– ఎం.వి.ఆర్. శాస్త్రి
మరునాడు (ఆగస్టు 19) వేకువనే సుభాస్ చంద్రబోస్ పార్థివకాయం చుట్టూ తెరలు కట్టి జపనీస్ సంప్రదాయం ప్రకారం పూలు, కొవ్వొత్తులు అలంకరించారు. జపాన్ మిలిటరీ గార్డులు అక్కడ కాపలా ఉన్నారు. ఉదయం 10 గంటలకు మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఉద్యోగులు వచ్చి దివంగత నేతకు మెమోరియల్ సర్వీస్ జరిపించారు. దేహం కుళ్ళకుండా చేసి సింగపూర్‌కు, అది కుదరకపోతే టోక్యోకు వెంటనే తరలించే ఏర్పాటు చేయమని హబిబుర్ రహమాన్ కోరాడు. సైగాన్‌కు, టోక్యోకు అప్పటికే దుర్ఘటన సమాచారం తెలిపాము; శవపేటిక తెప్పిస్తున్నాము; విమానం కోసం ప్రయత్నిస్తాము అని మేజర్ నగాతొమో చెప్పాడు. ముందు జాగ్రత్తగా డాక్టర్ యోషిమి భౌతిక దేహంలోకి ఫార్మాలిన్ రసాయనం ఇంజెక్ట్ చేశాడు. శవాన్ని మార్చురీలో ఉంచారు.
కాసేపటికి ఇంపీరియల్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఫార్మోసా ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌కు బోస్ దేహాన్ని విమానంలో టోక్యో పంపించమంటూ టెలిగ్రాం అందింది. మేజర్ నగాతొమో కర్పూరపు చెక్కతో చేసిన శవ పేటికను ఆస్పత్రికి పట్టుకొచ్చాడు. అతడే దగ్గరుండి కింద బట్ట పరిపించి పార్థివ దేహాన్ని అందులో పెట్టించాడు. అప్పుడే ఒక ఫోటోగ్రాఫరును పిలిపించారు. బోస్ ఒంటిమీద పలుచోట్ల బాండేజి కట్లు ఉన్నాయి. ముఖం విపరీతంగా వాచి, చర్మం ఊడి, పై పెదవి చిట్లి మొహమంతా వికారంగా ఉంది. ఆ స్థితిలో నేతాజీ లోకానికి కనపడటం ఇష్టంలేక హబిబుర్ రహమాన్ ముఖాన్ని ఫోటో తీయనివ్వలేదు. పేటికలో బట్టకప్పి ఉన్న బోస్ భౌతిక కాయం, ఆ పక్కనే హాస్పిటల్ గౌను, బాండేజి కట్లతో హబిబుర్ రహమాన్ ఉన్న దృశ్యాన్ని ఫోటో తీశారు. స్థానిక జపనీస్ ఆర్మీ ఆఫీసర్లు వచ్చి నేతాజీకి శ్రద్ధాంజలి అర్పించారు. శవపేటిక మీద ‘చంద్రబోస్’ పేరు రాశారు. మార్చురీలో మూత వేసి ఉంచారు.
మరునాడు (20న) నగాతొమోతో బాటు కొంతమంది మిలిటరీ అధికారులు వచ్చారు. నేతాజీ కాయానికి సగౌరవంగా నివాళి అర్పించాక చల్లగా చెప్పారు. అందుబాటులో ఉన్న విమానంలో శవపేటిక పట్టదట. అది పట్టేంత పెద్ద విమానం తెప్పించటం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదట. ఇంపీరియల్ హెడ్ క్వార్టర్సు తొలి ఆదేశాన్ని రద్దుచేసి, అంత్యక్రియలు తైహోకులోనే కానివ్వమని ఆదేశిస్తూ ఇంకో టెలిగ్రాం పంపిందట. ఫార్మోసాలో ఆగస్టులోనే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది. బోస్ మరణించి ఇప్పటికే రెండు రోజులు అయింది. ఎంబామింగ్‌కు కావలసిన రసాయనాలు అందుబాటులో లేవు. శరీరం కొయ్యబారింది. పూర్తిగా కుళ్ళకముందే ఇక్కడే దహనం చేయక తప్పదు. వేరే దారి లేదు. హబిబుర్ రహమాన్ వారి అశక్తతను అర్థం చేసుకుని ‘సరే’ అన్నాడు.
అనుకున్న వెంటనే శవ దహనం కుదరదు. కొన్ని ఫార్మాలిటీలు ఉంటాయి. అవసరమైన ఏర్పాట్లు చేయాలి. వాటికి ఇంకో రోజు పట్టింది. హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యోషిమి ‘చంద్రబోస్’ పేరుమీద అంతకుముందే డెత్ సర్టిఫికేట్ జారీ చేశాడు. ‘శరీరమంతటా థర్డ్ డిగ్రీ బర్నస్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్’ను మరణ కారణంగా పేర్కొన్నాడు.
విమానం కూలి బోస్ మరణించాక జరిగిన దానిలో తమ తప్పిదం చాలా ఉందని జపాన్ సైన్యాధికారులకు అర్థమయింది. ఏడు దేశాల చేత గుర్తించబడిన ఆజాద్ హింద్ ప్రభుత్వ అధినేత పట్ల వారు వ్యవహరించిన తీరులో ప్రోటోకాల్ ఉల్లంఘన చాలా ఉంది. అంతకు ముందు ఒకసారి ట్రబుల్ ఇచ్చి కండిషన్ సరిగా లేని విమానంలో ఒక ప్రభుత్వాధినేతను ఒంటరిగా పంపటమే పెద్ద తప్పు. జపాన్ అధికారికంగా సరెండర్ అయి, మిత్ర రాజ్యాల తదుపరి ఆజ్ఞల కోసం చేతులు కట్టుకుని తలవంచిన సమయంలో ఆ రాజ్యాలకు ప్రబల శత్రువైన సుభాస్ చంద్రబోస్‌ను మంచూరియాకు, అటునుంచి రష్యాకు జపాన్ ప్రభుత్వం రహస్యంగా పంపబూనిన సంగతి బయటపడితే పెద్ద గొడవ అవుతుంది. పోనీ సంప్రదింపుల కోసం ముందస్తు అనుమతి లేకుండా అతడిని టోక్యోకు పిలిపించామని చెప్పినా అది ఇంకో అపరాధమవుతుంది. చరిత్రలో మొదటిసారి జపాన్ శత్రువులకు పాదాక్రాంతమై, బాంబు దాడుల్లో సర్వనాశనమై, హిరోహిటో చక్రవర్తి అంతటివాడే తన గతి ఏమవుతుందోనని గజగజ వొణుకుతున్న సమయంలో ప్రభుత్వ వ్యవస్థ కుప్పకూలింది. కొమ్ములు తిరిగిన సేనాపతులూ, ప్రభుత్వ ప్రముఖులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏ నిర్ణయం తీసుకోవటానికీ ఇంపీరియల్ హెడ్ క్వ్వార్టర్స్‌లో ఎవరూ సిద్ధంగా లేరు. ఎవరూ ఎవరికీ అందుబాటులోకి రావటం లేదు. కర్మం చాలక అదే సమయంలో తైహోకు టోక్యో, సైగాన్‌లతో కమ్యూనికేషన్లూ దెబ్బతిన్నాయి. దిక్కుతోచని కంగారులో ఎవరి నిర్ణయమో తెలియదు కాని విమాన ప్రమాదాన్ని, అందులో సుభాస్ బోస్ దుర్మరణాన్ని బయటికి పొక్కనివ్వకుండా అతి గోప్యంగా ఉంచాలని తైహోకులోని జపాన్ అధికారులకు రహస్య ఆదేశాలు వెళ్ళాయి. వారు వెంటనే రంగంలోకి దూకారు.
డాక్టర్ యోషిమి మొదట సంతకం చేసిన మరణ ధ్రువ పత్రాన్ని మార్పించి ‘చంద్రబోస్’కు బదులుగా ‘ఇచిరో ఒకురా’ అనే సైనికుడి పేరు మీద కొత్త డెత్ సర్టిఫికేట్ ఇప్పించారు. పోలీసుల శవ పంచాయతీలోనూ అదే పేరు నమోదు చేయించారు. మెట్రోపాలిటన్ మునిసిపల్ బ్యూరో ఆఫీసు నుంచి అదే మారుపేరు మీద దహనానికి పర్మిట్ తీసు కున్నారు. మామూలుగా అయితే అక్కడి సిబ్బంది శవాన్ని స్వయంగా తనిఖీ చేసి అది ఆ పేరు గలవాడిదే అని నిర్ధారించుకున్నాక గాని అనుమతి పత్రం ఇవ్వరు. అప్పటికి ఫార్మోసా దీవి (తైవాన్) ఇంకా జపాన్ పెత్తనం కిందే ఉన్నది. ఒక జపనీస్ మిలిటరీ ఆఫీసరు వెళ్లి ఆ బ్యూరోకు డైరెక్టర్‌గా ఉన్న జపాన్ అధికారితో మాట్లాడాడు. ప్రఖ్యాత భారత నాయకుడు చంద్రబోస్‌కు అంత్యక్రియలు చేయాలి; దానికి మారుపేరు మీద అనుమతి ఇవ్వమని అడిగి ఆ ప్రకారం ఆగస్టు 21వ తేదీన పర్మిట్ జారీ చేయించాడు. స్థానిక దహనవాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరిగాయి.
ఆగస్టు 22న సుభాస్ చంద్రబోస్ దహన సంస్కారం సింపుల్‌గా, హుందాగా జరిగింది. ఆస్పత్రి నుంచి శవపేటికను అలంకరించిన మిలిటరీ ట్రక్కులో తీసుకుపోయారు. 12 మంది సాయుధ సైనికులు దాని వెంట ఉన్నారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు నియోగించబడిన మేజర్ నగాతొమో వేరే కారులో హబిబుర్ రహమాన్, దుబాసీ నకమురాతో కలిసి ఆ శకటం ముందు ఉన్నాడు.
సైనికులు గౌరవ వందనం సమర్పించి, ప్రధాన ద్వారం నుంచి క్రెమటోరియం లోపలికి శవపేటికను భుజాలమీద మోసుకుని పోయారు. అక్కడ శవాల దహనానికి రెండు వరసలలో ఒక డజను ఇన్సినరేటర్లు ఉన్నాయి. అన్నిటిలోకీ మంచి ప్రదేశాన్ని నేతాజీ కోసం ప్రత్యేకించారు. విశాలమైన హాలు మధ్యలో ఉన్న ఫర్నెస్ స్లైడింగ్ ట్రే వద్ద భౌతిక దేహాన్ని పొజిషన్‌లో ఉంచి సెల్యూట్ చేసి సైనికులు బయటికి వచ్చారు. అప్పుడు అధికారులు లోపలికి వెళ్ళారు. ముందు రహమాన్, అతడి వెనుక నకమురా, ఆ వెనుక నగామోతో, మరి నలుగురు ఉన్నారు. ఇన్సినరేటర్ ఎదుట నిలబడి సెల్యూట్ చేసి నివాళి అర్పించాక పార్థివ కాయాన్ని లోపలికి నెట్టారు. అగరబత్తులు పట్టుకుని గంభీరంగా ఉన్న బౌద్ధ అర్చకుడు ఏదో మెల్లిగా గొణిగి ఇన్సినరేటర్‌కున్న మెటాలిక్ డోర్ మూశారు. తరవాత రహమాన్ బృందం వెనక వైపు వెళ్లి అర్చకుడు అందించిన అగర్ బత్తులను తలా ఒకటి తీసుకుని ఫర్నెస్ గోడకు అమర్చి ఉన్న కన్నంలో ఉంచారు. రహమాన్ చేతులకు కట్టు ఉన్నందున నకమురా ఒక అగర బత్తిని తీసుకుని అతడి అరచేతుల మధ్య ఉంచాడు. ప్రార్థన తరవాత మెటాలిక్ డోర్‌కు తాళం వేసి తాళంచెవి రహమాన్ తీసుకున్నాడు. తన నాయకుడు అగ్నికి ఆహుతి కావటం అతడు అరగంట సేపు చూశాడు. అస్థికల కోసం మరునాడు రమ్మని అక్కడి కేర్ టేకర్ చెప్పాడు.
మరునాడు ఉదయం మేజర్ నగాతొమో ఆసుపత్రికి వెళ్లి రహమాన్‌ను వెంటపెట్టుకుని కారులో క్రెమటోరియం వెళ్ళాడు. ఫర్నెస్ తాళం వారే తీసి స్లైడింగ్ ట్రేను బయటికి లాగారు. అస్థిపంజరం ఏమాత్రం చెదరకుండా ఉన్నది. బౌద్ధ ఆచారం ప్రకారం గొంతుభాగం నుంచి ఒక ఎముకను చాప్ స్టిక్స్‌తో తీసి నగాతొమో తన వెంట తెచ్చిన చిన్న చెక్కపెట్టెలో ఉంచాడు. తరవాత మిగతావారూ ఇతర శరీర భాగాలనుంచి ఎముకలను, బూడిదను ఏరి పెట్టెలో భద్రపరిచారు. ఆ సందర్భంలో ఒక చిన్న బంగారపు పలుకు మెరుస్తూ కనిపించింది. అది నేతాజీ ఫిల్లింగ్ చేయించుకున్న దంతానికి సంబంధిం చినది. దాన్ని కూడా హబీబ్ తీసి భద్రపరచాడు. ఆస్థి, భస్మ సేకరణ అయ్యాక బౌద్ధ ఆచారం ప్రకారం ఆ పేటికను తెల్లని వస్త్రంలో చుట్టి హబిబుర్ రహమాన్ మెడకు ఉట్టిలా తగిలించారు. తరవాత అందరూ కారులో మిలిటరీ హాస్పిటల్‌కు దగ్గరలో ఉన్న హొన్గన్జి బౌద్ధ దేవాలయానికి వెళ్లి అంత్యక్రియ ప్రత్యేక కార్యక్రమం తరవాత ఆ పేటికను అక్కడ ప్రధానార్చకుడికి అప్పగించారు. గమ్యస్థానానికి తీసుకు వెళ్ళేంతవరకూ దానిని అక్కడే ఉంచి రోజూ పూలతో అలంకరించేలా ఏర్పాటు చేశారు. ఆ విధంగా నేతాజీ సుభాస్ చంద్రబోస్ జీవయాత్ర ముగిసింది. బ్రిటిషు వారు తనను ప్రాణాలతోనే కాదు; ప్రాణం పోయాక కూడా పట్టుకొనలేరని 1944లో ఝాన్సీరాణి రెజి మెంట్‌లోని జానకితో నేతాజీ అన్న మాట నిజమ యింది. బోస్ బూడిద కూడా తెల్లవాళ్ళకు చిక్కలేదు.
అస్థి సంచయనం తరవాత హబిబుర్ రహ మాన్‌కు ఇంకో దిగులు పట్టుకుంది. తనను వెంట బెట్టుకుని వచ్చిన మహా నాయకుడు అర్ధాంతరంగా అగ్నికి ఆహుతి అయ్యాడు. ఆయన ఆనవాలుగా మిగిలింది భస్మపాత్ర ఒక్కటే. దానిని ఎక్కడికి తీసుకుపోవాలి? పరాయి దేశంలో ఉండి ఏమి చేయాలి? అంతదాకా అండగా ఉన్న జపాన్ కూడా యుద్ధంలో చితికి శత్రువుకు దాసోహం అన్న తరవాత ఎక్కడికి వెళ్ళాలి? దేనికోసం?
సింగపూర్‌లో బయలుదేరినప్పుడు బోస్ తన వెంట ఎంతో విలువైన బంగారాన్ని, ఆభరణాలను 13 పెట్టెల్లో తీసుకువెళ్ళాడు. సైగాన్లో విమానం ఎక్కుతుండగా లగేజి మరీ ఎక్కువ కావటంతో రెండు సూట్ కేసులలో పట్టినంతమేరకే తీసుకుని మిగిలినవి అయ్యర్ తదితర సహచరుల వద్ద వదిలేశాడు. వెనుకనుంచి ఇంకో విమానంలో వారు తనని చేరుకుంటారని ఆయన అనుకున్నాడు. తైహోకులో ఘోర ప్రమాదంలో సామాన్లతో బాటు వెలలేని బోస్ స్వర్ణనిధి కూడా మంటల్లో చిక్కుకుంది. అది ఏమయిందో తెలియదు. దానిని అలా వదిలేయటం రహమాన్‌కు ఇష్టం లేదు.
ఏమి చేయాలో పాలుపోక విమానప్రమాదంలో తనలాగే బయటపడ్డ లెఫ్టినెంట్ కల్నల్ సకాయి ముందు తన గోడు వెళ్ళబోసుకున్నాడు. అతడు బర్మాలో రహమాన్‌తో కలసి పని చేశాడు. ఇద్దరికీ మంచి స్నేహం. ప్రమాదంలో గాయపడిన జపాన్ వారిని తైహోకులోని ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్‌కు తరలించారు. కొన్నాళ్ళకు రహమాన్‌ని కూడా అక్కడికి మార్చారు. ఆ సందర్భంలో కలిసినప్పుడు దిక్కుతోచని మిత్రుడికి సహాయపడాలని సకాయి అనుకున్నాడు. తైవాన్ జనరల్ హెడ్ క్వార్టర్స్‌కు హాస్పిటల్ కారులో వెళ్లి పాత పరిచయస్థుల ద్వారా అక్కడి అధికారులతో మాట్లాడి రహమాన్‌కు అన్నివిధాల సహాయపడేందుకు ఒప్పించాడు. గల్లంతైన అమూల్య వస్తువుల గురించి వాకబు చేయగా – విమానం మంటల్లో 12 గంటలకు పైగా కాలింది. దగ్ధ శిథిలాల్లో దొరికిన బంగారం ఆభరణాలు వగైరా ఒక ఆయిల్ కాన్‌లో భద్ర పరిచాము అని కంట్రోల్ బ్యూరో వారు చెప్పారు. (నిజానికి ప్రమాదం జరిగిన వెనువెంటనే బోస్ పెట్టెల్లో విలువైన రత్నాభరణాలు ఉన్న సంగతి లెఫ్టినెంట్ కల్నల్ నొనొగాకి స్థానిక లెఫ్టినెంట్ కల్నల్ తకమియకు తెలియపరచాడు. ఆ అధికారి వెంటనే మిలిటరీ పోలీసులను శిథిలాల వద్ద కాపలా ఉంచి వెదికించాడు. మొదటి రెండు రోజుల్లో 3 వేల కారట్లు, మూడో రోజు 2 వేల కారట్ల బంగారం, ఆభరణాలు దొరికాయని తరవాత అతడు చెప్పాడు. మొత్తం అన్నిటినీ ఆయిల్ కాన్‌లో పెట్టి సీలు చేశారు.)
అస్థి పాత్రను, నేతాజీ నిధిని తీసుకుని ముందుగా టోక్యో వెళ్లి ఇంపీరియల్ హెడ్ క్వార్టర్స్‌తో అన్ని విషయాలు మాట్లాడాలని రహమాన్ అనుకున్నాడు. తనను టోక్యో పంపమని అతడు తైవాన్ అధికారులను ఒత్తిడి చేశాడు. వారు ఒకరోజు రహమాన్‌ను పిలిచి ‘ఒక అంబులెన్స్ విమానం టోక్యోకు బయలు దేరుతున్నది. అందులో ఒక సీటు మీకు ఇవ్వగలం’ అని చెప్పారు. బతుకు జీవుడా అనుకుని నేతాజీ వస్తువులనూ అవశేషాల పేటికనూ తీసుకుని అతడు సెప్టెంబరు 6న టోక్యో చేరాడు. అతడిని నగర శివార్లలో ఒక చోట రహస్యంగా ఉంచారు. రెండు రోజుల తరవాత ముందు భస్మ పేటికనూ, ఆ తరవాత అతడినీ సహచరుల దగ్గరికి పంపించారు.
అప్పుడు ఏమైందన్నది అయ్యర్ మాటల్లో :
తైహోకు నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా? అని నేను, టోక్యోలో ఐఐఎల్ అధ్యక్షుడు రామమూర్తి రోజూ వెళ్లి ఇంపీరియల్ హెడ్ క్వార్టర్స్‌లో వాకబు చేస్తుండే వాళ్ళం. వారు ఏమీ లేదు అంటుండే వాళ్ళు. సెప్టెంబరు 7న కలిసి నప్పుడు వారు ‘రేపు రండి చెపుతాం’ అన్నారు. ఆ రాత్రంతా మాకు నిద్ర పట్టలేదు. మరునాడు ఉదయం ఆత్రంగా హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లాం. ‘హబిబుర్ రహమాన్ నేతాజీ చితాభస్మం తీసుకుని టోక్యో వచ్చాడు; ఈ రోజు మిమ్మల్ని కలుస్తాడు; భస్మ పాత్ర మా దగ్గరికి వచ్చింది; ముందుగా దానిని మీకు అప్ప గిస్తాము.’ అని అక్కడి ఒక కల్నల్ చెప్పాడు. నేను సరే అన్నాను. ‘కిందికి వెళ్లి కారు దగ్గర ఉండండి. దాన్ని తీసుకోగానే వెళ్లిపోవచ్చు’ అని అతడు అన్నాడు.
నేను,రామమూర్తి వెళ్లి పోర్టికో కింద వేచి ఉన్నాము. కల్నల్ భక్తిశ్రద్ధలతో భస్మపేటికను రెండు చేతులతో జాగ్రత్తగా పట్టుకొని కొందరు ఆఫీసర్లతో కలిసి మెట్లుదిగి మా దగ్గరికి వచ్చాడు. తెల్లటి వస్త్రాన్ని ఏడెనిమిది అంగుళాల వెడల్పున లూప్‌లా ముడివేసి కట్టి నా మెడలో వేశారు. కల్నల్ పేటికను అందులో పెట్టాడు. నేను దాన్ని రెండు చేతులతో పట్టుకుని కారెక్కాను.
మేము వెళ్లేసరికి రామమూర్తి భార్య ఇంట్లో ఎత్తుబల్ల మీద తెల్లని బట్ట పరచి, నేతాజీ పటం పెట్టి ఉంచింది. దాని ముందు భస్మ పాత్రను ఉంచి పూలు చల్లి అగరుబత్తులు వెలిగించి మేమందరం భక్తితో నమస్కరించాం. ఆందరి మనసులూ వికల మయ్యాయి. నేతాజీనే తలచుకుంటూ ఆయన గురించే మాట్లాడుకుంటూ చాలాసేపు అక్కడే కూచున్నాం. అప్పటికీ నాకు ఆ అవశేషాలు నేతాజీవి కావేమో, జపాన్ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారేమో, నేతాజీ బతికే ఉన్నాడేమో, ఏదో ఒక రోజు మా మధ్యకు వచ్చేస్తాడేమో అని మనసులో ఏ మూలో చిన్న ఆశ. అలా జరిగేట్టు చేయమని దేవుడిని పదేపదే వేడుకున్నాను. తరవాత మెల్లిగా లేచి రెండు మైళ్ళ దూరంలోని నా బసకు నడిచి వెళ్లాను.
అది ఆజాద్ హింద్ ప్రభుత్వంలో నా తోటి మంత్రి ఎ.ఎం.సహాయ్ ఇల్లు. అతడు హనోయ్‌లో ఉన్నాడు. భార్య, బిడ్డలు ఇంటి దగ్గర ఉన్నారు. సహాయ్ శ్రీమతి చల్లని తల్లి. వందల సంఖ్యలో విలాసవంతమైన గదులున్న పెద్ద పెద్ద హోటళ్ళలోనే తినడానికి ఏదీ దొరకక, కనీసం చిటికెడు ఉప్పుకూ, చక్కెరకూ తెరువులేని చేటుకాలంలో నా వంటి వారికి ఇంట్లో ఆశ్రయమిచ్చి, ఎలాగో కష్టపడి కడుపునిండా తిండి పెట్టిన మహా ఇల్లాలు. ఆమెకూ నేతాజీ అంటే ఎనలేని భక్తి. ఆయన అవశేషాలు వచ్చాయని చెపితే నిర్ఘాంత పోయింది. ఎంతో బాధపడింది. హబిబ్ వస్తే గానీ నిజానిజాలు తెలియవు, అతడు ఏ కబురు మోసుకొస్తాడో ఏమో అనుకుంటూ, గుబగుబలాడే గుండెలతో అతడి కోసమే ఎదురుచూస్తూ క్షణమొక యుగంగా డ్రాయింగు రూములో చాలా గంటలు వేచి ఉన్నాం.
ఎట్టకేలకు రాత్రి 10 గంటలు దాటాక బయట గేటు చప్పుడైంది. విమాన ప్రమాదం బూటకం, నేతాజీ క్షేమం అని అతడు చెప్పాలని వెయ్యిదేవుళ్లకు మొక్కుకుంటూ తలుపు తీశాం. చూడాలి చూడాలి అని నేను పరితపించిన హబిబ్ రానే వచ్చాడు. సైగాన్‌లో మూడువారాల కింద విమానం ఎక్కే ముందు లాగే ఇప్పుడూ ఖాకీ బుష్ కోటు, బ్రీచేస్, టాప్ బూట్లతో ఉన్నాడు. రెండు చేతులకు, తలకు బాండేజి ఉంది. మొహం కాస్త వాచి, పాలిపోయినట్టు కనిపించింది. మనిషి నీరసంగా ఉన్నాడు. ‘జైహింద్’ అని పరస్పర అభివాదాలయ్యాక నేను అతడి చుట్టూ చేతులువేసి ఆప్యాయంగా తీసుకువెళ్ళి సోఫాలో కూచోబెట్టాను. రహమాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్రేకపడడు. మెల్లిగా మాట్లాడతాడు. ఇప్పుడూ అలాగే ఉన్నాడు. అసలు ఏమైంది? నిజం చెప్పు -అంటూ నేను ప్రశ్నల వర్షం కురిపించాక హబిబ్ నింపాదిగా మొదలెట్టాడు. సైగాన్లో విమానం బయలుదేరింది మొదలు తైహోకులో టేకాఫ్ తరవాత ప్రొపెల్లర్ ఊడి విమానం కూలటం వరకూ జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించాడు.
‘పోర్ట్ ఇంజన్ పాడయింది. ఒక్క స్టార్ బోర్డ్ ఇంజన్ మాత్రమే పనిచేస్తున్నది. విపరీతంగా ఊగిస లాడుతున్న విమానాన్ని కంట్రోల్ చేయటానికి పైలట్ విశ్వప్రయత్నం చేస్తున్నాడు. భయంతో అందరూ కెవ్వుమని హాహాకారాలు చేస్తున్నారు. నేతాజీ మాత్రం నిర్వికారంగా ఉన్నాడు. విమానం సాఫీగా లాండ్ అవుతున్నప్పుడు ఎలా ఉంటాడో ఇప్పుడూ అలాగే నిబ్బరంగా ఉన్నాడు. మరికొద్ది సెకండ్లలో విమానం మహావేగంగా నేలకు గుద్దుకున్నది. ఏమైందో తెలియదు. నాకు స్పృహ పోయింది. మళ్ళీ మెలకువ వచ్చేసరికి నా మీద లగేజి పడి ఉంది. నేతాజీ తలకు పెద్ద గాయమయింది. ఆయన ఎలాగో లేచి నా వైపు రాబోతుంటే ‘వెనుక దారి మూసుకు పోయింది. ముందు నుంచి వెళ్ళమ’ని నేను అరిచాను. ముందు వైపు మంటలు. నేతాజీ ధైర్యంగా రెండు చేతులతో నెట్టుకుంటూ మంటలలోంచే పరుగెత్తి కిందికి దూకాడు. పది పదిహేను అడుగులు వెళ్లి నాకోసం నిలబడ్డాడు. ప్లేన్ క్రాష్ కాగానే నేతాజీ ఒంటిమీద పెట్రోల్ చిందింది. మంటలకు ఖాకీ దుస్తులు భగ్గున అంటుకున్నాయి. అలాగే పరుగెత్తి బట్టలు, బెల్టు లాగేసే ప్రయత్నం చేశాడు. నేనూ ఆయనకు సాయపడ్డాను. నాకు చేతులు కాలాయి. ఆ సమయాన నేతాజీ మొగం చూస్తే భయం వేసింది. ఇనుప వస్తువేదో బలంగా తాకటం వల్ల తలకు లోతుగా గాయమయింది. రక్తం ధారగా కారుతున్నది. మంటలకు మొహం, ఒళ్ళు బాగా కాలిపోయింది. కొన్ని క్షణాల తరవాత ఆయన నేలకు ఒరిగాడు. మెల్లిగా నాకూ స్పృహ తప్పింది.
కళ్ళు తెరిచేసరికి ఆసుపత్రిలో ఉన్నాను. నా పక్క బెడ్ మీద నేతాజీ ఉన్నాడు. కాస్త తేరుకున్నట్టే కనిపించాడు. కాసేపటికి కోమాలోకి వెళ్ళాడు. డాక్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన ప్రాణం కాపాడలేక పోయారు. ఆస్పత్రిలో చేర్చి ఆరు గంటలయ్యాక రాత్రి తొమ్మిదింటికి నేతాజీ ప్రశాంతంగా కన్నుమూశాడు. ఆ ఆరుగంటల్లో తన శరీర బాధ గురించి ఆయన ఒక్క మాట కూడా అనలేదు. అంత భయంకర వేదననూ మౌనంగా భరించాడు. ఇక తాను బతకనని గ్రహించాక ఆయన నాకు చెప్పిన చివరి మాటలివి: ‘హబిబ్. నాకు మరణం దగ్గరపడింది. బతికినంత కాలం నేను నా దేశ స్వాతంత్య్రం కోసం పోరాడాను. ఇప్పుడూ స్వాతంత్య్రం కోసమే ప్రాణం అర్పిస్తున్నాను. పోరాటాన్ని కొనసాగించమని మన దేశవాసులకు చెప్పు. ఇండియా స్వాతంత్య్రం పొంది తీరుతుంది. అదీ త్వరలోనే.’ ఇదీ ఆయన చివరి సందేశం.
ఆ సమయంలో నేను పడిన క్షోభను మీరు అర్థం చేసుకోగలరు. నేతాజీ దేహాన్ని సింగపూర్‌కు తరలించాలని ప్రయత్నించాను. కాని కుదరలేదు. శవపేటిక పట్టేంత విమానం అందుబాటులో లేదని, శరీరం పాడవకముందే దహనం చేయటం మంచిదనీ అధికారులు అన్నారు. వేరే దారిలేక తైహోకులోనే దహనానికి అంగీకరించాను. పూర్తి మిలిటరీ లాంఛనాలతో ఫ్యూనెరల్ సర్వీసు జరిగింది. నేతాజీ అవశేషాలతో నన్ను టోక్యో పంపించమని అడిగాను. అధికారులు ఒప్పుకున్నారు. మొన్న ఏదో విమానంలో నన్ను టోక్యో చేర్చారు. రెండు రోజులు ఎక్కడో రహస్యంగా ఉంచి ఇవాళ మీ దగ్గరికి పంపించారు’ అని హబిబ్ చెప్పుకొచ్చాడు.
నిర్ఘాంతపోయి అంతా మౌనంగా విన్న నాకు, సహాయ్ భార్యకు నోట మాట రాలేదు. మిగిలిన చివరి ఆశ కూడా ఆవిరయింది. మేము భయపడినంతా జరిగింది. ప్రమాదం కట్టుకథ కాదని తేలిపోయింది. నేతాజీ ఇక లేడన్న భయంకర వాస్తవాన్ని ఒప్పుకోవటానికి ఇంకా మనస్కరించటం లేదు. విసురుగా లేచి హబిబ్ భుజాలను చేతులతో గట్టిగా నొక్కుతూ దీనంగా అడిగాను : ‘‘కల్నల్ సాహెబ్. దయచేసి చెప్పు. నా నుంచి నిజం దాచలేవు. నా కళ్లలోకి చూసి చెప్పు. నిజంగా విమానం క్రాష్ అయిందా? నేతాజీ నిజంగానే మనకు లేడా?’’
నా ఉద్వేగం చూసి హబిబ్ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ‘‘అయ్యర్ సాహెబ్. అయాం సారీ. వెరీ సారీ. మీరు విన్నది భయానక వాస్తవం. అదంతా అబద్ధం కావాలని ఆశపడి లాభం లేదు. నేను నిజమే చెప్పాను. నన్ను నమ్మండి.తప్పదు.’’
[Unto Him A Witness, S.A. Ayer, pp.107 -115]
- మిగతా వచ్చేవారం