అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు ఉంది. జరగని ఘటనను సాకుగా చూపి అల్లర్లు రెచ్చగొట్టారు. మూడు నగరాలు అట్టుడికిపోయాయి. సకాలంలో వాస్తవాలు బయటకు వచ్చాయి. లేకపోతే నష్టం మరింతగా ఉండేది. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై అనుమానాలు వస్తున్నాయి. వాస్తవాలను బయటకు చెప్పి కట్టడి చేయాల్సిన ఉద్ధవ్ ప్రభుత్వం సంకుచిత రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం విమర్శలకు దారితీస్తోంది. ఈ ఘటనల వెనుక ఎవరున్నారు? వారిమీద చర్యలు ఎందుకు చేపట్టలేదు? అన్నది తేలాల్సి ఉంది.
త్రిపురలో అసలు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ప్రధాన మీడియా వాస్తవాలను దాచి పెట్టింది. ఏకపక్ష వార్తను ప్రసారం చేసింది. కనీసం ఘటనా స్థలికి కూడా ఎవరూ పోయిన దాఖలాలు లేవు. ఆ వార్త నిజమేనా? అన్నది ఎవరూ నిర్ధారించు కోలేదు. అది నిజం కాదని త్రిపుర పోలీసులు ప్రకటించినా, దానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. అక్కడ స్విచ్ వేస్తే ఇక్కడ బల్బ్ వెలిగినట్లు అల్లర్లు జరిగి పోయాయి. బీజేపీయేతర పక్షాలకు చలికాచుకునేం దుకు కావాల్సినంత సరుకు దొరికింది. ఎప్పటిలాగే బీజేపీ, వీహెచ్‌పీ, ఆరెస్సెస్‌ల మీద దుమ్మెత్తిపోశారు. వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత తేలుకుట్టిన దొంగల్లా వారి నోళ్లు మూతపడ్డాయి. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ సృష్టికర్తల పుకార్లు గుడ్డిగా నమ్మారని కూడా అనలేం. చూస్తుంటే ఇది పెద్ద కుట్ర అని అర్థమైపోతుంది.
కుట్రపూరిత అల్లర్లు
ఇటీవల మహారాష్ట్రలోని మూడు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. అమరావతి, నాందేడ్, మాలెగావ్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో అల్లర్లు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ప్రార్థనల తర్వాత ఒక్కసారిగా అల్లరి మూకలు రోడ్ల మీద పడ్డాయి. కనిపించిన వ్యాపార సంస్థలు, షోరూమ్‌లు, దుకాణాల మీద దాడులు జరిగిపోయాయి. ముఖ్యంగా ఆటో మోబైల్ షోరూమ్‌లలోకి ప్రవేశించి కొత్త వాహనాలను ధ్వంసంచేసి, వాటికి నిప్పు పెట్టారు. కత్తులతో నడిరోడ్ల మీద బహిరంగంగా చెలరేగిపోయారు. ఎందో మందిపై భౌతికదాడులు జరిగాయి. పోలీసులను కూడా వదలలేదు. ఇన్‌స్పెక్టర్ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి అధికారుల వరకు కూడా రోడ్ల మీద పరుగులు తీశారు. ముష్కరులు వదలకుండా వారి వెంటపడి యూనిఫారాలు చింపేశారు. నష్టం అపారంగా జరిగిపోయింది. దాడులు చేసింది ఎవరో, వారి లక్ష్యం ఎవరో అందరికీ తెలుసు. ఇక్కడ బాధితులు హిందువులు మాత్రమే. రజా అకాడమితో పాటు మరి కొన్ని సంస్థలు ఇచ్చిన పిలుపు మేరకు నిరసనల పేరుతో ఈ అల్లర్లు జరిగాయి. త్రిపురలో పానీసాగర్ మసీదు మీద దాడిచేసి తగులబెట్టినట్లు ప్రచారం జరిగింది. దీనికి ప్రతీకారంగా మహారాష్ట్రలో ఈ ఘటనలు జరిగినట్లు చెబుతున్నారు. మీడియాలో కూడా ఇవే కథనాలు వచ్చాయి. కానీ వాస్తవం ఏమిటి? అనే విషయం మీద ఎవరూ దృష్టిపెట్టలేదు. త్రిపురలో మసీదు మీద దాడి జరిగిందనే ప్రచారం నేపథ్యంలో తెలంగాణ, ఆంధప్రదేశ్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీతో సహా, ఇతర పార్టీలు బీజేపీ, వీహెచ్‌పీ, ఆరెస్సెస్‌లను లక్ష్యంగా చేసుకొని మైనారిటీలకు భద్రత లేదంటూ ఎప్పటిలాగే విమర్శలు, ఆరోపణలు చేశాయి.
అసలు దాడే జరగలేదు!
త్రిపురలోని పానీసాగర్‌లో అసలు ఏం జరి గింది? ఏమైనా జరిగితే కదా చెప్పడానికి. పానీసాగర్ మసీదు మీద ఎలాంటి దాడి జరగలేదు. అయినా ఏదో జరిగిపోయిందంటూ తప్పుడు ప్రచారాన్ని వైరల్ చేశారు. స్వయంగా త్రిపుర పోలీసు శాఖ ఈ మేరకు ప్రకటన చేసింది. భద్రంగా ఉన్న సంబంధిత మసీదు ఫోటోను కూడా విడుదల చేసింది. మసీదును ఎవరూ తగులబెట్టలేదని సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు. పానీసాగర్ సబ్‌డివిజన్‌లో విశ్వహిందూ పరిషత్ ర్యాలీ జరిగినా మసీదు జోలికి ఎవరూ పోలేదు. ఎలాంటి నష్టం జరగలేదు. గోమతి జిల్లాలోని కాక్రాబన్ ప్రాంతంలోని మసీదుపై కూడా దాడులు జరిగాయని వదంతులు వచ్చాయి. కానీ అది కూడా సురక్షితంగా ఉందని పోలీసులు ఫొటోలు విడుదల చేశారు. రాష్ట్రంలో ఏ ఇతర ప్రాంతంలోనూ ఇలాంటి ఘటనలు జరగలేదని ప్రకటించారు. పరిస్థితి ప్రశాంతంగా, సాధారణంగా ఉందని త్రిపుర పోలీసులు తెలిపారు. వందంతులను నమ్మరాదని విజ్ఞప్తి చేశారు. పానీసాగర్ మసీదు విషయంలో తప్పుడు వార్తలు, మతపరమైన వదంతులను వ్యాప్తి చేసిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
అయితే, పానీసాగర్ మసీదుపై దాడి జరిగిందనే వార్తను కమ్యూనిస్టు పార్టీ చేతిలోని మీడియా సంస్థలు అతిగా ప్రచారం చేశాయి. ఈ దాడిని ఖండిస్తున్నట్లు తమ నాయకుల ప్రకటనలకు ప్రాధాన్యం ఇచ్చాయి. వీరి ట్రాప్‌లో పడ్డ మిగతా మీడియా సంస్థలు కూడా కనీసం నిర్ధారించుకోకుండా ఏదో జరిగిపోయిం దంటూ వార్తలు ఇచ్చేశాయి. వాస్తవాలు బయటకు వచ్చాక నాలిక కరుచుకొని నామమాత్రం వార్తతో సరిపెట్టేశారు.
బీజేపీ నిరసన
అమరావతి అల్లర్లను ఖండిస్తూ బీజేపీ బంద్ పాటించింది. అంతకుముందురోజు ఘటనపై స్పందించని పోలీసులు బీజేపీ కార్యకర్తలపై మాత్రం లాఠీచార్జ్ చేశారు. త్రిపురలో ఎలాంటి అల్లర్లు జరగ కున్నా, దాన్ని అడ్డుపెట్టుకొని మహారాష్ట్రలో అల్లర్లకు పాల్పడటాన్ని తప్పుపట్టారు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. జరిగిన హింసా కాండను ఖండిం చారు. రాజకీయ లాభం కోసమే ప్రభుత్వం శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. అల్లర్ల వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందని కూడా ఆరోపించారు.
– క్రాంతి, సీనియర్ జర్నలిస్ట్