– క్రాంతి

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు భారత్‌ ‌చేపట్టిన వ్యాక్సినేషన్‌ ఇటీవలే 100 కోట్ల డోసుల మైలురాయి పూర్తి చేసుకొని తాజాగా (నవంబర్‌ 1) 106 ‌కోట్లకు చేరింది. అగ్ర దేశాలతో పోలిస్తే భారత్‌కు త్వరితగతిన టీకాలు ఇచ్చే సామర్థ్యం లేదని, దేశమంతా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేసేందుకు 3, 4 ఏళ్లయినా పడుతుందని విమర్శకులు విశ్లేషించినా, ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమాన్ని సవాలుగా స్వీకరించి ఆచరణతోనే వారికి సమాధానం ఇచ్చారు. భారత ప్రభుత్వం వ్యాక్సినేషనల్‌లో వివక్షకు, వీఐపీ సాంప్రదాయానికి తావు లేకుండా అందరికీ సమానంగా ఇస్తోందని, స్వదేశీ టీకాలపై ప్రజలకు నమ్మకం ఉండటం సంతోషకరమైన విషయమని ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించారు. మరోవైపు రష్యా, బ్రిటన్‌, ‌చైనా, అమెరికా దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. థర్డ్ ‌వేవ్‌ అం‌చనాల నేపథ్యంలో ప్రతిఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ప్రపంచం మీద కరోనా మహమ్మారి పడగ విప్పినప్పటి నుంచీ భారతదేశం భారీ యుద్ధమే చేస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభాలో రెండో స్థానంలో ఉన్న భారత్‌ ‌మొదటి నుంచీ ఈ విషయంలో అప్రమత్తంగానే ఉంటోంది. కరోనా ముప్పు భారత్‌ ‌మీదే అధికంగా ఉంటుందని అంతర్జా తీయంగా నిపుణులు ఆందోళనలు, హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. దీన్ని సవాలుగా స్వీకరించిన కేంద్ర ప్రభుత్వం కట్టడి చేసేందుకు తీసుకున్న చర్యలు ప్రశంసలందుకుంటున్నాయి. 2020 ఆరంభంలో వచ్చిన కరోనా మొదటి దశతో పాటు ఈ ఏడాది ఆరంభం నుంచీ సవాలు విసురుతూ వచ్చిన రెండో దశ తీవ్రతను కూడా గణనీయంగా తగ్గించగలిగాం. ప్రపంచ దేశాల గణాంకాలతో పోలిస్తే మనదేశం కరోనా కేసుల్లో అమెరికా తర్వాత రెండో స్థానంలో, మరణాల్లో మూడో స్థానంలో కనిపిస్తుంది. కానీ జనాభా ప్రాతిపదికన గమనిస్తే అగ్రరాజ్యాలుగా చెప్పుకునే అమెరికా, బ్రిటన్‌, ‌రష్యాతో పాటు కొన్ని యూరప్‌ ‌దేశాలే అత్యధిక ముప్పు ఎదుర్కొన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరించిన పటిష్టమైన వ్యూహంతో కరోనాను కట్టడి చేయగలిగాం. దేశంలోని ఆస్పత్రులు ఎదుర్కొన్న ఆక్సిజన్‌ ‌కొరతను అధిగమించడంతో పాటు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే కార్యక్రమం మొదలైంది. ప్రధాని మోదీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులతో మాట్లాడి అప్రమత్తం చేశారు. ఇవన్నీ సత్ఫలితాలు ఇస్తున్నాయి.

వ్యాక్సినేషన్‌లో ముందడుగు

కరోనా రక్కసిని ఎదుర్కొనేందుకు అగ్ర దేశాలతో పాటుగా భారత్‌ ‌కూడా టీకాలను అభివృద్ధి చేసింది. అమెరికా, బ్రిటన్‌, ‌రష్యా, చైనా దేశాలకు దీటుగా దేశీయంగానే వ్యాక్సిన్‌ అభివృద్ధిని ప్రోత్సహించారు మోదీ. స్వయంగా టీకాల తయారీ కేంద్రాలను సందర్శించారు. కొవాగ్జిన్‌, ‌కొవిషీల్డ్ ‌వ్యాక్సిన్లను సిద్ధం చేసి దశలవారిగా టీకాల పంపిణీ ప్రారంభించారు. మొదటి దశ వ్యాక్సినేషన్‌ ‌పక్రియ జనవరి 16న మొదలైంది. మొదట ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు ఇచ్చారు. ఫిబ్రవరి 2న బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులకు టీకా వేశారు. మార్చి1న 45 ఏళ్ల నుంచి 60ఏళ్ల వారికి ప్రారంభించారు. ఆ తర్వాత ఏప్రిల్‌ 1 ‌నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికి టీకాలు వేశారు. వ్యాక్సినేషన్‌ ‌సమర్ధంతంగా సులభతరంగా సాగేందుకు ‘కొవిన్‌’ ‌మొబైల్‌ ‌యాప్‌ను అందుబాటు లోకి తేవడంతో పాటు, టీకాలు తీసుకున్నవారందరూ తమ మొబైల్‌లోనే ధృవీకరణ పత్రం పొందే అవకాశం కల్పించారు.

కొవిడ్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమానికి మొదట్లో కొన్ని అవరోధాలు కలిగాయి. వ్యాక్సిన్‌ ‌తీసుకోవడానికి కొందరు ఇష్టపడలేదు. ఇందుకు కారణం చాలా వరకూ అపోహలే. మరి కొందరు అప్పటికే కరోనా తీవ్రత తగ్గడంతో తొందరే ముంది నిదానంగా తీసుకో వచ్చనుకున్నారు. కానీ అంతలోనే రెండోదశ కరోనా విరుచుకుపడింది. వైద్యవ్యవస్థ మీద ఒక్కసారిగా భారం పడింది. అప్పటి దాకా టీకాలు తీసుకోవడానికి బద్ధకించిన వారు ఒక్కసారిగా వ్యాక్సినేషన్‌ ‌కేంద్రాలవైపు పరుగులు తీశారు. ఈ తాకిడితో ముందుగా వేసుకున్న అంచనాలు తప్పి వ్యాక్సిన్‌ ‌కొరత ఏర్పడింది. అయితే పటిష్టమైన వ్యూహంతో ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించారు. స్వదేశీ టీకాలతో పాటు ఇతర దేశాల వ్యాక్సిన్లనకు కూడా అనుమతులను ఇచ్చారు. అన్ని చోట్లా, అందరికీ టీకాలు అందుబాటులో ఉంచారు. అంతకు ముందే భారత్‌లో తయారైన వ్యాక్సిన్లను ‘వ్యాక్సిన్‌ ‌మైత్రి’లో భాగంగా ప్రపంచ దేశాలకు కూడా అందించాం.

100 కోట్ల మైలు రాయి

భారత్‌లో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చేపట్టిన బృహత్తర టీకా కార్యక్రమం కీలక మైలురాయిని దాటింది. కేవలం తొమ్మిదంటే 9 నెలల్లోనే అక్టోబర్‌ 21‌న దేశవ్యాప్తంగా 100 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసి అరుదైన కీర్తిని సాధించాం. ఎన్నో అవాంతరాలు, మరెన్నో సవాళ్లను దాటుకుని ఈ ఘనత చేరుకున్నాం. ఈ శతకోటి టీకా ప్రయాణాన్ని ‘ఆందోళన నుంచి భరోసా వరకు’ అని అభివర్ణించారు ప్రధాని మోదీ. దేశంలో 100 కోట్ల డోసుల టీకా పంపిణీ పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని. ‘ఈ ప్రయాణంతో మనం మరింత బలంగా మారాం. 100 కోట్ల డోసులు అనేది కేవలం సంఖ్య కాదు. దేశ సంకల్ప బలం. దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం. నవ భారతానికి ప్రతీక’ అన్నారు నరేంద్రమోదీ.

భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభమైన ప్పుడు ప్రశంసలతో పాటు విమర్శలూ వచ్చాయి. వాటన్నింటికీ తగిన సమాధానం ఇచ్చామన్నారు ప్రధాని మోదీ. టీకాలపై ఎన్ని అపోహలు సృష్టించినా, గందరగోళ పరిస్థితులు ఎదురైనా దేశ ప్రజల విశ్వాసంతోనే ఈ విజయం సాధించగలిగామన్నారు. దేశంలో వ్యాక్సినేషన్‌పై ఎదురైన ఎన్నో ప్రశ్నలు, సవాళ్లకు ‘100 కోట్ల ఘనతే’ సమాధానమని చెప్పుకొ చ్చారు. కరోనా వ్యాక్సిన్ల ద్వారా భారత్‌ ‌శక్తి ఏంటో ప్రపంచానికి చూపించాం. మన ఫార్మా సామర్థ్యం ప్రపంచానికి మరోసారి తెలిసిందన్నారు మోదీ.

కొత్తగా ‘ఏవై.4.2’ కలవరం

భారత్‌లో సెప్టెంబర్‌ ‌చివర లేదా అక్టోబర్‌లో థర్డ్‌వేవ్‌ ‌ముప్పు ఉంటుందని వైద్య నిపుణులు అంచనా వేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌తో పాటు, తీసుకుంటున్న జాగ్రత్తల కారణంగా ఇప్పటి వరకూ ఆ పరిస్థితి రాలేదు. కానీ ప్రమాదం ఇంకా పొంచే ఉంది. కొత్తగా కరోనాలో డెల్టా ఉపరకం ‘ఏవై.4.2’ కలవరం పుట్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రష్యా, చైనా, బ్రిటన్‌తో పాటు అమెరికాలోనూ మరోసారి పెద్ద సంఖ్యలో కరోనా కేసులు మొదలయ్యాయి. రష్యాలో రికార్డు స్థాయిలో విజృంభిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసులు, మరణాలు వెలుగు చూస్తున్నాయి. చైనాలో యుద్ధ వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికాలో వ్యాక్సినేషన్‌ ‌జోరుగా సాగుతున్నా కేసుల తగ్గుదలలో ఎలాంటి మార్పులేదు. ప్రపంచ వ్యాప్తంగా మరోసారి ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. పలు దేశాలు కొవిడ్‌ ఆం‌క్షల్ని కఠినతరం చేస్తున్నాయి. మరికొన్ని ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో భారత్‌లోనూ కలవరం మొదలైంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌, ‌మహారాష్ట్రల్లో కరోనా మహమ్మరి కొత్త వేరియంట్‌ ‌కలకలం సృష్టిస్తుంది. ఇప్పుడిప్పుడే కరోనా క్షీణిస్తున్నదని భావిస్తున్న తరుణంలో కొత్త వేరియంట్‌ ‌కేసులు ఒక్కసారిగా భారత్‌ను ఉలిక్కిపడేలా చేశాయి. మొన్నటి వరకు డెల్టా వేరియంట్‌, ‌డెల్టా ప్లస్‌ ఉత్పరి వర్తన పట్ల భయం వ్యక్తం కాగా ఇప్పుడు ‘ఏవై.4.2’ వేరియంట్‌ ‌వణికిస్తుంది.

ముప్పు పూర్తిగా తొలగిపోలేదు: ప్రధాని

 ఓ వైపు పండుగల పేరుతో నిబంధనలు గాలికొదిలేస్తూ రద్దీగా తిరిగేస్తున్న జనం.. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో నామమాత్రంగా సాగుతోన్న టీకా పంపిణీ.. ఇవన్నీ చూస్తుంటే కరోనా మూడో దశను మళ్లీ ఆహ్వానిస్తున్నామా? అన్నట్లు ఉన్నాయి దేశంలో తాజా పరిస్థితులు. మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోనేలేదు. 100 కోట్ల వ్యాక్సిన్‌ ‌డోసులను పంపిణీ చేసినప్పటికీ ఇంకా ముప్పు ఉందని హెచ్చరించారు ప్రధాని మోదీ. కరోనా నిబంధనలను మరవొద్దని అన్నారు.

టీకాల వృథాయే సమస్య

దేశవ్యాప్తంగా నవంబర్‌ 1‌న 106 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశారు. ఈ ఏడాది చివరికల్లా అర్హులైన 94 కోట్ల మందికి రెండు డోసుల పంపిణీ పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్‌లోనే లక్ష్యం పూర్తయింది. అయితే పండుగల సందర్భంగా అక్టోబర్‌లో వ్యాక్సినేషన్‌ అం‌తంత మాత్రంగానే సాగింది. సెప్టెంబరులో 24 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేయగా.. గత నెల అది 17 కోట్ల దిగువకు పడిపోయింది. ముఖ్యంగా దసరా పండగ రోజుల్లో చాలా రాష్ట్రాల్లో టీకా పంపిణీ నిలిచిపోయింది. దీంతో డోసుల పంపిణీ తగ్గింది. అక్టోబర్‌ ఒకటో తేదీ నాటికి రాష్ట్రాల వద్ద 5 కోట్ల డోసుల నిల్వలు ఉన్నాయి. అయితే గత నెల పంపిణీ నెమ్మదించడంతో ఈ నిల్వలు కూడా పేరుకు పోయాయి. ఇప్పటివరకు రాష్ట్రాల వద్ద 13 కోట్లకు పైగా డోసులు, ప్రైవేటు ఆసుపత్రుల వద్ద దాదాపు 2 కోట్ల డోసులు నిల్వ ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. దీంతో రాష్ట్రాల తీరుపై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తంచేసింది. ఒకప్పుడు టీకాల కొరతపై ప్రశ్నించిన రాష్ట్రాలు.. ఇప్పుడు సరిపడా డోసులు అందుబాటులో ఉన్నా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంలేదు.

మరోవైపు ఇప్పటికే చాలా దేశాలు బూస్టర్‌ ‌డోసును మొదలుపెట్టాయి. కానీ మన దగ్గర మాత్రం అక్టోబర్‌ ‌నెలతో పోలిస్తే డోసుల పంపిణీ 25శాతం మేర తగ్గింది. రాష్ట్రాల వద్ద ఉన్న టీకాల నిల్వలు మూడు రెట్లు పెరిగాయి. అందుకే స్వయంగా ప్రధాన మంత్రి మోదీ రంగంలోకి దిగి టీకా పంపిణీపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. నవంబరు 2 నుంచి టీకా పంపిణీ తక్కువగా ఉన్న జిల్లాలో ఇంటింటి వ్యాక్సినేషన్‌ ‌డ్రైవ్‌ ‌చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇంకా ఒక్క డోసు కూడా తీసుకోని వారి ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్‌ ‌వేయించుకునేలా వారికి సర్దిచెప్పి అక్కడే టీకాలు ఇవ్వాలని భావిస్తోంది. అలాగే రెండు డోసులు తీసుకున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో రెండో డోసు పంపిణీపై ప్రత్యేక దృష్టిపెట్టనుంది.

భారత్‌ ‌టీకా పత్రానికి గుర్తింపు!

భారత్‌లో కరోనా టీకా తీసుకున్నప్పుడు జారీచేసే గుర్తింపు పత్రాన్ని గుర్తించేందుకు ఇటీవలి వరకూ కొన్ని దేశాలు నిరాకరించాయి. కరోనాతో అల్లకల్లోల మైన పరిస్థితులు సాధారణానికి చేరుకుంటున్న క్రమంలో ఆయా దేశాలు దశలవారీగా ఆంక్షలు ఎత్తేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ రాకపోకలను సులభతరం చేసేందుకు వ్యాక్సిన్‌ ‌తీసుకున్నట్లు గుర్తింపు పత్రం అవసరం. ఇది ఉంటే ఆయా దేశాలకు వెళ్లినప్పుడు క్వారంటైన్‌ ‌నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే కొన్ని దేశాలు మనదేశం జారీచేసే సర్టిఫికెట్‌ను అంగీకరించ లేదు.

మొదట్లో బ్రిటన్‌తో ఈ చిక్కులు ఏర్పడ్డాయి. క్వారంటైన్‌ ‌నిబంధనల విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం దీటుగా స్పందించడంతో ఆ దేశం దిగొచ్చింది. అక్టోబర్‌ ‌ప్రారంభంలో హంగేరీ, సెర్బియా తదితర దేశాలూ భారత్‌ ‌టీకా పత్రాన్ని గుర్తించాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇటీవల తన ఇటలీ పర్యటనలో భాగంగా టీకా ధ్రువపత్రాల పరస్పర గుర్తింపు అంశంపై యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు విదేశాంగ తెలిపింది. ఈ క్రమంలో భారత్‌ ‌కొవిడ్‌ ‌టీకా ధ్రువపత్రాన్ని అధికారికంగా గుర్తించిన దేశాల జాబితాలో తాజాగా మరో అయిదు దేశాలు చేరాయి. ఎస్తోనియా, కిర్గిస్తాన్‌, ‌స్టేట్‌ ఆఫ్‌ ‌పాలస్తీనా, మారిషస్‌, ‌మంగోలియా ఇందులో ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కొవాగ్జిన్‌ ‌టీకాను ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా గుర్తించింది.

కరోనా వ్యాక్సిన్‌ ‌తీసుకున్నవారు ప్రయాణించేం దుకు భారత ప్రభుత్వం ఇటీవల 28 దేశాలతో ‘ఎయిర్‌ ‌బబుల్‌’ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా.. ఆయా దేశాలకు ప్రత్యేక విమాన సర్వీసులను నడుపుతున్నారు.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE