్ణయించగా, ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. వారు ఉన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించగా ఆనుమతించింది. పాదయాత్రకు పోలీసుల ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ దశలో అన్ని పార్టీలు అమరావతి రైతులకు తమ మద్దతును ప్రకటించాయి. కోర్టులో కూడా వాదనలు కొనసాగు తున్నాయి. అమరావతి రాజధానిపై నడుస్తున్న కేసులో రైతులతో జరిగిన ఒప్పందంలో ప్రభుత్వం తప్పించుకునే అవకాశంలేదని సాంకేతికంగా ప్రభుత్వం ఇరుక్కుపోయినట్లు నిపుణులు సూచించినట్లు సమాచారం. దీంతో మూడు రాజధానుల చట్టాల విషయంలో ఇన్నాళ్లుగా మొండిపట్టు పట్టిన ఏపీ సర్కారు… ఉన్నట్టుండి వెనక్కి తగ్గింది. అమరావతిని కాదని అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో తీసుకొచ్చిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాల్లో సాంకేతిక లోపాలున్నాయని ఇప్పుడు గుర్తించి.. వాటిని ఉపసంహరించుకుంటున్నట్టు హైకోర్టుకు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అభివృద్ధి అథారిటీ (ఏపీసీఆర్‌డీఏ) చట్టం (2020) రద్దు, ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి (మూడు రాజధానులు) చట్టం (2020), వాటి అనుబంధ అంశాలను ఉపసంహరిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టింది. ఆ బిల్లును శాసనసభ ఆమోదించింది. ఇది ఈ ప్రభుత్వం తీసుకున్న పెద్ద యూటర్న్.
రాజధానుల వికేంద్రీకరణ బిల్లును ఇప్పుడు రద్దుచేయడం తాత్కాలికమేనని, మరింత మెరుగైన, సమగ్రమైన బిల్లుతో మళ్లీ వస్తామన్న ప్రభుత్వ పెద్దల ప్రకటన హాస్యాస్పదం. బాధ్యతారాహిత్యం కూడా. అంటే ఈ ప్రభుత్వం ఒకే నిర్ణయాన్ని పదేపదే తీసుకుంటూ, తనతో పాటు ప్రజల్ని గందరగోళంలోకి నెడుతోంది. ప్రజలకు ఇష్టం లేని పనులు, న్యాయ సమీక్షలో నిలబడని అంశాలపై మొండితనం చూపిస్తోందని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతానికి మూడు రాజధానుల అంశానికి స్వస్తి చెప్పడం వెనుక చాలా లెక్కలున్నాయంటున్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజల మద్దతు క్రమేపీ హెచ్చడం, విపక్షాలన్నీ ఏకం కావడం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనే అంశానికే ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రచారం కావడంతో ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేసిన మాట నిజం. ఈ నేపథ్యంలో ఇప్పటికి ఈ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
శాసనమండలి చట్టం రద్దులో యూటర్న్
సీఆర్‌డీఏ, రాజధాని వికేంద్రీకరణ బిల్లు రద్దు చేసిన 24 గంటలు తిరగకుండానే రాష్ట్ర ప్రభుత్వం మరో యూటర్న్ తీసుకుంది. శాసనమండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. కాని అప్పటి శానసమండలి.. శాసనసభ పంపిన సీఆర్‌డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణ చట్టాల తీర్మానాలను రద్దు చేయలేదు. దీనికి కారణం అప్పట్లో తెలుగుదేశం సభ్యులతో కౌన్సిల్ మెజారిటీలో ఉండటమే. ఈ బిల్లులను మండలి ఆమోదించక సెలెక్ట్ కమిటీకి పంపింది. దీంతో మండలిపైనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల ద్వారా ఎన్నికైన మండలి సుప్రీం అయినప్పటికీ దిగువసభకు సూచనలు మాత్రమే చేయాలి, కానీ శాసనసభకు వ్యతిరేకంగా ప్రవర్తించ రాదని పేర్కొంటూ శాసనమండలి ఈ రాష్ట్రానికి అవసరం లేదని, దానిని రద్దుచేస్తూ 2020 జనవరి 24 శాసనసభలో తీర్మానంచేసి కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపారు. దానిపై ఇంతవరకు కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు కౌన్సిల్‌లో వైకాపాకు మెజారిటీ రావడంతో శాసనమండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది.
మద్య నిషేధంపై యూటర్న్
అధికారంలోకి వచ్చిన అయిదేళ్లలో మద్య నిషేధం అమలుచేస్తానని హామీ ఇచ్చిన వైకాపా దానిని నెరవేర్చే ప్రయత్నం చేయడంలేదు. మద్యంపై 15 ఏళ్లపాటు వచ్చే ఆదాయాన్ని హామీగా ఇచ్చి బ్యాంకుల నుంచి రూ.25 వేల కోట్లు అప్పులు తెచ్చారు. 15 ఏళ్ల పాటు మద్యం అమ్మకాలు కొనసాగించేలా హామీ ఇస్తే ఇక అయిదేళ్లలో మద్యం అమ్మకాలు ఎలా నిషేధిస్తారు? ఇలా మద్య నిషేధం హామీపై ఆయన యూటర్న్ తీసుకున్నారు.
ఎయిడెడ్‌పై యూటర్న్
ఎయిడెడ్ విద్యాసంస్థలకు సహాయ నిరాకరణ చేస్తున్నట్లు వైకాపా ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించిన మీదట కోర్టు తప్పుపట్టి తీర్పు వచ్చే వరకు ఎయిడ్‌ను కొనసాగించాలని ఆదేశించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, యువజన సంఘాలు చేసిన ఆందోళనతో వైకాపా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దిగివచ్చిన ప్రభుత్వం ఇష్టమైన సంస్థలే ప్రభుత్వానికి స్థలాలు అప్పగించాలని. లేని వారిని నిర్భందం పెట్టమని ఎయిడ్ కొనసాగిస్తామని చెప్పి యూటర్న్ తీసుకుంది.
ఇసుక పాలసీలో మూడు సార్లు..
ఇసుక పాలసీని ప్రభుత్వం మూడుసార్లు మార్చింది. అంటే మూడు సార్లు యూటర్న్ తీసు కుందన్నమాట. గత ప్రభుత్వ హయాంలో ఇసుకలో అవినీతి చోటుచేసుకుంది. దీనిని అన్ని పార్టీలు ఎండగట్టాయి. అధికారంలోకి వస్తే అవినీతి లేకుండా ఇసుకను తక్కువ ధరకు అందిస్తానని చెప్పిన వైకాపా అధికారంలోకి రాగానే ఇసుక పాలసీ మార్చేసింది. ఇసుక అమ్మడానికి పెట్టింది. ఇసుక అమ్మకంపై మూడుసార్లు పాలసీలను మార్చారు. ఇసుకను మొత్తం ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టారు. ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు నదీతీరాలు, ఏర్లు, చెరువుల్లో ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారు. అయినా ఇప్పటికీ మూడిర తల రేటుకు బ్లాక్‌లో ఇసుకను అమ్ముతున్నారు.
– సీనియర్ జర్నలిస్ట్