– ఎం.వి.ఆర్. శాస్త్రి
అది మరలిరాని పయనం.
ప్రపంచ స్థాయి విప్లవవీరుడు, భారత మహానాయకుడు నేతాజీ సుభాస్ చంద్ర బోస్ తాను జీవిత పర్యంతం తపించిన స్వాతంత్య్ర సిద్ధికి ఆత్మ బలిదానం చేసిన మహత్తర ఘట్టం.
అనంతరకాలంలో అనేక ఆధికారిక, అనధికారిక విచారణల్లో నిస్సందేహంగా నిరూపితమైన వివరాలను ఒక క్రమంలో గుదిగుచ్చితే కళ్లకు కట్టే వాస్తవచిత్రాన్ని ఆయా ప్రత్యక్షసాక్షుల మాటల్లోనే చిత్తగించండి:
ఐఎన్‌ఎ కూజపాన్మిలిటరీకీ నడుమ సంధానం చేసిన హికారీ కికాన్ అధిపతి జనరల్ ఐసోడా ప్రయాణానికి ముందు జరిగిన దానిని ఇలా గుర్తు చేసుకున్నాడు:
‘‘1945 ఆగస్టు 16న జపాన్ బాంబర్ విమానంలో బోస్ తన మంత్రులు, ముఖ్య సహచరులతో కలిసి బాంగ్‌కాక్ వచ్చాడు. పరిస్థితి చేయి దాటిపోయింది కనుక వెంటనే అక్కడికి రమ్మని నేనే అతడికి టెలిగ్రాం పంపాను. ఇకపై ఏమి చేయదలచుకున్నారు అని నేను బోస్‌ను అడిగాను. ‘మంచూరియా గుండా రష్యా వెళ్లదలచుకున్నాను. అక్కడ నన్ను బంధిస్తారో, చంపుతారో తెలియదు. ఏమైనా కానీ. స్వాతంత్య్రం కోసం బ్రిటిషువారిపై పోరాడటానికి ఇంకో దారి లేదు. జపాన్ నుంచో, జర్మనీ నుంచో బ్రిటన్, అమెరికాలపై పోరాడటం సాధ్యం కాదు. రష్యా వెళ్లటానికి జపాన్ ప్రభుత్వ సహకారం నాకు కావాలి’ అని ఆయన చెప్పాడు. ఆ మాటలు నన్ను కదిలించాయి. ఆయన అందరిలాంటి వాడు కాదు. ఓటమిని అంగీకరించే రకం కాదు. విప్లవ స్ఫూర్తి నరనరానా నిండి ఉన్నవాడు – అని మరోసారి అర్థమయింది. మీరు రష్యా వెళ్లేందుకు మేము చేయగలిగింది అంతా చేస్తామని మనస్పూర్తిగా మాట ఇచ్చాను.
‘‘మర్నాడు 17వ తేది ఉదయం బోస్‌కు వీడ్కోలు ఇవ్వటానికి నేను, రాయబారి హచియ కూడా సైగాన్ వెళ్లాము. మంచూరియాలోని దైరెన్ (ణ•శ్రీఱ••అ) నగరానికి ఆ రోజు మధ్యాహ్నం ఒక విమానం బయలుదేరనున్నదని అక్కడ మాకు తెలిసింది. లెఫ్టినెంట్ జనరల్ షిదేయి అందులో వెళుతున్నాడు. అతడు అంతదాకా బర్మాలో జపాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్‌గా పనిచేశాడు. చైనా లోని క్వాన్‌తాంగ్ ఆర్మీకి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యాడు. మంచూరియాలో జపాన్ సేనలను దగ్గరుండి సరెండర్ చేయించేందుకు ప్రత్యేక విమానంలో వెళుతున్నాడు. బోస్‌ను, అతడి బృందాన్ని రష్యా పంపటానికి అది మంచి అవకాశ మని నేను తలిచాను. కాని అ విమానంలో ఒక్క బోస్‌కు మాత్రమే చోటు ఇవ్వగలమని అక్కడి అధికారులు చెప్పారు. బోస్ వెంట వెళ్లవలసిన ఐదారుగురూ అతి ముఖ్యులే. ఎవరినీ వదిలివేయ టానికి వీల్లేదు. వ్యవధి లేదు కనుక నేను ఆ విషయం ఫీల్డ్ మార్షల్ తెరౌచీతో మాట్లాడటానికి వెంటనే అరగంట దూరంలో ఉన్న దలాత్‌కు వేరే విమానంలో వెళ్లాను. ప్రభుత్వాధిపతి బోస్ కాక ఇంకో ముగ్గురు నలుగురిని పంపటానికి అక్కడ అనుమతి తీసుకుని సైగాన్‌కు తిరిగివచ్చాను. పైవాళ్లు ఒప్పుకున్నా సరే షిదేయి కోసం ఉద్దేశించిన విమానంలో బోస్ వెంట ఒక్క సహాయకుడిని మించి పంపలేమని సైగాన్ అధికారులు కరాఖండిగా చెప్పారు. అప్పటికే జపాన్ సరెండర్ అయి రెండు రోజులయింది. లొంగి పోయాక యుద్ధ విమానాలు తిరిగితే విజేతలు ఊరుకోరు. విమానాలు ఎక్కడివక్కడ నిలిపెయ్యమని బ్రిటిష్, అమెరికన్ అథారిటీల నుంచి ఆర్డర్లు ఏ క్షణమైనా రావచ్చు. ఇంకో విమానం కోసం వేచి ఉండటం క్షేమం కాదు కాబట్టి సిద్ధంగా ఉన్న విమానంలో ఒక్క సహాయకుడితో వెళ్లటానికి బోస్‌ని అతి కష్టం మీద ఒప్పించాను. మిగిలిన వారిని వెనక నుంచి సాధ్యమైనంత త్వరగా పంపే షరతు మీద ఆయన అనిష్టంగా అంగీకరించాడు.
‘‘విమానం బయలుదేరే ముందు ‘మిష్టర్ బోస్ లగేజి బరువు చాలా ఎక్కువ అయింది. తగ్గించాలి’ అని చీఫ్ పైలట్ అన్నాడు. బోస్ తన పుస్తకాలు, దుస్తులు ఉన్న ఏడు పెట్టెలు తీసేయించాడు. జనరల్ షిదేయికి బోస్‌ను పరిచయం చేసి మంచూరియాలో ఆయన అవసరాలు చూడమని నేను కోరాను. అతడు రష్యన్ వ్యవహారాల నిపుణుడు కాబట్టి బోస్ రష్యా చేరటానికి సహాయం చేయగలడు. తప్పక చేస్తానని అతడు చెప్పాడు. మళ్లీ బోస్‌ను చూడలేనేమోనని నేను బాధపడ్డాను. ఐదుగురు మంత్రులు వరసలో నిలబడి మిలిటరీ సెల్యూట్‌తో తమ నాయకుడికి వీడ్కోలు ఇచ్చారు.’’
అది మిత్సుబిషి కంపెనీ నిర్మించిన జంట ఇంజిన్ల టైప్ 97-2 బాంబర్ విమానం. అమెరికన్లు దానికి పెట్టిన కోడ్ నేమ్ శాలీ. దాని నిడివి 23 మీటర్లు. బరువు 7490 కిలోలు. దానికంటే పెద్ద బాంబరును యుద్ధంలో జపాన్ వాడలేదు కాబట్టి దానికే హెవీ బాంబరు అని పేరు. దాని గరిష్ఠ వేగం 230 నాట్లు. మామూలుగా నాలుగు ఫిరంగులు, మిషన్ గన్లు, 60 కిలోల బాంబులు ఒక డజను అందులో అమర్చి ఉంటాయి. అది విమానాలు మజిలీలు చేస్తూ, ఇంధనం నింపుకుంటూ, రాత్రి కాగానే ఆగుతూ అంచెలంచెలుగా ప్రయాణం చేసే కాలం. మాటిమాటికీ నింపుకోవటానికి అనువుగా గాసోలిన్ ఇంధనం టాంకులు ప్రయాణికుల నెత్తిపైన లాంతర్లలా కొక్కేలకు లూజుగా వేలాడదీసి ఉంటాయి. విమానం నడిపేవారికి తప్ప ప్రయాణికులకు సీట్లు ఉండవు. అందరూ కింద కూచొనవలసిందే. రాంకు ప్రకారం అందరికంటే సీనియర్ ఆఫీసర్ అయిన షిదేయిని కో పైలట్ స్థానంలో కూచోబెట్టారు. ఆ స్థానం బోస్‌కు ఇద్దామనుకున్నారు. కాని అక్కడ ఇరుకుగా ఉన్నదని బోస్ వద్దన్నాడు. ఆ వెనుక ఉన్నంతలో కాస్త అటూ ఇటూ మెసలటానికి అనువుగా ఉండే పాసేజి ఏరియాలో బోస్, హబిబుర్ రహమాన్‌లు కూచున్నారు. సౌకర్యం కోసం వారికి కుషన్లు ఏర్పాటు చేశారు. మిగతావారు ఆ వెనుక సర్దుకున్నారు.
చోదక సిబ్బంది ఏడుగురు కాక గరిష్ఠంగా నలుగురు ప్రయాణికులను మాత్రమే ఆ విమానంలో మామూలుగా అనుమతిస్తారు. లెఫ్టినెంట్ జనరల్ వెంటే ముగ్గురు జపనీస్ సైన్యాధికారులు ఉన్నారు. బోస్‌ను, హబీబుర్ రహమాన్‌ను ఎక్కించుకోవటంతో నిర్దేశించిన 704 పరిమితికి మించి ఇద్దరు మనుషులు ఎక్సెస్ అన్నమాట. సైగాన్‌లో రన్‌వే మొత్తం నిడివిని వాడుకుంటే గాని పైకి ఎగరలేకపోయింది. దాన్నిబట్టే విమానం ఓవర్ లోడ్ అయ్యిందని సిబ్బందికి అర్థమయింది. సాధారణంగా ఆ టైపు బాంబర్ ప్లేన్ ఎగిరే సమయంలో వినియోగమయ్యే పవర్ సైకిల్స్ 1650 నుంచి 1700 కాగా సైగాన్లో టేకాఫ్‌కు 3300 సైకిల్స్ అవసరపడ్డాయి. అది ఒక నిమిషంలోపల సర్దుకుని మామూలు స్థితికి వస్తే ఫరవాలేదు. కాని రాలేదు. ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్ మేజర్ కోనో అది గమనించి పైలట్‌ను అప్రమత్తం చేశాడు. ఫరవాలేదులే. ఓవర్ లోడ్ అయినప్పుడు అంతే. ఇప్పుడు ఏమీ చెయ్యలేము అని జవాబిచ్చాడు పైలట్‌గా ఉన్న సార్జంట్ మేజర్ అవయగి.
పైలట్, కో పైలట్, కెప్టెన్‌లు పని తెలిసినవారే. కానీ గొప్ప సమర్దులు కారు. యుద్ధం చివరిలో జపాన్ ఎన్నో యుద్ద విమానాలను నష్టపోయి, మెరికల్లాంటి పైలట్లు పెద్దసంఖ్యలో హతమైన స్థితిలో అంత దూర ప్రయాణానికి, ఆ రెండోరకం సిబ్బంది కంటే, కండిషను సరిగా లేని విమానం కంటే గత్యంతరం లేకపోయింది. ఆ విమానం లోగడ సింగపూర్‌లో లాండింగ్ సమయంలో ట్రబుల్ ఇచ్చింది. ప్రొపెల్లర్ దెబ్బ తిన్నది. కొత్త ప్రొపెల్లర్ అమర్చే అవకాశం లేనందున పాతదాన్నే సుత్తులతో సరిచేశారు.
మొదట నిశ్చయించిన రూటు సైగాన్ – హీతో – తైహోకు – దైరెన్- టోక్యో. 17న బయలుదేరే సరికే బాగా ఆలస్యమై సాయంత్రం 5 దాటింది. కాసేపటికి చీకటి పడింది. రాత్రి ప్రయాణం కుదరదు. అనుకున్న ప్రకారం ఫార్మోసాలోని హీతో దాకా వెళ్లే వ్యవధి లేదు. కాబట్టి 7-30కి షెడ్యూలులో లేని తౌరాన్‌లో విమానం దింపారు. అది వియత్నాంలో సైగాన్‌కు, హనోయికి నడుమ ఉండే జపనీస్ బేసు. అక్కడ క్వార్టర్ మాస్టర్స్ క్వార్టర్స్‌గా మారిన పాత హోటల్లో ఆ రాత్రి బస చేశారు. జనరల్ షిదేయికి ఇంగ్లిషు, జర్మన్ భాషలు వచ్చు. అతడు, బోస్ బాగా కలిసిపోయారు. ఆ రాత్రి అతడు, బోస్, హబీబ్ బారక్స్‌లో ఒకే గదిలో ఉండి చాలాసేపు మాట్లాడు కున్నారు. యుద్ధానంతరం ప్రపంచ రాజకీయాలు, ఇండియా భవిష్యత్తు గురించి బోస్ వారితో చర్చించాడు.
మర్నాడు పొద్దున్న లెఫ్టినెంట్ కల్నల్ నోనోగాకి విమానాన్ని పరీక్షించాడు. ఒక చక్రంలో చిన్న సొట్ట కనిపించింది. అదనపు బరువు దానికి కారణమై ఉండొచ్చు. ఓవర్‌లోడు పెద్ద సమస్య. యుద్ధం ముగిశాక ఇప్పుడు ఆయుధాలతో పని ఉండదు కనుక విమానంలో గన్ కారేజి ఓపెన్ చేసి అందులోని మెషిన్ గన్లను, ఎక్సట్రా మాగజిన్లను తీసేయించారు. దానివల్ల 600 కిలోల బరువు తగ్గింది.
ఆగస్టు 18 ఉదయం సుమారు 7 గంటలకు విమానం తౌరాన్‌లో బయలు దేరింది. అసలైతే అది హీతోలో ఆగి అన్నీ చెక్ చేసుకుని, ముందు దారిలో పరిస్థితి సవ్యంగా ఉందని నిర్ధారించుకున్నాక తైహోకు వెళ్లాలి. హీతో సమీపానికి వస్తుండగా రష్యా సేనలు చైనాలోని పోర్ట్ ఆర్థర్‌ను ఆక్రమించాయని, ఎప్పుడైనా అవి దైరెన్ చేరుకోవచ్చని రేడియో మెసేజ్ అందింది. రష్యన్ సైనికులు వచ్చి పడేలోగా తాను దైరెన్ చేరుకొని జపాన్ బలగాల కమాండ్ తీసుకోవాలని షిదేయి తొందరపడ్డాడు. అప్పుడు వాతావరణం చక్కగా ఉంది. టాంకులో పెట్రోలు సరిపడా ఉంది. ఇంజన్లు స్మూత్‌గా పనిచేస్తున్నాయి. హీతోను స్కిప్ చేసి ముందుకు సాగవచ్చు అని పైలెట్ అన్నాడు. ఇక ఎక్కడా ఆగకుండా 12000 అడుగుల ఎత్తున (ఆ కాలంలో అది గొప్ప విశేషమే) ఐదు గంటలు పైగా ప్రయాణించి దక్షిణ చైనా సముద్రం మీదుగా మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో విమానం ఫార్మోసా (తైవాన్)రాజధాని తైహోకు (తైపే)లో దిగింది.
తైవాన్ దీవి ఆదినుంచీ చైనాలో భాగం. 1895లో జపాన్‌తో మొదటి యుద్ధంలో ఓడిపోయాక ఇతర ప్రాంతాలతో బాటు ఆ దీవిని కూడా జపాన్ ఆక్రమించింది. ఆ దీవి పేరును ఫార్మోసాగా, రాజధాని తైపే పేరును తైహోకుగా జపాన్ వారు మార్చారు. ప్రపంచయుద్ధంలో ఓడి మూడురోజుల కింద జపాన్ సరెండర్ అయింది. యుద్ధాన్ని గెలిచిన మిత్రరాజ్యాలు ఇంకా ఫార్మోసాను స్వాధీనం చేసుకోలేదు. అధికారం మార్పిడి సంధికాలం కాబట్టి ఎక్కడ చూసినా అనిశ్చిత స్థితి. అంతా అయోమయం. నెల కిందట శత్రువుల బాంబింగులో విమానాశ్రయం బాగా దెబ్బతిన్నది. కంట్రోల్ టవర్లు, హాంగర్లు, ఆఫీసులు ధ్వంసమయ్యాయి.
నేతాజీ బృందాన్ని ఎయిర్‌పోర్టులోని రెజిమెంట్ సైనికులు దగ్గరే ఉన్న గుడారంలోకి తీసుకువెళ్ళి టీ ఇచ్చారు. అందరూ అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకుని శాండ్‌విచ్‌లు, అరటిపండ్లతో లంచ్ చేశారు. జపాన్ వాళ్లు ఈ సారైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుని మనవాళ్లను వెనకనుంచి విమానంలో మన దగ్గరికి చేరుస్తే బావుండు అని భోజనం చేస్తూ రహమాన్‌తో నేతాజీ అన్నాడు. ఇంధనం టాంకులు నింపిన తరవాత పైలట్, మరికొందరు విమానం లోకి వెళ్లి ఇంజన్లను చెక్ చేశారు. ఎడమవైపు ఇంజన్ కాస్త షేక్ అవుతున్నది. అది అంతకుముందు లేదు. కవర్ తీసి ప్లగ్ పాయింట్లను సరిచేస్తే షేకింగ్ సమస్య పోయినట్టే అనిపించింది. మళ్లీ ఎవరి స్థానాల్లో వారు మునుపటివలె కూచున్నారు. మధ్యాహ్నం 2, 2-30 మధ్య విమానం బయలుదేరింది.
మరికొద్ది నిమిషాల్లో ఘోర ప్రమాదం జరిగింది.
కింది నుంచి గమనిస్తున్న ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ ఇంజినీర్ కెప్టెన్ నకమురా కు టేక్ ఆఫ్ సమయంలోనే ఏదో తేడా కనిపించింది. అక్కడ రన్ వే నిడివి 890 మీటర్లు. సాధారణంగా హెవీ బాంబర్ పృష్ఠ భాగం (టెయిల్) రన్ వే సగం దూరం వెళ్లగానే పైకి లేస్తుంది. ఆ రోజు దాదాపుగా చివరివరకు వెళ్లాక గాని లేవలేదు. రన్ వే అంచుకు 50 మీటర్ల దూరంలో విమానం టేకాఫ్ అయింది. 30-40 మీటర్ల ఎత్తుకు లేచిందో లేదో ఎడమ వైపుకు ఒరిగింది. ఎడమ వైపు ప్రొపెల్లర్ విరిగి కిందికి పడింది. పోర్ట్ (ఎడమ) ఇంజన్ పెద్ద పేలుడుతో విమానం నుంచి విడివడింది. పైలట్ ఇంజన్ స్విచ్ ఆఫ్ చేసి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. విమానం బాలన్స్ తప్పి స్పిన్ అయి చెవులు చిల్లులుపడే చప్పుడుతో గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ఎయిర్ స్ట్రిప్‌కు అల్లంత దూరంలో కూలిపోయింది. నాసికాభాగం (నోస్) నేలకు గుద్దుకుని మంటలు లేచాయి. లోపల కింద కూచున్న వారికి సీట్ బెల్టులు లేకపోవటంతో అందరూ ఎగిరిపడ్డారు. లెఫ్టినెంట్ జనరల్ షిదేయి, కో పైలట్ మేజర్ తకిజవా, వైర్లెస్ ఆపరేటరు, ముగ్గురు ఇంజనీర్లు మొత్తం ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. షిదేయి కాళ్లు పైలట్ కుర్చీ కింద ఇరుక్కు పోవటంతో కదలలేక, మెడ తెగి సజీవదహనమయ్యాడు. పైలట్ వెనుక ఉన్న మేజర్ కోనో కేనోపీ తాళం ఓపెన్ చేసి దానిగుండా మంటలమధ్య కిందికి దూకాడు.
తరవాత ఏమైందన్నది హబీబుర్ రహమాన్ ఇలా చెప్పాడు:
‘‘మధ్యాహ్నం 2-35కి విమానం టేకాఫ్ అయింది. ఎయిర్ ఫీల్డ్ దాటకముందే పేలుడు లాంటి పెద్దచప్పుడుతో విమానం కూలిపోయింది. ముందు వైపు మంటలు లేచాయి. ఆ సమయాననాసిక భాగం (నోస్)లో కో పైలట్, వైర్లెస్ ఆపరేటరు, నావిగేటరు, వారి వెనుక పైలటు ఉన్నారు. పైలట్‌కు కుడివైపున జపనీస్ ఆఫీసరు షిదేయి, పైలట్ వెనుక నేతాజీ కూచుని ఉన్నారు. నేతాజీ పక్కనే పెట్రోల్ టాంకు ఉన్నది. ఆయన వెనుక నేనున్నాను. కూలిన కుదుపునకు నా మీద బాగేజీ పడింది. టాంకులోని పెట్రోల్ నేతాజీ మీద చిమ్మింది. ఆయన లేచి నా వైపు తిరిగాడు. ‘ఆగే సే నికలియే పీఛేసే రాస్తా నహీఉ’ (ముందునుంచి వెళ్లండి. వెనుక దారి లేదు) అని నేను అరిచాను. పెట్టెలు, అవీ పడి ద్వారం బిగుసుకు పోయింది. నేతాజీ మంటలలోంచి పరుగెత్తి బైటికి దూకాడు. ఆయన వెనుకే నేనూ.
‘‘నేతాజీ ఒంటి నిండా పెట్రోల్ చింది, ఆయన ధరించిన ఖాకీ డ్రిల్ యూనిఫాం తగలబడింది. ఒళ్లంతా మంటలు అంటుకున్నాయి. నేను పరుగెత్తి ఆయనను చేరి రక్షించే ప్రయత్నం చేశాను. బుష్ షర్టు బెల్టు అతికష్టం మీద ఊడదీసి నేలమీద పడుకోబెట్టాను. ఆయన తలమీద నాలుగు అంగుళాల లోతున పెద్ద గాయమైంది. రక్తం ధారగా కారుతున్నది. మొహమంతా కాలి కమిలి పోయింది. తలమీద జుట్టు కాలిపోయింది. చర్మం ఊడింది. కర్చీఫ్‌తో రక్తప్రవాహం ఆపాలని ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. దుస్తులు తొలగించాక ఆయన ఒంటిమీద కాలిన గాయాలు కనిపించాయి. నాకూ ఒళ్లు కాలింది. భరించలేనంత నొప్పి. నేతాజీ పక్కనే నేనూ నిస్త్రాణగా పడుకున్నాను. ‘ఆప్ కో జ్యాదా తో నహీఉ లగీ?’ (మీకు మరీ ఎక్కువ కాలేదు కదా?) అని ఆయన అడిగాడు. నేను ఫరవాలేదు అన్నాను. ‘నేనైతే బతకను ‘ అని ఆయన ఇంకా ఇలా అన్నాడు:
‘జబ్ అప్నే ముల్క్ వాపస్ జాయే తో ముల్కీ భాయియోం కో బతానా కి మై ఆఖరీ దమ్ తక్ ముల్క్ కీ ఆజాదీ కే లియే లడతా రహా హూ (వో జంగీ ఆజాదీ కో జారీ రఖే. హిందూస్తాన్ జరూర్ ఆజాద్ హోగా. ఉస్ కో కోయీ గులామ్ నహీఉ రఖ్ సక్ తా’ (మీరు వెనక్కి వెళ్లాక మన దేశ సోదరులకు చెప్పండి. నేను చివరి ఊపిరి వరకు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడాను. వారు పోరాటాన్ని కొనసాగించాలి. హిందూస్తాన్ తప్పక స్వాతంత్య్రం పొంది తీరుతుంది. దానిని బానిసత్వంలో ఎవరూ ఉంచజాలరు.)
తల నుంచి పాదాల దాకా మంటల్లో కాలుతూ పరుగెత్తుతున్న నేతాజీని చూసిన కోనోకు జపనీస్ అగ్నిదేవుడు ఫుదోమ్యూ గుర్తొచ్చాడు.ఆ స్థితిలో నేతాజీని నేల మీద దొర్లించి మంటలు అర్పటంలో హబిబుర్‌కు సహ ప్రయాణికుడు నోనోగాకి సహాయపడ్డాడు. పది పదిహేను నిమిషాల్లో ఫస్ట్ ఎయిడ్ బృందం హుటాహుటిన వచ్చి, వంటికి అతుక్కుపోయిన దుస్తులను కట్ చేసి, గాయాలకు డ్రెస్సింగ్ చేసి బోస్‌నూ, రహమాన్‌నూ లారీలో దగ్గరలోనే ఉన్న ఆర్మీ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అప్పుడున్న గందరగోళ పరిస్థితుల్లో కనీసం అంబులెన్సు కూడా అందుబాటులో లేదు. గాయపడిన వారిని మిలిటరీ లారీల్లో ఆస్పత్రికి చేరవేశారు.
తలపగిలి, ఒళ్లంతా కాలి ఆస్పత్రికి చేరినవారు ఎవరైనా తమకు ఎంత త్వరగా చికిత్స జరుగుతుందా అని ఆరాటపడతారు. తైపే ఆర్మీ ఆస్పత్రికి వెళ్ల గానే తన చుట్టూ చేరిన డాక్టర్లతో సుభాస్ చంద్ర బోస్ అన్న మొదటి మాట ‘ముందు నన్ను కాదు.. మిగతావాళ్ల సంగతి చూడండి’ అని! అందరికంటే ఆయన పరిస్థితే మరీ విషమంగా ఉన్నది కనుక వైద్యులు మొదట ఆయనకే ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. నేతాజీ తలమీద పెద్ద గాయం. తల, చాతీ, తొడల మీద సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీలలో కాలిన తీవ్ర గాయాలు ఉన్నాయి. చర్మం చాలా చోట్ల ఊడిపోయింది. శరీరం బూడిద రంగులోకి మారింది. మొహమంతా వాచింది. వాచిన కళ్లు తెరిచినా సరిగా చూడలేకపోతున్నాడు. జ్వరం బాగా ఉంది. టెంపరేచర్ 39 డిగ్రీల సెంటిగ్రేడ్. పల్స్ రేటు 120. గుండె బలహీనంగా ఉంది. ఈయన ‘చంద్ర బోస్’. వివిఐపి. ఈయన ప్రాణం ఎలాగైనా కాపాడాలి అని జపనీస్ ఆఫీసర్లు వైద్యులను కోరారు. కానీ బతికే అవకాశం లేదని చీఫ్ మెడికల్ ఆఫీసరు డాక్టర్ యోషిమికి, డ్యూటీ డాక్టర్ త్సురుతకు చంద్ర బోస్‌ను చూడగానే అర్థమయింది. బోస్‌కు విటాకాంఫర్, డిజిటమిన్ ఇంజెక్షన్లు, రింగర్ సొల్యూషన్, సల్ఫా డ్రగ్స్ ఇచ్చి గాయాలకు మందు రాసి తల నుంచి కాళ్ల దాకా గాయాలకు బాండేజీ వేశారు. థర్డ్ డిగ్రీ బర్నస్ వల్ల రక్తం చిక్కబడి గుండె మీద ఒత్తిడి పెరిగింది. 200 సి.సి.ల చెడు రక్తం ఓడ్చి 400 సి.సి.ల కొత్త రక్తం ఎక్కించారు.
మగతగా ఉన్నా మొదటి నాలుగు గంటలు సుభాస్ స్పృహలో ఉండి తన పక్కన ఉన్న రహమాన్‌తో, వైద్యులతో ఇంగ్లీషులో ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. ఏమంటున్నాడో తెలుసు కోవటానికి నకమురా అనే దుబాసీని పిలిపించారు. అతడు లోగడ బోస్ అక్కడికి వెళ్లినప్పుడు దుబాసీగా పనిచేసినవాడు. ఆస్పత్రిలో బోస్‌ను చూడగానే గుర్తుపట్టాడు.
ఒళ్లంతా కాలి భయానక వేదన అనుభవిస్తున్నా ఒక మూలుగు గాని, బాధగా ఉందన్న మాట గాని నేతాజీ నోటి వెంట రాలేదు. తాగేందుకు నీరు కావాలని మాత్రం అప్పుడప్పుడూ అడిగాడు. అంతటి యమయాతనను ఆయన మౌనంగా ఓర్చుకున్న తీరు వైద్యులనే ఆశ్చర్యపరచింది. లెఫ్టినెంట్ కల్నల్ నోనోగాకి బోస్ దగ్గరికి వెళ్లి ఏమైనా చెబుతారా అని అడిగితే ఒకసారి తెరౌచీని గుర్తుచేసుకున్నాడు. ‘ఇంకా ఎక్కువ టైము లేదు. ఆయన చెప్పదలచుకున్నది ఏమైనా ఉంటే స్టేట్మెంటు రికార్డు చేద్దామని డాక్టర్ యోషిమి అన్నాడు.. ఏమైనా చెబుతారా అని సాయంత్రం 6 గంటలకు దుబాసీ అడిగితే ‘మా వాళ్లు వస్తున్నారు. వాళ్లను జాగ్రత్తగా చూడాలి…. షిదేయి ఎలా ఉన్నాడు?… నిద్ర పోవాలని ఉంది’ అని నేతాజీ చెప్పాడు. తన శరీర బాధ గురించి ఒక్కమాటా అనలేదు. బాధ ఎక్కువగా ఉందా అని వైద్యుడు అడిగితే జవాబు చెప్పలేదు. ఒక మారు ‘హసన్’ అని గొణిగాడు. ‘హసన్ ఇక్కడ లేదు సాబ్. నేను హబీబ్‌ని’ అని రహమన్ అంటే ఏమీ మాట్లాడలేదు.
రాత్రి 7 తరవాత పరిస్థితి విషమించింది. కాపాడటానికి డాక్టర్ల బృందం చేసిన ప్రయత్నాలేవీ పనిచేయలేదు. ఎలా ఉంది అని డాక్టర్ యోషిమి అడిగితే ‘తలలోకి రక్తం ఎగజిమ్ముతున్నది. నిద్రపోవాలని ఉంది.’ అన్నాడు బోస్. చివరిలో స్వాతంత్య్రం గురించి ఏదో గొణిగాడు. తరవాత మెల్లిగా కోమాలోకి వెళ్లాడు.
1945 ఆగస్టు 18 రాత్రి 9, 10 గంటల మధ్య మహావీరుడు, భావి భారత స్వాతంత్య్ర ప్రదాత నేతాజీ సుభాస్ చంద్ర బోస్ భారతమాత పాదాల చెంత ప్రశాంతంగా ప్రాణం విడిచాడు. ప్రధాన వైద్యుడు డాక్టర్ యోషిమి, డాక్టర్ త్సురుత, జపనీస్ మేజర్ నగాతమో, కల్నల్ రహమాన్, దుబాసీ నకమురా, కొందరు నర్సులు ఆ సమయాన ఆయన పక్కనే ఉన్నారు.