కాశీ అంటేనే జ్యోతుల నగరమని అర్ధం. కాశీ అనగానే జ్ఞాన సంపద, భారతదేశంలో పుట్టిన మహనీయుల పాదస్పర్శ కంటి ముందు కదులుతాయి. అదొక పుణ్యక్షేత్రమే కాదు, భారతీయ పునరుజ్జీవన స్ఫూర్తి కేంద్రం. ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదిక అయిన ఆ పుణ్యభూమి డిసెంబర్‌ 13‌న మరొక చరిత్రాత్మక దినాన్ని నమోదు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ కలల ప్రాజెక్ట్ ‌కాశీ విశ్వనాథ్‌ ‌కారిడార్‌ ‌తొలిదశను ఆయనే ప్రారంభించారు. ఆ విధంగా ఆయన కాశీ సంక్షేమానికీ, తద్వారా భారతీయ సాంస్కృతిక రక్షణకూ పాటుపడిన రాణీ అహల్యాబాయి తరువాతి స్థానం దక్కించుకున్నారంటే అతిశయోక్తి కాదు.

క్రీస్తుపూర్వం 10,000 ఏళ్ల నాటిది కాశీ. రుగ్వేద మంత్రాలలో వినిపించే మాట. దానితోనే ఇంత ప్రాధాన్యం రాలేదు. భారతభూమిలో నాలుగు వేల ఏళ్ల నుంచి అత్యంత పవిత్ర స్థలాలుగా  పూజలందుకుంటున్న ఏడింటిలో కాశీ ఉంది. అందుకే ఆ గంగాతీర పట్టణం గొప్పదైపోలేదు. అక్కడ ప్రతి అణువులోను శివుడే ఉంటాడని విశ్వసిస్తాం. ఇది కూడా ఆ పట్టణం ఘనతకు కారణం కాకపోవచ్చు. అదొక ఆధ్యాత్మిక కేంద్రం. ఎన్నో మహోన్నత గంథ్రాలకు జన్మనిచ్చిన పుణ్యభూమి. హిందువులకే కాదు, జైనులకూ, బౌద్ధులకూ కూడా వారణాసి పూజనీయమే. భారత స్వాతంత్య్ర సమరయోధుల నిలయం కూడా. ఎంతటి ఆధ్యాత్మిక స్ఫూర్తి కేంద్రం కాకపోతే మహ్మద్‌ ‌ఘోరీ వెంటే వచ్చిన కుతుబుద్దీన్‌ ఐబక్‌ 1194‌లోనే దాడులు మొదలు పెట్టి ఉంటాడు? అలా 1673 వరకు ముస్లిం దురాక్రమణదారులు ఈ పుణ్యక్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకుంటూనే ఉన్నారు. కాశీని అపవిత్రం చేయడమే ఇస్లాం పట్ల తమకున్న నిబద్ధతకు నిదర్శనమని వారంతా భావించినట్టే కనిపిస్తుంది. అయినా తట్టుకుని, మళ్లీ మళ్లీ హిందువులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నదా మహోన్నత క్షేత్రం. కాశీ క్షేత్రాన్ని ధ్వంసం చేయడమే పనిగా మొగల్‌ ‌చక్రవర్తి ఎంత నీచంగా వ్యవహరించాడో ఇటీవల కాలంలోనే వెలువడిన ఎస్‌ఎల్‌ ‌భైరప్ప నవల ‘ఆవరణ’ కళ్లకు కట్టింది. ఔరంగజేబ్‌ ‌విశ్వనాథుడి ఆలయాన్ని కూల్చి, మసీదు నిర్మించాడు. అదే జ్ఞానవాపి మసీదు. తరువాత పట్టణంలోని హిందువులను ఊచకోత కోసిన తీరు, గంగలో తేలిన శవాల  గురించి ఆధారాలతో సహా వివరించారు భైరప్ప. 1675లో ఇందోర్‌ ‌రాణి అహల్యాబాయి జీర్ణోద్ధరణ గావించారు. ఇదంతా చూస్తే హిందూత్వం నాశనం కాదు. సరికదా, దాడి జరిగిన ప్రతిసారి మరింత తేజస్సుతో ఆవిర్భవిస్తుందని తేలుతుంది. అది కాశీ పట్టణం విషయంలోను జరగాలి. ఆ పుణ్యక్షేత్ర దర్శనం, నివాసం కొంచెం ఇబ్బందికరమే. దీనిని నివారించాలి.

‘మహోన్నతమైన మన పుణ్యక్షేత్రాలలో వీధీ, వాడా ఇంత మురికిగా ఉండాలా? మన దేవాలయాలు పరిశుభ్రతకు నమూనాలుగా ఉండకపోతే మన స్వయం ప్రభుత్వం ఎందుకు?’ ఇవి గాంధీజీ బెనారస్‌ ‌హిందూ విశ్వవిద్యాలయం ప్రారంభకార్యక్రమంలో అన్నమాటలు. ఫిబ్రవరి 4, 1916న గాంధీజీ పడిన ఈ వేదనను గుర్తించే నాథుడు ఇప్పటికి వచ్చారు. ఆయనే మోదీ. ఈ బీజేపీ ప్రధానీ, యూపీ బీజేపీ ముఖ్యమంత్రీ మధ్య ఏకాత్మత దీనిని సాధ్యం చేసింది.

మార్చి 8, 2019 కాశీ విశ్వనాథ్‌ ‌కారిడార్‌ ‌ప్రాజెక్టుకు మోదీ శ్రీకారం చుట్టారు. ఇప్పుడు 23 కొత్త భవంతులను జాతికి అంకితం చేసి తొలిదశకు ప్రారంభోత్సవం గావించారు. ఈ చరిత్రాత్మక ఉత్సవానికి సాధుసంతులు సహా  3000 మంది హాజరయ్యారు. దేశంలో కొన్నిచోట్ల ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇరుకు సందుల మధ్య, అడ్డదిడ్డంగా ఉండే కట్టడాల నడుమ ఉండే విశ్వనాథ మందిరానికి భవ్యమైన రూపు తెచ్చారు. ఇప్పటివరకు 3000 చదరపు అడుగు విస్తీర్ణంలో ఉన్న కాశీ ఆలయాన్ని 5 లక్షల చదరపు అడుగులలో విస్తరింపచేశారు. 50 వేల నుంచి 75 వేల మంది భక్తులు సులభంగా స్వామివారిని దర్శించుకోవచ్చు. ఎలాంటి కోర్టు వివాదాలకు తావు లేకుండా విస్తరణకు 400 భవనాలను  స్వాధీనం చేసుకున్నారు. వీటిని కూలగొడుతుంటే దాదాపు 40 పురాతన ఆలయాలు బయటపడ్డాయి. ఇప్పుడు గంగానదికీ, విశ్వేశ్వరుడి మందిరానికీ మధ్య చక్కని, సౌకర్యవంతమైన మార్గం ఏర్పడింది. మొత్తం రూ.8000 కోట్ల ఈ పథకంలో తొలిదశకు రూ. 399 కోట్లు ఖర్చు చేశారు.

మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ దేశ చరిత్రకూ, నాగరికతకూ, ఔన్నత్యానికీ ప్రతీకలుగా ఉన్న ఆలయాల మీద దృష్టి పెట్టారు. అయోధ్య మందిర నిర్మాణానికి పునాది వేశారు. సోమనాథ్‌ ‌మందిరానికి మరమ్మతులు చేపట్టారు. కేదార్‌నాథ్‌ను పునరుద్ధరించారు. 370 అధికరణం ఎత్తివేసిన తరువాత కశ్మీర్‌లోనూ ఆలయాల పునరుద్ధరణ చేపట్టారు. అక్కడ హిందువులకు పవిత్రమైన  1842 స్థలాలు ఉన్నాయి. ఇందులో ఆలయాలు 952. వీటిలో పూజాపునస్కారాలకు నోచుకుంటున్నవి 212. మిగిలిన740 దుస్థితి చెప్పడానికి మాటలు చాలవు. జీలం నది ఒడ్డున ఉన్న రఘునాథాల యాన్ని ఇటీవలనే పునరుద్ధరించారు.

బీజేపీ లేదా మోదీ ఏది చేపట్టినా ఎద్దేవా చేసేవాళ్లకి దేశంలో కొరత లేదు. ఆయన ఆలయాలను, ఆధునికతను సమంగానే చూస్తున్నారు. మేం బీజేపీ కంటే ముందే అయోధ్య మందిరం పూర్తి చేస్తామని నిన్న గాక మొన్న చెప్పినవాళ్లు కాశీ పునరుద్ధరణను విమర్శిస్తున్నారు. మోదీ పురాతన దేవాలయాలు కూల్చేస్తున్నారంటూ చెన్నై నుంచి వెలువడే ఒక ఇంగ్లిష్‌ ‌దినపత్రిక గగ్గోలు పెట్టింది. కానీ తమిళనాడులో స్టాలిన్‌ అనే హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి అన్ని గుళ్లు కూల్చినప్పటికీ ఈ పత్రికకు పట్టలేదు. ఒకటి నిజం. భారతశక్తి, భక్తి కంటే విధ్వంసకుల బలం ఎప్పటికీ ఎక్కువ కాదు అంటూ కాశీలో మోదీ అన్న మాట ఎంతో విలువైనది.

About Author

By editor

Twitter
YOUTUBE