- క్రాంతి
భారతావనిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తూ తమిళనాడులోని కున్నూర్ సమీపంలో కాట్టేరి కొండప్రాంతంలో నంజప్పసత్రం వద్ద సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధూలిక సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎంఐ 17 వి5 హెలికాప్టర్ కూలిపోయింది. ఒకరు మాత్రమే ప్రాణాలతో మిగిలారు. తీవ్ర గాయాలతో బయటపడిన ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ చావుబతుకుల మధ్య ఉన్నారు. తమిళనాడులోని నీలగిరి జిల్లా వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కళాశాలలో శిక్షణలో ఉన్న అధికారులను ఉద్దేశించి జనరల్ రావత్ ప్రసంగించాల్సి ఉంది. అందుకోసం భార్య, మరికొంతమంది సైనిక ఉన్నతాధికారులతో కలసి ఆ రోజు ఢిల్లీ నుంచి ఉదయం 11:34 గంటలకు కోయంబత్తూరు జిల్లా సూలూర్ పట్టణానికి చేరుకున్నారు. అక్కడి నుంచి 11:48 గంటలకు భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17వి5 హెలికాప్టర్‌లో వెల్లింగ్టన్‌కు బయలుదేరారు. దాదాపు 45 నిమిషాల్లో ఆయన డీఎస్‌ఎస్‌సీకి చేరుకోవాలి. అయితే 12:22 గంటలకు ఈ ఘోరం జరిగింది. జనరల్ రావత్ వెల్లింగ్టన్‌లోని డీఎస్‌ఎస్‌సీలోనే గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆ కళాశాలలో ప్రసంగించేందుకు వెళ్తుండగానే ఆయన మరణించడం బాధాకరం.
శత్రు దుర్భేద్యమని చెప్పుకునే ఎంఐ 17 వి5హెలికాప్టర్ ప్రమాదం మీద వెంటనే అనుమానాలు రేకెత్తాయి. ఎందరో నిపుణులు, రాజకీయ నాయకులు, మాజీ సైనికాధికారులు ఇందులో కుట్రను చూశారు. కొన్ని గంటలలోనే త్రివిధ దళాలు ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి. మూడు రక్షణదళాలను సమన్వయం చేయడానికి దేశ చరిత్రలోనే తొలిసారి నియమితులైన జనరల్ రావత్ దుర్మరణం మీదే త్రివిధ దళాలు సంయుక్తంగా దర్యాప్తు చేయడం వైచిత్రి. మరోవైపు- హెలికాప్టర్ కూలిపోయిన స్థలంలో అధికారులు బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను నిర్ధారించడంలో అది కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలోనే నిరాధార సమాచారం, ఊహాగానాలకు దూరంగా ఉండాలని భారత వైమానిక దళం ప్రజలకు సూచించింది. తాము దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేస్తామని ట్విటర్ వేదికగా వెల్లడించింది.
రావత్ 2015లో ఒకసారి హెలికాప్టర్ ప్రమాదం నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకొన్నారు. ఆయన ప్రయాణిస్తున్న చీతా హెలికాప్టర్ గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కూలిపోయింది. కానీ రావత్ స్వల్పగాయాలతో తప్పించుకొన్నారు. ఇప్పుడు మాత్రం ఆయనను మరణం వదిలిపెట్టలేదు. జనరల్ రావత్ మరణం ఒక్క భారతదేశంలోనే కాదు, కొన్ని ఇతర దేశాలలోను సంచలనంగానే మారింది. నిజానికి సైన్యంలో జనరల్ రావత్ ప్రస్థానం ఆసక్తికరం. అత్యున్నత అధికారిగా ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం కూడా.
1993 మే 17. జమ్మూ-కశ్మీర్‌లోని యురి ప్రాంతంలో గస్తీ విధులు నిర్వర్తిస్తోంది సైన్యం. హఠాత్తుగా పాకిస్తాన్ సైన్యం భారీగా కాల్పులు జరిపింది. ఒక తూటా వచ్చి విధుల్లో ఉన్న సైనికాధికారి చీలమండలో దిగింది. వెంటనే ఆయనను శ్రీనగర్ సైనిక ఆసుపత్రికి తరలించారు. తూటా గాయం ఆ అధికారిని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. ఆయన ఆందోళన సైన్యంలో తన భవిష్యత్తు గురించే. మధ్యప్రదేశ్‌లోని మౌ సైనిక శిక్షణ కేంద్రంలో సీనియర్ కమాండ్ కోర్సుకు ఈ గాయం అవరోధంగా మారుతుందేమోనని ఆయన అనుమానించారు. ఆ కోర్సు పూర్తి చేస్తే కానీ సైన్యంలో ఉన్నత హోదాలక• అర్హత రాదు. ఇక ఈయన కెరీర్ ముగిసినట్లే అని ఎవరో అన్న మాటలు బాధించాయి. కానీ ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాక ఆ సైనికాధికారి ఊతకర్ర సాయంతో మళ్లీ నడవడం ప్రారంభించారు. నెల లోపే సైనిక ఆస్పత్రి వైద్యులు పూర్తి ఫిట్‌నెస్ (షేప్1)గా ఉన్నట్లు తేల్చారు. అయితే పోస్టింగ్ ఎక్కడ అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. లక్నోలోని గూర్ఖా రెజిమెంటల్ సెంటర్‌కు బదలీ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఆ అధికారి మాత్రం మళ్లీ యురికే వెళతానని ధీమాగా చెప్పారు. ఇందుకు ఉన్నతాధి కారులు ఒప్పుకున్నా, గస్తీ విధులకు అనుమతించలేదు. క్రమేపీ చీలమండ సాధారణ స్థితికి వచ్చింది. మొక్కవోని ధైర్యంతో సైన్యంలో తన సత్తా చాటుకుంటూ ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఆయనే జనరల్ బిపిన్ రావత్.
మన కాలం మహావీరుడు
ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప, జనరల్ కేఎస్ రాజిందర్ సింహజీ, జనరల్ ఎస్‌ఎం శృంగేశ్, జనరల్ కేఎస్ తిమ్మయ్య, జనరల్ పీఎన్ థాపర్, జనరల్ జేఎన్ చౌధురి, జనరల్ పీపీ కుమార మంగళం, జనరల్ మానెక్షా, జనరల్ రైనా, జనరల్ కృష్ణారావు వంటివారంతా అరకొర సౌకర్యాలు మాత్రమే ఉన్న సైన్యాన్ని నడిపి ఖ్యాతులయ్యారు. కానీ జనరల్ బిపిన్ రావత్ కాలానికి పరిస్థితులు మారాయి. సరిహద్దులలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇది 1962 కాదు, 2021 అంటూ సరిహద్దు దేశాలను హెచ్చరించవలసిన పరిస్థితులు. ఇలాంటి సమయంలో వినిపించిన మాట సర్జికల్ స్ట్రైక్స్. ఈ మాట వినగానే గుర్తుకొచ్చే పేరు జనరల్ బిపిన్ రావత్! జమ్ముకశ్మీర్‌లోని యురి సెక్టార్‌లో సెప్టెంబర్ 18, 2016న టెర్రరిస్టులు భద్రతా బలగాలపై దాడిచేశారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వచ్చినా సంయమనం పాటిస్తూ వచ్చిన భారత్, ఈ దాడిని తీవ్రంగా పరిగణించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు మన సైన్యం పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించింది. సెప్టెంబరు 29, 2016న పాక్ సరిహద్దుల్లోకి భారత సైన్యం వెళ్లి అత్యంత సాహసోపేతంగా ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపింది. ఈ ఘటన దేశంలో కొత్త వాతావరణాన్ని తీసుకువచ్చింది. భద్రతా బలగాలలోను ఆత్మ స్థయిర్యాన్ని నింపింది. జనరల్ రావత్ భారత సైన్యానికి ఉప అధిపతి అయిన నెల రోజుల్లోపే ఈ దాడి జరిగింది. జైషే మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహుద్దీన్ ఉగ్రవాద సంస్థల సంయుక్త శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు చేపట్టారు. 2019 ఫిబ్రవరిలో పుల్వామాలో ఉగ్రవాదులు సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్ మీద దాడి చేసి 40 మంది జవాన్ల మరణానికి కారణమయ్యారు. దీనికి ప్రతికారంగా మన సైన్యం మరోసారి పాకిస్తాన్‌పై విరుచుకుపడింది. పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో గల బాలాకోట్ పరిసరాల్లోని జైషే మహ్మద్ సంస్థ ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షాన్ని కురిపించింది. 35 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లు వార్తలు వచ్చాయి.
ఎన్నో కీలక విజయాలు
బిపిన్ రావత్ అంతకు ముందు కూడా పలు కీలక సైనిక మిషన్లకు నాయకత్వం వహించి సమర్థంగా నడిపించారు. చైనాతో 1987లో జరిగిన ఘర్షణలో రావత్ బెటాలియన్ ముందుండి పోరాడింది. 1962 యుద్ధం తర్వాత మెక్‌మహన్ రేఖ వద్ద జరిగిన తొలి సైనిక ఘర్షణ ఇదే. రావత్ బృందం మెక్‌మహన్ రేఖ వద్ద ‘సుబ్రాంగ్ చూ’లోయలో చైనా సైన్యాన్ని బలంగా అడ్డుకొంది.
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఐక్యరాజ్య సమితి తరఫున నిర్వహించిన మిషన్ రావత్ విజయాల్లో చెప్పుకోదగ్గది. దక్షిణ కివూ రాజధాని గోమాను ఆక్రమించుకునేందుకు సాయుధ తిరుగుబాటుదారులు చేసిన ప్రయత్నాన్ని వమ్ము చేశారు. ఐరాస తరఫున పోరాడిన బృందానికి జనరల్ రావత్ నాయకుడు. ఈ ఆపరేషన్ నాలుగు నెలలు జరిగింది. గోమా తిరుగుబాటుదారుల వశం కాకుండా కాపాడి, తిరుగుబాటుదారులను చర్చలకు వచ్చేలా చేశారు.
2015 జూన్‌లో మణిపుర్‌కు చెందిన యూఎన్‌ఎల్‌ఎఫ్‌డబ్ల్యూ తిరుగుబాటుదారులు మన సైనికులపై దాడి చేసి 18 మందిని పొట్టన బెట్టుకున్నారు. ఆ సమయంలో దిమాపుర్ కేంద్రంగా పనిచేసే కోర్ 3 కమాండింగ్ అధికారిగా రావత్ వ్యవహరించారు. ఈ ఘటన తర్వాత భారతసైన్యం మయాన్మార్‌లోకి ప్రవేశించి తిరుగుబాటుదారులపై విరుచుకుపడింది. 21వ బెటాలియన్‌కు చెందిన పారాషూట్ రెజిమెంట్ ఎన్‌ఎస్‌సీఎన్-కే తిరుగుబాటు సంస్థ స్థావరాన్ని ధ్వంసం చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్‌లో 21మంది పారా కమాండోలు పాల్గొన్నారు.
రావత్ సేవలూ, పతకాలు..
జనరల్ రావత్ సేవలకు పలు అవార్డులు వరించాయి. పరమ విశిష్ట సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం, అతి విశిష్ట సేవాపతకం, యుద్ధసేవా మెడల్, సేనా మెడల్, విశిష్ట సేవా పతకం వాటిలో కొన్ని. ఐక్యరాజ్యసమితిలో పనిచేసిప్పుడు ఫోర్స్ కమాండర్ నుంచి ప్రశంస లందాయి. మిలిటరీతో పాటు దౌత్యపరంగానూ ఆయన విశేష సేవలు అందించారు. అమెరికా, రష్యా, నేపాల్, శ్రీలంక, మయన్మార్, భూటాన్ తదితర దేశాల్లో పర్యటించారు. దేశాల మధ్య సైనిక సంబంధాలను బలోపేతం చేశారు.
రక్షణ బలగాల మార్గదర్శిగా..
మరణించే నాటికి బిపిన్ రావత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. భారత్‌కు తొలి సీడీఎస్ ఆయనే. బిపిన్ రావత్ ఫోర్‌స్టార్ జనరల్. భారత్‌లో అత్యంత శక్తివంతమైన సైనికాధికారి రావత్. అంచెలంచెలుగా ఎదిగిన రావత్ 2016 డిసెంబరు 31న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇద్దరు సీనియర్లను కాదని బిపిన్ రావత్‌కు ఈ బాధ్యత అప్పగించారు అంటే ప్రధాని మోదీ ఆయనపై ఎంత విశ్వాసం పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. లద్ధాఖ్ సంక్షోభ సమయంలో రావత్ త్రివిధ దళాలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తున్నారు. మూడు దళాలు బీజింగ్‌ను సమష్టిగా ఎదుర్కోనే వ్యూహంలో ఆయన పాత్ర కీలకం.
భారత రక్షణ రంగంలో అతిపెద్ద సంస్కరణలకు బిపిన్ రావత్ మార్గదర్శి. భారత్‌లో వేర్వేరు చోట్ల త్రివిధ దళాలకు ఉన్న 17 కమాండ్లను కలిపి ఇంటిగ్రెటెడ్ థియేటర్ కమాండ్లుగా ఏర్పాటు చేసే గురుతర బాధ్యత ఆయనదే. భారత సైన్యాన్ని అగ్రరాజ్యాలతో సమానంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలూ ఆయన శ్రమించారు. డీఆర్‌డీవో సైన్యం కోసం అభివృద్ధిచేసే ముఖ్యమైన ప్రాజెక్టులపై జరిగే సమీక్షలకు జనరల్ రావత్ తప్పనిసరిగా హాజరయ్యే వారు. శాస్త్రవేత్తలతో కూర్చుని సైనికుల అవసరాలపై చర్చించేవారు. ఆయన ముక్కు సూటి మనిషి. నిజాన్ని నిర్భయంగా చెప్పేవారు. సీడీఎస్‌గా బాధ్యతలు చేపట్టాక సైన్యానికి అవసరమైన ఆయుధాలు సహా ఇతర రక్షణ సామగ్రి స్వదేశంలోనే తయారుకావాలని గట్టిగా కోరుకునేవారు.
జనరల్ బిపిన్ రావత్ ప్రాణాలు కోల్పోవడంపై యావద్దేశం దిగ్భ్రాంతి చెందింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, బాలీవుడ్ సహా పలు రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
వీరపుత్రుడిని కోల్పోయాం: రాష్ట్రపతి
దేశం తన ధీర కుమారుల్లో ఒకరిని కోల్పోయిం దని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రగాఢ సంతా పాన్ని వ్యక్తం చేశారు. మాతృభూమి కోసం రావత్ నాలుగు దశాబ్దాల నిస్వార్థ సేవలు అందించారని కొనియాడారు. అసాధారణమైన శౌర్యం, వీరత్వం ఆయన సొంతమని ప్రశంసించారు.. హెలికాప్టర్ ప్రమాదం చాలా బాధాకరని విచారం వ్యక్తం చేశారు రాష్ట్రపతి.
ఎప్పటికీ గుర్తుండిపోతారు: ఉపరాష్ట్రపతి
దేశానికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా రావత్ సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు. అద్భుతమైన నాయకత్వ లక్షణాలు, వ్యూహాత్మక దార్శనికత ఆయన సొంతమన్నారు.. రక్షణ సామర్థ్యాన్ని, దేశ భద్రతను బలోపేతం చేయడంలో ఆయన కృషి ఎనలేనిదని తన సంతాప సందేశంలో తెలిపారు.
దేశానికి తీరని లోటు: ప్రధాని మోదీ
దేశసైన్యం స్వయం సమృద్ధి సాధించే దిశగా సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఎంతో కృషి చేశారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారికి నివాళులర్పించారు. ‘భారతదేశ తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణం ప్రతి దేశభక్తునికి తీరని లోటు. ఆయన ధైర్యశాలి. దేశంలోని సాయుధ బలగాలను స్వావలంబనగా మార్చడానికి చాలా కష్టపడ్డారు, దీనికి దేశం సాక్షి’ అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.
పార్లమెంట్ సంతాపం
జనరల్ రావత్ సహా ఇతర మృతులకు లోక్‌సభ, రాజ్యసభ నివాళులర్పించాయి. ప్రమాదంపై ఉభయ సభల్లోనూ రాజ్‌నాథ్ ప్రకటన చేశారు. జనరల్ రావత్ మృతిపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిపుణుడైన ఓ యోధుడిని, అసమాన వ్యూహచతురుడిని దేశం కోల్పోయిందని వ్యాఖ్యానిం చారు. నాలుగు దశాబ్దాలకు పైగా దేశ సేవలో గడిపిన రావత్ భద్రతారంగంలో గణనీయమైన సంస్కరణలు తెచ్చారని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
రక్షణ భాగస్వామ్యంలో బిపిన్ కీలక పాత్ర: అమెరికా
భారత సీడీఎస్ బిపిన్ రావత్ మృతి పట్ల అమెరికా సంతాపం తెలిపింది. భారత్-అమెరికా రక్షణ భాగస్వామ్యంలో ఆయన బలమైన ప్రతినిధి అని, ఇరు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంలో ఆయన విశేషంగా కృషి చేశారని కొనియాడింది. ‘సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్.. అమెరికా-భారత్ రక్షణ భాగస్వామ్యానికి బలమైన ప్రతినిధి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించేందుకు ఆయన దోహదపడ్డారు. అమెరికా, భారత్ మధ్య సంబంధాలు బలోపేతం కావడంతో ఆయన కీలక పాత్ర పోషించారు. జనరల్ బిపిన్ రావత్ కుటుంబానికి, ఈ ప్రమాదంలో మృతి చెందిన సైనిక సిబ్బంది కుటుంబాలకి, భారతీయులందరికీ మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం’ అని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ ప్రకటించారు. సీడీఎస్ బిపిన్ రావత్ మృతి పట్ల అమెరికా రక్షణ రంగం తరఫున సంతాపం తెలియజేస్తున్నట్లు పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ వెల్లడించారు. అమెరికాకు చెందిన పలువురు రాజకీయ నాయకులు సైతం బిపిన్ రావత్ మృతి పట్ల సంతాపం తెలిపారు.
ఊరికి ఏదైనా చేద్దామని..
స్వగ్రామానికి ఏదైనా చేయాలనే కోరిక నెరవేరకుండానే జనరల్ బిపిన్ రావత్ ఈ లోకాన్ని వీడారు. ఆయన చివరిసారిగా 2018లో స్వగ్రామం పౌరిని సందర్శించారు. పదవీ విరమణ తర్వాత అక్కడే ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సమీప బంధువు భరత్‌సింగ్ రావత్ గుర్తుచేసుకున్నారు. అక్కడకు వెళ్లినప్పుడు తమ కుల దేవతకు పూజలు చేయడం ఆయన అలవాటు. ఇక్కడినుంచి ఉద్యోగరీత్యా వెళ్లడం చాలా బాధగా ఉందని, తిరిగి వచ్చాక గ్రామానికి ఎంతో కొంత చేయాలని ఉందని కూడా బిపిన్ రావత్ అప్పట్లో అన్నారని భరత్ సింగ్ చెప్పారు. వచ్చే ఏప్రిల్‌లో మళ్లీ గ్రామానికి వస్తానన్నారని, ఇంతలోనే ఇలా చూడాల్సి వస్తుందనుకోలేదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
సైకోల అనుచిత వ్యాఖ్యలు
ప్రముఖులు మరణించినప్పుడు సోషల్ మీడియాలో కుసంస్కారాన్ని చాటుకునేవారు ఇటీవలి కాలంలో పెరిగిపోయారు. జనరల్ రావత్ విషయం లోను ఇదే జరిగింది. మనం ఏ దేశంలో పుట్టాం, ఏ దేశంలో నివసిస్తున్నాం, మన తల్లిదండ్రులు ఏ దేశంలో ఉన్నారు అనే స్పృహ కూడా లేకుండా వికృత వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశం అంటే అకారణ ద్వేషం. మెజారిటీ మతస్థులంటే ఆగ్రహం. వీరికి మోదీ, బీజేపీ, ఆరెస్సెస్ నచ్చకపోవచ్చు. కానీ దేశం కోసం పని చేసేవారి మీద కూడా అవాకులు చెవాకులు పేలుతున్నారు. జనరల్ బిపిన్ రావత్ విషాదకర మరణాన్ని కొందరు పండగ చేసుకున్నారన్న సంగతి ఎందరినో బాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినవారెందరో. ఇలాంటి వారిపై మధ్యప్రదేశ్, జమ్ము కశ్మీర్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, రాజస్తాన్‌లలో కేసులు నమోదయ్యాయి. పలువురిని అరెస్టు చేశారు. వీరిలో కొందరు బాధ్యతాయుత మైన ఉద్యోగులూ ఉన్నారు. ఇలాంటి కొందరిని ఉద్యోగాల్లోంచి తొలగించారు. పోలీసులు ఈ పోస్టులను డిలీట్ చేయించారు. ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం కావడంతో కొందరు డిలీట్ చేసుకున్నారు. మరి కొందరు ప్రొఫైల్స్ లాక్ చేసుకున్నారు.
జనరల్ బిపిన్ రావత్ దంపతులకు యావత్ దేశం కన్నీటి వీడ్కోలు పలికింది. కామ్‌రాజ్ మార్గ్‌లోని స్వగృహం నుంచి రావత్, ఆయన భార్య మధూలిక పార్థివదేహాలతో బ్రార్ స్క్వేర్ స్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగింది. దారి పొడువునా ప్రజలు ‘జబ్‌తక్ సూరజ్ చాంద్ రహేగా.. రావత్‌కా నామ్ అమర్ రహేగా.. రావత్ అమర్‌రహే’’ అంటూ నినాదాలు చేశారు. రావత్ అంత్యక్రియల్లో శ్రీలంక సీడీఎస్ అండ్ కమాండర్ జనరల్ షవేంద్ర సిల్వా, శ్రీలంక మాజీ అడ్మిరల్ రవీంద్ర చంద్రసిరి (నేషనల్ డిఫెన్స్ కాలేజ్‌లో రావత్‌కు మంచి మిత్రుడు), రాయల్ భూటాన్ ఆర్మీ డిప్యూటీ ఆపరేషన్స్ చీఫ్ బ్రిగేడియర్ డోర్జీ రించన్, నేపాల్ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ బాలకృష్ణ కార్కీ, బంగ్లాదేశ్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ డివిజన్ స్టాఫ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ వకార్ ఉజ్ జమాన్, పలు దేశాల రాయబారులు హాజరయ్యారు.
—————————————————–
తండ్రి బాటలో సైనిక దళాలలోకి..
బిపిన్ రావత్ మార్చి 16, 1958లో ఉత్తరా ఖండ్‌లోని పౌరీలో జన్మించారు. తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. తండ్రి స్ఫూర్తితోనే రావత్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. బిపిన్‌కు ఇండియన్ మిలిటరీ అకాడమీ దెహ్రాదూన్‌లో సోర్డ్ ఆఫ్ ఆనర్ లభించింది. డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీలో గ్రాడ్యు యేషన్ చేశారు. ఆ తర్వాత అమెరికాలోని కాన్సాస్‌లో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ కమాండ్ అండ్ జనరల్ స్టాఫ్ కాలేజీలో హైయ్యర్ కమాండ్ కోర్స్ చేశారు. దేవీ అహల్యా విశ్వవిద్యాలయంలో ఎంఫిల్, మద్రాస్ యూనివర్శిటీలో కంప్యూటర్ డిప్లొమా చేశారు.
బిపిన్ రావత్ 1978లో 11 గుర్ఖా రైఫిల్స్ విభాగంలో సెకండ్ లెఫ్టినెంట్‌గా సైనిక జీవితాన్ని ప్రారంభించారు. లక్ష్మణ్ రావత్ అదే యూనిట్‌లో కెరీర్ ప్రారంభించడం విశేషం. సెక్టార్‌లో భారత్-చైనా సరిహద్దు అయిన వాస్తవాధీన రేఖ వద్ద విధులు నిర్వర్తించారు. మేజర్ హోదాలో జమ్ము కశ్మీర్‌లోని యురిలో కంపెనీ కమాండ్‌గా వ్యవహరించారు. కల్నల్‌గా గూర్ఖా రైఫిల్స్‌లో పనిచేశారు. ఆ తర్వాత జమ్ము కశ్మీర్‌లోని సోపూర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్ సెక్టార్ 5 బాధ్యతలు నిర్వహించారు. మేజర్ జనరల్‌గా పదోన్నతి పొందాక యురిని 19వ ఇన్‌ఫాంట్రీ డివిజన్ జనరల్ ఆఫీసర్‌గా వ్యవహరించారు.
ఆ తర్వాత లెఫ్టినెంట్ జనరల్ హోదాలో నాగాలాండ్‌లోని టైగర్ కోర్ (3వ కోర్) బాధ్యతలను చేపట్టారు. 2016లో దక్షిణ కమాండ్‌లో కమాండింగ్-ఇన్-చీఫ్ జనరల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. కొన్ని నెలలకే ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా పదోన్నతి పొందారు. 2016 డిసెంబర్‌లో భారత సైన్యానికి 27వ అధినేతగా(ఆర్మీ చీఫ్) బాధ్యతలు నియమితులయ్యారు. బిపిన్ రావత్ 2017 జనవరి 1వ తేదీన ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. రావత్ ఉగ్రవాద, వేర్పాటువాద నిరోధక ఆపరేషన్లలో విశేష అనుభవం గడించారు.
సైన్యంలో నేను ఎలా చేరానంటే..
రెండేళ్ల క్రితం సైన్యంలో చేరాలని ఆశిస్తున్న కొందరు విద్యార్థులతో జరిగిన ఓ ఇష్టాగోష్టిలో బిపిన్ రావత్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. సైన్యంలో అధికారులుగా చేరాలంటే యూపీఎస్‌సీ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఈ పరీక్షలో పాసైన రావత్ ఆ తర్వాత అలహాబాద్ లోని సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ఎదుట ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ‘‘ఇంటర్వ్యూ చేసిన అధికారి నన్ను కొన్ని ప్రశ్నలు అడిగి ఆ తర్వాత అభిరుచులేమిటో చెప్పమన్నారు. ట్రెక్కింగ్ అంటే నాకు చాలా ఇష్టమని చెప్పాను. వెంటనే ఆ అధికారి నువ్వు ఐదురోజులు ట్రెక్కింగ్‌కు వెళ్లాల్సి వస్తే నీతో తీసుకెళ్లే అతి ముఖ్యమైన వస్తువు ఏది? అని అడిగారు. నేను ‘అగ్గిపెట్టె’ అన్నాను. ఆశ్చర్యానికి గురైన ఆ అధికారి, వివరంగా చెప్పమన్నారు. ‘అగ్గిపెట్టె నాతో ఉంటే ట్రెక్కింగ్‌లో చాలా పనులు చేసుకోగలను. అగ్ని ఆదిమ మానవుడి అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణ. నేను కూడా నా ట్రెక్కింగ్ సమయంలో ఇది అత్యంత ముఖ్యమైన వస్తువుగా భావించాను. అని చెప్పాను.’
‘సంతృప్తి చెందని ఆ బ్రిగేడియర్ నా సమాధానం మార్చుకోవాలని ఒత్తిడి చేశారు. నేను నా మాటపై గట్టిగా నిలబడ్డా. కొద్ది రోజుల తర్వాత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్లు లేఖ వచ్చింది. ఆ తర్వాత ఎన్‌డీఏలో చేరి సైన్యానికి సేవలందిం చాను. ఎంత ఒత్తిడిలోనైనా నా జవాబుపై నేను గట్టిగా నిలబడటమే. ఇంటర్వ్యూ ఎంపికలో కీలక పాత్ర పోషించింది’ అన్నారు రావత్.
————————————————————-
లమరులు వీరే..
- జనరల్ బిపిన్ రావత్, 2. భార్య మధూలిక రావత్, 3. రావత్ సైనిక సలహాదారు బ్రిగేడియర్ ఎల్.ఎల్.లిద్దర్, 4. లెఫ్టినెంట్ కర్నల్ హరిజిందర్ సింగ్, 5. వింగ్ కమాండర్ పి.ఎస్.చౌహాన్, 6. స్క్వాడ్రన్ లీడర్ కె.సింగ్, 7. జూనియర్ వారెంట్ ఆఫీసర్ దాస్, 8. జూనియర్ వారెంట్ ఆఫీసర్ ఎ.ప్రదీప్, 9. హవాల్దార్ సత్పాల్, 10. నాయక్ గురుసేవక్ సింగ్, 11. నాయక్ జితేందర్ కుమార్, 12. లాన్స్ నాయక్ వివేక్ కుమార్, 13. లాన్స్ నాయక్ సాయితేజ (తెలుగు వారు)
——————————–
నేనున్నంత కాలం ఉండు సాయి
హెలికాప్టర్ దుర్ఘటనలో బిపిన్ రావత్‌తో పాటు ప్రాణాలు కోల్పోయిన వారిలో చిత్తూరు జిల్లా వాసి లాన్స్‌నాయక్ సాయితేజ కూడా ఉన్నారు.. ఏడాది కిందట సాయితేజను తన వ్యక్తిగత భద్రత సిబ్బందిగా నియమించుకున్నారు. రావత్‌ను ఆయన కంటికి రెప్పలా చూసుకునేవారు. సాయితో పాటు ఆయన తమ్ముడు కూడా సైన్యంలో సేవలు అందిస్తు న్నారు. అయితే సాయితేజ ఆర్మీలో కొనసాగడంపై అతడి తల్లిదండ్రులు కొంత ఆందోళన వ్యక్తంచేశారు. ప్రాణాల మీదకు వచ్చే ఉద్యోగం మనకొద్దు.. మానుకో అంటూ తండ్రి మోహన్ చెప్పినా, సార్ (బిపిన్ రావత్)తోనే ఉంటానంటూ సాయితేజ బదులిచ్చారు. ఒకానొక సందర్భంలో తల్లిదండ్రుల ఒత్తిడితో.. ఆర్మీ నుంచి వైదొలుగుతానని సాయితేజ చెప్పారు. ‘నేను ఉన్నంతవరకూ నువ్వూ ఉండు సాయీ’ అని రావత్ కోరడంతో ఆయనతోనే ఉండిపోవాలని నిర్ణయించు కున్నారు.. చివరకు విధి రావత్‌తోపాటుగా సాయిని కూడా తీసుకెళ్లింది. లాన్స్ నాయక్ సాయిది కురబలకోట మండలం ఎగువ రేగడ. పార్థివదేహం బెంగళూరు నుంచి వస్తుంటే మదనపల్లె నుంచి ఆ గ్రామం వరకు 20 కిలోమీటర్ల మేర ఎన్‌సీసీ కేడెట్లు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ప్రజాసంఘాలు, యువకులు అడుగడుగునా నీరాజనం పలికారు.‘జై జవాన్! భారతమాత ముద్దుబిడ్డ సాయితేజ అమర్ రహే!’ అంటూ నినదించారు. ఈ యాత్రలో పాల్గొన్నవారిలో పలువురు త్రివర్ణ పతాకాలు ధరించారు. ఆయన భార్య శ్యామల, కుటుంబ సభ్యులు పార్థివ దేహాన్ని చూసి చలించిపోయారు. 12వ తేదీన అంత్యక్రియలు జరిగాయి.
—–
జనరల్ రావత్ మరణాన్ని చులకన చేస్తూ కొందరు తుంటరులు పెట్టిన పోస్టులకు మనస్తాపం చెందిన మళయాళ సినీ దర్శకుడు అలీ అక్బర్ ఇకపై తాను ముస్లింను కానని ప్రకటించారు. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఎమోజీలు తీవ్రంగా బాధించాయని అన్నారు. తాను, తన భార్య త్వరలోనే హిందూమతం స్వీకరిస్తామని ప్రకటించారు.