శాలివాహన 1943 శ్రీ ప్లవ కార్తీక శుద్ధ ఏకాదశి – 15 నవంబర్ 2021, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
నవంబర్ 8న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ పురస్కార ప్రదానోత్సవంలో హరేకాల హాజబ్బను చూసిన చాలామంది విస్తుపోయి ఉంటారు. ఆయన పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. వివిధ రంగాలలో ప్రఖ్యాతులైన వారంతా ఆ పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొంటారు. ప్రధాని సహా కేంద్రమంత్రులు, విపక్షాల నాయకులు ఆహూతులుగా ఆసీనులై ఉంటారు. వేడుకకు హాజరయిన వారు కూడా ప్రముఖులే. ప్రత్యక్షంగా పురస్కారం అందుకున్న వారిలో నటి కంగనా రనౌత్, క్రీడాకారిణి పీవీ సింధు వంటివారు ఉన్నారు. వారంతా ప్రతి నిత్యం వార్తాపత్రికలలో, టీవీ చానళ్లలో దర్శనమిచ్చేవారే. తళుకు బెళుకులు ఉన్నవారే. బహుశా హాజబ్బ ఒక్కరే సర్వ సాధారణమైన దుస్తులతో, ఎలాంటి హంగూ ఆర్భాటం లేని నడవడికతో వచ్చి భారత రాష్ట్రపతి నుంచి పురస్కారం అందుకున్నారు.
విద్యా రంగానికి అందించిన సేవలకుగాను హాజబ్బ ఆ మూడో అత్యున్నత పౌర పురస్కారానికి భారత ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇంతకీ పద్మశ్రీ వంటి పురస్కారం, అదికూడా విద్యారంగ విభాగంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న హాజబ్బ నిరక్షరాస్యుడు.
హాజబ్బ కర్ణాటకలోని మంగళూరులో బత్తాయిలు, కమలా ఫలాలు అమ్ముతూ జీవించేవారు. మరో సంవత్సరంలో డెబ్బయ్యో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న హాజబ్బ రోజువారీ ఆదాయం రూ 150. తాను చిరకాలంగా పొదుపు చేసి దాచుకున్న డబ్బంతా పెట్టి ఒక పాఠశాల నెలకొల్పారు. గడచిన రెండు దశాబ్దాలుగా నిర్విరామంగా దానిని నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఒక అపురూప ఆశయం కోసం, దాని అమలు కోసం దాదాపు సర్వం త్యాగం చేసినందుకే హాజబ్బ ఆ అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు.
రెండు దశాబ్దాల క్రితమే ఎదురైన ఒక అనుభవం హాజబ్బను తన స్వగ్రామం న్యూపాదలో ఒక ఉన్నత పాఠశాలను నెలకొల్పాలన్న ఆశయం వైపు అడుగులు వేయించింది. ఒకసారి కొంత మంది విదేశీయులు ఆయన దగ్గర బత్తాయిలు కొనడానికి వచ్చారు. వారంతా ఆంగ్లంలోనే మాట్లాడారు. హాజబ్బ వారు అడిగిన ఏ ప్రశ్నకీ సమాధానం చెప్పలేకపోయారు. ఆయనకు కన్నడ తప్ప మరొక భాష ఏదీ తెలియదు. అయితే ఆ పరిస్థితి ఆయనలో ఆత్మన్యూనతా భావాన్ని పెంచలేదు. తనకు భాష రాకపోవడం వల్ల విదేశీయులు ఇబ్బంది పడ్డారని ఆయన భావించడమే ఇక్కడ గమనార్హం. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండేందుకు తనవంతుగా ఒక పాఠశాలను స్థాపించాలనీ, అది కూడా తన స్వగ్రామంలో ఉంటున్న పిల్లలకు అక్షరజ్ఞానం అందించాలనీ హాజబ్బ నిర్ణయించుకున్నారు. ఇది కూడా అంత సున్నితంగా కార్యరూపం దాల్చలేదు. బత్తాయిలు, కమలా ఫలాల వ్యాపారంతో తను గడించినదంతా వెచ్చించినా ఆయన స్వప్నం సాకారం కాలేదు. గ్రామస్థులు ఎవరూ ఆసరా ఇవ్వలేదు. అప్పుడే అదే గ్రామంలో ఉన్న కేవలం 28 మందితో నడిచే మదర్సాను చూసి, కొద్దిమంది పిల్లలతో పాఠశాల ప్రారంభించాలని అనుకున్నారు హాజబ్బ. కొంత రుణం తెచ్చి మొత్తానికి భవనం ఏర్పాటు చేశారు. అలా 2000 సంవత్సరంలో ఆయన గ్రామంలో ఒక పాఠశాల ఆవిర్భవించింది. విదేశీయుల దగ్గర తాను ఎదుర్కొన్న అనుభవం తన గ్రామంలోని పిల్లలు ఎవరికీ ఎదురుకాదని అప్పుడు హాజబ్బకు నమ్మకం కుదిరిందట. మరొక అంశం, 2000 సంవత్సరం వరకు న్యూపాద గ్రామానికి పాఠశాల లేదు.
పద్మశ్రీ హాజబ్బను వరించిన పెద్ద పురస్కారమే. కానీ ఇంతకు ముందే ఆయన సేవను చాలా సంస్థలు గుర్తించాయి. నిజానికి ఇది ఒక సత్కార్యానికి లభించిన గుర్తింపు. అక్షరానికి ఉన్న శక్తికి లభించిన విజయం. జ్ఞానం మీద వ్యవస్థకు ఉన్న నమ్మకం. ప్రఖ్యాత టీవీ చానల్ సీఎన్‌ఎన్-ఐబీఎన్, రిలయెన్స్ ఇచ్చే ‘రియల్ హీరోస్’ పురస్కారం అందుకున్న వారిలో హాజబ్బ కూడా ఒకరు. ప్రముఖ దినపత్రిక ‘కన్నడ ప్రభ’ ప్రత్యేక పురస్కారానికి కూడా ఆయన ఎంపికయ్యారు. ఇస్మత్ పాజిర్ అనే రచయిత హాజబ్బ జీవిత గాధకు అక్షరరూపం ఇచ్చారు. దీనిని మంగళూరు విశ్వవిద్యాలయం తన పాఠ్య ప్రణాళికలో చేర్చింది. ‘నిరక్షరాస్యుడైన పళ్ల వ్యాపారి కన్న భారతీయ విద్యారంగ స్వప్నం’ పేరుతో బీబీసీ ఒక కార్యక్రమం (2012) ప్రసారం చేసింది.
ఇప్పుడు హాజబ్బ పాఠశాల పేరుతో దీనికి ఎంతో ఖ్యాతి వచ్చింది. దీనిని నిర్వహణను ప్రభుత్వం స్వీకరించింది. ఎందరో వ్యక్తిగత హోదాలో విరాళాలు అందించారు. అయితే హాజబ్బ తన ఆశయాన్ని ఇక్కడితో ఆపేయడం లేదు. తన స్వగ్రామంలోనే ఒక జూనియర్ కాలేజీ కూడా స్థాపించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంత చేశారు కాబట్టే హాజబ్బను ఆ ప్రాంతంలో ‘అక్షరదూత’ అని సగౌరవంగా పిలుచుకుంటున్నారు. విద్యాలయాల పేరుతో వెలుస్తున్న అంబర చుంబిత భవంతులలో చదువు ఉండవచ్చు. అది కొనుక్కుంటే వచ్చేది కావచ్చు. పెద్ద పెద్ద రుసుములు కట్టవలసి రావచ్చు. భారీగా రుసుములు కట్టినంత మాత్రాన చదువుతో రావలసిన సంస్కారం వస్తుందన్న భరోసా ఏదీ లేదు. పెద్ద పెద్ద భవంతులలో అయినా, పెంకులూ రేకులూ కప్పిన చిన్న గదిలో అయినా అందించవలసినది విద్య. అది నిరక్షరాస్యుడే అయినా గుర్తించగలిగినందుకు హాజబ్బ వందనీయుడు.