– క్రాంతి

తొమ్మిదన్నరేళ్లు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని ఒక్క కలంపోటుతో తొలగించింది కాంగ్రెస్‌. ‌తీవ్రమైన ఆరోపణలు ఉన్న వ్యక్తిని ఏకాభిప్రాయం మేరకు ముఖ్యమంత్రిని చేశారు. ఇక అంతా కలగాపులగం చేసిన వ్యక్తి, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి కేవలం రెండున్నర నెలల క్రితమే ఎంపిక చేసిన నేత కాడి కింద పడేసిపోయాడు. ఇదంతా కాంగ్రెస్‌ ‌లీల. అధికారానికి ఆమడు దూరంలో ఉండవచ్చు. మూడు రాష్ట్రాలలోనే అధికారం మిగిలి ఉండవచ్చు. అయినా కాంగ్రెస్‌కు అవేమీ పట్టవు. విధ్వంసకరంగా ఆలోచించడమే దాని సంస్కృతి. పంజాబ్‌ ‌వంటి సరిహద్దు రాష్ట్రంలో ఇలాంటి వికృత విన్యాసాలు చేస్తున్నదంటే ప్రజాశ్రేయస్సు పట్ల, దేశ సమగ్రత, సంక్షేమాల పట్ల ఆ పార్టీకి ఉన్న నిబద్ధతను ప్రశ్నించవలసిందే. ఒక్క వారంలోనే పంజాబ్‌లో చోటు చేసుకున్న పరిణామాలన్నీ దానిని చాటి చెబుతున్నాయి.

 ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అంటే ఇదేనేమో? కేవలం నాలుగు మాసాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ముందు సొంత ముఖ్యమంత్రి అమరీందర్‌ ‌సింగ్‌కు పొగపెట్టింది కాంగ్రెస్‌ అధిష్టానం. సెప్టెంబర్‌ 18‌న ఆయన అవమానకర పద్ధతుల్లో పదవిని వీడారు. సరిగ్గా పదిరోజులకి, అంటే సెప్టెంబర్‌ 28‌న పంజాబ్‌ ‌కాంగ్రెస్‌ను కంగాళీ చేసిన పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌ ‌సింగ్‌ ‌సిద్ధు హఠాత్తుగా వైదొలిగారు. పదవికి రాజీనామా చేస్తూ అమరీందర్‌ ‌చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ పరువును రచ్చ కీడ్చేశాయి. సిద్ధు పాక్‌ అనుకూలుడని చెప్పారాయన. ఇతడికి సీఎం పదవిని ఇస్తే ఊరుకునేది లేదని, ప్రియాంక, రాహుల్‌ ‌గాంధీలకు అనుభవం లేదని, వారిని సలహాదారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు అమరీందర్‌. ఏకాభిప్రాయం పేరుతో కొత్తగా ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్‌ ‌సింగ్‌ ‌చన్ని తెర మీదకు వచ్చారు. ఈయన మీద మీటూ ఆరోపణలు ఉన్నాయి.

ఇలా ఒక వార్త మీద ఒక వార్త వెలువడి పంజాబ్‌ ‌దేశ దృష్టిని ఆకర్షించింది. వీటికి పరాకాష్ట అమ రీందర్‌ ‌సింగ్‌ ‌బీజేపీలో చేరడానికి సర్వం సిద్ధమైందన్న వార్త. ఆయనకు కేంద్రంలో చోటు కల్పిస్తారన్న మాట కూడా వినపడింది. నిజానికి అమరీందర్‌ ‌ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేసిన సమయంలోనే బీజేపీలో చేరడం గురించి ఊహాగానాలు వచ్చాయి. అమరీందర్‌కు జాతీయవాది అన్న పేరుంది. సెప్టెంబర్‌ 28‌వ తేదీనే ఢిల్లీ వెళ్లిన అమరీందర్‌ ‌బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుసుకో బోతున్నారన్న వార్త నేపథ్యంలో సిద్ధు వికెట్‌ ‌హఠాత్తుగా కూలింది. ఈ రాజీనామాను అధిష్టానం ఆమోది స్తుందో లేదో తెలియదు. ఆమోదించకున్నా సిద్ధు వైలదొలగితే చన్నిని ముఖ్యమంత్రిని చేయడం ఇష్టలేకనే వెళ్లాడన్న అపవాదు తప్పదు. కాగా పంజాబ్‌కు, దేశానికి ప్రమాదకారి అని అమరీందర్‌ ‌వ్యాఖ్యానించినా, సిద్ధును చేర్చుకోవడానికి పార్టీలు సిద్ధంగానే ఉంటాయి.నిజానికి ఆది నుంచి సిద్ధు వ్యక్తిత్వం మీద అనుమానాలు ఉన్నాయి. సిద్ధు రాజీనామా చేసిన వెంటనే అమరీందర్‌ ‌చేసిన ట్వీట్‌ ఒక్క వాక్యమే అయినా బలమైనది. అది- ‘సిద్ధుకు బొత్తిగా స్థిరత్వం లేదు’. అంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదాలనుకుంటే ఇంతే అని పరోక్షంగా రాహుల్‌, ‌ప్రియాంకలను ఆయన హెచ్చరించినట్టే. ఢిల్లీలో, సోనియా ఇంట్లో అమరీందర్‌ ‌కంటే ఈ‘ స్థిరత్వం లేని’ సిద్ధుకే ఎక్కువ ప్రాధాన్యం లభించడం వింత కాదా! కానీ కాంగ్రెస్‌లో అది అదొక సంస్కృతి.

పంజాబ్‌ ‌ప్రయోజనాల కోసం ఎంత త్యాగాని కైనా సిద్ధమని సిద్ధు రాజీనామా చేస్తూ అన్నమాటగా వార్తల వల్ల తెలుస్తున్నది. కానీ చరణ్‌జిత్‌ ‌చన్నిని ఆ పదవిలో కూర్చోపెట్టినందుకు ఆయన అలిగాడన్న అభిప్రాయం కూడా ఉంది.ఇంతకీ చన్ని కూడా సిద్ధు అనుచరుడే. అమరీందర్‌ ‌మీద తిరుగుబాటు జెండా ఎగురవేసినవాడే.

ఒకప్పుడు దేశాన్ని పాలించిన రాజకీయ పార్టీ ఇప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబడు తోంది. యువతరాన్ని, నవతరాన్ని ఆకట్టుకోవడంలో ఇప్పటికే విఫలమైన ఆ పార్టీ అంతర్గత కలహాలతో ఇప్పుడు బలమైన నాయకులను కూడా పోగొట్టు కుంటోంది. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యానికి, అంతర్గత విబేధాలకు అధిష్టానమే ఆజ్యం పోస్తోంది. రాహుల్‌ ‌తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్ష పదవిని త్యజించినట్లు దేశాన్ని మభ్యపెట్టిన రాహుల్‌ ‌పార్టీపై పెత్తనాన్ని మాత్రం వదులుకోరు.ఇదే విపరిణా మాలన్నింటికి కారణమవుతున్నది.

అమరీందర్‌కు పొగ

కూర్చున్న కొమ్మనే నరుక్కునే మూర్ఖత్వం అంటే ఇదే. కాంగ్రెస్‌ ‌పార్టీకి అంతో ఇంతో బలం ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్‌ ఒకటి. సొంత ప్రభుత్వంలో కుమ్ములాటలకు పార్టీ అధిష్టానమే ఆజ్యం పోసింది. అవమానాలను భరించలేక రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. అమరీందర్‌ ‌సింగ్‌ అభిమతానికి వ్యతిరేకంగా అధిష్టానం సిద్ధును పీసీసీ అధ్యక్షునిగా నియమించింది. అప్పటికే అమరీందర్‌కు వ్యతిరేకంగా అసమ్మతిని రెచ్చగొట్టిన సిద్ధుకు ఈ పదవి కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లయింది. ఎమ్మెల్యేలందరినీ రెచ్చగొట్టి ఆయన రాజీనామా కోసం ఒత్తిడి తెచ్చాడు. ఈ పనులను అమరీందర్‌ ‌సోనియా, రాహుల్‌, ‌ప్రియాంకల దృష్టికి తెచ్చినా ఫలితం లేకపోయింది. వారు సిద్ధునే వెనకేసుకు రావడంతో రాజీనామా చేయక తప్పలేదు.

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ‘రాహుల్‌, ‌ప్రియాంక నా పిల్లల్లాంటి వాళ్లు. నన్ను అవమానకరంగా సీఎం పదవి నుంచి తప్పించారు. ఎమ్మెల్యేలను నేను విమానాల్లో గోవాకు తీసుకెళ్లను. అది నా విధానం కాదు. సోనియా గాంధీతో మాట్లాడా. నమ్మకం లేని చోట నేను ఉండను. ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేలతో సమావేశాలు పెట్టారు. ఇది నాకు అవమానకరంగా అనిపించింది. ప్రభుత్వాన్ని నడపలేనని అనుకున్న ట్లున్నారు. ఎవరి మీద నమ్మకముంటే వారిని సీఎం చేసుకోమని చెప్పా’ అన్నారు అమరీందర్‌.

‌సిద్ధు ఇమ్రాన్‌కు సన్నిహితుడు

సిద్ధును ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి కానివ్వకుండా పోరాడతానని అమరీందర్‌ ‌ప్రకటిం చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనపై గట్టి అభ్యర్థిని నిలబెడతానని చెప్పారు. ఇలాంటి ప్రమాదకారి నుంచి దేశాన్ని కాపాడేందుకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధమేనని వ్యాఖ్యానించారు అమరీందర్‌. ‌సిద్ధు పాకిస్తాన్‌ ‌పాలకులకు సన్నిహితుడని ఏఎన్‌ఐ ‌వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమరీందర్‌ ఆరోపించారు. ‘పాకిస్తాన్‌ ‌ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ‌సిద్ధూ స్నేహితుడు. ఆ దేశ ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ‌ఖమర్‌ ‌జావేద్‌ ‌బజ్వాతో కూడా ఆయనకు స్నేహం ఉంది. పాకిస్తాన్‌ ‌నుంచి అక్రమంగా ఆయుధాలు, హెరాయిన్‌ ‌వస్తున్నాయి. భారత దేశంపై డ్రోన్‌లను వదులు తున్నారు. అలాంటి దేశ నాయకులకు స్నేహితుడైన సిద్ధూను ముఖ్యమంత్రిని చేయడం నేను వ్యతిరేకిస్తా’ అని అన్నారు.

రాబోయే ఎన్నికల్లో గెలిచి పంజాబ్‌లో పాగా వేయాలని ఆప్‌, ‌పునర్వైభవం దక్కించుకోవాలని ఆకాళీదళ్‌, ఒం‌టరిగా సత్తా చూపాలని బీజేపీ మల్లగుల్లాలు పడుతుంటే, ఇవేమీ పట్టనట్లుగా ఉన్నట్లుండి సీఎంను మార్చాలని కాంగ్రెస్‌ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది.

అమరీందర్‌సింగ్‌ ‌పంజాబ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2002లో మొదటిసారి సీఎం అయ్యారు. 2007లో కాంగ్రెస్‌ ‌పార్టీ ఓడిపోయి శిరోమణి అకాళీదళ్‌ అధికారం చేపట్టింది. ఈ పదేళ్ల కాలంలో అమరీందర్‌ ‌చాలా కాలం పాటు కాంగ్రెస్‌ ‌కార్యకలాపాల్లో అంటీ ముట్టనట్లుగానే ఉన్నారు. అయితే అకాలీదళ్‌ ‌ప్రభుత్వంపై పంజాబ్‌ ‌ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో అమరీందర్‌ ‌నాయకత్వంలో కాంగ్రెస్‌ ‌పార్టీ 2017 ఎన్నికల్లో విజయం సాధించింది.

రాష్ట్రంలో డ్రగ్‌ ‌మాఫియాపై ఉక్కుపాదం మోపుతానని అమరీందర్‌ ‌గురుగ్రంథ సాహెబ్‌ ‌సాక్షిగా ప్రమాణం చేశారు. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకో లేదు. ఎన్నికల హామీల్లో కీలకమైన ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతి వంటి వాటిని అమరీందర్‌ ‌ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, రైతులు, ఆశా వర్కర్లు, నిరుద్యోగులు, దళితులు.. ఇలా అనేక వర్గాలు వారి బాధలు తీరడం లేదంటూ ఆందోళనలు ముమ్మరం చేశాయి.

అమరీందర్‌ ‌పార్టీకి, ప్రజలకు అందుబాటులో ఉండరనేది ఎమ్మెల్యేల ఆరోపణ. పంజాబ్‌ ‌కాంగ్రెస్‌లో ఎదురులేని నేతగా ఉన్న అమరీందర్‌ ‌ప్రతిష్ట క్రమంగా మసకబారుతోందని కొన్ని సర్వేలు ఎత్తి చూపాయి. 2019లో ఆయన రేటింగ్‌ 19‌శాతం ఉండగా, 2021 ఆరంభంలో 9.8 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్‌ ‌సొంతంగా రాష్ట్రంలో నిర్వహించిన సర్వేలో కూడా అమరీందర్‌ ‌పట్ల ప్రతికూలత కనిపించినట్లు సమాచారం. అయితే కెప్టెన్‌ను అంత సులభంగా తీసి పారేయడానికి వీల్లేదు. ‘రాజకీయ భవిష్యత్‌ ‌గురించి నాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అవసరమైనప్పుడు వినియోగిస్తా. నా వెంట ఉన్నవారితో మాట్లాడి భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటా.’ అని అమరీందర్‌ ‌చెప్పారు.

మీటూ వివాదంలో కొత్త సీఎం

అమరీందర్‌ ‌రాజీనామాతో సీఎం పదవికి చరణ్‌జిత్‌ ‌చన్ని ఎంపికయ్యారు. రామదాసియా సిక్కు సమాజానికి చెందిన చన్ని మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పంజాబ్‌ ‌ప్రభుత్వంలో సాంకేతిక విద్యా, పారిశ్రామిక శిక్షణ మంత్రి. 2015 నుండి 2016 వరకు పంజాబ్‌ ‌విధానసభలో చన్ని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. త్వరలో పంజాబ్‌ ఎన్నికలు జరగనుండటం, దేశవ్యాప్తంగా బలమైన ఎస్సీ సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించేందుకు గాను కాంగ్రెస్‌ ‌పార్టీ దళిత ముఖ్యమంత్రిని నియమించినట్లు చెబుతున్నారు. తీరా చన్ని ప్రమాణ స్వీకారం చేయక ముందే జాతీయ మహిళా కమిషన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. చన్ని అమరీందర్‌ ‌క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న సమయంలోనే 2018లో ఒక మహిళా ఐఏఎస్‌ అధికారిణికి అసభ్యకర సందేశం పంపారనే అరోపణలున్నాయి. దీనిని అప్పట్లోనే సుమోటాగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్‌ ‌విచారణ చేపట్టింది.

కాంగ్రెస్‌ ‌పరిస్థితి తారుమారు

కొత్త నాయకత్వాన్ని తయారు చేయడం, యువ నాయకత్వాన్ని ఆకర్షించడం సంగతి ఎలా ఉన్నా, ఉన్న నాయకులనే కాపాడుకోలేని దుస్థితిలో ఉంది కాంగ్రెస్‌. ‌కాంగ్రెస్‌ ‌యువ నేతల్లోనూ నిరాశా నిస్పృహలు నెలకొని ఉండటం మరో సమస్య. మధ్య ప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియాను పక్కన పెట్టినందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. సీనియర్‌ ‌నేత జితిన్‌ ‌ప్రసాద్‌ ‌బీజేపీలో చేరారు. రాజస్తాన్‌లో సచిన్‌ ‌పైలట్‌ ‌రూపంలో ఇప్పటికీ అసమ్మతి గుప్పుమంటూనే ఉంది. సచిన్‌ ‌సమయం కోసం వేచి చూస్తున్నారు.

అస్సాం మహిళా కాంగ్రెస్‌ ‌నేత సుస్మితాదేవ్‌ ‌టీఎంసీలో చేరారు. దక్షిణ ముంబయి మాజీ ఎంపీ మిలింద్‌ ‌దియోరా, గతంలో మూడుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న దీపేందర్‌సింగ్‌ ‌హుడా, ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి షీలాదీక్షిత్‌ ‌కుమారుడు సందీప్‌ ‌దీక్షిత్‌ ‌వంటి ప్రజాకర్షణ కలిగిన యువనేతలకు కాంగ్రెస్‌ ఎలాంటి బాధ్యతలనూ అప్పగించలేదు. దీంతో వారు పార్టీ విధానాలకు విరుద్ధంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు.

2024 కూడా కలిసిరానట్లే..

జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌ ఇప్పటికే ఉనికి పోగొట్టుకుంది. ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే కానీ గెలవలేమని భావిస్తోంది. కాంగ్రెస్‌, ‌బీజేపీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో 189 సీట్లలో ముఖాముఖీ తలపడ్డాయి. అందులో బీజేపీ 166 సీట్లు గెలుచుకుంది. 2019లో 192 స్థానాల్లో ప్రత్యక్ష పోరుకు దిగితే బీజేపీ 176 సీట్లను దక్కించుకుంది. 2019లో భాజపాకు దాదాపు 23 కోట్ల ఓట్లు పడగా, కాంగ్రెస్‌ ‌సుమారు 12 కోట్ల ఓట్లు పొందింది. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మినహా హస్తం పార్టీ ఇప్పటివరకు పేలవ ప్రదర్శనే కనబరచింది. ఇలాంటి దశలో పార్టీని బలోపేతం చేయడానికి శ్రమించాల్సిన శ్రేణులు స్వీయ సంఘర్షణల్లో తలమునకలయ్యాయి. దీంతో 2024 పార్లమెంట్‌ ఎన్నికలపై కాంగ్రెస్‌కు దాదాపు ఆశలు సన్నగిల్లినట్లే.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE