‘సంఘటిత భారత్‌, ‌సమర్థ భారత్‌. ‌సంఘటిత భారత్‌, ‌స్వాభిమాన భారత్‌. ‌సంఘటిత భారత్‌ను రూపొందించడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి. ఇదే ఈ హిందూ శక్తి సంగమ సందేశం’ అన్నారు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌కార్యవాహ దత్తాత్రేయ హొసబలే. ప్రపంచానికి భారత్‌ ఆశాకిరణమైతే.. భారత్‌కు హిందూ సమాజమే ఆధారం. హిందూ సమాజ సంఘటన కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ 90 ఏళ్లకు పైగా కృషి చేస్తున్నదని ఆయన చెప్పారు. నల్గొండలోని ఎన్‌.‌జి. కళాశాల మైదాన ప్రాంగణంలో ‘హిందూ శక్తి సంగమం’ పేరుతో డిసెంబర్‌ 12‌న జరిగిన సార్వజనికోత్సవ కార్యక్రమంలో హొసబలే పాల్గొని మాట్లాడారు.

భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి ఏడుదశాబ్దాలు దాటింది. కానీ మనదైన సంస్కృతి, సంప్రదాయాలు, జీవనవిధానం పాటించడంలో; ప్రగతిని సాధించడానికి వచ్చిన అవకాశాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడంలో మాత్రం మనం వెనకబడిపోయాం. ఇదే సమయంలో జపాన్‌, ఇ‌జ్రాయెల్‌ ‌వంటి దేశాలు ఎంతో అభివృద్ధిని, స్వావలంబనను సాధించగలిగాయని ఆయన గుర్తుచేశారు. అయితే నేడు ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌స్ఫూర్తితో భారత్‌ ‌కూడా స్వాభిమానపూరిత ఆలోచనతో అడుగులు వేయడం ప్రారంభించిందని సంతోషం వ్యక్తంచేశారు.

స్వాతంత్య్ర సమరకాలంలో వ్యక్తమైన దేశభక్తి, స్వాభిమాన భావాలు ఆ తరువాత మాయమయ్యాయన్నారు. దీనికి కారణం-విదేశీ పాలన పోయినా విదేశీ బానిసబుద్ధి ఇంకా కొంత మందిలో మిగిలే ఉండటం, విదేశీ విద్యావిధానం ద్వారా తరతరాలుగా మనల్ని మనమే కించపరచు కోవడమే అన్నారు. అందుకే ప్రగతిని సాధించలేక పోయామని పేర్కొన్నారు. అధికార వ్యామోహంతో సమాజంలో వేర్పాటువాదాన్ని, విభజనను ప్రేరేపించే శక్తులు పెరుగుతున్నాయని, ఇది దేశప్రగతికి మంచిది కాదని విచారం వ్యక్తంచేశారు.

స్వాభిమానంతో కూడిన ఆలోచన, కార్యాచరణ వల్ల ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో అతితక్కువ కాలంలోనే మనకు అనుభవపూర్వకంగా తెలిసిందని దత్తాజీ పేర్కొన్నారు. యోగా దినోత్సవం జరుపుకోవాలని భారత్‌ ‌పిలుపునివ్వగానే ప్రపంచంలోని దాదాపు అన్నీ దేశాలు ముందుకు వచ్చాయని, కొవిడ్‌ ‌కష్టకాలంలో ఉచితంగా వాక్సిన్లు అందించడం ద్వారా అనేక దేశాలను భారత్‌ ఆదుకుందని గుర్తుచేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం సాంస్కృతిక జాగృతికి ప్రతీక అని హొసబలే అన్నారు.

భారత్‌ ‌తన శక్తిసామర్థ్యాలను గుర్తించి అందుకు తగినట్లుగా ముందుకు సాగితే అద్భుతాలు సాధిస్తుందని, విశ్వగురువు అవుతుందని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మొదటినుండి చెప్తూనే ఉందన్నారు. నేడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కంపెనీలు, సంస్థల్లో భారతీయులదే అగ్రస్థానమని ఆయన కొనియాడారు. ప్రాచీన సంస్కృతీ సభ్యతలే భారత్‌ ‌గుర్తింపు. ఈ సాంస్కృతిక విలువలను జీవితంలో ఎంతవరకు ఆచరిస్తున్నా మన్నది ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. కులం, ప్రాంతం, భాష, మొదలైన విభేదాలను పక్కనపెట్టి మనమంతా హిందువులమనే విషయాన్ని గుర్తించాలి. కానీ విచిత్రమేమిటంటే విభజనవాదాన్ని రెచ్చగొట్టే విధానం సెక్యులర్‌గా గుర్తింపు పొందుతుంటే.. సమైక్య, సంఘటితవాదాన్ని గుర్తుచేయడం మతతత్వం, కమ్యూనల్‌ అవుతోందని దత్తాజీ విచారం వ్యక్తంచేశారు. ఇక్కడ జన్మించి,ఈ దేశ సంస్కృతిని గౌరవించి, సొంతం చేసుకుని, ఆచరించేవారంతా హిందువులేనని ఆయన అన్నారు.

ప్రాచీన సంస్కృతి, అపారమైన శక్తిసామర్ధ్యాలు కలిగిన హిందూ సమాజం ఆ సంగతి మరచి పోవడం వల్లనే వెనుకబడుతోందని, ప్రలోభాలకు గురిచేసి అన్యమతస్తులు మతమార్పిడులు చేస్తున్నా, అక్రమ చొరబాటుదారులు ఇక్కడ తిష్ట వేసుకుని అరాచకం సృష్టిస్తున్నా హిందూ సమాజం చూసీచూడనట్లు ఉండటం సబబు కాదని అన్నారు. దేశ సైన్యాధిపతి చీఫ్‌ ఆఫ్‌ ‌డిఫెన్స్ ‌స్టాఫ్‌ ‌బిపిన్‌ ‌రావత్‌ ‌ప్రమాదవశాత్తు మరణిస్తే సంతోషం వ్యక్తం చేసేవాళ్లు చదువుకున్నవారు, మేధావులుగా చెలామణి అవుతున్నవారేనని, ఈ చర్యలను ప్రతిఒక్కరూ ఖండించాలన్నారు. ఇటువంటి ధోరణులను అరికట్టడం కోసం హిందువులలో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కృషి చేస్తున్నదని దత్తాత్రేయ హొసబలే అన్నారు. తన శక్తిని మరిచిపోయిన హనుమంతునికి జాంబవంతుడు గుర్తు చేసినట్లు.. హిందూ సమాజంలో చైతన్యాన్ని నింపే పనిని ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చేస్తున్నదని అన్నారు.

దేశవ్యాప్తంగా 50వేలకు పైగా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌శాఖలు నడుస్తున్నాయని, హిందూజన శక్తి జాగరణకే శాఖా కార్యక్రమమని ఆయన అన్నారు. భేదభావాలు లేని హిందూసమాజాన్ని నిర్మాణం చేయడమే ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సిద్ధాంతం, లక్ష్యం, తపస్సు అని అన్నారు. దేశం మొత్తంలో లక్షన్నరకు పైగా సేవా కార్యక్రమాలను స్వయంసేవకులు నిర్వహిస్తున్నారని, ఈ విధంగా సంఘటిత, సమర్థ సమాజాన్ని నిర్మాణం చేయడానికి రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలని దత్తాత్రేయ హొసబలే పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ప్రముఖ కంటివైద్య నిపుణులు డాక్టర్‌ ‌కస్తూరి చందు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రాంత సంఘచాలక్‌ ‌బూర్ల దక్షిణామూర్తి, నల్గొండ విభాగ్‌ ‌సంఘచాలక్‌ ‌గార్లపాటి వెంకటయ్య, జిల్లా సంఘచాలక్‌ ఇటికాల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లాలోని 325 గ్రామాల నుండి 3959 మంది స్వయంసేవకులు గణవేష్‌తో పాల్గొన్నారు. అలాగే కార్యక్రమం తిలకించడానికి 1128 మంది పురుషులు, 800 మంది మహిళలు హాజరయ్యారు.

సార్వజనికోత్సవానికి ముందుగా నల్గొండ నగరంలోని హిందూపూర్‌, ‌దేవరకొండ రోడ్డు, శివాజినగర్‌ ‌నుండి 3 భాగాలుగా ప్రారంభమైన పథ సంచలన్‌ (‌రూట్‌మార్చ్) ‌క్లాక్‌టవర్‌ ‌దగ్గర ఒకే సమయానికి ఒకటిగా కలిసి చివరకు ఎన్‌.‌జి. కళాశాల మైదానం వరకు సాగింది. ఈ పథ సంచలన్‌ ‌కార్యక్రమంలో పురః ప్రజలు, ముఖ్యంగా మహిళలు పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. ఈ రూట్‌మార్చ్‌లో 3384 మంది గణవేష్‌ ‌ధరించిన స్వయంసేవకులు పాల్గొన్నారు.

About Author

By editor

Twitter
YOUTUBE