మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ నరంద్రమోదీ నాయకత్వంలోని నేషనల్‌ ‌డెమొక్రటిక్‌ అలయన్స్ (ఎన్‌డీఏ) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్నదాతల మనోభావాలను, అభిప్రాయాలను, ఆలోచనలను గుర్తిస్తూ, గౌరవిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ప్రతిఒక్కరూ హర్షించదగ్గది. రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక, సులభతర) చట్టం-2020, ధరల హామీ, వ్యవసాయ సేవలపై రైతుల (సాధికారత, రక్షణ) ఒప్పంద చట్టం-2020, నిత్యావసర సరకుల (సవరణ చట్టం)-2020.. ఉపసంహరించుకుంటున్నట్లు స్వయంగా ప్రధాని ప్రకటించారు. జరిగిన పరిణామాల నేపథ్యంలో సహజంగా ఎవరైనా ఈ నిర్ణయాన్ని హర్షిస్తారు, స్వాగతిస్తారు, ఆహ్వానిస్తారు. కానీ విపక్షాలకు ఈ నిర్ణయం సైతం మింగుడు పడకపోవడం ఆశ్చర్యం, ఆందోళన, ఆవేదన కలిగిస్తోంది. ఇన్నాళ్లూ అవి రైతు వ్యతిరేక చట్టాలని రైతుల్లో అపోహలు కలిగించిన విపక్షాలు వాటిని రద్దు చేసినా హర్షించకపోవడం రాజకీయం తప్ప మరొకటి కానేకాదు. ఏదో ఒక విధంగా ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రోది చేయడం, తద్వారా రాజకీయంగా లబ్ధిపొందడం తప్ప మరో ఆలోచన ప్రతిపక్షాలకు లేదనడానికి ఇంతకు మించి మరో నిదర్శనం అక్కర్లేదు. కానీ భారతీయ రైతులు అంత అమాయకులు కారు. పాలూనీళ్లనూ హంస వేరు చేసినట్లు ప్రభుత్వ నిర్ణయంలోని చిత్తశుద్ధిని, విపక్షాల రాజకీయ ప్రయోజనాన్ని వేరు చేసి చూడగలరనడంలో ఎలాంటి సందేహం లేదు.

వాస్తవానికి ఈ మూడు చట్టాల పేర్లలోనే అవి రైతుల ప్రయోజనాలకు పట్టం కడతాయన్న అభి ప్రాయం ఉంది. మొదటిది రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక, సులభతర) చట్టం. దీని ప్రకారం రైతు తన ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్ల వెలుపల దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ఉంది. ఎక్కడ ఎక్కువ ధర ఉంటే అక్కడ విక్రయించు కోవచ్చు. ఇలా చేసే విక్రయాలపై రుసుములేవీ విధించరు. ఈ నిబంధనలు రైతులకు ఏ రకంగా చూసినా మేలు చేస్తాయే తప్ప ఎంత మాత్రం హాని చేయవు. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. రెండోది ధరల హామీ, వ్యవసాయ సేవలపై రైతుల (సాధికారత, రక్షణ) ఒప్పంద చట్టం. పండించే పంట కొనుగోలు, ధరకు సంబంధించి ముందస్తుగానే ఎగుమతిదారులు, కొనుగోలుదారులతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. దీనివల్ల రైతులకు ధరకు సంబంధించి ముందుగానే స్పష్టత వస్తుంది. మార్కెట్‌ ‌ధరల్లో ఉండే ఒడిదొడుకులు, ప్రతికూలతలు రైతులపై పడవు. వారికి ఈ చట్టం రక్షణగా నిలుస్తుంది. ఇది ఏ రకంగా రైతులకు హానికరమో ఎవరూ నిర్దిష్టంగా చెప్పలేరు. తృణధాన్యాలు, పప్పులు, నూనెగింజలు, ఉల్లి, బంగాళాదుంప వంటి వాటిని నిత్యావసరాల జాబితా నుంచి తొలగించాలని, వాటి ఎగుమతులపై నిల్వ పరిమితి, సంబంధిత ఆంక్షలు విధించకూడదని మూడో చట్టం పేర్కొంటోంది. యుద్ధం, కరవు, విపత్తులు, ధరల్లో అసాధారణ పెరుగుదల వంటి పరిస్థితుల్లోనే ఈ ఆంక్షలు విధించాలని చట్టం నిర్దేశిస్తోంది. స్థూలంగా చూసినప్పుడు ఈ చట్టం వల్ల రైతులకు ఎలా నష్టమో ఎవరూ చెప్పలేరు. కార్పొరేట్‌ ‌కంపెనీలకు మోదీ సర్కారు దోచిపెడుతుందనే రొడ్డకొట్టు వాదన తప్ప ఈ మూడు చట్టాలు ఏ విధంగా రైతులకు హానికరమో విమర్శకులు సూటిగా వివరించలేకపోతున్నారు. అయితే రైతుల్లో దురభిప్రాయాన్ని కలిగించడంలో మాత్రం విపక్షాలు విజయవంతమయ్యాయి.

రైతులకు మేలే: షేత్కారీ సంఘటన్‌

‌మూడు సాగు చట్టాలను రద్దు చేయడం దురదృష్ట కరమని రైతు నాయకుడు, మహారాష్ట్ర షేత్కారీ సంఘటన్‌ అధ్యక్షుడు అనిల్‌ ‌ఘన్వాట్‌ ‌వ్యాఖ్యానించడం గమనించదగ్గ విషయం. స్వయంగా రైతు, రైతు సంఘం నాయకుడైన ఘన్వాట్‌కు చట్టాల్లో కనిపించని లోపాలు ఇతరులకు కనిపించడం వెనక రాజకీయ దురుద్దేశం తప్ప మరొకటి కాదు. మహారాష్ట్ర షేత్కారీ సంఘటన్‌కు దేశవ్యాప్తంగా రైతుల్లో మంచి పేరుంది. రైతుల ప్రయోజనాల కోసం పోరాడే సంస్థగా గుర్తింపు ఉంది. ఘన్వాట్‌ ‌కేవలం రైతు నాయకుడే కాదు. సాగుచట్టాల రద్దుపై అధ్యయనానికి సర్వోన్నత న్యాయస్థానం నియమించిన త్రిసభ్య కమిటీలో ఒక సభ్యుడు. ‘పాత సాగుచట్టాలు ఫలితమివ్వక లక్షలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడు కేంద్రం కొత్త చట్టాలను రద్దు చేస్తున్నందున భవిష్య త్తులో మరే ప్రభుత్వమూ కనీసం మరో 50 ఏళ్లపాటు సాగు రంగాన్ని సంస్కరించే సాహసం చేయదు. ఇది రైతులకు కీడుచేస్తుంది. మా కమిటీ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు ఇప్పటివరకూ చర్చించలేదు. ఈ చట్టాల్లో ఉన్న కొన్ని లోపాలను నివేదికలో పేర్కొన్నాం. వాటిని పరిగణనలోకి తీసుకుని మార్పులు, చేర్పులు చేసి ఉంటే రైతులకు, దేశానికి మేలు జరుగుతుంద’ని ఘన్వాట్‌ ‌తన అభిప్రాయాన్ని సూటిగా, స్పష్టంగా వివరించారు. తమ నివేదికను సుప్రీంకోర్టు విడుదల చేయకపోతే త్వరలో తామే రైతులకు అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు. చట్టాల రద్దన్నది సర్కారు సొంత నిర్ణయమని, త్రిసభ్య కమిటీలోని మరో సభ్యుడు అశోక్‌ ‌గులాటి వ్యాఖ్యానించారు.

వాస్తవాలకు వక్రభాష్యం…

వాస్తవాలు, నిపుణుల అభిప్రాయాలు ఇలా ఉంటే మరోవైపు రైతు సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు చేస్తున్న బాధ్యతారాహిత్య ప్రకటనలు విస్తుగొల్పుతున్నాయి. రాజకీయ నాయకులంటే ఎన్ని కల అవసరాల కోసం మాట్లాడతారని అనుకోవచ్చు. కానీ రైతు సంఘాల నాయకులూ వారి తరహాలోనే వ్యాఖ్యానాలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరగనున్న అయిదు రాష్ట్రాల (యూపీ, ఉత్తరాఖండ్‌, ‌గోవా, పంజాబ్‌, ‌మణిపూర్‌) ఎన్నికల నేపథ్యంలో మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్‌, ‌తదితర పార్టీలు విమర్శిం చడం విడ్డూరంగా ఉంది. కేవలం రైతుల ఆందోళన, ఆవేదనను పరిగణనలోకి తీసుకునే చట్టాల రద్దు నిర్ణయం తీసుకున్నామన్న ప్రధాని మాటల్లోని చిత్త శుద్ధిని అవి ఉద్దేశపూర్వకంగా గుర్తించడం లేదు. ఎన్నికలకు, ఈ నిర్ణయానికి సంబంధం ఏమిటో అర్థం కాని విషయం. ఒక్క పంజాబ్‌ ‌తప్ప మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం తధ్యమని ఇటీవల ఎన్నికల సర్వేలు తేల్చిచెప్పాయి. ప్రభుత్వ వ్యతిరేకత పేరుతో రాజకీయ లబ్ధి పొందాలన్న విపక్షాల జిమ్మిక్కులకు ప్రజలు మోసపోరని సర్వేలు స్పష్టం చేశాయి. ఇంధనం, వంటగ్యాస్‌ ‌ధరల పెరుగుదల వంటి అంశాలు ప్రభావం చూపవని పేర్కొంది. మహా అయితే విపక్షాలు కొన్ని సీట్లను పెంచుకోగలవు తప్ప, ఎక్కడా కాషాయపార్టీని నిలువరించే సత్తా లేదని సర్వే విస్పష్టంగా చెప్పింది. సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ ‌వంటి పార్టీలు హడావిడి చేయడం తప్ప భాజపాను యూపీలో నిలువరించలేవని స్పష్టంచేసింది. యూపీలో అయితే గియితే భాజపాకు కొన్ని సీట్లు తగ్గుతాయని, ఈ మేరకు సమాజ్‌వాదీ పార్టీ లబ్ధి పొందగలదని, యూపీ పీఠాన్ని మళ్లీ కాషాయ పార్టీ చేజిక్కించుకుంటుందని స్పష్టంగా తెలియజేసింది. ఉత్తరాఖండ్‌, ‌గోవా, మణిపూర్‌ ‌లోనూ మళ్లీ అధికారం భారతీయ జనతా పార్టీదేనని వివరించింది. యూపీ తప్ప ఉత్తరాఖండ్‌, ‌గోవా, మణిపూర్‌ల్లో రైతుల ప్రభావం నామమాత్రం. అందువల్ల ఎన్నికల కోణంలోనే సర్కారు రద్దు నిర్ణయం తీసుకుందనడంలో ఎంతమాత్రం హేతుబద్ధత లేదు. పంజాబ్‌కు సంబంధించి ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని, అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఏకైక పెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వే జోస్యం చెప్పింది. వాస్తవానికి పంజాబ్‌లో భాజపా ఏనాడూ అతిపెద్ద పార్టీ కాదు. అకాలీదళ్‌ ‌మిత్రపక్షంగా ఉంటూ వస్తోంది. సాగు చట్టాల పేరుతో భాజపాతో అనుబంధాన్ని తెంచుకున్న అకాలీదళ్‌ ‌పరిస్థితి కూడా ఏమీ బాగాలేదు. అది అధికార ఛాయలకు కూడా రాలేదని సర్వే వెల్లడించింది. అధికార కాంగ్రెస్‌ ఓటమి అనివార్య మని తెలిపింది. దళితుడిని ముఖ్యమంత్రిని చేసినా ప్రజలు పట్టించుకోరని పేర్కొంది. హస్తం పార్టీ మునిగే నావ అని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల అవసరాల కోసం, ముఖ్యంగా పంజాబ్‌ ‌రైతులను ప్రసన్నం చేసుకునేందుకే సాగు చట్టాల రద్దు నిర్ణయం తీసుకున్నారన్న భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ ‌నాయకుడు రాకేశ్‌ ‌టికాయిత్‌, ‌విపక్షాల విమర్శలు, వాదనలో డొల్లతనం తప్ప మరొకటి కనపడదు. చట్టాల రద్దు పక్రియ పూర్తయ్యేవరకు ఆందోళన కొనసాగుతుందని, ఢిల్లీని వీడమని, టికాయిత్‌తో పాటు సంయుక్త కిసాన్‌ ‌మోర్చా నాయకులు ప్రకటించడం అర్థరహితం. అంతేకాక కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేంతవరకూ ఆందోళన కొనసాగుతుందని పేర్కొనడంలో ఎలాంటి హేతు బద్ధత కనపడదు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె బిడ్డలు రాహుల్‌ ‌గాంధీ, ప్రియాంకా గాంధీలు సైతం ఇదే కోణంలో విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. ఏనాడూ రైతుల సమస్యలను దగ్గరగా చూడని ఈ నేతలు రైతులపై మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉంది. సొంత నియోజకవర్గమైన అమేథిలో ప్రజల తిరస్కారానికి గురైన రాహుల్‌గాంధీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం ఆశ్చర్యకరం. కారణాలు ఏమైనప్పటికి ఎన్నికల అనంతరం మూడేళ్లయినా రాజధాని నగరాన్ని దాటి ప్రజల వద్దకు వెళ్లని హస్తం పార్టీ అధినేత్రి సోనియాగాంధీ విమర్శల్లో పస కనిపించడం లేదు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు, సీట్లను పెంచుకునే యావలో హస్తం పార్టీ సహా అన్ని విపక్షాలు రైతులను పక్కదారి పట్టిస్తున్నాయి. తద్వారా రాజకీయంగా లబ్ధి పొందేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి.

రాజకీయ పార్టీలు, రైతు సంఘాల నాయకుల ప్రకటనలు ఎలా ఉన్నప్పటికీ కర్షకుల మనోభావాలను గౌరవించి వెనక్కు తగ్గుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వినమ్రంగా ప్రకటించారు. కొంతమంది రైతులు అనుమానాలను, సందేహాలను సంపూర్ణంగా తీర్చలేకపోయామని అందువల్లే చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి రైతుల పట్ల తన చిత్తశుద్ధిని, నిబద్ధతను చాటుకున్నారు. కొంతమంది విపక్ష నాయకులు వ్యాఖ్యానించినట్లు ఇది ప్రభుత్వ ఓటమి ఎంతమాత్రం కాదు. ప్రజల ఆకలిని తీర్చే అన్నదాతల పట్ల గౌరవం. వ్యక్తిగతంగా నరేంద్ర మోదీ, పార్టీ పరంగా భారతీయ జనతా పార్టీ కర్షకుల ప్రయోజనాలను కాపాడటంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. ద్వితీయ ప్రధాని దివంగత లాల్‌ ‌బహదుర్‌ ‌శాస్త్రి ‘జై జవాన్‌, ‌జై కిసాన్‌’ ‌నినాదాన్ని నిజం చేసేందుకు త్రికరణ శుద్ధితో ప్రయత్నిస్తుంది. ప్రధాని మోదీ ఇటీవల దీపావళిని చైనా సరిహద్దుల్లోని సైనికులతో జరుపుకోవడం గమనార్హం. విపక్షాల నుంచి సుద్దులు చెప్పించుకునే పరిస్థితిలో పార్టీ, ప్రభుత్వం లేనేలేదు.

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE