జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో మొదటి బహుమతి పొందిన రచన

– గంటి భానుమతి


లోపలికి వెళ్లేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంది. ఎప్పటి లాగా యాంటిసెప్టిక్‌ ‌లోషన్‌ ‌రాసుకుని పాప దగ్గరికి వెళ్లింది.

పలచటి తెరలోంచి పాపని అలా చూస్తుండి పోయింది. ఎంత ముద్దుగా ఉందో, అచ్చు బొమ్మలా ఉంది. పరీక్షలప్పుడు మాత్రమే దేవుడిని ప్రార్థించే సుధీర ఇప్పుడు ఈ పాప జీవన్మరణ పరీక్షలో పాపని పాస్‌ ‌చేయించు.. బతికించు అని దేవుడిని ప్రార్థించింది. ఇప్పుడు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత దేవుడిది.

అలా చూస్తూ మెల్లిగా తన చేతి వేలుని ఆమె అరచేతిలో ఉంచింది. వెంటనే స్పందించలేదు. సుధీర ఆ వేలుని అలాగే ఉంచి అరచేతిని కదిలించింది. ఆ వేళ్లల్లో కదలిక. మెల్లిగా పట్టుకుంది. దూదిలాంటి మెత్తదనం. గులాబీ రేకుల నాజూకుతనం. మధ్య వేలుతో బుగ్గని పుణికింది. మెల్లిగా కళ్లు తెరిచింది. స్పందించడమో, ప్రతి స్పందించడమో తప్ప ఆ పాపకేం తెలుస్తుంది. ఎందుకో ఆ కళ్లల్లో బాధ కనిపించింది. ఏం బాధ అనుభవిస్తోందో, చెప్పు కోవడానికి రాదు. ఆ చూపుని అనువదిస్తే ఎన్నో ప్రశ్నలు.

అంతలో డాక్టర్‌ ‌వచ్చారు.

‘‘అపరాజిత మదర్‌ ఎక్కడ? ఆమె వస్తే బావుంటుంది. ఆమెతో కాస్త మాట్లాడాలి’’

‘‘ఆమె ఇక్కడే ఉన్నారు. నేను ఇప్పుడే పిలుస్తాను’’

అంటూ సుధీర గబగబా ఆ వార్డు బయటికి వచ్చి, పేరెంట్స్ ‌హాల్‌లోకి వెళ్లి వినీలని లేపింది.

‘‘డాక్టరు గారు నిన్ను రమ్మంటున్నారు’’ అంది.

ఒక్కసారి భయంగా చూసింది. ఆ వెంటనే లేచింది.

‘‘ఏం జరిగింది. ఏమైనా సీరియస్‌గా ఉందా? సుధీరా, ఏంటో డాక్టరు పేరు వింటేనే భయం వేస్తోంది..’’

‘‘భయపడకు. ఎందుకు పిలుస్తున్నారో తెలీదు’’

ఇద్దరూ హడావుడిగా ఇంటెన్సివ్‌ ‌కేర్‌ ‌నర్సరీకి వెళ్లారు.

డాక్టరు అపరాజిత దగ్గరే ఉన్నారు. ఆయన బాగా వంగి చూస్తున్నారు.

‘‘ఏం జరిగింది. మళ్లీ ఛాతీలో ప్రాబ్లమా?’’ అంది వినీల గాబరాగా.

‘‘లేదు, ఈసారి పొట్ట. ఇక్కడ చూడండి, కనిపిస్తోందా. కొంచెం వాచింది’’ అంటూ అలాగే వొంగి చూస్తున్నారు.

నిజమే వాచిన దగ్గర చర్మం ఊదా రంగుకి మారింది. వాపు వల్ల మెరుస్తోంది. ఏదో దెబ్బ తగిలినట్లుగా ఉంది.

 ‘‘ఎందుకు వాచింది. నిన్న మీకు కనిపించిందా?’’

‘‘నిన్న లేదు. దీన్ని గమనించిన వెంటనే ఎక్స్ ‌రేలు తీసాం. అన్నీ నార్మల్‌గా ఉందన్న రిపోర్ట్ ‌వచ్చింది. కానీ ఏదో అవుతోంది. ఎక్కడైనా అడ్డుకుందా? అన్నది తెలీదు. ఏదీ నిర్ధారించ లేకపోతున్నాం. జాగ్రత్తగా అన్నీ గమనిస్తున్నాం. పరీక్షిస్తున్నాం. సర్జన్లు కూడా వచ్చి దీన్ని చూస్తారు’’ అంటూ పొట్టని వేలితో నాజూకుగా ముట్టుకుంటూ వంగి పాపనే చూస్తున్న డాక్టరు గారు, వాళ్ల మొహాలు చూస్తూ బాగా నిటారుగా నుంచున్నారు.

 ‘‘సర్జర్లు అన్న మాట విని భయ పడాల్సింది ఏంలేదు. కాని, అక్కడ ఎందుకలా ఉందో, ఏదైనా అడ్డుకుందేమో అని వాళ్లు చూస్తారు’’

‘‘ఈ రోజుల పిల్లకి వాచింది కదా, మరి నొప్పిగా ఉండదా!’’ అని వినీల అడిగింది.

‘‘నొప్పి ఉంటుంది. నర్సులు కూడా అదే అన్నారు. ఈ రోజు పొద్దున్న హాండిల్‌ ‌చేస్తున్నప్పుడు నొప్పిగా ఉన్నట్లు కదిలిందని అన్నారు. ఓ రెండు సార్లు డైయామార్ఫిన్‌ ఇచ్చాం’’

 వెంటనే సుధీర గూగుల్‌లో ఆ మందు గురించి చూసి ఆశ్చర్యంగా అపరాజితని, డాక్టర్‌ని చూసింది. డైయామార్ఫిన్‌ ‌హెరాయిన్‌ ఇచ్చారా అది ఓ డ్రగ్‌. ‌మామూలుగా డాక్టర్లు దానిని, నొప్పి తగ్గడానికి ఇస్తారు. ఇప్పుడు దానిని ఈ పసిగుడ్డుకి ఇచ్చారా!? అంటే పాపకి బాగా నొప్పిగా ఉందని గమనించారా? అపరాజితని నర్సులు చేతుల్లోకి తీసుకుని ప్రేమగా చూస్తున్నారు. ఎంతో జాగ్రత్తగా ముట్టుకుంటూ అన్ని వైర్లు, ట్యూబులు సరిచేస్తున్నారు. ఓ తల్లిగా వినీల చెయ్యలేనివి వాళ్లు చేస్తున్నారు. వినీల ఇంతవరకు తన చేతుల్లోకి తీసుకోలేదు. వీళ్లు చేస్తున్న పనులన్ని కూడా వినీల చెయ్యగలదా, చేసినా ఇంత జాగ్రత్తగా చూసుకోగలదా.

ఇలా ఆలోచిస్తూ సుధీర వినీలని, అపరాజితని చూసింది. డాక్టర్లు చెప్తున్న దానిబట్టి చూస్తూంటే అంతా అదుపులోనే ఉన్నట్లుంటోంది కాని, ఇంకోవైపు చేయి దాటి పోతున్నట్లుంది.

 ‘‘మనం ఇక్కడ ఉండగానే ఎంతోమంది, వాళ్ల పిల్లలని సంతోషంగా, నవ్వుతూ తీసుకెళ్తున్నారు. కాని నా అపరాజితని మాత్రం కాదు. ఆ వెళ్తున్న వాళ్లని చూస్తూంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంది.’’

 ఆమె అన్నదాన్లో అబద్ధం ఏం లేదు. ఆమె ఫీలింగ్‌ ‌సహజం. సుధీరకే ఈర్ష్య కలుగుతోంది. ఆ పిల్లలెవరో ఏమో. కులం, భాష, మతం, దేశం, ఏమాత్రం బేధంలేని హాలు అది. ఆ ఇంక్యుబేటర్లలో ఉన్నవాళ్లు పిల్లలు కారు. అందులో ఉన్నవి జీవితాలు. ఊహ వాస్తవాల త్రిశంకులోకంలో, ఆశ నిరాశల మధ్య ఊగుతున్న జీవితాలు.

సిస్టర్‌ ‌వెళ్లమని చెప్పే వరకూ ఇద్దరూ అక్కడే ఉన్నారు.

 అక్కడి నుంచి వెళ్లి, పేరెంట్స్ ‌హాల్లో కూచున్నారు. అంతలో వినోద కాఫీ, బిస్కట్లు తీసుకొచ్చింది. వినోద కూడా వెళ్లి పాపని చూసి వచ్చింది. ఆమెతో పాటూ వినీల కూడా వెళ్లి మరోసారి చూసి వచ్చింది. డాక్టర్లతో మాట్లాడి, పాప పోగ్రెస్‌ అన్నీ కనుక్కున్నాకా ఆ తరవాత ముగ్గురూ ఇంటికొచ్చేసారు. ఇంటికి రాగానే జరిగినదంతా విక్రాంత్‌కి ఫోన్‌ ‌చెయ్యడానికి సెల్‌ ‌తీసింది.

 సుధీర విక్రాంత్‌కి జరిగినదంతా వివరంగా చెప్పింది. తరవాత కామాక్షి కూడా ఫోన్‌ ‌చేసి అన్నీ కను క్కున్నది. ఆవిడ సుధీరని  మెచ్చుకున్నారు, సమయానికి నీల దగ్గరుండి మానసిక బలాన్ని స్తున్నందుకు. సుధీరకి ఏం చెప్పాలో తెలీడం లేదు. ఏదో అడగాలన్నట్లుగా మామగారికి ఎలా ఉందని అడిగింది.

 ఇవాళ కట్లు విప్పడానికి హాస్పిటల్‌కి తీసుకెళ్లాం. కాలు కదల్పడానికి లేదు. ఫిజియోథెరపీ చేయించాలి. డాక్టర్ని మాట్లాడాం. రేపట్నించి వస్తానని అన్నాడు. ఓ నెల అయ్యాక, ముందు వాకర్‌ ‌సాయంతో నడిపిస్తానని అన్నాడు.

 సుధీర పెళ్లి అయినప్పటి నుంచి ఇంట్లో ఏదో ఒకటి యుద్ధం ఎవరో ఒకరు చేస్తూంటే చూస్తోంది. మామ్మ గారు, నాగమణి, దుర్గ, వినీల, అపరాజిత. తను జీవితం అంటే యుద్ధం అనే అర్థం వచ్చేస్తోంది. అన్ని చోట్లా యుద్ధం చేయాల్సి వస్తోంది. విరామ సమయం మధ్య మధ్యలో వస్తోంది. అప్పుడే ఆ విరామ కాలంలోనే జీవించడం అంటే ఏంటో నేర్చుకుంటున్నట్లుగా ఉందనిపిస్తోంది.

 ఇంటికొచ్చాక కూడా ఎవరి మూడ్‌ ‌బాగాలేదు. ఎవరికీ ఏం మాట్లాడాలని అనిపించడం లేదు. ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారు. వినోద పిల్లలకి పరీక్షలు. అందుకని సుధీర వాళ్లకి చదువులో సాయం చేస్తోంది.

 వినీలకి మందులు అవీ ఇచ్చే బాధ్యత సుధీర తీసుకుంది. రాత్రి పడుకునే ముందు పాలు తెచ్చి ఇవ్వడం మర్చిపోదు. మధ్యాహ్నం అన్నం తిన్నాకా కాల్షియం డైరెక్ట్‌గా లోపలికి వెళ్లడం కోసం తమలపాకులు వేసుకోవాలని వినోద అత్తగారు చెప్తే వాటికి సున్నం అదీ రాసి ఇస్తోంది.

 సుధీరకి ఆశ్చర్యంగా ఉంది. ఇంట్లో తల్లి ఏదైనా చెప్పబోతే నాకేం చెప్పకు; ఎవరైనా చెప్తే నాకు చిరాకు, విసుగు. నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అని ఆమె మాటల్ని తోసి పారేసేది. అలాంటిది ఇప్పుడు వినోద అత్తగారు, కామాక్షి ఏం చెప్తే అది సుధీర చేస్తోంది. ఎన్నిచేయాలో అన్ని చేస్తోంది. ఇవన్నీ ఎందుకు చేస్తోందో ఆమెకే తెలీదు. నేనెందుకు చెయ్యాలి? అని అనొచ్చు, కాని అనడం లేదు.

ఆరోజు ఇంకా పూర్తిగా తెల్లారకముందే ఫోను. తీసి చూసింది. నర్సరీ నుంచి. అది వినీలకి. ఆమె లేదు, బాత్రూమ్‌లో ఉన్నట్లుంది. ఫోను సుధీర తీసింది. తనెవరో చెప్పింది.

‘‘ఓసారి ఆఫీసుకొచ్చి, కలవమన్నానని, వినీల గారికి చెప్పండి. నేను ఆసుపత్రి రిజిస్ట్రార్‌ ‌డాక్టర్‌ ‌నీరజ్‌ ‌గుప్తాని ఫోన్‌ ‌చేసానని చెప్పండి.’’

సుధీరకి భయం వేసింది. ఏం జరిగి ఉంటుంది? ఎందుకు కలుసుకోమని, మాట్లాడమని అన్నారు.

ఈ విషయం వినీలకి చెప్పాలి. అసలే నీరసంగా ఉంది. రాత్రిళ్లు నిద్రపోవడం లేదు. సరిగా భోంచేయడం లేదు. ఎలా చెప్పాలి, కానీ చెప్పాలి. వినీల బాత్రూం నుంచి బయటికి వచ్చిన వెంటనే విషయం చెప్పలేదు. కాఫీ తాగాక సుధీర డాక్టరు గారు అన్న విషయం చెప్పింది. ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఇద్దరూ తయారై ఆసుపత్రికి వెళ్లారు.

వీళ్లు వెళ్లేసరికి, డాక్టర్‌ ‌నీరజ్‌ ‌గుప్తా సీరియస్‌గా ఉన్నారు. అతని ముందు ఓ ఫైలుంది. అది కచ్చితంగా అపరాజితదే అని వాళ్లకి అనిపించింది. వీళ్లు కూచోగానే, అతను ఏదో చెప్పడానికి బాధ పడుతున్నట్లుగా ఉన్నారు. జంకుతున్నారు. రెండు చేతులు నలుపుకుంటూ, వేళ్లల్లో వేళ్లు దూరుస్తూ అటూ ఇటూ చూస్తూ, మధ్య మధ్య టేబుల్‌ ‌సర్దుతున్నారు. కాలయాపన చేస్తున్నట్లుగా ఉన్నారు.

‘‘దేనికి మమ్మల్ని కలుసుకోమని అన్నారు. ఏదైనా సీరియస్‌ ‌విషయం జరిగిందా?’’

‘‘అపరాజితని సర్జన్లు చూసారు. ఆమె కడుపులో మార్పు ఏమీ లేదు, అలాగే ఉంది. కానీ రోజురోజుకి ఆమె పరిస్థితి దిగజారుతున్నట్లుగా అనిపిస్తోంది.’’

‘‘ఇప్పుడు చిన్న ఆపరేషన్‌ ‌చేస్తున్నారు. పైగా ఇది ఆఖరు ఆపరేషన్‌. ఆ ‌తరవాత వచ్చే ఇబ్బందులు అవీ…’’ ఆగిపోయారు.

‘‘ఫరవాలేదు డాక్టర్‌ ‌మీరు చెప్పండి. ఏదైనా నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను’’ అంది వినీల ధైర్యంగా.

 ‘‘ఏం జరిగినా జరగచ్చు, మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. ఎందుకంటే, ఆపరేషన్‌ ‌చేసినా, ఆ వాపు పోలేదు. అన్నీ పరీక్ష చేసాం. కాని ఏం తెలీడం లేదు. చూద్దాం. ఇప్పుడు కూడా చిన్న ఆపరేషన్‌ ‌చేస్తున్నారు. దీని తరవాత ఏం తెలుస్తుందో. మీరు కూచోండి. ఆపరేషన్‌ అయ్యాక చెప్తాం.’’

వాళ్లిద్దరూ మళ్లీ రూంలోకి వచ్చి కూచున్నారు. ఓ గంట తరవాత ఫోను వచ్చింది.

‘‘నువ్వే చూడు సుధీరా, నేనేం వినలేను.’’ అంటూ ఫోన్‌ ‌సుధీరకిచ్చింది.

 సుధీర భయంగానే అందుకుంది.

‘‘ఓసారి కలుసుకోండి’’ అదే మాట చెప్పింది వినీలతో. ఆమెలో ఏవిధమైన కదలిక లేదు.

‘‘నేను వెళ్లి కనుక్కుని వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు.’’ అని అక్కడి నుంచి సుధీర పరుగు లాంటి నడకతో వెళ్లింది. మరో ఐదు నిమిషాల్లో నవ్వు మొహంతో వచ్చింది. కళ్లు మూసుకుని ఉన్న వినీలని కుదిపింది.

‘‘వినీలా మంచి వార్త తెచ్చాను. ఆపరేషన్‌ ‌చేసారుట. ఏదో కొంచెం బౌల్‌ అబ్‌‌స్ట్రక్షన్‌ అం‌తే.’’

‘‘నాకు తెలుసు సుధీరా, అపరాజితకి ఏం కాదు. దాని పేరు అపరాజిత, అంత తొందరగా లోకం విడిచి ఎలా వెళ్తుంది?’’ అని గట్టిగా అంది.

 ఆపరేషన్‌ అయ్యాకా అపరాజిత కొంచెం కోలుకుంది. ఆమె గాయాలు అవీ కాస్త క్లీన్‌గా కనపిస్తున్నాయి. పాప కూడా కొంచెం ఆరోగ్యంగా కనపడుతోంది.

 కాని ఆ సంతోషం ఎంతో సమయం నిలవలేదు. ఆ సాయంత్రం మళ్లీ ఫోన్‌. ‌పరిస్థితి దిగజారిందని, బీపీ బాగా పడిపోయిందని. రక్త ప్రసరణ కూడా సరిగా లేదని అన్నారు. బ్రీతింగ్‌ ‌కూడా సరిగా లేదు. రెండు సార్లు రిససియేషన్‌ ‌చేశారు.

గంట గంటకి ఏం జరుగుతోందో తెలుస్తోంది. ఓ సారి సరిగా ఉన్నట్లుగా ఉంటోంది. ఆ వెంటనే దిగజారిపోతోంది.

అందరూ ఫోన్లు చేస్తున్నారు- ఎలా ఉందని, డాక్టర్లు ఏం అంటున్నారని.

అన్ని ఫోన్లకి సుధీర జవాబిస్తోంది, ఏం మాట్లాడాలో తెలీడం లేదు.

వినోద భోజనం తీసుకొచ్చింది. ఆకలి అసలు వేయడం లేదు కాని, వినోద బలవంతం మీద ఇద్దరూ ఏదో భోంచేసామనిపించారు.

 తిరిగి వచ్చేసరికి అపరాజితని మరో పెద్ద క్లోజ్‌డ్‌ ఇం‌క్యుబేటర్‌లో ఉంచారని తెలిసింది. ఇది ఇదివరకు దానిలా లేదు. అంతా మూసి ఉంది. ఓడల్లో ఉండే లాంటిది, గుండ్రటి కిటికీ లాంటిది ఉంది. అందులోంచి చూడాల్సి వచ్చింది.

వేలు పెట్టి అపరాజిత చేతిని స్పృశించింది. ఏమీ రెస్పాండ్‌ అవలేదు. ఈసారి వేరే డాక్టరున్నారు. ఆయన పేరు హేతల్‌ అని ఆయన జేబుకి ఉన్న బాడ్జ్ ‌ప్లేట్‌ ‌మీద రాసి ఉంది. డాక్టర్‌ ‌కూడా నిశ్శబ్దంగా చూస్తున్నారు.

‘‘ఆమె కడుపు కండిషన్‌ ఏం ‌బాగా లేదు. ఇంకా వాచింది. పైగా ఇన్ఫెక్షన్‌ ‌సోకింది. ఆమెకి సెప్టికేమియా, అంటే ఇన్‌ఫెక్షన్‌ అం‌తా పాకిందని అర్థం. ప్రస్తుతానికి ఆమె కండిషన్‌ ‌చాలా నాజూకుగా ఉంది. హాండిల్‌ ‌చేయడం కొంచెం కష్టమే.’’

‘‘కళ్లు తెరిచిన అపరాజిత నన్నే చూస్తున్నట్ల నిపిస్తోంది’’ అని అంది వినీల.

చావుబతుకుల సన్నటి సరిహద్దుపై రాత్రుళ్లూ, పగళ్లూ సవారి చేసి, అలసిపోయి ఉంది. ఆ అలసట కనిపిస్తోంది. అందులో ఏదో భావం. దానికి అక్షరాలు చాలవు. కాని అర్థం చేసుకోమంటోంది. ఏదో సంజాయిషి కోరుతున్న అర్థం ఏం లేదు ఆ చూపులో. ప్రశ్నలు లేవు. జవాబులు అడగడం లేదు. అందులో స్థితప్రజ్ఞ మాత్రమే ఉంది.

‘‘ఇప్పుడు ఆమెకి నొప్పి తగ్గడానికి పెయిన్‌ ‌కిల్లర్స్, ఇన్ఫెక్షన్‌ ‌తగ్గడానికి యాంటిబయటిక్స్ ఇస్తున్నాం.’’ అతను కూడా తన బాధని దాచుకోవడానికి ప్రయత్నిస్తు న్నట్లుగా ఉన్నారు.

వెర్రిగా చూస్తూండిపోయింది వినీల.

‘‘కాస్త డిస్టర్బెన్స్‌గా ఉంది. ఏదీ సరిగా లేదని పిస్తోంది. ఏమో మాకేం నమ్మకం కలగడం లేదు.’’ ఆయన గొంతు పూడుకుపోయింది.

డాక్టర్‌ ‌చేతి రుమాలుతో కళ్లు ఒత్తుకున్నారు.

డాక్టర్లు ఇలా ఉంటారా! ఇంత అటాచ్‌మెంట్‌ ‌పెట్టుకుంటారా! పైకి చూస్తే అంతా యాంత్రికంగా చూస్తున్నట్లుగా, చేస్తున్నట్లుగా ఏమాత్రం ఫీలింగ్స్‌ని చూపించకుండా ఉంటారు. కాని ఈ డాక్టరు మాత్రం అలా కాదు. ఓ మనసున్న మనిషి. తన కన్నీళ్లని ఆపుకోలేకపోతున్నారు.

డాక్టర్‌ అలా అనగానే వినీల తల పక్కకి తిప్పుకుని సుధీర భుజం మీద పెట్టుకుంది. వెంటనే సుధీర ఆమెని బయటికి తీసుకెళ్లింది. కొంచెం మామూలుగా అయ్యాక మళ్లీ నర్సరీకి వెళ్లారు. వినీల అక్కడున్న సిస్టర్‌ని పాప గురించి అడిగింది.

‘‘ఏమో వినీలా ఏం చెప్పడానికి లేదు. కానీ ఏదీ సరిగా లేదనిపిస్తోంది.’’

చేతులు శుభ్రం చేసుకుని అపరాజిత దగ్గరికి వెళ్లారు.

(ముగింపు వచ్చేవారం)

About Author

By editor

Twitter
YOUTUBE