నవంబర్‌ 30 ‌తిరుచానూరు శ్రీ పద్మావతీ దేవీ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

అలమేలు మంగమ్మ సాక్షాత్తు ఆనందనిలయుని దయాస్వరూపం. భక్తవరదాయిని. భక్తుల విన్నపాలను, ఇక్కట్లను ఆలకించి విభునికి వినిపించి, ఒత్తిడి తెచ్చి వరాలు ఇప్పిస్తారు. అందుకే ‘మముగన్న మాయయ్మ అలమేలు మంగమ్మ/విభునికి మా మొరలు వినిపించవమ్మా’ అంటూ భక్తులు వేడుకుంటారు. పైగా, ‘తిరుమల క్షేత్రంలో పెత్తనమంతా పద్మావతీ దేవిదే! నా పట్టపురాణి అలమేలుమంగ ఎంత చెబితే అంత. అందువల్ల నా హృదయంలో కొలువై ఉన్న ఆ ‘వ్యూహలక్ష్మి’ని వేడుకో. నీ కోరికను విన్నవించుకో. అలమేలు మంగ నిన్ను అనుగ్రహించిందనుకో. ఇక తిరుగే లేదు. నీవు దండిగా, మెండుగా ఈ కొండపై ఉండవచ్చు’ అని తిరుమలేశుడే తరిగొండ వెంగమాంబకు కలలో కనిపించి హితవు చెప్పారట. తన గారాబుదేవేరి గురించి చెప్పిన ‘శ్రీసూక్తి’ భక్తజనులందరికి మార్గదర్శనం.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస్‌ ‌పెరుమాళ్‌ ‌తపమాచరించిన పుణ్యప్రదేశం తిరుచానూరు. పావన స్వర్ణముఖీతీరంలో రూపొందిన వ్యాసభగవానుడి తనయుడు శ్రీశుకమహర్షి ఆశ్రమమే (శుకపురి) నేటి తిరుచానూరు. దీనికి ‘తిరుచ్చికనూర్‌’, ‘‌తిరుచ్చొకనూర్‌’ అని నామాంతరాలు ఉన్నట్లు 8,9 శతాబ్దాల నాటి తిరుమల తిరుపతి దేవస్థానాల దేవాలయాల శాసనాలు పేర్కొంటున్నాయి. శ్రీమహావిష్ణువు వక్షంపై భృగుమహర్షి పాదతాడనంతో అలిగిన వక్షస్థల నివాసిని వైకుంఠాన్ని వీడగా, ఆమెను వెదుకుతూ విష్ణువూ భూలోకం చేరారు. ప్రియసతి కొల్హాపురంలో ఉందని తెలిసి ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు విఫలయత్నం చేశారు. అశరీరవాణి సూచన మేరకు సువర్ణముఖరీ నదీతీరాన కుంతాయుధంతో (బల్లెం)తో సరోవరాన్ని నిర్మించి స్వర్గం నుంచి బంగారు పద్మం తెప్పించి నెలకొల్పి, సరోవరానికి తూర్పున పశ్చిమాభి ముఖంగా సూర్యభగవానుడిని ప్రతిష్టించి మహాలక్ష్మి కోసం పుష్కరకాలం పాటు తపస్సు చేశారట. కొంతకాలం కేవలం పాలు, మరికొంత కాలం నిరాహారంగా చేసిన కఠోర తపస్సుకు మెచ్చిన శ్రీమహా లక్ష్మి అలమేలుమంగ రూపంలో అనుగ్రహించారు. సౌరమానం ప్రకారం కార్తిక మాసం శుక్ల పక్షం పంచమి శుక్రవారం ఉత్తరాషాడ నక్షత్రం పుణ్య ముహూర్తంలో సహస్రకిరణాల స్పర్శతో వికసించిన పద్మం నుంచి అమ్మవారు ఆవిర్భవించారు. పద్మంలో అవతరించారు కనుక ‘శ్రీపద్మావతి’ అని, పుష్పంపైన దేదీప్యమానంగా వెలుగులీనుతున్న దివ్యవనిత కనుక ‘అలర్‌ ‌మేల్‌ ‌మంగ’ అని దేవతలు కీర్తించారట. శ్రీవారు తన మెడలోని కలువవూల మాలను ఆమె మెడలో వేసి, ఆమెను వక్షస్థలంలో ‘వ్యూహలక్ష్మి’గా ఆవాహనం చేసుకున్నారు. అంతవరకు ‘సిరి’ రహిత దేవుడు ‘శ్రీనివాసుడు’ అయ్యారు.

దేవదేవుడు శ్రీవేంకటేశ్వరుడు భక్తజనప్రియుడు, ఆపదమొక్కులవాడు, అనాథ రక•కుడుగా మన్ననలు అందుకుంటుండగా, ఆయన దేవేరి శ్రీపద్మావతీ దేవి భక్తకల్పవల్లి, పలుకు తేనెల తల్లి, ప్రేమ స్వరూపిణీ, కరుణామయిగా ఆరాధనలు అందుకుంటున్నారు. పద్మసరోవర మహత్యాన్ని నారద వసిష్ట మరీచి అత్రి అంగీరస పులస్త్య పులహక్రతుదాది మహర్షులు ప్రస్తుతించారు.

అర్చామూర్తిగా అలమేలుమంగ

జనశ్రుతిలో ఉన్నట్లు అమ్మవారు అయ్యవారిపై అలగలేదు. ఆయనా ఆమెను దూరం పెట్టనూలేదు. ఒకవేళ ప్రణయ కలహమనుకున్నా అది లోకకల్యాణం, భక్తపాలన కోసమేనన్నది పురాణగాథ. వేంకటేశుడు ప్రతిష్టించిన సరోవరంలో ఆవిర్భవించిన అలమేలు మంగ బ్రహ్మాదిదేవతల విన్నపం మేరకు భక్తజనులను తరింపచేసేందుకు ఆ క్షేత్రంలోనే ‘అర్చామూర్తి’గా స్థిరపడేందుకు అంగీరించారు. అప్పటికే ‘వ్యూహలక్ష్మి’గా వక్షంలో నిలుపుకున్న శ్రీనివాసుడూ అందుకు ఆమోదించారు. అయితే దేవేరి కోరినట్లు వేంకటాచల క్షేత్రంలో తరహాలోనే తిరుచానూరులోను బ్రహ్మోత్సవాలు జరిగేలా అనుగ్రహించారట. తాను ఉద్భవించిన కార్తిక పంచమి (పంచమి తీర్థం) నాటితో ముగిసేలా పదినాళ్లపాటు ఈ ఉత్సవాలు సాగేలా జగదీశ్వరి అర్థించారట. ఆ ప్రకారం తిరుమలలో శ్రీవారి ఉత్సవాలతో దీటుగా, వివిధ వాహన సేవలతో ఈ వేడుక కొనసాగుతూ వస్తోంది. ‘వీరలక్ష్మి‘గా, అర్చామూర్తిగా పూజలు అందుకుంటూ వరాలతల్లిగా అలరిస్తున్నారు.

ఇలా అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనా వాస్తవానికి శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదట ఇక్కడే మొదలయ్యాయట. తిరుమల దేవాలయంలోని తొలిశాసనం ప్రకారం తిరుచానూరులోని వేంకట నాథుడి ‘తిరువిలన్‌ ‌కోయిల్‌’‌లోని తిరువేంకట పెరుమాళ్‌కు ఈ ఉత్సవాలు జరిగేవట. అప్పట్లో దుర్గమ ప్రాంతమైన తిరుమలలో సరైన ఆలయ ప్రాకారాలు, ఉత్సవాదులకు వీధులు లేకపోవడంతో అక్కడ ‘తిరుమల ఒళుగు’ అనే ఉత్సవాన్ని ఆరంభించి మిగిలినవి తిరుచానూరులో నిర్వహించి, తిరిగి ధ్వజారోహణం తిరుమలలో జరిపేవారట. అనంతర కాలంలో విశిష్టాద్వైత ప్రతిష్టాపనాచార్య శ్రీ భగవద్రామానుజ యతీంద్రులు ఈ పద్ధతికి స్వస్తి పలికి బ్రహ్మోత్సవాలు తిరుమలలోనే జరిగేలా ఏర్పాట్లతో పాటు తిరుమలనాథుడికి నిత్యపూజా విధులను స్థిరపరచి, ఉత్సవాలనూ అక్కడే నిర్వహిం చేలా కట్టుదిట్టం చేశారు. కొండపై ఉత్సవాలకు వెళ్లలేని వారికి స్వామివారి ప్రతిరూపాన్ని తిరుచానూరు ఆలయంలో ఉంచి ఉత్సవాలు జరపడం ద్వారా శ్రీవారి దర్శనభాగ్యం కలిగించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.

వాహనసేవలు

పంచమి తీర్థానికి పదిరోజుల ముందు, అంటే చాంద్రమానం ప్రకారం కార్తిక బహుళ ఏకాదశి రాత్రి సేనాధిపతి ఉత్సవంతో అంకురార్పణ జరుగుతుంది. రెండవ నాడు ఉదయం తిరుచ్చి ఉత్సవం, రాత్రి చిన్న శేషవాహనసేవ, మూడవ రోజు ఉదయం పెద్ద శేషవాహనం, రాత్రి హంస వాహనం, నాలుగవ నాడు ఉదయం ముత్యపు పందిరి వాహనం, రాత్రి సింహవాహనం, ఐదవ నాడు పగలు కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమద్వాహనం, ఆరవ రోజు పగలు పల్లకి, రాత్రి గజవాహనం, ఏడవ నాడు ఉదయం సర్వభూపాల వాహనం, రాత్రి గరుడ వాహనం, ఎనిమిదవ రోజు పగలు సూర్యప్రభ, రాత్రి చందప్రభ వాహనోత్సవాలు, తొమ్మిదవ నాడు రథోత్సవం, రాత్రి అశ్వవాహనంపై అమ్మవారు తిరువీథులలో దర్శనం ఇస్తారు.

పంచమితీర్థం సారె

జగన్మాత బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా తిరుమలలోని ‘ఆనంద నిలయుడు’ తిరుచానూరులోని దేవేరి శాంతినిలయాధిష్ఠ దేవతకు పంచమి తీర్థంనాడు ఘనంగా సారె పంపుతారు. రెండు బంగారు నగలు, రెండు పట్టుచీరలు, రెండు పట్టు రవికల వస్త్రాలు, పచ్చి పసుపుచెట్టు, పసుపు, చందనం ముద్దలు, తులసి, పూలమాలలతో పాటు పిండివంటలు ఒక్కొక్క రకం ఒక్కొక్క పడి (51) చొప్పున పెద్ద లడ్లు, వడలు, అప్పాలు, దోసెలు తదితరాలను ఏనుగు అంబారీపై తరలిస్తారు. వీటన్నిటిని ముందుగా తిరుమలలో శ్రీవారికి సమర్పించి, దేవస్థానం సిబ్బంది, అమ్మవారి ఆలయ అర్చకులు, పరిచారకులు వాటిని వెదురుబుట్టలలో పెట్టుకొని కాలినడకన అలిపిరి పాదాల మండపం సమీపంలోని పద్మావతి పసుపు మండపానికి చేరతారు. అక్కడి నుంచి ఏనుగు అంబారీపైన వాటిని అధిష్టింపచేసి మేళతాళాలతో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ కోదండ రామస్వామి ఆలయాల మీదుగా తిరుచానూరు చేరుకుంటారు.

అక్కడ ‘అలమేలుమంగ’కు సారె సమర్పించి, పద్మసరోవరంలో పసుపు, చందనం తదితర• సుగంధ ద్రవ్యాలతో తిరుమంజనం, చక్రస్నానం తరువాతే శ్రీవారికి ఆరగింపులు ఉంటాయి. ఇది శ్రీనివాసుడు గారాబు దేవేరి కోసం తనకు తానుగా విధించుకున్న నియమంగా చెబుతారు. పద్మసరోవరంలో ఆవిర్భ వించిన దేవేరి జన్మదిన వేడుకలలో పాల్గొనేందుకు తిరుమలరాయుడు తిరుచానూరుకు వేంచేస్తాడని భక్తుల విశ్వాసం. సుదర్శన చక్రంతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పద్మసరోవరంలో పుణ్యస్నానాలు చేస్తారు.

ఈ సారెను ఆనందనిలయం నుంచి శాంతి నిలయానికి ‘కాలినడకన’ పంపడాన్నీ చమత్కారంగా చెబుతారు. ‘నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగివచ్చునో/తిరుమల శిఖరాలు దిగివచ్చునో..’ అని కవి దాశరథి కృష్ణమాచార్య అన్నట్లు, కొండలరాయుడు కొండదిగి అలిపిరిలో బంగారువో, వెండివో, ఇత్తడివో, చెక్కవో, కాదంటే చర్మ పాదరక్షలు ధరించి వడివడిగా ‘మంగపట్నం’ తరలుతారని, మళ్లీ తెల్లారేలోగా కొండకు చేరుకుంటాడని మురిపెంగా చెప్పుకుంటారు. ఆ ‘నడకే’ అలవాటుగా ప్రియసతి ఆవిర్భావ శుభదినాన కాలినడకనే సారె పంపే ఆనవాయితీని కొనసాగిస్తున్నట్లున్నారు.

పుష్పయాగం

పంచమి తీర్థం మరునాడు అమ్మవారికి పుష్పయాగం నిర్వహిస్తారు. అనేక సుగంధ పుష్పాలతో భగవంతుడిని, భగవతిని అర్చించడాన్ని పుష్పయాగం అంటారు. ఇది అగ్నిము•ంగా, ఆహూతులు, రుత్విక్కులతో కూడిన యాగం కాదు. శాంతియాగం.

‘ధ్వజారోహణ తీర్థాంత

ప్రాయశ్చిత్తంతు యద్భవేత్‌

‌తస్యదోష విఘాతార్థం

పుష్పయాగం చ కారయేత్‌’ అని ఆర్యోక్తి. ఉత్సవాలలో ధ్వజారోహణం నుంచి అవభృత (చక్ర) స్నానం దాకా సాగిన కార్యకలాపాలలో చిన్నపాటి లోపాలు, దోషాలు చోటుచేసుకుంటే వాటి నివారణకు వేదసూక్తాలు, ఉపనిషత్తుల పఠనంతో ఈ విశేష క్రతువును నిర్వహిస్తారు. కేవలం ఉత్సవాల ముగింపు సందర్భంలోనే కాకుండా, సూర్యచంద్ర గ్రహణాం తారాలలో, తుల కర్కాటక మకర సంక్రమణాలలో, శ్రవణ నక్షత్రంలో, అనావృష్టి లేదా దుర్భిక్ష పరిస్థితులలో, మహావ్యాధులు ప్రబలినప్పుడు, దేశోపద్రవాలు సంభవించినప్పుడు, ఆకాశంలో చూడరాని ఉత్పాతాలు కనిపించిన సందర్భాలలో శ్రీ మహా విష్ణువుకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం చేసి, మరునాడు పుష్పయాగం చేయడం శుభప్రదమన్నది పెద్దల మాట.

దేవదేవేరుల నిత్యారాధనలో పుష్ప వినియోగం ఉన్నప్పటికీ వాటిని ఒక్కొక్కటిగా సమర్పిస్తారు. ఈ సందర్భంలో మాత్రం రాశులుగా సమర్పిస్తారు. ఈ యాగంలో అన్ని రంగులపూలను వాడడం శ్రేష్టం, రెండు రంగులు మధ్యమం, ఏకవర్ణం పూలతో యాగం అథమం అని శాస్త్రం. తెల్లపూవులు శాంతిని, పసుపువి పుష్టిని, నల్లనివి వశీకరణ, ఎరుపు పూలు శత్రు విద్వేషాన్ని హరిస్తాయి కనుక, ఇవన్నీ నెరవేరాలంటే అన్ని రకాలతో అర్చించాలన్నది భావం. పుష్పయాగం వల్ల తరతరాల వారు పునీతులవుతారని, ఈతిబాధలు తొలగి దేశం సుభిక్షంగా ఉంటుందని చెబుతారు.

– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE