– ఎస్‌ గురుమూర్తి (ఎడిటర్‌, ‘తుగ్లక్‌’, ఆర్థిక రాజకీయ వ్యవహారాల విశ్లేషకులు)

‘‘భారతీయుల జీవనశైలి, వారి మానసిక స్థితి ఇంకా, ఆచార విచారాలను హిందుత్వ  వివరిస్తుంది. హిందూ, హిందుత్వ, హిందూ యిజమ్‌ను భారతీయ సంస్కృతి, వారసత్వ విషయం నుంచి మినహా యించి కేవలం మతానికి చెందిన ఇరుకైన పరిమితులకు లోబడి ఉంచకూడదు. లేదా హిందూమతాన్ని ఒక ధర్మంగా పాటిస్తున్న వ్యక్తులకు పరిమితం చేయరాదు. హిందుత్వ లేదా హిందూయిజమ్‌ను ఇతర మత విశ్వాసాల పట్ల ఇరుకైన ఛాందసవాద హిందూ ధార్మిక మత దురాభిమానం లేదా శత్రుభావం, విద్వేషం లేదా అసహనం లేదా మతవాదంతో సమం చేయరాదు.’’ ఇదంతా ఎవరన్నారు? ఆగండి! ఇది సగం మాత్రమే. ఇదిగో మిగిలిన అర్ధ భాగాన్ని అవలోకించండి.

‘సన్‌రైజ్‌ ఓవర్‌ అయోధ్య’ పేరుతో ప్రముఖ రాజకీయ నాయకుడు, పెద్దగా పేరు లేని న్యాయవాది రచించిన ఒక పుస్తకం ఇటీవల విడుదలైంది. అంతర్జాతీయ ఇస్లామిక్‌ తీవ్రవాద సంస్థలైన ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా (ఐసిస్‌), నైజీరియాకు చెందిన బొకొ హరామ్‌లతో భారత్‌లో హిందుత్వ ఉద్యమం సైద్ధాంతిక సారూప్యతను కలిగి ఉందని సదరు పుస్తకం పేర్కొంది. పైన ప్రస్తావించిన రెండు ఉగ్రవాద సంస్థలు లక్షలాదిగా అమాయక ప్రజలను పొట్టనపెట్టుకున్నాయి. వేలాది మందిని లైంగిక బానిసలను చేశాయి. చిత్రహింసల పాల్జేశాయి. బతికుండగానే దేహాల నుంచి అవయవాలను ఖండ ఖండాలు చేశాయి. ప్రజలతో బలవంతంగా మత మార్పిడి చేయించాయి. ముస్లిమేతరులను నిర్మూలించి కేవలం ముస్లిములతో కూడిన ఒక అంతర్జాతీయ ఇస్లామిక్‌ రాజ్యం ఏర్పాటు లక్ష్యంగా దేశాలపై యుద్ధానికి దిగాయి. ఏమిటా పుస్తకం, రచయిత ఎవరు? ఈ రెండు ప్రశ్నలకు సమాధానంతో పూర్తి కథనం సంపూర్ణమవుతుంది.

మొదటి ప్రశ్నకు సమాధానంగా భారతీయుల జీవన విధానం, సంస్కృతి, ఆచార విచారాలతో హిందుత్వ, హిందూయిజమ్‌ కూడుకున్నదని సహేతుకమైన వాస్తవాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం 1995లో సుప్రీం కోర్టు ఒక తీర్పును వెలువరించింది. హిందుత్వను ఐసిస్‌, బొకొ హరామ్‌తో సమం చేసిన పుస్తక రచయిత సల్మాన్‌ ఖుర్షీద్‌. ఆయన కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, న్యాయవాది కూడాను. 1995 నాటి తీర్పును పున:పరిశీలించాలని 2019లో కోర్టును కోరిన ఘనుడు. మరిప్పుడు హిందుత్వ తత్త్వాన్ని ఐసిస్‌ లేదా బొకో హరామ్‌ సిద్ధాంతంతో ఖుర్షీద్‌ సమం చేస్తున్నారా? లేక ఐసిస్‌ తరహా హిందుత్వను భారతీయ జీవన విధానం, సంస్కృతి, ఆచార విచారాలుగా పేర్కొన్న సుప్రీం కోర్టును అపహాస్యం చేస్తున్నారా? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలు దురదృష్టవ శాత్తూ భారతీయ సమాజం నిర్లక్ష్యానికి గురయ్యాయి.

ముగ్గురూ ఏకమయ్యారు

ఖుర్షీద్‌ పార్టీ సహచరులు పి. చిదంబరం పేరొందిన న్యాయవాది. అలాగే పేరొందిన నేత దిగ్విజయ్‌ సింగ్‌. ఖుర్షీద్‌ రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ముగ్గురూ కూడా సైద్ధాంతికంగా ఒకే పంచన చేరినవారు. వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాలు నిషేధించిన టెర్రరిస్టు సంస్థ భారత విద్యార్థుల ఇస్లామిక్‌ ఉద్యమం (సిమి)ను ఖుర్షీద్‌ వెనకేసుకొచ్చారు. సిమిని ఒక శాంతియుతమైన సంస్థ అని తీర్పు ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హిందూత్వపై ఇచ్చిన తీర్పును కూకటివేళ్లతో సహా పెకలించివేయాలని ఖుర్షీద్‌ ఆకాంక్షించారు. హోమ్‌ మంత్రిగా ఉండగా ఇస్లామిక్‌ ఉగ్రవాదంతో సమంగా హిందూ ఉగ్రవాదం అనే దురాలోచనను తెరమీదకు తీసుకురావడానికి తనదైన లిటిగేషన్‌ బుర్రను చిదంబరం ఉపయోగించారు.

హిందూ ఉగ్రవాదం అనే రూపాన్ని సృష్టించడా నికి దిగ్విజయ్‌ సింగ్‌ చిరకాలంగా ప్రయాస పడుతున్నారు. ఉగ్రవాదానికి మతంతో సంబంధం లేదు. అదీ కాకుంటే ఇస్లామ్‌ ఉగ్రవాదానికి కంపెనీ ఇవ్వడానికి హిందూ ఉగ్రవాదాన్ని ఆవిష్కరించాలనే ఒక దృక్కోణాన్ని ఈ ముగ్గురు పెద్ద మనుషులు పెంచి పోషిస్తున్నారు.

ఖుర్షీద్‌ రాసిన తాజా పుస్తకం హిందూ ఉగ్రవాదం అనే దృక్కోణాన్ని స్థానికత నుంచి అంతర్జాతీయ స్థాయికి చేర్చింది. భారత్‌లో హిందుత్వ ఉద్యమాన్ని ఐసిస్‌ , బొకో హరామ్‌లతో సరిసమానం చేసింది. హిందూత్వ ఉద్యమంతో ఖుర్షీద్‌ పోల్చిన ఐసిస్‌, బొకొ హరామ్‌ల వివరాలు తెలుసుకుందాం.

 ఐసిస్‌, బొకొ హరామ్‌

 ఇస్లామ్‌ పురుడు పోసుకున్న తొలినాళ్లలో ఇస్లామ్‌ ఖలీఫత్‌కు వారసత్వంగా ఐసిస్‌ ఉద్భవించిందని చెప్పారు. ప్రపంచంలో ముస్లిములందరూ తన పట్ల విధేయతను ప్రదర్శించాలని ఐసిస్‌ ఆదేశించింది. అమెరికా మేథోవర్గంగా చెప్పుకునే విల్సన్‌ సెంటర్‌ ప్రకారం ఒకవైపు ముస్లిములు, మరొక వైపు అమెరికా, రష్యా, యూదుల నేతృత్వంలో ముస్లిమేతరులను కాఫిర్లుగా పేర్కొంటూ ప్రపంచాన్ని ఐసిస్‌ రెండుగా విభజించింది. దాని దృష్టిలో టెర్రరిజం అంటే అల్లాను పూజించటంతో సమానం. అలా చేయాలని ముస్లిములను ఆయన ఆదేశించారని ఐసిస్‌ చెప్పుకుంటుంది. అంతర్జాతీయ ఇస్లామిక్‌ రాజ్య ప్రతిష్ఠాపన కోసం అమాయకుల హత్యలు, క్రైస్తవులు, యాజిదీలను పీడిరచడం, బలవంతపు మత మార్పిడులు, మనుషులపై అకృత్యాలు, బతికుండగానే దేహాలను ముక్కలు ముక్కలుగా చేయడం, మహిళల అణచివేత, సెక్స్‌ బానిసత్వం, పరస్త్రీ అధీనం, దారుణమైన శిక్షలతో కూడిన ఐసిస్‌ అకృత్యాల జాబితాను ఇస్లామిక్‌ నెట్‌వర్క్స్‌ గ్రూప్‌ (ఐఎన్‌జీ) వెలువరించింది.

Statista.com ప్రకారం 2013, 2018 సంవత్సరాల మధ్య కాలంలో 28,000 మందికి పైగా అమాయకులను ఐసిస్‌ పొట్టనపెట్టుకుంది. ుష్ట్రవ The Quint.com 2018లో తీసుకువచ్చిన ఒక నివేదిక ప్రకారం దాదాపు 3,000 మంది మహిళలు, బాలికలను సెక్స్‌ బానిసలుగా ఐసిస్‌ మార్చింది. విదేశీ యోధులకు వారిని బహుకరించింది. నాలుగు లక్షల మందితో కూడిన యాజిది తెగలో అందమైన బాలికలను సెక్స్‌ బానిసలుగా మార్చడంలో ఐసిస్‌ తొలి ప్రాధాన్యం ఇస్తుంది. 2015నాటి ఎన్‌బీసీ నివేదిక ప్రకారం జర్మనీలో దాదాపు 1,110 మంది ఐసిస్‌ సెక్స్‌ బానిసలు నివసిస్తున్నారు.

బొకొ హరామ్‌ విషయానికి వద్దాం. నైజీరియాకు చెందిన ఈ జిహాదీ మూక ‘నకిలీ ముస్లిము’లను మట్టుపెట్టి నైజీరియాలో అసలు సిసలు ముస్లిము రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ఆకాంక్షిస్తున్నది. 2015 సంవత్సరంలో రాయిటర్స్‌ నివేదిక ప్రకారం బొకొ హరామ్‌ కారణంగా 23 లక్షల మంది నిరాశ్రయులై నారు. 2,50,000 మంది నైజీరియా నుంచి శరణార్థులుగా ఇతర దేశాలకు తరలిపోయారు. అదే ఏడాది ది ఇండిపెండెంట్‌ వెలువరించిన నివేదిక ప్రకారం 2014 సంవత్సరంలో దాదాపు 6,600 మంది ప్రజలను బొకొ హరామ్‌ పొట్టనపెట్టుకున్నది. ఇలాంటి అకృత్యాల ఘన చరిత్రను సంతరించుకున్న ఉగ్రవాద సంస్థలతో ప్రజాస్వామ్యబద్ధమైన, ఓటర్ల ఉద్యమంతో కూడుకున్న హిందుత్వను పోల్చడం ఒక్క ఖుర్షీద్‌కు మాత్రమే చెల్లింది.

2016 సంవత్సరంలో, 21 సంవత్సరాల తర్వాత, హిందుత్వ నిర్ణయంపై పునరాలోచన చేయడానికి ఏడుగురు జడ్జీలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. 2019లో హిందుత్వను ఐదుగురు జడ్జీలతో కూడిన ధర్మాసనం ఎదుటకు తీసుకు వెళ్ళాలన్న ఖుర్షీద్‌ ప్రయత్నం విఫలమైంది. కోర్టులో విఫలమైన తర్వాత ఐసిస్‌, బొకొ హరామ్‌లతో హిందుత్వను సరిసమానం చేస్తూ ఒక పుస్తకాన్ని ఆయన తీసుకువచ్చారు. అది హిందుత్వపై దాడినా? లేక హిందుత్వను ఆమోదించిన కోర్టుపైనా?

హిందుత్వపై 1960వ దశకం, 1970వ దశకంలో సుప్రీం కోర్టు దృక్పథాలు

హిందుత్వపై తీర్పు రాజకీయాల నుంచి రూపుదిద్దుకున్నది కాదు. దానిని వ్యతిరేకించే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, దానిని బలపరిచే బీజేపీ విపక్షంలో ఉన్న కాలంలో ఆ తీర్పు వెలువడిరది. బీజేపీ, శివసేన పార్టీలు వాటి ఎన్నికల మ్యానిఫేస్టోల్లో చోటు కల్పించడంతో 1991లో భారతీయ రాజకీయ బాహుళ్యంలోకి హిందుత్వ అడుగుపెట్టింది. హిందుత్వ ఒక ధార్మికమైన, మతపరమైన రూపం సంతరించుకున్నదనే వాదన ప్రాతిపదికగా వాటి ఎన్నికలు సవాల్‌కు నోచుకున్నాయి. ఇది హిందుత్వ ధార్మికత, మతతత్త్వాన్ని సంతరించు కున్నదా అనే ప్రశ్నకు సుప్రీం కోర్టు జవాబు చెప్పాల్సిన పరిస్థితికి దారి తీసింది.

హిందుత్వ ఒక విస్తారమైన అర్థాన్ని కలిగి ఉన్నదని, సమ్మిళితమైనదని, ధార్మికపరమైనది కాదనే తీర్పును 1995లో కోర్టు వెలువరించింది. కానీ హిందుత్వ అనేది భారతీయ జీవనశైలి, సంస్కృతి, ఆచార వ్యవహారాలతో కూడుకున్నదనే విషయాన్ని సదరు తీర్పు ప్రధానంగా ప్రస్తావించింది. అది 1995 సంవత్సరంలో కోర్టు ఆవిష్కరించిన అంశం కాదు. హిందుత్వ అంటే అర్థం చెబుతూ కోర్టుకు చెందిన గతకాలపు రాజ్యాంగ ధర్మాసనం వరుసగా వెలువరించిన తీర్పుల సమాహారం. వాటిలో 1966లో జస్టిస్‌ గజేంద్ర గడ్కర్‌ వెలువరించిన తీర్పు, 1976లో చీఫ్‌ జస్టిస్‌ ఏఎన్‌ రే, జస్టిస్‌ జస్వంత్‌ సింగ్‌, జస్టిస్‌ ఎంహెచ్‌ బేగ్‌, జస్టిస్‌ పీఎన్‌ సింఘాల్‌, జస్టిస్‌ ఆర్‌ఎస్‌ సర్కారియాలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు కీలకమైనవి.

1976 నాటి కేసు చరిత్రాత్మకమైనది. హిందూ తత్త్వంపై ఒక న్యాయపరమైన దర్యాప్తునకు ఆదేశించింది. క్రైస్తవ మతానికి చెందిన భార్య, శిశువుతో కూడుకున్న హిందూ కుటుంబాన్ని ఒక అవిభాజ్యమైన హిందూ కుటుంబంగా పరిగణించేదీ లేనిదీ నిర్ణయించమని ఆదేశించింది. ఈ కేసులో కోర్టు కనీవినీ ఎరుగని తీర్పును ఇచ్చింది. హిందూయిజమ్‌ కేవలం ఒక మతానికి మాత్రమే పరిమితం కాదని, ఒక అవిభాజ్య హిందూ కుటుంబం క్రైస్తవ సభ్యులను కలిగి ఉండవచ్చని తెలిపింది. అనేక ధార్మిక సిద్ధాంతాలతో కూడుకున్న ప్రపంచంలో అత్యంత సరళీకృతమైన తీర్పుగా నిలిచిపోయింది. హిందూయిజమ్‌పై తన తీర్పుకు మద్దతుగా అంతర్జాతీయ సాహిత్యమైన ఎన్‌సైక్లోపిడియా బ్రిటానికాను కోర్టు ఉటంకించింది.

మతపరమైనది కాదు, నాగరికమైనది

హిందూయిజమ్‌ గురించి తొమ్మిది కీలకమైన అంశాలను ఎన్‌సైక్లోపిడియా బ్రిటానికా పేర్కొంది. వాటిలో మొదటిది, హిందూయిజమ్‌ అనేది ప్రత్యేకించి ఒక దానిని ఎంచుకోవడం లేదా తొలగించకుండా అన్ని రూపాల్లోని విశ్వాసాలు , ప్రార్థనా పద్ధతులను తనలో సమ్మిళితం చేసుకుంది. పరమత సహనం అవలంబిస్తూ హిందువులు, హిందువేతరులు ఉభయులను వారికి నచ్చిన ప్రార్థనా విధానాలను అనుసరించడానికి హిందూయిజమ్‌ ఉపకరిస్తుందని రెండవ అంశం తెలిపింది. ఒక హిందువు హిందువుగా ఉంటూనే హిందూయేతర మతాన్ని అవలంబించవచ్చని మూడవ అంశం పేర్కొంది. ఇతర రూపాల్లోని ప్రార్ధనా విధానాలు, అరుదైన దేవీదేవతలు, సంప్రదాయాలను హిందువు పాటించవచ్చునని నాల్గవ అంశం ప్రస్తావించింది. యావత్‌ మానవాళి సంక్షేమం కోసం అత్యున్నతమైన దైవికశక్తులు పరస్పరాధరితమై ఉంటాయని హిందువులు విశ్వసిస్తారని ఐదవ అంశం పేర్కొంది. కొన్ని ధార్మిక అంశాలు ఎట్టకేలకు ఒకదానికి ఒకటి పొసగకుండా పోతాయని హిందువులు భావిస్తారని ఆరవ అంశం తెలిపింది.

హిందూయిజమ్‌ కీలకం దైవం అస్తిత్వ నాస్తిత్వాలు లేదా ఒకరే దైవం లేదా అనేక మంది దేవీ దేవతలు అనేదానిపై ఏ మాత్రం ఆధారపడి ఉండదని ఏడవ అంశం స్పష్టం చేసింది. అన్ని రకాల వాఙ్మయాలకు అతీతమైనదిగా ధార్మిక సత్యం చెప్పినందున అది పిడివాద పద్ధతుల్లో హిందూ యిజమ్‌లో పురుడు పోసుకోలేదని ఎనిమిదవ అంశం పేర్కొంది. ఒక నాగరికత, మతాల మేలు కలయిక హిందూయిజమ్‌.

నాందీ ప్రస్తావన లేనిది, వ్యవస్థాపకులు లేనిది, కేంద్రీకృత అధికారం ఏలుబడిలో లేనిది, ఆచారాధిపత్యం లేనిది, ఒక వ్యవస్థ అంటూ లేనిదిగా హిందూయిజమ్‌ విరాజిల్లుతోందని ఎన్‌సైక్లోపిడియా బ్రిటానికాలోని తొమ్మిదవ అంశం పేర్కొంది. హిందు ఒక మతపర మైన పదం కాదు అని స్పష్టం చేస్తూ హిందూలో బౌద్ధులు, జైనులు, సిక్కులను రాజ్యాంగంలోని 25వ అధికరణం చేర్చిందని 1976 నాటి తీర్పుకు తోడు 1995 నాటి కోర్టు తీర్పు ప్రధానంగా ప్రస్తావించింది.

హిందూయిజమ్‌ ఒక మతం కాదు అని గట్టిగా చెప్పిన తత్త్వవేత్త,రాజనీతిజ్ఞుడు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌, చరిత్రకారుడు అర్నాల్డ్‌ టాయన్బీపై సైతం ఆధారపడి 1995నాటి తీర్పు వెలువడిరది. ‘‘సత్యం, మోక్ష సాధనకు హిందూయిజమ్‌లో అనేక మార్గాలు ఉన్నాయి. ఈ వేర్వేరు మార్గాలన్నీ కూడా పరస్పరం ఆలంబనగా ఉన్నాయి’’ అని టాయన్బీ తెలిపారు. ఇది ఎన్‌సైక్లోపీడియాలో మొదటి ఆరు అంశాలతో సరితూగుతున్నది. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ప్రకారం హిందు అనేది భౌగోళిక సంబంధితమైనది. స్పష్టంగా నిర్వచించిన భౌగోళిక ప్రాంతంలో ఆవాసమైనది. మూలాలు తెలియని గిరిజనులు, సగం నాగరికత తెలిసిన ప్రజలు, సంస్కృతికి పెట్టని కోట లాంటి ద్రవిడులు, వేదాధ్యయనంలో దిట్టలైన ఆర్యులు అందరు హిందువులు. ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు. ఆయన వరకు, హిందు అనేది ఒక నాగరికమైన భావన.

హిందుత్వపై 1995 నాటి తీర్పు 1994 నాటి అయోధ్య కూల్చివేత కేసులో జస్టిస్‌ భరూచా, జస్టిస్‌ అహ్మదీల ఇచ్చిన తీర్పును ఉటంకించింది. ‘‘హిందూయిజమ్‌ పరమత సహనంతో కూడుకున్న ఒక విశ్వాసం. అలాంటి ఒక సహనం ఆలంబనగా ఇస్లాం, క్రైస్తవం, జొరాస్ట్రియనిజం, జుడాయిజం, బౌద్ధం, జైనం, సిక్కిజం ఈ నేలపైన గూడుకట్టు కున్నాయి’’ అని వారు అన్నారు. హిందూయిజమ్‌ కేవలం ఒక మతం అయిన పక్షంలో అది ఇతర మతాలకు చోటు ఇచ్చి అవి ఎదగడానికి సాయం చేసి ఉండేదా? వివాదరహితమైన, మార్పునకు నోచుకొని తత్త్వం, చారిత్రక, వాస్తవిక, న్యాయపరమైన అంశాలు ప్రాతిపదికగా హిందుత్వపై వెలువరించిన తీర్పుతో మేధోపరంగా ఎలా వివాదస్పదమవుతుంది? లేదా ఏ విధమైన న్యాయ సమీక్షకు నోచుకుంటుంది?

హిందుత్వ, హిందూయిజమ్‌ వేరు కాదు

‘‘హిందూయిజమ్‌, హిందుత్వ రెండూ ఒకటి కాదు. హిందూయిజమ్‌ మంచిది కానీ హిందుత్వ చెడ్డది’’ అని వాయనాడ్‌ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అదేపనిగా వల్లె వేస్తుంటారు. హిందూ యిజమ్‌పై 1966, 1976 సంవత్సరాల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను బహుశా ఆయన చదివి ఉండరు. ఆ తీర్పులు ప్రాతిపదికగా సర్వోన్నత న్యాయస్థానం 1995లో హిందుత్వపై తీర్పును వెలువరించింది. ప్రస్తుతం సుప్రీం కోర్టు వెలిబుచ్చిన అభిప్రాయాలనే తన ముత్తాతగారైన జవహర్‌ లాల్‌ నెహ్రూ వ్యక్తీకరించిన విషయం రాహుల్‌కు తెలిసి ఉండదు. 1935 నాటి తన గ్లిమ్సెస్‌ ఆఫ్‌ వరల్డ్‌ హిస్టరీలో హిందూ జాతీయతను సైతం నెహ్రూ ఆమోదించారు. ‘‘హిందూ జాతీయతకు, నిజమైన జాతీయతకు మధ్య గీత గీయడం అంత తేలిక కాదు. అత్యధిక సంఖ్యాకులైన హిందువులకు ఏకైక నెలవుగా భారత్‌ ఉన్నందున ఆ రెండూ సమ్మిళితమైపోయాయి’’ (పేజీ 720).

ఆయన ఇంకా ఇలా చెప్పారు.. ‘‘రామకృష్ణ పరమహంస శిష్యుల్లో స్వామి వివేకానంద ఒకరు. జాతీయతను గురించి ఆయన అనర్గళంగా, స్పష్టంగా బోధించారు. ఇది ఏదో విధంగా ముస్లిములకు లేదా మరొకరికి వ్యతిరేకం కాదు. వివేకానందుని జాతీయత హిందూ జాతీయత. దాని మూలాలు హిందూ మతం, సంస్కృతిలో ఉన్నాయి (పేజీ 507). స్వామి వివేకానంద ప్రవచించిన హిందూ జాతీయత పట్ల నెహ్రూకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇదే విషయాన్ని ఫారిన్‌ అఫైర్స్‌ మ్యాగజైన్‌ 1937 సంవత్సరం జనవరి సంచికలో నెహ్రూ రాశారు. ‘‘భారతీయ నేపథ్యం, ఐక్యత ప్రధానంగా సాంస్కృతికమైనది, ఇరుకైన భావజాలంతో కూడుకున్న మాటల్లో చెప్పినట్టుగా మతపరమైనది కాదు’’ అని నెహ్రూ నొక్కి వక్కాణించారు. సరిగ్గా ఇదే విషయాన్ని 1995 నాటి తన తీర్పులో సుప్రీం కోర్టు చెప్పింది. ఆ తర్వాత నెహ్రూ తన దృక్పథాన్ని మార్చుకున్నప్పటికీ వాస్తవాలను మార్చలేకపోయారు.

హిందూయిజమ్‌, సనాతన ధర్మం ఉన్నంతకాలం భారతదేశం వర్థిల్లుతుందని పేరొందిన తన ఉత్తర్‌పర ప్రసంగంలో మహర్షి అరవింద అన్నారు. దక్షిణాదిన సేతు, తూర్పున జగన్నాథ్‌, ఉత్తర భారతాన హరిద్వార్‌, పవిత్ర నదులు భారత్‌లో ఐక్యతను తీసుకు వచ్చాయంటూ 1909లో హింద్‌ స్వరాజ్‌లో తాను రాసిన వ్యాసంలో చివరకు కామాలు, ఫుల్‌ స్టాప్‌లు మార్చడానికి సైతం 1940లోనూ మహాత్మా గాంధీ నిరాకరించారు. హిందూ ధర్మం పట్ల వివేకానంద, గాంధీ, నెహ్రూ, అరబిందోల మధ్య ఒక విస్తృతమైన ఏకాభిప్రాయం ఉన్నది. మైనార్టీలను బుజ్జగించే కుహనా లౌకికవాద ఓటు బ్యాంకు రాజకీయాలు భారతదేశపు హిందూ సాంస్కృతిక పునాదిని వక్రీకరించాయి.

ఈ ప్రశ్నకు బదులేది?: సుప్రీం కోర్టు ఆమోదించిన హిందుత్వను ఐసిస్‌తో సమం చేస్తూ ఖుర్షీద్‌ రాసిన పుస్తకాన్ని ఆయన పార్టీ సహచరుడు గులామ్‌ నబీ ఆజాద్‌ తిరస్కరించారు. ఇక్కడ పుస్తక రచయితకు ఒక ప్రశ్న వేస్తున్నాను. ఐసిస్‌కు సుప్రీంకోర్టు కొమ్ము కాస్తున్నదా, మిస్టర్‌ ఖుర్షీద్‌?

అను: మహేష్‌ ధూళిపాళ్ల

About Author

By editor

Twitter
YOUTUBE