సంపాదకీయం

శాలివాహన 1943 శ్రీ ప్లవ మార్గశిర బహుళ అష్టమి – 27 డిసెంబర్‌ 2021, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


లక్ష్యసాధన మానవాళిని ఉన్నత శిఖరాలకు నడిపిస్తూ ఉంటుంది. అలాంటి లక్ష్యసాధనకు సమ్యక్‌ ‌మార్గమూ, సమ్యక్‌ ‌దృష్టి, పరమార్థమూ ఉండాలి. ఈ  అనంతయానంలో గెలుపోటములను సమంగా స్వాగతించాలి. సుఖదుఃఖాలను సమదృష్టిలో స్వీకరించాలి. చిన్న ఓటమికీ కుంగిపోతే జీవితాన్ని అర్థం చేసుకునే అవకాశాన్ని నిరాకరించినట్టే. దీని నుంచి బయటపడే మార్గాలు ఎన్నో! అందులో మొదటిది గీతాజ్ఞానం. పరాజయ భావన బారిన పడకుండా జీవితాన్ని మలుచుకునే సూత్రాలను బోధించేదే భగవద్గీత. అలాంటి భగవద్గీతను పాఠశాలల్లో బోధించాలని భావిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించవచ్చునని డిసెంబర్‌ 20‌న కేంద్రం లోక్‌సభలో ప్రకటించింది. విద్య ఉమ్మడి జాబితాలోనిది. కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలదేనని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి  చెప్పారు. ఇదొక గొప్ప శుభ సంకేతం. ఇవాళ విద్యార్థులకు కావలసినది ఆత్మ స్థయిర్యం. విజ్ఞతతో యోచించడం. సంశయాత్ములు కాకుండా ఉండడం. ఇంకా, సమాజంతో మెలిగే పద్ధతి తెలియడం. వీటినే బోధిస్తుంది గీత.

సెంట్రల్‌ ‌బోర్డ్ ఆఫ్‌ ‌సెకండరీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (‌సీబీఎస్‌ఈ) ‌పాఠ్య ప్రణాళిక ప్రకారం 6,7,8 తరగతుల పిల్లలకు గీతను బోధిస్తున్న సంగతిని మంత్రి గుర్తు చేశారు. ఉత్తర ముంబై సభ్యుడు (బీజేపీ) గోపాల్‌ ‌శెట్టి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈమేరకు సమాధానం ఇచ్చారు. నిజానికి గీతను దేశవ్యాప్తంగా పాఠశాలల్లో బోధించే అవకాశం గురించి ఆ సభ్యుడు అడిగారు. కాంగ్రెస్‌ ‌సభ్యులు గీత చదివితే కాస్త ఇంగితజ్ఞానం వస్తుందని చురక వేశారు. ప్రస్తుతం ఆ పార్టీ సభను వాయిదాల పర్వం నుంచి సాగనివ్వడం లేదు.

జీవన ఔన్నత్యాన్నీ, మానవ సంబంధాలనూ మహోన్నత దృష్టితో చూసిన భగవద్గీత ఒక మార్గదర్శక గ్రంథం. అసమాన, అద్వితీయ భావాల వర్షిణి. మతం పరిధిలో దానిని ఎవరూ చూడరాదు. చాలా హిందూ గ్రంథాలు శౌనకాది మహామునులకు సూతుడు వివరించినవే. ఒక ప్రశాంత, రమణీయ మునివాటికలలో, పవిత్ర యజ్ఞవాటికల దగ్గర వాటిని మళ్లీ మునులే వింటారు. కానీ గీత- కురుక్షేత్రం నడుమ, ఒక మహా సంగ్రామం ఆరంభ వేళ జరిగిన తాత్వ్తిక చర్చ. కురుక్షేత్రం, యుద్ధం ఇవి మన అంతర్గత సమరానికి ప్రతీకలంటారు పండితోత్తములు. మనలోని యుద్ధ వాతావరణాన్ని గమనించాలి. మానసిక బలహీనతను ఓడించాలి. ఇందులో పాండవ మధ్యముడు ఆత్మ అయితే, కృష్ణ పరమాత్మ బ్రహ్మ. వారు అధిరోహించిన రథం మానవ దేహానికి ప్రతీక అంటారు.  ఇది నరనారాయణుల మధ్య భావ వినిమయం. ఎంత గొప్ప భావన!  శ్రోత నరుడు, అంటే అర్జునుడు. వ్యాఖ్యాత నారాయణుడు, ఆ దేవదేవుడు.

భారతీయత మీద, విశ్వం మీద గీత జాడ ఎంత సుదీర్ఘమైనదో! గాఢమైనదో! ఎంతమందిని నడిపించింది! అలనాటి శంకర భగవత్పాదులు మొదలు, రామానుజాచార్యులు, నింబార్కుడు, వల్లభాచార్యుడు, చైతన్య మహాప్రభు, అభినవగుప్తుడు, జ్ఞానేశ్వరుని దాకా గీతాసారం గ్రోలినవారే. సమీపగతంలో బాలగంగాధర తిలక్‌, ‌వివేకానంద, అరవిందులు, అనీబిసెంట్‌, ‌వినోబా, గాంధీ, ఆల్డస్‌ ‌హాక్సిలీ, రాల్ఫ్ ‌వాల్డో ఎమర్సన్‌, ‌కార్ల్ ‌యాంగ్‌, ‌హెర్మన్‌ ‌హెస్సె వంటివారు  ఎందరో జీవితాలపై గీతోపదేశం సుస్పష్టం. గీత ప్రతి యుగానికి కొత్త సందేశాన్ని ఇస్తుంది. ప్రతి నాగరికతకి అర్థాన్ని చెబుతుందంటారు అరవిందులు. అర్జునుడు సంశయాత్ముడైన మానవమాత్రుడికి ప్రతీక అయితే, కృష్ణభగవానుడు మనిషికీ, భగవానుడికీ నడుమ దైవిక సందేశాల వారథి అని కూడా  ఆ యోగి భాష్యం చెప్పారు. మంచీ చెడుల మధ్య మనసులో జరిగే ఒక మహాయుద్ధానికి ప్రతీక కురుక్షేత్రమంటారు స్వామి వివేకానంద. మానవ జీవిత జ్ఞానసారం గురించి సహజ సౌందర్యంతో చేసిన గొప్ప వ్యక్తీకరణ గీత అన్నారు హెర్మెన్‌ ‌హెస్సె.

‘సర్వశాస్త్ర మయీ గీత’ అంటుంది మహాభారతమే. మనిషి మానసికంగా స్థిరంగా ఉండేటట్టు చేసే శాస్త్రదృష్టి గీత బోధలలో ఒకటి అనిపిస్తుంది. వినదగినదే  వినమంటుంది గీత. తినదగినదే తినమంటుంది. గెలుపునీ, ఓటమినీ ఒక్కలా చూసే స్థిరబుద్ధిని అలవరుచుకోవాలంటుంది. కోపం ఎంత వినాశకరమైనదో ఇలా చెబుతుంది: క్రోధంతో వ్యామోహం కలుగుతుంది. ఆ ప్రభావంతో స్మృతి ఛిన్నాభిన్నమవుతుంది. స్మృతి భ్రష్టమైనందు వల్ల బుద్ధి, అంటే జ్ఞానశక్తి నశిస్తుంది. బుద్ధి నాశనం కావడం వల్ల మనిషి తన స్థితి నుంచి పతనమవుతాడు అంటుంది. బుద్ధి అంటే జ్ఞానశక్తి అనడంలోనే గీత లోతు తెలుస్తుంది. నేడు విద్యారంగంలో అలుముకుంటున్న కల్లోలాల నివారణకి గీత సమాధానం కాగలదు. అన్ని అవకాశాలు ఉన్నా, అలజడిలో కొట్టుకుపోతున్న విద్యార్థులే ఇవాళ ఎక్కువ. వ్యక్తి నిర్మాణం మీద కాకుండా, అనారోగ్య కరమైన పోటీ తత్త్వం వైపు భావిభారత పౌరులను నెట్టివేస్తున్న కారణంగా తలెత్తున్న ప్రమాదాన్ని దేశం ఇప్పటికే అనుభవిస్తోంది. తక్కువైన ఒక్క ర్యాంక్‌ ఆత్మహత్యకు దారి తీస్తే విద్య పరమార్ధం ఏమటి? పక్క విద్యార్థి కంటే తక్కువ వచ్చిన నాలుగు మార్కులు నూరేళ్ల జీవితాన్ని నిర్దేశిస్తే అదెంత విషాదం! ఎంత కడుపు కోత! సెల్‌ఫోన్‌తో సమయమంతా గడపవద్దంటే, ఇక జీవితమే వ్యర్థమన్న ఆలోచనలేమిటి? చైతన్యంతో ఉరకలు వేయవలసిన వయసులో మత్తుమందులకు బానిసలు కావడం ఏమిటి? ఇందులోని ప్రమాదాన్ని,ఉత్పాతాన్ని రేపటి తరానికి ఎలా చెప్పగలం! మన నేల మీద పుట్టిన గీత అనే ఆ మహా వికాస వాణి ఆ పని చేయగలదు. కొంచెం ఆలస్యంగానే అయినా మంచి ఆలోచన నేతలకు వచ్చింది. ఇక దేశమంతా పాఠశాలల్లో గీత వినిపించే రోజు కోసం వేచి చూద్దాం.

About Author

By editor

Twitter
YOUTUBE