– సుజాత గోపగోని, 6302164068
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు ఏ ఉపఎన్నికలోనూ చేయని స్థాయిలో ప్రచారం హుజురాబాద్‌లో చేశారు. అధికార, పార్టీ యంత్రాంగాన్నంతా ఒక్క ఆ నియోజకవర్గానికే పరిమితం చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో పథకాలను ప్రకటించడం, అప్పటికప్పుడు అటకెక్కిన కొన్ని ఫైళ్లను బూజు దులిపి.. పెండిరగ్‌లో ఉన్న పథకాల దరఖాస్తులు స్వీకరించడం వంటి ఎన్నో పరిణామాలను మనం చూశాం. అయితే, ఇప్పుడు హుజురాబాద్ ఉపఎన్నిక ఓ చరిత్ర అయిపోయింది. అందరూ దాన్ని మర్చిపోయారు. కానీ, ఒకే ఒక్కరిని ఈ ఎన్నిక ఇంకా పీడకలలా వెంటాడుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా తన సహజ స్వభావాన్ని పక్కనబెట్టి ప్రసంగాలు చేయడానికి, విమర్శలు గుప్పించడానికి, అసహజమైన భాషను అధికారిక పీఠం నుంచి మాట్లాడిరచడానికి కారణమవుతోంది. ఆయనే సీఎం కేసీఆర్.
తెలంగాణ రాష్ట్రం తెచ్చిందే తామంటూ స్వీయ పేటెంట్‌ను దక్కించుకున్న టీఆర్‌ఎస్‌ని హుజురాబాద్ ఉపఎన్నిక విస్తుపోయేలా చేసింది. నెలరోజులు గడిచిపోయినా ఆ ఓటమి ఇంకా వెంటాడుతూనే ఉంది. ఎంతలా అంటే.. ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీ తమకే ఉన్నప్పటికీ ఓడిపోతామేమో అన్న భయాన్ని నిలువెల్లా నింపుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు కేసీఆర్‌కు చెమటలు పట్టిస్తున్నాయి. గతంలో అయితే కంటిచూపుతో సరిదిద్దుకోవాల్సిన పరిస్థితులు.. ఇప్పుడు విపక్షాలను, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రెస్‌మీట్ పెట్టి మరీ దూషించాల్సిన స్థాయికి చేర్చాయి. రాజకీయ వ్యూహ చతురుడిగా పేరొందిన కేసీఆర్ అందులో భాగంగానే ఇప్పుడు ప్రజల దృష్టిని మరల్చే వ్యూహానికి పదును పెడుతున్నారు. అయితే, ఇప్పటికే క్షేత్రస్థాయి లోకి టీఆర్‌ఎస్ పట్ల వ్యతిరేకత చొచ్చుకు పోవడం.. తొలినుంచీ జరుగుతున్న పరిణామాలు, అవసరమై నప్పుడు ఇస్తున్న హామీలు.. అవసరం తీరాక నీళ్లొదిలేస్తున్న వైనం ప్రజల్లో బలంగా నాటుకొని పోవడం వంటి కారణాలు కేసీఆర్‌కు నిద్ర పట్టనీయడం లేదు. అందుకే పరిస్థితులను పక్కదారి పట్టించే వ్యాఖ్యానాలు, విమర్శలు, ఆరోపణలు, ప్రసంగాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు.
వాస్తవానికి కేసీఆర్ వ్యవహారశైలి మొదటినుంచీ కూడా ఎవరికీ అంతుబట్టదు. ఒకరకంగా ఎవరి మాటా వినని సీతయ్య మాదిరిగా తన ఆలోచనలు, తన ప్రయోగాలు, తన వ్యూహాలను మాత్రమే ఆచరణలో పెడతారని ఆయనకు సన్నిహితంగా మెదిలిన వాళ్లు చెబుతారు. అందుకే ఉద్యమకాలం నుంచి టీఆర్‌ఎస్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన వాళ్లంతా పార్టీకి ఇప్పుడు దూరమయ్యారు. దూరమయ్యారనేకంటే.. కేసీఆరే దూరం చేసుకున్నారని చెప్పవచ్చు. ఈటల రాజేందర్‌ను కూడా పొమ్మనలేక పొగబెట్టి బయటకు పంపించారు. కేసీఆర్‌కు తొలినుంచీ సన్నిహితుల్లో ప్రధానమైన వ్యక్తి కావడం, కేసీఆర్ ఆనుపానులు అన్నీ తెలిసి ఉండటం వల్ల హుజురాబాద్ ఎన్నికను ఈటల ఎదుర్కోగలిగారు. దానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బలం కూడా తోడయింది. ఈటల హుజురాబాద్‌లో గెలుపుబావుటా ఎగురవేసి ఒకరకంగా టీఆర్‌ఎస్ అహంకారంపై దెబ్బకొట్టారన్న విశ్లేషణలు వినిపించాయి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్లు, చేస్తున్న ప్రసంగాలు, వాడుతున్న పదజాలం వంటివి ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి.
తెలంగాణలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవుల ఎన్నికలకు నోటిఫికేషిన్ వెలువ డిరది. స్థానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీలను ఏకగ్రీవం చేసుకోడానికి గులాబీదళం ప్రయత్నించినా 6 మాత్రమే దక్కి, మిగతా 6 చోట్ల ఎన్నిక అనివార్య మైంది. ప్రస్తుతం రాష్ట్రంలో అదే వేడి నడుస్తోంది. వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌కే పూర్తిస్థాయి మెజారిటీకి అవకాశా లున్నాయి. స్థానిక సంస్థలన్నీ దాదాపు తెలంగాణ రాష్ట్ర సమితి చేతిలో ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను నిలపగా, బీజేపీ అయితే అసలు పోటీకే దూరంగా ఉంది. ఫలితంగా టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు నల్లేరుమీద నడక మాదిరిగానే ఉండాలి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయన్న సంకేతాలు వస్తున్నాయి. అందుకే కేసీఆర్‌లో అసహనం స్థాయి పెరిగిపోయిం దంటున్నారు.
టీఆర్‌ఎస్‌లో ప్రధానంగా రెండు బ్యాచ్‌ల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూ ఉంటుంది. యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్.. వీటి గురించి పార్టీలో కిందిస్థాయి కార్యకర్త దగ్గరినుంచి కేసీఆర్ దాకా అందరికీ తెలుసు. యూటీ అంటే ‘ఉద్యమ తెలంగాణ’ బ్యాచ్ అనీ, బీటీ బ్యాచ్ అంటే ‘బంగారు తెలంగాణ’ బ్యాచ్ అని పిలుచుకుంటారు. ఇదంతా బహిరంగ రహస్యమే. యూటీ బ్యాచ్ అంటే, తెలంగాణ ఉద్యమ సమయం నుంచీ పార్టీలో కొనసాగుతూ, పార్టీ విజయాలకు నిస్వార్థంగా సేవ చేసే బ్యాచ్ అనీ, బీటీ బ్యాచ్ అంటే టీఆర్‌ఎస్‌కు అధికారం దక్కిన తర్వాత ఇతర పార్టీలనుంచి వలసలు వచ్చి కీలక పదవులు దక్కించుకున్న వాళ్ల బ్యాచ్ అనీ చెప్పుకుంటారు. మొదటినుంచీ కేసీఆర్ యూటీ బ్యాచ్ కంటే బీటీ బ్యాచ్‌కే ప్రాధాన్యం ఇస్తారన్న ప్రచారం ఉంది. అయితే, మొన్నటి హుజురాబాద్ ఉపఎన్నిక తర్వాత ఒకరిద్దరు యూటీ బ్యాచ్‌కు చెందిన వాళ్లకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు కేసీఆర్. కానీ, అలాంటివాళ్లు ఇంకా ఉన్నారని, ఇన్నాళ్లు పదవులు ఆశించకున్నా.. ఇప్పుడైనా అవకాశాలు వస్తాయని ఎదురుచూస్తున్న వాళ్ల జాబితా చాంతాడంత ఉంటుందంటే ఆశ్చర్యం కాదు. అందులో ఒకరు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్. తొలినుంచీ పార్టీలో ఉన్న నాయకుడు. అంతేకాదు, ఆయనకు స్వయంగా కేసీఆర్ పలుసార్లు ఎమ్మెల్సీ సీటు ఇస్తానని బహిరంగంగానే ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎల్.రమణ, భానుప్రసాద రావుకు అవకాశం కల్పించారు కేసీఆర్. కానీ, మొదటినుంచీ హామీ ఇచ్చి, ఆశ పెట్టి తనను మోసం చేశారన్న ఆక్రోశం రవీందర్‌సింగ్‌ను కుదురుగా ఉండనీయలేదు. అందుకే ఎమ్మెల్సీ పదవికి స్వతంత్రుడిగా పోటీలో ఉన్నారు. అధికార వర్గాల వేధింపులు, టీఆర్‌ఎస్ నేతల బెదిరింపులు ఉంటాయని తన ఫోన్ కూడా స్విచాఫ్ చేసుకున్నారు. ఇన్నాళ్లు అసంతృప్తి గూడుకట్టుకొని ఉన్నా టీఆర్‌ఎస్‌ను ఎదిరించలేమన్న కారణంగా బయటపడలేదు. కానీ, హుజురాబాద్ ఉపఎన్నిక తర్వాత టీఆర్‌ఎస్‌కు ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో బట్టబయ లయింది. రవీందర్‌సింగ్ తిరుగుబావుటా వెనక ఈటల రాజేందర్ హస్తం కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈటల పరపతితో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సునాయాసంగా రవీందర్‌కు పోలింగ్‌లో సానుభూతి చూపిస్తారని అనుకుంటు న్నారు. దీంతో ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు కొత్త టెన్షన్ పట్టుకుంది.
కరీంనగర్ జిల్లాలో 1300కు పైగా స్థానిక ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో 1,000కి పైగా టీఆర్‌స్‌కు చెందినవారే. కాంగ్రెస్, బీజేపీలు ఇక్కడ పోటీకి దూరంగానే ఉన్నాయి. అయితే, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ పోటీలో ఉండటం టీఆర్‌ఎస్‌కు ఇబ్బందికరంగా మారింది. అందుకే, స్థానిక సంస్థల ప్రజా ప్రతి నిధులను టీఆర్‌ఎస్ పార్టీ క్యాంపులకు తరలించింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో వీరంతా వెళ్లిపోయారు. హైదరాబాద్ శివార్లలోని ఓ రిసార్ట్‌లో వీరికి క్యాంప్ ఏర్పాటు చేశారు.
టీఆర్‌ఎస్‌లో యూటీ, బీటీ బ్యాచ్‌లకు తోడు.. సరికొత్త వర్గం పురుడు పోసుకుందన్న రవీందర్ సింగ్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. కేసీఆర్ తనను ఎలా మోసం చేసిందీ చెబుతున్న తీరు అందరినీ ఆలోచింపజేస్తోంది. ఇప్పటిదాకా పార్టీలో ఉద్యమ తెలంగాణ బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్ కాకుండా కొత్తగా మెయింటెనెన్స్ బ్యాచ్ కూడా మొదలయిందని.. తప్పుడు పద్ధతులు, అక్రమ మార్గాల్లో ఎన్నికలను నడిపించడమే ఈ కొత్త బ్యాచ్ పని అని, కరీంనగర్‌లో ఎమ్మెల్సీ స్థానానికి తన నామినేషన్‌ను కూడా అడ్డుకోవాలని ఈ బ్యాచ్ తీవ్రంగా ప్రయత్నించిందని రవీందర్‌సింగ్ ఆరోపించారు. నిజానికి తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని మంచిర్యాల జిల్లాలోని అర్జున గుట్ట పుష్కరాల సాక్షిగా కేసీఆర్ 15 ఏళ్ల క్రితం వాగ్దానం చేశాడని, ఆ తర్వాత మహబూబ్‌నగర్ ఉపఎన్నిక సందర్భంలో మరోసారి నాయిని నరసింహరెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డిల సమక్షంలోనూ అదే మాట చెప్పారని బాంబుపేల్చారు. తనకు పదవి ఇవ్వకున్నా ఫర్వాలేదుగానీ.. ఏనాడూ జై తెలంగాణ అననివాళ్లకు, ఉద్యమ ద్రోహులకు పిలిచి మరీ కేసీఆర్ పదవులు ఇవ్వడం ఉద్యమకారులను అవమానించినట్లే అని మండిపడ్డారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కేబినెట్ నిర్ణయాలు వెల్లడిరచేందుకు నవంబర్ 29న మీడియా సమావేశం ఏర్పాటుచేసిన కేసీఆర్.. చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. బీజేపీ రెండు మూడు సీట్లు గెలవగానే ఎగిరెగిరిపడుతోందని ఆయన మండిపడ్డారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇప్పటికే తాము 13 ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకున్నామని.. ఒకవేళ ఓడిపోతే ఒకటి రెండు సీట్లు ఓడిపోవచ్చని.. దాన్ని తాము పెద్దగా పట్టించుకోబోమని అన్నారు. అయితే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు అనుకోకుండా చేశారా లేక కావాలనే చేశారా? అనే చర్చ మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కేసీఆర్‌కు షాక్ ఇచ్చేందుకు రవీందర్‌సింగ్‌ను ఈటల బరిలోకి దింపారని.. ఆయనను గెలిపించుకునేందుకు పక్కా వ్యూహాన్ని కూడా సిద్ధం చేసుకున్నారని కరీంనగర్ జిల్లా రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్