– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌       

‌దసరా ఉత్సవాల వేళ బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న అవాంఛనీయ ఘటనలు భారతీయులను ఆందోళన, ఆవేదనకు గురిచేశాయి. అక్కడి కొన్ని ఛాందసవాద సంస్థలు మైనార్టీ హిందువులు, వారి ప్రార్ధనా స్థలాలపై మూకుమ్మడిగా జరిపిన దాడులు మాయని మచ్చగా మిగిలాయి. హిందువులు అధికంగా ఉండే ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న దసరా దుర్గాదేవి మండపాన్ని దుండగులు తీసుకెళ్లి నీళ్లలో పడేయడం, కనిపించినవారినల్లా చావగొట్టడం, దుర్గామాత శిబిరాలను కూల్చడం వీడియోలలో ప్రపంచం మొత్తం చూసింది.ఈ దాడులలో నలుగురు హిందువులు చనిపోయారు. తరువాత నౌకాలిలోని ఇస్కాన్‌ ‌గుళ్ల మీద కూడా మతోన్మాదులు దాడిచేశారు. విగ్రహాలను అపవిత్రం చేయడమే కాకుండా, భక్తులను గాయపరిచారు. దుర్గ శిబిరాల మీద గుంపులు గుంపులుగా , ఇస్కాన్‌ ‌గుళ్ల మీద రెండువందల మంది మారణాయుధాలతో దాడి చేయడం గమనార్హం. ఇది పాకిస్తాన్‌ ‌నుంచి అక్కడ స్థిరపడిన వారి దుశ్చర్య అని వార్తలు వచ్చాయి.మధ్యయుగాల ముస్లిం దాడులకు ఏమాత్రం తీసిపోని ఈ అల్లర్ల దరిమిలా 22 జిల్లాలలో పారా మిలటరీని మోహరించవలసి వచ్చింది.

 ప్రపంచవ్యాప్తంగా హిందువులు పరమ పవిత్రంగా భావించే దుర్గాష్టమి వేడుకల సందర్భంగా వదంతులను నమ్మి, కొన్ని ఇస్లామిస్ట్ ‌ఛాందసవాద సంస్థలు హిందువులను లక్ష్యంగా చేసుకున్నాయి. వాస్తవాలు ఏమిటో తెలుసుకోకుండా, సంయమనం పాటించకుండా మూకుమ్మడిగా జరిపిన దాడుల వల్ల బంగ్లాదేశ్‌ ‌లోని మైనార్టీ హిందువులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ఘటనలను దేశ ప్రధాని, అవామీలీగ్‌ ‌పార్టీ అధినేత షేక్‌ ‌హసీనా వాజెద్‌, ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం, అమెరికా తదితర పాశ్ఛాత్య దేశాలు తీవ్రంగా ఖండించాయి. మైనార్టీలను కాపాడేందుకు తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని, దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ ‌చేశాయి. ఈ దిశగా హసీనా సర్కారు కూడా అడుగులు వేసింది. లౌకికవాద పార్టీగా చెప్పుకునే అవామీలీగ్‌కు హసీనా సారథ్యం వహిస్తున్నారు. బంగ్లాదేశ్‌ ఆవిర్భావ సమయంలోనే దేశ నిర్మాత, బంగబంధు షేక్‌ ‌ముజిబుర్‌ ‌రెహమాన్‌ ‌మైనార్టీల రక్షణకు ప్రతిన బూనారు. ఆ బాటలోనే ఆయన తనయ హసీనా నడుస్తున్నారు. స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది మార్చి 26న బంగ్లాదేశ్‌ ‌సందర్శించారు. ఆ దేశానికి అన్నివిధాలా బాసటగా నిలుస్తామని హామీ ఇచ్చారు. దేశ నిర్మాత, బంగబంధు షేక్‌ ‌ముజిబుర్‌ ‌రెహమాన్కు 2020 గాంధీ శాంతి బహుమతిని ఆయన తనయ హసీనాకు అందజేశారు. కరోనా వంటి కఠినమైన పరిస్థితుల నేపథ్యంలోనూ మోదీ ఢాకా సందర్శించడం, ఆ దేశానికి రెండు మిలియన్ల డోసుల టీకాలను పంపించడం ఉభయ దేశాల మైత్రీ బంధానికి నిదర్శనం. ఈ ఏడాది మోదీ జరిపిన తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో గత నెలలో పొరుగుదేశంలో జరిగిన అవాంఛనీయ ఘటనలు సహజంగానే భారతీయులను ఆందోళన, ఆవేదనకు ఒకింత ఆగ్రహానికి గురి చేయడం అనివార్య పరిణామం. దీనిని పొరుగుదేశం కూడా సానుకూల ధోరణిలోనే అర్థం చేసుకోవడం స్వాగతించ దగ్గ విషయం. ఏమైనా బంగ్లా తాజా దుర్ఘటన ఆ దేశ పరువును దిగజార్చింది.

దుర్గాపూజ సందర్భంగా కుమిల్లా పట్టణంలోని హిందువుల ప్రార్థనా మందిరంలో ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్‌కు అవమానం జరిగిందన్న వదంతులు దేశాన్ని కుదిపేశాయి. దీంతో అల్లరి మూకలు హిందువులు, వారి ఆలయాల లక్ష్యంగా దాడులకు తెగబడ్డాయి. ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేశాయి. హిందువుల ఇళ్లను నేలమట్టం చేశాయి. అక్టోబరు 13న కుమిల్లా పట్టణం,15న ఢాకా సమీపంలోని నాసిర్‌ ‌నగర్‌, ‌బేగంగంజ్‌ ‌తదితర పట్టణాలు ఇందుకు సాక్షీభూతంగా నిలిచాయి. దేశ రాజధాని ఢాకాకు వంద కిలోమీటర్ల దూరంలో, ఢాకా- చిట్టగాంగ్‌ ‌మార్గంలో కుమిల్లా. దీని జనాభా సుమారు మూడు లక్షలు. భారత్‌లోని త్రిపుర రాష్ట్రానికి కూడా ఇది సమీపంలోనే ఉంటుంది. ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు 71 కేసులు నమోదు చేశారు. దాదాపు 450 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటనలకు కారణం జమాతే-ఇ-ఇస్లాం పార్టీ. దేశ రాజకీయాల్లో ఇది ఛాందసవాద పార్టీగా గుర్తింపు పొందింది. మైనార్టీల వ్యతిరేకత ప్రాతిపదికగా ఈ పార్టీ రాజకీయాలను చేస్తోంది. అంతగా ప్రజాదరణ లేనప్పటికీ మత మౌఢ్యాన్ని ప్రేరేపించి అమాయక ప్రజల మనసులను కలుషితం చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది. మైనార్టీలు ముఖ్యంగా హిందువులు, భారత్‌ ‌పట్ల గుడ్డి వ్యతిరేకత దీని విధానం. పాక్‌ ‌మాదిరిగా దేశాన్ని పూర్తిగా ఇస్లామీకరణ చేయాలన్నది జమాతే లక్ష్యం. అందుకే అవకాశం చిక్కినప్పుడల్లా మత విద్వేషాన్ని రగలించే పనిలో ముందంజలో ఉంటుంది. 2001-2006 మధ్యకాలంలో షేక్‌ ‌ఖలీదా జియా ఆధ్వర్యంలోని బంగ్లాదేశ్‌ ‌నేషనలిస్ట్ ‌సర్కారులో ఈ పార్టీ భాగస్వామి. 2013 నుంచి దేశంలో హిందువుల ఇళ్లు, ఆలయాలపై దాదాపు నాలుగువేల దాడుల ఘటనలు జరిగాయి.

పాకిస్తాన్‌ ‌నుంచి స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోరుతూ 1971లో షేక్‌ ‌ముజిబుర్‌ ‌రెహమాన్‌ ‌సాగించిన పోరాటానికి భారత్‌ ‌సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నాటి పోరాటంలో భారత్‌ ‌పాత్ర చిరస్మరణీయం. బంగ్లా తరఫున భారతీయ సేనలు పాక్‌పై పోరాడాయి. తద్వారా బంగ్లాదేశ్‌ ఆవిర్భావంలో భారత్‌ ‌శ్లాఘనీయమైన పాత్ర పోషించింది. ఈ విషయం ఈ తరం బంగ్లాదేశీయులకు, భారతీయులకు సైతం పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ రెండు దేశాల్లోని పాత తరానికి బాగా తెలుసు. తొలిరోజుల్లో దేశంలో దాదాపు 30 శాతం మైనార్టీలు ఉండేవారు. వీరిలో హిందువులు అధికం. సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు సైతం ఉన్నారు. మైనార్టీల హక్కులకు, రక్షణకు సంపూర్ణ పూచీ వహిస్తామని, వారు స్వేచ్ఛగా, నిర్భయంగా జీవించవచ్చని అవామీలీగ్‌ ‌పార్టీ అధినేత, దేశ తొలి అధ్యక్షుడు, బంగబంధు షేక్‌ ‌ముజిబుర్‌ ‌రెమమాన్‌ అప్పట్లో హామీ ఇచ్చారు. కొంతకాలం పాటు ఇదే పరిస్థతి కొనసాగింది. ఆయన తనయ, ప్రస్తుత అవామీలీగ్‌ అధినేత, ప్రధాని హసీనా వాజెద్‌ ‌కూడా తండ్రి బాటలోనే నడిచారు. మైనార్టీల హక్కులకు బాసటగా నిలిచారు. కానీ కాలక్రమంలో కొన్ని వర్గాల్లో ఛాందసవాదం పెరిగింది. మతమౌఢ్యం జడలు విప్పింది. రాడికల్‌ ఇస్లామిస్ట్ ‌పార్టీలు పుట్టుకొచ్చాయి. ఇందులో జమాతే-ఇ-ఇస్లామిస్ట్ ‌ది ప్రధాన పాత్ర. దీని బాటలోనే అన్సరుల్లా బంగ్లా టీమ్‌, ‌హిజ్బ్ ఉల్‌ ‌తహ్రీర్‌, ‌జమాతే -ఉల్‌-‌ముజాహిద్దీన్‌ ‌బంగ్లాదేశ్‌ ‌వంటి పుట్టగొడుగు పార్టీలు పుట్టుకొచ్చాయి. మైనార్టీల పట్ల వ్యతిరేకతే వీటి విధానం. మత మౌఢ్యాన్ని ప్రేరేపించడం, ప్రజలను ఛాందసవాదం వైపు మళ్లించడం లక్ష్యంగా ఇవి పని చేస్తుంటాయి. ఈ దిశగా కొంత మేరకు పురోగతి కూడా సాధించామని అవి చెబుతుంటాయి. ఇందుకు పాకిస్తాన్‌ ‌నుంచి వచ్చిన మూకలు కూడా తమ వంతు సాయం అందిస్తున్నాయి.

 హిందువుల పండగల సమయంలో వదంతులను, పుకార్లను వ్యాపింప చేయడం, వారి ఇళ్లు, మందిరాలపై దాడులకు తెగబడటం ఈ పార్టీల లక్ష్యం. తాజా దాడుల వెనక కూడా వీటి పాత్ర బహిరంగ సత్యం. మతమౌఢ్యాన్ని, ఛాందసవాదాన్ని వ్యాపింప చేయడంలో దేశంలో ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్‌ ‌నేషనలిస్ట్ ‌పార్టీ (బీఎన్‌పీ) పాత్రను తక్కువగా అంచనా వేయలేం. రాడికల్‌ ఇస్లామిస్ట్ ‌పార్టీల స్థాయిలో కాకపోయినా ఆ పార్టీ కూడా ఇస్లామీకరణ పట్ల మొగ్గు చూపుతుంది. మైనార్టీల పట్ల అంతగా ఉదారభావాన్ని చాటదు. ఆ పార్టీ అధినేత్రి బేగం ఖలీదా జియా ప్రధానిగా ఉన్న సమయంలో పరోక్షంగా ఛాందసవాదాన్ని ప్రోత్సహించారు. మైనార్టీలపై ఉదాసీనత ప్రదర్శించారు. భారత్‌ ‌పట్ల అంతగా సన్నిహితంగా ఉండేవారు కాదు. బంగ్లా రాజకీయాల్లో అవామీలీగ్‌ ‌భారత అనుకూల పార్టీగా, బీఎన్‌పీ భారత వ్యతిరేక పార్టీగా ముద్రపడ్డాయి. బీఎన్‌పీ కూడా దేశాన్ని దాదాపు సగం కాలం పాలించింది. ఫలితంగా దేశంలో మైనార్టీ వ్యతిరేకత, ఇస్లామీకరణ విస్తరించింది. ఛాందస వాద పార్టీలకు అడ్డే లేకుండా పోయింది. ఫలితంగా దేశంలో మైనార్టీల సంఖ్య నానాటికి పలచబడిపోతోంది. ఒకప్పుడు దేశంలో 30 శాతం ఉన్న హిందువుల సంఖ్య ఇప్పుడు పది శాతానికి పడిపోయింది.

దేశంలో మైనార్టీ వ్యతిరేకత పెరగడానికి ఇతర కారణాలు అనేకం ఉన్నాయి. గత మూడు దశాబ్దాల్లో దేశంలో మదర్సాలు పుట్టగొడుగుల్లా విస్తరించాయి. పేరుకు ఇవి మతపరమైన పాఠశాలలని పైకి చెప్పుకుంటున్నప్పటికీ అక్కడ చెప్పేదంతా ఇస్లామీకరణ గురించే. అదే సమయంలో మైనార్టీల పట్ల వ్యతిరేకతను నూరిపోయడం. ఈ పరిస్థతిని నివారించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అదేమంటే ఇస్లాంకు వ్యతిరేకమన్న ముద్ర పడుతుందన్న భయం. అదే సమయంలో దేశంలో ‘వహాబిజం’ పెరిగింది. సౌదీ అరేబియా వంటి అరబ్‌ ‌దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లిన యువత అక్కడి ప్రభావానికి లోనయి మత మౌఢ్యాన్ని బాగా వంటబట్టించుకుంది. స్వదేశానికి తిరిగి వచ్చిన వారు దేశాన్ని ఇస్లామీకరణ చేయాలన్న ధ్యేయంతో పని చేస్తున్నారు. వీరిని ఇస్లామిస్ట్ ‌రాజకీయ పార్టీలు చేరదీస్తున్నాయి. బీఎన్‌పీ వంటి ప్రధాన ప్రతిపక్షం పరోక్షంగా వీరికి అండగా నిలుస్తోంది. ప్రధాన పార్టీలను కాదని, మతం ప్రాతిపదికగా ఏదో ఒకరోజు అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంగా రాడికల్‌ ఇస్లామిస్ట్ ‌పార్టీలు పని చేయడం కూడా సమస్యకు ఒక కారణం. మెజార్టీ ముస్లిముల మద్దతు ఉంటే అధికారం సాధించవచ్చన్న ప్రధాన ప్రతిపక్షం బీఎన్‌పీ వైఖరి సైతం పరిస్థితిని దిగజారుస్తోంది. దీంతో మరో ప్రధాన పార్టీ హసీనా వాజెద్‌ ‌నాయకత్వంలోని అవామీలీగ్‌ ‌కొంతమేరకు ఇరకాట పరిస్థితిని ఎదుర్కొంటోంది. మైనార్టీల పట్ల మొగ్గు చూపితే ఎక్కడ మెజార్టీ ముస్లిముల మద్దతు కోల్పోతామన్న భయంతో ఆ పార్టీ గట్టిగా మాట్లాడలేకపోతోంది. అందుకే తమ దేశంలో మైనార్టీ హిందువుల భద్రత భారత్‌ ‌వైఖరిపై కొంతవరకు ఆధారపడి ఉంటుందని ఆ పార్టీ అధినేత్రి హసీనా వివాదాస్పద వ్యాఖ్యచేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ- సిటిజన్‌ ‌షిప్‌ ఎమెండ్‌ ‌మెంట్‌ ‌యాక్టు), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ- నేషనల్‌ ‌రిజిస్టర్‌ ఆఫ్‌ ‌సిటిజెన్స్) ‌నేపథ్యంలో హసీనా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఆమె ఉద్దేశం అది కాదు. స్వదేశంలో విపక్షపార్టీల దూకుడు తగ్గించేందుకు, తాను మైనార్టీల అనుకూలమన్న భావనను చెరిపేసేందుకు హసీనా అలా మాట్లాడి ఉంటారన్నది రాజకీయ పండితుల భావన. సీఏఏ, ఎన్‌ ఆర్‌ ‌సీ చట్టాల వల్ల ఎవరికీ, ముఖ్యంగా మైనార్టీలకు ఎలాంటి నష్టం లేదన్న విషయం ఆమెకు బాగా తెలుసు. భారత్‌ ‌లో మైనార్టీలకు ఉన్నంత రక్షణ, భద్రత మరే దేశంలోనూ లేదన్న విషయం అంతర్జాతీయ సమాజానికి సుపరిచితం. కశ్మీరీలపై పాకిస్తాన్‌, ‌టర్కీ వంటి కొన్ని దేశాలు మొసలి కన్నీరు కార్చడం వెనక అసలు విషయం అందరికీ తెలిసిందే. ఆర్థికంగా పతనం అంచుకు చేరుతున్న ఈ రెండు దేశాలు భారత్‌ ‌వ్యతిరేకతను బూచిగా చూపి రాజకీయంగా తమ తమ దేశాల్లో పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. గతంలో కొంతవరకు తటస్థంగా వ్యవహరించే ‘నాటో’ (నార్త్ అట్లాంటిక్‌ ‌ట్రీటీ ఆర్గనైజేషన్‌) ‌దేశం టర్కీ ఇటీవల కాలంలో అయినదానికి కాని దానికి ఇస్లామాబాద్‌కు వంత పాడటం అలవాటుగా చేసుకుంది. ఏది ఏమైనప్పటికి బంగ్లాదేశ్‌ ‌లో మైనార్టీ హిందువులపై దాడులను సాకుగా చూపి భారత్‌- ‌బంగ్లాదేశ్‌ ‌మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని శక్తులు చేసిన ప్రయత్నాలను ఉభయ దేశాలు తిప్పికొట్టాయి. ఉభయ దేశాలు సంయమనం పాటించడం, ఆచితూచి వ్యవహరించడం వల్లే ఇది సాధ్యపడింది. స్వదేశంలో మైనార్టీల హక్కులు, భద్రత, రక్షణ గురించి అదే పనిగా మోదీపై విమర్శలు కురిపించే కొన్ని జాతీయ పార్టీలు బంగ్లాదేశ్‌ ‌లో మైనార్టీలపై దాడుల గురించి ఉద్దేశ పూర్వకంగా మౌనం పాటించడం వాటి ద్వంద్వ ప్రమాణాలకు నిలువెత్తు నిదర్శనం. నిజానికి పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీయేకాదు, ఏ ఉదారవాది వీటి గురించి నోరు మెదపలేదు.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE