గోపరాజు విశ్వేశ్వర ప్రసాద్
అఫ్ఘానిస్తాన్ పరిణామాలలో ప్రపంచం అమెరికాను దోషిగా పరిగణిస్తున్నది. అఫ్ఘాన్‌లో జరుగుతున్న ముస్లిం మత ఛాందస ఉగ్రవాద మూకల ఏకీకరణను కశ్మీర్ సాధన కోసం మలుచుకోవాలని పాకిస్తాన్ కలలు కంటున్నది. ప్రపంచానికి పురోగమించడం ఎలాగో నేర్పిందని కుహనా మేధావులు, కమ్యూనిస్టులు నిత్యం స్తోత్రపాఠాలు వల్లించే చైనా తాలిబన్‌కు నిస్సిగ్గుగా మద్దతు పలికింది. రష్యా పరోక్షంగా చేయూతనిస్తున్నది. ఇవన్నీ ఎలా ఉన్నా, అఫ్ఘాన్ పరిణామాల విష ప్రభావం మొదటిగా పడేది భారత్‌పైనే. కాబట్టి భారతదేశం స్పందన ఏమిటి అంటూ ప్రపంచ ఎదురు చూస్తున్న సమయం. ఇలాంటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచం అభివృద్ధి చెందుతుంది అంటూ ఆయన ఇచ్చిన పిలుపు పెద్ద సందేశమే.
కరోనా తదితర అంశాలు, భారత్- అమెరికా సంబంధాల నేపథ్యంలోనూ ప్రధాని అమెరికా సందర్శన ప్రాముఖ్యం సంతరించుకుంది. అగ్రరాజ్యాధినేతగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టాక ఆ దేశాన్ని సందర్శించిన తొలి విదేశీ అధినేత కూడా మోదీనే. కరోనా కారణంగా ఇప్పటివరకు ఉభయ దేశాధినేతలు వర్చువల్ సమావేశాలకే పరిమిత మయ్యారు. కరోనా పరిస్థితులు ఒకింత కుదుట పడుతున్న నేపథ్యంలో ఇద్దరు అధినేతలు ముఖా ముఖిగా కలుసుకున్నారు. ఈ ఏడాది బంగ్లాదేశ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మోదీ డాకా వెళ్లివచ్చారు. ఆ తరవాత సందర్శించింది అమెరికానే. పర్యటనలో భాగంగా బైడెన్‌తో ద్వైపాక్షిక అంశాలపై చర్చలతో పాటు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. క్వాడ్ (క్వాడ్రిటోరియల్ సెక్యూరిటీ డైలాగ్- చతుర్భుజ కూటమి) అధినేతల సదస్సులో భారత అధినేత పాల్గొన్నారు. తన ఏడేళ్ల పదవీ కాలంలో ప్రధాని మోదీ ముగ్గురు అమెరికా అధినేతల (బరాక్ ఒబామా, డొనల్డ్ ట్రంప్, జో బైడెన్)తో సమావేశం కావడం విశేషం. గతంలో ఏ భారత ప్రధానికీ ఇటువంటి అరుదైన గౌరవం లభించలేదు. ప్రధాని హోదాలో మోదీ అమెరికాను సందర్శించడం ఇది ఏడోసారి. గత నెల 22 నుంచి 25 వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మోదీ విమానం పాక్ మీదుగా అమెరికా ప్రయాణించింది. వాస్తవానికి అఫ్ఘాన్ మీదుగా ప్రయాణించాల్సి ఉంది. అయితే ఆ దేశంలో నెలకొన్న పరిస్థితుల వల్ల నిఘా వర్గాల సూచన మేరకు పాక్ మీదుగా వెళ్లారు. ఆర్టికల్ 370 రద్దు నాటి నుంచి తన గగనతలాన్ని వాడుకునేందుకు పాక్ నిరాక రిస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్ ఐస్‌లాండ్, మోదీ జర్మనీ, అమెరికా పర్యటనల కోసం భారత అధికారులు గతంలో పాక్‌ను కోరగా తిరస్కరించింది. అదే సమయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శ్రీలంక పర్యటన కోసం తన గగనతలాన్ని ఉపయోగించు కునేందుకు భారత్ అనుమతించింది.
తన 65 గంటల అమెరికా పర్యటనలో మోదీ ఒక్క నిమిషాన్నీ వృధా చేయలేదు. మొత్తం 65 గంటల్లో 20 సమావేశాలలో పాల్గొన్నారు. విమాన ప్రయాణంలో మరో నాలుగు సమావేశాలు నిర్వహించారు. అమెరికాలోని దిగ్గజ కంపెనీల అధిపతులతో ముచ్చటించారు. అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో చర్చలు జరిపారు. క్వాడ్ సభ్య దేశాలు జపాన్, ఆస్ట్రేలియా ప్రధానులు యోషి హిదె, స్కాట్ మోరిసన్ లతో కీలక అంశాలపై సమాలోచనలు చేశారు. ఐరాస సర్వ ప్రతినిధి సభలో మాట్లాడారు. ఇవి కాకుండా అనేక అంతర్గత సమా వేశాల్లో పాల్గొన్నారు. ప్రతి క్షణం దేశ ప్రయోజనాలే పరమావధిగా పని చేశారు.
మోదీ పర్యటనతో న్యూఢిల్లీ-వాషింగ్టన్ వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేత మయ్యాయి. ద్వైపాక్షిక అంశాలతో పాటు, తాజా అంతర్జాతీయ పరిస్థితులపై ఇద్దరు అధినేతలు సమాలోచనలు చేశారు. పర్యావరణం, ఉగ్రవాదం, కొవిడ్ ముప్పు, అఫ్ఘాన్ పరిణామాలు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానం సహా ఆర్థిక, రక్షణ సంబంధాల్లో పరస్పరం మరింతగా సహకరించు కోవాలని, స్నేహాన్ని కొత్త రంగాలకు విస్తరించుకో వాలని బైడెన్, మోదీ నిర్ణయించారు. శ్వేత సౌథానికి చేరుకున్న ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ ‘40 లక్షల మంది భారతీయ అమెరికన్లు నిత్యం అమెరికాను బలోపేతం చేసే పనిలో నిమగ్న మయ్యారని’ అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యానించడం ఉభయ దేశాల మైత్రీ బంధానికి నిదర్శనం. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు అత్యంత సన్నిహితంగా, దృఢంగా వ్యవహరించడం నిర్ణయాత్మ కమని అమెరికా అధినేత పేర్కొన్నారు. ఇద్దరు అధినేతలకూ పూర్వ పరిచయం ఉంది. ఇప్పుడు దేశాధినేతల హోదాలో కలుసుకున్నారు. బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో (2014, 2016)ల్లో మోదీ భేటీ అయ్యారు.
వాణిజ్య, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం రెండు దేశాల సంబంధాల్లో కీలక భూమిక కానుంది. పర్యటనలో భాగంగా మోదీ దిగ్గజ కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. అడోబ్ కంపెనీ సీఈవో శంతను నారాయణ, జనరల్ అటామిక్స్ సీఈవో వివేక్ లాల్ తదితరులు మోదీతో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు సీఈవోలు భారతీయ అమెరికన్లు కావడం విశేషం. ఐటీ, డిజిటల్ రంగాల్లో అడోబ్ కీలకమైనది. అత్యాధునిక సైనిక డ్రోన్ల తయారీలో జనరల్ అటామిక్స్ దిగ్గజ సంస్థ. క్వాల్కమ్ కంపెనీ సీఈవో క్రిస్టియాన్ ఇ ఎమాన్, బ్లాక్ స్టోన్ కంపెనీ సీఈవో స్టీఫెన్ ఎ ష్వార్జమెన్, ఫస్ట్ సోలార్ కంపెనీ సీఈవో మార్క్ విద్మర్ తదితరులు మోదీతో సమావేశమయ్యారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో ముఖ్యమైన ఫొటో వోల్టాయిక్ సాంకేతికతలో ప్రముఖ స్థానంలో ఫస్ట్ సోలార్ సంస్థ ఉంది. 5జీ సాంకేతిక పరిశోధనల్లో అగ్రస్థానంతో పాటు వైర్ లెస్ టెక్నాలజీలో క్వాల్కమ్ కంపెనీకి మూడు దశాబ్దాల అనుభవం ఉంది. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశోధన కేంద్రాలు నెలకొల్పేందుకు ఆయా కంపెనీల సీఈవోలు సుముఖుత చూపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మోదీ పర్యటనతో భారత్-అమెరికా ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింతగా బలోపేతమైంది.
కమల హ్యారిస్‌తో మాటామంతి
పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఉపాధ్యక్షు రాలు కమలా హ్యారిస్‌తో భేటీ అయ్యారు. ఆమె భారతీయ మూలాలున్న మహిళ. కమల తల్లి శ్యామలా 1964 ప్రాంతంలోనే అమెరికా వెళ్లారు. కమల తాతయ్య పీవీ గోపాలన్ భారత ప్రభుత్వ అధికారిగా వివిధ హాదాల్లో పనిచేశారు. మోదీ-కమల గతంలో వివిధ సందర్భాల్లో ఫోన్లో మాట్లాడు కున్నప్పటికీ ముఖాముఖి భేటీ కావడం ఇదే ప్రథమం. అఫ్ఘాన్ సహా ప్రపంచ పరిస్థితులు, ప్రజాస్వామ్య వ్యవస్థలకు పొంచి ఉన్న ప్రమాదాలు, ఇండో- పసిఫిక్ పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించారు. భారత్- అమెరికా సహజ భాగస్వాములు, ఒకే విధమైన విలువలు, భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు కలిగి ఉన్న దేశాలు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన ప్రజాస్వామ్య వ్యవస్థలు గల ఈ దేశాల మధ్య సమన్వయం, సహకారం మరింత బలపడాలని ఇద్దరు నేతలు ఆకాంక్షించారు. భారత్ తమకు అత్యంత ముఖ్యమైన భాగస్వామని కమల ప్రకటించడం విశేషం. పాకిస్తాన్‌లో ఉగ్రవాద ముఠాలు పనిచేస్తు న్నాయని ఆమె పేర్కొనడం కీలకమైన విషయం. ఉగ్రమూకల వల్ల భారత్, అమెరికా భద్రతకు భంగం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్వయంగా ఆమె పాక్‌కు సూచించారు. విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్థన్ శ్రింగ్లా విలేకరులకు ఈ విషయాన్ని తెలిపారు. విదేశాలకు కరోనా టీకాలు ఎగమతి చేస్తామన్న భారత్ ప్రకటనను ఆమె స్వాగతించి అభినందిం చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలకు సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఉభయ దేశాలు పరస్పరం సహకరించు కోవాలని ఆమె సూచించారు. పర్యటనలో మోదీతో పాటు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్థన్ శ్రింగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, అమెరికాలో భారత రాయబారి తరుణ్‌జిత్ సింగ్ సంధూ తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ శాంతికి క్వాడ్ ప్రతిన…
పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. మోదీతోపాటు క్వాడ్ సభ్య దేశాల అధినేతలు అమెరికా అధ్యక్షుడు బైడెన్, జపాన్, ఆస్ట్రేలియా ప్రధానులు యోషి హిడె, స్కాట్ మోరిసన్లతో వివిధ అంశాలను చర్చించారు. ఈ కూటమి అధినేతలు వర్చువల్ విధానంలో కాకుండా ముఖాముఖి సమావేశం కావడం ఇదే ప్రథమం. కొవిడ్, పర్యావరణ మార్పులు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఎదురవుతున్న సవాళ్లు తదితర అంశాలపై వారు చర్చించారు. క్వాడ్‌లో అందించు కుంటున్న పరస్పర సహకారం వల్ల ఇండో-పసిఫిక్ ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతిస్థాపనకు దోహదపడుతుంది. 2004లో జపాన్‌లో సునామీ విలయం సమయంలో మనమంతా కలసి పనిచేశాం. ఇప్పుడు కరోనా సమయంలో మానవాళి పరిరక్షణకు టీకాలు అందించేందుకు క్వాడ్ ముందుకు సాగుతోందని సమావేశంలో మోదీ పేర్కొన్నారు. అంతకుముందు సదస్సుకు సంబంధించి శ్వేతసౌథం ఒక ప్రకటన విడుదల చేసింది. అంతరిక్ష రంగంలో పరస్పర సహకారానికి కూటమి కొత్త కార్య బృందాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఈ ప్రకటన తెలిపింది. 5జి సాంకేతిక విస్తరణ కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించవచ్చని పేర్కొంది. అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో క్వాడ్ దేశాల విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. అఫ్ఘాన్‌ను ఉగ్రవాద అడ్డాగా మారిస్తే చూస్తూ ఊరుకోబోమని పరోక్షంగా పాక్‌ను చతుర్భుజ కూటమి హెచ్చరించింది.అఫ్ఘాన్ నుంచి పాక్ మీదుగా కశ్మీర్ లోకి ఉగ్రవాదులను తరలించే ప్రయత్నాలు జరుగుతున్న వార్తల నేపథ్యంలో కూటమి ఈ హెచ్చరిక చేసింది. పేద, మధ్య ఆదాయ దేశాలకు 129 కోట్ల కొవిడ్ టీకాలను సరఫరా చేస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఇప్పటికే ఇండో- పసిఫిక్ దేశాలకు 7.9 కోట్ల డోసులను అందించామని గుర్తు చేసింది. భారత్ లోని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బయోలాజికల్ – ఇ – లిమిటెడ్‌కు ఆర్థిక సాయం అందించి అక్కడ టీకాల తయారీ సామర్థ్యాన్ని పెంచామని చతుర్భుజ కూటమి వెల్లడించింది. ఐక్యరాజ్య సమితి ‘కొవాక్స్’ కార్యక్రమానికి కూడా టీకాలు అందిస్తామని తెలిపింది.
అకస్ ఏర్పాటుతో భారత్‌కు నష్టమా?
అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాతో కూడిన ‘అకస్’ కూటమి ఏర్పాటు వల్ల భారత్ ప్రాధాన్యం తగ్గిందన్న వాదన దౌత్యవర్గాల్లో ఉంది. దీనిని అటు అమెరికా, ఇటు భారత్ తోసిపుచ్చాయి. అకస్ కన్నా కీలకమైన క్వాడ్‌లో భారత్ భాగస్వామి అన్న విషయాన్ని విస్మరించకూడదు. అమెరికాను మినహాయిస్తే బ్రిటన్, ఆస్ట్రేలియా మనకన్నా పెద్ద దేశాలు ఏమీ కావు. అటు ఆర్థికంగా, సైనికంగా సైతం బలమైనవి కావన్న వాస్తవాన్ని గుర్తించాలి. అందువల్ల ‘అకస్’ లో భాగస్వామి కానంత మాత్రాన భారత్‌కు వచ్చిన నష్టమేమీ లేదు. అదే సమయంలో కోల్పోయిన ప్రాధాన్యం కూడా ఏమీలేదు. ఇక యథాపూర్వకంగా క్వాడ్ సదస్సుపై చైనా ప్రతికూలంగా స్పందించింది. ఇది విఫల కూటమిగా మిగిలిపోతుందని పేర్కొంది. మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో ఇలాంటి కూటములకు ఎంతమాత్రం ఆదరణ ఉండదని విమర్శించింది. ఇతర దేశాల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్ల క్వాడ్ లక్ష్యం నెరవేరదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝూవో లిజియాన్ విలేకరుల సమావేశంలో విషం కక్కారు. క్వాడ్ చర్యల వల్ల ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మరింతగా ఉద్రిక్తతలు చెలరేగే ప్రమాదం ఉందని నాటకీయతను ప్రదర్శించారు. బలమైన దేశాలు కూటమిగా ఏర్పడటం వల్ల అంతర్జాతీయంగా తమ ప్రాబల్యానికి దెబ్బన్నది చైనా అసలు భయం.
ఐరాసలో సంస్కరణల ఆవశ్యకత…
ఐక్యరాజ్య సమితి 76వ సర్వ ప్రతినిధి సభలో హిందీలో అనర్గళంగా ప్రసంగించిన మోదీ ఈ అంతర్జాతీయ సంస్థలో సంస్కరణల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఐరాస తన సమర్థతను, విశ్వస నీయతను మరింతగా పెంచుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా చట్టబద్ధ పాలనకు, ప్రపంచ ప్రయోజనాలు, విలువల పరిరక్షణకు పాటుపడాలంటే తనను తాను ఐరాస మరింత మెరుగుపరచుకోవాలని, విశ్వసనీయతను పెంచుకోవాలని ప్రధాని మోదీ కుండబద్దలు కొట్టారు. వాతావరణ సంక్షోభం, కొవిడ్ సమస్య తదితర విషయాల్లో ఐరాస పాత్రపై సానుకూల అభిప్రాయం కొరవడిందని పేర్కొన్నారు. కరోనా వైరస్ మూలాలు కనుగొనడం, సులభతర వాణిజ్య ర్యాంకులు వంటి విషయాల్లో అంతర్జాతీయ సంస్థల విశ్వసనీయత దెబ్బతిన్నదని మోదీ ఒకింత ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత వైవిధ్యంగా ఉండాల్సిన అవసరాన్ని కరోనా మనకు నేర్పిందని తెలిపారు. భారత్‌లో బలమైన ప్రజాస్వామ్యం ఉందని, చాయ్ వాలా అయిన తాను ప్రధాని కావడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. భిన్న భాషలు, జాతులు, సంస్మృతులు, ఆచారాలు, సంప్రదాయాలు గల దేశానికి ప్రాతినిథ్యం వహించడం తనకు గర్వంగా ఉందని చెప్పారు. ఈ భిన్నత్వమే భారత్ బలమని విశ్లేషించారు. భారత్ ఒక ప్రత్యేక దేశమని, భారత్ అభివృద్ధితో ప్రపంచం అభివృద్ధి ముడిపడి ఉందని వ్యాఖ్యానించారు. అత్యంత కీలకమైన అఫ్ఘాన్ అంశాన్నీ మోదీ సవివరంగా ప్రస్తావించారు. ఈ మధ్య ఆసియా దేశ పరిస్థితులు చైనా, పాకిస్తాన్, రష్యా వంటి దేశాలకు తప్ప యావత్ అంతర్జాతీయ సమాజానికి ఆందోళన కలిగిస్తున్నా యని విస్పష్టంగా వ్యాఖ్యానించారు. అక్కడ పరిస్థితులను సరిదిద్దాల్సిన బాధ్యత ఐరాసపైన ఉందన్నారు. అఫ్ఘాన్ భూభాగం ఉగ్రవాదులకు అడ్డాగా మారకుండా ప్రతి దేశం తనవంతు ప్రయత్నం చేయాలని కోరారు. ప్రస్తుతం ఆ దేశ ప్రజలకు ముఖ్యంగా మహిళలు, మైనార్టీలు, పిల్లలు, వయోజనులకు సాయం అందించాలి. మనం ఆ బాధ్యతను తీసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ఉగ్రవాదాన్ని రాజకీయ సాధనంగా వాడుకుంటున్న వారు అది తమకూ ముప్పేనన్న విషయాన్ని గ్రహించాలని, లేనట్లయితే అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని పరోక్షంగా పాకిస్తాన్‌ను హెచ్చరించారు.
కరోనా వ్యాక్సిన్‌లో భారత్ సాధించిన విజయాలను ఈ వేదిక మీద ప్రధాని ప్రపంచానికి తెలియచేశారు. 12 ఏళ్ల పిల్లలకు ఇవ్వడం కోసం డీఎన్‌ఏ టీకాను మొదటిగా భారత్ కనుగొన్నదని ఆయన చెప్పారు. భారత్‌కు ఉన్న వనరులు తక్కువ. అయినా సేవా పరమో ధర్మ: అన్న ఆర్యోక్తిని బట్టి తాము టీకాను తయారు చేసి ప్రపంచ దేశాలకు కూడా అందించిన సంగతిని కూడా ప్రధాని గుర్తు చేశారు. కాలం ఎంత మారుతున్నా కొన్ని దేశాలు ఇప్పటికీ ఆధిపత్య ధోరణిని వీడకపోవడం బాధాకరమే. ఈ విషయాన్ని ప్రధాని బాగా చెప్పారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్టుగా ఒక దేశం ఇచ్చిన ధ్రువపత్రాన్ని అన్ని దేశాలు గౌరవించే వాతావరణం ఏర్పడాలని ప్రధాని అన్నారు. అలాగే భారత్‌కు వచ్చి వ్యాక్సిన్‌ను తయారు చేయవలసిందిగా ప్రపంచ ఫార్మసీ కంపెనీలను ఆయన కోరారు కూడా.
మండలిలో సభ్యత్యానికి అమెరికా బాసట…
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వంపై అమెరికా మద్దతు ప్రకటించడం మోదీ పర్యటనలో మరో సానుకూల అంశం. ప్రపంచ శాంతికి విశేషంగా కృషి చేస్తున్న భారత్‌కు మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని అగ్రరాజ్యం అభిప్రాయపడింది. ఇందుకోసం తీసుకువచ్చే సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారు. దీంతో మండలిలో శాశ్వత సభ్యత్వానికి గట్టి మద్దతు లభించినట్లయింది. ఆగస్టు నెలలో భద్రతా మండలి అధ్యక్ష హోదాలో భారత్… అఫ్ఘాన్ సంక్షోభం సందర్భంగా సమర్థంగా వ్యవహరించిందని బైడెన్ కొనియాడారు. మండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ అయిదు దేశాలు అంగీకరిస్తేనే ఏ దేశానికి అయినా శాశ్వత సభ్యత్వం లభిస్తుంది. నాలుగు దేశాలు భారత్‌కు మద్దతు ఇస్తుండగా, చైనా మాత్రమే వ్యతిరేకిస్తుండటం గమనార్హం. ఏ దేశం వ్యతిరేకించినా సభ్యత్వం లభించదు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా, స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయవ్యవస్థ, మైనార్టీల హక్కులకు భరోసా కల్పిస్తున్న దేశంగా శాశ్వత సభ్యత్వానికి భారత్ పూర్తిగా అర్హురాలు. అదేవిధంగా ఐరాసకు నిధులు సమకూర్చడంలో, శాంతిపరిరక్షణకు సైనికులను పంపడంలో భారత్ కీలకంగా వ్యవహరిస్తోంది. అందువల్ల ఏ కోణంలో చూసినా భారత్‌కు అన్ని విధాలుగా అర్హత ఉంది. దీంతోపాటు అణు సరఫరా దారుల బృందంలో భారత్ ప్రవేశానికి అమెరికా అధ్యక్షుడు సుముఖత తెలిపారు. రక్షణ రంగానికి సంబంధించి భారత్‌ను తమ ప్రధాన భాగస్వామిగా గుర్తిస్తున్నట్లు బైడెన్ తెలిపారు. అత్యాధునిక సైనిక సాంకేతికతల్లో సహకారం, రక్షణ రంగంలో పారిశ్రామిక సహకారాన్ని మరింతగా పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు బైడెన్ స్పష్టం చేశారు.
మన కళాఖండాలు మనకి!
అమెరికాకు చేరిన 157 పురాతన కళాఖండాలను ప్రధాని నరేంద్ర మోదీ తన వెంట తీసుకువచ్చారు. ఈ పర్యటనలో వాటిని ఆ దేశం మన ప్రధానికి అప్పగించింది. అదే సమయంలో కళాఖండాల అక్రమ వ్యాపారం, రవాణా, దొంగతనాల నిరోధానికి గట్టి ప్రయత్నం చేయాలని రెండు దేశాలు భావించాయి. మోదీ వెంట తెచ్చిన 157 కళాఖండాలలో 71 వస్తువులు సంస్కృతికి సంబంధించినవే. మరొక 60 హిందూ మతానికి చెందినవి, 16 బౌద్ధమతానికి, 9 జైన మతస్థులకు చెందినవి ఉన్నాయి. పది, పన్నెండు శతాబ్దాలకు చెందిన విగ్రహాలు కూడా ఇందులో ఉన్నాయి. లక్ష్మీనారాయణ, బుద్ధుడు, విష్ణుమూర్తి, శివ పార్వతులు, జైనుల 24వ తీర్ధంకరుల పంచలోహ విగ్రహాలు వీటిలో ఉన్నాయి. త్రిముఖ బ్రహ్మ, రథం మీద సూర్యభగవానుడు, దేవేరులతో శ్రీమహావిష్ణువు, దక్షిణామూర్తి, నృత్య గణపతి వంటి హిందూ దేవుళ్ల విగ్రహాలు ఎంతో విలువైనవి. బోధిసత్వ, తార, పద్మాసన తీర్థంకరుల విగ్రహాలు కూడా ఉన్నాయి.
నలభయ్ లక్షల మంది భారతీయుల సేవలతో అమెరికా పురోగమిస్తున్నది అంటూ అధ్యక్షుడు బైడెన్ చెప్పడం ప్రత్యేకతను సంతరించుకుంటున్నది. మోదీ అమెరికా పర్యటనకు కాస్త ముందు కొంతమంది బీజేపీ, ఆరెస్సెస్ వ్యతిరేకులు డిస్‌మ్యాంటిల్ గ్లోబల్ హిందుత్వ పేరుతో సదస్సును నిర్వహించారు. ఇది వర్చ్యువల్ సదస్సు. దాదాపు నలభయ్ అమెరికా విశ్వవిద్యాలయాలకు చెందిన కొంతమంది, మోదీని వ్యతిరేకించే భారతీయ ప్రొఫెసర్లు ఇందులో ప్రసంగించారు. హిందూధర్మం వేరు, హిందుత్వ వేరు అన్న అంశంతో ఒక వివాదాన్ని ప్రపంచం ముందుకు తేవాలన్నదే వారి ఆశయం. ఆ సదస్సుకు తయారు చేసిన లోగోలో ఆరెస్సెస్ కార్యకర్తలు ప్రణామం చేస్తున్నట్టు చిత్రించారు. ఒక్కొక్కరిని మేకులు లాగుతున్నట్టు ఒక సుత్తితో పెళ్లగిస్తున్నట్టు ఆ చిత్ర రచన జరిగింది. ఇలాంటి తిక్క వేషాలు ఎన్ని వేసినా తాము మోదీని అభిమానిస్తామని అమెరికాలో ఉంటున్న ఎక్కువ మంది భారతీయులు బాహాటంగానే ప్రకటించారు. కూచిపూడి నృత్యాలతో ఆయనకు స్వాగతం పలికారు. ఇక్కడ హిందుత్వ అంటే బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న భావధార అని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఆ విధంగా మోదీని తిరోగమన భావాలు గలిగిన వ్యక్తిగా చిత్రించే ప్రయత్నం చేశారు. అందులోని మోసాన్ని , భారత వ్యతిరేకులు చేస్తున్న కుట్రను ప్రవాస భారతీయులు చక్కగా గుర్తించారని చెప్పాలి. డిస్‌మ్యాంటిల్ అయినది హిందుత్వ కాదు. కుహనా సెక్యులరిస్టుల దురాలోచన.
నానాటికీ తీసికట్టు
ప్రపంచ దేశాల మధ్య పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. పాకిస్తాన్‌ది ప్రస్తుతం ఒంటరి ప్రయాణమే. ఒసామా బిన్ లాడెన్ ఉదంతం తరువాత ప్రపంచం ఆ దేశాన్ని నమ్మడం మానేసింది. తాజాగా అఫ్ఘాన్‌లో తాలిబన్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలంటూ చేస్తున్న డిమాండ్‌తో పేద దేశంగా, సమస్యలు ఎదుర్కొంటున్న దేశంగా ప్రపంచ దేశాలకు ఉన్న సానుభూతి కూడా కనుమరుగైంది. పొరుగుదేశం భారత్‌తో సయోధ్య మాటెలా ఉన్నా నిత్య సంఘర్షణ పడుతున్నది. అంతర్జాతీయ ఉగ్రవాదం మీద పోరులో అమెరికాకు కుడిభుజంగా ఉంటూనే, ఆ దేశం ఇచ్చిన నిధులను ఉగ్రవాదులను పెంచి పోషించడానికి వెచ్చించింది. తాజాగా సార్క్ సమావేశాలకు తాలిబన్ ప్రభుత్వాన్ని పిలిస్తేనే తాను హాజరువుతానని మొండికేయడం పతనానికి పరాకాష్ట. ఎలాంటి చట్టబద్ధత లేని ప్రభుత్వాన్ని ఎలా గుర్తిస్తారు? ఇటలీ అయితే ఆ ప్రభుత్వాన్ని గుర్తించడం అసాధ్యమని తేల్చింది. ఐక్యరాజ్య సమితి కోరినా ప్రపంచ దేశాలు, దాతలు నిధులు విదల్చని దుస్థితిలో ఇప్పుడు అఫ్ఘాన్ ఉంది. అలాంటి దేశాన్ని వెనకేసుకోస్తూ, ఉగ్రవాదులు నడుపుతున్న ఒక చట్టబద్ధత లేని ప్రభుత్వ అధినేతలను, ఉగ్రవాద చరితులను అంతర్జాతీయ వేదిక మీదకు తేవాలని పాకిస్తాన్ ప్రయత్నించడంలోనే విధ్వంసం ఉంది. గత అనుభవాలను బట్టి కాబోలు ఇకపై అమెరికా పాకిస్తాన్‌ను నమ్మే అవకాశమే లేదనిపిస్తుంది. ఆ దేశం ఉగ్రవాద అడ్డాయేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మన ప్రధానితో చర్చల సందర్భంలో గట్టిగానే చెప్పారు. అమెరికా దృష్టిలో ఇమ్రాన్ పాక్ సైన్యం ఆడిస్తున్న తోలుబొమ్మ. ఇంకా చిత్రం, తాను ఎన్నికైన తరువాత ఇంతవరకు జోసెఫ్ బైడెన్ పాకిస్తాన్ అధ్యక్షునితో మాట్లాడలేదు. తాలిబన్‌తో కలసి కశ్మీర్‌లో ఏదో చేయాలనుకున్న పాకిస్తాన్ పెద్ద మూల్యమే చెల్లించుకోబోతున్నది. అది అమెరికా వ్యతిరేకమైనంది. భారత్ కశ్మీర్ పట్ల మరింత కఠినంగా, అప్రమత్తంగా వ్యవహరించక తప్పని పరిస్థితిని కల్పించింది. కశ్మీర్ గురించి, భారత ప్రభుత్వం గురించి గతంలోనే అనేక పర్యాయాలు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో అవాకులు, చవాకులు పేలిన పాక్‌కు భారత్ దీటైన సమాధాన మిచ్చింది. అనేక పర్యాయాలు ఇలా చీవాట్లు తిన్నది పాకిస్తాన్. కశ్మీర్ సమస్య, అక్కడ మానవహక్కుల ఉల్లంఘన, ఉగ్రవాదం వంటి అబద్ధాలను అదేపనిగా అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించిన ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ నోరెత్తకుండా ప్రత్యుత్తరం ఇచ్చింది. దాయాది దేశం ఆరోపణలను యువ దౌత్యవేత్త స్నేహ దూబె సమర్థంగా తిప్పికొట్టారు. కొంపకు నిప్పంటించి వాటిని ఆర్పుతున్నట్లు పాక్ నటిస్తోందని ఆమె కడిగి పారేశారు. కశ్మీరే కాకుండా పీవోకే సైతం భారత్‌లో అంతర్భాగమని, దానిని తక్షణం ఖాళీచేయాలని దూబె పాక్‌ను డిమాండ్ చేశారు. 370 అధికరణ రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాటు తదితర అంశాలు పూర్తిగా తమ అంతర్గత విషయాలని, ఇందులో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని విస్పష్టంగా వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ కారణంగా యావత్ ప్రపంచం నష్టపోతుందని, ఏదో ఒక రోజు పాక్ కూడా ఉగ్రవాద భూతానికి బలి కాక తప్పదని హెచ్చరించారు. ఐరాస భద్రతా మండలి నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయం ఇచ్చిన సంగతి అంతర్జాతీయ సమాజానికి తెలియనిది కాదని గుర్తు చేశారు. అంతర్జాతీయ వేదికలపై అసత్య ప్రచారానికి పాల్పడే బదులు పాక్ ఆత్మపరిశీలన చేసుకుంటే వాస్తవాలు బోధపడతాయని హితబోధ చేశారు. పాక్, భారత్‌లో మైనార్టీల స్థితిగతులకు సంబంధించి ఆమె సోదాహరణంగా వివరించి సభికులను ఆకట్టుకున్నారు.
భారత్ వాణిని వినిపించడంలో యువ దౌత్యవేత్త దూబె ప్రతిభకు వివిధ వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి. 2012 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్) అధికారి అయిన దూబె ఐరాసలో ప్రస్తుతం భారతదేశం ఫస్ట్ సెక్రటరీగా పని చేస్తున్నారు. అంతిమంగా మోదీ అగ్రరాజ్య పర్యటన అనేక విధాలుగా భారత్‌కు మేలు చేకూర్చింది. అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రాధాన్యాన్ని, ప్రాశస్త్యాన్ని చాటింది. భారత్ వాణిని బలంగా వినిపించింది. అగ్రరాజ్యాన్ని ఆకట్టుకుంది. అదే సమయంలో దాయాది దేశం ద్వంద్వ ప్రమాణాలను సమర్థంగా ఎండగట్టింది. అందరిదీ ఒకటే ప్రశ్న. పాకిస్తాన్ బెలూచిస్తాన్ వాసులను అణచివేస్తున్నది. చైనా ఉయిఘర్ ముస్లింలను అణచి ఉంచుతున్నది. ఇక అఫ్ఘాన్ పరిస్థితి చెప్పక్కరలేదు. సొంత కుటుంబాలలోని మహిళలు, పిల్లలకే హక్కులు లేవు. ఇక మైనారిటీల పరిస్థితి చెప్పేదేముంది? కానీ ఈ మూడు దేశాలు హక్కుల గురించి ప్రపంచ దేశాలకు సుద్దులు చెబుతున్నాయి. అదే విశ్వ మానవాళికి జుగుప్స కలిగిస్తున్నది.
నరేంద్ర మోదీ ఇప్పుడు ప్రపంచ నాయకుడు. అది ఈ పర్యటనతో రుజువైంది. గడచిన ఏడేళ్లుగా ఆయన నెరపిన దౌత్యంతో అమెరికా దౌత్య విధానాన్ని కూడా ఆయన మార్చగలిగారు. నిజానికి ఇప్పుడు అమెరికా ఒక వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నది. అఫ్ఘాన్ నుంచి బయటకు రావాలన్న ఆ దేశ నిర్ణయాన్ని తప్పు పట్టడం సాధ్యం కాదు. కానీ వచ్చిన విధానమే ప్రశ్నార్థకం. లక్షల డాలర్ల విలువ చేసే ఆయుధాలు, యుద్ధ విమానాలు కూడా అక్కడ వదిలి రావడం తాలిబన్‌కు ఆయాచిత వరమైంది. 1960 దశకంలో వియత్నాం మీద అపజయం సమయంలో కూడా అమెరికాది ఇదే పరిస్థితి. ఓటమి భావన నుంచి బయటపడడానికి తంటాలు పడుతున్న అమెరికాకు మోదీ అక్కడికి వెళ్లడం పెద్ద సాంత్వన. ఇదే ఆ దేశాధినేతల మాటలలో, అంతర్జాతీయ నిపుణుల విశ్లేషణలలో వ్యక్తమైంది కూడా. పాకిస్తాన్ నిజరూపం ఏదో ఇప్పుడు అమెరికాకు బాగా అర్ధమవుతున్నది. చైనా నిర్వహిస్తున్న పాత్ర కూడా ఇటీవలి కాలంలోనే అమెరికా అర్ధం చేసుకుంటున్నది. ఇప్పుడు చైనా, పాకిస్తాన్ ప్రపంచ దేశాలకు ఏమాత్రం ఇష్టమైన మిత్రులు కారు. కరోనా వ్యాప్తిలో చైనా పాత్ర గురించి, ఆ వాస్తవాన్ని వెలికి తీయడంలో ఐరాస వైఫల్యం అన్నీ కూడా ప్రపంచానికి తెలుస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కూడా పాకిస్తాన్‌ను దూరంగా ఉంచాలన్న విధానం వైపే మొగ్గు చూపారు. ఇప్పుడు ఈ రెండు దేశాలు మతోన్మాదంతో చెలరేగిపోతున్న తాలిబన్‌కు మద్దతు ఇచ్చి ప్రపంచ దృష్టిలో మరింత పలచన అయ్యాయి. ముస్లిం మతోన్మాదం కశ్మీర్‌కు, భారత్‌కు పరిమితమైనది కాదని చెప్పడానికి ఉపకరించే రుజువులు ఇటీవలే చాలా పాశ్చాత్య దేశాలలో బయటపడుతున్నాయి. ఇది ఇంతకాలం భారత్ చేస్తున్న వాదనకు బలం చేకూర్చే పరిణామమే. ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ వంటి దేశాలకు ఇస్లాం ఛాందసవాదం ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే అనుభవానికి వస్తున్నది. ఈ వాతావరణాన్ని ప్రపంచ దేశాలు మౌనంగా పరికిస్తున్నట్టే కనిపిస్తున్నాయి. కానీ ఈ పరిస్థితి నుంచి ప్రపంచాన్ని కాపాడడానికి కదలవలసిన అవసరం కూడా ఉంది. అంతర్జాతీయ వేదికల మీదకు తాలిబన్‌ను తీసుకువచ్చి చట్టబద్ధత తీసుకురావాలన్న పాక్ కుట్రను కూడా ప్రపంచ దేశాలు అర్ధం చేసుకుంటున్నాయి. అఫ్ఘాన్‌కు సాయం కోసం ఐరాస పిలుపు ఇచ్చినా ఫలించలేదంటే దానర్ధం ఇదే.
ఇస్లాం మత ఛాందసవాదాన్ని ప్రపంచం మీద రుద్దాలన్న పాకిస్తాన్ కుట్రను సాగకుండా మోదీ నిశ్శబ్దంగా చేస్తున్న ప్రయత్నం ఆయన ప్రతి అడుగులోను కనిపిస్తున్నది. ఇది గుర్తించడానికి కొంతకాలం పడుతుంది.
వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్