(డిసెంబర్‌ 3 ‌బాబూ రాజేందప్రసాద్‌ 126‌వ జయంతి)

‘నా మతంలో నాకు విశ్వాసం ఉంది. నా మతం నుంచి నేను వేరు కాలేను’. ఈ మాట అన్నది ప్రథమ రాష్ట్రపతి డాక్టర్‌ ‌బాబు రాజేందప్రసాద్‌. ‌సందర్భం- గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయం జీర్ణోద్ధరణ తరువాత లింగ ప్రతిష్ట కార్యక్రమానికి రాజెన్‌బాబు హాజరు కారాదని ప్రథమ ప్రధాని నెహ్రూ భావించిన సందర్భంలో. రాష్ట్రపతి ఇలాంటి ‘మత’ కార్యక్రమాలకు వెళితే వేరే సంకేతాలు వెళతాయంటూ నెహ్రూ వ్యాఖ్యానించినప్పుడు. మే11, 1951న సోమనాథ్‌ ఆలయ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. నిజానికి సోమనాథ్‌ ఆలయ జీర్ణోద్ధరణనే నెహ్రూ వ్యతిరేకించిన మాట వాస్తవం. అయితే మత భావన, మతానికి సంబంధించిన మనోభావాలు కలిగి ఉండడమే మతోన్మాదమా? లేక ఒక్క హిందువులే అలాంటి అవాస్తవిక ధోరణిలో ఉండిపోవాలా? సెక్యులరిజం హిందువులకే పరిమితమా? ఇవి అప్పటికీ ఇప్పటికీ వినిపిస్తున్న ప్రశ్నలు.

సోమనాథ్‌, ‌రాజేందప్రసాద్‌, ‌జవాహర్‌లాల్‌- ఈ ‌పేర్లతో ముడిపడి ఉన్న వివాదం చరిత్ర ప్రసిద్ధం. ప్రఖ్యాత పత్రికా రచయిత, ‘ఇండియా ఫ్రం కర్జన్‌ ‌టు నెహ్రూ’ గ్రంథకర్త దుర్గాదాస్‌ ఈ ‌విషయాన్ని ప్రస్తావించారు. నెహ్రూ, రాజేందప్రసాద్‌ల మధ్య అదే అంశం మీద కొన్ని నెలల పాటు లేఖల రూపంలో వాదోపవాదాలు నడిచాయి. సోమనాథ్‌ ఆలయానికి ఉన్న చరిత్రాత్మక నేపథ్యం కారణంగా ఇలాంటి ఆహ్వానాన్ని తిరస్కరించడం సరికాదని తనకు అనిపిస్తున్నదని రాజెన్‌బాబు మార్చి 10,1951న నెహ్రూకు రాసిన జవాబులో పేర్కొన్నారు. (జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్‌ ఆలయం త్రేతాయుగం నుంచి ఉన్నదని ప్రతీతి. ఈ మహోన్నత ఆలయం గురించి 11వ శతాబ్దానికి చెందిన పర్షియన్‌ ‌యాత్రికుడు అల్‌ ‌బెరూనీ తన రచనలలో ప్రస్తావించాడు. క్రీస్తుశకం 1024 నుంచి 1665 వరకు, వరసగా మహమ్మద్‌ ‌ఘజనీ, అల్లావుద్దీన్‌ ‌ఖిల్జీ, జఫార్‌ఖాన్‌, ‌మహమ్మద్‌ ‌బెగాదా, ఔరంగజేబు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. మొగలుల ఏలుబడిలో ఔరంగజేబు గుజరాత్‌ ‌గవర్నర్‌ ‌కూడా). ఏది ఏమైనా సోమనాథ్‌ ‌లింగ ప్రతిష్ట కార్యక్రమానికి రాజెన్‌బాబు (డిసెంబర్‌ 3,1884-‌ఫిబ్రవరి 28,1963) వెళ్లకుండా చూడాలని నెహ్రూ శతథా యత్నించారన్నది తిరుగులేని నిజం. అందుకు నెహ్రూ వేసిన తాత్త్విక ముసుగులు- పునరుద్ధరణవాద వ్యతిరేకత, సెక్యులరిస్టు వ్రతం.

 సోమనాథ్‌ ఆలయ జీర్ణోద్ధరణలో ప్రథమ ప్రధాని ఒక పునరుద్ధరణ యత్నాన్ని మాత్రమే చూశారు. అదేదో కాదు, హిందూ ధర్మ పునరుద్ధరణ ఆయన భావం కావచ్చు. ఏప్రిల్‌ 22,1951‌న రాజెన్‌బాబుకు రాసిన లేఖలో ఇదే పేర్కొన్నారు నెహ్రూ. సోమనాథ్‌ ‌వ్యవహారంతో నేను చాలా కలతపడ్డాను. దీనికి రాజకీయ కోణం వస్తుందని భయపడుతున్నాను. ఈ అంశం మీద అంతర్జాతీయంగా కూడా ప్రస్తావనలు వస్తున్నాయి. ఒక పునరుత్థాన లక్షణం కలిగిన ఇలాంటి కార్యక్రమంలో మన సెక్యులర్‌ ‌ప్రభుత్వం ఎలా భాగమవుతుందన్న విమర్శలు వస్తున్నాయి. పార్లమెంటులో కూడా నన్ను ప్రశ్నిస్తున్నారు. ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని వారికి చెబుతున్నాను. సోమనాథ్‌ ఆలయం కార్యక్రమంలో ఉన్నవారంతా వ్యక్తిగత హోదాలోనే పని చేస్తున్నారని అలా ప్రశ్నిస్తున్న వారికి నేను జవాబు చెబుతున్నాను అంటూ నెహ్రూ ఆ లేఖలో చెప్పారు. సోమనాథ్‌ ఆలయ పునరుద్ధరణ సంఘం అధ్యక్షుడు జామ్‌ ‌సాహెబ్‌ ‌విదేశీ దౌత్య కార్యాలయాలకు రాసిన విన్నపాన్ని కూడా నెహ్రూ తప్పు పట్టిన సంగతిని కూడా నెహ్రూయే ఆ లేఖలో చెప్పుకున్నారు. దేశ విదేశాలకు సంబంధించి మట్టినీ, జలాన్నీ సోమనాథ్‌ ‌జ్యోతిర్లింగ ప్రతిష్ట కార్యక్రమానికి సేకరించి ఇవ్వవలసిందని దౌత్య కార్యాలయాలకు జామ్‌ ‌సాహెబ్‌ ‌విన్నవించడం కూడా నెహ్రూకు అవమానంగా తోచింది. ఇదొక దురుసు ప్రవర్తనగా అభివర్ణించారాయన. ఇదేమిటంటూ ఆ కార్యాలయాలు ప్రభుత్వాన్ని అడిగాయని కూడా నెహ్రూ చెప్పుకున్నారు. ఆ కార్యక్రమానికి సౌరాష్ట్ర (గుజరాత్‌) ‌ప్రభుత్వం రూ. 5లక్షలు కేటాయించడం కూడా నెహ్రూకు నచ్చలేదు. దానికి నిరసన తెలియచేస్తూ వారికి లేఖ కూడా రాశారు. దేశంలో ప్రజలు ఆకలితో మాడుతుంటే, విద్యకీ ఇతర అవసరాలకీ నిధులు ఆపేసిన తరుణంలో ఇలా చేస్తారా అంటూ ఆగ్రహించారు (పాపం, పాకిస్తాన్‌కు తరలిపోతున్న నిధుల గురించి మాత్రం నెహ్రూ ఏ దశలోనూ ప్రస్తావించలేదు). ఈ కార్యక్రమం తనకేమీ నచ్చడం లేదని జామ్‌ ‌సాహెబ్‌కు కూడా నెహ్రూ లేఖ సంధించారు. కానీ మే 9, 1951న విదేశి వ్యవహారాల కార్యదర్శి ఎస్‌. ‌దత్‌కు రాసిన లేఖలో కొందరు కేంద్రమంత్రులు కూడా సోమనాథ్‌ ఉత్సవానికి అనుకూలంగా వ్యవహరించిన సంగతి అర్ధమవుతుంది. కొన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలను నిర్వాహకులు సంప్రతించారని, వీరు కూడా అనుకూలంగానే చర్యలు తీసుకున్నారని ప్రస్తుత వాతావరణంలో మనమేమీ చేసేది లేదని కూడా నెహ్రూ ఇదే లేఖలో వాస్తవం అంగీకరించారు. సోమనాథ్‌ ఆలయ పాలకమండలి అధ్యక్షుడు, సంస్థానాధీశుడు జామ్‌ ‌సాహెబ్‌ ‌చాలా ఘటికుడిలా ఉన్నారు. ఈ ఉత్సవానికి తమరూ హాజరు కావాలని సాక్షాత్తు నెహ్రూకు కూడా ఆహ్వానం పంపారాయన.

ఏప్రిల్‌ 24, 1951‌న జామ్‌ ‌సాహెబ్‌కు ఇలా సమాధానం ఇచ్చారు నెహ్రూ. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు. ప్రస్తుత పరిస్థితులలో అలాంటి ఏ కార్యక్రమానికైనా నేను ఢిల్లీ విడిచిరావడం అసాధ్యం అని జవాబిచ్చారు. అంతేకాదు, జామ్‌ ‌సాహెబ్‌కు పెద్ద ఎత్తున హితబోధ కూడా చేశారు. ఇలాంటి పునరుజ్జీవ కార్యక్రమం నన్ను చాలా ఇరుకున పెడుతున్నదని రాశారు. అయినా సంస్థానాధీశునిగా మీరు, రాష్ట్రపతి, కొందరు మంత్రులు కూడా ఇందులో భాగస్వాములయ్యారని వాపోయారు. అంతేకాదు, ఇది జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా పరిణామాలకు కారణమవుతుందని బెదిరించారు కూడా. ఇదేదో కొందరు వ్యక్తిగత హోదాలో చేసుకుంటే పట్టించుకోనక్కరలేదు. కానీ మనం ప్రైవేటు వ్యక్తులం కాము కదా! మనం మన హోదాలను విస్మరించలేం అన్నారు నాటి ప్రధాని. తరువాత గుజరాత్‌ ‌ముఖ్యమంత్రి దేబర్‌భాయ్‌కి కూడా నెహ్రూ లేఖ రాశారు. ఆ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నంత మాత్రాన ఎంతమాత్రం ప్రభుత్వ కార్యక్రమం కాబోదు అని పదే పదే గుర్తు చేశారు. సోమనాథ్‌ ‌ప్రతిష్ట వ్యవహారం భారత్‌ ‌మీద చాలా చెడు అభిప్రాయాన్ని కలిగిస్తుందని ముఖ్యమంత్రికి రాశారు. దీనిని పాకిస్తాన్‌ అలుసుగా తీసుకుంటుందని కూడా అభిప్రాయపడ్డారు నెహ్రూ. ఇక్కడ ఆయన పాకిస్తాన్‌ను తలుచుకోవడం వెనుక ఒక కారణం ఉంది. అది భారత్‌ ‌మీద పడుతుందని భావిస్తున్న చెడు అభిప్రాయం నేపథ్యంగా ఉన్నది కాదు. మే 12, 1951న కరాచీలో జరిగిన ఒక బహిరంగ సభలో సోమనాథ్‌ ఆలయ పునరుద్ధరణ కార్యక్ర మానికి పాకిస్తానీయులు నిరసన తెలియచేశారు. దురాక్రమణకు బలై ధ్వంసమైనదిగా ఆ ఆలయం గురించి చెప్పడం ముస్లింలకు అంగీకారయోగ్యం కాదని ఆ సందర్భంగా ఆమోదించిన తీర్మానంలో చెప్పుకున్నారు.

సోమనాథ్‌లో లింగ ప్రతిష్ట సంగతి ఒక వాస్తవమైతే, ప్రజాస్వామికవాదిగా నెహ్రూ అంతరంగం కూడా ఆ కార్యక్రమం సందర్భంగా చరిత్రలో ప్రతిష్టితమైంది. మే 11, 1951న ప్రతిష్ట కార్యక్రమానికి రెండువారాల ముందే, అంటే ఏప్రిల్‌ 28‌న నాటి కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఆర్‌ఆర్‌ ‌దివాకర్‌కు నెహ్రూ లేఖ రాశారు. సోమనాథ్‌ ఆలయ ప్రతిష్ట కార్యక్రమం గురించి ఆకాశవాణిలో ఇచ్చే ప్రాధాన్యం బాగా తగ్గించండని అదేశిస్తూ రాసినదే ఆ లేఖ. ఆ ఉత్సవం అసలు ప్రభుత్వానికి సంబంధించినది కానేకాదన్న విషయమే ప్రధానంగా ఉండాలని కూడా నెహ్రూ సూచించారు. అయినా మిగిలిన మంత్రుల మాదిరిగా దివాకర్‌ ‌కూడా అటే మొగ్గుతారేమోనని, సోమనాథ్‌లో జరుగుతున్న ఉత్సవాల నిర్వహణ పట్ల తనకు చాలా విచారంగా ఉందని ముక్తాయించారు.

రాజెన్‌బాబును ఈ ఒక్క వివాదంతోనే చరిత్ర గుర్తు పెట్టుకున్నదని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. ఆయన విద్యావంతుడు. స్వాతంత్య్ర సమరయోధుడు. గాంధీజీకి అత్యంత ఆప్తుడు. రాజనీతిజ్ఞుడు.

రాజేందప్రసాద్‌ ‌బిహార్‌లోని జైరాదీలో పుట్టారు. తండ్రి మహదేవ్‌ ‌సాహె సంస్కృతం, పర్షియన్‌ ‌భాషలలో పండితుడు. తల్లి కమలేశ్వరి దేవి సంప్రదాయాల పట్ల అనురక్తి కలిగిన గృహిణి. చాప్రా జిల్లాలో ప్రాథమిక విద్య తరువాత కలకత్తా విశ్వవిద్యాలయంలో చేరారు. జేసీ బోస్‌, ‌ప్రఫుల్ల చంద్ర రాయ్‌ ‌వంటి గొప్ప గురువుల దగ్గర అక్కడ చదివారు. ఆయన అక్కడ ఉండగానే బిహార్‌ ‌విద్యార్థుల సమావేశం 1908లో జరిగింది. అలాంటి ఒక సమావేశంలో దేశంలో జరగడం అదే ప్రథమం. మొదట సైన్స్ ‌చదివినప్పటికీ తరువాత సామాజిక శాస్త్రాలు తీసుకున్నారు. ఆర్థికశాస్త్రంలో పీజీ చదివారు. తరువాత న్యాయశాస్త్రం కూడా చదివారు. కలకత్తాలో కొద్దికాలం, తరువాత పట్నా హైకోర్టులో కొంతకాలం న్యాయవాద వృత్తి చేపట్టారు. 1906 నాటి కలకత్తా జాతీయ కాంగ్రెస్‌ ‌సమావేశాలలో స్వచ్ఛంద కార్యకర్తగా పనిచేయడంతో ఆయన రాజకీయ జీవితం మొదలయింది. తరువాత అఖిల భారత కాంగ్రెస్‌ ‌కమిటీ సభ్యుడయ్యారు. చంపరాన్‌ ‌రైతు ఉద్యమంలో గాంధీజీతో కలసి పనిచేశారు. 1920 గాంధీజీ పిలుపు మేరకే న్యాయవాద వృత్తి వదలి ఉద్యమంలో చేరారు. తరువాత రాజ్యాంగ పరిషత్‌ అధ్యక్షుడయ్యారు. అంతిమంగా స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతి అయ్యారు.

ప్రథమ పౌరుడు ఒక మత కార్యక్రమానికి హాజరైతే సెక్యులరిజానికి మంచిది కాదంటూ నెహ్రూ ఇచ్చిన భాష్యాన్ని రాజెన్‌బాబు పూర్తిగా నిరాకరించారు. అలాగే సోమనాథ్‌ ఆలయానికి చరిత్రలో ఉన్న ప్రాధాన్యం గురించి నెహ్రూ వ్యక్తం చేసిన అభిప్రాయాలను కూడా ఆయన పూర్తిగా తృణీకరించారు. దేశానికి ఎంతమాత్రం సరికాని నెహ్రూ శైలి సెక్యులరిజం నుంచి భారతదేశం కొంతవరకైనా తనను తను కాపాడుకున్నదంటే అందుకు స్వాతంత్య్రానంతర తొలితరం నేతలల• ఉన్న నిజమైన రాజనీతిజ్ఞులు -వల్లభ్‌ ‌భాయ్‌ ‌పటేల్‌, ‌శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీ, పురుషోత్తమదాస్‌ ‌టండన్‌ ‌వంటి నాయకులు కారణం. అలాంటి మాన్యులలో రాజెన్‌బాబు ఒకరు. భారతదేశం ఒక గణతంత్ర దేశంగా నిలదొక్కుకోవడానికి తొలి రాష్ట్రపతిగా ఆయన అందించిన సేవలు కూడా కారణమే.

భారతీయమైన మనోభావాలతో నెహ్రూ పదే పదే సంఘర్షించిన సంగతి ఒక చేదు నిజం. ఒకరకమైన మౌఢ్యంతో ఆయన చాలామందిని దూరంగా ఉంచారు. కానీ రాజెన్‌బాబు వంటి నాయకులు నెహ్రూ గాలికి తట్టుకుని నిలిచి, తమదైన వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నారు. ఇందుకు గొప్ప తార్కాణం సోమనాథ్‌ ‌ప్రతిష్ట కార్యక్రమం. మళ్లీ ఎనిమిదేళ్ల తరువాతనే నాకు సోమనాథ్‌ను దర్శించే అవకాశం వచ్చిందనీ, ఇది పురాతన కాలం నుంచి గొప్ప పుణ్యక్షేత్రంగానే దర్శనీయ స్థలంగానే ఉన్నదనీ ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన నిష్కర్షగా చెప్పడం నెహ్రూ మార్కు సెక్యులరిజానికి గొప్ప సమాధానం వంటిదే. చరిత్రలో సంభవించిన అనేక సంక్షోభాల వల్ల సోమనాథ్‌ ‌పలుమార్లు పతనమైనా మళ్లీ పునరుద్ధ రణకు నోచుకుంటూనే ఉందని కూడా రాజెన్‌బాబు చెప్పారు. ఇప్పుడు మళ్లీ పునరుద్ధరణ జరగడం మనందరికీ గర్వకారణమని, అది కూడా స్వర్గీయ సర్దార్‌ ‌పటేల్‌, ‌జామ్‌ ‌సాహెబ్‌ ‌నాయకత్వంలో జరిగిందని బాబు రాజేందప్రసాద్‌ ‌వ్యాఖ్యానించారు. నిజానికి సోమనాథ్‌ ‌వివాదం ప్రథమ రాష్ట్రపతి, ప్రథమ ప్రధాని మధ్య సాగుతున్న ప్రచ్ఛన్నయుద్ధం గురించి లోకానికి వెల్లడించిందని ఆర్‌ఎల్‌ ‌హాండా రాసిన ‘రాజేందప్రసాద్‌- ‌ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్‌ ‌ట్రయంఫ్‌ అం‌డ్‌ ‌డిస్పెయిర్‌’ ‌పుస్తకంలో చెప్పారు. ఇది రాజెన్‌బాబు జీవితచిత్రణ. అసలు రాజెన్‌బాబు పదవీ స్వీకారం చేసిన రెండు మాసాలకే వారిద్దరి మధ్య రాజ్యాంగ అంశాల మీద భిన్నాభిప్రాయాలు మొదలయినాయి. అందులో రాష్ట్రపతి అధికార పరిధి గురించి కూడా ఉంది. అసలు రాష్ట్రపతి పదవి విషయంలో నెహ్రూ తొలి ప్రాధాన్యం రాజెన్‌బాబు కానేకాదని మత్తయ తన గ్రంథం, ‘రెమినిసెన్సెస్‌ ఆప్‌ ‌ది నెహ్రూ ఏజ్‌’‌లో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. రాజెన్‌బాబు సనాతనుడు, సంప్రదాయవాది అని నెహ్రూ భావించేవారు. సి. రాజగోపాలాచారి కూడా ఆ పదవికి రంగంలో ఉన్నా ఎక్కువ మంది ఎంపీలు ఆయనను అంగీకరించలేదు. ఈ విషయంలో సర్దార్‌ ‌పటేల్‌ ‌మౌనం దాల్చారు. కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారన్న వ్యూహం పటేల్‌ది. ఇక్కడే నెహ్రూ అభిప్రాయం బయటకు రాలేదు. దీనితో రాజెన్‌బాబును రాష్ట్రపతిగా ఆమోదించకతప్పని పరిస్థితి నెహ్రూకు వచ్చింది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి, మంత్రిమండలిలో చోటు వంటి తాయిలాలు కూడా నెహ్రూ చూపించారు. కానీ వాటికి రాజెన్‌బాబు లొంగలేదు. చివరికి జనవరి 26, 1950న రాజేంద్ర ప్రసాద్‌ ‌రాష్ట్రపతి అయ్యారు. తరువాత మాత్రం సోమనాథ్‌ ‌విషయంలో నెహ్రూ వాదనను రాజాజీ బలపరచడం విశేషం.

అసలు సోమనాథ్‌ ‌లింగ ప్రతిష్ట కార్యక్రమానికి రాజెన్‌బాబును ముఖ్య అతిథిగా పిలవడం వెనుక కూడా ఒక అనివార్యత ఉంది. ఆ ప్రఖ్యాత ఆలయ జీర్ణోద్ధరణ, తరువాత లింగ ప్రతిష్ట సర్దార్‌ ‌పటేల్‌ ‌చొరవే. కానీ ఆ శుభ కార్యం జరిగే లోపుననే పటేల్‌ అస్తమించారు. దీనితో కేఎం మున్షీ రాజెన్‌బాబును కార్యక్రమం కోసం ఆహ్వానించారు. ఎవరి అభ్యంతరాలు ఎలా ఉన్నా గుజరాత్‌లోని ప్రభాస్‌ ‌పతాన్‌ ‌పట్టణంలో ఉన్న సోమనాథ్‌ ఆలయంలో రాజేందప్రసాద్‌ ‌మే 11, 1951న ఉదయం 9.47కు వేద పఠనం మధ్య జోతిర్లింగాన్ని ప్రతిష్టించే భాగ్యానికి నోచుకున్నారు. కేఎం మున్షీ, జామ్‌ ‌సాహెబ్‌, ‌ముఖ్యమంత్రి దేబర్‌భాయ్‌ ‌సమక్షంలో ఆ కార్యక్రమం వైభవంగానే జరిగింది.లక్ష మంది భక్తులు హాజరయ్యారని చెబుతారు. 101 కేనన్‌ ‌గన్ల వందనం జరిగింది.

ఇది నెహ్రూ మీద విజయం కాదు. నెహ్రూ మార్కు భ్రమాజనిత సెక్యులరిజం మీద భారత ఆధ్యాత్మికచింతన సాధించిన విజయం. ప్రభుత్వంలో ఉన్నవారికీ మనోభావాలు ఉంటాయనీ, అవి ఎంతో బలమైనవనీ దీనితో తేలింది. పదవి తాత్కాలికం, పరంపర శాశ్వతం. భారత దర్శనం వంటి పుస్తకం రాసినా భారతీయతను గమనించడానికి ఏనాడు ఇష్టపడని వ్యక్తి భారత ప్రథమ ప్రధాని.

About Author

By editor

Twitter
YOUTUBE