సంపాదకీయం
శాలివాహన 1943 శ్రీ ప్లవ కార్తిక బహుళ దశమి – 29 నవంబర్ 2021, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
————————————————————————————————-
అక్కడ అధికారంలో ఉన్న పార్టీది అంతులేని రక్తదాహం. దానిని అంటకాగే ముస్లిం మతోన్మాదుల మూక సంగతి ఇక చెప్పేదేముంది? ఆ రెండూ హిందూత్వ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకున్నాయి. వారిని వేటాడుతున్నాయి. ముస్లిం మతోన్మాదుల మధ్యయుగాల నాటి ఈ రక్తపిపాసకు ఆ ఎర్ర పార్టీ మద్దతుగా నిలిచింది. దానికి రుజువే- నవంబర్ 15న జరిగిన ప్రాముక్ సంజిత్ అనే 27 ఏళ్ల ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త దారుణ హత్యోదంతం. ముస్లిం మతోన్మాదులు పట్టపగలు, ముఖాలకు ముసుగులు కూడా లేకుండా, నడిరోడ్డు మీదే అతడిని నరికి చంపారు. ఈ హత్యకు సంబంధించి 22వ తేదీన పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) సభ్యుడిని అరెస్టు చేశారు. ఇతడి పేరు మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ఇతడు హత్యతో నేరుగా సంబంధం కలిగి ఉన్నాడని మాత్రం చెబుతున్నారు. పీఎఫ్‌ఐ, దాని రాజకీయ తోక ఎస్‌డిపీఐ (సోషల్ డెమాక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా)లకు చెందిన చాలామందిని పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు. మరొక పక్క పాలక్కాడ్‌కి చెందిన మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లే సుబేర్, సలేం, ఇషాక్. ఇదంతా పోస్ట్‌మార్టమ్ వ్యవహారమే.
ఉదయం 9 గంటల ప్రాంతంలో సంజిత్‌ను నరికి చంపారు. పాలక్కాడ్ జిల్లాలోని ఇళప్పల్లి అనేచోట ఇది జరిగింది. తన భార్యను ఆమె పనిచేసే చోటికి తీసుకువెళుతుండగా కొందరు ముష్కరులు కారుతో ఆయన ద్విచక్ర వాహనాన్ని డీకొట్టి, పడిపోయిన తరువాత నరికేశారు. అతడి శరీరం మీద 25కు పైగానే గాయాలు ఉన్నాయని చెబుతున్నారు. పది వరకు తల మీదే ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. ఇదేం పైశాచకత్వం? ఇదేం పశు ప్రవృత్తి? ఇందులో పీఎఫ్‌ఐ రాజకీయ విభాగం సోషల్ డెమాక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా హస్తం ఉండవచ్చునని పోలీసులు వెంటనే చెప్పారు. దీనికి పెద్ద అపరాధ పరిశోధన ఏమీ అవసరం లేదు. కుట్ర ఎస్‌డీపీఐదే. అయినా సంజిత్ హత్య జరిగిన 24 గంటల తరువాత కూడా పోలీసులు కదలేదు. అధికార సీపీఎంకు ఆగ్రహం కలిగించే పని పోలీసులు చేయలేరు మరి! ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను కలుసుకుని ఫిర్యాదు చేయవలసి వచ్చింది. ఇది గడచిన పదిరోజులలో జరిగిన రెండో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్య. ఇదంతా ఎస్‌డీపీఐ, సీపీఐ(ఎం)ల మధ్య ఉన్న అపవిత్ర బంధంతోనే అడ్డూఅదుపూ లేకుండా జరుగు తోందని కేరళ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులు ఆరోపించడం అసంబద్ధం కాదు.
ఒక ప్రైవేటు సంస్థలో పనిచేసే సంజిత్ ఆర్‌ఎస్‌ఎస్ మండల బౌద్ధిక్ ప్రముఖ్. పాలక్కాడ్ జిల్లాలో ప్రముఖ కార్యకర్త. ఆయనకు భార్య, ఒక కూతురు ఉన్నారు. తల్లి బాధ్యత కూడా ఆయనదే. సంజిత్ సతీమణి అర్షిత చెప్పిన వివరాలు భీతావహంగా ఉన్నాయి. వెనుకనుంచి కారులో వచ్చి వారి ద్విచక్ర వాహనాన్ని డీకొట్టి, సంజిత్ కిందపడిన తరువాత చంపారు. కాన్వెంట్ పిల్లలతో వెళుతున్న బస్సు, అంతా సంచరిస్తున్న రద్దీ ప్రదేశంలోనే ఈ హత్య జరిగింది. పైగా అర్షితను బలవంతంగా తీసుకువచ్చి జరుగుతున్న ఆ హత్యా కాండను చూపించారు దుండగులు. ముఖాలకి ఎలాంటి ఆచ్ఛాదనలూ లేకుండానే యథేచ్ఛగా ఈ హత్యాకాండ సాగించారనీ, వాళ్లని గుర్తు పడతాననీ ఆమె చెబుతున్నారు.
నిజానికి సంజిత్ మీద ఎస్‌డీపిఐ కన్ను ఎప్పటినుంచో ఉంది. రెండు వారాల క్రితం ఇలప్పల్లిలో ఒక ఎస్‌డీపీఐ కార్యకర్త మీద దాడి జరగడంతో అది మరింత బిగిసింది. అప్పటి నుంచి సంజిత్ తన నివాసంలో కాకుండా వేరే చోటు ఉంటున్నారు. గతంలోను సంజిత్ మీద హత్యా ప్రయత్నాలు జరిగాయి. నిరుడు హత్యాప్రయత్నం జరిగితే, నలుగురు ఎస్‌డీపీఐ కార్యకర్తలను అరెస్టు చేశారు కూడా. ఈ ప్రయత్నం తరువాత సబీర్ అలీ, అన్వర్ సిద్దికి అనేవాళ్లు తమిళనాడుకు పారిపోతుండగా పట్టుకున్నారు.
ఎస్‌డీపీఐ, ఆర్‌ఎస్‌ఎస్ మధ్య ఘర్షణ కేరళలో కొత్తకాదు. అలాగే ఎస్‌డీపీఐ సీపీఎం మధ్య ప్రేమ వ్యవహారం కూడా పాతదే. గడచిన కొన్నేళ్లుగా రాజకీయ హత్యలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. బిజు అనే 35 ఏళ్ల ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తను త్రిచూర్ జిల్లా చావక్కాడ్‌లో ఈ అక్టోబర్ 31న ఎస్‌డీపీఐ గూండాలే చంపారు. ఈ హత్య వ్యక్తిగత కక్షల ఫలితమని పోలీసులు నమ్మించాలని చూస్తున్నారు. కానీ అది రాజకీయ హత్య అని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు వాదిస్తున్నారు. గడచిన ఫిబ్రవరిలోనే వయలార్ గ్రామ శాఖ ముఖ్యశిక్షక్ నందు కృష్ణన్ అనే 22 ఏళ్ల ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త ఎస్‌డీపీఐ మతోన్మాదుల చేతిలో బలైపోయారు. ఇటీవలి కొన్నేళ్ల కాలంలోనే ఎస్‌డీపీఐ పది వరకు రాజకీయ హత్యలకు పాల్పడింది. ఇందులో ఒక ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నాయకుడు కూడా ఉన్నాడు. మతం మత్తు మందు కదా, ఈ మతోన్మాదులతో పనేమిటని అమాయకంగా ప్రశ్నించి ఉంటాడా అమాయకుడు. ఇది సీపీఎం విద్యార్థి విభాగమే. కానీ గట్టి చర్యలేమీ లేవు. కారణం- పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మీద సీపీఎంకు ఉన్న గాఢమైన ప్రేమ. ఇటీవలి హత్యలకు పినరాయ్ విజయన్ బాధ్యత వహించాలని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ చెబుతోంది. ఎందుకంటే హోంశాఖను కూడా ఆయనే నిర్వహిస్తున్నారు. చాలాచోట్ల స్థానిక సంస్థలలో సీపీఎం అధికారంలో కులుకుతున్నదంటే అందుకు ఎస్‌డీపీఐ అండే కారణం.
రాజకీయ హత్యలు, మతాంతరీకరణలు, లవ్ జిహాద్ ఇవన్నీ కేరళకు మామూలైపోతున్నాయి. లవ్ జిహాద్‌తో హిందూ, క్రైస్తవ యువతులను లోబరుచుకుని సిరియా వంటి చోటికి ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఎగుమతి చేస్తున్న సంగతి వాస్తవం. ఇకనైనా హిందూ సమాజం, నిజమైన ప్రజాస్వామిక వాదులు, వెన్నెముక ఉన్న మేధావులు మేల్కోవడం అవసరం.