జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన
– డా।। చింతకింది శ్రీనివాసరావు
కన్నతల్లి స్వరం గాఢత చెందడం, ఎన్నడూ లేని విధాన కరుగ్గా వెల్లువెత్తడం, నగ్నసత్యాలను ఆవిష్కరించడంతో గతుక్కుమన్నాడు దేవేంద్రుడు. అయినా బింకాన్ని వీడలేదు. తప్పులను కప్పిపుచ్చుకునే ధోరణిలో,
‘‘నేనెప్పుడూ నందపురాన్ని తక్కువ చేయలేదు. స్నేహధర్మంతోనే కొన్ని అంశాల్లో చొరవచేశాను. అయినా అవన్నీ గతం. ఇది మరచిపోవాల్సిన తరుణం. నాకూ ఒక చెల్లెలు లేకపోలేదు. నేనేందుకు ఎదరి పిల్లను లోకువ కడతాను. పైగా నంద యువరాణీతో బంధం పెళ్లిపీటలకు చేరితే వడ్డాది, నందరాజ్యమూ ఒక్కటి కాదా, అమ్మా! నువ్వు కోపం తగ్గించుకో. మన ప్రతిపాదనను తక్షణమే నందప్రభువులకు పంపించు.’’ అంటూనే మాతృమూర్తి పాదాలకు వంగి వంగి నంగి నంగి నమస్కారాలు చేశాడు. పుత్రరత్నం ఎప్పుడయితే అనునయంగా మాట్లాడినట్టు తల్లికి తోచిందో ఆమె హృదయం తేటబడింది. అంచేతనే,
‘‘ప్రతిపాదన ఎవరితోనో చేరవేయడం కాదు. స్వయంగా ప్రణవశర్మవర్యులే నందపురం వెళ్లి సంబంధాలు ఖాయం చేసుకుని వస్తారు. కుండ మార్పిళ్లు కూర్చుకుని విచ్చేస్తారు. రేపే ఆయన ప్రయాణం. పల్లకీని, మందీమార్బలాన్ని సిద్ధం చేయించు.’’ అనేసి పూర్ణిమాదేవి చరచరా పట్టపుదేవి మందిరం వైపు పయనింపు చేసేసింది.
ఆ మరుసటి దినమే ప్రణవయ్య నందపురానికి బయలుదేరివెళ్లాడు. ఆ మరురోజే నంద పట్టపురాణి మాకలిశక్తికి, ఆమె కుమారుడు వేంకటేశునికి వర్తమానాన్ని అందజేశాడు. వారిని ఒప్పించి మెప్పిం చేందుకు వీలుగా అక్కడే అతిథిగా ఉండిపోయాడు.
* * *
గడచిన మూడురోజులుగా నందపురంలో చిన్నపాటి కలకలమే రేగుతోంది. నందంలోనే అని కాదు. రాజ్యం మొత్తాన పెద్ద చర్చలే జరుగుతున్నాయి. అప్పటివరకూ అక్కడి జనావళికి ఒక భయమే ఉండేది. అది శత్రుభయం. ఇప్పుడు మరో భీతి. మత్స్యరాస ప్రభువులు తమ రాచకుటుంబంతో అతిగా నెయ్యం నెరపడానికి సంసిద్ధులయ్యారనేది వార్త. ఈసారి ఆ నెయ్యాన్ని వియ్యంతో స్థిరపరుచుకునే ప్రయత్నమూ చేస్తున్నారన్నది భోగట్టా. నంద పౌరులందరూ ఈ అంశంపైనే ప్రస్తుతం మల్లగుల్లాలు పడుతున్నారు. వాదప్రతివాదనలకు దిగుతున్నారు. వీటికి ప్రధానవేదికగా మారిపోయింది రాజధానిలోని చిడుగుల సత్రం.
ఈ సత్రాన్ని కొన్ని వందల ఏళ్ల కిందట నందప్రభువు ప్రతాపగంగరాజు నిర్మించాడు. రాజ్యం లోని ఎక్కడివారయినా పనులమీద నందపురానికి వచ్చినప్పుడు ఉచితంగా వసతి, భోజన సౌకర్యాలు అందించేందుకు ఏర్పాటు చేశాడు. ఎక్కడెక్కడివారి బస ఇక్కడే అన్నట్టుగా ఇప్పటికీ అంతా సాగిపోతోంది.
గంగరాజు శాంతశివుని భక్తుడు. శాకాహారి. అప్పటికీ ఇప్పటికీ నందరాజ్యం వరకూ ఆయనే ప్రథమ శాకాహారిగా పేరుపడ్డాడు. ఇందువల్లనే సత్రంలో ఎవరు ఎన్నిరోజులు ఉన్నా ఫరవాలేదు. వారికి మాంసాహారం మటుకు వడ్డించరు. వచ్చినవారంతా శాకపాకంతోనే సరిపెట్టుకోవాలి. కొర్రలు, ఊదలు, రాగులు, జొన్నలు, అరికెలు పుట్ల కొద్దీ రోజూ సత్రంలో ఉడుకుతూనే ఉంటాయి. వాటితో చింతకాయపచ్చడో, దుంపలపచ్చడో, కొండకందికట్టో వడ్డిస్తుంటారు. ఆ మీదట రకరకాల జావలూ, అంబళ్లూ తాగబోస్తుంటారు. పెరుగు మాత్రం దొరకదు. మజ్జిగ ప్రశ్నే లేదు. నంద•రాజ్యంలో పశువుల పాలు మొత్తం వాటి పిల్లలకే దక్కాలనేది జీవకారుణ్య నిబంధన. పశుగణాన్ని వ్యవసాయ పనులకే తప్ప మరి దేనికీ వాడుకోకూడదన్నది ఆ దేశపు నిష్ట. ఇందువల్లే చిడుగుల సత్రంలో నాలుగునాళ్లు భోంచేసి వెళ్లే ఎవరయినా ఇళ్లకు చేరిన మరుక్షణం నాలుక రోసి పోయిందన్న యావతో మాంసాహారం మీద పడిపోతారు. జీలుగుకల్లుకు ఎగబడిపోతారు.
ఎప్పటిలాగానే ఆనాటి మధ్యాహ్నపు భోజనాలవేళ కూడా సత్రంలో బంతులు లేస్తున్నాయి. పెద్దసంఖ్యలో జనం తినివెళుతున్నారు. సాయంత్రం నాలుగుగంటల మందళవేళ చివరిబంతి నడుస్తోంది. రబ్బలవలస, కొణిసింగి, ఇగురుపుట్టు గ్రామాలవారు విక్రమార్కసింహాసనానికి జోరలు చేసేందుకు, తమ రాజ్యపు ఘనతను వల్లెవేసుకునేందుకు, గిరిగుర్రాల మీద మూటముల్లెతో దిగబడ్డారు. వారి భోజన పర్వమే సత్రాన ఇప్పుడు సాగిపోతోంది. విస్తరంట ముందు కూర్చున్న కొణిసింగి వాస్తవ్యుడు నీలసింగడు తన చెవిచేరిన మత్స్యరాసుల వ్యవహారాన్ని ప్రస్తావించాడు.
‘‘మనకి ఏ మాత్రమూ సహాయపడని వడ్డాది దేవేంద్రుడు వెంకటేశులవారికి తన చెల్లెల్ని ఇస్తాడట. మన రాచగన్నియను పెళ్లి చేసుకుంటాడట.’’ కేకవేసినట్టుగా జావ జుర్రుతూనే అనేశాడు. దీనికి ప్రతిస్పందనగా,
‘‘అవునవును. పల్లాలవారు పెద్దపనివాళ్లు. అందితే జుత్తు. అందకపోతే కాళ్లు. భైరవరాజు చనిపోయిననాటినుంచీ ఎన్నో బాధలు పడుతున్నాం. ఒకపక్క ఓఢ్రదేశపు బారగడ ప్రభువులు, మరోపక్క మధ్యప్రదేశపు బస్తరు చక్రకూటపుదొరలు మనమీద చిందులేస్తుంటే ఆ వడ్డాదిరాజు దేవేంద్రుడు కిమ్మనలేదు. మీదుమిక్కిలిగా వహ్వారీ చిత్తగించాడు. అలాంటి వడ్డాదివాడికి నేడు మన బిడ్డ కావలసి వచ్చింది. చోళులు, చాళుక్యులు చుట్టుముడితినేగానీ అయ్యగారికి నందం అవసరపడలేదు.’’ రబ్బలవలస నివాసి నాగబన్ని ఊదబియ్యపన్నం ఉండలుగా చేస్తూ గంగవెర్రులెత్తిపోయాడు. ఇంతలోనే అదే ఊరికి చెందిన చెంగడు గొంతు సవరించాడు.
‘‘పోనీలెద్దురూ! అయిందేదో అయిపోయింది. ఇప్పుడవన్నీ ఎందుకు? ఒకనాటి వడ్డాదిపురాధీశులు ప్రతాపార్జునదేవుడు, తరువాతి ఏలిక అర్జున దేవుడు మనమంటే ప్రాణం పెట్టలేదా ఏం! ఇప్పుడేదో ఈ దేవేంద్రుడు కొద్దిగా లెక్కతప్పాడంతేను. ఈ పెళ్లి జరిగాక అంతా కుదుటపడుతుంది.’’ సర్దుబాటు మాటలు పలికాడు. చెంగడి మాటలకు నీలసింగడు మరింతగా రెచ్చిపోయినట్టయ్యాడు.
‘‘నీకేం తెలుసునయ్యా కింది వారి మర్యాదా. వాళ్లకీ మనకీ అస్సలు పొసగదు. పల్లాన పదివేల మాయలు. సంతలో ఆరువేలు. మన్యాన ఒక వెయ్యి మాత్రమే. అది తెలుసుకో.’’ అందరికీ వినబడేలాగానే పలికాడు. ఆనక బాగా నోరు తగ్గించి,
‘‘కిందినుంచి గ్రామసేవకులుగా మీదికొచ్చిన కోలగాళ్లతోనే పడలేకపోతున్నాం. చుక్కలు చూపిస్తు న్నారు. ఉల్లిపాయంత కోలడు ఊరంతా కంపు. కోలలే ఇలా ఉంటే వారి ప్రభువులు మీదపడి•తే చెప్పేదేముంది. కొండవాళ్లం కాయగలమా?’’ నిష్టూరంగా అనేశాడు. తన భాషణ బంతికి దూరంగా కూర్చుని అంటరానివారిగా అన్నాలు తింటున్న తమఊళ్ల కోలగాళ్ల చెవిన పడకూడదని ఎంతగానో అనుకున్నాడు. అయినప్పటికీ వాళ్లు విననే విన్నారు. కొండప్రజ తమ గురించి రకరకాలుగా మాట్లాడు కోవడం ఎప్పుడూ ఉన్నదేలే అన్నట్టుగా భోజనంలో నిమగ్నమైపోయారు. ఈలోగానే పనసపిక్కల కూరలోని కరివేపాకును ఎంగిలివేళ్లతో పైకి తీసిచూపిస్తూ ఇగురుపుట్టువాసి కండడు విరగబడిపోయాడు.
‘‘చూశారా ఈ కరివేపాకుని! దీన్ని మనం కంపురొడ్డ అంటాం. నిజానికి అదే సరైన మాట. కానీ దీని విత్తనాలను దిగువ దుండగులు అంకించు కుని పోయి, రకరకాల సేద్యపు ప్రయోగాల చేసి, దీనికి మరింత కంపు జోడించి, మనకే అంటగడు తున్నారు. ఇదేకాదు. మన విత్తనాలేవైనా కిందికిపోయి మారురూపుతో మళ్లీ మన తలుపే తడుతున్నాయి. ఇది ముమ్మాటికీ కింది దొంగలదగా. వాళ్లు ముదుర్లు. మనల్ని దోచి, దోచిన సొత్తును మనకే అమ్ముతున్న దెష్టలు.’’ గరగరలాడిపోయాడు. కండడి మాటలు సరైనవే అన్నట్టుగా అందరూ జోరజోర అంటూ గోలగోలపెట్టారు.
‘‘ఉష్..’’ అనే పెద్ద కేక ఆ పట్టున పెనుస్వరమై వినిపించడంతో మెల్లగా అందరూ సర్దుకున్నారు. అలా నోరు చేసుకున్నది వయోవృద్ధుడైన కొణిసింగి వాసి పోకల దంతెయ్య. అంతా నిశ్శబ్దం పాటించాక భాషించడం మొదలెట్టాడు.
‘‘కూడు తింతిమి.. గుణము తప్పితీమి.. అని అనిపించుకోకండర్రా. అడిగిన పిల్ల.. కడిగిన ముఖం.. అన్నారు పెద్దలు. ఇదీ మనమంచికే. ఆడపిల్లలకి పెళ్లి చెయ్యకతప్పదు. ఎదిగిన పిల్ల ఉంటే అడగడం సహజమే. హెచ్చుగా ఆలోచించకండి. మరోమాట మరువకండి. మన యువరాణి రాచగన్నియ చిన్నింటిది కాదు. ఆ పాప బుద్ధికి• బృహస్పతి. ఆచితూచిగానీ మనువుకు వొల్లదు. కాబట్టి ఆ పిల్ల నిర్ణయానికి వదిలేస్తే మంచి జరుగుతుంది. అక్కరలేని మాటలు కట్టిపెట్టండి.’’ పెద్దమనిషి ఈ పద్ధతిలో చెప్పేసరికి అంతటితో ఆ చర్చ ఆగిపోయింది.
ఇదేవేళకు అక్కడికి కొంతదూరంలో ఉన్న నందరాజ్యపు రాచమహల్లో ఈ విషయమై తర్జన భర్జనలు మొదలయ్యాయి. మాకలిశక్తి, ఆమెబిడ్డలైన రాచగన్నియ, వెంకటేశుడు వడ్డాదిప్రభువు పంపిన వివాహవర్తమానాలపై తలామాటా అంటున్నారు.
* * *
‘‘అది ప్రభాతవేళ. నందరాచకుటుంబమంతా భైరవదుర్గాదేవికి, గండనీలకంఠస్వామికి, శాంత శివప్రతిమలకు పూజలు ముగించారు. మహంకాళి అందించినట్టుగా చెబుతున్న మహాఖడ్గానికి భక్తిశ్రద్ధలతో అర్చన జరిపారు. ఆవేళ రథసప్తమి కావడంతో సూర్యభగవానునికి పాలముద్దల నివేదనలు చేశారు. బెల్లంబువ్వల సాకపెట్టారు. లెంకలు మంత్రఘోష వినిపిస్తుండగా ఆ సప్తాశ్వరథస్వామికి వేనవేల జోతలు అర్పించారు. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష్ణ, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరనామాల ప్రాశస్త్యాన్ని వివరిస్తున్నట్టుగా గిరిభాషలో దివాకరుని నుతించారు పూజారులు. భక్తిభావనతో ఆ స్తోత్రాలను విన్నారు రాచకుటుంబసభ్యులు. తీర్థప్రసాదాలను స్వీకరించారు.
ఎంత భక్తియుతంగా పూజాదికాల్లో భాగం పంచుకున్నప్పటికీ మాకలిశక్తి, వెంకటేశుడు, రాచగన్నియలకు మనసులో ఏదో ఒక మూల కీలకనిర్ణయమేదో తీసుకోవాల్సి వస్తోందన్న యాతన లేకపోలేదు. అది కేవలం వివాహబంధానికి సంబం ధించినది మాత్రమే కాకుండా, నందరాజ్య భవితనూ నిర్ణయించేదిగా ఉంటుందనేదీ వారికి తెలియకపోదు. అందుకే దైవంపై చిత్తాన్ని నిలిపినప్పటికీ చిన్నపాటి మనోమరలింపు వారికి లేకపోలేదు.
పూజాదికాలు పూర్తయ్యాయని లెంకలు, గిరిఒజ్జలు ఏకకంఠాన పలకడంతో రాజవంశీకులు మువ్వురూ ఆ పెద్దలకు పాదాభివందనాలు చేశారు.
‘‘జై..శివ.. జై జై.. నీలకంఠ..’’ నినాదాలు లెంకల నోటివెంట దీవెన పనసలై వెల్లువెత్తగా తాంబూలాలిచ్చి వారిని సగౌరవంగా సాగనంపారు.
పెద్దలందరూ అలా వెళ్లిపోయాక పూజా మందిరం ఒక్కసారిగా నిశ్శబ్దానికి నెలవైంది. అగరు ధూమాలు, కస్తూరి పరిమళాలు, జవ్వాది సౌరభాలు, కొండమల్లెల సువాసనలు కలగలిసి ఆ పూజా గృహంలో మరింతగా సురభిళమవుతున్నాయి. అవిసె తైలపు దీపాలు చురచురమనే శబ్దాలతో వెలుగులు కురిపిస్తున్నాయి. కర్తవ్యాన్ని తలపునకు తెచ్చుకున్నట్టుగా రాచగన్నియే తొలిమాటలు వినిపించింది.
‘‘అన్నయ్యా! సమాలోచన మందిరానికి వెళదామా! నేటి రాచకార్యం చిన్నది కాదు కదా!’’ మాతృమూర్తి మాకలిని, సోదరుడు వెంకటేశుని ఒకేమారు ఉద్దేశించి పలికినట్టుగా పలికింది. అంతటితో ఊరుకోకుండా,
‘‘వడ్డాదిమంత్రి ప్రణవశర్మవర్యులే స్వయంగా మన సన్నిధికి వచ్చినప్పుడు నిర్ణయాలు చేయకతప్పదు కదూ!’’ వివరణా పోల్చింది. ప్రణవశర్మ గుర్తుకు రాగానే మాకలి, వెంకటేశుడు ఒక్కసారిగా జాగరూకు లైనట్టయ్యారు. ముందుగా తేరుకుంది మాకలి.
‘‘అవునే గన్నియా! అయ్యవారు అతిథిగానే ఉన్నారు. ఆయనకు మన మనోగతాన్ని ఈ రోజు ఎరిగించవలసిందే.’’ పొడిపొడిగా అంటూనే వెంకటేశుడి వైపు చూసింది. అచేతనుడై నిలిచిఉన్నట్టున్న వెంకటి తల్లి దృక్కులను అవగతం చేసుకుంటూ,
‘‘అవునవును. మనసులో మాట చెప్పకపోతే ఎలాగ? అతిథిని, అందునా తగుమనిషిని ఎన్నాళ్లని రాజ్యాన కట్టిఉంచగలం. అయినా సమాలోచన మందిరానికి ఎందుకు? ఇక్కడే మన మధ్యనే ఆ చర్చలేవో జరిగితే సరిపోతుంది. దైవసన్నిధానానికి మించిన వేదిక మరెక్కడుంటుంది?’’ జిడ్డుజిడ్డుగా పదాలు జార్చాడు. అప్పటివరకూ అన్నగారు ఏం మాట్లాడతారో తెలుసుకుందా మన్నట్టుగా వేచి ఉన్న రాచగన్నియ, మరోసారి తోబుట్టువు నజ్జుతనాన్నే చవిచూసింది. రంగంలోకి దిగక తప్పదన్నట్టుగా స్వరతంత్రులు పారించింది.
‘‘మూజువాణీలు, మెహర్బాణీలు అనవసరం. నీ మనసులో మాట చెప్పు.’’ తల్లిని నిలదీసినట్టుగానే అడిగింది. అదే సమయాన విశాలమైన పూజగదిలోని నైరుతిమూలన పరిచి ఉన్న వేగిసకర్ర ఆసనాలను అమ్మకు, అన్నయ్యకు చూపింది. తాను నడుచుకుంటూ వెళ్లి అక్కడే ఉన్న ఎత్తయిన పీటమీద సాగిలబడింది. అప్పటికిగానీ మాకలిశక్తికి తనయ హృదయం పూర్తిగా అర్థంకాలేదు. విషయాన్ని ఏదో ఒకపద్ధతిలో తోవకి తేవాలన్నదే గన్నియ వాంఛితమని గ్రహించింది. చప్పున ఆసనానికి చేరింది. వెంకటేశుడూ అమ్మను అనుసరించాడు. వాళ్లూ అలా కూర్చోగానే ఎకాఎకిన అసలు మాటకే వచ్చేసింది గన్నియ.
‘‘మనకూ వడ్డాదివాళ్లకు పొత్తు సాధ్యమేనా? దిగువ ఎగువ రాజ్యాల మధ్య అన్నసారమే గానీ బంధనసారం ఎక్కడా లేదే! కొత్తగా ఇప్పుడీ ప్రతిపాదన ఏంటి?’’ సూటిగా అడగవలసిందేదో అడిగేసింది. ప్రత్యేకంగా ఆ ప్రశ్న మాకలిశక్తిని ఉద్దేశించింది కాకపోయినా సమాధానం చెప్పవలసిన బాధ్యత మాత్రం ఆమెదే. వెంకటేశుడు గన్నియకంటే జ్యేష్ఠుడయినప్పటికీ, మెత్తన. కాబట్టే మాకలమ్మే నోరు తెరవవలసివచ్చింది.
‘‘గన్నియా! మన రాజ్యపు వర్తమానస్థితిగతులు నీకు తెలుసుననే భావిస్తున్నాను. నాన్న గతించిపోయాక నందపురం ఎలా దిగనాసిల్లిపోతోందో వేరుగా చెప్పనక్కరలేదనీ అనుకుంటాను. శత్రురాజ్యాలను తిమ్మినిబమ్మిని చేసి నిలువరిస్తున్నాను. ఈ వయసులో ఇంకా నాకీ కష్టం తగునా!’’ బిగువుగా భాషణ మొదలుపెట్టిన మాకలి చివరిచివరికి వచ్చేసరికల్లా తప్తహృదయసంభూతమై బావురుమని ఏడ్చేసింది.
తల్లి రోదనతో ఒక్కసారిగా వెంకటేశుడు నిరుత్తరుడయిపోయాడు. చిన్నపిల్లే అయినా ఎప్పుడూ ధైర్యం వదలని రాచగన్నియా తండ్రి కన్నుమూత ప్రస్తావనకు రాగానే నీరుగారిపోయింది. నాన్న పోయిన నేపథ్యంలో రాజ్యంపై విరగబడుతున్న వైరివర్గాల దుశ్చర్యలు గుర్తుకురాగానే డీలా పడిపోయినట్టూ అయింది. నానా ప్రయాసలకూ ఓర్చి మాతృమూర్తి రాజ్యపాలన సాగిస్తుండటం గుర్తుకు వచ్చి నేత్రాలను సజలం చేసుకుంది. అప్పటివరకూ వడ్డాది నుంచి వచ్చిన కుండమార్పిళ్ల ప్రతిపాదనపై ఆమెకున్న యోచన వేరు. ఇప్పుడువేరు.
జన్మనిచ్చిన మాకలిశక్తి బేలగా రోదనకు దిగడంతో రాచగన్నియ ఎదలో జాలి, దయ, కరుణ తీవలు తీవలుగా సాగడం మొదలైపోయింది. ప్రణవశర్మ తెచ్చిన పెళ్లిసంబంధాలను ఆదిలో గన్నియ తన కన్నెవయసుతోనే అంచనా వేసినప్పటికీ, రాజనీతి కోణంనుంచి ఇప్పుడిప్పుడే మదింపు చేయవలసి వస్తోంది. అందుకనే,
‘‘అమ్మా! నీ మాట కాదని చరిస్తానని నువ్వు ఏ కోశానా అనుకోవద్దు. నందప్రగతికి, జనవికాసానికి, సింహాసనాన్ని బలోపేతం చేయడానికి నువ్వుపడుతున్న తపన తెలియంది కాదు. శత్రువుల బారినపడకుండా రాజ్యం పరువు నిలిపేందుకు పడుతున్న నీ ఆరాటాన్నీ కాదనలేను. కానీ, ప్రజల మనసు ఎరిగి మనమంతా ప్రవర్తించాలి కదా! నా కన్నెరికానికి లోటు జరుగుతోందనో, చేపల రాజ్యానికి అల్లుడవుతూ అన్నయ్య స్థాయి దిగువకు చేరి పోతోందనో అనడం లేదు.’’ నింపాదిగా మాటలను నడిపించింది. ఎప్పుడయితే స్థిరతను కోల్పోకుండా గన్నియ స్వరాన్ని సారిస్తోందో వెంకటేశుడు, మాకలీ స్థిమితపడ్డట్టయ్యారు.
ఇందుకు తగ్గట్టుగానే,
‘‘జై నందపురమా.. జై.. నీలకంఠా.. జై జై మాకలితల్లీ..’’ రాజమందిరపు ఉద్ధారకుడు జయ ధ్వానాలు చేస్తూ పూజగది బయట నిలుచున్నాడు.