చైనా ప్రాపంచిక దృక్పథం ఏమిటో ‘పంచశీల’ చెబుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలకూ, దౌత్యానికీ అతీతమనుకుంటుంది చైనా. భారత్‌తో పాటే స్వాతంత్య్రం తెచ్చుకున్నప్పటికీ ఇరుగు పొరుగుతో సయోధ్య అన్నమాటే ఈనాటికీ తలపెట్టలేదు. భారత్‌ వంటి పెద్ద దేశం మీద కుట్రలు జరుపుతుంది. సరిహద్దుల మీద కన్నేసి ఉంచుతుంది. స్నేహం, సయోధ్య ` ఈ పదాలు బీజింగ్‌ డిక్షనరీలో లేనేలేవు. ఈ విషయం అనేకసార్లు రుజువైంది. భారత్‌తో అది వ్యవహరించే తీరు ఎప్పుడూ రెచ్చగొట్టేవిధంగానే ఉంటుంది. వివాదాస్పద అంశాలపై అది చేసే ప్రకటనలు, వ్యాఖ్యలు కయ్యానికి కాలు దువ్వే విధంగా ఉంటాయి. పుండుమీద కారం చల్లే విధంగా ఉంటాయి. తాజాగా ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అరుణాచల్‌ ప్రదేశ్‌ పర్యటనపై బీజింగ్‌ నాయకత్వం చేసిన వ్యాఖ్యలు ఈ కోవలోకే వస్తాయి. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఏ ప్రముఖుడు అక్కడికి వెళ్లినా సిద్ధం చేసుకున్నట్టు ఉండే ఒక ప్రకటన చైనా విదేశ వ్యవహారాల శాఖ నుంచి ఆలస్యం లేకుండా వెలువడేది. పొరుగు దేశం అధీనంలో ఉన్న ఒక ప్రాంతం గురించి తరచు మాట్లాడితే కొద్దికాలానికైనా దాని మీద హక్కు వస్తుందన్న నమ్మకమేదో చైనాకు ఉందని అనిపిస్తుంది.

అరుణాచల్‌ ప్రదేశ్‌ అంటే భారతావనిని ప్రతి వేకువన సూర్యుడు ముద్దాడే తొలి భూభాగం. అక్కడే సూర్యుడు ఉదయిస్తాడు. ఆ సూర్యోదయాన్ని అరచేతిని అడ్డు పెట్టాలని గత కొన్ని దశాబ్దాలుగా చైనా పని చేస్తున్నది. అలాంటి భూభాగం మీదకు ఏ భారతీయ నేత వెళ్లినా అక్కసు వెళ్లగక్కడం చైనాకు రివాజుగా మారింది. గబ్బిలాలకు ప్రసిద్ధి చెందిన చైనా, వాటి భక్షణకు ఖ్యాతి గాంచిన చైనా అరుణాచల్‌ను అచ్చంగా గబ్బిలంలాగే వేలాడుతోంది.

గత నెల రెండో వారంలో ఈశాన్య భారత పర్యటనలో భాగంగా ఉప రాష్ట్రపతి సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ సందర్శించారు. అంతకు ముందు అసోం, మణిపూర్‌, నాగాలాండ్‌, మేఘాలయ తదితర రాష్ట్రాల్లో పర్యటించిన ఆయన అనంతరం చైనా సరిహద్దుల్లో విస్తరించిన అరుణాచల్‌ ప్రదేశ్‌లో అక్టోబరు 9న అడుగు పెట్టారు. ఆ రాష్ట్ర అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజా స్వామ్యంలో ప్రజా ప్రతినిధుల పాత్ర, రాజకీయాల్లో నైతిక విలువలు, చట్టాల రూపకల్పన తదితర అంశాలపై వెంకయ్యనాయుడు కీలక ఉపన్యాసం చేశారు. అనంతరం అసెంబ్లీ గ్రంథాలయాన్ని, మాజీ ముఖ్యమంత్రి దోర్జీ ఖండూ పేరిట నిర్మించిన ఆడిటోరియాన్ని ప్రారంభించారు. పేపర్‌ రీ సైక్లింగ్‌ యూనిట్‌ను, నెహ్రూ స్టేట్‌ మ్యూజియాన్ని ప్రారంభిం చారు. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకు స్థాపన చేశారు. మరికొన్ని పథకాలను ప్రారంభిం చారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పెమా ఖండూ, గవర్నర్‌ బి.డి.మిశ్రా, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నాలుగేళ్ల క్రితం ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వెంకయ్య నాయుడు అరుణాచల్‌ ప్రదేశ్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి. ఎప్పటిలాగానే ఉప రాష్ట్రపతి పర్యటనపై బీజింగ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమది కాని భూభాగంలో భారత నేత పర్యటించడం సరికాదని వ్యాఖ్యానించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ను అసలు భారత్‌లో అంతర్భాగంగానే తాము గుర్తించడం లేదని మొరటుతనాన్ని ప్రదర్శించింది. భారత్‌ తనదిగా ప్రకటించే ఈ సరిహద్దు రాష్ట్రం తమ దేశంలోని దక్షిణ టిబెట్‌లో భాగమని ప్రకటించింది. అందువల్ల భారత నేతలు ఈ ప్రాంతంలో పర్యటించడాన్ని తాము ఎప్పుడూ వ్యతిరేకిస్తుంటామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్‌ పేర్కొన్నారు. ఈ ప్రకటనను భారత్‌ తీవ్రంగా ఖండిరచింది. బీజింగ్‌ వ్యాఖ్యల్లోని డొల్లతనాన్ని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి సూటిగా ప్రశ్నించారు. వాస్తవాలు తెలిసినప్పటికీ బీజింగ్‌ ఉద్దేశ పూర్వకంగానే వక్రభాష్యాలు చెబుతోందని, అంతర్జాతీయ సమాజానికి ఇవి తెలియని విషయా లేమీ కాదని బాగ్చి స్పష్టం చేశారు. తమదైన భూభాగంలో పర్యటించే సంపూర్ణ అధికారం భారత నేతలకు ఉందని, ఈ విషయంలో బీజింగ్‌ వ్యాఖ్యలను తాము ఎంతమాత్రం పరిగణనలోకి తీసుకోబోమని విస్పష్టంగా ప్రకటించారు. ఇకనైనా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలను, రెచ్చగొట్టే ప్రకటనలను, శాంతికి విఘాతం కలిగించే మాటలను మానుకోవాలని ఆయన బీజింగ్‌ కు హితవు పలికారు. ఒక్కసారి ప్రశాంత చిత్తంతో ఆత్మపరిశీలన చేసుకుంటే వాస్తవాలు చైనాకు అవగతమవుతాయని బాగ్చి పేర్కొన్నారు.

భారత్‌లో అంతర్భాగం…

 ఇక్కడ అరుణాచల్‌ ప్రదేశ్‌ కు సంబంధించిన కొన్ని వాస్తవాలను గ్రహించాల్సి ఉంది. తొలుత ఈశాన్య భారతంలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం ఫిబ్రవరి 20, 1987న అరుణాచల్‌ ప్రదేశ్‌ పేరిట కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా తన ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. మౌలిక వసతులను విస్తరించుకుంటూ ముందుకు సాగుతోంది. విస్తీర్ణంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఇది ఒకటి. కీలకమైన చైనా సరిహద్దుల్లో ఉండటంతో ఈ రాష్ట్రంపై అందరి చూపు ఉంటుంది. అక్కడ చీమ చిటుక్కుమన్నా ప్రచార, ప్రసార, సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కుతుంది. చైనాతో కీలకమైన సరిహద్దు వాస్తవాధీన రేఖ (ఎల్‌ ఏ సీ- లైన్‌ ఆఫ్‌ యాక్చువల్‌ కంట్రోల్‌) ఇక్కడే ఉంది. మొత్తం చైనాతో గల 3488 కిలోమీటర్ల సరిహద్దులో 1129 కిలోమీటర్లు ఈ రాష్ట్రంలోనే ఉంది. దేశంలోని మరికొన్ని రాష్ట్రాలతో చైనా సరిహద్దులు కలిగి ఉన్నప్పటికీ అరుణాచల్‌ ప్రదేశ్‌ తో గల సరిహద్దు అత్యంత కీలకమైనది. అందువల్ల చైనా చూపంతా దీనిపైనే ఉంటుంది. 60 దశకంలో చైనాతో యుద్ధం కూడా ఈ ప్రాంతంలో జరిగిందే కావడం గమనార్హం. బ్రిటిష్‌ హయాంలో నాటి అధికారి మెక్‌ మహన్‌ వాస్తవాధీన రేఖను నిర్థరించారు. దానిని చైనా గుర్తించడం లేదు. తాజాగా గత ఏడాది తూర్పు లద్దాఖ్‌లో గల్వాన్‌ లోయ వద్ద ఇరు దేశాల సైనికులు ఇక్కడే ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో 20మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. బీజింగ్‌ కు కూడా భారీ నష్టమే జరిగింది. కానీ ఆ విషయాన్ని బహిరంగ పరచడం లేదు. గతఏడాది ఘటనల నేపత్యంలో అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుల్లో వాస్తవాదీన రేఖ వద్ద మౌలిక వసతుల విస్తరణకు భారత్‌ చర్యలు చేపట్టింది. పొరుగు దేశం ఎలాంటి కవ్వింపు చర్యలు చేపట్టినా, చొరబాట్లకు పాల్పడినా దీటుగా తిప్పి కొట్టేందుకు వేల కోట్ల రూపాయల వ్యయంతో సైనికులకు ఆధునిక వసతులను సమకూరుస్తోంది. ఆయుధాలు, సరకులు, ఆహార పదార్థాల రవాణాకు నూతన రహదారులు, వంతెనలు నిర్మిస్తోంది. సరిహద్దుల పరిరక్షణ, సైనికుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోంది. భారీఎత్తున బలగాలను మోహరిస్తోంది. సైనిక దళాల ప్రధానాధి కారి ఎం.ఎం.నరవణె, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌ ఎప్పకటికప్పుడు పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు. చైనా ఎత్తుగడలను, కుట్రలను, వ్యూహాలను తిప్పికొట్టేందుకు ప్రతి వ్యూహాలను రచిస్తున్నారు. ఈ పరిస్థితులను జీర్ణించుకో లేని బీజింగ్‌ నాయకత్వం అర్థంపర్థం లేని ప్రకటన లతో, అవాంఛనీయ వ్యాఖ్యలతో పరిస్థితిని ఉద్రిక్తం చేసేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా తూర్పు లద్దాఖ్లో గత 17 నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఇప్పటివరకు 13సార్లు ఇరుదేశాల సైనిక కమాండర్లు చర్చలు జరిపినప్పటికీ సానుకూల ఫలితాలు సమకూరలేదు. ప్రతిష్ఠంభన తొలగలేదు. దీనికి కారణం చైనా ప్రతినిధుల మొండి వైఖరేనని ప్రత్యేకంగా చప్పనక్కర్లేదు. గంటల తరబడి చర్చలు సాగినా తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లన్న చైనా వైఖరి కారణంగా యథా పరిస్థితి కొనసాగు తోంది. ఇక సరిహద్దు సమస్యలపై ఇప్పటివరకు 21సార్లు చర్చలు జరిగినా మార్పేమీ లేదు.

గతంలోనూ ఇదే తీరు …

అరుణాచల్‌ ప్రదేశ్లో భారత నేతల పర్యటనలపై బీజింగ్‌ ప్రతికూలంగా స్పందించడం కొత్తేమీ కాదు.గతంలో అనేకమార్లు ఇలానే వ్యాఖ్యానించి నవ్వులపాలైంది. అంతర్జాతీయంగా అప్రతిష్టను మూటగట్టుకుంది. గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వచ్చినప్పుడు బీజింగ్‌ నాయకత్వం ఇలానే ప్రతిస్పందించింది. 2017లో, 2015 ఫిబ్రవరి 24న ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్‌ పర్యటన సందర్భంగానూ చైనా నాయకత్వం అవాకులు చెవాకులు పేలింది. 2013 నవంబరు 23న నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పర్యటన సమయంలోనూ చైనా ఇదే తీరును ప్రదర్శించింది. 2009లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పర్యటన సందర్భంగానూ, తరవాత నాటి విదేశాంగ మంత్రి ఎస్‌.ఎం కృష్ణ పర్యటించినప్పుడూ చైనా ఎప్పటిలాగానే అభ్యంతరం వ్యక్తం చేసింది. 2016 డిసెంబరులో బౌద్ధ గురువు దలైలమా సందర్శనపైనా బీజింగ్‌ ప్రతికూల వ్యాఖ్యలు చేసింది. నాటి విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి విష్ణు ప్రకాశ్‌ బీజింగ్‌ వ్యాఖ్యలను, అభ్యంతరాలను గట్టిగా తిప్పికొట్టారు. ఆసియాలోనే కాకుండా ప్రపంచంలోనే అంతర్జాతీయ శక్తిగా భారత్‌ ఎదుగుతున్న తీరుపై చైనా అసహనంగా ఉంది. మహమ్మారి కొవిడ్‌ను అత్యంత వేగంగా అధిగమించిన తీరు, అంతర్జా తీయంగా అనేక దేశాలకు టీకాల సరఫరాతో భారత ప్రతిష్ట పెరిగింది. అదే సమయంలో చైనా ఇంకా కొవిడ్‌తో సతమతమవుతోంది. ఇప్పటికీ లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తోంది. దీనికితోడు ఆహార కొరత ఎదుర్కొంటుందన్న వార్తలు దేశాన్ని కలవర పెడుతున్నాయి. ఎక్కువగా తినవద్దని, ఆహారాన్ని నిల్వ చేసుకోమని స్వయంగా పాలకులు ప్రజలకు సూచించడం ముంచుకొస్తున్న ప్రమాదానికి సంకేతంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోపక్క విద్యుత్‌ సంక్షోభం, తైవాన్‌తో ఉద్రిక్తతలు దేశాన్ని కలవర పెడుతున్నాయి. తైవాన్‌ జోలికొస్తే తాము మౌనంగా ఉండజాలమన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటన బీజింగ్‌ను ఆలోచనలో పడేస్తోంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకు భారత ఉప రాష్ట్రపతి అరుణాచల్‌ ప్రదేశ్‌ పర్యటనపై అనవసరం రాద్ధాంతం చేస్తోందన్న దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. స్వదేశంలో సమస్యలు ఎదురైనప్పుడల్లా ప్రజల చూపును పక్కకు మళ్లించడం ప్రపంచవ్యాప్తంగా చాలామంది పాలకులకు వెన్నతో పెట్టిన విద్య. ఈ విషయంలో చైనా అందరికన్నా నాలుగాకులు ఎక్కువే చదివింది. పదవి చేపట్టిన కొద్ది రోజులకే చైనా అధినేత షి జిన్‌ పింగ్‌ ఈ విద్యను అలవరచుకున్నారు. భారత్‌ను బూచిగా చూపి పబ్బం గడుపుకోవడం దాయాది దేశం పాకిస్తాన్‌, చైనాలకు కొత్తేమీ కాదు. చైనా తాజా వ్యాఖ్యలను ఈ కోణంలోనే చూడాలి. భారత్‌కు చెందిన ప్రముఖుడు ఎవరో ఒకరు అక్కడకు వెళతారు. చైనా అవాకులూ చెవాకులూ మాట్లాడుతుంది. దానికి దట్టమైన తాత్వికత కూడా అద్దుతుంది. కానీ అవేమీ ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా నమ్మడానికి సిద్ధంగా లేవు. చైనా భూగోళం మీద ఉన్న అతి పెద్ద దురాక్రమణదారు దేశం. దాని విదేశాంగ విధానం, వాణిజ్య ఒప్పందాలు, చిన్నా చితకా దేశాలకు సాయం ఇవన్నీ దురాక్రమణ లక్షణం కలిగి ఉంటాయి. ప్రపంచ మార్కెట్‌ను ఆక్రమించాలను కుంటున్న చైనా వ్యూహాలు ఇప్పుడు ప్రపంచం మొత్తం అర్ధం చేసుకుంది. చైనాలోనే ఒక సామెత ఉంది. ‘అనుభవం దువ్వెన వంటిది. కానీ ప్రకృతి దానిని మన చేతికి ఇచ్చేది మాత్రం బట్టతల వచ్చాకే’. ప్రపంచం ఇలాంటి దువ్వెనను ఇచ్చే వరకు చైనా తన ధోరణిని మార్చుకునేలా లేదు.

– దోర్బల పూర్ణిమాస్వాతి

About Author

By editor

Twitter
YOUTUBE