– ఎం.వి.ఆర్. శాస్త్రి
‘‘నేతాజీ! యుద్ధంలో ఓడిపోయాం. మళ్లీ పుంజుకుని పోరాడే ఆశా లేదు. ఇక మన పోరాటం దేనికోసం?’’ అని అడిగాడు ఇంఫాల్ పరాజయం తరవాత కల్నల్ ధిల్లాన్.
‘‘స్వాతంత్య్రానికి మూల్యం చెల్లించటానికి’’ అని బదులిచ్చాడు నేతాజీ.
స్వాతంత్య్రాన్ని కోరుకునే భారతీయుల నెత్తురు ప్రవహించినప్పుడు భారతదేశానికి స్వాతంత్య్రం వస్తుందని నేతాజీ ఎప్పుడూ చెప్పే మాట నాకు ఆ సమయాన గుర్తొచ్చింది. మన జాతీయ ధ్యేయం స్వాతంత్య్రం సాధించటం. మన మిలిటరీ లక్ష్యం దానికి నెత్తురు మూల్యం చెల్లించటం అని నాకు తేటతెల్లమైంది- అంటాడు ధిల్లాన్.
ఇంఫాల్ యుద్ధంలో విఫలమయితే చివరి సైనికుడు నేలకొరిగే వరకూ పోరాడాలి. ఆఖరు రక్తపు బొట్టును దేశం కోసం చిందించాలి. తమ అసమాన త్యాగంతో, అనన్య శౌర్యంతో భారతీయులను కదిలించాలి. బ్రిటిష్ సైన్యంలోని భారత సైనికులలో దేశభక్తిని పురికొల్పి తిరుగుబాటును తేవాలి. ఇదే నేతాజీ మొదటినుంచీ నొక్కి చెప్పింది. ఇంఫాల్ ఆపరేషన్లో గెలిచే ఆశ లేదని జనరల్ కవాబే తనకు చెప్పినప్పుడు, ‘‘జపాన్ యుద్ధాన్ని ఆపినా మేము కొనసాగిస్తాము. మా మాతృభూమి విమోచన కోసం మేము చేసే ప్రయత్నాలన్నీ విఫలమైనా మేము పశ్చాత్తాపపడము. సైనికుల మరణాలు, సరఫరాల సమస్యలు, కరవులు పోరాటం ఆపేందుకు కారణాలు కాజాలవు. మొత్తం విప్లవ సైన్యం అంతరించి పోయినా మా ప్రయాణం ఆగదు.’’ అని చాటినవాడు నేతాజీ. అలాంటి మహానాయకుడే తన సైన్యాన్ని పోరాటం విరమించి వెనక్కి రమ్మని ఒక దశలో ఆదేశించక తప్పలేదు. దానికి కారణాలు అనేకం.
ఇంఫాల్ యుద్ధంలో ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు చూపిన పరాక్రమం శత్రువులను సైతం ఆశ్చర్యపరచిన మాట వాస్తవం. కలాదన్, హాకా, తిడ్డిమ్, బిషెన్‌పూర్, పలేల్, కొహిమా – ఇలా తమకు అవకాశం దొరికిన ప్రతి రంగంలోనూ వారు బలవంతుడైన శత్రువును వెంటపడి, తరిమివేయ గలిగారు. ఒక్క పలేల్ వైఫల్యం (దానికి కూడా జపాన్ వాళ్లు మాట నిలుపుకోక పోవటం కారణం) మినహా ఏ రంగంలోనూ ఐఎన్‌ఎ వెనుదిరగడమంటూ ఎరగదు. సుభాస్ బ్రిగేడ్ కోహిమా చుట్టూ కొండలమీద త్రివర్ణపతాకాన్ని గర్వంగా ఎగుర వేసింది. గాంధీ, ఆజాద్ బ్రిగేడ్‌లు దాదాపు 250 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకు వెళ్లగలిగాయి. అక్కడ ఆజాద్ హింద్ ప్రభుత్వం కొన్నాళ్ళయినా నడిచింది. స్థానిక ప్రజలు దానిని ‘నయీ సర్కార్’ అని ఇష్టంగా పిలిచేవారు. తమ మధ్య వివాదాలను విచారించి ఆ సర్కారు చేసిన పరిష్కారాలకు ఐచ్ఛికంగా కట్టుబడేవారు. ఇలా ప్రజాబలం, ధైర్యం, శౌర్యం పుష్కలంగా ఉన్నా దురదృష్టం కొద్దీ ఐఎన్‌ఎకి విధి వక్రించింది.
ఇండియన్ నేషనల్ ఆర్మీ సుభాస్ చంద్రబోస్ అగ్నేయాసియా చేరటానికి ముందే ఏర్పాటయింది. యుద్ధఖైదీలుగా ఉండి జపాన్ వాళ్లు పెట్టే క్రూరమైన బాధలు తప్పించుకోవటం కోసం ఆపద్ధర్మంగా దానిలో చేరినవారే ఎక్కువమంది. అలాంటి అవకాశ వాదులలో సైతం అత్యధికులను నేతాజీ తన సమ్మోహనశక్తితో సిసలైన దేశభక్తులుగా తీర్చిదిద్ద గలిగాడు. కాని బ్రిటిష్ సర్కారు అంటే భయమో భక్తో జాస్తి అయినవారూ ఐఎన్‌ఎ శ్రేణుల్లో కొందరు మిగిలారు. ఇంఫాల్ సెక్టారులో శత్రుసేనలు ఎదుట పడ్డప్పుడు నేతాజీ ప్రేరణ వల్ల బ్రిటిష్ ఆర్మీలోని పలువురు భారతీయ సైనికులు ఐఎన్‌ఎ శ్రేణుల్లో కలిసినట్టే – అటువైపు ప్రాపగాండాకు, ప్రలోభాలకు లోబడి ఐఎన్‌ఎ నుంచి బ్రిటిషు ఆర్మీలోకీ కొందరు ఫిరాయించారు. వారినుంచి శత్రు స్కంధావారం గుట్టుమట్లను తెల్లవాళ్లు రాబట్టారు.
ఇంఫాల్, కోహిమాలలో జపాన్ ముట్టడికి ఉక్కిరిబిక్కిరై, దిగ్బంధం నుంచి బయటపడే ఆశ లేక మిత్రరాజ్యాల సేన లొంగిపోవటానికి సిద్ధమైన తరుణమది. ఆహార సరఫరా సమస్య వల్ల ఆకలిచావుల కంటే లొంగుబాటు మేలని తాము అనుకుంటూ ఉంటే తమకు మించిన సరఫరాల సమస్య శత్రువులనూ బాధిస్తున్నదన్న రహస్యం ఫిరాయింపుదారుల ద్వారా సర్కారుకు తెలిసింది. శత్రు శిబిరం బలహీనతలూ, జపాన్ సైన్యానికీ, ఐఎన్‌ఎకీ నడుమ వైరుధ్యాల సంగతి ఉప్పందాక బ్రిటన్ తెప్పరిల్లింది. విమాన వాహక నౌకలు రేవులకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టేవరకూ ఎలాగో ఓర్చుకుంటే ముట్టడి గండం నుంచి బయటపడ గలమన్న నమ్మకం కలిగింది. దాంతో లొంగిపోయే ఆలోచన మానుకుని బ్రిటిష్ సేనలు పళ్ళబిగువున పోరాడాయి. అక్కడినుంచీ యుద్ధగతి మారి, జపాన్ పతనం మొదలైంది.
సరిగా అదే సమయాన వర్షాలు ఆ ఏడు ముందుగా ముంచుకొచ్చాయి. సేనలకు నిత్యావసర సరకుల రవాణాకు ఉన్న నాటు రహదారులు జడివానలకు కొట్టుకుపోయాయి. ఆహారం, మందుల సరఫరా ఆగిపోయింది. ఉన్న రేషన్లు, మందులు నిండుకున్నాయి. సైనికులు చుట్టుపక్కల నాగా గ్రామాల నుంచి వడ్లు తెచ్చుకుని అడవి గడ్డితో కలిపి ఉడక బెట్టుకుని తిని కడుపు నింపుకునేవారు. రుచికోసం చిటికెడు ఉప్పయినా దొరికేది కాదు. వారాల తరబడి ఇదే తిండి తినటం వల్ల సైనికుల సత్తువ క్షీణించింది. దీనికి తోడు ఆ ప్రాంతమంతటా అడవి ఈగలు జాస్తి. ఎవరికి ఏ కాస్త దెబ్బతగిలి పుండు అయినా దానిమీద ఈగలు వాలేవి. కాసేపట్లో పుండ్లలో వందలకొద్దీ పురుగులు చేరేవి. యమయాతన భరించలేక కొందరు బాధితులు ‘జైహింద్’ అంటూ తమను తాము తుపాకీతో కాల్చుకునే వారు. ఇన్ని బాధలు పడుతున్నా వెనక్కి మరలాలన్న ఆలోచనే ఎవరికీ రాలేదు.
అలాంటి పరిస్థితుల్లో జూన్ 4న జపాన్ సేనల ప్రాంత కమాండర్ జనరల్ సాటో ఐఎన్‌ఎ సుభాస్ బ్రిగేడ్ కమాండర్ షా నవాజ్ ఖాన్‌ని పిలిచి ‘ఇక ఇక్కడ ఉండలేము. మేము వెనుతిరిగి ఉఖ్రుల్‌కి వెళ్ళిపోతున్నాం. మీరూ మాతో వచ్చేయండి’ అన్నాడు. ‘అది కుదరదు. ప్రతి పోరులో శత్రువును గెలిచి కోహిమాలో మా జెండా ఎగరేశాక ఇప్పుడు దాన్ని పీక్కుని వెనక్కిపోవటం మా వల్ల కాదు’ అని షా నవాజ్ తిరస్కరించాడు. ‘మనం పోరాటం ఆపలేదు. ఉఖ్రుల్ వెళుతున్నది అక్కడి నుంచి ఇంఫాల్ మీద దాడి చేయటానికి’ అని మభ్యపెట్టి షానవాజ్‌ను సాటో ఒప్పించాడు. అష్టకష్టాలు పడి తీరా ఉఖ్రుల్ చేరాక, అక్కడికి రేషన్ల సరఫరా లేదని చెప్పి అటునుంచి తామూ అనే చోటికి తరలించారు. తీరా అక్కడికి వెళ్ళాక ‘ఇంకా పోరాటం మా వల్ల కాదు. యుద్ధం చాలించి వెనక్కి పోతున్నాం’ అని అసలు సంగతి చల్లగా చెప్పారు.
సుభాస్ బ్రిగేడ్ సైనికులు ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మొదలెట్టిన యుద్ధాన్ని మధ్యలో ఆపటం మనకు అప్రతిష్ట. ఇటునుంచి పలేల్ రంగానికి వెళ్లి అక్కడి మన గాంధీ, ఆజాద్ బ్రిగేడ్లతో కలిసి శత్రువుపై పోరాడుతూ మరణించటమే మనకు మర్యాద. వెనక్కి మాత్రం పోవద్దు’ అని బ్రిగేడ్ ఆఫీసర్లు గట్టిగా కోరారు. కమాండర్ షానవాజ్ ఖాన్ వారి డిమాండుకు అంగీకరించాడు. అది తెలిసి, జపనీస్ కమాండర్ ‘తక్షణం కలగజేసుకుని మీ వాళ్లకు దయచేసి నచ్చజెప్పండి’ అంటూ నేతాజీకి జరూరు విన్నపం పంపించాడు.
అదే సమయాన జపాన్ సైన్యాధికారి మేజర్ ఫుజివారా కూడా గాంధీ, ఆజాద్ బ్రిగేడ్ల డివిజనల్ కమాండర్ మహమ్మద్ జమాన్ కియానీకి ఇలాగే నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. ‘త్వరలో అన్ని రంగాలలోనూ సేనల ఉపసంహరణ జరగబోతున్నది. కాబట్టి మీరు కూడా వెనక్కి మరలండి’ అని అతడంటే కియానీ ‘మేము దానికి చచ్చినా ఒప్పుకోం. భారతభూమిలో ఇప్పటికే 150 మైళ్ళు చొచ్చుకు వెళ్ళాము. ప్రాణం ఉన్నంతవరకు ఇంకా ముందుకే పోతాము. వెనక్కి మళ్లే ప్రసక్తే లేదు’ అని కరాఖండిగా చెప్పాడు.
షానవాజ్ ఖాన్ కైనా, కియానీ కైనా ప్రేరణ వారిలో నేతాజీ నింపిన విప్లవ స్ఫూర్తే. అది తెలుసు కాబట్టి ఫుజివారా నేరుగా నేతాజీ దగ్గరికే వెళ్లి సేనల ఉపసంహరణకు ఆయన సహాయం అభ్యర్థించాడు. సైనికులను ఉత్సాహపరచటానికి పైకి ఎంత ఆశాభావం వ్యక్తపరచినా సుభాస్ చంద్రబోస్‌కు ఇంఫాల్ సంగ్రామం మీద భ్రమలేమీ లేవు. 1944లో ఆరకన్, ఇంఫాల్, కోహిమా ఆపరేషన్లలో మిత్రరాజ్యాల సైనికుల సంఖ్య 1,55,000 కాగా జపాన్ సైనికుల సంఖ్య అందులో సగం కంటే కొంచెం ఎక్కువ (87,000). రంగంలో నిలిచి పోరాడే అవకాశం దక్కిన ఐఎన్‌ఎ సైనికుల సంఖ్యేమో జపాన్ బలగంలో పదో వంతు కంటే తక్కువ (8,000). అవకాశం దొరికిన మేరకు శౌర్య పరాక్రమాలను నిరూపించుకోగలదే తప్ప సొంతంగా యుద్ధంలో గెలిచే శక్తి ఐఎన్‌ఎకి లేదు. మిలిటరీ పరంగా అది జపాన్ కాంపైను. సంఖ్యాపరంగానూ, ఆయుధ పాటవం లోనూ, అసలైన వైమానిక బలంలోనూ శత్రువు ముందు జపాన్ తూగలేదు. పైగా జపాన్ సేనానాయకుల ప్రయోజకత్వమూ నేతాజీకి బాగా తెలుసు. మూర్ఖపు ముట్టడి బెడిసికొట్టి ఇంఫాల్ యుద్ధంలో జపాన్‌కి శృంగభంగం తప్పదని ఆయన ముందే ఊహించాడు.
వాస్తవ పరిస్థితి తనకు తెలియనివ్వకుండా జపాన్ వాళ్లు దాచిపెడుతున్నారని గ్రహించి నిజనిర్ధారణ కోసం నేతాజీ అప్పటికే ఎ.సి.చటర్జీ నాయకత్వంలో ఒక బృందాన్ని రంగానికి పంపించాడు. సైనికులకు జీతాల చెల్లింపులకు, అవసరమైన కొనుగోళ్లకు సరిపడా డబ్బు, లారీల్లో సరకులు, మందులు, మరమ్మతుల సామాగ్రి వగైరాలు వేసుకుని వారు బయలుదేరారు. రేషన్లు అందక, మందులు దొరకక, జపాన్ వాళ్లు సహకరించక మనవారు పడుతున్న అవస్థలను- గడ్డి గాదం, దొరికిన దుంపలు, ఆకులు, అలములు, వడ్లు ఉడకేసి తింటూ, మలేరియా వంటి జబ్బుల పాలవుతూ, నడుము లోతు బురదలో నడుస్తూ వీరజవాన్లు పడుతున్న అగచాట్లను వారు ప్రత్యక్షంగా గమనించారు. రంగం వెళ్ళాక ఇస్తామని చెప్పిన టెలిఫోన్లు, వైర్లెస్ కమ్యూనికేషన్లు జపాన్ సోదరులు సమకూర్చనందువల్ల డివిజన్ కమాండ్ నుంచి ఆదేశాల కోసం ప్రమాదభరిత యుద్ధ ప్రాంతాల గుండా మైళ్ళ దూరం మనుషులు వర్తమానాలు అందజేసుకోవలిసి రావటం వంటి సమస్యలను వారు అర్థం చేసుకుని తిరిగి వెళ్ళాక నేతాజీకి వివరంగా రిపోర్టు ఇచ్చారు. జూలై వచ్చేసరికి మలేరియా లాంటి జబ్బులు ప్రబలి, మందులు లేక, తిండి దొరకక సైనికుల బతుకు దుర్భరమయింది. నీటి ప్రవాహాల్లో దోమతెరలతో చేపలు పట్టుకుని, అక్షరాలా అడవి గడ్డి తిని ఆ సమయాన ఎన్ని పాట్లు పడ్డదీ నాగసుందరం అనే తమిళుడు వర్ణించాడు. భయానక బాధలు పడలేక గాంధీ బ్రిగేడ్‌లో నెంబర్ టూ గా ఉన్న మేజర్ బి.జె.ఎస్. గరేవాల్ బ్రిటిష్ శిబిరంలో చేరిపోయాడు. అతడి ద్వారా ఆనుపానులు రాబట్టి మొత్తం రెజిమెంటును నాశనం చేయబూనిన బ్రిటిష్ ఆర్మీ బారి నుంచి బయటపడేసరికి తలప్రాణం తోక కొచ్చింది. (విద్రోహానికి పాల్పడ్డ గరేవాల్ యుద్ధం తరవాత లాహోర్ నడివీధిలో హత్యకావించబడ్డాడు.)
మేజర్ ర్యాంకు వాడు ద్రోహానికి పాల్పడ్డా సామాన్య సిపాయిలు బ్రిటిషు సర్కారు ప్రలోభాలకు పెద్దగా లొంగిపోలేదు. ‘‘ఐఎన్‌ఎ సోదరులారా! తిండిలేక, మందులు దొరకక, నానా బాధలు పడుతూ ఎన్నాళ్ళు ఇలా ఉంటారు? మీ భార్యాబిడ్డలు మీ గురించి తల్లడిల్లుతున్నారు. మా వైపు వచ్చెయ్యండి. మీకు మంచి ఆహారం, వైద్య సదుపాయం దొరుకుతాయి. మీకు జీతం పెంచుతాం. రివార్డులు, 3 నెలల సెలవు కూడా ఇస్తాం.’’ అంటూ బ్రిటిషు కమాండర్ ఇన్ చీఫ్ సంతకంతో ఉన్న కరపత్రాలను విమానం నుంచి ఐఎన్‌ఎ శిబిరాల వైపు వెదజల్లేవారు. కాని మన సైనికులు ‘‘బ్రిటిషు బానిసల్లా సుఖపడేకంటే స్వాతంత్య్ర సైనికులుగా గడ్డితిని బతకటం మేలు’’ అని చెప్పి ఏరికోరి దురవస్థలు పడ్డారు.
తిరోగమనానికి తన సేనలను ఒప్పించమని మేజర్ ఫుజివారా తన దగ్గరికి వచ్చినప్పుడు నేతాజీ దృష్టిలో ఇవన్నీ ఉన్నాయి. ఆయన పట్టుబట్టి జపాన్ మీద ఒత్తిడి పెట్టి ఇంఫాల్ యుద్ధానికి పురికొల్పింది జపాన్ సౌజన్యంతో ఆ యుద్ధాన్ని గెలిచి భారతదేశ కిరీటాన్ని చేజిక్కించుకోవాలన్న యావతో కాదు. గెలుపు, ఓటముల మీద ఆయనకు ధ్యాస ఎప్పుడూ లేదు. భారత ప్రజలు చూస్తుండగా స్వాతంత్య్ర సమర సైనికులు సామూహికంగా ఆత్మార్పణ చేసేందుకు మహాదవకాశంగానే నేతాజీ ఆ యుద్ధాన్ని తలచాడు. ఆజాద్ హింద్ ఫౌజ్‌ను ఒక పెద్ద ఆత్మాహుతి దళంగా ఆయన పలుమార్లు వర్ణించాడు. స్వాతంత్య్రం కోసం తాను సంకల్పించిన ఆత్మాహుతికి ఇది సమయమా అన్నదే ఇప్పుడు నేతాజీ ముందున్న ప్రశ్న.
ఇంఫాల్ ఆపరేషన్‌లో ఎదురుదెబ్బల కబురు తెలియగానే మిగిలిన రెండు ఐఎన్‌ఎ డివిజన్లనూ అవశ్యం రంగానికి తరలించనివ్వమని జనరల్ కవాబే ని బోస్ కోరాడు. దానికి అతడు ఒప్పుకోలేదు. తాను అనుకున్న ప్రకారం మొత్తం మూడు డివిజన్లూ 30 వేల ఇఎన్‌ఎ సైనికులూ రంగంలో ఉండి ఉంటే ‘వెనక్కి తిరిగి రాకండి. స్వాతంత్య్రం కోసం చివరి మనిషి నేలకొరిగేంత వరకూ పోరాడండి’ అని బహుశా నేతాజీ నిస్సంకోచంగా ఆనతిచ్చి ఉండేవాడే. కాని రణరంగంలో ఉండేందుకు ముందో వెనకో అవకాశం చిక్కింది మొత్తం సైన్యంలో మూడో వంతుకు మాత్రమే. వారిలోనూ కొంతమందికి ప్రత్యక్షంగా పోరాడే వీలు లేకుండా రోడ్లు వేయటం, వంతెనలు మరమ్మతు చేయటం, మంటలు ఆర్పటం, మూటలు మోయటం, ఎడ్లబండ్లు నడపటం వంటి డ్యూటీలు వేశారని జపనీస్ కమాండర్ల మీద నేతాజీకి షా నవాజ్ ఖాన్ ఏప్రిల్‌లోనే ఫిర్యాదు చేశాడు. మూడింట రెండు వంతుల సైన్యానికి యుద్ధంచేసే అవకాశమే రాక, ముందస్తు వర్షాలు వచ్చిపడ్డ అస్తవ్యస్త పరిస్థితుల్లో రంగంలో మిగిలిన 6 వేల మందిని ఆత్మాహుతికి పురికొల్పటం పాడి కాదని బోస్ భావించాడు. అందుకే ‘ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వచ్చెయ్యండి’ అని తన సేనలను ఆదేశించాడు.
తమను వెనక్కి రమ్మంటున్నారని చెబితే ఐఎన్‌ఎ సైనికులు నమ్మలేదు. నేతాజీ అలా అని ఉండడు. జపాన్ వాళ్ళే ఆయన పేరు చెప్పుకుని ఏదో మోసం చేస్తున్నారు. ఎన్ని బాధలైనా పడి చావనైనా చస్తాము కాని వెనక్కి పోయి నేతాజీకి మొగం చూపించలేము- అని మొండికేశారు. సాక్షాత్తూ నేతాజీ నుంచే ఆ ఆదేశం వచ్చిందనటానికి తమ కమాండర్లు రుజువులు చూపిస్తే అందరూ గొల్లున ఏడ్చారు. మొదటి డివిజన్ సేనలన్నిటినీ వెనక్కి మరలమని జూలై 18న కమాండర్ కియానీ ఉత్తర్వు చేశాడు. వైఫల్యానికి బాధ్యత వహించి ప్రధాని పదవికి రాజీనామాను జూలై 26న చక్రవర్తికి టోజో సమర్పించాడు. చేసిన పోరాటాలను, సాధించిన విజయాలను నెమరు వేసుకుంటూ బరువెక్కిన గుండెతో, విషణ్ణ వదనాలతో కోహిమా, చమోల్ నుంచి ఫాలం, కలాదాన్ దాకా మొత్తం అన్ని రంగాలనుంచి మొత్తం సేనలు ఇంటిదారి పట్టాయి. కాలే కడుపులతో కాళ్ళు ఈడ్చుకుంటూ వందల మైళ్ళ నడకలో సైనికుల దుర్భర వ్యధ షానవాజ్ ఖాన్ మాటల్లో:
‘‘అప్పుడు మేము పడినన్ని కష్టాలు బహుశా ప్రపంచంలో ఏ సైన్యమూ పడి ఉండదు. కుండపోత జడివానలకు దారులన్నీ కొట్టుకు పోయాయి. మోకాలు లోతు బురదలో అడుగు తీసి అడుగు వేయటం కష్టం. చాలామంది మలేరియా, అతిసార వ్యాధుల బారిన పడ్డారు. ఎవరికీ సత్తువ లేదు. ఒకరికి సహాయం చేసే స్థితిలో ఎవరూలేరు. ఆకలితో, జబ్బులతో నేలకూలిన జపనీస్, ఇండియన్ సైనికుల శవాలు వెళ్ళే దారికి అటూ ఇటూ వందల సంఖ్యలో కనిపించాయి. నాలుగు రోజుల కింద చచ్చిన గుర్రాలను పీక్కు తింటున్న వారిని నా కళ్ళతో చూశాను.
‘తామూ నుంచి 175 మైళ్ళ దూరంలోని ఆహ్లౌకు ఎలాగో చేరుకోండి. అక్కడ 400 మంది రోగులకు రవాణా సదుపాయం ఏర్పాటు చేయగలం. అక్కడికి కాస్త దూరంలో ఉండే తెరౌన్ నుంచి మొత్తం రెజిమెంటుకు నదీరవాణా ఏర్పాటుచేస్తాం’ అని జపాన్ వాళ్లు హామీ ఇచ్చారు. దొరికిన ఎడ్లబండ్ల మీద తీవ్రంగా జబ్బుపడినవారిని వేసుకుని ఎలాగో ఆహ్లౌ నదీ తీరానికి చేరాం. నది వరదతో పోటెత్తింది. వ్యాధిగ్రస్తుల రవాణాకు కనుచూపుమేరలో ఒక్క పడవా కనిపించలేదు. అక్కడే వారంరోజులు పడి ఉన్న తరవాత బర్మా వాళ్లెవరో కాసిని పడవల సాయం చేస్తే నది దాటాము. విషపూరితమైన జలగలకు, మలేరియా దోమలకు నెలవు అయిన ప్రాంతాలలో మోకాలి లోతు బురదలో తెరపిలేని వానలో ఖాళీకడుపుతో ఎడతెగని నడక సాగించాము. రేషన్లు ఇప్పించమని ఎంత బతిమిలాడినా జపాన్ వాళ్ళు చేయగలిగి కూడా సహాయం చేయలేదు. ఎందరో సైనికులు ఆకలిచావుల పాలయ్యారు. మా వెంట ఉన్న డాక్టర్లు, వైద్యసిబ్బంది కూడా అందరి లాగే మలేరియాకు, అతిసారానికి లోనయ్యారు. మరణించిన వారిని వదిలేసిపోవటం కంటే చేయగలిగింది లేదు. వేలసంఖ్యలో ఈగలు ముసిరిన మానవ కళేబరాలు దారిపొడవునా లెక్కలేనన్ని కనబడ్డాయి.
ఒకచోట ఒక యువ సైనికుడు కనిపించాడు. అతడి కాలి మీద గాయం. దాని నిండా పురుగులు. భరించలేని బాధ నుంచి విముక్తికి చావు కోసం ఎదురుచూస్తున్నాడు. నేను పలకరిస్తే కళ్ళు తెరిచాడు. లేవబోయి ఓపికలేక కూలబడ్డాడు. నన్ను పక్కన కూచోమని సైగ చేశాడు. కన్నీరు జలజల కారుతుండగా బలహీన స్వరంలో నాతో ఇలా అన్నాడు: ‘సాహిబ్! మీరు వెనక్కి తిరిగెళ్లి నేతాజీని చూస్తారు. నేను చూడలేను. నా జైహింద్ ఆయనకు తెలపండి. ఆయనకు చేసిన బాస నేను తప్పలేదని చెప్పండి. చూస్తున్నారు కదా. బతికుండగానే నన్ను పురుగులు పీక్కు తింటున్నాయి. అయినా నా దేశం కోసం, నా మాతృభూమి విముక్తికోసం చచ్చిపోతున్నానని నాకు తృప్తిగా ఉంది. దయచేసి ఈ సంగతి నేతాజీకి చెప్పండి’
ఇలాంటి వాళ్లు ఇంకా కొన్ని వందలమంది ఉన్నారు. బెర్రీ వ్యాధితో కాళ్ళు, మొహం తెగ వాచి, అతిసారంతో జీవశక్తి నశించి కాలు తీసి కాలు పెట్టలేని స్థితిలో ఉన్నవాళ్లు కూడా ఆఫీసరు తమ దగ్గరకొచ్చి ‘ఎన్ని బాధలైనా పడతామని నేతాజీకి మాట ఇచ్చారు కదా మరచిపోయారా? నేతాజీ ఇంకో 50 మైళ్ల దూరంలో మీకోసం ఎదురు చూస్తున్నాడు. మీకు ఆయనని చూడాలని లేదా?’ అని హెచ్చరించగానే శరీర బాధను లెక్కచేయక లేచి ముందుకు కదిలిన వాళ్ళను నేను వందలమందిని చూశాను. నేతాజీని కళ్లారా చూడటం కోసం 50 మైళ్ళ దూరం పాకుకుంటూ వెళ్లి ఆయన దర్శనం కాగానే మరణించినవారు ఎందరో ఉన్నారు.’’
[My Memories of INA And Its Netaji, Maj. Gen. Shahnawaj Khan, pp.102-107]
కొండదారిన తిరిగి వెళుతూండగా డివిజనల్ కమాండర్ మహమ్మద్ కియానీకి ఒక చోట చెట్టుకొమ్మను ఆనుకుని మలవిసర్జన భంగిమలో కూర్చున్న ఒక సైనికుడు కనిపించాడు. ఎంతకీ లేవకపోయేసరికి దగ్గరికెళ్ళి చూస్తే ప్రాణం ఎప్పుడో పోయింది. అతిసార వ్యాధితో దుర్మరణం పాలైన ఆ సైనికుడు రంగూన్‌లో ప్రసిద్ధ వ్యాపారి ఖన్నా! ఎన్నో లక్షలు విలువచేసే తన యావదాస్తినీ నేతాజీ ఉద్యమానికి విరాళంగా ఇచ్చి, స్వయంగా తాను ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరాడు. అతడి భార్య ఝాన్సీరాణి రెజిమెంట్‌లో చేరగా, కుమారుడు బాలసేనలో కలిశాడు.
ఇంఫాల్ రంగానికి వెళ్ళిన మొత్తం 8 వేల ఐఎన్‌ఎ సైనికుల్లో 400 మంది యుద్ధంలో మరణించారు. 1500 మంది ఆకలి వల్లో, వ్యాధుల కారణంగానో చనిపోయారు. 800 మంది బ్రిటిష్ సేనలకు లొంగిపోయారు. 2600 మంది క్షేమంగా తిరిగొచ్చారు. వారిలో 2000 మంది రాగానే ఎకాఎకి ఆస్పత్రులలో చేరారు. 715 మంది శత్రువుతో కలిసి పోయారు. కొందరు నదులు దాటే సమయంలో ప్రవాహంలో కొట్టుకు పోయారు. కొంతమంది అడవుల్లో దారి తప్పి గల్లంతయ్యారు.
విధివశాత్తూ పరాజయం పాలైనా, కదనరంగంలో ఐఎన్‌ఎ వీరసైనికుల పరాక్రమం పగవాళ్లను సైతం మెప్పించింది. యుద్ధం ముగిసిన తరవాత బ్రిటిష్ ఇండియా ప్రభుత్వానికి ఇంటలిజెన్స్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన రిపోర్టులో ఐఎన్‌ఎ గురించి చేసిన వంకర ప్రశంస ఇది:
“A measure of courage can not be denied to INA frontline units.. they faced up to British equipment, tanks, guns and aircraft with rifles and bullock carts and empty stomachs.”
[Quoted in The Lost Hero, Mihir Bose, p. 416]
(రంగంలో ముందు నిలిచినా ఐఎన్‌ఎ దళాల ధైర్యాన్ని మెచ్చుకోవాలి. బ్రిటిష్ ఎక్విప్‌మెంటును, టాంకులను, విమానాలను వారు రైఫిళ్ళతో, ఎడ్లబండ్లతో, ఖాళీ కడుపులతో ఎదుర్కొన్నారు.)
మిగతా వచ్చేవారం