స్వధర్మ స్వాభిమాన్ స్వరాజ్య
గతం నాస్తి కాదు, అనుభవాల ఆస్తి. గతాన్ని గమనంలోకి తీసుకుంటూనే, భవిష్యత్తు వైపు.. లక్ష్యసిద్ధి వైపు దేశం సాగిపోగలదు. అందుకు మొదటిమెట్టు తెచ్చుకున్న స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలి. రకరకాల పేర్లతో స్వాతంత్య్రాన్ని, అది కల్పించిన స్వేచ్ఛను దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి. ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చి, ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన మహనీయుల త్యాగాల స్మరణతో అది సాధ్యమవుతుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పరమోద్దేశం అదే. నవంబర్ 20,21 తేదీలలో జరిగిన గోల్కొండ సాహితీ మహోత్సవం ఆ క్రమంలోనిదే. రెండు రోజులు వర్షం కురుస్తూనే ఉన్నా ప్రజలు విశేషంగా హాజరయి విజయవంతం చేశారు. ఉపన్యాసాలు, చర్చలు, సాంస్కృతిక ప్రదర్శనలతో కార్యక్రమం ఆలోచనలు రేకెత్తించింది. హైదరాబాద్ లోని కేశవ మెమోరియల్ స్మారక విద్యా ప్రాంగణం (నారాయణగూడ) ఇందుకు వేదికయింది. ఈ ఉత్సవాల నినాదమే -స్వధర్మ, స్వాభిమాన్, స్వరాజ్య.
మొదట ప్రముఖులు, ముఖ్య అతిథులు అంతా కలసి కళాశాల ఆవరణలోని సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తరువాత అదే ప్రాంగణంలోని పటేల్ సభా మందిరంలో ప్రారంభోత్సవ సభ జరిగింది.
ఉత్సవాలన• గోల్కొండ సాహితీ మహోత్సవాలు అని పిలవడం వెనుక ఉద్దేశాన్ని సభకు అధ్యక్షత వహించిన ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి స్వాగతో పన్యాసంలో వివరించారు. 1688 నాటి అక్కన్న మాదన్నలు ఆ కోటతో గుర్తుకు వస్తారు. నిజాం వ్యతిరేక పోరాటంలో కీలకంగా ఉన్న పత్రిక గోల్కొండ, గోల్కొండ కవులు పేరుతో ఒక సంకలనాన్ని గుర్తుకు తెచ్చుకోవడం కూడా. మొత్తంగా తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక గోల్కొండ. సాహితీ మహోత్సవ ఔన్నత్యాన్ని కూడా ఆచార్య కసిరెడ్డి ఆహూతులకు వివరించారు. బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, భాగయ్య, కోవెల సుప్రసన్నా చార్య, రతన్ శార్దా, ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత కార్యకారిణి సదస్యులు వడ్ల భాగయ్య, ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత సంఘచాలక్ బూర్ల దక్షిణమూర్తి, ప్రముఖ పత్రికా రచయిత వల్లీశ్వర్, సమాచార భారతి అధ్యక్షులు ఆచార్య గోపాలరెడ్డి వేదికను అలంకరించారు. వీరిని ఆచార్య కసిరెడ్డి సభకు పరిచయం చేశారు.
సమర యోధుల ఫోటో ప్రదర్శనను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక వ్యవహారాల మంత్రి జి. కిషన్‌రెడ్డి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలసి ప్రారంభించారు. పక్కనే జాతీయ సాహిత్య విక్రయశాలలను ఏర్పాటు చేశారు.
ఈ ఉత్సవాన్ని సమాచార భారతి, జాతీయ సాహిత్య పరిషత్, ఇతిహాస సంకలన సమితి, సంస్కార భారతి, ప్రజ్ఞాభారతి తదితర సంస్థలు నిర్వహించాయి.
స్వాతంత్య్ర భావనను మేల్కొల్పేది సాహిత్యమే
(స్వరాజ్యం రావడం వేరు. స్వాతంత్య్రం రావడం వేరు అంటున్నారు ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత కార్య కారిణి సదస్యులు వి. భాగయ్య. గోల్కొండ సాహిత్య మహోత్సవంలో ప్రధాన వక్తగా పాల్గొన్న ఆయన గ్రామానికి వెలుగు వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్య్ర మని చెప్పారు. ఉపన్యాసంలోని కొన్ని భాగాలు:)
ఇవాళ అన్ని రంగాలలోను మార్పు రావాలి. విద్యావిధానంతో పాటు అన్ని జీవనరంగాల్లో మార్పు రావాలి. ఇందుకు ఆధారం సాహిత్యం. సాహిత్యం బుద్ధికి పదును పెడుతుంది. న్యాయాన్యాయాల విచక్షణ కలిగిస్తుంది. వివేకాన్ని ఇస్తుంది. ఎందుకు జీవించాలో, ఎలా జీవించాలో చెబుతుంది. హృదయాన్ని మేల్కొల్పుతుంది. అదే సౌశీల్యం. అటు ఆధ్యాత్మికత, అధిభౌతికత రెండూ మన సాహిత్యంలో దర్శనమిస్తాయి. అయినా మనవారు ‘ఏకో రస: కరుణ ఏవ’ అన్నారు. కరుణమొక్కటే రసమన్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం. కానీ దేశానికి వచ్చింది స్వరాజ్యమే. స్వాతంత్య్రం ఇంకా రాలేదు. స్వాతంత్య్రం అంటే ఒక జాతి తనదైన జీవితాన్ని గడుపుతూ మానవాళికీ, ప్రపంచానికీ సేవ చేసే అవకాశాన్ని కల్పించేది. స్వరాజ్యంలో మనం ఎంతో ప్రగతి కూడా సాధించాం. కానీ ప్రతి దానికి ప్రభుత్వంపై ఆధారపడటం, ప్రతి పని ప్రభుత్వమే చేయాలని అనుకోవడం సమాజానికి నష్ట కారకమని రవీంద్రనాథ్ టాగూర్ అన్నారు. ఈ విషయంలో సాహిత్యం మన బాధ్యతను గుర్తు చేయాలి. మనసుకు దిశ చూపుతూ హృదయాన్ని మేల్కొలిపే సాహిత్యం వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, భారతం, భాగవతం, బౌద్ధ వాఙ్మయం రూపంలో ఈ పుణ్యభూమిలో మనకు అందింది. కాళిదాసు, వేమన, నన్నయ, తిరువళ్లువర్ వంటి వారి సాహిత్యం సాంస్కృతిక వికాసానికి తోడ్పడింది. యోగి అరవిందుల జీవితం, సాహిత్యం చూస్తే ఆధ్యాత్మికత, ఆధునికత సమపాళ్లలో ఉన్నాయని అర్ధమవుతుంది. ఇంకా చెప్పాలంటే నిన్నటి ఉదయం మళ్లీ వచ్చినట్టే మన దేశం అఖండమవుతుంది.
భారతీయ జీవనం పట్ల ఏర్పడిన ఆత్మన్యూనత లను తొలగించడానికి మన సాహితీవేత్తలు ఎంతో కృషి చేశారు. ఇందుకు ఒక ఉదాహరణ గుర్రం జాషువ ‘మాతలకు మాత సకల సంపత్సమేత మన భరతమాత’ పద్యం. ఉన్నవ లక్ష్మీనారాయణ ‘మాలపల్లి’ నవలలో రామదాసు పాత్రలో కనిపించే ధార్మిక చింతన కూడా గొప్ప ఉదాహరణ. సంస్కృతి నుంచి, దేశీయత నుంచి రామదాసు వంటి వారిని ఎలా వంచించదలిచారో, విదేశీ మతాలలో చేర్చదలుచుకున్నారో ఆ నవల చెబుతుంది. భారత ఆధ్యాత్మికతకు రామదాసు కొండంత అండగా నిలబడతాడు. రామదాసు హేతుబద్ధమైన జవాబులతో అవతలి మిషనరీ విచలితుడవుతాడు. సాహిత్యం సమాజాలను కలిపి ఉంచాలి. విభజించే పనికి పూనుకోరాదు. చరిత్ర మరిచిన దేశాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఎనిమిది శతాబ్దాలు విదేశీ పాలనలో మగ్గిపోయినా మన దేశం అనాదిగా నిలబడటానికి కారణం మన సాహితీవేత్తలే.
1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో నానాసాహెబ్, ఝాన్సీ రాణి వెంట సమస్త సమాజం కదిలింది. నాడు ఈ సమాజం సంస్కృతి ఆధారంగా నడిచింది. బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత మెకాలే విద్యా విధానంతో సంస్కృతిని, మాతృభాషలని, స్వాభిమానాన్ని గాయపరిచారు. ఫలితం- జాతీయభావన అణగారిపోయింది. వీటిని అధిగమించడానికి భారతీయులు అనేక ఉద్యమాలు చేశారు. గాంధీజీ కంటే ముందే లాల్, బాల్, పాల్ ఆధ్వర్యంలో జాతీయ భావాలతో స్వాతంత్య్రం కోసం మహోద్యమం నడిచింది. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమానికి బంకించంద్రుడి ‘వందేమాతర’ గీతం ఊపిరిపోసింది. భారతమాత ఎక్కడైనా, ఏ భాషలో అయినా భారతమాతే! మాతృభూమి పట్ల అందరూ విధేయత చూపాలి.సత్యం, అహింస జీవన విలువలుగా ఉండాలి. అరవిందుల అజరామర కావ్యం చూడండి! అందులో మహాసాధ్వి సావిత్రి యమలోకానికి వెళ్లి భర్తను బతికించుకున్నది. ఇదొక ప్రతీక. 24వేల పంక్తుల ఆ మహాకావ్యంలో మనం కోల్పోయిన దాని గురించి ఆ మహాకవి తపించడం కనిపిస్తుంది. ఇక ఉద్దాం సింగ్ ఇంగ్లండ్ వెళ్లి ఓడ్వయ్యర్‌ను యమలోకానికి పంపాడు. ఓడ్వయ్యర్ పంజాబ్ గవర్నర్‌గా ఉండగానే జలియన్‌వాలా బాగ్ మారణహోమం జరిగింది. ఆ సమయంలో ఆయన- నిన్ను కాల్చకుంటే నా మాతృభూమికి అవమానమని అన్నారు. ఈ మాటలే నేతాజీ చేత అజాద్ హింద్ ఫౌజ్ సాయంతో యుద్ధం చేయడానికి ప్రేరణ కలిగించాయి. 1943లో మొదటి భారత స్వతంత్ర ప్రభుత్వాన్ని స్థాపించినవారు నేతాజీ. ఆ ప్రభుత్వాన్ని జపాన్, జర్మనీ, ఇటలీ, కొరియా, ఐరిష్ రిపబ్లిక్ వంటి దేశాలు గుర్తించాయని మరచిపోవద్దు. కానీ స్వతంత్రం వచ్చాక కొందరు నేతాజీని దేశద్రోహిగా చిత్రించడం అత్యంత విషాదం. స్వతంత్రం కోసం బొంబాయిలో నావికాదళం తిరుగుబాటు చేసింది.
ఒకవైపు గాంధీజీ నేతృత్వంలో అహింసా సత్యాగ్రహం, మరోవైపు నేతాజీ నేతృత్వంలోని అజాద్ హింద్ ఫౌజ్ యుద్ధం. ఇంకోవైపు బొంబాయి నావికదళ తిరుగుబాటు. ఇన్ని పోరాట పంథాల కారణంగానే స్వాతంత్య్రం సిద్ధించింది. ఇప్పటికైనా స్వాతంత్య్రం అన్ని రంగాల్లో సిద్ధించాలి. ఎందుకంటే- మనమింకా మానసిక బానిసత్వంలోనే మగ్గుతున్నాం. ఇటీవలి ఉదాహరణ చూడండి! అల్లోపతి వైద్యం గొప్పదే. కానీ కరోనా కాలంలో ఆయుర్వేద వైద్యాన్ని ఐసిఎంఆర్ ఎందుకు గుర్తించలేదు? ఆయుర్వేదమే కాదు, వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, చేనేత అన్ని అభివృద్ధి పథాన సాగాలి. పురోగతి అంటే నగరాలు పెరగడం కాదు. వాటి పెరుగుదల దేశానికి శాపం. గ్రామం పెరగాలి. అక్కడ వాటికి విద్య, వైద్యం, ఆర్థిక పరిపుష్టి వచ్చినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వస్తుంది. ఆ దిశగా మన ప్రయత్నాలు కొనసాగాలి.
హైదరాబాద్‌లో గిరిజన మ్యూజియం
75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహణ ఉద్దేశం- పాతికేళ్ల తరువాత స్వతంత్ర భారత ఆవిర్భావ నూరేళ్ల ఉత్సవాను ఘనంగా, అర్ధవంతంగా జరుపుకోవ డానికి స్ఫూర్తిని పొందడానికేనని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. వచ్చే ఏడాది నిజాం విమోచన 75 ఏళ్ల ఉత్సవాలకు సిద్ధం కావాలనీ, హైదరా బాద్‌లో ఒక గిరిజన సాంస్కృతిక మ్యూజియం ఏర్పాటుకు నిధులు కేటాయించిన సంగతీ ఆయన చెప్పారు. ఆయన ప్రసంగంలోని కొన్ని అంశాలు:
స్వాతంత్య్రం వచ్చి డెబ్బయ్ ఐదు సంవత్సరాలు గడిచాయి. ఆ సందర్భంగానే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను నిర్వహించుకుంటున్నాం. ఇన్నేళ్లు గడిచినా ఆ మహా పోరాటంలో సర్వ త్యాగం చేసిన కొందరి చరిత్రలు వెలుగు చూడలేదు. చాలామందికి గుర్తింపు రాలేదు. అలాంటి వారి చరిత్రలన్నీ ఇప్పుడు వెలుగులోకి తేవాలని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలకు పిలుపు నిచ్చింది.
దేశమంతా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ప్రజా సంఘాల కృషితో ఇప్పుడు ఆ పోరాటంలో పాల్గొన్న ఎందరినో స్మరించుకోగలుగుతున్నాం. ముఖ్య మంత్రులు, మంత్రులు, సాంస్కృతిక వ్యవహారాల శాఖలు, పోలీసు యంత్రాంగం మధ్య సమన్వయంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన నిర్ణయాల అమలుకు హోంమంత్రి అమిత్‌షా నాయకత్వంలో జాతీయ అమలు సంఘం కూడా ఏర్పాటయింది. ఇందులో ప్రసార సాధనాల భాగస్వామ్యం కూడా ఉంది.
ఇటీవలే ప్రధాని మోదీ నవంబర్ 15, బిర్సా ముండా జయంతిని గిరిజన గౌరవ దినోత్సవంగా ప్రకటించారు. బిర్సా అడవి బిడ్డల కోసం, వారి గౌరవం కోసం, హక్కుల కోసం ఎంతో పోరాటం చేశారు. రాంచీ జైలులో వాస్తవానికి హత్యకు గురయ్యారు. వారిని స్మరించుకోవాలి. బిర్సా ఏ జైలులో అయితే మరణించారో, అదే జైలును ఇటీవలనే ప్రధాని మోదీ మ్యూజియంగా ప్రకటించారు. హైదరా బాద్‌లో కూడా గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే ఒక ప్రదర్శనశాలను ఏర్పాటు చేయడానికి కేంద్రం రూ.15 కోట్లు కేటాయించింది. మన చరిత్రలో ఎంతో ఖ్యాతి ఉన్న రాంజీ గోండు, అల్లూరి సీతారామరాజు, కొమురం భీంల పోరాటాల చరిత్ర కూడా ఈ తరాలకు అందవలసి ఉంది.
నేతాజీ చరిత్రను ఇప్పటికే అందించాం. ఆయన చరిత్రతో సంబంధం ఉన్న ప్రదేశాలను చారిత్రక, దర్శనీయ స్థలాలుగా తీర్చిదిద్దే పనిలో ప్రభుత్వం ఉంది. ఢిల్లీలో ఆయన జీవిత విశేషాలను చెప్పే ఒక మ్యూజియం ఏర్పాటుకు సన్నాహాలు జరుగు తున్నాయి. దేశ చరిత్ర ప్రతి వ్యక్తికీ అందాలి. సోషల్ మీడియా, ప్రచురణ రంగం ఇందుకు దోహదపడాలి. వచ్చే ఏడాది సెప్టెంబర్ 17ను నిజాం విమోచన 75 ఏళ్ల సందర్భాన్ని జరుపుకోవాలి. తద్వారా నిజాం అరాచకాలు, నిజాం పాలనలోని దాష్టీకాలు, అణచివేతల చరిత్ర వర్తమాన తరాలకు అందించాలి.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా జరుపుకుంటున్న ఈ ఉత్సవాల వెనుక స్వతంత్ర భారతి నూరేళ్ల సందర్భం, ఈ పాతికేళ్ల ప్రయాణం రూపురేఖలు ఉన్నాయి. కొన్ని పనికిమాలిన విదేశీ దిగుమతి సిద్ధాంతాలతో కొందరు కల్లోలం సృష్టించాలని చూస్తున్నారు. యువతరం అధికంగా ఉన్న మనదేశం ప్రపంచాన్ని శాసించే దిశగా సాగాలని ప్రతిజ్ఞ చేయాలి. స్వతంత్ర భారతం వందేళ్ల సందర్భంలో వచ్చే ఆగస్ట్ 15న ఎర్రకోట మీద ఎవరు జెండా ఎగురవేస్తారో తెలియదనీ, ఎవరు జెండా ఎగుర వేసినా దేశం సమున్నత స్థానంలో ఉండాలని మొన్న ఆగస్ట్ 15న ప్రధాని మోదీ తన ప్రసంగంలో చెప్పిన సంగతి మీకు తెలుసు. కాబట్టి నిన్నటి పోరాటయోధుల త్యాగాలనూ, స్ఫూర్తినీ స్మరించుకుంటూ, దేశాభివృద్ధి కోసం శ్రమించాలి. వారి త్యాగనిరతిని గుర్తు చేసుకుంటూ ఈ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలి.
జైహింద్!
గతం మరిస్తే భవిష్యత్తు శూన్యం
(మన వాఙ్మయం ఎంతో శక్తిమంతమైనదనీ, దీనితో దేశాన్ని సమున్నత స్థాయికి తీసుకువెళ్లగలమనీ, మనకి ఇస్తున్న దేశభక్తి, జాతీయత అచంచలమైనవనీ ముఖ్య అతిథిగా హాజరైన హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆయన ఉపన్యాసం లోని కొన్ని భాగాలు:)
సాహితీవేత్తలను గౌరవించడమంటే దేశాన్ని గౌరవించడమే. తమ కలం బలంతో దేశ ప్రజలను బానిస భావాల నుంచి విముక్తం చేసిన వారు కవులూ రచయితలే. బ్రిటిష్ వారు మన సంపదను ఎంత దోచినా మన సంస్కృతిని దేశభక్త కవులు కాపాడారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉద్దేశాన్ని ఇప్పుడు మళ్లీ వారే యువతరానికి అందించాలి. దేశానికి స్వాతంత్య్రం తేవడానికి జరిగిన త్యాగాల గురించి, రక్తతర్పణల గురించి రాయాలి. అసలు స్వాతంత్య్రం లక్ష్యం ఏదో కూడా తెలియచెప్పాలి. గతాన్ని మరచి పోయే జాతికి భవిష్యత్తు ఉండదు. అందుకే కవులూ, రచయితలతో పాటు మనందరం కూడా ఆ కృషిలో భాగం పంచుకో వాలి. సాధించుకున్న ఈ స్వాతంత్య్రం డబ్బయ్ ఐదేళ్లుగా ఎలా నిలిచిందీ అప్పుడే అర్ధమవుతుంది. దేశభక్తి కవిత్వం అన్ని భాషలలోను వచ్చింది. ఎందుకంటే స్వాతంత్య్ర సమరయోధులను ఎవరూ మరచిపోరు. అలాగే, తరచు వినిపించే ఒక ప్రశ్న-ఆర్‌ఎస్‌ఎస్ స్వాతంత్య్రో ద్యమంలో పాల్గొన్నదా? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలుగుతున్నాం. సంఘ్ వ్యవస్థాప కులు డాక్టర్ కేశవరావ్ బలిరాం హెడ్గెవార్ ఉప్పు సత్యాగ్రహంలో, అటవీ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఈ చరిత్ర ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది నాకు. అనేకమంది స్వయం సేవకులు త్యాగాలు చేశారు. దేశం కోసం పాటుపడిన ప్రతివారిని స్మరించు కోవాలి. జాతీయ భావాలు ఎంత విస్తరిస్తే అంతమంచిది. ఎంత మేధస్సు, ఎంత పురోగతి సాధించి నప్పటికి మన నేలను మరచి పోకూ డదు. నిజాం నవాబును ఎదురించిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షోయబుల్లాఖాన్ వంటి వారి త్యాగాలు చిరస్మరణీయం. శ్రీరాముడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నాడన్న సంగతి సదా స్మరించుకోవాలి. రామాయణం లేదా భారతం లేకుంటే మన దేశానికి విలువలు ఎక్కడ నుంచి వచ్చేవి? మన వాఙ్మయం ఎంతో శక్తిమంత మైనది. దీనితో దేశాన్ని సమున్నత స్థాయికి తీసుకు వెళ్లగలం. అవి మనకి ఇస్తున్న దేశభక్తి, జాతీయత అచంచలమైనవి. అలాంటి ఆశయాలను ఇవాళ్టి యువతరానికి చెప్పే బాధ్యతను స్వీకరించిన ఈ సాహితీ మహోత్సవ్‌కు అభివందనాలు.
ఇది సాంస్కృతిక చైతన్య గర్జన
(ఆ నో భద్రాః క్రతవో యన్తు విశ్వతో… (నలుదిక్కుల నుంచి జ్ఞానం అందనీ) అంటూ ఆశీః ప్రసంగం చేశారు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య. అలా అనుకుంటూనే భారతీయుడు నేను ఎన్నడూ, ఎవరికీ, ఎప్పటకీ తక్కువ కాదు అన్న స్ఫూర్తి కలిగి ఉంటాడు అని పలికారు సుప్రసన్నాచార్య. ఇలాంటి ఒక సాహితీ మహోత్సవం నిర్వహిస్తున్నందుకు అటు ఆశీస్సులు, ఇటు అభినందనలు, అభివాదాలూ కూడా అందించారా పండితుడు. వారి ఉపన్యాసంలోని అంశాలు:)
ఒక సాంస్కృతిక చైతన్యం మళ్లీ విజృంభించి, గర్జించినట్టు అనిపిస్తున్నది. ఉత్తరాన కేదారనాథ్‌లో ఆదిశంకరులవారు ఆశీనులయ్యారు. పశ్చిమాన పటేల్ నిలబడ్డారు. దక్షిణాన కన్యాకుమారిలో వివేకా నందులవారు, తిరువళ్లువరు ఉన్నారు. వేయేళ్ల ముందే భక్తి ఉద్యమానికి అంకురార్పణ చేసిన భగవద్ రామానుజులు హైదరాబాద్‌కు వస్తున్నారు. సాంస్కృతిక చైతన్యం తిరిగి విజృంభిస్తున్నదని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి!
ఈ దేశం సహజంగానే శక్తిమంతమైనది. స్ఫూర్తి వంతమైనది. అన్ని వైపుల నుంచి జ్ఞానం రావాలని అనుకుంటూనే, నేను ఎప్పుడూ తక్కువకాదు అన్న స్ఫూర్తిని కూడా కలిగి ఉంది. 1818లో కాబోలు కలకత్తాలోని హిందూ కళాశాలలో పనిచేసిన హెన్రీ డిరాజియో అనే కవి దేశాన్ని మాతృమూర్తి అని తన రచనలో సంబోధించారు. దేశాన్ని తల్లి అని సంబోధించడం అప్పటి నుంచే ఆరంభమైంది. వివేకానందుల షికాగో ఉపన్యాసం ప్రేరణ ఇచ్చింది. వందేమాతర గీతం ఉద్యమంలో భాగమైంది. పరాక్రమశీలతను అలవరుచుకోవలసిన ఆవశ్యకతను ఆ గీతమే చెప్పింది. అదొక ఉపాసనా గీతం.
రామకృష్ణ పరమహంస విద్యకు ఫలితం సంస్కారం అన్నారు. విద్యలో విశ్వభావన ఉండా లన్నారు. ఆయనకు మామూలు చదువు తక్కువ. కానీ ఈ మాటని బట్టి అంతటి విద్యావంతుడు లేడనీ అనిపిస్తుంది. ఒక శక్తిదూతను మనకు ఇచ్చాడాయన. అందుకు ప్రేరణ కాళీమాత. అసలు ఆమే మన ఉద్యమం నడిపించిందా అనిపిస్తుంది. అరవిందులు భవానీ మందిరం పేరుతో కరపత్రాలు రాశారు. అంటే భారతదేశమే. ఉత్తరపర ఉపన్యాసంలో విశ్వజనీనమైన భారతీయతను దర్శించారాయన. తనకు అంతటా కృష్ణభగవానుడే దర్శనమిస్తున్నాడని చెప్పారాయన, అందులో.
మార్పు రాక గురించి చెప్పాలంటే – అది 1857లో ప్రారంభమైంది. ఒకవైపు పైన చెప్పుకున్న నిజ చైతన్యమార్గం. మరొకవైపు దీనికి విరుద్ధమైన సిద్ధాంతాలూ వచ్చాయి. ఆర్‌ఎస్‌ఎస్ స్థాపన, కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు 1925లోనే జరిగాయి. కమ్యూనిస్టులు ఒక మూర్తిత్రయాన్ని మన మీద రుద్దారు. వాళ్లే కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి. వీరు అపార కృషి చేశారు. కానీ ఆ ముగ్గురూ కూడా బ్రిటిష్ అనుకూలురే. కందుకూరి అయితే బ్రిటిష్ వారిలో న్యాయబుద్ధిని చూశాడు. బ్రిటిష్ వారికి అనుకూలమైన విజయనగరం సంస్థానాధీశుని దగ్గర పనిచేసినవాడు గురజాడ. గిడుగు తను ఆశించినది వేరు, జరిగింది వేరు అని వాపోయారు చివర. గురజాడ ప్రబో ధించిన దేశభక్తి భావన నిజమైనది కాదు. చివరికి అబ్బూరి రామకృష్ణారావు 1953 ప్రాంతంలో సాహిత్యంలో మనం చేసిన కృషంతా వ్యర్థం అన్నారు. ఇవాళ జాతీయ సాహిత్య స్ఫూర్తి కనిపిస్తున్న తరుణంలో తెలుగు వేరు, ఆంధ్రం వేరు అంటున్నారు. ఇందుకు భాషాశాస్త్రం ఒప్పదు.
జానపద సాహిత్యం కదిలించింది.. పద్యం గుండె తలుపు తట్టింది..
సామాజిక చైతన్యం తేవడంలో జానపద సాహిత్యం పాత్ర అమోఘమని ప్రముఖ రచయిత డాక్టర్ భాస్కరయోగి అన్నారు. మహోత్సవంలో భాగంగా జరిగిన స్వాతంత్య్ర సమరంలో సాహిత్యం, జానపద కళల పాత్రపై నిర్వహించిన గోష్టిలో డాక్టర్ యోగి, స్వాతంత్య్ర సమరంలో సాహితీవేత్తల కృషికి సమాంతరంగా జానపద సాహిత్య ప్రభావం కూడా ఉందని అన్నారు. ఇందుకు ఉదాహరణగా ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి వీరగాథను గుర్తుచేశారు. ఆయన ఇంకా ఇలా వివరించారు. జానపద గేయాలలో, భజన పాటలలో, కథలు, గేయాలు, ఒగ్గుకథ వంటి కళారూపాల్లో ధర్మాధర్మ విచక్షణ కనపడుతుంది. నాడు భజనల ద్వారా దేశభక్తిని ప్రభోదించారు. వెల్పూరి హన్మంతదాస్ రచించిన బొబ్బిలి యుద్ధం కథ ప్రజలను ఉత్తేజితులను చేసింది. దొడ్డి కొమురయ్య, కన్నెగంటి హనుమంతు, సర్వాయి పాపన్న తదితరులపై వచ్చిన గేయాలు, యక్షగానాలు సామాన్య ప్రజానీకం నాలుకలపై నర్తించాయి. నైజాం నవాబు విధించిన ఆంక్షలను తప్పించుకోవడానికి తిరుపతమ్మ కథల పేరుతో రామయణం, భారతం చెబుతూ మన ధర్మం గురించి జానపదులు వివరించారు.
అనంతరం ప్రొఫెసర్ అరవిందరావు మాట్లా డుతూ 20 శాతం ఉన్న ముస్లింలు 80 శాతం అధికారాన్ని అనుభవించారని, తెలంగాణలో 1939 వరకు మక్తబా ప్రాథమిక పాఠశాలలు మాత్రమే ఉర్దూ మాద్యమంగా నడిచేవని అన్నారు. నైజాం పరిపాలనలో తెలంగాణ స్వాతంత్య్రోద్యమంలో కన్నడ, మరాఠీల పాత్ర మరువలేనిదని అన్నారు. 1939లో కన్నడ సాహిత్య పరిషత్ స్థాపించినా కూడా నైజాం ఆంక్షల కారణంగా రహస్యంగా జాతీయోద్యమం నడిచిందని గుర్తు చేశారు. జాతీయోద్యమ ప్రభావంతో 350 గ్రామాలు స్వాతంత్య్ర ప్రకటన చేయడంతో రాయచూరులో 3,756 మంది అరెస్టయ్యారు. వీరశైవ విద్యావర్థన్ హాస్టల్, నృపతుంగ పాఠశాల, కర్ణాటక శిక్షణా సమితి, కేశవరావు కోరట్కర్ గారి పేర ఏర్పడిన పాఠశాల జాతీయోద్యమ సాహిత్యానికి దోహదం చేశాయని అన్నారు. కీర్తన కేసరి, జయభేరి, నర్సింగదేవ లాంటి కవులు కన్నడ భాషా అభివృద్ధికి విశేష కృషి చేశారని చెప్పారు. మనం గోల్కొండ సాహితీ పురస్కారంతో సాహితీవేత్తలను గౌరవించుకోవాలని కోరారు.
సంగారెడ్డి జిల్లాకు చెందిన అవధాని అవుసుల భానుప్రకాష్ మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమంలో పద్యం పాత్రను వివరించారు. చిలకమర్తి లక్ష్మీ నర్సింహం, కాళోజీ, మాడపాటి, సురవరం ప్రతా పరెడ్డి, ముదిగొండ లక్ష్మినర్సింహ, ఓగేటి అచ్యుత రామయ్య వంటి కవులేందరో సమాజ చైతన్యానికి కృషి చేశారని తెలిపారు. సమాజంలోని వస్తువును వెతుక్కొని కవి మార్గనిర్దేశనం చేస్తాడని అన్నారు. ప్రాచీన విద్యావిధానంలో చదవడం అంటే పద్యం నేర్పడమేనని అంటూ పద్యం గొప్పతనాన్ని తెలిపారు. మనం దేశభక్తి, ఆత్మీయశక్తి, ఆధునికతలతో ముందుకేగుదామని పిలుపునిచ్చారు.
దిశా నిర్దేశం చేసే రచనలను ప్రచురణకర్తలు ప్రోత్సహించాలి
సమాజ దశను, దిశను సాహిత్యమే నిర్దేశిస్తుందని గోల్కొండ సాహిత్య మహోత్సవంలో భాగంగా జరిగిన ప్రచురణకర్తల సమ్మేళనంలో ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత సహ కార్యవాహ డా।। అన్నదానం సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. ఇలాంటి దృక్పథంతో చేసిన రచనలను ప్రచురణకు తీసుకురావాలని ప్రచురణకర్తలకు పిలుపునిచ్చారు. ఏ పరిస్థితులు ఎదురైనా రచయితలు రచనలు ఆపవద్దని, ఆలోచనలు అక్షరరూపం దాల్చాలని పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద పుస్తకం చదివిన కారణంగానే అన్నా హజరే దిశ మారిందని, ఆంగ్లంలో రఘువీర్ రాసిన స్వామి పుస్తకం చదవడంతోనే ఇండోనేషియా జాతిపిత సుకర్నొ దిశ కూడా మారిందని సుబ్రహ్మణ్యం అన్నారు. గౌతమబుద్ధుడి చరిత్ర చదవడంతోనే అంబేడ్కర్ మహాశయుని ఆలోచనల్లో అద్భుతమైన మార్పు వచ్చిందని అన్నారు. ఇలా సామాజిక స్పృహ ఇతివృత్తంగా రచనలు జరగాలని, వీటిని ముద్రణ కర్తలు ప్రొత్సహించాలని, ముద్రణకర్తలు, రచయితల మధ్య పరస్పర సంబంధాలు పెరగాలని ఆకాంక్షించారు. రచనాశైలి పిల్లలకు సైతం అర్థమయ్యే స్థాయిలో ఉండాలని సూచించారు. పుస్తకం కొని, చదివే మానసిక స్థితిని సమాజంలో నిర్మాణం చేయాలని చెప్పారు.
అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ రచయిత రతన్ శార్దా మాట్లాడుతూ రచయితలు తమ రచనలను మార్కెటింగ్ చేయడం అసలు సమస్యగా మారిందని అన్నారు. పుస్తకాలు అందరినీ చేరడానికి అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని రచనలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సామాజిక మాద్యమాలకు అలవాటుపడ్డ యువత సైతం రచనలు చదివేలా చేయాల్సి ఉందన్నారు.
సూర్తినిచ్చే సాహిత్య సృష్టి జరగాలి
సాహిత్య స్ఫూర్తి పేరుతో జరిగిన స్వాతంత్య్ర ఉద్యమంలో తెలుగు సాహిత్యం సంగోష్టి లోతైన అంశాలతో, విశ్లేషణలతో జరిగింది. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో సాహిత్యం ఒక ఆయుధ మైందని అన్నారు. ఇందుకు ఉదాహరణగా బంకించంద్ర, గరిమెళ్ల సత్యనారా యణ, చిలకమర్తి, దాశరథి తదితరుల సాహిత్యాన్ని ఉదహరించారు. గరిమెళ్ల ‘మాకొద్దీ తెల్లదొరతనం’ గేయం, చిలకమర్తి ‘భరతఖండంబు చక్కని పాడియావు’ పద్యం జాతియోద్యమాన్ని ఉధృతం చేయగలిగాయని అన్నారు. ఇంతటి ఘన చరిత్రను బ్రిటిష్ వారు అణచివేసి వారి సొంత చరిత్రను రాశారు. మన చరిత్రను మనం రాసుకోలేదు. మెకాలే మానసపుత్రులు కూడా దాన్నే కొనసాగిస్తు న్నారు. ఇప్పుడు మనం మనదైన చరిత్రను వెలికితీయాల్సిన అవసరముందన్నారు.
దేశభక్తులు వారి త్యాగాల కారణంగా చిరంజీవులు. వారి గాథలకు అక్షరరూపం ఇచ్చేది రచయితలు, కవులేనని డాక్టర్ కెవికె శర్మ తన ప్రసంగంలో చెప్పారు. ఈ గాథలే భావితరాలకు తరగని సంపద అని కూడా ఆయన గుర్తు చేశారు. ఆనాటి పరిస్థితులలో ఏ అంశం జాతిని జాగృతం చేసి కర్తవ్యం వైపు నడిపిస్తుందో గమనించే కవులంతా దేశభక్తి కవిత్వాన్ని ప్రజల ముందు ఉంచారని ఆయన విశ్లేషించారు. వేదుల, దుర్భాక, బసవరాజు, గరిమెళ్ల, జాషువ, గడియారం వంటివారు ఈ అంశంలో చేసిన కృషి అద్భుతమని శర్మ కొనియాడారు. మా తెలంగాణ కోటిరత్నాల వీణ అంటూ దాశరథి కవితా శంఖం పూరించి, నిజాం విముక్తికి తోడ్పడ్డారని చెప్పారు.
కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ తెలుగు శాఖాధిపతి డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి పత్రికల పాత్రను వివరించారు. భారత స్వాతంత్రోద్యమంలో పత్రికలు ప్రధాన పాత్ర పోషించాయని, ఆ కాలంలో ప్రసార సాధనాలు లేకపోయినా, అక్షరాస్యత అంతగా లేకపోయిన దేశాన్ని పత్రికలే ప్రభావితం చేశాయన్నారు. మారుమూల ప్రాంతాలకు సైతం వార్తలు చేరేవన్నారు. తెలుగులో మొట్టమొదటిసారి గాడిచర్ల హరిసర్వోత్తమరావు స్వరాజ్య పత్రికలో ఓ బ్రిటిష్ పిశాచమా అని రాసినందుకు దేశద్రోహం కింద వారు అరెస్టయ్యారు. స్వామినాథన్ సదానంద్ ఫీప్రెస్ జర్నల్ నడిపించడానికి ఎంతో నష్టపోయినా తల వంచలేదని గుర్తుచేశారు. తన పత్రికలో బ్రిటిష్ వ్యతిరేక విమర్శలు రాసినందుకు ఆయన కట్టిన జరిమానా రూ. 70వేలు. అదే విధంగా సుబ్రమణ్యభారతి, మట్నూరి కృష్ణారావు తమ రచనలతో ఆనాటి ప్రజలను, నాయకులను ఎంతో ప్రభావితం చేశారని అన్నారు.
విస్మృత వీరులకు వందనం!
మనం మరచిన వీరులు అనే అంశం మీద వివేకానంద మందిరంలో (నవంబర్ 21) జరిగిన గోష్టిలో డాక్టర్ సుదక్షిణ, సతీశ్‌కుమార్, వెంకటరాజం పాల్గొన్నారు.
ఆ మహిళల ఆక్రందనను చరిత్ర ద్వారా వినాలి : డాక్టర్ సుదక్షిణ
విసునూరి రామచంద్రారెడ్డి అనే దయాదాక్షిణ్యాలు లేని భూస్వామి తమ ఇంట్లో పనిచేసే మహిళను ఈడ్చుకురావడంతో తిరుగుబాటుకు మూలమన్న అభిప్రాయం ఉంది. అప్పటికి ఆమె మూడు రోజుల బాలింత. తీరా ఆమె పని తరువాత ఇంటికి వెళ్లి చూస్తే ఆ పసికందు పాలు లేక మరణించింది. నిజం చెప్పాలంటే ఆ పసికందుది కూడా పోరాటమే, దాష్టీకానికి బలికావడమే. తెలంగాణ జిల్లాలలో ఎక్కడికి వెళ్లినా ఇలాంటి దారుణ గాధలు వినిపిస్తాయి. మా గాథ వినండంటే, మా కథ వినండంటూ మహిళలు, పురుషులు పోటీ పడతారు. అంత విషాదం ఇక్కడ ఉంది. స్వాతంత్య్ర పోరాటంలో మిగిలిన దేశమంతటిది ఒక ధోరణి. తెలంగాణ పోరాటం ధోరణి వేరొకటి. ఇక్కడ స్త్రీల పోరాటం మరీ క్లిష్టమైనది. నిజాం దాష్టీకాలు, రజాకార్ అకృత్యాలు, వీటికి తోడు సంస్థానాలకు బయట జరుగుతున్న ఉద్యమ స్ఫూర్తితో కదలడం వేరొకటి. ఆంధప్రాంతంలో ఎందరో మహిళలు అక్కడ జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారు. దువ్యూరి సుబ్బమ్మ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ వంటివారు అక్కడ జరిగిన స్వరాజ్య ఉద్యమంలో కనిపిస్తారు. కానీ నిజాం రాజ్యంలో మహిళల పరిస్థితి పరమ ఘోరం. కానీ వాటికి బలైపోయిన వారి జీవిత చరిత్రలు వెలుగు చూడలేదు. భర్తలను కట్టేసి, వారి ఎదురుగానే స్త్రీలను నగ్నం చేసి బతుకమ్మలాడించిన అమానుషం ఇక్కడ జరిగింది. రాక్షసత్వానికి పేరుమోసిన రజాకార్లు గ్రామం మీద దాడి చేస్తున్నారని తెలియగానే నిస్సహాయతతో చెరువులో దూకి చనిపోయిన విషాదాంతాలు కూడా ఉన్నాయి. దేశం కోసం త్యాగం చేసిన వారిని అంతా గుర్తు చేసుకుంటారు.ఆరుట్ల కమలాదేవి హైదరాబాద్‌లో చదివి, తన గ్రామంలో అందరికీ అక్షరం పంచారు. కర్రి బుచ్చమ్మ, జ్ఞానకుమారి హెడా, భూలక్ష్మి, చాకలి ఐలమ్మ, సంగెం లక్ష్మీ బాయమ్మ, ఓబులరెడ్డి రంగమ్మ, చెరుకుపల్లి రంగమ్మ ఎందరో ఉద్యమంలో పాల్గొన్నారు. చాలామంది చనిపోయారు. ఇప్పటికీ కొందరు మన మధ్య ఉన్నారు. వారి నుంచి సమాచారం సేకరించే పనిని తక్షణం ఆరంభించాలి.
రాంజీ, భీమ్ : సతీశ్‌కుమార్
పురాణాలలో కనిపించినట్టే ఆధునిక కాలంలోనూ గిరిజన రాజ్యాలు కనిపిస్తాయి. ఆనాడు గుహుడు, సుగ్రీవుడు వంటి వారి రాజ్యాలు ఉన్నాయి. ఇప్పుడు గోండ్వానా కనిపిస్తుంది. ఆంగ్లేయుల రాకతో సైన్య సహకారపద్ధతి ప్రవేశ పెట్టడం, విభజించి పాలించడం వల్ల గిరిజనుల జీవితాలు కూడా ఛిన్నాభిన్నమైనాయి. రాంజీ గోండు జీవితం ఇందుకు గొప్ప ఉదాహరణ. ఆయన అటు ఆంగ్లేయులతో, ఇటు నిజాంతో పోరాడవలసి వచ్చింది. తాంతియా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయిల మద్దతు ఉంది. రొహిల్లాలు అనే తెగవారితో కలసి రాంజీ గోండు యుద్ధం ఆరంభించాడు. అది గెరిల్లా యుద్ధం. కానీ ఆ యుద్ధంలో రాంజీ, గోండు సైనికులు, రోహిల్లాలు ఓడి బందీలుగా చిక్కారు. రాంజీ సహా వేయిమందిని తీసుకువచ్చి ఒక మర్రిచెట్టుకు ఉరి వేశారు. అదే వేయి ఉరుల మర్రిగా తరువాత ఖ్యాతి గాంచింది. అలాగే కొమురం భీమ్ కూడా. ఆయన వెనుక నిలిచిన కొమురం సూర్‌ను ప్రతి తరం తలుచుకోవాలి. అటు జానపద సాహిత్యం, ఇటు పలు రంగాల వారు రాసిన ఆధునిక చరిత్రలు క్రోడీకరించి రాంజీ, భీమ్ చరిత్రలను మరింత వెలుగులోకి తీసుకురావాలి.
పరిశోధకులు తాకని రంగాలు ఎన్నో: వెంకటరాజం
ఈ దేశం మీద దండయాత్రకు వచ్చి, ఇక్కడి ప్రజలతో కలసిపోయినవారు ఉన్నారు. కానీ ఆంగ్లేయులు అలా కాదు. వచ్చారు, దోచుకున్నారు, పోయారు. వీళ్లే క్రైస్తవ మిషనరీలను తెచ్చారు. విద్య, వైద్యం పేరుతో విస్తరిం చారు. నేను చూసిన ఒక మిషనరీ జట్టి కాశీనాథ్. ఈయన సికింద్రాబాద్‌లోని లాలాపేటలో ఉండే వాడు. విద్యావ్యాప్తికి బాగా కృషి చేశాడు. అలాగే కట్టంగూరి నరసింహారెడ్డి, మనోహర్ వంటివారు కూడా విద్యాపరంగా సేవలు అందించారు. తెలంగాణలో చరిత్రకు ఎక్కని ఘట్టాలు, వ్యక్తులు ఎందరో ఉన్నారు. నిజాం రాజ్యంలో స్త్రీల మీద జరిగిన ఘోరాలు చరిత్ర మరువలేనివి. పరిశోధ కులు స్పృశించని రంగాలను పట్టించుకోవాలి.
సంస్కారాల సంఘర్షణ
(స్వరాజ్య సమరంలో రాజకీయ ఉద్యమమే కాదు, విలువలూ, సంస్కారాలూ, విద్యా, గ్రంథాలయాల అభివృద్ధి, ఆర్య సమాజం, మహారాష్ట్రుల పాత్ర, గిరిజనోద్యమాలు కూడా కనిపిస్తాయి. నవంబర్ 21న లా కళాశాల సభా మందిరంలో ఈ అంశాల మీద గోష్టి జరిగింది. అందులో విశేషాలు:)
అది సంస్కారాల మధ్య సంఘర్షణ : హెబ్బార్ నాగేశ్వరరావు
స్వాతంత్య్రోద్యమం అంటే కేవలం రాజకీయ స్వాతంత్య్రం సాధించడమే కాదు. విదేశీ పాలనలో మనం పోగొట్టుకున్న కొన్ని సంస్కారాలూ, విలువలూ తిరిగి సాధించుకోవడం కూడా. భారతదేశానికి సంబంధించినంతవరకు గోరక్షణ ఒక సంస్కారం. మనకు భూమి, గోవు ఒక్కటే. నిజం చెప్పాలంటే భారత స్వాతంత్య్రం సమరమంటేనే సంస్కారాల మధ్య సంఘర్షణ. పాశ్చాత్య పోకడలు, వికృతులతో పోరాటం కూడా.
ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తుల గురించి ప్రస్తావనకు వచ్చింది. ఒకరు మన పురాణ పురుషుడు దిలీపుడు. రెండో వ్యక్తి ఫైడల్ కాస్ట్రో. కామధేనువును సింహం నుంచి రక్షించడానికి దిలీపుడు తనను తాను సింహానికి బలి కావడానికి సిద్ధపడ్డాడు. మరొకటి- ఒకసారి వాహనం మీద ప్రయాణిస్తున్న ఒక పాశ్చాత్యుడు ఎవరి గొడవా పట్టకుండా పచ్చిక మీద మేస్తున్న గో సమూహాన్ని చూసి తుపాకీ తీసి ఆరుసార్లు కాల్చాడు. ఆరు ఆవులు కన్నుమూశాయి. అతడే కాస్ట్రో. దిలీపుడు పురాణ పురుషుడు కావచ్చు. గోవు పట్ల అలాంటి భక్తి ప్రపత్తులే ఇటీవలి కాలం వరకు కూడా ఈ నేల మీద ఉన్నాయని సాక్ష్యం చెప్పేది- ఆవుల సుబ్బన్న ఉదంతం. తెలుగు ప్రాంతంలో ఉన్న పెనుకొండ అందరికీ తెలుసు. ఇక్కడ తొర్రుపట్టు ఉండేది. అంటే ఒట్టిపోయిన ఆవులను తరలించే స్థలం. ఆ ఆవులతో పాటు పాడియావులు కూడా మేతకు వచ్చేవి. వీటన్నిటికీ కాపలాదారు ఆవులు సుబ్బన్న. పోర్చుగీసు వాళ్లు ఈ దేశంలోకి వచ్చినప్పుడు అక్కడ కొన్ని ఆవులను పట్టుకు పోవడానికి ప్రయత్నించారు. ఇందుకు సుబ్బన్న ప్రతిఘటించాడు. విదేశీయులు దాడి చేశారు. అయినా అతడిని కొట్టి పడేశారు. సుబ్బన్న అరుపులు విని వచ్చిన గోపాలురు పోర్చుగీసు వాళ్ల మీద తిరగబడి ఆవులను రక్షించుకున్నారు. సుబ్బన్న రక్షణకు పూనుకున్నవారు అబ్బరాజు, బుచ్చిరాజు. ఈ ఘన చరిత్ర అంతా ఒక కోలాటం పాటతో, ఇతర సాహిత్య పక్రియలలో ఉంది.
హెబ్బార్ చెప్పిన ఈ చరిత్ర శ్రోతలను ఆకర్షించింది.
ఇదే గోష్టిలో దేశ స్వరాజ్య సమరంలో, హైదరాబాద్ విముక్తి పోరాటంలో ఆర్య సమాజ్ నిర్వహించిన సాహసోపేత పోరాటం గురించి వెంకట రఘురామ్ తన ప్రసంగంలో వివరించారు. స్వాతంత్య్ర కాంక్ష తెచ్చిన చైతన్యాలలో ఒకటి విద్యా వాప్తి. ఈ అంశం గురించి ప్రముఖ జర్నలిస్ట్ కె. రాకాసుధాకర్ వివరించారు. ఇలాంటి ప్రయత్నం అన్ని ప్రాంతాలలోను కనిపిస్తుందని ఆయన చెప్పారు. అలాగే గ్రంథాలయాల స్థాపన ద్వారా జరిగిన కృషి గురించి ఆయన వివరించారు.
గుబాళించిన సాంస్కృతిక సౌరభాలు
సభా కార్యక్రమంలో ప్రార్ధన మొదలు, మధ్య మధ్య దేశభక్తి పాటలతో ఆహూతులను కదిలించిన ఘనత మైథిలి, ఉదయ్‌కుమార్‌లకు దక్కుతుంది.
నవంబర్ 20 సాయంత్రం సంచలన స్కూల్ ఆఫ్ డ్యాన్స్ బాలికలు, డాక్టర్ కిరణ్మయి నృత్య దర్శకత్వంలో ‘మాతృస్తవం’ ప్రదర్శన జరిగింది. పిల్లలు దాస్యంలో మగ్గతుంటే తల్లి పడే వేదనను హృద్యంగా ప్రదర్శించారు. జనజాగృత నవ భారత మహోదయం వంటి సంఘ శాఖలలో పాడుకునే పాటలనే అద్భుతమైన నృత్య రూపకాలుగా మలచి, హావభావాలతో, చక్కని ఆహార్యంతో బాలికలు ప్రదర్శించారు. చిరంజీవులు సమ్మోహనకృష్ణ, జయసాయి సరస్వతి, శోభిత, నవ్య, ఎన్‌సీహెచ్ సాయితన్మయి ఇందులో పాల్గొన్నారు.
తరువాత ‘హైదరాబాద్ విమోచన పోరాటం’ రూపకం చక్కని ప్రయోగ దృష్టితో ప్రదర్శించారు. హైదరాబాద్ నగరంలోని ఆరు పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందాలు ఈ రూపకాన్ని ప్రదర్శించి రక్తి కట్టించారు. ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో హిందువులు ఎదుర్కొన్న హింస, మాతృభాష కోసం వారు పడిన ఆరాటం, అంతిమంగా తిరుగుబాటు, ఖాశిం రజ్వి ప్రగల్భాలు, నెహ్రూ-పటేల్ సంవాదం, చివరికి నిజాం లొంగుబాటు దృశ్యాలను బాలబాలికలు ప్రదర్శించారు. ప్రయోక్తలు తమ వ్యాఖ్యానంలో ఆంగ్ల పదాలు తొలగించి ఉండవలసింది. ప్రతీకాత్మకమైన ఆహార్యంతో, పాటలు, నృత్యాలతో అరగంట మాత్రమే సాగిన ఈ రూపకం ప్రేక్షకుల ప్రశంసలు పొందింది.విద్యా విజ్క్షాన హైస్కూల్ (మలక్‌పేట•), సరస్వతి శిశుమందిర్(కార్వాన్), స్వామి దయానంద్ హైస్కూల్ (అంబర్‌పేట్), వివేకానంద హై స్కూల్‌గుడి (మల్కాపూర్), సాయిభూపతి హైస్కూల్(నాగోల్), విద్యాభారతి హైస్కూల్ (నాచారం) విద్యార్థులు ప్రదర్శించారు. ఇతివృత్తంగాద తీసుకున్న 6 దృశ్యాలను ఆ ఆరు పాఠశాలల వారు ప్రదర్శించారు. దాశరథి, మహిళా ఉద్యమకారిణి, నెహ్రు, సర్దార్ పటేల్, వానమామలై, సురవరం ప్రతాపరెడ్డి, షోయబుల్లాఖాన్, వందేమాతరం(వావిలాల) రామచంద్రారావు పాత్రధారులు అందరినీ ఆకట్టుకున్నారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్, రామానందతీర్ధ, ఖాశిం రజ్వీ, కిషన్‌ప్రసాద్ వంటి పాత్రలలోను బాలలు కనిపించారు.
రెండవ రోజు సిద్ధిపేట కళాకారులు ప్రదర్శించిన పేరిణి తాండవం ఉర్రూతలూగించింది.