– డా॥ శ్రీదేవి శ్రీకాంత్
వాకాటి పాండురంగారావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందిన రచన
‘‘హలో… హలో రాఘవ గారు ఉన్నారా?’’ అన్నాడు హరినాథ్. అవతల నుండి ‘‘చెప్పండి’’ అనే సమాధానం. ‘‘రాఘవ గారికి ఒకసారి ఫోన్ ఇస్తారా?’’ అన్నాడు.
‘‘పర్లేదు నాకు చెప్పండి. నా పేరు కళ. వారి శ్రీమతిని’’ అంది.
‘‘నా పేరు హరినాథ్. ఈరోజు వాట్సాప్ పెళ్లిళ్ల గ్రూప్‌లో మీ పాప సంబంధం గురించి చూశాం. ఒకసారి రఘురా…’’ అంటున్న హరినాథ్ మాటను మధ్యలోనే తుంచేసి ‘‘వివాహ ప్రకటన ఇచ్చింది నేనే. మీ బాబుది సాఫ్ట్‌వేర్ ఉద్యోగమా?’’ అంది. ‘‘అవునండి’’ అన్నాడు హరినాథ్.
‘‘బాబు పొడవుగా, తెల్లగా ఉండాలి అనేది మా పాప కోరిక. అవునూ.. హెచ్ వన్ బీ వీసా ఉందా?’’ అంది. ‘‘అమెరికాలో చదివాడు. అక్కడే జాబ్ వచ్చింది’’ అన్నాడు హరినాథ్.
‘‘ఏ రాష్ట్రంలో ఉన్నాడు?’’ అని అడిగింది. ‘‘వర్జీనియాలో’’ అని సమాధానం ఇచ్చాడు. ‘‘మా పాప అదే రాష్ట్రంలో చదువుతుంది. మీకు ఎంతమంది పిల్లలు? మీకు బాధ్యతలు ఉన్నాయా? మీ ఆస్తిపాస్తులు? మీ బాబు బయోడేటా పంపండి. మా పాపకి నచ్చాలి. పాపతో మాట్లాడతాను’’ అంది. ‘‘అలాగేనండి’’ అని హరినాథ్ ఫోన్ పెట్టేశాడు.
‘‘ఏవండీ.. ఇంతకీ పిల్ల తండ్రా? లేదా తల్లితోనేనా మీరు మాట్లాడిరది?’’ అంది ఇందిర కుతూహలంగా. ‘‘ఈ రోజుల్లో పిల్ల తండ్రి మాట్లాడితే ఆశ్చర్యపోవాల్సిందే! ఏ సంబంధం వాళ్లకి ఫోన్ చేసినా ఆడవాళ్లే మాట్లాడుతున్నారు. తండ్రుల పెత్తనం లేదు. అమ్మాయి తల్లులే ఫోన్ ఎత్తడం. ‘అమ్మాయితో మాట్లాడి చెప్తాం. అబ్బాయి అమ్మాయికి నచ్చాలి’ అంటున్నారు. ఏం చేస్తాం?’’ అన్నాడు నిట్టూరుస్తూ హరినాథ్.
‘‘ఇదివరకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ చేసుకున్నారు. దాని పర్యవసానమే ఇది. ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోయిందట కదా. ఆడపిల్లలకు గిరాకీ పెరిగింది. కన్యాశుల్కం రావచ్చేమో!’’ అంది ఇందిర నవ్వుతూ..
‘‘ఏది వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మన అమ్మాయి పెళ్లి ఒక్క సంబంధమే చూసి చేశాం. మగపిల్లవాడి పెళ్లే ఈ రోజుల్లో పెద్ద సమస్యగా తయారయింది’’ అన్నాడు, హరినాథ్ దీనంగా ముఖం పెట్టి.
‘‘ఈ రోజుల్లో అన్నీ కష్టాలే. ఏదీ ఎక్కువగా ఆశించకూడదు. ఎలాగూ పెళ్లయ్యాక మన దగ్గర ఉండేది లేదాయే. వాళ్లు ఎక్కడో అమెరికాలో ఉంటారు. జూమ్‌లోనూ, వీడియో కాల్‌లోనూ చూస్తాం. పూర్వం కథల్లో మాయా దర్పణాల్లా ఇవన్నీ మాయా దర్పణాలే’’ అంది ఇందిర.
* * *
‘‘హలో! బాబు మాధవ్, అమ్మాయి సమీరా వివరాలు పంపాను. వాకబు చేశావా?’’ అన్నాడు హరినాథ్. ‘‘ఆ అమ్మాయి నేను చదువుకునేప్పుడు నాకు జూనియర్. నా హాస్టల్‌లోనే ఉండేది. విచ్చలవిడిగా అబ్బాయిలతో తిరగడం, బాగా మందు కొట్టడం, సిగరెట్లు కాల్చడం లాంటి చాలా చెడు అలవాట్లు ఉన్నాయిలే.’’
‘‘నిజమా!’’ అన్నాడు హరినాథ్ నమ్మలేనట్లుగా.
‘‘మీరు చెప్పిన ఇక్కడున్న నాలుగు సంబంధాల అమ్మాయిలు ఇంచు మించు ఒకే బాపతు నాన్నగారు!’’
‘‘అదేమిటి మాధవ్? వింతగా చెబుతున్నావు.’’
‘‘నాన్నా! ఇందులో ఆశ్చర్యపోయే విషయం ఏమీ లేదు. మీరు ఒక్కసారి వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది’’
‘‘…….’’
‘‘మనదేశం నుండి వచ్చిన అందరూ అనను గానీ చాలా మంది అమ్మాయిల పరిస్థితి ఇదే. మన తెలుగు ఆడపిల్లలు మన సంస్కృతి కట్టుబాట్లు కాలరాసి.. ఈ వ్యసనాలకు బానిస అవడం నేను చూస్తూనే ఉన్నాను.’’
‘‘నిజమా, మాధవ్!’’ నమ్మలేనట్లుగా మళ్లీ అన్నాడు చాలా మధనపడుతూ..
‘‘ఏమండీ! ఒక్కసారి ఫోన్ ఇలా ఇవ్వండి. నేనూ పలకరిస్తాను.’’ అంది ఇందిర. హరినాథ్ సెల్ ఇచ్చాడు.
‘‘బాబూ! ఏమి తిన్నావురా?’’
‘‘పని ఎక్కువగా ఉంది. ఖాళీ లేదు. నూడుల్స్ చేసుకున్నాను అమ్మా!’’
‘‘నీకు మంచి భార్య దొరికి నీకు చేదోడు వాతోడుగా ఉండాలనే కోరిక. ఎన్ని సంబంధాలు చూస్తున్నారో మీ నాన్న గారు…ప్రతి సంబంధమూ తృప్తిగా అనిపించడం లేదు’’ అంది.
‘‘అమ్మా! అక్కడే మనదేశంలో చదువుకుని, కాస్త సంగీతం, మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవం ఉన్న అమ్మాయిని చూడండి.’’
‘‘అదే ప్రయత్నిస్తున్నాం. నేను మొక్కని దేవుడు లేడు.’’ అంది నిరుత్సాహ పడుతూ..
‘‘అమ్మా! మీటింగ్‌కు అటెండ్ కావాలి. ఉంటా’’ అవతల మాధవ్ సెల్ డిస్కనెక్ట్ చేశాడు.
* * *
‘‘హలో! శోభ గారు.. నమస్తే అండి! మానస ఏం చేస్తుంది?’’
‘‘దర్జీ దగ్గరకు వెళ్లింది. ఈ రోజుల్లో జాకెట్ కుట్టించడం అంటే చాలా సమయం తీసుకునే పని అయింది. కొన్ని నమూనాలు చూపిస్తానంటే వెళ్లింది.’’ అంది మానస తల్లి శోభ.
‘‘అలాగా?’’ అంది ఇందిర.
‘‘అసలు విషయం ఏమిటంటే మానస నిశ్చితార్థానికి, పెళ్లికి పెట్టాల్సిన నగలు, బట్టల తాలూకూ అన్నీ అదే ఎంచుకుంటుంది’’ అంది వియ్యపురాలు ఇందిరతో.
‘‘అలాగేనండి’’ అంది ఇందిర.
‘‘ఇంకో విషయం చెప్పడం మరిచాను. పాప బట్టలు, మాధవ్ బట్టలు సరిపోలేవిగా ఉంటే బాగుండదు. అందుకే మాధవ్‌ని మా ఊరు పంపించండి. మానస మాధవ్‌తో మాట్లాడతానంది లెండి.’’
‘‘అలాగేనండి…’’ అన్నింటికీ ఇందిర సమాధానం అదే.
* * *
మాధవ్ షాపింగ్ చేయడానికి హైదరాబాద్ వెళ్లాడు. షాపింగ్ చేస్తూన్న మాధవ్ మానసను ఉద్దేశించి…‘‘మానస నీ అభిరుచులు ఏమిటి?’’ అన్నాడు.
‘‘నాకు షాపింగ్ ఇష్టం’’ అంది చాలా సాధారణంగా..
అదిరిపడ్డాడు మాధవ్.
‘‘మాధవ్! నీకు?’’ అంది మానస.
‘‘షాపింగ్ మాత్రం కాదు’’ అని నవ్వేశాడు.
‘‘మన పెళ్లి చాలా ఘనంగా జరగాలి, మాధవ్’’ అంది.
‘‘ఎందుకు? అంత ఖర్చు.’’ అన్నాడు.
‘‘నాకు వేడుకలు అంటే చాలా ఇష్టం. పెళ్లిళ్లలో ఉండే కళే వేరు’’ అంది.
‘‘మనం పెళ్లి చేసుకునే ప్రదేశం చాలా అందంగా ఉండాలి. ఈ రోజుల్లో చాలా మంది దూర ప్రాంతాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మనం మన మొదటి ప్రేమ యాత్రకు సింగపూర్ వెళదాం’’ అంది. మాధవ్ ఇష్టం లేకున్నా ఊఁ అని ఊరుకున్నాడు.
మానస, మాధవ్‌ల నిశ్చితార్థం హైదరాబాద్‌లో చాలా ఘనంగా జరిగింది. నిశ్చితార్థం తరువాత పెళ్లి రోజు వరకు మానస, మాధవ్ వీడియో కాల్స్‌లో రాత్రంతా గంటలు గంటలు మాట్లాడుకోవడం, ఉదయం పదింటికి నిద్ర లేవడం.. ఇదే వరస.
* * *
పెళ్లి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. పెళ్లికి ముందు పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరినీ రకరకాల దుస్తులు ధరింపచేసి.. చిన్న చలనచిత్రంలా తీశారు. చక్కని పాటలతో అందమైన స్థలంలో తీసిన ఆ చిత్రం ఎందరినో ఆకర్షించింది.
అదే పెళ్లి శుభలేఖకు చేర్చి వివిధ మాధ్యమాల ద్వారా బంధువులకు, స్నేహితులకు పంపారు.
పెళ్లి జైపూర్ నగరంలోని గలమన్ సాగర్ సరస్సులో ఉన్న జైమహల్ భవంతిలో నిశ్చయించారు. రంగురంగుల లైట్లతో, పూలతో అలంకరింపబడి ఆ ప్రాంతం కనులపండువగా ఉంది. పెళ్లి అంగరంగ వైభోగంగా జరిగింది.
డబ్బు ఉంటే స్వర్గమే కాళ్లకు పాదా క్రాంతమైనట్లు ప్రేమ యాత్రకు సింగపూర్‌లోని ఇండిగో హోటల్‌లో ఉన్నారు. ఆ తరువాత ఇద్దరూ అమెరికా వెళ్లిపోయారు.
* * *
‘‘మానసా! ఏమన్నా విశేషమా?’’
ఫోన్ చేసినప్పుడు మాటల మధ్యలో అడిగింది కోడల్ని ఇందిర.
‘‘ఇంకా ప్లాన్ చేయలేదు ఆంటీ!’’ అంది తాపీగా మానస.
అలా మరో సంవత్సరం.. అదే సమాధానం. పెళ్లయి ఐదు సంవత్సరాలు అయింది.
‘‘మన రోజుల్లో పిల్లల్ని కనడానికి ఒక ప్రణాళిక ఏర్పరచుకుని కనేవాళ్లం కాదు. ఇప్పటి పిల్లలు అదేమిటో, అన్నీ విడ్డూరాలే! వాడికి పిల్ల దొరకడానికి ఐదు సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు పిల్లల్ని కనడానికి మరో తపస్సు..’’ అంది భర్తతో ఇందిర.
‘‘ఏం చేస్తాం? కాలంతో పాటు వచ్చే మార్పులతో మనం సర్దుకుపోవాలి. ఇప్పుడు పిల్లలు మనల్ని ఏమీ తెలియనివారీగా చిత్రీకరిస్తూ.. ప్రతిదానికి వింత ప్రణాళికలు వేసుకుంటూ, వెర్రి పోకడలు పోతున్నారు’’ అన్నాడు హరినాథ్.
‘‘ఈ రోజుల్లో డబ్బుకే కాదు, బంధాలకు కూడా విలువ లేకుండా పోయింది. ఒకర్నో ఇద్దర్నో కనడమేగా! దానికి సమయం నిర్ణయించుకుని కడుపు తెచ్చుకోవడం…కాయకష్టం చేయకుండా…నొప్పులు తెలియకుండా… శస్త్ర చికిత్స ద్వారా ముహూర్తం నిర్ణయించుకుని పిల్లలను కనడం…పురిటి నొప్పులు తెలియని బంధాలు’’ అంది ఇందిర నిట్టూరుస్తూ..
‘‘అత్తయ్యా! ఆరు సంవత్సరాలుగా…పిల్లలు పుట్టకుండా మేం జాగ్రత్తలు వహించి… వాడిన మందులకు గాను ఏదో లోపం వచ్చింది. అందుకే ఇద్దరం చికిత్స కోసం వెళుతున్నాం’’ అంది మానస ఓ రోజు ఫోన్లో.
ఒక మగ, ఒక ఆడ బిడ్డలు కావాలని ఇద్దరూ నిర్ణయించుకుని…చికిత్స ద్వారా గర్భం దాల్చింది మానస.
* * *
ఇంటికి రాగానే మానస తల్లికి ఫోన్ చేసి ‘‘రెండు కాన్పుల్లో పిల్లల్ని మోయడం, ఖర్చు ఎందుకని మగపిల్లాడు, ఆడపిల్ల ఇద్దరూ కావాలన్నాం, అమ్మా. నువ్వు, నాన్న అమెరికా రండి అంది. కరోనా రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్నారుగా.. అయినా ప్రయాణం జాగ్రత్త. మూడవ నెల వచ్చినప్పటి నుండి కాస్త జాగ్రత్తగా ఉండమన్నారు’’ అంది.
మాధవ్ మానసకు వేళకు మంచి ఆహారం ఇస్తూ..
సాయంత్రాలు నడవడానికి తీసుకెళుతూ చక్కగా చూసుకోసాగాడు. మానసకు మూడవ నెల వచ్చింది. మానస తల్లిదండ్రులు అమెరికా వెళ్లారు.
* * *
మానస డెలివరీ తేదీ రావడంతో ఆసుపత్రికి వచ్చింది. ముందుగానే ఎంచుకున్నట్టు బాబూ, పాప పుట్టారు.
‘‘అత్తయ్యా! కరోనా సమయంలో మీరు ప్రయాణం చెయ్యలేరు. తొలి కాన్పు.. పైగా ఇద్దరు పిల్లల్ని కనడానికి ప్రణాళిక వేసుకున్నట్లు అంతా చక్కగా జరిగింది. ఉయ్యాల వేడుక ఘనంగా చెయ్యాలి అంటున్నది అమ్మ. మీరూ, మామయ్య జూమ్‌లో చూద్దురు గానీ. లింక్ పంపిస్తాను’’ అంది మానస ఫోన్ చేసి.
‘‘అలాగేనమ్మా’’ అంది ఇందిర.
మొదటినుంచీ ఈ కాలం మగపిల్లాడి తల్లిగా ఆవిడకు వచ్చిన పదం అదే.
‘‘అమ్మా! కొరియర్‌లో నువ్వు పాపకు పట్టు పావడా, బాబుకు పంచే పంపించు. ఉయ్యాలలో వేసినప్పుడు వెయ్యడానికి..’’ అన్నాడు మాధవ్.
‘‘అలాగే’’ అంది.
వీడియో కాల్ చేసి చూపించారు, నానమ్మ, తాతయ్యకు.
‘‘అమ్మా! చెప్పడం మరిచాను. పాపను మూడు నాలుగు సంవత్సరాలు నీ దగ్గరే పెంచాలి. బాబును మా అత్తగారు పెంచుతానన్నారు’’ అన్నాడు.
‘‘పిల్లలు ఇద్దరూ ముచ్చటగా, ఆరోగ్యంగా ఉన్నారు. మీరు రేపు డిశ్చార్జ్ అవుతున్నారు, మానస’’ అంది డాక్టర్.
డాక్టర్ వైపు కృతజ్ఞతా భావంతో చూస్తూ… ‘‘డాక్టర్ గారు!.. మేం పిల్లలు పుట్టరేమోనని చాలా నిరుత్సాహ పడ్డాం. చివరికి ఈ విధానం ద్వారా బిడ్డలను కనగలగడం అదృష్టంగా భావిస్తున్నాం’’ అంది మానస.
‘‘చూడండి మానసా! ఈ రోజుల్లో పిల్లలు ప్రతిదీ తరచి చూసి..పెద్దవాళ్ల మాటలు వినకుండా తమ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. పూర్వం త్వరగా పెళ్లి చేసుకునే వారు. పిల్లల్ని కనే వారు. వాళ్లకి ఓపికలు ఉండగానే పిల్లల భాధ్యతలు తీరిపోయేవి. వారికి పిల్లల్ని ఎప్పుడు కనాలి అనే ప్రణాళికలు లేవు.
ఈ రోజుల్లో పూర్తిగా ఉద్యోగంలో నిలదొక్కు కున్నాక ఆలస్యంగా వివాహాలు చేసుకుంటున్నారు. స్త్రీకి ఇరవై ఐదు సంవత్సరాల తరువాత శరీరంలో మార్పులు రావడం మొదలవుతాయి. సంతాన నిరోధక మందుల వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. కనుక పిల్లల్ని కనడం అనేది సహజంగా జరిగితే మంచిది. ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా పిల్లల్ని కనే పరిస్థితి ఏర్పడిరది. ఇది మీ స్వయం కృతం. ఇది రిస్క్‌తోనూ, ఖర్చుతోనూ కూడుకున్న పని.’’ అంది డాక్టర్.
‘‘అవును డాక్టర్! నేనే కాదు ఈ రోజుల్లో మేం ఇంకా పిల్లల్ని కనడానికి ప్రణాళిక వేసుకోలేదు అనే నా లాంటి వారికి ఎందరికో మీ సలహా కనువిప్పు’’ అంది మానస రెండు చేతులు జోడిరచి.