శాలివాహన 1943 – శ్రీ ప్లవ ఆశ్వీయుజ బహుళ ఏకాదశి – 01 నవంబర్ 2021, సోమవారం
గతంతో సంభాషించడం, పాఠాలు చెప్పించుకోవడం- నిరంతరం జరగవలసినవే. కోల్పోయినదేమిటో అన్వేషిస్తున్న భారతజాతికి ఇది మరీ అవసరం. ఎనిమిది శతాబ్దాల పాటు అస్వాతంత్య్రమనే నిబిడాంధకారంలో మగ్గిపోయి, వెలుగు అనే మాటే విస్మరించిన భారతీయులకు వేకువను చూపిన చూపుడు వేలు చరిత్రే. విదేశీ దండయాత్రలూ, స్వజాతిలో జడత్వం జమిలిగా చొరబడిన ఫలితమే ఆ ఆత్మ విస్తృతి. ఇవాళ్టి మేధో విధ్వంసం దానికి కొనసాగింపు. చరిత్ర ఉంది, చారిత్రక స్పృహే లేదంటూ భారతీయుల మీద పడిన ఆత్మహత్యాసదృశమైన ఆరోపణలోని సత్యమెంతో వెలుగులోకి వచ్చే అవకాశాన్ని ఆ జడత్వమే అడ్డుకుంది. అలాంటి సత్యాన్వేషణను ఆ మేధో విధ్వంసమే నేడూ నిలువరిస్తున్నది. అలా అని భారతీయుల చారిత్రక స్పృహ మీద ఉన్న వ్యాఖ్యలను సమూలంగా కొట్టిపారేయడం ఇక్కడ ఉద్దేశం కానేకాదు.
చరిత్ర మీద, చరిత్ర రచనా విధానం మీద గ్రీకులకో, రోమన్‌లకో ఉన్న దృష్టి భారతీయులకు ఏదీ అన్న ప్రశ్నకు తిరుగులేని సమాధానమే కల్హణుడు (క్రీస్తుశకం 12వ శతాబ్దం). ఆ కశ్మీరీ పండితుడే 1148-1149 కాలంలో ‘రాజతరంగణి’ రచించాడు. కశ్మీర పాలకుల చరిత్ర ‘రాజతరంగిణి’ భారతీయులకూ, చరిత్ర పరిశోధకులకూ కూడా వరమే. సంస్కృత సాహిత్యంలో చారిత్రక స్పృహ అన్న అధ్యయనంలో ప్రఖ్యాత చరిత్రకారుడు ఆర్‌సి మజుందార్ కల్హణుని కృషినీ, మేధస్సునీ అంచనా వేశారు. అలాంటి చారిత్రక స్పృహకు ‘రాజతరంగిణి’ నిలయమంటారు ఆచార్య మజుందార్. కల్హణుని చారిత్రక దృష్టి మధ్య యుగ హిందూ భారతదేశ విద్యావంతులందరికీ శిరోధార్యమయిందన్నారు మరొక ప్రపంచ ప్రఖ్యాత చరిత్రకారుడు ఏఎల్ బాషామ్. కల్హణునిది కుంచించుకుపోయిన మెదడు కాదు, మంచి చరిత్రకారుడికి ఉండవలసిన అసలు లక్షణం ఇదే అంటూ ప్రొఫెసర్ రొమిల్లా థాపర్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో మనం తలపెట్టిన త్యాగమూర్తుల సంస్మరణ సందర్భంగా కల్హణుని కూడా గుర్తుకు తెచ్చుకోవడం అమృతోత్సవ్ ఆశయాన్ని అమృతోప మానం చేస్తుంది. మనం ఇన్ని అడుగులు వేయడానికి దారిని నిర్మించిన వారిని చరిత్ర పేరుతో స్మరించుకోవాలని అనుకుంటున్నాం. కాబట్టి చరిత్ర నిర్మాణం అంటే ఏమిటో మొదట శాస్త్రీయంగా తెలుసుకోవాలి. ఆ ప్రయాణానికి• కల్హణుని చరిత్ర నిర్మాణ దృష్టే కరదీపిక కావాలి.
ఢిల్లీ పాలకుల వంశావళే భారతదేశ చరిత్ర అన్న పరిమిత దృష్టితో, వారి చుట్టూ తిరిగిన పరిశోధనతో చాలా వాస్తవాలు మరుగున ఉండిపోయాయన్న సహేతుక విమర్శకు ఇప్పుడు గొంతు వస్తోంది. ముస్లిం దేశాల నుంచి వచ్చిన యాత్రికులు, చరిత్రకారులతోనే ఇక్కడ చరిత్ర రచన ఆరంభమైందన్న వాదనలోని చీకటివెలుగులు కూడా క్రమంగా అర్ధమవుతున్నాయి. ఒక గొప్ప సంస్కృతికీ, విద్యకూ భారతీయులు వారసులన్న వాస్తవం వారే బాగా చెప్పారు. ఇది వెలుగు. విజేతలంతా విదేశీయులే అన్న అనాలోచిత తీర్పులలో ఉన్నది చీకటే. చరిత్ర పునర్నిర్మాణం ప్రతి తరపు బాధ్యత అంటుంది రచనా విధానం. కాబట్టి ఆ పక్రియ ఎవరినో బోనులో నిలబెట్టడానికి చేసే విన్యాసం కాదు. నిజాలను నిగ్గు తేలుస్తూ క్రమంగా నిర్మితమయ్యే గతగాథ.
జాగృతి ఏటా దీపావళి సంచికకు ఒక ప్రత్యేక అంశం తీసుకున్నట్టే ఈసారి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఆలోచనను సవినయంగా స్వీకరించింది. అదే ‘స్వాతంత్య్రోద్యమంలో మా నేల- మా నేత’ అంశం. చరిత్రపుటలలోకి చేరలేకపోయిన వారినీ, వెలుగులోకి రావాల్సిన ఘట్టాలనీ అన్వేషించే అవకాశం బీజేపీ ప్రభుత్వం ఇచ్చినందుకు సంతోషించాలి. విస్మృత త్యాగాలకు అక్షరరూపం ఇచ్చే అవకాశం వచ్చినందుకు చరిత్ర అభిమానులు, పరిశోధకులు గర్వపడాలి. ఇందులో భాగస్వామి అవుతూ జాగృతి తన వంతు పని చేసింది. ఇది చంద్రునికో నూలుపోగు వంటిదే. మా ఈ ప్రయత్నంలో చాలామంది సహకరించారు. స్వరాజ్య సమరయోధుల కుటుంబాల వారూ చేయూతనిచ్చారు. వారందరికి ధన్యవాదాలు. కాంగ్రెస్ వాదులుగా పోరాడిన వారి చరిత్ర కాస్త శోధిస్తే దొరుకుతుంది. కానీ కొండకోనలలోని ఉద్యమాలు, రైతాంగ పోరాటాలు, కాంగ్రెస్ పంథాను అనుసరించకుండా ఇతర ప్రేరణలతో ఉద్యమించినవారు, ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు, గదర్ వీరులు- వీరంతా తెలుగు ప్రాంతంలో కూడా ఉన్నారు. వీరందరి త్యాగాలూ, రక్తతర్పణలూ స్మరణీయమే. స్వరాజ్యం కోసమే కాబట్టి అహింసా పథమైనా, ఆయుధమెత్తినా గుర్తించడం ధర్మం. అదే సమగ్ర చరిత్ర అనిపించుకుంటుంది. చరిత్రపుటలలోని అక్షరదీపా వరసన ఇంకొన్ని దీపాలూ చేరాలని మా అభిలాష.