దేశాన్ని ఏలిన అనుభవం నుంచి, ఒక్కొక్కటిగా రాష్ట్రాల్లోనూ ఆదరణ కోల్పోతున్నా.. వరుస ఓటములు ఎదుర్కొంటున్నా.. ఆ పార్టీ ఆలోచనా సరళిలో మార్పులు రావడం లేదు. ఎన్ని సూత్రీకరణలు అమలు చేస్తున్నా సహజ ధోరణులు ఆ పార్టీని వీడిపోవడం లేదు. అన్నింటికీ ‘అంతర్గత ప్రజాస్వామ్యం’ అనే ఊతపదం సర్వరోగ నివారిణి మాదిరిగా తయారయింది. అవును, ఈ వ్యాఖ్యలన్నీ కాంగ్రెస్‌ ‌పార్టీ గురించే. నిత్యం ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఆధిపత్య ధోరణులు, ఫిర్యాదులు, మొట్టికాయలు.. కాంగ్రెస్‌లో సర్వసాధాణం. ఇక, తెలంగాణలో ఆ పార్టీ నేతల మాటలకు, సొంతపార్టీ నేతలపైనే ఆరోపణలకు, విమర్శలకు ‘అర్థాలే వేరులే’ అన్నట్లుగా తయారయింది.

కొద్దిరోజులుగా కాంగ్రెస్‌ అధిష్టానం టీపీసీసీపై ప్రత్యేక దృష్టి సారించిందని అంతా అనుకున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌కు తోడు పలువురు పరిశీలకుల నియామకం వంటి పరిణామాలు ఆ పార్టీని గాడిలో పెడతాయని సొంత పార్టీ నేతలు సైతం అనుకున్నారు. కానీ, ‘అంతా మిథ్య’ అన్నట్లుగా తయారయింది.

టీపీసీసీ అధ్యక్షుడిగా టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డికి అవకాశం కల్పించడంతో తీవ్రస్థాయిలో నిరసన స్వరాలు వినిపించినా అధిష్టానం జోక్యంతో అప్పటికి అంతా సర్దుమణిగిందనుకున్నారు. రేవంత్‌రెడ్డి కూడా గత అధ్యక్షుల కంటే భిన్నంగా టీఆర్‌ఎస్‌, ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రజాదరణ తగ్గించడమే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. వరుస సభలు నిర్వహిస్తున్నారు. అయితే, ఇక్కడే సమస్య మళ్లీ చింతచెట్టు ఎక్కి కూర్చుంది. సీనియర్లు, పీసీసీ కార్యవర్గానికి సమాచారం ఇవ్వకుండా, అనుమతి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు జోరుగా వస్తున్నాయి. అంతేకాదు, ఏ నాయకుడినీ లెక్క చేయడం లేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టీపీసీసీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డి మరోసారి మీడియా ముందే టీపీసీసీ చీఫ్‌పై విమర్శల వర్షం కురిపించారు. మరోవైపు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరు కాలేదు. దీంతో, ఒక సమస్య సర్దుకుంటే మరో సమస్య ఎదురుచూస్తున్నట్లు తయారయింది ఏఐసీసీ పెద్దలకు. ఫలితంగా పార్టీ సీనియర్లు, బాధ్యులు తలలు పట్టుకుంటున్నారు.

పార్టీలో రేవంత్‌రెడ్డికి, సీనియర్‌లకు మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. దాదాపు రెండు నెలలుగా ఇదే పంచాయితీ నడుస్తోంది. సీనియర్లు, ముఖ్యనేతలు.. ఏది చేసినా తమకు చెప్పాలని హుకుం జారీచేస్తున్నారు. అయితే, వాళ్లు చెప్పినప్పుడు సరేనంటున్న రేవంత్‌ ‌తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. దీంతో ‘ఎవరికి వారే.. యమునా తీరే..’ అన్నట్లుగా తయారయింది పరిస్థితి. ఫలితంగా విపక్షాలతో కాదు, స్వపక్షంతోనే పోరు అన్నట్లుగా మారింది. ప్రతి విషయాన్ని పార్టీలో చర్చించిన తర్వాతే నిర్ణయాలు బయటకు చెప్పాలని, తమతో మాట్లాడిన తర్వాతే కేడర్‌లోకి వెళ్లాలని సీనియర్లు భావిస్తుంటే రేవంత్‌ అం‌దుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరాయి. రేవంత్‌ ‌మినహా పార్టీ ఎంపీలు, సీతక్క మినహా ఎమ్మెల్యేలు, ఉన్న ఒక్క ఎమ్మెల్సీతో పాటు పలువురు సీనియర్‌ ‌నాయకులు కూడా రేవంత్‌ ‌తీరుపై అసంతృప్తితో ఉన్నారనే చర్చ గాంధీభవన్‌ ‌వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అధిష్టానం కొత్తగా టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)ని ఏర్పాటుచేసింది. అయితే, సరిగ్గా ఈ సమావేశానికి ముందురోజే ఎమ్మెల్యే జగ్గారెడ్డి అగ్గి రాజేశారు.

పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే సందర్భంగా రేవంత్‌ ‌చేసిన వ్యాఖ్యలకు, అధ్యక్షుడైన తర్వాత వ్యవహరిస్తున్న తీరుకు పొంతనలేదని సీనియర్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమ నిర్వహణ సీనియర్లు వర్సెస్‌ ‌రేవంత్‌ అన్నట్లుగా సాగింది.

ఇంద్రవెల్లి సభకు ముందు మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అలకతో ప్రారంభమైన పంచాయతీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇంద్రవెల్లి సభకు సీతక్క అధ్యక్షత వహించడం, రావిర్యాల సభను అంతా రేవంత్‌ ‌బృందం నడిపించడం, మూడుచింతలపల్లి దళిత దీక్షలో కూడా సీనియర్లు తెరపైన కనిపించే పరిస్థితి లేకపోవడం, గజ్వేల్‌ ‌సభ అంతా రేవంత్‌ అన్నట్లే సాగడాన్ని ఆయన వ్యతిరేక వర్గం జీర్ణించుకోలేకపోతోంది. కనీసం పార్టీలో చర్చించకుండానే గజ్వేల్‌ ‌సభలో 2 నెలల పాటు నిరుద్యోగ సమస్యపై కార్యాచరణ ప్రకటించడం దేనికి సంకేతమని, అన్నీ ఆయనే ప్రకటిస్తే ఇక తాముండి ఎందుకనే భావన సీనియర్‌ ‌నాయకుల్లో వ్యక్తమవుతోంది.

పార్టీలో ఓవైపు ఈ రచ్చ కొనసాగుతుండగానే.. మరోవైపు, నిజామాబాద్‌, ‌మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలకు చెందిన కొందరు ఇతర పార్టీల నేతలు స్థానిక కాంగ్రెస్‌ ‌నాయకులకు సమాచారం లేకుండా రేవంత్‌ను కలవడం, కనీసం చర్చించకుండానే అధికార ప్రతినిధుల నియామక పేర్లు ప్రకటించడం, గాంధీభవన్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఎవరెవరు వస్తున్నారనే సమాచారం కూడా ముఖ్య నేతలకు ఇవ్వకపోవడం లాంటివి రేవంత్‌ ఏకపక్ష ధోరణికి అద్దం పడుతున్నాయనేది సీనియర్ల విమర్శ. ఇందులో భాగంగానే రాష్ట్ర నేతలు అధిష్టానాన్ని కలసి రేవంత్‌ ‌తీరుపై ఫిర్యాదు చేశారు కూడా.

సంగారెడ్డి ఎమ్యెల్యే జగ్గారెడ్డి అయితే రేవంత్‌ ‌తీరును మీడియా ముఖంగానే తప్పుపట్టారు. రేవంత్‌ ఏ ‌విషయంలోనూ పార్టీ ప్రొటోకాల్‌ ‌పాటించడం లేదని విమర్శించారు. అయితే ఏఐసీసీ పెద్దలు ఈ విషయాన్ని ‘టీ కప్పులో తుపాను’గా చూపించే ప్రయత్నం చేశారు. అంతేకాదు, జగ్గారెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపడంతో ఆయన ఏం మాట్లాడారన్న దానిపై అధిష్టానం ఆరా తీసింది. పార్టీ వ్యవ హారాలను అంతర్గత వేదికలపై చర్చించుకోవాలే తప్ప మీడియాతో మాట్లాడడం సరికాదని జగ్గారెడ్డికి సూచించింది. దీంతో, మరోమారు పార్టీ అంతర్గత వ్యవహారాలను మీడియాతో మాట్లాడనని పార్టీ పెద్దలకు జగ్గారెడ్డి హామీ ఇచ్చారు.

ఇక, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా మరోసారి కాంగ్రెస్‌లో కాక పుట్టించారు. పార్టీ తొలి రాజకీయ వ్యవహారాల భేటీకి భేటీకి ఆయన గైర్హాజరయ్యారు. ఫలితంగా తన అసంతృప్తిని చూపించారు.

వాస్తవానికి ఆ రోజు హైదరాబాద్‌లోనే ఉన్నా.. కోమటిరెడ్డి మాత్రం సమావేశానికి హాజరు కాకపోవడంపై పెద్ద చర్చే జరిగింది. పార్టీ అధికార ప్రతినిధుల నియామకంలో సీనియర్లు, పార్టీ ప్రజాప్రతినిధులను సంప్రదించలేదని, కుటుంబ విషయాల్లో కేసులున్న వ్యక్తులను పార్టీ అధికార ప్రతినిధులుగా నియమిస్తే, ఇతర పార్టీలు అడిగే ప్రశ్నలకు ఏం జవాబు చెప్తామని కోమటిరెడ్డి సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్‌లో దళిత-గిరిజన దండోరా సభ పెట్టింది ఒక నాయకుడైతే, ఆ సభ అధ్యక్షత ఇంకొకరికి అప్పగించారని, ఇలా చేయడం సరైంది కాదని, ఇలాంటి విషయాలన్నింటిలోనూ మార్పురావాలని ఆయన భావిస్తున్నారంటున్నారు.త్వరలోనే సోనియా, రాహుల్‌లను కలసి రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు, టీపీసీసీ పనితీరు గురించి వివరించాలన్న ఆలోచనలో కోమటిరెడ్డి ఉన్నట్లు సమాచారం. కాగా, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కూడా పీఏసీ సమావేశానికి గైర్హాజరు కావడం గమనార్హం.

జరుగుతున్న పరిణామాలు చూస్తే.. కాంగ్రెస్‌ ‌పార్టీలో ఎన్ని అంతర్గత విభేదాలున్నా, సీనియర్లంతా మూకుమ్మడిగా అసహనంతో ఉన్నా.. పార్టీ అధిష్టానం మాత్రం రేవంత్‌ను సమర్థించే రీతిలోనే ముందుకు వెళ్తోంది.

ముఖ్యంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్యం ఠాగూర్‌ అన్ని విషయాల్లోనూ టీపీసీసీ అధ్యక్షుడికి అండగా నిలబడుతున్నారు. దీనికి తోడు రేవంత్‌కు సహకరించాల్సిందేనంటూ ముఖ్య నేతలందరికీ అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు కూడా వచ్చాయని చెబుతున్నారు. అందుకే జగ్గారెడ్డి సైలెంట్‌ అయ్యారని, గతంలో బహిరంగంగా మాట్లాడిన కోమటిరెడ్డి కూడా ఈసారి తన అసంతృప్తిని సంకేతాత్మకంగా వెల్లడించారని చెప్పుకుంటున్నారు.

– సుజాత గోపగోని, 6302164068

 సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE