– ఎం.వి.ఆర్. శాస్త్రి
అనుకున్నాక ఆలస్యమెందుకు? పాదయాత్రకు వెంటనే అందరూ రెడీ కావాలి అని నిర్ణయమైంది. ముందుగా వెళ్ళే బృందాన్ని నడిపించే బాధ్యత మేజర్ జనరల్ జమాన్ కియానీకి అప్పగించారు. అతడు మమ్మల్ని లైనులో నిలబెట్టి – అందరూ ఒకే పద్ధతిలో మార్చింగ్ ఎలా చెయ్యాలి, విమాన దాడి అలారం ఎలా మోగుతుంది, అది వినపడగానే రోడ్డు పక్కలకు వెళ్లి ఎలా కవర్ చేసుకోవాలి? అన్నవి నేర్పాడు. నేతాజీ, జనరల్ ఐసోడా, జపాన్ రాయబారి హచయ (అప్పటికి వాళ్ళు కూడా మమ్మల్ని చేరుకున్నారు) ముందు నడవగా వారి వెనుక 40 మంది రాణులు, వందమంది సైనికులు, నా లాంటి సివిలియన్లు! అందరం ఆ రాత్రే మార్చ్ మొదలెట్టాం. అరగంటకో సారి అలారం మోగేది. అది విన్న వెంటనే అందరం డిస్పర్స్ అయి బాటల పక్క నక్కేవాళ్ళం. మళ్ళీ గంట మోగగానే ఎప్పటిలా లైన్లలో ఫాం అయి మార్చ్ కొనసాగించే వాళ్ళం. ప్రతి గంటకూ 5 నిమిషాలు మాత్రం హాల్ట్ చేస్తూ నాన్ స్టాప్‌గా నడిచాం. కాసిని మైళ్ళు నడిచేసరికే నా కాళ్ళు తెగ నెప్పి పుట్టాయి. వీపుమీద వేసుకున్న చిన్న పాటి లగేజీ కూడా మహా భారం అయింది. నిద్రముంచుకొస్తున్నది. ఇంకేమీ వద్దు. ఎక్కడైనా నడుం వాలిస్తే చాలు అనిపించింది. నేతాజీ మాత్రం టాప్ బూట్లతో అందరికంటే ముందుండి ఏ మాత్రం తొణకకుండా స్టెడీగా ఒకే ఊపులో గంటకు మూడు నాలుగు మైళ్ళ చొప్పున నడుస్తూనే ఉన్నాడు. చాలా దూరం మార్చింగుకు ఇబ్బందిగా ఉండే టాప్ బూట్లతో ఆయన మిలిటరీ జనరల్స్‌తో సమానంగా ఎలా నడవగలుగుతున్నాడా? అని మాకు ఆశ్చర్యం వేసింది.
నాలాంటి వాళ్ళం నిద్రకళ్ళతో కాళ్ళీడ్చుకుంటూ ఎలాగో నడవగా ఎట్టకేలకు వేకువ జాము అయింది. కియానీ ‘హాల్ట్’ అని ఆర్డర్ వేశాడు. అందరం డిస్పర్స్ అయ్యాం. ఆరోజు షెల్టర్‌కు చుట్టుపట్ల సరైన చోటు వెతకటానికి కియానీ, ఇంకో ఆఫీసరు వెళ్ళారు. మేము దుమ్ములో కూలబడ్డాం. మా కాళ్ళు పచ్చి పుండ్లయ్యాయి. బడలిక వల్ల ఎక్కడివాళ్ళం అక్కడే కునుకు తీశాం. సూర్యోదయం కావస్తూండగా కియానీ తిరిగొచ్చి అక్కడికి దగ్గరలోనే ఉన్న అడవిదారి గుండా తాను ఎంపిక చేసిన చోటుకు మమ్మల్ని మార్చ్ చేయించాడు. అక్కడ చుట్టూ ఎత్తైన చెట్లు ఉండటం వల్ల విమాన దాడుల భయం ఉండదు. మేము చేరిన కాసేపటికి జనరల్ భోంస్లే మిగిలిన రాణులను వెంటబెట్టుకుని వెనకనుంచి వచ్చి మమ్మల్ని కలిశాడు. మా పార్టీ సంఖ్య 250 దాటింది.
ముందుగా అందరికీ టీ ఇవ్వాలి. తరవాత కనీసం ఒక పూటయినా భోజనం ఏర్పాటు చేయాలి. దేనికైనా ముఖ్యంగా నీళ్ళు కావాలి. అక్కడ ఉన్నది కేవలం ఒక ఉప్పునీటి మడుగు. అందులోని నీరు మనుషులు తాగేందుకు పనికిరాదు. నేతాజీ ఆ మడుగును పరీక్షించి మా పార్టీలోని డాక్టర్లతో మాట్లాడాడు. ఒడ్డున ఉన్న ఇసుకతో ఆ నీటిని వడబోసి బాగా మరగపెడితే వంటకు, తాగేందుకు పనికొస్తుందని నిర్ణయమైంది. తరవాత సమస్య ఆహారానికి పదార్థాలు. మా దగ్గర బియ్యం లేవు. ఒక్క కూరగాయ లేదు. అప్పుడు ఒక సబ్ ఆఫీసర్ నడుచుకుంటూ వెళ్లి ఏదో ఊళ్ళో దొరికిన పదార్థాలు పట్టుకొచ్చాడు. రాళ్ళతో పొయ్యి అమర్చి రాణులు వంట మొదలెట్టారు. కానీ దూరాన విమానాల మోత వినపడగానే మా జాడను పొగ ఎక్కడ పట్టిస్తుందోనన్న భయంతో మాటిమాటికీ పొయ్యి ఆర్పివేయవలసి వచ్చేది. అలా అనేక అంతరాయాలతో అన్నం, పప్పు వండి అందరం భోంచేసేసరికి మధ్యాహ్నం 3 అయింది. ఆ రోజుకు మొదటి, చివరి భోజనం అదే.
ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వానికి అధినేత, ప్రధానమంత్రి అయిన నేతాజీ సుభాస్ చంద్రబోస్ ఒక చెట్టు కింద దుమ్ము, ఎండిన ఆకులతో నిండిన నేల మీద దుప్పటి పరచుకుని కూచున్నాడు. ఆయన గడ్డం మాసింది. ఆకలి, ఎడతెగని నడక బడలిక ఎంత బాధిస్తున్నా ఆయన ఎంతసేపూ తన పక్కన ఉన్నవాళ్ల సౌకర్యాల గురించే ఆలోచించే వాడు. ఎవరు ఎన్ని తెలివితక్కువ పనులు చేసినా ఓరిమి కోల్పోకుండా కూల్‌గా ఉండి అందరికీ పెద్దదిక్కుగా ఉండేవాడు. అలాగే ఝాన్సీరాణి రెజిమెంటు బాలికలు అన్ని ఇబ్బందులను ఓర్చుకుని, వంటావార్పుల్లో సహాయపడుతూ చలాకీగా తిరిగేవారు. ఆ సాయంత్రం టీ లాంటిది పెట్టుకుని సూర్యాస్తమయం తరవాత మళ్ళీ బయలుదేరాం.
రాత్రివేళ. తెలియని తోవ. దట్టమైన మబ్బులు. చిమ్మచీకటి. రెండు అడుగులకు మించి ఎదుట ఏమున్నదో కనిపించటం లేదు. చెదిరిన కాలమ్‌ని మళ్ళీ ఫాం చేసుకోవాలంటే ఎవరు ఎక్కడున్నారు అని అరిచి తెలుసుకోవాలి. ముందు నేతాజీ. వెనుక ప్రభుత్వ మంత్రులు. వారి వెనుక రాణులు. ఆ వెనుక సివిలియన్లు. చివరన సైనికులు. అదీ వరస. అందరినీ లీడ్ చేస్తూ నేతాజీ టాప్ బూట్లతో చకచక నడుస్తూనే ఉన్నాడు. కానీ నిన్నటితో పోలిస్తే నడకలో కొంచెం తేడా ఉంది. కొంచెం కుంటుతున్నట్టు అనిపిస్తున్నది. కాళ్ళు బొబ్బలెక్కాయేమో! అడిగినా ఆయన చెప్పడు. రాత్రంతా నడిచి తెల్లవారకుండా క్యాయిక్టావ్ అనే ఊరు దగ్గర ఆగాం. ఊరిబయట మామిడి తోటలో విడిది చేశాం.
నేతాజీ ఒక చెట్టుకింద కూచుని బూట్లు, మేజోళ్ళు విప్పాడు. రెండు కాళ్ల మీద చాలా బొబ్బలున్నాయి. వ్యక్తిగత వైద్యుడు మేజర్ మీనన్ గాయాలకు మందు రాశాడు. చెట్టుకింద దుప్పటి పరచుకొని నేతాజీ కళ్లుమూసుకుని పడుకున్నాడు. వంటలయ్యేసరికి మధ్యాహ్నమయింది. ఆకలిమీద ఉన్న అందరం తెగతిన్నాం. మా అదృష్టం కొద్దీ మధ్యాహ్నం నాలుగు లారీలు మా కోసం వచ్చాయి. వాటిని ఎలా ఉపయోగించాలి అన్నది నేతాజీ స్వయంగా ప్లాన్ చేశాడు.
సాయం సంజె వేళ మేము బయలుదేరాం. ముందు నిలిచిన లారీలో నేను, కొందరు రాణులు, ముగ్గురు ఆఫీసర్లు ఎక్కాము. దురదృష్టం కొద్దీ ఎవరు ఏ లారీలో ఎక్కాలి, అవి ఎప్పుడు కదలాలి, ఎక్కడ ఆగాలి? అన్నది మాకు తెలియదు. అందరం ఎక్కటం అయ్యాక ఎవరో ‘పోనివ్వు’ అన్నారు. డ్రైవర్ పోనిచ్చాడు. మమ్మల్ని చూసి మా వెనుక ఉన్న ఒకటి రెండు లారీలు కూడా కదిలాయి. ఊరు దాటాక ఫలానా చోట ఆగి అన్ని లారీలూ ఒక గ్రూపుగా వెళ్ళాలని నేతాజీ ఆదేశం. ఆ సంగతి మాకు తెలియదు. ఝామ్మంటూ మా లారీలు దౌడు తీశాయి. రంగూన్ నుంచి బయలుదేరాక మొదటిసారి నేతాజీకి చాలా కోపం వచ్చింది. ‘బుద్ధిలేనివాళ్ళంతా ఇక్కడ పోగయ్యారు’ అని చిరాకు పడ్డాడట. కోపం రాదా మరి? మార్చ్ సాగినంత కాలమూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించాలని నేతాజీ మొదటినుంచీ నొక్కి చెబుతున్నాడు. ఇతరులకు ఆదర్శం కావటం కోసం స్వయంగా తాను క్రమశిక్షణకు కట్టుబడ్డాడు. తాను ఆజాద్ హింద్ ఫౌజ్‌కు సాక్షాత్తూ సుప్రీమ్ కమాండర్, ఆజాద్ హింద్ ప్రభుత్వానికి సర్వాధికారి అయి ఉండీ తన సైన్యంలో ఒక డివిజన్ కమాండర్ అయిన మేజర్ జనరల్ కియానీ ఇచ్చిన ఆర్డర్లకు కట్టుబడ్డాడు. అతడు ‘మార్చ్’ అంటే మార్చ్ చేశాడు. ‘హాల్ట్’ అనగానే ఆగాడు. అదే క్రమశిక్షణను అందరూ పాటించవద్దా?
నేతాజీ ఆదేశంపై ఒక ఆఫీసరు ఫోర్డ్ కారులో వెంటపడి ముందుగా ఉడాయించిన లారీలను ఓవర్ టేక్ చేసి వెనక్కి మళ్ళించాడు. కడకు అన్ని వాహనాలూ కలిసి బిలిన్ నది వైపు క్రమప్రకారం సాగాయి. మహా ఉద్ధృతంగా ప్రవహించే ఆ నదిని దాటటం పెద్ద రిస్కు. అవతలి ఒడ్డు చేర్చటానికి ఒక నాటు ఫెర్రీ ఉన్నది. అది ఆగే చోటునుంచి ఆరడుగుల దూరంలోని ఒడ్డుకు ప్లాంకుల మీదుగా వెళ్ళాలి. అవి జర్రున జారుతున్నాయి. ప్లాంకుకు అటుగాని, ఇటుగాని అంగుళం స్లిప్ అయినా లారీతో సహా అందరం నదిలో పడతాం. మా అదృష్టం కొద్దీ అన్ని లారీలూ క్షేమంగా అవతలి ఒడ్డు చేరాయి.
ఇక అక్కడినుంచీ మేము ప్రయాణించే ప్రాంతంలో జపానీయులపై తిరుగుబాటు చేసిన బర్మీస్ డిఫెన్స్ ఆర్మీది ప్రాబల్యం. వారు దూరాన పొంచి ఉండి అటు మీదుగా వెళ్ళే జపాన్ సైనికులమీద, వారి వాహనాల మీద కాల్పులు జరుపుతుంటారు. కొంత దూరం వెళ్ళాక కుండపోతగా జడివాన కురిసింది. దారిపక్క కనిపించిన ఒక పాడుబడ్డ ఇంటిదగ్గర లారీలు ఆపి తలదాచుకోవటానికి లోపలికెళ్ళాం. కానీ ఆ కొంపకు పై కప్పు లేకపోవటంతో పూర్తిగా తడిశాము. వాన ఆగాక బయలుదేరిన కాసేపటికే రాణులు ఎక్కిన ఒక లారీ ట్రబులిచ్చి మొరాయించింది. ఇంకో లారీతో దాన్ని నెట్టుకుంటూ మెల్లిగా కదిలాము. ఎటునుంచి మా మీద కాల్పులు జరుగుతాయోనని భయపడుతూ ముందుకు సాగి తెల్లవారకుండా ఒక శిథిల గృహం దగ్గర ఆగాము. సాయంత్రం దాకా అదే మా ఆవాసం. కాసేపయ్యాక నేతాజీ ఉన్న లారీ మమ్మల్ని చేరుకుంది. ఆకలితో, బొబ్బలెక్కిన కాళ్ళతో రోజుల తరబడి తెగ నడిచినందువల్ల కాబోలు నేతాజీ నీరసంగా కనిపించాడు. ఆ పాడుబడ్డ ఇంటి మిద్దెపైకి మెట్లు నెమ్మదిగా ఎక్కుతున్న తీరు చూస్తే ఆయన ఒళ్ళంతా పులిసిపోయి విశ్రాంతి కోరుతున్నట్టు నాకు అనిపించింది.
మా బసకు కాస్త అనుకూలంగా ఉన్నది మిద్దెమీద చీకటి గది ఒక్కటే. చెక్క ఫ్లోరు నిండా దుమ్ము. పైగా అక్కడక్కడ చిల్లులు. కప్పులోనూ కంత లున్నాయి. వాటి గుండా ప్రసరించే సూర్య కిరణాలు తప్ప గదిలో వెలుతురు లేదు. సీలింగు నుంచి సాలెగూళ్ళు వేలాడుతున్నాయి. మేము చిరిగిన దుప్పటితో నేలమీద దుమ్ము దులిపి నేతాజీ కోసం ఒక మూల దుప్పటి పరిచాము. దాని మీద పడుకున్న వెంటనే ఆయనకు నిద్రపట్టింది.
మళ్ళీ అరగంటకల్లా నేతాజీ మేలుకున్నాడు. టీ అనబడ్డ కషాయం లాంటిది కాస్త తాగాడు. పెన్సిలు, పేపరు పుచ్చుకుని మా అందరినీ కేకేశాడు. మా తరవాత మజిలీ బర్మాలో మూడో పెద్ద నగరమైన మౌల్ మేన్ (Moulmein). అది థాన్ ల్విన్ నది అవతలి ఒడ్డున ఉంటుంది. అందరం ఒకేసారి నది దాటటం మంచిది కాదు. చిన్న చిన్న జట్లుగా మధ్యాహ్నమే బయలుదేరి ఫెర్రీ స్టేషన్ దగ్గరికి చేరుకొని అవతలికి వెళ్ళాలి. ఎవరు ఏ గ్రూపులో ఉండాలనేది నేతాజీ చెప్పాడు.
నాది రెండో గ్రూపు. కొంతమంది రాణులు కూడా అందులో ఉన్నారు. అందరం మధ్యాహ్నం బయలుదేరి పడవల రేవు దగ్గరికి వెళ్లాం. నది ప్రవాహం భయం వేసేంత ఉద్ధృతంగా ఉంది. మూడు గంటలు వేచి ఉన్నాక పడవ వచ్చింది. మొత్తానికి అందరం క్షేమంగా ఆవలి ఒడ్డు చేరాం. మాకంటే ముందు మౌల్ మేన్ వెళ్ళిన చటర్జీ, కియానీ అక్కడ ఒక పెద్ద భవనంలో మా బసకు, భోజనానికి ఏర్పాట్లు చేశారు. ఆ భవనం మీదా ఫైటర్ విమానాలు ఒకసారి దాడి చేశాయి. మేమందరం ప్రాణభయంతో పరుగులు పెట్టాం. చివరి బ్యాచిలో నేతాజీ కూడా వచ్చాక జపాన్ అధికారులతో మాట్లాడి బాంగ్‌కాక్ వెళ్ళటానికి మాకు రైళ్ళు ఏర్పాటు చేశాడు. జట్లుజట్లుగా అందరం బాంగ్‌కాక్ చేరుకున్నాం. మళ్ళీ నాగరిక సమాజంలోకి అడుగుపెట్టాం.
[Unto Him A Witness, S.A. Ayer, 25-40]
నది దాటి మౌల్ మేన్ చేరటానికి ముందు పెగూకు ఉత్తరాన ఒక గ్రామంలో బస చేయటం సాహసయాత్రలోని అత్యంత ప్రమాదభరిత ఘట్టాల్లో ఒకటి. జపాన్ సేనలు అప్పటికి పూర్తిగా నిష్క్రమించాయి. ఆ ప్రాంతమంతటా బర్మీస్ గెరిల్లాలదే ఆధిపత్యం. వాళ్ళ కంటపడ్డ ప్రతి వాహనం మీదా ముందు కాల్పులు జరిపి తరవాత మాట్లాడేవారు. ఆ రోడ్డు వెంట రాత్రంతా ప్రయాణం చేసి క్షేమంగా బయటపడటం ఎంతో అదృష్టవంతులకు గానీ సాధ్యపడదు. నేతాజీ వెళ్ళిన మరునాడే బ్రిటిష్ బలగాలు పెగూను ఆక్రమించాయి. బయలుదేరటం ఒకరోజు ఆలస్యమై ఉంటే నేతాజీ అక్కడే శత్రువులకు చిక్కేవాడు. తెల్లదొరతనం బహుశా అక్కడికక్కడే ఆయనను మట్టుపెట్టేదేమో.
రంగూన్ నుంచి బాంగ్‌కాక్ వరకు చేసిన సాహస యాత్రలో నేతాజీ మృత్యువును వెంట్రుకవాసిలో తప్పించుకున్న ఘటనలు ఇంకా అనేకం ఉన్నాయి. ఆ ప్రయాణం అంతటా ఆయన పక్కనే ఉన్న ఝాన్సీరాణి రెజిమెంట్ కమాండర్ లెఫ్టినెంట్ లక్ష్మీ దేవర్ డైరీలోని ఈ వివరాలను మచ్చుకు చిత్తగించండి:
ఏప్రిల్ 25: మా పైనుంచి శత్రు విమానాలు ధారాళంగా తిరుగుతున్నాయి. నేను నేతాజీ పక్కనే నడుస్తున్నాను. కల్నల్ మాలిక్ ఉన్న ప్రాంతానికి చేరాక నేతాజీ కూచుని కాసేపు రెస్టు తీసుకుని షేవింగ్ మొదలెట్టాడు. హఠాత్తుగా మూడు ఫైటర్ ప్లేన్లు అటు వచ్చి చక్కర్లు కొట్టసాగాయి. మేమందరం పరుగెత్తి కవర్ తీసుకున్నాము. నేతాజీ మాత్రం ఉన్నచోటే నిబ్బరంగా షేవింగ్ కొనసాగించాడు. అదృష్టం కొద్దీ ఆయన శత్రువుల కంట్లో పడలేదు. తరవాత నేతాజీ మా అమ్మాయిలు ఆగిన చోటు విజిట్ చేయదలచాడు. మేము వరిపొలాల మధ్య నుంచి నడుస్తున్నాం. అప్పుడే ఆరు విమానాలు అటుకేసి వచ్చాయి. దాక్కుందా మంటే చుట్టుపట్ల ఎక్కడా ఒక చెట్టుకూడా లేదు. ఏమి చేయాలో తోచలేదు. నాయకుడి భద్రత గురించి నేను చాలా కంగారు పడ్డాను. నేతాజీ మాత్రం అక్కడే కూచుని నిశ్చింతగా సిగరెట్ ముట్టించాడు. అదేమీ చిత్రమో అక్కడక్కడే తిరిగిన శత్రు విమానాలు ఏ ఒక్కటీ ఆయనను కనిపెట్టలేదు. వెళ్ళాల్సిన చోటికి వెళ్ళాక నేతాజీ కాసేపు విశ్రమించి లేచి ఒక స్టాఫ్ ఆఫీసరును కేకేశాడు. ‘వెంటనే ఒక మోటారు సైక్లిస్టును మన దగ్గరికి వస్తున్న జనబాజ్ దళం దగ్గరికి పంపించు; రోడ్డును వదిలేసి రైల్వే లైను పక్క నుంచి రమ్మని చెప్పు; శత్రువుల ట్యాంకులు వారున్న వైపు రావచ్చు’ అని ఆదేశించాడు. ఆ కబురు అంది తాము రోడ్డు వదిలిపెట్టిన కొద్ది నిమిషాలకే బ్రిటిష్ ట్యాంకులు అటుమీదుగా వెళ్ళాయి; ఏ మాత్రం ఆలస్యమయినా మా ప్రాణాలు పోయేవి- అని కల్నల్ రాతూరి తరవాత నేతాజీకి చెబుతుంటే విన్నాను. ప్రమాదాన్ని అంత కచ్చితంగా ఆయన ఎలా పసిగట్టగలిగాడా? -అని నాకు ఆశ్చర్యం.
ఏప్రిల్ 26: ఆ రోజు అమ్మాయిలను ఒక గ్రామంలో బస చేయమన్నారు. అది నది పక్క ఊరు. గ్రామస్థులు ఊరు ఖాళీ చేసి పోయారు. దాడి సమయంలో దాక్కోవటానికి ఏవో కొన్ని చెట్లు మాత్రమే ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నట్టుండి ఆరు ఫైటర్ ప్లేన్లు అటు వచ్చాయి. మేము చెట్ల చాటుకు పరుగెత్తాం. జనరల్ చటర్జీ నేతాజీని అక్కడ ఉన్న ఒకే ఒక ట్రెంచ్‌లోకి వెళ్ళమన్నాడు. నేతాజీకి చాలా కోపం వచ్చింది. ‘అమ్మాయిలు షెల్టర్ లేక చెట్ల మాటున నిలబడితే నేనొక్కడినీ ట్రెంచ్‌లోకి వెళ్ళటమేమిటి?’ అని కసిరి, నింపాదిగా సిగరెట్ కాలుస్తూ కూచుండిపోయాడు. అంత కూల్‌గా ఆయన ఎలా ఉండగలడో! శత్రువిమానాలు మెషిన్ గన్లతో భీకరంగా గుండ్ల వర్షం కురిపించాయి. మావి ఐదు లారీలు దగ్ధమయ్యాయి. మా తలల పైనుంచే గుండ్లు దూసుకుపోయాయి. నేతాజీ మాత్రం చిన్న గాటు కూడా పడకుండా బయటపడ్డాడు.
ఏప్రిల్ 27 : మా కాన్వాయ్ అర్ధరాత్రే బయలు దేరింది. వానలూ, బురదతో వాహన ప్రయాణం కష్టమయింది. కాన్వాయ్‌ని కల్నల్ చోప్రాకు అప్పగించి సిట్టాంగ్ నది చేరటానికి చివరి 10 మైళ్లు నేతాజీ అమ్మాయిలతో కలిసి నడిచాడు. శత్రువు మా వెనక తరుముకొస్తున్నట్టు సమాచారం వచ్చింది. తెల్లవారే లోపే మేము ఫెర్రీలో నది దాటాము. కాన్వాయ్ కూడా మమ్మల్ని చేరుకుంది. పగలు నేతాజీ విడిది చేసిన చోట బాంబులతో, మెషిన్ గన్లతో శత్రు విమానాలు దాడి చేశాయి. నేతాజీ పక్క ట్రెంచ్‌లో ఉన్న లెఫ్టినెంట్ నజీర్ అహ్మద్ మరణించాడు. నేతాజీ క్షేమం.
[Quoted in My Memories Of INA And Its Netaji, Shahnawaj Khan, pp. 204-207]
బర్మా నుంచి చరిత్రాత్మక సాహసయాత్ర చేసి బోస్ బృందం బాంగ్‌కాక్ చేరుకునే లోగా యూరప్‌లో యుద్ధం ముగిసింది. ముస్సోలినీని అతడి దేశ వాసులే వెంటపడి చంపారు. హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. జపాన్ లొంగుబాటుకు సిద్ధమవుతున్నది. రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాల కూటమి దిగ్విజయం సాధించింది. అయినా గెలిచిన సంబరం బ్రిటిష్ మారాజులకు లేదు. ఎందుకంటే వారి సామ్రాజ్యానికి ప్రధాన శత్రువైన సుభాస్ చంద్రబోస్ ఇంకా కత్తి దించలేదు. ఎన్ని విపత్తులు చుట్టుముట్టినా అధైర్యపడలేదు. వారి దుంప తెంచే ఉద్యమం ఎంతమాత్రం ఆపలేదు. అతడు ఏ ఎత్తుమీద ఉన్నాడో, ఏమి చేయబోతున్నాడో కూపీ లాగటానికి తెల్ల దొరతనం చెయ్యని ప్రయత్నం లేదు. అందులో ఒక కుతంత్రం ఈ మధ్యే ఫలించింది. బోస్ పక్కనే ఉండి అన్నీ కనిపెట్టి అతడి ఆనుపానుల ఉప్పు బ్రిటిషు సర్కారుకు అందించటానికి అతడి శిబిరంలోనే ఒకడు దొరికాడు.
ఆ సీక్రెట్ ఏజెంట్ నుంచి లండన్‌కు చేరిన రహస్య నివేదిక ఇది:
‘‘సుభాస్ చంద్రబోస్ తన బృందంతో 1945 ఏప్రిల్ 24న రంగూన్ వదిలి మే 14న బాంగ్‌కాక్ చేరాడు. రంగూన్‌లో బయలుదేరేటప్పుడు ఈ బృందం 9’’×9’’×4’’ పరిమాణం గల నాలుగు పెట్టెల్లో బంగారం, బంగారు ఆభరణాలు, వజ్రాలు పట్టుకుపోయింది. ఇవి కాక మౌల్ మేన్‌లో ఆగినప్పుడు సుభాస్ చంద్రబోస్ 7 లక్షల రూపాయలు విలువచేసే బంగారం కొన్నాడు. ఆ మొత్తాన్ని యోకొహామ స్పెసీ బ్యాంకు వారి మౌల్ మేన్ బ్రాంచి నుంచి డ్రా చేశాడు. బాంగ్‌కాక్‌లో ఉండగా మే 18 నుంచి జూన్ 14 వరకు PGI ( Provisional Government of India) కేబినెట్ మంత్రులు పలుమార్లు సమావేశమై భవిష్య కార్యాచరణ గురించి చర్చించారు. అంతలో బోస్ ‘వేవెల్ ప్రతిపాదన’ (ఇండియాలో రాజ్యాంగ పరిష్కారానికి వైస్రాయ్ లార్డ్ వేవెల్ ప్రకటించిన ప్రపోజలు)కు వ్యతిరేకంగా రేడియో ద్వారా ప్రచారం చేయటానికి సింగపూర్ వెళ్ళటంతో నిర్ణయమేదీ జరగలేదు.
తాత్కాలిక ప్రభుత్వంలో ఒక ముఖ్య భాగాన్ని చైనాలోని యున్నాన్ రాష్ట్రానికి తరలించాలని ఈ సమావేశాల సందర్భంలో మేజర్ జనరల్ చటర్జీ సూచించాడు. ఆ ప్రాంతంలో పలుకుబడి ఉన్న చైనీస్ కమ్యూనిస్టుల ద్వారా సైబీరియాలో సోవియట్ రష్యా అధికారులను కాంటాక్ట్ చేయవచ్చని అతడి ఆలోచన. అదే సమయంలో బాంగ్‌కాక్, సింగపూర్ ప్రధాన కేంద్రాలుగా పోరాటం కొనసాగించటానికి కొంతమంది కేబినేట్ మంత్రులనూ, ఐఎన్‌ఎ అధికారులను పెట్టి వెళ్లాలనీ అనుకున్నారు. ఈ సమావేశాల్లో పాల్గొన్న వారి పేర్లు:
‘‘…. ….. …. …. …. ’’ (మొత్తం 13 పేర్లు)
‘‘బాంగ్‌కాక్ చేరుకున్న రాణీఝాన్సి అమ్మాయిలు 120 మందిని రెండో సారి మంత్రివర్గ సమావేశం తరవాత (తేదీ జ్ఞాపకం లేదు) కియానీ సింగపూర్ తీసుకువెళ్ళాడు. దాదాపుగా ఇదే సమయంలో చటర్జీ, అయ్యర్, ఎ.ఎం. సహాయ్ సైగాన్ వెళ్ళారు. చటర్జీ వెళ్ళింది తాత్కాలిక ప్రభుత్వానికి తగిన కార్యస్థానం చూడటానికి. అయ్యర్ పని రేడియో బ్రాడ్ కాస్టింగు. సహాయ్ వెళ్లింది హనోయ్‌లో ప్రత్యేక పనిమీద.’’
[Quoted in Lost Hero, Mihir Bose, pp. 430-431]
మిగతా వచ్చేవారం