ఐక్యరాజ్య సమితి అనగానే వెంటనే మన మదిలో మెదిలే స్వతంత్ర సంస్థ ఐ.ఎం.ఎఫ్‌. అం‌తర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పేరు తలవగానే ఇప్పుడు మనందరి ఎదుట నిలిచిన రూపం గీతా గోపీనాథ్‌. ఆ ‘‌ఫండ్‌’‌కి, ఈ భారతీయ అమెరికన్‌ ‌మహిళా ఆర్థికవేత్తకి ఎంతో అవినాభావ సంబంధముంది. ఎలా అంటారా? ఏడున్నర దశాబ్దాలకు పైగా చరిత్రగల సంస్థాగత ప్రగతిని చూసినప్పుడు, తాజా పరిణామాలను సమీక్షించినప్పుడు మొట్టమొదటి డిప్యూటీ మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌గా గీత సృష్టించింది రికార్డే! సంస్థ స్థాపిత తేదీ ఇదే డిసెంబర్‌ ‌నెల 27. ప్రతిష్టాత్మక పదవీ బాధ్యతలు నిర్వహించే ఆమె జన్మదినోత్సవం కూడా ఈ నెలలోనే (8వ తేదీ). అభివృద్ధి చెందుతూ ఉండే వర్ధమాన దేశాలకు ప్రత్యేక పత్రాల ద్వారా రుణ సహాయం అందించడమే సంస్థ కీలక కర్తవ్యం. నిర్వహణ, పరిశీలన సమీక్షాపరంగా అత్యున్నత హోదాకు చేరిన గీత జీవన నేపథ్యం తెలుసుకోవడమూ ప్రత్యేకించి భారతీయులందరికీ సగర్వ కారణం. ఒకప్పుడు కేరళ ముఖ్యమంత్రికి ఆర్థిక అంశాల సలహాదారుగా వ్యవహరించి, తాజాగా అంతర్జాతీయ స్థాయిన కీర్తికిరీటం అందుకన్న తన గురించి ఎంతైనా ముచ్చటించుకోవచ్చు.

‘సమితి’ ప్రత్యేకత గురించి అందరికీ తెలుసు. ఆర్థిక-సామాజిక పురోగతి సాధనకు ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా ఏర్పాటుచేసుకున్న విశిష్టగా ప్రతి ఒక్కరూ పరిగణిస్తారు. రమారమి రెండొందల దేశాల సభ్యత్వంతో, అత్యంత ప్రధానమైన ఆరు విభాగాల ఉమ్మడి తత్వంతో యు.ఎన్‌.ఒ. ‌కార్య కలాపాలు నిర్వర్తిస్తోంది. ఐదు మూల ఆశయాల్లోనూ గణనీయం – సమగ్ర పురోగమన కల్పన ద్వారా పౌర జీవితాలను సఖమయం చేయడం. అనుబంధ విభాగాల్లోని ఐ.ఎం.ఎఫ్‌. ‌విధుల నిర్వహణ మొదలైంది మాత్రం 1947 నుంచి. అంటే మనం స్వాతంత్య్రం సాధించుకున్న సంవత్సరం. నాటినుంచీ భారత్‌, అమెరికన్‌ ‌సంస్థా సంబంధ బాంధవ్యం. ఏ విధంగా అంటున్నారా? ఇంటర్నేషనల్‌ ‌మానిటరీ ఫండ్‌ ‌కేంద్ర కార్యాలయ స్థానం అమెరికాలోని వాషింగ్టన్‌ ‌డీసీ. అక్కడినుంచే విధివిధానాల నిర్మాణం, ఆచరణ, పర్యవేక్షణ… అన్నీ. ప్రపంచస్థాయిన ద్రవ్య సహకారం అందజేయడం ఒక్కటే కాదు – వాణిజ్య వ్యవస్థను అన్ని విధాలా పెంపొందించడం ముఖ్య ధర్మం. అనువైనరీతిలో ఉపాధి అవకాశాలను విస్తరించడం కూడా కీలకమే. సంస్థలోని వ్యవస్థాపక దేశాల సంఖ్య మూడు పదుల్లో. సభ్య దేశాలైతే అటూ ఇటుగా ద్విశతం. గవర్నర్ల బోర్డుదే ప్రధాన నిర్ణయాధి కారం. ఆర్థిక స్థిరత్వాన్ని అంతటా భద్రపరచాలంటే ఏమేం చేయాలన్నదే వారే నిర్దేశిస్తుంటారు. వనరుల పరికల్పన విధి మటుకు సహజసిద్ధంగా ప్రపంచ బ్యాంకుదే!

నిర్వహణలో మిన్న

ఇన్నిన్ని బాధ్యతల నట్టనడుమ, నూతన సంవత్సరం (2022) మొదట్లో రంగప్రవేశం చేస్తారు గీత. ఇప్పటిదాకా పనిచేసిన ఒక మొటొ చేతులమీదుగా సరికొత్త బాధ్యతల పరంపరను స్వీకరిస్తారు. ఇదేమీ సాధారణం కానేకాదు. అన్ని విధాల అసాధారణ పర్వం. ఆర్థిక రీత్యా చెల్లింపుల సంక్షోభాలు దేశదేశాల్ని గుక్క తిప్పుకోకుండా చేస్తుంటాయి. అందుకే ముందు జాగ్రత్తగా ఫండ్‌ ‌సభ్య దేశాలన్నీ నిర్ణీత రూపాల్లో నిధులు సమకూరు స్తుంటాయి. సమస్య ఎదురైనవి వాటినుంచి సహాయ సహకారాలు పొందుతుంటాయి. ఆ కారణంగానే సభ్యుల ఆర్థిక వ్యవస్థాగత స్థితిగతుల్ని ఐ.ఎం.ఎఫ్‌. ఎప్పు‌డూ పరిశీలిస్తూ ఉండాల్సిందే. కోటాల ద్వారా సమీకరించే వాటిపై సర్వదా ఓ కన్నేసి ఉంచాల్సిందే. సంస్థ ఎం.డీ. క్రిస్టాలినా జార్జివా. బల్గేరియాకు చెందిన వనితా ఆర్థిక శాస్త్రవేత్త. రెండేళ్లుగా బాధ్యతల నిర్వహణలో ఉంటున్నారు. నిజానికి అంతకుమందు నుంచే (2018) అదే సంస్థకు గీత ఆర్థిక వ్యవహారాల నిపుణురాలు. విశ్వవిఖ్యాత ప్రిన్స్‌టన్‌ ‌విశ్వ విద్యాలయంలో ఆర్థికాంశాల డాక్టరేట్‌ ‌చేసిన అత్యున్నత విద్యాధికురాలు. దేశాల రుణాల చెల్లింపు స్థాయిని పర్యవేక్షించే బ్యాంక్‌ ‌లా ఫండ్‌ ఉం‌డాలన్నది నిర్వివాదం. ఒకానొక ఉదాత్తస్థాయి సహకార నిధిగా వ్యాప్తి చెందాలన్నదీ నిశ్చితాభిప్రాయం. ఇవన్నీ ఉదారవాదాన్ని పెంచి పోషిస్తాయని గీత సైతం ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఆర్థిక విధానాలను సంపూర్ణ ప్రభావితం చేసే సంస్థగా ఎలా వ్యవహరించాలన్నదీ నిర్ణయిస్తుంటారు.

అంతటా విభిన్నత

సంస్థ ఎం.డి. గా ఫ్రాన్స్, ‌జర్మనీ, స్పెయిన్‌, ‌మరికొన్ని దేశాలవారు ఇప్పటివరకు పనులు నిర్వహించారు. వారిలో ఎక్కువమంది సహజసిద్ధంగా ఆర్థికవేత్తలే. మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌తదుపరి తిరిగి అంతే ప్రతిపత్తి తొలి డిప్యూటీ ఎం.డి.కి ఉంటుంది. సహాయ సమన్వయ సహకారాలు అందిస్తూ ఉండటమే అసలు పని. ఇంతదాకా ఉన్న ఆచార సంప్రదాయాల ప్రకారం అమెరికన్‌ ‌జాతీయులే ఆ హోదాను అందు కుంటూ వస్తున్నారు. ఎం.డి. మొదటి ఉప ఎం.డి. ఈ ఉభయులే సమస్త యాజమాన్య వ్యవస్థకీ నేతలు. ఇద్దరి పదవీకాల పరిమితీ చెరి ఐదేళ్లు. ఇన్నేళ్ల కాలంలో డిప్యూటీ పదవిని సాధించిన వారంతా అమెరికన్లే.

భారతీయ మూలాలున్న గీత గోపినాథ్‌ను వినూత్నంగా ఎంపిక చేయడం సర్వత్రా సరికొత్త ఆశలను రేకెత్తిస్తుంది. ఆమెకి ప్రస్తుతం ఐదు పదులలోపు వయసు. ద్రవ్యనిధి పరిశోధన రంగాన ఘటికురాలు. ప్రఖ్యాత హార్వర్డ్ ‌వర్సిటీలోని ఆర్థికశాస్త్ర విభాగానికి వెన్నుదన్ను తానే. నేషనల్‌ ‌బ్యూరో ఆఫ్‌ ఎకనామిక్‌ ‌రీసెర్చిలోనూ ఉన్నతస్థాయి బాధ్యతాయుత పాత్ర పోషణ. నిరుడు ఆర్థిక మాంద్యం మొత్తం ప్రపంచాన్నే చుట్టుముట్టినప్పుడు, ఆ ప్రవీణురాలి వ్యాఖ్యలను మేటి ఆర్థికవేత్తలంతా చెవులు రిక్కించి విన్నారు. అప్పటి ఆ మాంద్య తీవ్రత ఆమె దృష్టిలో ‘అతిపెద్ద లాక్‌డౌన్‌’. ఇం‌తటి నిశిత పరిశీలన, ప్రస్ఫుట వ్యక్తీకరణ నిండి ఉన్నందునే; జగద్విఖ్యాత ఐ.ఎం.ఎఫ్‌.‌కి రెండో స్థానంలో ఉండి వెలుగొందు తున్నారా ఆదర్శ మహిళామణి. స్వస్థలం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కత్తా. జన్మించింది మలయాళీ కుటుంబంలో. పాఠశాల చదువంతా కర్ణాటకకు చెందిన మైసూర్‌లో! ఎంతటి వైవిధ్యమో చూశారా?

సౌభాగ్యశాలి అనాల్సిందే

గీత తల్లి విజయక్ష్మి, తండ్రి గోపీనాథ్‌. ‌వృత్తి రీత్యా వారు ఎక్కడికి వెళితే అక్కడికి తానూ వెళ్లారు. ఆ క్రమంలో రాష్ట్రాలకు రాష్ట్రాలే మారారు. ఆర్టస్‌లో ఎం.ఏ. డిగ్రీని ఢిల్లీ విశ్వవిద్యాలయానికి అనుబంధ మైన స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్ ‌నుంచి స్వీకరించారు. తదుపరి కోర్సును వాషింగ్టన్‌ ‌యూనివర్సిటీ ద్వారా ముగించారు. డాక్టరేట్‌ ‌డిగ్రీకి కారణమైన సిద్ధాంత వ్యాస అంశం ఏమిటో తెలుసా? మూలధన విస్తరణ-శోధన. ఫెలోషిప్‌ ‌రీసెర్చి పురస్కారాన్నీ సొంతం చేసుకుని, తానేమిటో నిరూపించారు. నాయకత్వ పటిమకు మారుపేరుగా నిలిచి, సముచిత స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కరోనా కాలంలో ఒకటని ఏముంది – అన్ని దేశాలు సంక్షోభం బారినపడ్డాయి. సవాళ్లను ఎదుర్కోవడంలో విభిన్న అనుభవాలు చవిచూశాయి. వీటిని గీత గ్రహించి, గుర్తించి, పరిష్కార సూచనలతో ముందుకొచ్చారు కాబట్టే విలక్షణ స్థానం అందివచ్చింది. భారత సంతతి వనిత ఇంతటి మహోన్నత పరిగణన సాధించడాన్ని ఎవరైనా హర్షించాల్సిందే. నాటి ప్రధాన ఆర్థికవేత్త నేడు అదే సంస్థ సీనియర్‌ ‌మేనేజ్‌ ‌మెంట్‌లో మూల భాగస్వామి. ఇంతింత మహత్తర పదోన్నతిని ఇంకెక్కడైనా చూడగలమా? నిస్సందేహంగా ఆమెది మేధో నేతృత్వం. షికాగో యూనివర్సిటీలో బోధన అనుభవం, హార్వర్డ్ ‌వేదికగా పరిశోధనా నైపుణ్యం ఇలా శిఖరాగ్రానికి చేర్చాయి. ప్రతిభకు భాగ్యం జత చేరడమంటే, కచ్చితంగా ఇదేనేమో!

ఆశల చుక్కాని

ఎప్పుడూ శాస్త్ర పరిశోధనలే కావు… ఎంతెంతో కళా నైపుణ్యమూ గీతను విలక్షణ వ్యక్తిగా నిలుపుతోంది. ఢిల్లీలో పరిచయమైన ఇక్బాల్‌ ‌తన జీవిత భాగస్వామి అయ్యారు. పదిహేడేళ్ల తనయుడు సైతం పరిశోధనారంగం పైన ఇప్పటినుంచే మక్కువ చూపిస్తున్నారు. ముచ్చటైన కుటుంబ జీవితం, బాధ్యతాయుత వృత్తి నిర్వహణం ఇప్పటికే ఆమెను ఘన విజయ తీరాలకు తీసుకెళ్లాయి. ‘పరుగు ఆపడానికి కాదు. నా ఈ అడుగు విశ్రమించడానికి కాదు’ అంటున్న గీత సర్వదా వర్తమానాన్నే ఇష్టపడతారు. గతంతో ఆగిపోవడం నచ్చదు. భవిష్యత్తు గురించి కలలుగనడం ఆ వనితా రత్నానికి నప్పదు. గెలుపు అనేది ఆకాశం నుంచి ఊడిపడదని, చిత్తశుద్ధితో వేసే ప్రతి అడుగు వెనకా అదే ఉంటుందనీ ఒకే ఒక నమ్మిక. ఆ వాక్యాలే తన ఇంటి గోడల మీద వెలుగొందుతూ కనిపిస్తుంటాయి ఇప్పటికీ. పదవిని పొందామన్న ఆనందం – పనిలోనూ కనబరిస్తే  ‘అది చాలదా ఈ జీవితానికి’ అంటున్న గీతా గోపినాథ్‌ ‌భారతీయుల సకల ఆశలకీ దారిదీపం. అంతేనంటారా?

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE