– ఎం.వి.ఆర్‌. శాస్త్రి

అది ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌. రaాన్సీ రాణి లక్ష్మిబాయి వీరగాథ నాటకాన్ని చూడవచ్చిన మూడువేల మంది ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సైనికులతో, 500 మంది మహిళా రెజిమెంట్‌ అమ్మాయిలతో ఆగస్టు 14 రాత్రి కిక్కిరిసి ఉంది. సుభాస్‌ చంద్ర బోస్‌ అనుకున్నదాని కంటే ముందే అక్కడికి చేరుకున్నాడు. ప్రియతమ నాయకుడిని చూడగానే హర్షాతిరేకంతో చప్పట్లు, జయజయ ధ్వానాలు మారుమోగాయి. మహిళా రెజిమెంట్‌ అమ్మాయిలు ప్రదర్శించిన చక్కని నాటకం అందరినీ ఆకట్టుకుంది. వీరనారి రaాన్సీ లక్ష్మిబాయి ధైర్యం, శౌర్యం అక్కడ చేరిన ప్రతి ఒక్కరికీ గొప్ప ఉత్తేజాన్ని ఇచ్చింది. ప్రదర్శన పూర్తవగానే అన్ని వేల మందీ లేచి ఒక్క గొంతుతో ‘శుభ్‌ సుఖ్‌ చెయిన్‌…’ జాతీయగీతాన్ని ఒక్క గొంతుతో ఆలపించారు. బోస్‌ పాల్గొన్న ఆఖరి పబ్లిక్‌ ఫంక్షన్‌ అదే.

నాటకం మధ్యలో ఉండగా ఆజాద్‌ హింద్‌ ప్రభుత్వ న్యాయ మంత్రి ఎ.ఎన్‌. సర్కార్‌ బాంగ్‌కాక్‌ నుంచి విమానం దిగి నేరుగా అక్కడికి వచ్చాడు. సుభాస్‌ బోస్‌ అతడిని పక్కన కూచోబెట్టుకుని నాటకం అయ్యాక తనతో బాటు బంగాళాకు తీసుకువెళ్ళాడు. డిన్నర్‌ కాగానే రోజూలాగే మంత్రిమండలి సమావేశం మొదలైంది.

సైనిక పోరాటంలో సుభాస్‌ చంద్ర బోస్‌ కున్న ప్రధాన ఆలంబనం జపాన్‌. అదికాస్తా లొంగి పోయాక పరిస్థితి దారుణంగా విషమించింది. బ్రిటిష్‌ సామ్రాజ్యానికి బోస్‌ మీద పీకల దాకా కోపం ఉంది. అతడిని తమకు అప్పగించమని జపాన్‌ మీద మిత్రరాజ్యాల ఒత్తిడి ఎక్కువైంది. అతడు చేతికి చిక్కితే చాలు వార్‌ క్రిమినల్‌ గా పరిగణించి, నామరూపాలు లేకుండా చేయాలని బ్రిటిషు పాలకులు మహా మంట మీద ఉన్నారు. రేపో మాపో సింగపూర్‌లోకి బ్రిటిషు సేనలు రాబోతున్నాయి. పోరాటం కొనసాగించ దలచుకుంటే బోస్‌ ఇంకా సింగపూర్లో – ఆ మాటకొస్తే ఆగ్నేయాసియాలో – ఉండటం ప్రమాదం.

మొత్తం అక్షకూటమి కుప్పకూలిన స్థితిలో బ్రిటిష్‌ సామ్రాజ్యం పంజాకు అందకుండా పోరాటం కొనసాగించాలంటే ఆదుకోలిగింది, ఆశ్రయించ వలసినది సోవియట్‌ రష్యానే. జపాన్‌ మిలిటరీకి అది బొత్తిగా ఇష్టం లేదు. ఆ దిశగా బోస్‌ చేసిన ప్రయత్నాలను జపాన్‌ పాలకులు ప్రతిసారీ అడ్డం కొట్టారు. అయినా జపాన్‌ సైనిక, ప్రభుత్వవర్గాలలో సుభాస్‌ చంద్ర బోస్‌ అభిమానులు, శ్రేయోభిలాషులు బాగానే ఉన్నారు. వారి ద్వారా అనుకున్నది సాధించటానికి ఆయన బహు గోప్యంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇంకా జపాన్‌ అధీనం లోనే ఉన్న మంచూరియాలో రష్యన్‌ సరిహద్దుకు చేరువలో బోస్‌ను వదిలిపెట్టేట్టూ, అక్కడి నుంచి ఆయన సొంత రిస్కుపై ఎలాగో రష్యా చేరుకునేట్టూ రహస్య ఒప్పందమైతే కుదిరింది. ఎలాగైనా మాస్కోను ప్రసన్నం చేసుకుని, ఆజాద్‌ హింద్‌ ప్రభుత్వాన్ని అక్కడ నుంచి నడపాలని బోస్‌ ఆశ. సోవియట్లతో మిలిటరీ పొత్తు కుదుర్చుకుని, ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దు గుండా ఐఎన్‌ఎ ఇండియాలోకి ప్రవేశించాలని ఆయన ప్రణాళిక.

అది ఎంతవరకు నెరవేరుతుందో దేవునికెరుక. ఆ లోగా రహస్యం బయటికి పొక్కితే మొదటికే మోసం. పెదవి దాటితే పృథివి దాటుతుంది. కాబట్టి తన మనసులో ఏముందో ఏ ఒక్కరికీ తెలియకుండా బోస్‌ జాగ్రత్తపడ్డాడు. తన మంత్రులు, సహచరులు ఏ సలహా ఇచ్చినా చూద్దాం, చేద్దాం, ఆలోచిద్దాం అంటూనే ఉన్నాడు. ఆందరి మాటా వింటున్నట్టే కనపడ్డాడు.

ఆగస్టు 12వ తేదీన బోస్‌ సింగపూర్‌కు వచ్చినప్పటి నుంచీ కేబినేట్‌ రోజూ కలుస్తూనే ఉంది. అప్పటిదాకా ఏకాభిప్రాయం ఏమిటంటే బ్రిటిష్‌ సేనలు వచ్చేసరికి మిగతా మంత్రులతో బాటు నేతాజీ కూడా సింగపూర్‌లో ఉండిపోవాలని. నేతాజీ తెల్లవారికి చిక్కకూడదని మొదట్లో మంత్రులు అభిప్రాయపడ్డారు. ఆయన వినలేదట. ఏమైనా కానీ నేను ఇక్కడే ఉంటాను అని ఆయన పట్టుబట్టేసరికి సరే అలాగే కానిద్దాం అనుకున్నారట!

నేతాజీని ఖైదీగా పట్టుకుని మాత్రం బ్రిటిషువారు ఏమి చేయగలరు? మలయాలోనో, తూర్పు ఆసియా లోనో, భారత దేశంలోనో రాజద్రోహ అభియోగం మోపి విచారణ జరుపుతారు. మహా అయితే మరణ శిక్ష వేస్తారు. అది అమలు జరిగిన మరుక్షణం బ్రిటిషు సామ్రాజ్యానికి కాలం మూడుతుంది. ఇండియాకు స్వాతంత్య్రం వచ్చి తీరుతుంది. శిక్షించే ధైర్యం లేక ఆయనను విడిచి పెడితే ఎక్కడ ఉన్నా ఆయన స్వాతంత్య్ర పోరాటం కొనసాగిస్తాడు. ఏ రకంగా చూసినా నేతాజీ ఖైదీగా చిక్కటం బ్రిటిషువారికి కాదు – మనకే లాభం అన్నది అప్పటిదాకా మంత్రిమండలి భావన. జనరల్‌ కియానీ వంటి సైన్యాధికారులూ అలాగే అనుకుంటున్నారు. ‘వార్‌ క్రిమినల్‌’ గా గుర్తించబడిన బోస్‌ వంటి ముఖ్య శత్రువులను ఏ విచారణ లేకుండా కాల్చివేయాలని బ్రిటన్‌ నిర్ణయించిన సంగతి బహుశా వారికి తెలియదు.

నాటకం నుంచి తిరిగి వెళ్ళాక 14 వ తేదీ రాత్రి సమావేశంలోనూ ఈ విషయం మళ్లీ ప్రస్తావనకు వచ్చింది. నేతాజీ ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రిటిషువారికి చిక్కకూడదని సహాయ్‌ గట్టిగా వాదించాడు. (నేతాజీని అరెస్టు చేసి, విచారణ జరిపి మరణశిక్ష వేసినా ఉద్యమానికి మంచిదే. కాని మూడో కంటికి తెలియకుండా కాల్చేసి, ఏమీ ఎరగనట్టు బ్రిటిష్‌ సర్కారు బుకాయిస్తే ఎలా అని అతడి వాదన.) దాంతో అందరిలోనూ పునరాలోచన మొదలైంది. అప్పటిదాకా అందరితోబాటు తానూ సింగపూర్‌లోనే ఉండి బ్రిటిష్‌ సైన్యాన్ని ఎదుర్కొంటా నని చెప్పిన నేతాజీ కూడా ఆ రాత్రి సుదీర్ఘ చర్చ తరవాత ‘కొంచెం’ మెత్తబడ్డాడట!! అప్పటికే తెల్లవార వస్తున్నది. ఆందరి కళ్లూ కూరుకుపోతు న్నాయి. తుది నిర్ణయం మరునాడు తీసుకుందామని అనుకుని సమావేశం ముగించారు.

దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సైనికులకు సముచిత స్మారకస్థూపం కట్టించాలని బోస్‌ అంతకుముందే సంకల్పించాడు. “Memorial to the unknown soldier of Azad Hind Fouj” పేర అజ్ఞాత అమరవీరులకు సింగపూర్లోని కన్నాట్‌ డ్రైవ్‌ సముద్ర తీరాన జూలై 8న పునాదిరాయి కూడా వేశాడు. “Unity, Faith and Sacrifice” (ఐకమత్యం, విశ్వాసం, త్యాగం) అనే ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ మోటోను ఆ ఫలకం మీద చెక్కించాడు. వార్‌ మెమోరియల్‌కు రూపకల్పన చేసి నిర్మించే బాధ్యతను కల్నల్‌ సిరిల్‌ జాన్‌ స్ట్రేసి అప్పగించాడు. ఆగస్టు 15 ఉదయం స్త్రేసీకెప్టెన్‌ మాలిక్‌తో కలిసి వచ్చి అర డజను నమూనాలు, డిజైన్లు బోస్‌కు చూపించాడు.

బ్రిటిష్‌ సేనలు ఏ క్షణమైనా సింగపూర్‌ దీవిలో అడుగుపెట్టనున్న సమయంలో అమరవీరులకు స్మారక చిహ్నం కట్టించే సాహసం సుభాస్‌ చంద్ర బోస్‌కే చెల్లింది. తన ముందు పెట్టిన నమూనాలను, డిజైన్లను పరీక్షించి ఖరారు చేశాక ‘‘కల్నల్‌ స్ట్రేసీ! బ్రిటిషు వాళ్లు ఇక్కడ అడుగుపెట్టేలోగా ఈ స్మారక చిహ్నం నిర్మాణం జరగాలి. అది మీవల్ల అవుతుందా?’’ అని అడిగాడు నేతాజీ.

‘‘తప్పకుండా సర్‌!’’ అని నమ్మకంగా చెప్పాడు స్ట్రేసీ. తాను పైన వేసుకున్నది ఎంత మహా భారమో అతడికి తెలుసు. అనుకున్న సమయానికల్లా పని సరిగా చేసిపెట్టే కాంట్రాక్టరును చూసుకోవాలి. కావలసిన సామగ్రి సమకూర్చుకోవాలి. మంచి పనివాళ్లను మాట్లాడుకోవాలి. ఇప్పుడు మొదలుపెట్టి వేగంగా కానిస్తే నిర్మాణం పూర్తయ్యేందుకు కనీసం రెండు వారాలు పడుతుంది. అంత వ్యవధి ఉన్నదా? ఆ లోపే బ్రిటిష్‌ సేనలు ఊడిపడితే పని ఆపెయ్య వలసిందే. స్ట్రేసీ అవేవీ ఆలోచించలేదు. ఏది ఏమైనా స్మారక చిహ్నం వెలసి తీరాలన్న తహతహ నేతాజీ కళ్లలో అతడికి కనిపించింది. ఉద్వేగం పొర్లుకొచ్చింది. అనుకున్నది చేసి తీరుతానన్న దృఢ విశ్వాసంతో నేతాజీ కళ్లలోకి సూటిగా చూసి స్మార్ట్‌ గా నిలబడి ‘జైహింద్‌’ అంటూ సెల్యూట్‌ చేసి నిష్క్రమించాడు. మళ్లీ అతడు బోస్‌ని కలవలేదు. రేయింబవళ్లు కష్టపడి మూడువారాల్లో స్మారకచిహ్నం నిర్మాణం పూర్తి చేయించాడు. మౌంట్‌ బాటెన్‌ సైన్యం సింగపూర్‌ కు వచ్చీ రాగానే చేసిన మొదటి పని డైనమైట్లతో ఆ మెమోరియల్‌ ను కూల్చటమే! (తరవాతెప్పుడో పి.వి.నరసింహారావు హయంలో 1945లో సింగపూర్‌ ఎస్ప్లనేడ్‌ పార్కు లో ఆ మెమోరియల్‌ స్మారకార్థం అదే చోట ఒక మార్కర్‌ నిర్మించారు.)

ఆగస్టు 15 మధ్యాహ్నం జపాన్‌ లొంగుబాటు నిర్ణయాన్ని టోక్యో రేడియో ఆధికారికంగా ప్రకటించింది. తరవాత కథాక్రమం ఎస్‌.ఎ. అయ్యర్‌ వివరిస్తాడు వినండి:

‘‘ఆ రాత్రి డిన్నర్‌ తరవాత 10 గంటలకు మొదటి అంతస్తు వరండాలో అందరం చేరి మూడిరటివరకూ మాట్లాడుకున్నాం. నేతాజీ సింగపూర్‌ నుంచి బయటపడాలని అందరం నిశ్చయించి అతికష్టం మీద ఆయనను ఒప్పించాం. ఆయన ఎక్కడికి వెళ్లాలి అన్నది తరవాత ప్రశ్న. ఇండో చైనాకా? జపాన్‌కా? మంచూరియాకా? రష్యాకా?ఎక్కడికన్నది తరవాత ముచ్చట. ముందు మలయా నుంచి వెళ్లిపోవాలి. ఏదో ఒక రష్యా పాలిత ప్రాంతాన్ని చేరుకోవాలి. వీలయితే రష్యాకే వెళ్లాలి. థాయిలాండ్‌కో, ఇండో చైనాకో వెళ్లి బ్రిటిషు మిలిటరీకి పట్టుబడటంలో అర్థం లేదు. జపాన్‌ సరెండర్‌ అయ్యాక జపాన్‌ వెళ్లటం దండుగ. నేతాజీ తానే వర్ణించినట్టు ఈ ‘తెలియని చోటికి సాహసయాత్ర’ ( Adventure into the unknown)లో ఉన్న రిస్కు మాటేమిటి? జపాన్‌ లొంగిపోయాక జపాన్‌ విమానంలో ప్రయాణం ఎంతవరకు క్షేమం? మధ్యలో ఏమైనా అయితే…? ఇదే మాట నేను అడిగితే- ‘ఏమైనా కానీ! జరిగేది జరిగే తీరుతుంది’ అన్నాడు నేతాజీ.

గడియారం 3 కొట్టింది. ఇక తుది ఏర్పాట్లు మిగిలాయి. వీలయితే మాస్కోకు, లేదా మంచూరి యాకు వెళ్లాలని ఆలోచన. నేతాజీ వెంట ఎవరు వెళ్లాలి? ఆ చిట్టచివరి ఇన్ఫార్మల్‌ మీటింగులో నేతాజీ కాక మేజర్‌ జనరల్‌ కియానీ, మేజర్‌ జనరల్‌ అలగప్పన్‌, కల్నల్‌ హబీబుర్‌ రహమాన్‌, ఎ.ఎన్‌. సర్కార్‌, నేను ఉన్నాము. తాను వెళ్లాక సింగపూర్లో ఉండి ఐఎన్‌ఏ వ్యవహారాలన్నీ చూసుకోవలసిన బాధ్యత కియానీదని నేతాజీ చెప్పాడు. మిగతా పనులు చక్కబెట్టటానికి అలగప్పన్‌, సర్కార్‌లను కూడా సింగపూర్‌లో ఉండిపొమ్మన్నారు. హబీబుర్‌ రహమాన్‌ కేసి చూసి ‘నువ్వు నాదో వస్తావా?’ అని నేతాజీ అడిగాడు. ‘ఎస్‌సర్‌’ అని అతడు బదులి చ్చాడు. మరికాసేపట్లో అక్కడికి చేరుకోనున్న మేజర్‌ స్వామి కాక సింగపూర్‌ నుంచి కల్నల్‌ ప్రీతమ్‌ సింగ్‌, మేజర్‌ ఆబిద్‌ హుస్సేన్‌, బాంగ్‌ కాక్‌ నుంచి దేవనాథ్‌ దాస్‌ కూడా తన వెంట వస్తారని నేతాజీ అన్నాడు. తరవాత ‘అయ్యర్‌ సాబ్‌! నీ మాటేమిటి?’ అని నన్ను అడిగాడు. ‘సర్‌! నాకు మలయా అయినా మాస్కో అయినా ఒక్కటే. నేనూ మీతో వస్తాను’ అని నేనన్నాను. అలా అన్నీ సెటిల్‌ అయ్యాయి. ఇంకో రెండు మూడు గంటల్లో బయలు దేరాలి. నేను వెళ్లి మంచం మీద పడ్డాను. నేతాజీ కంటికి కునుకు లేకుండా అందరికీ అప్పగింతలు చేస్తూ తెల్లవార్లూ పనిచేస్తూనే ఉన్నాడు.

16 వ తేదీ ఉదయం మేము బయలుదేరాము. నేతాజీకి ‘జై హింద్‌’తో వీడ్కోలు ఇవ్వటానికి కియానీ, మరికొందరు ఏరోడ్రోమ్‌కు వచ్చారు. బాంబర్‌ విమానంలో 10 గంటలకు సింగపూర్‌ వదిలి, మధ్యాహ్నం 3 గంటలకు బాంగ్‌ కాక్‌ చేరాము. మేము వస్తున్నట్టు అక్కడ ఎవరికీ ముందుగా తెలియదు. ఆలస్యంగా సమాచారం అందిన మేజర్‌ జనరల్‌ భోంస్లే మేము విమానం దిగిన రెండు గంటల తరవాత వాహనాలు తీసుకుని ఏరోడ్రోమ్‌కు పరుగున వచ్చాడు.

నేతాజీ వచ్చాడన్న వార్త బాంగ్‌ కాక్‌ నగరమంతా పాకింది. ఆ సాయంత్రం నుంచి మరునాడు తెల్లవారే వరకూ ఆయనను కలిసేందుకు ఐఎన్‌ఎ ఆఫీసర్లు, ఐఐఎల్‌ ప్రముఖులు, భారతీయ వ్యాపారులు, ఇతరులు ప్రవాహంలా వస్తూనే ఉన్నారు. మేము బస చేసిన భవనం కాలుబెట్ట సందు లేకుండా విజిటర్లతో కిక్కిరిసి పోయింది. నేతాజీ తదుపరి కార్యాచరణ ఏమిటో తెలుసుకోవాలని అందరికీ కుతూహలం. మేము రాత్రి ఏదో కాస్త తినే సరికి అర్ధరాత్రి అయింది. ఐఎన్‌ఎ, లీగ్‌ అధికారులతో బోస్‌ వివరంగా మాట్లాడాడు. ఇప్పుడు తప్పనిసరై సరెండర్‌ అవుతున్నంత మాత్రాన మనం స్వాతంత్య్ర పోరాటాన్ని వదిలేసినట్టు కాదు. దాన్ని తప్పక కొనసాగిస్తాం. మీరు గుర్తు పెట్టుకోవలసింది ఓటమిని కాదు.. మనం సాధించిన విజయాలను’ అని ఐఎన్‌ఎ ఆఫీసర్లను ఉద్బోధించాడు. తరవాత ఉదయం 5 గంటలకు పక్క మీద వాలి ఒక గంట రెస్టు తీసుకున్నాడు. (ఆగస్టు 17 వ తేదీ) పొద్దున్నే తేలికపాటి లగేజి తీసుకుని, బెల్టుకి రివాల్వర్‌ బిగించి అందరం బయలుదేరాం. నేతాజీ విడిది వద్ద చేరిన ప్రతి ఒక్కరినీ నీళ్లు నిండిన కళ్లతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు.

ఉదయం 8 గంటలకు మేము రెండు విమానాల్లో బాంగ్‌ కాక్‌ నుంచి సైగాన్‌కు బయలుదేరాం. మొదటి విమానంలో నేతాజీ, కల్నల్‌ హబీబ్‌, కల్నల్‌ ప్రీతమ్‌ సింగ్‌, జపనీస్‌ లైజాన్‌ ఆఫీసరు, నేను ఉన్నాము. రెండో దానిలో జనరల్‌ ఇసోడా, జపాన్‌ ప్రభుత్వ రాయబారి హచియ, కల్నల్‌ గుల్జారా సింగ్‌, మేజర్‌ ఆబిద్‌ హుస్సేన్‌, దేవనాథ్‌ దాస్‌ ఉన్నారు. మేము సైగాన్‌ చేరేసరికి 10 అయింది. తరవాత జరగ వలసినదాని గురించి జపాన్‌ అధికారులతో నేతాజీ మాట్లాడాడు. జనరల్‌ ఇసోడా, ప్రభుత్వ ప్రతినిధి హచియ ఆగ్నేయాసియాలో జపాన్‌ సైన్యాధిపతి ఫీల్డ్‌ మార్షల్‌ తెరౌచీ హెడ్‌ క్వార్టర్స్‌ ఉన్న దాలత్‌కు ముందుగా విమానంలో వెళ్లి నేతాజీ తదుపరి ప్రయాణానికి విమాన సదుపాయాల ఏర్పాటు గురించి మాట్లాడాలని నిర్ణయమైంది. వారు అటు వెళ్లారు. మేము రెండు కార్లలో వెళ్లి సైగాన్‌ ఊరుబయట స్థానిక ఐఐఎల్‌ సెక్రటరీ నివాసంలో బస చేశాం.

ఆ రోజు మధ్యాహ్నం ఇసోడా, హచియ, తెరౌచీ కార్యాలయ అధికారి కలిసి కారులో చాలా స్పీడుగా మేమున్న చోటికి వచ్చారు. నేతాజీ ఒక గది లోకి వారిని తీసుకు వెళ్లాడు. హబిబుర్‌ రహమాన్‌ ను కూడా లోపలికి పిలిచాడు. తలుపులు మూసి వారితో మాట్లాడాడు. వారు ఏమి మాట్లాడుకున్నారో నాకు తెలియదు. వచ్చిన వారిని లోపలే ఉంచి నేతాజీ మధ్యలో హబీబ్‌తో కలిసి విసురుగా బయటికి వచ్చి మమ్మల్ని అర్జెంటుగా రమ్మని కేకేశాడు. నన్ను, ఆబిద్‌, దేవనాథ్‌, ఆబిద్‌, హబీబ్‌లను తన గదిలోకి తీసుకువెళ్ళి తలుపు గడియపెట్టాడు. ఆ సమయాన గుల్జారా సింగ్‌, ప్రీతమ్‌ సింగ్‌లో పక్క ఇంట్లో ఉన్నారు. వారిని అర్జెంటుగా రమ్మని కబురు చేశాడు. ‘బట్టలు మార్చుకోనక్కరలేదు. ఉన్నవాళ్లు ఉన్నట్టు రమ్మను. ముఖ్య విషయం మాట్లాడాలి. టైము లేదు’ అని నొక్కి చెప్పాడు. వారు వచ్చేదాకా అసహనంతో వేచి ఉన్నాడు. నేతాజీని అంత కంగారుగా నేను ఎప్పుడూ చూడలేదు. ఆ ఇద్దరూ పరుగున రావటానికి కొద్ది నిమిషాలు కూడా పట్టలేదు. ఆ లోపే ‘ఇంకా రాలేదేం’ అని నేతాజీ చికాకుపడ్డాడు. వాళ్లు రాగానే మళ్లీ తలుపులు గడియపెట్టాడు.

మేమందరంఆత్రంగా నేతాజీ చుట్టూ చేరాం. ప్రతిఒక్కరి మొహం కేసి ఒకసారి చూసి, ‘చూడండి. మనం ఇప్పుడు ఒక ముఖ్య నిర్ణయం తీసుకోవాలి. అది కూడా కొద్ది క్షణాల్లోనే! మరి కాసేపట్లో ఒక విమానం బయలుదేరబోతున్నది. అందులో ఒకటే సీటు మనకు దొరికింది. కనీసం ఇంకొకటి కావాలని నేను అడిగాను. కాని వాళ్లు కుదరదంటున్నారు. మనం వెంటనే తేల్చుకోవాలి. ఉన్న ఆ ఒక్క సీటులో నేను ఒంటరిగా వెళ్లనా? వద్దా? మీరు ఏమంటారు?’ అని అసహనంగా అడిగాడు.

మాకు నోట మాట రాలేదు. అంత భయంకర మైన నిర్ణయం చేయవలసి వస్తుందని ఎవరం కలనైనా ఊహించలేదు. ఎక్కడికో తెలియని ప్రయాణానికి తోడు ఎవరూ లేకుండా ప్రియతమ నాయకుడు ఒక్కడినే పంపటానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. ‘సర్‌! మిమ్మల్ని ఒక్కరిని ఎలా వెళ్లమనగలం? కనీసం ఇంకొక్క సీటు ఇవ్వమని అడగండి. మాలో ఒకరిని దయచేసి వెంట తీసుకువెళ్లండి.’ అని ఒకరు ప్రాధేయపడ్డారు. మా అందరికీ జపాన్‌ వాళ్ల మీద చాలా కోపం వచ్చింది. బాంబర్‌ విమానంలో చోదక సిబ్బందిగాక కనీసం ఆరుగురికి చోటు ఉంటుంది. వారు తలుచుకుంటే ఇంకొక్కరికి చోటు ఇవ్వలేరా? అంతటి మహా నాయకుడిని ఒంటరిగా పంపుతారా?

‘మాట్లాడే సమయం లేదు. అడిగి చూస్తాను. ఒకవేళ ఇంకొకరికి చోటు లేదని వారంటే ఏమి చేయాలి? నేను ఒక్కడినీ వెళ్లనా వద్దా?’ అని రెట్టించి అడిగాడు నేతాజీ.

ఎట్టి పరిస్థితుల్లోనూ నేతాజీ సైగాన్‌లో ఉండ కూడదు. ఉంటే ఏ క్షణమైనా శత్రువులకు చిక్కవచ్చు. అది జరగకూడదు. ఆ విషయంలో మా అందరికీ స్పష్టత ఉంది. సైగాన్‌లో ఉండి ఆయన ఫ్రెంచ్‌ సైన్యానికి పట్టుబడటం కంటే ఏ ప్రత్యామ్నాయమైనా అది ఎంత ప్రమాదభరితమైనా మేలే. ఇక చేయ గలిగింది లేక ‘సర్‌! దయచేసి ఎలాగైనా మాలో ఒకరిని వెంటబెట్టుకు వెళ్లండి. అది కుదరకపోతే మీరు ఒక్కరే వెళ్లండి. కానీ సాధ్యమైనంత త్వరగా మీ వెనకే మేమూ మిమ్మల్ని చేరేందుకు రవాణా ఏర్పాటు చేయమని జపాన్‌ వాళ్లకు గట్టిగా చెప్పండి’ అని మేము ఏడుపు గొంతుతో చెప్పలేక చెప్పాం.

ఇంతకీ నేతాజీ ఎక్కడికి వెళుతున్నాడు? మేము అడగలేదు. ఆయన చెప్పలేదు. కానీ మాకు తెలుసు. మాకు తెలుసని ఆయనకూ తెలుసు. ఆ బాంబర్‌ విమానం మంచూరియా వెళుతున్నది.

అవతల గదిలో నేతాజీ జవాబు కోసం జపాన్‌ వాళ్లు మహా తొందర మీద ఉన్నారు. నేతాజీ, ఆయన వెంట హబీబ్‌ రివ్వున లోపలికి వెళ్లారు. కొద్ది నిమిషాల్లో నేతాజీ బయటికి వచ్చి ‘ఇంకో సీటు దొరికింది. నా వెంట హబీబ్‌ వస్తాడు. మనకు అంతకు మించి చోటు దొరుకుతుందనుకోను. అయినా మన అదృష్టం పరీక్షించుకుందాం’ అన్నాడు. తరవాత నన్ను, కల్నల్‌ గుల్జారా సింగ్‌నూ పిలిచి ‘మీరు కూడా లగేజి తీసుకుని నా వెంట రండి. అదృష్టం బాగుండి ఇంకో రెండు సీట్లు దొరికితే మీరూ రావచ్చు’ అన్నాడు.

అందరం లగేజి తీసుకుని హడావుడిగా పరిగెత్తి కార్లు ఎక్కి మహా వేగంగా ఏరోడ్రోమ్‌ వెళ్లాం. ముందు కారులో నేతాజీ, నేను, హబీబ్‌ ఉన్నాం. మేము వెళ్లేసరికే విమానం ఇంజన్‌ చప్పుడు చెవులు పగిలేలా వినిపిస్తున్నది. అదే విమానంలో వెళ్లబోతున్న లెఫ్టినెంట్‌ జనరల్‌ షిదేయ్‌ అప్పటికే వచ్చి వెయిట్‌ చేస్తున్నాడు. (అతడు మంచూరియాలోని జపనీస్‌ క్వాన్‌ టుంగ్‌ ఆర్మీకి వైస్‌ చీఫ్‌. అక్కడ సరెండర్‌ ఏర్పాట్లను పర్యవేక్షించటానికి వెళుతున్నాడు.) ఆలస్యమయింది,వెంటనే బయలుదేరాలని జపాన్‌ అధికారులు తొందర పడుతున్నారు. కాని రెండో కారు రావటం ఆలస్యమయింది. అందులో ముఖ్యమైన లగేజి ఉంది. అది వస్తే కాని బయలు దేరనని నేతాజీ చెప్పాడు. అది వచ్చేదాకా ఆగి, అందులోని లగేజిని విమానంలోకి ఎక్కించారు (కోట్ల డాలర్లు విలువ చేసే ఐఎన్‌ఎ సంపద అందులో ఉంది. తూర్పు ఆసియా లోని దేశభక్త భారతీయులు తమ దగ్గర ఉన్నదంతా ఊడ్చి స్వాతంత్య్ర పోరాటం కోసం సమర్పించిన ధర్మనిధి అది. తదుపరి పోరాటానికి వినియోగించటానికి సుభాస్‌ చంద్ర బోస్‌ దానిని వెంట తీసుకువెళుతున్నాడు).

ఖాకీ డ్రిల్‌ బుష్‌ షర్టు, ట్రౌజర్స్‌, తళతళలాడే బూట్లు, ఐఎన్‌ఎ కాప్‌, బాడ్జి ధరించిన నేతాజీ చకచకా విమానం దగ్గరికి వెళ్లి జనరల్‌ షిదేయ్‌తో కరచాలనం చేశాడు. ఐసోడా, హచియలకు గుడ్‌బై చెప్పి టార్మాక్‌ మీద సామాన్లు పట్టుకుని నిలబడ్డ మాకేసి తిరిగాడు. కుడిచెయ్యి చాచి ‘జైహింద్‌. తరవాత మళ్లీ కలుద్దాం’ అంటూ అశ్రునయనాలతో గట్టిగా షేక్‌ హాండ్‌ ఇచ్చాడు. రాచఠీవితో నిచ్చెన మెట్లు ఎక్కి లోపలికి వెళ్లాడు. వెంటనే తలుపు మూసుకుంది. విమానం కదిలింది.

 సాయంత్రం 5-15కు సైగాన్లో జపనీస్‌ బాంబర్‌ ప్లేను నేతాజీని తీసుకుని మరలిరాని పయనానికి టేక్‌ ఆఫ్‌ అయింది. ఎక్కడికో తెలియదు. అదే కడపటి వీడుకోలు. అదే అక్కడున్న అందరికీ నేతాజీ ఆఖరి చూపు.

[Unto Him A Witness, S.A.Ayer, 61- 72 ]

మిగతా వచ్చేవారం

About Author

By editor

Twitter
YOUTUBE