– క్రాంతి

డిసెంబర్‌ 13, 2021. ‌చరిత్రలో నిలిచిపోయే అద్భుతఘట్టం ఆవిష్కృతమైన రోజు అది.. ప్రపంచంలోని హిందువులంతా ఎంతో ఆసక్తి, ఉత్సుకతతో ఈ మహత్తర వేడుకను టీవీలో, ప్రత్యక్షంగా వీక్షించారు. కాశీ అంతటా ఆధ్మాత్మిక వాతావరణం నెలకొంది. ప్రభుత్వ భవనాలు, చౌరస్తాలు రంగురంగుల విద్యుత్‌ ‌కాంతులతో వెలిగిపోయాయి. నగరంలోని ప్రజలు కూడా తమ ఇళ్లు, షాపులను అందంగా అలంకరించారు. పరమపవిత్ర కాశీవిశ్వనాథుని ఆలయం వరకూ దారిపొడవునా కాషాయరంగు వేసి పూలమాలలు, భగవాధ్వజాలతో అలంకరించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ విద్యుత్‌ ‌వెలుగులను గమనిస్తే కాశీవాసులు దీపావళిని మరోసారి జరుపుకుంటున్నారా! అన్నంత సందడి కనిపించింది.


సాక్షాత్తు పరమశివుడు నిర్మించి, కొలువైన నగరం. భారతదేశంలో అతి ప్రాచీన, సుప్రసిద్ధమైన నగరం. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వరలింగం ఉన్న కాశీలో డిసెంబర్‌ 13‌న శ్రీ కాశీవిశ్వనాథ్‌ ‌ధామ్‌ ‌ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించి జాతికి అంకితం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. కాశీ విశ్వనాథుడి మందిరం, కాల భైరవేశ్వరుడి ఆలయాన్ని ఆధునీకరించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది.

శివుడి ఆజ్ఞలేనిదే ఏమీ జరగదు!

‘ఎన్నో ఏళ్లుగా వేచిచూసిన సమయం ఆసన్నమైంది. కాశీ చరిత్రలో ఇవాళ నూతన అధ్యాయం రచించాం.’ అన్నారు ప్రధాని మోదీ. కాశీవిశ్వనాథ్‌ ‌ధామ్‌ ‌ప్రాజెక్టు తొలిదశ ప్రారంభం తర్వాత ఇచ్చిన ప్రసంగంలో ఈ క్షేత్ర ప్రాధాన్యాన్ని, చరిత్రను గుర్తుచేశారు. భారత ప్రాచీనతకూ, సంప్రదాయానికీ ఈ కొత్త నడవా ప్రతీక. ఈనాటి కార్యక్రమంతో గంగానది ప్రసన్నమైందన్నారు మోదీ. సాక్షాత్తు పరమశివుని రక్షణలో ఉన్న ఈ నగరం నాశనం లేనిదని పేర్కొన్నారు. కాశీలో శివుడి ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు. ఈ ప్రాజెక్టును ప్రారంభించడం నాకు గర్వంగా ఉంది. దీన్ని సాకారం చేసేందుకు రాత్రింబవళ్లు కష్టపడిన సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ‌బృందాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. కాశీ విశ్వనాథ్‌ ‌కారిడార్‌ ‌ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అందరికీ ధన్యవాదాలు అని చెప్పారు ప్రధాని. కాశీ ప్రేమ పరంపరకు చిరునామా. కాశీలో మృత్యువు కూడా మంగళమే. కాశీలో ప్రతి జీవిలోనూ ఆ విశ్వేశ్వరుడే కనబడతాడు. కరోనా సమయంలోనూ నిర్మాణ పనులు వేగంగా జరిగాయన్నారు.

రాణి అహల్యాబాయి కాశీ విశ్వేశ్వరుడి ఆలయాన్ని పునర్నిర్మించారని, సిక్కు రాజు రంజిత్‌ ‌సింగ్‌ ఈ ‌గుడి గోపురాలకు బంగారుపూత వేయించా రని ప్రధానమంత్రి గుర్తుచేశారు. విశ్వనాథ ధామం ఒక భారీ భవంతి మాత్రమే కాదని, సనాతన సంస్కృతికి, ఆధ్యాత్మికతకు, సంప్రదాయాలకు చిహ్నం అని వెల్లడించారు. అయోధ్యలో రామ మందిరం, కాశీలో విశ్వనాథ ధామంతో పాటు బౌద్ధ, సిక్కు పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. సముద్రంలో వేలాది కిలోమీటర్ల ఆప్టికల్‌ ‌ఫైబర్‌, ‌పేదల కోసం లక్షలాది ఇళ్లను కూడా భారత్‌ ‌నిర్మించు కుంటోందని, పరిశోధకులను అంతరిక్షంలోకి పంపిస్తోందని తెలిపారు. విశ్వనాథ ధామం పాత, కొత్తల మేలు కలయిక అన్నారు. మన శక్తిసామర్థ్యాలకు ఈ ధామం సాక్షిభూతమని, గట్టి పట్టుదల ఉంటే ఏదీ అసాధ్యం కాదని వివరించారు. కాశీవిశ్వనాథ ఆలయాన్ని భారీగా విస్తరించామని మోదీ తెలిపారు. గతంలో ఈ ఆలయం 3,000 చదరపు అడుగు ల్లోనే ఉండేదని, ఇప్పుడు 5 లక్షల చదరపు అడుగులకు విస్తరించిందని చెప్పారు. నిత్యం 50 వేల నుంచి 75 వేల మంది భక్తులు సులభంగా దర్శించుకోవచ్చని అన్నారు. కాశీ విశ్వనాథుడి దర్శనానికి దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. కొందరు వారణాసి అంశాన్ని కూడా రాజకీయం చేశారని ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు మోదీ.

దురాక్రమణదారులు వచ్చారు, పోయారు..

ఎందరో ముస్లీం పాలకులు వచ్చారు, పోయారు. దురాక్రమణదారులు ఈ నగరంపై దాడి చేశారు. నాశనం చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఈ నేల మిగతా ప్రపంచానికి విభిన్నమైనది. ఔరంగజేబు దురాగతాలకు చరిత్రే సాక్షిగా నిలుస్తుంది. కత్తితో నాగరికతను మార్చేందుకు, మతోన్మాదంతో సంస్కృతిని అణిచివేసేందుకు ప్రయత్నించారు. సాలార్‌ ‌మసూద్‌, ‌వారెన్‌ ‌హేస్టింగ్స్ ‌లాంటి వాళ్లు కాశీని ధ్వంసం చేయడానికి ఎన్నో కుతంత్రాలు సాగించారని, అన్నింటినీ తట్టుకొని నగరం సగర్వంగా నిలిచిందని అన్నారు ప్రధాని.

శతాబ్దాల బానిసత్వం భారత్‌ను ఆత్మన్యూనతకు గురిచేసిందని, ఆ ప్రభావం నుంచి దేశం క్రమంగా బయటపడుతోందని మోదీ అన్నారు. కాశీ విశ్వనాథ్‌ ‌కారిడార్‌ ‌భారత్‌కు నిర్ణయాత్మక దిశను చూపుతుందని, భవ్యమైన భవిష్యత్తు వైపు నడిపిస్తుందని అభిప్రాయ పడ్డారు. కొత్త చరిత్ర పురుడు పోసుకుంటోందన్నారు. ఈ నవ చరిత్రకు సాక్షులం కావడం మనం అదృష్ట మని చెప్పారు. తన ప్రసంగం మధ్యలో పలుమార్లు ‘హర హర మహదేవ్‌’ ‌మంత్రాన్ని పఠించారు. స్థానిక యాసలోనూ మాట్లాడుతూ ఆకట్టుకున్నారు.

ఆత్మనిర్భర్‌పై దృష్టిపెట్టండి!

భారతదేశ శక్తి, భక్తి కంటే విధ్వంసకుల బలం ఎప్పటికీ ఎక్కువ కాబోదని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. మనల్ని మనం ఎలా చూసుకుంటామో ప్రపంచమంతా మనల్ని అలాగే చూస్తుందని చెప్పారు. ఆత్మనిర్భర్‌ (‌స్వయం సమృద్ధి) కోసం ప్రయత్నాలు కొనసాగించాలని దేశ ప్రజలకు పిలుపు నిచ్చారు. స్వచ్ఛత, సృజన మన మార్గం కావాలన్నారు. నమామి గంగా మిషన్‌ను విజయవంతం చేయాలని కోరారు. భారత్‌ ఎన్నో శతాబ్దాల పాటు బానిసత్వం కింద మగ్గి పోయిందని, ఇది మన ఆత్మవిశ్వా సాన్ని దెబ్బతీసిందని, ఫలితంగా మన సృజనపై మనం నమ్మకాన్ని కోల్పోయామని చెప్పారు. పూర్తి ఆత్మ విశ్వాసంతో సృజనాత్మకతకు పదునుపెట్టాలని ప్రజలకు సూచించారు. త్వరలో 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకోబోతున్నామని, మరో 25 ఏళ్ల (100వ స్వాతంత్య్ర దినోత్సవం) నాటికి భారత్‌ ఎలా ఉండాలని కోరుకుంటున్నామో అందుకోసం ఇప్పటినుంచే కృషి చేయాలన్నారు ప్రధాని మోదీ. కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌, ‌భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు భారీ సంఖ్యలో సాధువులు, ప్రముఖులు పాల్గొన్నారు.

కూలీలపై పూలవర్షం, సహపంక్తి భోజనం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాశీవిశ్వనాథ్‌ ‌కారిడార్‌ ‌నిర్మాణంలో భాగస్వామ్యులైన కార్మికులతో కలగలసిపోయారు. ఆ సమయంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మోదీ కూర్చునేందుకు నిర్వాహకులు వేదిక వద్ద ఓ కుర్చీని ఏర్పాటు చేశారు. అయితే ప్రధాని మాత్రం రాగానే ఆ కుర్చీని భద్రతా సిబ్బందికి ఇచ్చేశారు. కార్మికుల మధ్యకు వెళ్లి రెడ్‌ ‌కార్పెట్‌ ‌వేసిన మెట్లపై కూర్చున్నారు. అంతేకాదు తనకు దగ్గరగా వచ్చి కూర్చోవాలంటూ వారిని ఆహ్వానించారు. కారిడార్‌ ‌నిర్మాణంలో పాల్గొన్న కార్మికులందరిపై పూలు చల్లి సన్మానించారు. ఈ సందర్భంగా కొంతమంది కార్మికులతో మోదీ ఆప్యాయంగా ముచ్చటించారు. ప్రతి ఒక్కరికీ కృతజ్జతలు తెలియజేశారు. చేతులు జోడించి అభివాదం చేశారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

16 లక్షల లడ్డూలు

వారణాసిలో ఈ వేడుకలు ఒక నెలపాటు నిర్వహించనున్నారు. దీనికి ‘భవ్య కాశీ, దివ్య కాశీ’ అని పేరుపెట్టారు. ఈ కార్యక్రమంలో వారణాసిలో నివసించే ప్రతివ్యక్తికీ అందేలా 16 లక్షల లడ్డూలు తయారుచేశారు. ఈ లడ్డూలను కార్యకర్తలు నేరుగా ప్రజల ఇళ్లకే చేర్చారు. ప్రసాదంతోపాటూ ప్రజలకు ఒక స్మారకం కూడా అందజేస్తున్నారు.

కాశీవిశ్వనాథ్‌ ‌ధామ్‌ ‌ప్రాజెక్టు విశేషాలు

హిందువుల పుణ్యక్షేత్రాల్లో మొదట వినిపించే పేరు కాశీ. ఈ ఆధ్యాత్మిక నగరంలో ఎప్పుడూ భక్తుల రద్దీ ఉంటుంది. దేశ నలుమూలల నుంచి ఈ పవిత్ర నగరానికి యాత్రికులు, భక్తులు వస్తుంటారు. గంగలో స్నానం చేసి, గంగాజలాన్ని తీసుకువచ్చి, కాశీ విశ్వనాథుని దేవాలయంలో సమర్పించే ఆచారం ఉంది. అయితే విశ్వనాథుని ఆలయానికి వెళ్లాలంటే కాస్త ఇబ్బందికరంగా ఉండేది. ఎన్నో ఇరుకు సందుల్లోంచి, వేలాది దుకాణాల మధ్యలోంచి ప్రయాణిస్తూ విశ్వేశ్వరాలయాన్ని దర్శించుకోడానికి వెళ్లేవారు భక్తులు. 2 వేల చదరపు మీటర్లలో వ్యాపించిన ఆలయానికి ప్రజలు ఇరుకైన వీధుల్లో నుంచి వచ్చేవారు. ఆలయంలో చాలా తక్కువ చోటుండేది. ఇక్కడికి వృద్ధులు చేరుకోవడం గతంలో కష్టమయ్యేది. పూర్వం ఇక్కడ అనేక సుందరవనాలు, పూలచెట్లు ఉండేవి. మతోన్మాదుల దండయాత్రల్లో ధ్వంసమైన ఆలయాన్ని పునర్‌ ‌నిర్మించిన తర్వాత ప్రజలు ఆలయం చుట్టూ భవనాలు, ఇళ్లు దుకాణాలు నిర్మించుకొని శత్రు సైనికులకు దారి తెలియకుండా చేశారని చెబుతున్నారు.

అయితే ఇప్పుడు ఆ ప్రయాస అవసరం లేదు. భక్తులు, యాత్రికులకు కష్టాలను తప్పించి సరైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా కాశీ విశ్వనాథ్‌ ‌ధామ్‌ ‌ప్రాజెక్టు (కారిడార్‌-‌నడవా)కు శ్రీకారం చుట్టారు ప్రధానమంత్రి మోదీ. కాశీ సుందరీకరణ పనులు, గంగానదిని అనుసంధానిస్తూ ఈ కారిడార్‌ను నిర్మించారు. యాత్రికుల సందర్శనా అనుభవాన్ని పూర్తిగా మార్చేందుకు దీనిని అభివృద్ధి చేశారు. గంగానది ఒడ్డు వరకు కాశీవిశ్వనాథుని ఆలయ ప్రాంగణాన్ని విస్తరించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

తొలిదశ పనులు

–      ఔరంగజేబు పడగొట్టిన కాశీ క్షేత్రంలోని ప్రధాన ఆలయాన్ని 1669లో రాణి అహల్యాబాయి హోల్కర్‌ ‌పునరుద్ధరించారు. ఆ తర్వాత, దాదాపు 350 ఏళ్లకు ప్రధాని మోదీ ఆలయ విస్తరణ, పునరుద్ధరణ పనులు చేపట్టారు.

–     ఈ ప్రాజెక్టుకు 2019 మార్చి 8న ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.800 కోట్లు ఖర్చవుతాయని అంచనా.

–     ప్రాజెక్టు తొలి దశ 5 లక్షల చదరపు అడుగుల్లో విస్తరించింది. తాజాగా పూర్తైన నిర్మాణాల వ్యయం రూ.339 కోట్లు.

–   మొత్తం 40 పురాతన దేవాలయాలను పునర్‌ ‌నిర్మించారు. గతంలో ఎలా ఉన్నాయో అలానే వీటిని తీర్చిదిద్దారు. వీటిల్లో గంగేశ్వర్‌ ‌మహదేవ్‌ ఆలయం, మనోకామేశ్వర్‌ ‌మహదేవ్‌ ఆలయం, జౌవినాయక్‌ ఆలయం, శ్రీ కుంభ మహదేవ్‌ ఆలయం వంటివి ఉన్నాయి.

–    యాత్రికుల సౌకర్యార్థం 24 కొత్త భవనాలు నిర్మించారు. వీటిలో ప్రధాన ఆలయ ప్రాంగణం, వేద కేంద్రం, యాత్రికుల విశ్రాంతి భవనం, ముముక్షు భవన్‌, ‌భోగశాల, సిటీ మ్యూజియం, ఆహారశాలలు ఉన్నాయి. షాపింగ్‌ ‌కాంప్లెక్స్, ‌బహుళ ప్రయోజన మందిరం, సిటీ మ్యూజియం, వారణాసి గ్యాలరీ, గంగా వ్యూ కెఫే రెస్టారెంట్‌ ఉన్నాయి. శివలింగ ఆకారంలో నిర్మించిన రుద్రాక్ష కన్వెన్షన్‌ ‌సెంటర్‌ ‌ప్రత్యేక ఆకర్షణ.

–    కాశీవిశ్వనాథ్‌ ‌కారిడార్‌ను మొత్తం 3 భాగాలుగా విభజించారు. మొదటిది ఆలయ ప్రధానభాగం. దీన్ని రెడ్‌ ‌శాండ్‌ ‌స్టోన్‌తో నిర్మించారు. ఇందులో నాలుగు పెద్దపెద్ద ద్వారాలు ఉన్నాయి. ఒక ప్రదక్షిణ మార్గం కూడా నిర్మించారు. ఆ ప్రదక్షిణ మార్గంలో 22 మార్బుల్స్ ‌మీద కాశీ మహిమను వర్ణించే వివరాలు చెక్కారు.

–    ఈ ధామం మరింత ఆకర్షణీయంగా కనిపించేలా ప్రాంగణం చుట్టూ 5 వేలకుపైగా బల్బులు ఏర్పాటు చేశారు. ఇవి మధ్యాహ్నం, రాత్రి రంగులు మారుతూ ఉంటాయి.

–    మొత్తం కారిడార్‌ను దాదాపు 50వేల చదరపు మీటర్ల ఒక పెద్ద ప్రాంగణంగా నిర్మించారు. దీని ప్రధాన ప్రవేశ మార్గం గంగానది వైపు లలితా ఘాట్‌ ‌నుంచి ఉంటుంది. ఇంతకు ముందు అన్ని ప్రాంగణాలు కేవలం 3000 చదరపు అడుగుల్లోనే విస్తరించి ఉండేవి.

–    కారిడార్‌ ‌నిర్మాణం కోసం ప్రభుత్వం విశ్వనాథ ఆలయం చుట్టూ ఉన్న 300 ఆస్తులను కొనుగోలు చేసింది. 1400 దుకాణాలు, ఇళ్లవారికి పునరావాసం ఏర్పాటు చేశారు. దీంతో పనులకు ఆటంకం ఎదురుకాలేదు.

–     స్వాధీనాలు లేదా పునరావాసానికి సంబంధించి దేశంలోని ఏ కోర్టులోనూ ఎలాంటి వ్యాజ్యాలు పెండింగ్‌లో లేవు. ఇదే ఈ ప్రాజెక్టు విజయానికి నిదర్శనం.

–     విస్తరణ, పునర్‌ ‌నిర్మాణం సందర్భంగా అన్ని వారసత్వ కట్టడాలను సంరక్షించాలని మోదీ సంకల్పించారు.

–     ఈ కారిడార్‌ ‌నిర్మాణం కోసం సేకరించిన 400 ఆస్తుల్లో 27 కాశీ ఖండోక్త్ ఆలయాలు, 127 ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి. వీటిని కూడా సంరక్షించనున్నారు. కాశీ ఖండోక్త్ ఆలయాన్ని గతంలో ఉన్నట్లు పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్నారు. దీనిని కారిడార్‌లోని రెండో దశలో పూర్తి చేయనున్నారు.

కోట్లాది రూపాయల భారీ ఖర్చుతో నిర్మించిన ప్రతిష్టాత్మకమైన ఈ కారిడార్‌ ‌ప్రపంచంలోని హిందువులందరికీ కన్నులపండువగా మారుతుంద నడంలో సందేహం లేదు. ప్రధాని మోదీ వారణాసితో పాటు దేశ ప్రజలందరికీ ప్రమాణం చేసినట్లుగానే దీనిని నిర్మించి, నిరూపించుకున్నారు.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE