కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అంతరాష్ట్ర జల సంపద సద్వినియోగంపై దృష్టి కేంద్రీకరిస్తోంది. దానిలో భాగంగా నదుల అనుసంధానంపై పట్టుదలతో వ్యవహరిస్తోంది. దేశ జనాభా కనీస నిత్యావసరాలైన తాగు, సాగునీటి సంపదను ఉత్తర, దక్షిణాది, అన్ని రాష్ట్రాలకు కొరత రాకుండా అందించటానికి కేంద్ర ప్రభుత్వం దేశంలో నదీజలాల తరలింపు కార్యాచరణకు అడుగులు వేస్తోంది. వాతావరణ దుష్పరిణామాల కారణంగా పర్యావరణ సమకూలత దెబ్బతినటంతో సంభవించే ఉద్ధృత వరద విధ్వంసాలు, ఊళ్లు మునిగి కొంపా గోడూ, పాడిపంటలు, మానవజీవన వినాశన విపత్కరత మనకు కొత్త కాదు. తత్ఫలితంగా ఏ రాష్ట్రంలో అయినా సంభవించే కరవు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలు అరికట్టాలంటే నదీ జలాల సద్వినియోగం చేపట్టక తప్పదు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దశాబ్దానికిపైగా ‘ఇంటర్ బేసిన్’ నీటి బదలాయింపులు వివాదాస్పదం కాకుండా కేంద్ర ప్రభుత్వం తరలింపులు చేపట్టాలని హెచ్చరిస్తోంది. జాతి సర్వతోముఖ సౌభాగ్యానికి, నదుల జలసంపద సంరక్షణకు ఉత్తరాఖండ్ హైకోర్టు నదులను జీవం ఉన్న ప్రాణులుగా చట్టపరమైన హక్కులను ప్రసాదిస్తూ 2017 మార్చిలో సంచలనాత్మక ఉత్తర్వు జారీచేసింది.
లోక్‌సభలో 2016లో కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ మ్రతి సంజీవ్ బల్యాన్ దేశంలోని వివిధ నదుల అనుసంధానానికి (ఐ.ఎల్.ఆర్.) రూ. 5,60,000 కోట్ల భారీ వినియోగం అవసరమని ప్రకటించారు. నదీజలాల తరలింపునకు ప్రణాళికలు, అంచనావ్యయం నిర్ణయించే కేంద్ర జలవనరుల అభివృద్ధి ఏజెన్సీ దేశం మొత్తంలో 16 ద్వీపకల్ప సంబంధమైన నీటితో చుట్టబడిన భూభాగం గల నదులు, 14 హిమాలయ పర్వత నదులను జలాల తరలింపునకు అనుసంధానం చేయగల అవకాశాలను ధృవీకరించింది.
రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ వివాదాలు, అభ్యంతరాలు అవరోధంగా ఉన్నప్పటికీ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల మధ్య కాలవలు, నీటి నిల్వ నిర్మాణాలు; గుజరాత్, మహారాష్ట్రల దామన్‌గంగ, పింజల్ పనులు చురుకుగా కొనసాగాయి. కెన్-బిట్వా నదుల సంధానం వలన పన్నా పెద్దపులుల అటవీ సంరక్షణ సమస్య ఎదురైనా బుందేల్‌ఖండ్ ప్రాంత జనావాసాల కరవు కాటకాల నిర్మూలనపై ప్రభుత్వం దృష్టి సారించింది.
2016 నాటి పరిస్థితులకు అనుగుణంగా మహానది (మణిభద్ర)-గోదావరి, గోదావరి (ఇంఛంపల్లి) -కృష్ణా (పులిచింతల), గోదావరి (ఇంఛంపల్లి)-కృష్ణా (నాగార్జునసాగర్), గోదావరి (పోలవరం)- కృష్ణా (విజయవాడ), కృష్ణా (ఆల్మట్టి)- పెన్నార్, కృష్ణా (శ్రీశైలం)-పెన్నార్, కృష్ణా (నాగార్జున సాగర్)- పెన్నార్ (సోమశీల), పెన్నార్ (సోమశీల)- కావేరీ (గ్రాండ్ ఆనకట్ట) కావేరి (కట్టాలై)- వైగై-గుండార్, కెన్-బెట్వ, పర్బతి-కాలిసింధ్- చంలువ్, పర్-తపి-నర్మద, దామన్‌గంగ-పింజల్, బెడ్టి-నార్డా, నేత్రావతి- హేమావతి, పంబ- అచన్‌కొవిల్-నాయప్పర్ వంటి 16 ద్పీపకల్ప ప్రాంత నదీ సంధాన వ్యవ వినియోగం రూ.1,85,000 కోట్లు; హిమాలయ మానస్- సంకోష్- తిష్టా-గంగ, కోసి-ఘగ్రా, గండక్-గంగా, ఘగ్రా-యమున, శారదా-యమున, యమున- రాజస్తాన్, రాజస్తాన్-సబర్మతి, చునార్-సోనె బరాజ్, సోనెడామ్-సదరన్ గంగా ట్రైబ్యూన్స్, గంగా- దామోదర్-సువర్ణరేఖ, సువర్ణరేఖ-మహానది, కొసి-మిచి, ఫరాక్కా, సుందర్‌బన్స్, జోగి ఘోపా- తిష్టా-ఫరక్కా (ప్రత్యామ్నాయం) హిమాలయన్ కాంపొనెంట్ నదులు 14 అనుసంధానానికి రూ. 3,75,000 కోట్లు వ్యయం అంచనా వేశారు.
వరదల ఉద్ధృతి సమయంలో ఒక నది నుంచి వచ్చే అధిక ప్రవాహాలు వృథాగా సముద్రంలో కలవకుండా, సమీపంలో ఉన్న మరొక నదితో అనుసంధానం చేయగలిగితే ఎంతో సామాజిక సంక్షేమాన్ని, జీవన ప్రయోజనాలను సాధించవచ్చు. రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకొనే సామరస్య కార్యాచరణగా రైతుల ఆత్మహత్యలు, వరదలు, కరువు కాటకాల నివారణకు ఇది చక్కని పరిష్కారం. ఈ పక్రియ క్లిష్టతరం అయినా నీటి పంపింగ్ అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ లబ్ధి సమకూరు తుంది. నదుల మధ్య జలరవాణా సాధ్యమవుతుంది. ఉత్తర, దక్షిణ, మధ్య భారతదేశాలలో మూడు జలమార్గాలను నిర్మించే ప్రాజెక్టు ద్వారా కోట్లాది ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. కాని రాష్ట్రాల మధ్య జలజగడాల కారణంగా కేంద్ర ప్రభుత్వం 2017 సెప్టెంబర్‌లో తెరపైకి తెచ్చిన నదుల అనుసంధాన పక్రియ, ద్వీపకల్ప నదుల అభివృద్ధి పథకం తమిళనాడు మినహా దక్షిణాది రాష్ట్రాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించడంతో మరుగున పడి మళ్లీ తెరపైకి వచ్చింది. 2018 జనవరిలో కేంద్ర జలవనరుల శాఖమంత్రి నితిన్ గడ్కరీ గోదావరి మిగులు జలాలను కృష్ణా, పెన్నార్‌ల మీదుగా కావేరికి తరలించే ప్రతిపాదనకు ఒక్క తమిళనాడు ప్రభుత్వాధినేత ఇ.కె.పళనిస్వామి మాత్రమే హర్షామోదంతో ఆహ్వానించారు.
మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ, ఆంధప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు.. ఆరు రాష్ట్రాల ఆశాదీపం అయిన గోదావరి నదిని కావేరివైపు పరవళ్లు తొక్కించే మళ్లింపు సాధించాలని ప్రధాని మోదీ ప్రభుత్వం కృత నిశ్చయంతో పావులు కదుపుతోంది. నదుల అనుసంధానంలో భాగంగా ఒడిశాలోని మహానది నుంచి గోదావరికి మళ్లించి, ఇక్కడినుంచి కావేరిలోకి తరలించాలని తొలుత ప్రతిపాదించారు. ఉత్తర భారతావనిలో మానస్-సంకోశ్-తీస్తా-గంగ- దామోదర-సువర్ణరేఖ నదుల అనుసంధానంతో మహానదికి మిగులు జలాలు వస్తాయని, అందువలన రెండో దశలో బ్రహ్మపుత్ర, గంగ, సువర్ణరేఖ, మహానది, గోదావరి అనుసంధానం చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. ఆరు రాష్ట్రాలు అయిదు నదుల అనుసంధానంతో మహా కావేరి గ్రాండ్ ఆనకట్ట వరకు 247 టి.ఎం.సి.ల గోదావరి నీటిని తరలించే ఈ బృహత్తర పథకానికి 2020-21 ప్రకారం రూ. 85,962 కోట్లు వినియోగించవలసి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గోదావరి-కావేరి అనుసంధానాన్ని జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్.డబ్ల్యూ.డి.ఎ.) ఖరారుచేసి తుది సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డి.పి.ఆర్.) రూపొందించి సంబంధిత రాష్ట్రాలకు అందజేసింది. ప్రతి ఏటా జూన్ నుంచి అక్టోబర్ మధ్య 143 రోజులలో మళ్లించే గోదావరి జలాలలో మొత్తం 247 టి.ఎం.సి.లలో ఆవిరయ్యే నీరు పోగా మిగిలిన 230 టి.ఎం.సి.లలో తెలంగాణలో 65.8, ఆంధప్రదేశ్‌లో 79.92, తమిళనాడులో 84.28 టి.ఎమ్.సి.ల వినియోగం ఉండేలా, మూడు రాష్ట్రాలు ప్రయోజనం పొందే ప్రాజెక్టుగా ప్రతిపాదించారు. చెన్నైకి ప్రత్యేకంగా 25 టి.ఎం.సి.లు కేటాయించారు. తెలంగాణ ప్రభుత్వ సూచన మేరకు తాజా సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించే ప్రతిపాదనను ఆమోదించింది.
అదనపు జలాల లభ్యతకు అవకాశం ఉన్న మహానది, గోదావరిల మిగులు జలాలను కృష్ణా, కావేరీ వంటి నదులకు తరలించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం.. ప్రాంతం ఏదైనా, రాష్ట్రం ఏదైనా సామాన్య జనావళికి జల సౌభాగ్యం సమకూరుస్తుంది. మహా నదిలో సుమారు 360 టి.ఎం.సి.లు, గోదావరిలో 530 టి.ఎం.సి. లు మిగులు జలాలుగా లభ్యమవు తాయని, వాటి అనుసంధాన పక్రియ ద్వారా రాయల సీమ, కావేరీ వంటి ప్రాంతాలలో నీటికొరత నివారిం చాలని కేంద్రం స్థిర నిశ్చయంతో వ్యవహరిస్తోంది.
నదుల అనుసంధానాన్ని వ్యతిరేకిస్తున్న ఒడిశా ప్రభుత్వం మహానదిలో లభ్యత జలాలు లేవని అంటోంది. గోదావరి జలాలను వివిధ సాగునీటి ప్రాజెక్టులకు వినియోగించుకొంటున్న తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాలు తమ అవసరాల తర్వాతనే కావేరీ మళ్లింపు గురించి ఆలోచించాలని అంటున్నాయి. ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కొత్తగా తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టుల గురించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సహజంగా ఆందోళన పడుతున్నాయి. దానికి తోడు గోదావరిలో మిగలు జలాల వాదనను కేంద్రం 20 ఏళ్లనాటి విశ్వసనీయత ఆధారంగా లెక్కిస్తోంది. పైగా ఇంద్రావతిపై ఛత్తీస్‌ఘడ్ ప్రాజెక్టులు నిర్మిస్తే తమ రాష్ట్ర పరిస్థితి ఏమిటని తెలంగాణ సహేతుకమైన ఆందోళన వ్యక్తంచేస్తోంది. అనుసంధానం చేపట్టేముందు నదిలో నీటి లభ్యత తేల్చాలని, అధ్యయనం చేయాలని తెలంగాణ స్పష్టంచేస్తోంది. అనుసంధానం ప్రతిపాదించిన స్థలం ఎగువన, దిగువన ప్రస్తుత నీటి వినియోగం, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నీటి అవసరాలు, కొత్తగా ప్రతిపాదిత ప్రాజెక్టులు మొదలైన అన్ని అవసరాలను పరిగణనలోకి తీసుకొని ఎంత మిగులు ఉందో, ఎంత తరలించనున్నారో తేల్చాలని అంటోంది. గోదావరి-కావేరీ అనుసంధానాన్ని దిగువ రాష్ట్రాల నీటి లభ్యతపై ప్రభావం పడకుండా చేపట్టాలని ఆంధప్రదేశ్ కోరుతోంది. నీటి లభ్యత తేల్చాలని ఛత్తీస్‌ఘడ్ అంటోంది. ఈ ప్రాజెక్టు ఫలితాలు తమకు అందేటట్టు డి.పి.ఆర్. సవరించాలని కర్ణాటక అంటోంది.
ఢిల్లీలో జాతీయ జల అభివృద్ధి సంస్థ నదుల అనుసంధానంపై నవంబర్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిటీ సమావేశంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ గోదావరి-కావేరి అనుసంధానంపై ముసాయిదా సమగ్ర ప్రాజెక్టు నివేదికలను రాష్ట్రాలతో పంచుకున్నామని, సవాళ్లపై కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ నదుల అనుసంధానానికి జాతీయ అథారిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. నదుల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ దృక్పథంతో సానుకూలంగా ఆలోచించాలని షెకావత్ పిలుపునిచ్చారు.
– జయసూర్య