– డా. మృత్యుంజయ్ గుహా ముజుందార్
ప్రజాస్వామ్యం, జాతి – రాజ్యం వంటి భావనలకు మూలం ఆధ్యాత్మికత. జాతి- రాజ్యం అనేది పౌరులందరిలో ఉన్న సమానమైన గుణాన్ని లేదా సంబంధాన్ని రాజకీయాలతో జత చేయడం, రాజకీయ కార్యకలాపాలకు జాతిని ఆధారంగా చేసుకోవడం.
దేశం పట్ల నిష్ట లేనివారికి ప్రపంచం పట్ల కూడా విధేయత ఉండదని ఒక ప్రముఖుడు చెపుతుండగా ఇటీవల విన్నాను. ఆయన దేశ వ్యతిరేకంగా మాట్లాడే వామపక్షవాదులను దృష్టిలో పెట్టుకుని అలా అన్నారు. ఆధునిక అంతర్జాతీయ వాదాన్ని బాగా వంట పట్టించుకున్నవారు మాత్రం ఆయన వాదనతో ఏకీభవించకపోవచ్చును. ఆయన మాటలకు ప్రత్యక్ష ఉదాహరణ నేటి అఫ్గానిస్తాన్. తాలిబాన్ సానుభూతిపరులందరూ సహజంగానే అక్కడి ప్రభుత్వం పట్ల విధేయత ప్రకటిస్తారు. కానీ అలా తాలిబాన్ ప్రభుత్వాన్ని అంగీకరించడమంటే ప్రాథమిక మానవహక్కులు, ప్రాపంచిక విలువలను, న్యాయబద్ధమైన, స్వేచ్ఛాయుత ప్రపంచాన్ని వ్యతిరేకించడమే అవుతుంది. నిజానికి భారత జాతీయవాదం ఎంతో మెరుగైనది, శ్రేష్టమైనది. అందుకని అది జాతీయవాదపు సరైన ధోరణి అవుతుంది. అది ఆధ్యాత్మిక జాతీయవాదం. అంటే దీని పునాది, మూలం ఆధ్యాత్మిక సత్యం.
భారతీయ నాగరికతలో మొదటి నుంచి రాజకీయ అధికారంలో వికేంద్రీకరణ కనిపిస్తుంది. మొదట నగరాలు (మొహోంజదారో, హరప్పా), తరువాత రాజ్యాలు (రాష్ట్రకూటులు, గుర్జర ప్రతీహారులు, చోళులు), ఆ తరువాత దేశాలు (నేపాల్, భారత్ రెండు వేరువేరు దేశాలు అయినప్పటికీ ఒకే భారతీయ సాంస్కృతిక వారసత్వానికి చెందినవి) వంటివి ఒకే సాంస్కృతిక విలువలను కలిగిఉన్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దక్షిణాసియా, ఆగ్నేయాసియాల్లో విస్తరించిన సాంస్కృతిక(ఆ సంస్కృతి పేరు హిందూ. ఇది మతాన్నికాక నాగరికతనే సూచిస్తుంది) జాతీయ వాదాన్ని గురించి మాట్లాడుతుంది. సుదూర దేశాల్లో కూడా ఒకే సాంస్కృతిక విలువలు కనిపించినా వాటి ఆచరణలో కొన్ని తేడాలు మాత్రం ఉన్నాయి. థాయిలాండ్, కంబోడియాల్లో కనిపించే భారతీయ నాగరికతా విలువలు భారత్, పాకిస్తాన్‌లోని వాటికి భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు, థాయిలాండ్‌లో కనిపించే థెరవాద బౌద్ధం పరబ్రహ్మం లేదా అంతిమ సత్యానికి ఎలాంటి ఆకారం, రూపం లేదని చెపుతుంది. శూన్యవాదం ఆధారంగా కేవలం ధ్యానం, చింతన ద్వారా మాత్రమే పరబ్రహ్మాన్ని గురించి తెలుసుకోవాలని చెపుతుంది. కానీ భారత్‌లో ఇందుకు భిన్నంగా సాకార, సగుణ బ్రహ్మాన్ని గురించి చెప్పడం, విగ్రహారాధన కనిపిస్తుంది.
మనల్ని కలుపుతున్నది ఏది?
ప్రజలందరిలో ఉండే సామాన్య తత్త్వం, ధోరణే అందరినీ కలిపి ఉంచుతుంది. దీనికి దూరంగా ఎవరు పోలేరు. ఆ తత్త్వం ధోరణి, యుగధర్మం (ఆ కాలానికి చెందిన సామాజిక-సాంస్కృతిక వ్యవస్థ), స్వధర్మం (వికాసక్రమంలో వ్యక్తి ఉన్న, ప్రధానంగా ఆధ్యాత్మికంగా, స్థానం, స్థాయి), నేటి ప్రపంచంలో ప్రపంచీకరణ-జాతీయవాదం, ప్రాచీనవాదం- ఆధునికవాదం, సంపన్నులు – సాధారణ ప్రజానీకం.. ఇలా ద్వంద్వాలు ఎక్కువయ్యాయి. అయితే ఈ భావనల మధ్య పరస్పర సంబంధం ఏదైనా ఉందా? అసలు ఈ ద్వంద్వ భావనలు ఇప్పుడు అవసరమా అనే ముఖ్యమైన ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే ఆధునిక భౌగోళిక రాజకీయాల ఆధ్యాత్మిక పార్శ్వాన్ని పరిశీలించాలి. దురదృష్టవశాత్తు నేడు రాజకీయాలలో ఆధ్యాత్మికత, జాతీయవాదం అంటే అర్ధంలేని ప్రజాకర్షక విధానం, మతపరమైన పిడివాదంగా మారిపోయాయి. నిజానికి ఆధ్యాత్మికత ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యపు పునాది. పౌరులందరిలో సామాన్య లక్షణాలు, లేదా గుణాలను రాజకీయాలకు మధ్య సంబంధం ఉందనే ఆలోచనే జాతి-రాజ్య భావనకు మూలం. యూరప్‌లో 18వ శతాబ్దపు పునరుజ్జీవన కాలంలో జీన్ జాక్వెస్ రూసో ఈ పౌర మత సూత్రాన్ని ప్రతిపాదించాడు.
జాతి వర్ణనలో పారమార్ధికత
జాతి వర్ణన ఎలా చేసినా అది పారమార్ధికంగా ఉంటుందన్నది మాత్రం నిజం. వ్యక్తుల మధ్య ఉండే పారమర్ధిక సంబంధమే దానికి ఆధారం. సామాజిక, రాజకీయ నేపథ్యంలో చారిత్రక, సాంస్కృతిక కల్పనలే ఇందుకు మూలమని అమెరికా రచయిత గోరే విడల్ తన ‘No myth, no nation’ అనే పుస్తకంలో అంటారు. Gore vidal. At Home: Essays 1982-1988. Knopf Doubleday Publishing Group. 2018)
నేడు రాజకీయాలలో ఒక శూన్యం కనిపిస్తోంది. దానిని విదేశీ రాజకీయ శక్తులు తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ప్రతీకలు, గుర్తుల ద్వారా తమ ప్రయోజనాలను సాధించుకోవాలని చూస్తున్నాయి. ప్రతీకల గురించి తత్త్వవేత్త పాల్ టిల్లిచ్ ఇలా అంటారు – ‘మనిషి అంతిమ లక్ష్యాన్ని ప్రతీకాత్మక భాష ద్వారా మాత్రమే ప్రకటించగలం.’
రాజకీయ రంగంలో అనేకమంది పారమార్ధిక అంశాలను ఉపయోగించడం చూస్తే ప్రజలు రాజకీయాలు మరింత అర్ధవంతంగా ఉండాలని కోరుకుంటున్నారని అర్ధమవుతుంది. ఆధునిక కాలంలో అనేక దేశాలు ప్రజాస్వామ్య వ్యవస్థ వైపు మొగ్గుచూపుతున్నాయి. ఈ వ్యవస్థ ద్వారా స్థిరమైన అభివృద్ధిని సాధించాలన్నది లక్ష్యం. వివిధ సిద్ధాంతాల వల్ల అటువంటి లక్ష్యాన్ని సాధించడానికి తగిన అవకాశాలు, మార్గాలు లభిస్తాయి. తరతరాలుగా, శతాబ్దాలుగా భారత్ ఈ పారమార్ధికతను అనుసరిస్తూ వచ్చింది. జీవిత సత్యం, సామాజిక, సాంస్కృతిక అంశాలలోని సత్యం అనేవి దృష్టిలో పెట్టుకుని విభిన్న మార్గాలు, సిద్ధాంతాలను అంచనా వేసుకోవాలి.
భారత్ అంటే ఏమిటి?
రాజకీయ భావనల గురించి అనేకమంది ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇవే శతాబ్దాల బానిసత్వం నుంచి స్వేచ్ఛ దిశగా ప్రజలు నడవడానికి కారణమయ్యాయి. భారత స్వాతంత్య్రంతో మానవాళి మనుగడ ముడిపడి ఉందని శ్రీఅరవిందులు భావించారు. భారత్‌లోని ఆధ్యాత్మిక జ్ఞానం మానవాళికంతటికి ఎంతో అవసరమని ఆయన భావించారు. వందేమాతరం పత్రిక సంపాదకీయంలో ఆయన ఇలా వ్రాసారు-
‘ప్రపంచం కోసం భారత్ జీవించి ఉండాలి. అందుకోసమే స్వరాజ్యాన్ని సాధించాలి. సంకుచితమైన రాజకీయ, ప్రాపంచిక ప్రయోజనాల కోసం కాకుండా మానవాళికి ఆధ్యాత్మికంగా, మేధోపరంగా మేలు చేయగలిగిన స్వేచ్ఛాయుత ప్రజానీకం కలిగిన దేశంగా మనుగడ సాగించాలి.’’ (Collected Works of Sri Aurobindo, Vol. 6, p. 573)
భారత్ ఆధ్యాత్మిక జ్ఞానానికి కేంద్రమని, అంధకార, అజ్ఞాన శక్తులు ఇక్కడ పరాజితమవు తాయని అరవిందులు విశ్వసించారు. భారతీయ ఆధ్యాత్మిక, తత్త్వవేత్తలంతా శరీరాన్ని దాటి ఆత్మను పరిశీలించారు. దానినే బ్రహ్మము అన్నారు. అది శాశ్వతమైనది, సర్వత్ర ఉన్నది. ఈ జ్ఞానదృష్టితో వ్యక్తుల మధ్య సామాన్య ధర్మం ఏమిటన్నది అరవిందులు మొదలైనవారు గుర్తించి, చెప్పారు. ఆ తత్త్వమే ప్రపంచమంతటా ఉందని కూడా చెప్పారు. ఈ సత్యన్నే ‘అహం బ్రహ్మాస్మి’ అనే మహావాక్యం చక్కగా చెపుతుంది. అహం బ్రహ్మాస్మి అంటే అంతటా ఉన్న మూల తత్త్వపు విస్తృత రూపమే నేను. (బృహదారణ్యక ఉపనిషత్తు, 1.4.10, యజుర్వేదం)
దీనినే ఒక జాతి, దేశానికి అన్వయిస్తే ఒక వ్యక్తి సత్యస్వరూపం ఏదో ఒక జాతి, దేశానిది కూడా అదే స్వరూపం అని అర్ధమవుతుంది. మనలోని అంతరాత్మలను జాతి ఆత్మతో జోడించారు శ్రీఅరవిందులు. అందుకు తైత్తరీయ ఉపనిషత్‌లో పేర్కొన్న పంచకోశ భావనను ఉపయోగించారు.
భూమి అనేది ఒక జాతికి అన్నమయకోశం లేదా భౌతిక శరీరం; ఆ భూభాగంలో నివసించే ప్రజానీకం ప్రాణమయకోశం. ఈ భౌతిక శరీరం లోపల మరింత సంక్లిష్టమైన శరీరం ఉంటుంది. అది మన ఆలోచనలు, సాహిత్యం, తత్త్వజ్ఞానం, మేధస్సు, భావాత్మక కార్యకలాపాలు, ఆశలు, ఆనందాలు, నాగరికత, సంస్కృతి. ఇవన్నీ జాతి సూక్ష్మశరీరం అవుతాయి. ఈ సూక్ష్మ కార్యకలాపాలు వేలాది సంవత్సరాల ఆ జాతి అనుభవం, సమకూర్చుకున్న జ్ఞానం ఆధారంగా ఉంటాయి. ఇవి ఇతర జాతులకు భిన్నంగా మనల్ని నిలబెడతాయి. మనం వస్తాము, పోతాము. కానీ ఈ మాతృభూమి వేలాది సంవత్సరాలు ఉంటుంది, మనుగడ సాగిస్తుంది. (collected Works of Sri Aurobindo, Vol. 8, PP. 152- 153)
శ్రీఅరవిందులు చెప్పిన జాతీయవాదానికి ఆధ్యాత్మిక లక్ష్యం ఉంది. అపారమైన, విస్తృతమైన సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జ్ఞానం వలన ఈ దేశం మానవాళి ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చూపగలదు.
రవీంద్రనాథ్ టాగూర్ కూడా జాతీయవాదాన్ని గురించి విస్తృతంగా రాశారు. మానవుడిగా ఉండడం అంటే ఏమిటి? అన్న విషయం ఆధారంగా ఆయన జాతీయవాదాన్ని నిర్వచించారు. జాతీయవాదం అనే పదం పెట్టుబడిదారీ విధానం, పారిశ్రామికీకరణ నుండి పుట్టినదని, అది భిన్నత్వం, స్వావలంబన మొదలైన భారతీయ భావనలకు పూర్తి విరుద్ధమని ఆయన భావించారు.
రాజకీయాలను, ఆర్ధికవాదంతో ముడిపెట్టే పాశ్చాత్య ‘రాజకీయ నాగరికత’ మూలంగా సమస్యలు ఉత్పన్నమయ్యాయని టాగూర్ అన్నారు. దీనికి భిన్నంగా భారతీయ నాగరికతలో వివిధ సమూహాలు స్వయం నియంత్రణతో తమ కార్యకలాపాలు సాగించాయని ఆయన భావించారు. యూరప్ లోని తీవ్రమైన జాతీయవాదం 20వ శతాబ్దంలో విపరీతమైన నిరంకుశ ధోరణికి, అణచివేతకు కారణమైందని ఆయన భావించారు.
ఇక స్వామి వివేకానంద చెప్పిన జాతీయవాదం భారతీయ నాగరికతలోని ముఖ్యమైన రెండు భావనలు, విశ్వ భావన, మానవతావాదంపై ఆధార పడింది. వ్యక్తి తన మౌలిక తత్త్వాన్ని ప్రకటించడానికి అవసరమైన స్వేచ్ఛ, సమానత్వంతోపాటు అధ్యాత్మిక సౌభాత్రం ఆధారంగా ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా సమైక్యం చేయడానికి వీలు కలిగించేదే జాతీయవాదం అని ఆయన చెప్పారు. నిస్వార్ధమైన సేవ ద్వారా రాజకీయ, ఆధ్యాత్మిక మోక్షం సాధించడానికి అవకాశం కలిగించే వ్యవస్థ కర్మయోగమని అన్నారు. ప్రతి జాతి ఒక జీవనసూత్రాన్ని, సారాంశాన్ని ప్రతిఫలిస్తుందని, ఆధ్యాత్మికతలోనే జాతి బలం ఉందని ఆయన పేర్కొన్నారు.
‘ప్రతి జాతికి ఒక లక్ష్యం, అది ప్రపంచానికి ఇచ్చే సందేశం ఉంటాయి. మిగిలినవన్నీ ముఖ్యం కాదు. భారత దేశపు సారాంశం మతం.’ (Swami Vivekananda, The Complete Works of Swami Vivekananda. p.2173, Manonmani Publishers, 2015)
స్వాలంబన, ధైర్యం, బలం, నిరంతర ప్రయత్నం, దేశభక్తి చాలా అవసరమని ఆయన దేశ ప్రజలకు ఉద్బోధించారు. స్వేచ్ఛ, సమానత్వ భావనలను ఆయన భారత సంప్రదాయ వేదాంతానికి జోడించారు. ముఖ్యంగా వీటిని అద్వైత సిద్ధాంతం బాగా చెప్పిందని అన్నారు.
సర్వ ప్రాణులు-చిన్నవైన, పెద్దవైనా, ఆ భగవంతుని స్వరూపమే, ప్రకటీ•కరణలోనే భేదం.
ముగింపు
ధర్మాన్ని సామాజిక, రాజకీయ రంగాలలో అన్వయించడమే ముఖ్యమని ప్రాచీనకాలం నుండి భారత్‌కు చెందిన మహాపురుషులందరూ చెప్పిన విషయం. ఇలా చేయాలంటే ముందుగా మన దేశం ఎందుకు ఉందో, దాని అంతిమ లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి. జాతి, కుల, ప్రాంత, భాషాభేదాలకు అతీతంగా అందరినీ కలిపి ఉంచుతున్న సత్యాన్ని గుర్తించి, తెలుసుకోవాలి. అదే ఆధ్యాత్మిక జాతీయ వాదం. అదే భారత్‌కు ఆధారం.
‘ఆర్గనైజర్’ నుంచి
– అను: కేశవనాథ్