పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు.. నగరాలు పట్టణాలు, నాగరికతకు చిహ్నాలు. ఏ దేశ అభివృద్దికైనా నగరాలే ప్రామాణికం. పెద్ద పెద్ద భవనాలు, కార్యాలయాలు, సంస్థలు, రహదారులు నగరాలకు హంగులుగా కనిపిస్తాయి. కానీ అవే కష్టాలకు కారణమవుతున్నాయి. చినుకుపడితే చాలు వణుకుపుడుతోంది. దేశంలో ఏదో ఒక నగరం వరద ముంపులో చిక్కుకుంటోంది. ఇందుకు కారణం ప్రణాళికాబద్ధమైన అభివృద్ది లేకపోవడమే. సరైన డ్రైనేజీ వ్యవస్థ, వరదనీటి కాలువలు, అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం సమస్యలకు దారితీస్తోంది.

వానొస్తే ఆనందం. కానీ ఇప్పుడు చినుకు పడితే ఆందోళన. అది కుండపోతగా మారితే నగరాల ప్రజలకు గుండె దడ. రోడ్లు చెరువులను తలపిస్తాయి. వాహనాలు ఆగిపోయి, ట్రాఫిక్‌ అస్తవ్యస్థమవుతోంది. జనావాసాలు మునిగిపోయి ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. జననష్టం, ఆస్తినష్టం, కరెంటు కోతలతో అదనపు కష్టాలు. అంతా అస్తవ్యస్థం.. నిన్న చెన్నై, మొన్న బెంగళూరు, అంతకు ముందు హైదరాబాద్‌, ‌ముంబై.. మహానగరాలు ఎందుకు మునుగుతున్నాయి? ఏటా ఇవి పునరావృతమవుతున్నా ప్రభుత్వాలు ఎందుకు తీవ్రంగా పరిగణించడం లేదు?

‘నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు’ ఈ నానుడిలో విస్తృత అర్థం ఉంది. పడిన వర్షం చుక్క భూమిలోకి ఇంకుతుంది. వర్షం ఎక్కువైతే ప్రవాహంగా మారి చెరువులు, కుంటల్లో చేరుతుంది. అక్కడి నుంచి కాలువల ద్వారా నదుల్లో కలుస్తుంది. నదులు సముద్రాల్లో కలుస్తాయి. మానవులు తమ జీవనావసరాల కోసం ఆనకట్టలు నిర్మించి వ్యవసాయానికి, తాగునీటికి జలాలను ఉపయోగించుకుంటారు.. ఇది వందలు, వేల సంవత్సరాలుగా జరుగుతున్నా జలవనరులకు, జనావాసాలకు ఒక పరిధి ఉంటుంది. మనిషి స్వార్ధబుద్ధితో ఈ పరిధిని దాటి జలవనరులను కబలించడంతో అసలు సమస్య మొదలవుతోంది. వాన పడినప్పుడు నీరు చెరువులోకి వస్తుంది. కానీ ఆ చెరువు లేకపోతే ఎటు పోవాలి? పల్లానికి ప్రవహించే నీరు కాస్తా వరదరూపం సంతరించుకొని జనావాసాలు ముంచేస్తుంది. ఇప్పుడు జరుగుతోంది ఇదే.

రెండు వారాల క్రితం ఈశాన్య రుతుపవనాల కారణంగా చెన్నై పరిసరాలపై ఏకధాటిగా వర్షాలు పడ్డాయి. కుండపోత వర్షాలకు చెన్నై మహానగరంతో పాటు కాంచీపురం, తిరువల్లూరు, చంగల్పట్టు జిల్లాలు తడిసిమద్దయిపోయాయి. నాలుగైదు రోజుపాటు కొనసాగిన ఈ వర్షాల కారణంగా వేలాది ఎకరాల పొలాల్లో నీరు చేరి భారీ పంటనష్టం జరిగింది. కుండపోత కారణంగా చైన్నై నగర జీవనం స్తంభించిపోయింది. మూడువేలకు పైగా వీధులు జలమయమయ్యాయి. ఆరు వేలకు పైగా జననివాస ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రధాన రహదారులతో పాటు 27 సబ్‌వేలు పూర్తిగా నీట మునిగాయి. మెరినా బీచ్‌ ‌ప్రాంతమంతా సముద్రాన్ని తలపించింది. చెన్నై నగరంలో 18 మంది మరణించారు. రాష్ట్రమంతా కలిపి వంద వరకూ మరణించారు. పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. ఆస్తుల నష్టం ఆపారంగా ఉంటుందని అంచనా వేశారు.

గతం నుంచి ఏం పాఠం నేర్చుకున్నారు?

అక్టోబర్‌లో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభ మైనప్పటి నుంచి తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో 43 శాతం అధిక వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడే అల్పపీడనాల కారణంగా అక్టోబర్‌- ‌డిసెంబర్‌ ‌మధ్య ఉత్తర హిందూ మహాసముద్రంలో తుపానులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఈశాన్య రుతుపవనాలు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌, ‌యానాం, కోస్తాంధ్ర, కేరళ, ఉత్తర కర్ణాటక, లక్షద్వీప్‌లపై ప్రభావం చూపిస్తాయి. ఈ సంవత్సరం కూడా ‘లానినా’ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో ఈశాన్య రుతుపవనాలు బలోపేతమవు తున్నాయి. దీనికి ఉపరితల ఆవర్తనం తోడుకావడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈసారి ఏకధాటిగా నాలుగైదు రోజులు భారీ వర్షం పడటంలో చెన్నై నగరం తట్టుకోలేకపోయింది.

చెన్నైకి వర్షాలు, వరదల చరిత్ర కొత్తేమీ కాదు. 2015లో కూడా ఇదే విధంగా భారీ వర్షాలు మహానగరాన్ని కుదిపేశాయి. నాటి వరదల్లో 300 మంది వరకూ మరణించారు. ఆ చేదు జ్ఞాపకాలను అక్కడి ప్రజలు ఇంకా మరచిపోలేదు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఎదురైనా ప్రాణనష్టం కొంత తగ్గింది. అయితే తమిళనాడు ప్రభుత్వం, చెన్నై నగర పాలక సంస్థ అధికారులు గతం నుంచి గుణపాఠం ఏమీ నేర్చుకోలేదు. ఈ కారణంగానే ప్రస్తుత దుస్థితి ఎదురైంది. ‘2015 వరద పరిస్థితుల నుంచి ప్రభుత్వ యంత్రాంగం తగిన గుణపాఠం నేర్చుకోలేదని స్పష్టంగా అర్థమవుతోంది. నగరంలో నెలకొన్న వరద పరిస్థితులను చూస్తుంటే ఆందోళనగా ఉంది. 2015లో నగరంలో వరద పరిస్థితుల తర్వాత తీసుకున్న చర్యలేంటో చెప్పండి?’ అంటూ మద్రాస్‌ ‌హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పైనా, చెన్నై కార్పొరేషన్‌పైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. వారం రోజుల్లోగా పరిస్థితిని చక్కదిద్ది, భవిష్యత్తు ప్రణాళికలు కూడా రూపొందించకపోతే సుమోటోగా కేసును స్వీకరించి, కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అరియలూరు జిల్లా పెరియతిరుక్కోణం ప్రాంతంలో చెరువు దురా క్రమణలను తొలగించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సంజీబ్‌ ‌బెనర్జీ, న్యాయమూర్తి జస్టిస్‌ ఆదికేశవులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.

అసలు కారణాలు ఇవే..

కర్ణుని చావుకు కారణాలు ఎన్నో అన్నట్లు చెన్నై వరదలకు కారణాలు అనేకం. ఇందులో భౌగోళిక పరిస్థితులు కొంత కారణం అయితే, మానవ తప్పిదాలే అధికం. చెన్నై భౌగోళికంగా భిన్నంగా ఉంటుంది. సముద్ర మట్టంకన్నా కాస్త దిగువకు ఉంటుంది. సముద్ర తీరానికి ఆనుకొని ఉండటంతో విస్తరణ కష్టమైంది. పెరిగిపోతున్న జనాభా ప్రభావం నగరంపై పడింది. ముందుచూపు లేకుండా విచ్చల విడిగా ఇళ్లు, భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేశారు. చెరువులను మాయం చేశారు. వేలిచ్చేరి, లాంగ్‌టాంక్‌ ‌చెరువు ఇప్పుడు కనిపించవు. 1920లో టీ నగర్‌ ‌కోసం పూడ్చేశారు. ఉత్తర చెన్నైలోని వ్యాసార్‌ ‌పాడి చెరువులో ప్రభుత్వ కాలేజీ ఏర్పడింది. చెంబరంపక్కం రిజర్వాయర్‌ ‌నిండినప్పుడల్లా దిగువకు వదిలే నీరు మనప్పకంలోని అడయార్‌ ‌రివర్‌వ్యూ ప్రాంత ప్రజలకు ఇబ్బందులను తెచ్చి పెడుతోంది. పల్లికరనై ప్రాంత చిత్తడి నేలలు నీటిని గ్రహించే స్వభావాన్ని కోల్పోయాయి. అందుకే నీరు త్వరగా ఇంకడం లేదు. జనావాసాలు పెరగడం, జలవన రులు మాయం కావడంతో భారీ వర్షాలు కురిసినప్పు డల్లా డ్రైనేజీలు, వరద కాల్వల మీద భారం పెరుగు తోంది. ఫలితంగా నగరం మునిగిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో చెన్నైని కాపాడుకోవాలంటే నగరంలోని వీధులను రీ డిజైన్‌ ‌చేయాలి. డ్రైనేజీ వ్వవస్థను పూర్తిగా పునర్వ్యవస్థీకరిం చాలి. చెరువులు ఆక్రమణకు గురికాకుండా చూడాలి.

బెంగళూరు పరిస్థితీ ఇంతే..

దేశంలోని ఇతర మహానగరాల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. కొద్ది వారాల క్రితం బెంగళూ రును భారీ వర్షాలు, వరదలు వణికించాయి. ఆగస్టు 14 రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఒక్క రాత్రే 14 సెం.మీ. వర్షం కురవడంతో అతలాకుతల మైంది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి టెర్మినల్‌లోకి వర్షం నీరు ప్రవేశించింది. బెంగళూరులో గత కొన్నేళ్లుగా అడ్డూ అదుపులేని కాంక్రీట్‌ ‌నిర్మాణాల వల్ల చిత్తడి నేలలు, వృక్షాలు అంతరించిపోవడమే వర్షాకాలంలో వరదలకు కారణ మని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌సైన్స్ అధ్యయ నంలో తేలింది. నగర అభివృద్ధిలో భాగంగా పరి వాహక ప్రాంతాలు కుంచించుకుపోయి వ్యర్థాలు పెరిగి ప్రవాహానికి అడ్డుపడటం, నీరు నిల్వ ఉండటం వల్ల లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. బెంగళూ రులో తరచూ వరదలకు గల కారణాలను, నివారణ చర్యలను అన్వేషిస్తూ ఐఐఎస్సీ ఓ అధ్యయనం నిర్వహిం చింది. కొన్నేళ్లుగా ఊహించని పట్టణీకరణ వల్ల ఉపరితల నిర్మాణాలు 78 శాతానికి వృద్ధి చెందాయి.

ముంబైలోనూ..

ఈ ఏడాది జులై మాసంలో దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరం మరోసారి తడిసి ముద్దయింది. మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర, కొంకణ్‌, ‌విదర్బ ప్రాంతాల్లో కురిసిన వర్షాలు నగరంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. శిథిలాలు, బురద కారణంగా వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జలాశయాలు, చెరువులు, కుంటలు నిండిపోయాయి. వరదల్లో జంతువులతోపాటు మనుషులు కూడా కొట్టుకుపోయినట్టు సమాచారం. ఈ పరిస్థితులన్నిటికీ అక్రమ నిర్మాణాలే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

హైదరాబాద్‌ ‌కష్టాలు?

కొద్దిపాటి వర్షం పడ్డా హైదరాబాద్‌ ‌మహానగరం తట్టుకోలేకపోతోంది. చాలా ప్రాంతాల్లో జనావాసాలు మునుగుతున్నాయి. గత ఏడాదితో పాటు ఈ ఏడాది కూడా మూసీ ఉప్పొంగి ప్రవహించింది. హైదరా బాద్‌ ‌వరదలకు ప్రభుత్వాల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నగరంలో ఉన్న మురుగు, వరదనీటి పారుదల వ్యవస్థలు ఒక రోజులో రెండు సెంటీమీటర్ల వర్షపాతాన్ని మాత్రమే తట్టుకోగలు గుతాయి. గత కొన్నేళ్లుగా వర్షాపాతాలు 10-16 సెంటీమీటర్లు మించిపోతున్నాయి.

హైదరాబాద్‌లో ప్రస్తుత డ్రైనేజీ వ్యవస్థ 1920 నాటిది. 1888, 1908 సంవత్సరాల్లో మూసీనదికి వచ్చిన వరదలు అపారమైన ప్రాణ, ఆస్తుల నష్టాన్ని కలిగించాయి. ఆరో నిజాం మహబూబ్‌ అలీఖాన్‌ ‌ప్రఖ్యాత ఇంజినీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నగరానికి పిలిపించారు. 1913లో విశ్వేశ్వరయ్య నగరంలో ఇపుడున్న డ్రైనేజీ వ్యవస్థను డిజైన్‌ ‌చేశారు. అప్పుడప్పుడూ మరమ్మత్తులు తప్పిస్తే అదే వ్యవస్థ కొనసాగుతోంది. ఒకప్పుడు హైదరాబాద్‌ ‌మహానగర పరిసర ప్రాంతాల్లో 530 చెరువులు, కుంటలు ఉండేవి. ఇప్పుడు 190 మాత్రమే మిగిలాయి. ఇవి కూడా చాలా వరకూ కబ్జాల్లో ఉన్నాయి. మాసాబ్‌ ‌ట్యాంక్‌, ‌బతుకమ్మ చెరువుతో పాటు ఎన్నో జల వనరులు ఇప్పుడు కంటికి కూడా కనిపించవు. నాలాలను కూడా వదలకుండా అక్రమ కట్టడాలు వెలిశాయి. ఫలితంగా కొద్దిపాటి వర్షానికే నగరంలోని జనావాసాలు ముగినిపోతున్నాయి.

2000లో పడ్డ భారీ వర్షాలు, వరదలు అపార నష్టం కలిగించడంతో నాటి ప్రభుత్వం దిద్దుబాటు చర్యల కోసం 2003-04లో కిర్లోస్కర్‌ ‌కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక ప్రకారం నగర పరిధిలో ఉన్న చెరువుల చుట్టూ ఎఫ్‌టీఎల్‌ ‌కానీ, ఆ కట్టకింద 9 మీటర్ల బఫర్‌ ‌జోన్‌ ‌కానీ కచ్చితంగా ఉండాలి. కానీ ఇప్పుడు బఫర్‌ ‌జోన్‌ అన్నది పట్టించుకున్నవారే లేరు. సరిగ్గా కట్టకు దిగువనే ఇండ్ల నిర్మాణాలు ఉన్నాయి.

కిర్లోస్కర్‌ ‌కమిటీ సిఫార్సుల ప్రకారం భవిష్యత్తులో హైదరాబాద్‌ ‌వరదల బారిన పడకుండా ఉండాలంటే 390 వరదనీటి పారుదల కాల్వలు నిర్మించాలి. ఉన్నవాటిని పునరుద్ధరించడంతోపాటు వాటిని వెడల్పు కూడా చేయాలి. అక్రమ నిర్మాణాలన్నింటినీ తొలగించాలి. ఇందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీంతో ఆ కమిటీ సిఫార్సులను అమలు చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వంతో సహా ఇప్పటి వరకూ వచ్చిన ఏ ప్రభుత్వానికీ ధైర్యం చాలడం లేదు.

– క్రాంతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE