– డా॥ కాశింశెట్టి సత్యనారాయణ, 9704935660
స్వాతంత్య్రానికి ముందు భారతీయ సంస్కృతిలో హిందూ, ముస్లింలు అంతర్భాగంగా ఉన్నారు. ఈ రెండు ప్రధాన వర్గాల మధ్య స్నేహం, సోదరభావం ఆదర్శప్రాయంగా ఉంది. మత సామరస్యం ప్రతీకగా ఉన్నారు. స్వాతంత్రోద్యమం జన బాహుళ్య ఉద్యమం. ఈ ఉద్యమంలో అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు, అన్ని మతాలు తమ వంతు కృషి చేశాయి. వీరిలో ముస్లింలు కూడా స్వాతంత్య్రం కోసం ఎంతో కృషి చేశారు. అంతేకాదు, ముస్లిం స్త్రీల పాత్ర కూడా తక్కువేమి కాదు.ల
ప్రథమ ప్రపంచ యుద్ధానంతరం బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుండి భరతమాతకు విముక్తి లభిస్తుందని భావించిన జాతీయోద్యమ నాయకులకు ఆంగ్లేయులు రౌలట్ చట్టాన్ని తీసుకుని వచ్చి షాక్ ఇచ్చారు. పంజాబ్ ప్రజలు రౌలట్ చట్టం వలన ఇబ్బంది పడుతున్నారు. ఎవరు ఎప్పుడు అరెస్టు అవుతారో ఏ స్వతంత్య్ర సమర యోధుని ఇంటిపై పోలీసులు విరుచుకుపడతారో, ఎంతటి విధ్వంసం సృష్టిస్తారో తెలియని భయానక రోజులవి. ఆ రోజుల్లో కూడా ‘మీరు ధైర్యం కోల్పోకండి, వేదనపాలు కావద్దంటున్న – ఈ సాదత్ ప్రార్ధన మరువద్దు. ఎలాగైనా మీరు స్వపరిపాలనా స్వేచ్ఛను పొందండి’’ అంటూ ఉద్యమకారులను ప్రోత్సహిస్తూ ఆమె కవితలు రాసారు. ఆమె పేరు సాదత్ బానో కిచ్లు, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు భార్య.
రౌలట్ చట్టం కిరాతకత్వానికి పంజాబ్ ప్రజలతో పాటు డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు బలయ్యారు. ఆయనకు సంకెళ్లు వేసి అజ్ఞాత స్థావరానికి తరలించారు. అయన ప్రాణాలకు ముప్పు ఉందని ప్రజల్లో తీవ్ర ఆందోళన ప్రారంభమయింది. అయితే విచారణ జరిపి శిక్ష విధించారు. సాదత్ బానో మాట్లాడుతూ ‘‘నా భర్తకు శిక్ష పడినందుకు సంతోషంగా ఉంది. ఆ కంటక మార్గంలో సాగి నా ప్రాణాలను బలి ఇవ్వడానికి నేను సర్వదా సిద్ధం’’ అని ప్రకటించారు.
డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు, డాక్టర్ సత్యపాల్‌ను బ్రిటిష్ సైనికులు సంకెళ్లు వేసి అజ్ఞాత స్థావరానికి తరలించినప్పుడు పంజాబ్ ప్రజలు వారి వివరాలు తెలపాలని జలియన్‌వాలాబాగ్‌లో 1919 ఏప్రిల్ 13న సమావేశమయ్యారు. అక్కడ 15వేల నుండి 25 వేల దాకా జనం ఉన్నారు. వారంతా రౌలట్ చట్టానికి నిరసన తెలపడానికి అక్కడ సమావేశ మయ్యారు. ఆ సమావేశంలో డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు భార్య సాదత్ బానో కిచ్లు కూడా ఉపన్యాసం చేయాల్సి ఉంది. కానీ ఆవిడ సకాలంలో సమావేశ స్థలానికి చేరుకోలేకపోయారు. రెజినాల్డ్ డయ్యర్ అనే బ్రిటిష్ సైనికాధికారి ప్రధాన ద్వారం మూసివేయించి 50 మంది పోలీసులను పొజిషన్ తీసుకొని ఫైర్ చేయమన్నాడు. 1651 రౌండ్లు పేల్చారు, కాల్పుల్లో 379 మంది పౌరులు మరణించారు. భారత స్వతంత్ర సంగ్రామ చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన, హేయమైన సంఘటనగా జలియన్‌వాలాబాగ్ ఉదంతం నిలిచిపోయింది.
మాతృభూమి పట్ల భక్తి భావం గల దేశభక్తులకు అక్షర జ్ఞానం తోడై, ఆ అక్షర యోధులకు దాస్య శృంఖలాల నుండి మాతృభూమిని విముక్తం చేయాలన్న దృఢ సంకల్పంతో పోరుబాటను ఎంచు కొన్న ఉద్యమకారులు జీవిత భాగస్వాములు అయితే అటువంటి మహిళలు అద్భుతాలు సృష్టించగలరు. బేగం సాదత్ బానోకు అటువంటి అవకాశమే దక్కింది.
1893 జనవరి 10న పంజాబ్ రాష్ట్రంలో అమృత్‌సర్‌లో సాదత్ బానో జన్మించారు. ఆమె తండ్రి మియా హఫీజుల్లా, ఆ ఇల్లు విద్యావికాసాలకు పుట్టినిల్లు. ముస్లిం యువతులు చదువుకోవడమే అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో సాదత్ బానో పలు భాషలు నేర్చుకొన్నారు, అంతే కాకుండా జాతీయ స్ఫూర్తితో కవితలు రాసి గాంధీజీ లాంటి ప్రముఖుల ప్రశంసలను అందుకొన్నారు.
1914 అక్టోబర్ 20న డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లును వివాహం చేసుకున్నారు. ఆయన కూడా స్వాతంత్య్ర సమరయోధుడు. బారిస్టర్ అయ్యాక న్యాయవాదిగా మొదట రావల్పిండిలో ప్రాక్టీస్ ప్రారంభించినా తరువాత అమృత్‌సర్‌లో స్థిరపడ్డారు. 1919లో లక్షలు ఆర్జించి పెడుతున్న న్యాయవాదవృత్తిని వదిలి ఖిలాపత్ ఉద్యమానికి, జాతీయ కాంగ్రెస్ కార్యక్రమా లకు అంకితమయ్యారు. జలియన్ వాలాబాగ్ హీరోగా ఖ్యాతి గడిరచారు. బ్రిటిష్ వలసవాదుల చర్యలను తీవ్రంగా వ్యతిరేకించడంతో సుమారు 14 సంవత్సరాల కాలం జైలు గోడల మధ్య గడపాల్సి వచ్చింది. భారత ప్రజలు బానిసత్వం నుండి విముక్తమై స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ సంతోషంగా గడపాలని ఆకాంక్షిస్తూ కఠిన కారాగారవాసాన్ని, క్రూర హింసను భరించారు.
సాదత్ బానో కిచ్లు కలం పట్టి మతోన్మాద భావాలకు వ్యతిరేకంగా పోరాడారు. బయట శత్రువును తరిమికొట్టాలంటే ‘‘హిందూ-ముస్లిం’’ ఐక్యత అవసరమని ఆమె తన కలం ద్వారా, గళం ద్వారా పలుమార్లు ప్రకటించారు. ఆ ప్రయత్నంలో భాగంగా హిందూ సోదరుల మనోభావాలను గాయపర్చరాదు. ఆమె దానిని ఆచరించి చూపారు. హిందూ సోదరులు గోవును ఆరాధిస్తారు గనుక ఆమె తన కుటుంబంలో గోమాంసం వంటకాన్ని పూర్తిగా మానేశారు.
ఆమె రాసిన మరో గేయం` ‘నక్షత్రాలతో సంభాషణ.’ ‘‘నాకు నక్షత్రాలతో గాని, ఆకాశంతో గాని ఏ అవసరం లేదు. నా దేశం, నా భారతదేశం గురించే నా చింత అంతాను. ఆ రోజుని దేవుడు ఏనాటికైనా కళ్లకు చూపిస్తాడా?’’ అని వాపోయారు.
పంజాబ్‌లో జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతాల విచారణకు గాంధీజీ పంజాబ్ వచ్చి సాదత్ బానో కిచ్లును కలిశారు. ఆ సందర్భంగా ఉద్యమకారుల విడుదల కోసం ఓ కవిత రాసి గాంధీజీకి సమర్పించారు.
‘‘ప్రతి హృదయంలో నీ హృదయం వుంది కదా గాంధీ
నీ ప్రశంసలకు ఆలవాలం కదా ప్రతి జిహ్వ గాంధీ
యధార్థాన్ని విడమరచి చెప్పాలి మరీ
మీ మార్గదర్శకత్వంలో సూచించాలి ఉపాయాన్ని
జైలులో పడి వున్న వాళ్లు బంధ విముక్తులవ్వాలి.’’
బ్రిటిష్ వారిని ఎదుర్కొనేందుకు జాతీయ ఉద్యమకారులకు శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో డాక్టర్ కిచ్లు ‘‘స్వరాజ్య ఆశ్రమం’’ స్థాపించారు. దీన్ని 1921లో గాంధీజీ ప్రారంభం చేయగా దానిలో సర్దార్ భగత్‌సింగ్ లాంటి వారెందరో శిక్షణ పొందారు. ఖాదీ ఉద్యమంలో భాగంగా కిచ్లు దంపతులు జీవితాంతం ఖద్దరు ధరించారు. అంతేకాకుండా ఆమె పిల్లలను కూడా వాటిని ఇష్టపడేటట్లు చేశారు.
కిచ్లు దంపతులు మొదటి నుండీ ముస్లిం లీగ్ ఏర్పాటువాదాన్ని, దేశ విభజనను వ్యతిరేకించారు. విభజన జరగడంతో మతోన్మాదం జాతీయవాదానికి బానిసయ్యింది. మాతృభూమి రెండుగా చీలిపోవడం ఆమె సహించలేకపోయారు, విభజన వలన వచ్చిన ఉపద్రవాన్ని ఆ కుటుంబం చవిచూసింది, వారి ఆస్తిపాస్తులను దుండగులు దోచుకున్నారు. వారు కుటుంబంతో ఢల్లీి వెళ్లి ముస్లిం శరణార్థుల శిబిరంలో గడపాల్సి వచ్చింది. చివరకు 1963లో డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు, 1970 ఆగష్టు 18న సాదత్ బానో కిచ్లు అనారోగ్యంతో మరణించారు.
ూశీబతీషవం
Sources
1. Muslims in India Vol 2
-Naresh Kumar Jain, P – 27
2. Dr Abida Samiuddin, P-162
3.Saifuddin Kichlew – Hero of Jalian Wala Bagh.
-Toufique Kitchlew, P-42
4. భారత స్వాతంత్య్రోద్యమం – ముస్లిం మహిళలు
– సయ్యద్ నశీర్ అహమ్మద్ పే.- 167